(నక్సల్బరీ వార్షికోత్సవం సందర్భంగా మే 24న పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక హైదరాబాదులో నిర్వహించిన మరణమే లేదంది నక్సల్బరీ సదస్సు ప్రసంగ పత్రం – వసంతమేఘం టీం)
నక్సల్బరీ అనేది ఒక ఊరు పేరు మాత్రమే కాదు. అది కేవలం రైతుల తిరుగుబాటు కూడా కాదు. తీవ్రతలో గాని, దీర్ఘకాలికతలో గాని అది మహత్తర తెలంగాణ రైతాంగ తిరుగుబాటుతో కూడా పోల్చదగినది కాదు. కానీ అది ప్రైరీ అగ్ని లాంటి ఆర్పలేని అగ్నిని సృష్టించింది.
అయితే నక్సల్బరీ పోరాటాన్ని భారత రాజ్య యంత్రాంగం అనతి కాలంలోనే అణచివేసింది. మహత్తర శ్రీకాకుళ పోరాటం కూడా ఓడిపోయింది. బీహార్ లోని అగ్రకుల భూస్వాములకు వ్యతిరేకంగా భూమిలేని దళితులు, నిమ్న కులాల రైతులు చేసిన పోరాటం కూడా ముగిసి పోయింది. సిపిఐ(ఎంఎల్) కేంద్ర కమిటీకి చెందిన చాలామంది విప్లవ నాయకులను దారుణంగా చంపివేశారు. వందలాది విప్లవ కమ్యూనిస్టులు విప్లవం కోసం తమ ప్రాణాలను అర్పించారు. శత్రువు చాలా సంతోషించాడు. మన కాలపు ఫాసిస్టు అమిత్ షా లాగా నక్సల్బరీని తుడిచి పెట్టాలని కలలు కన్నాడు. కానీ నక్సల్బరీ మార్క్సిజం- లెనినిజం- మావోయిజంపై ఆధారపడిన విప్లవం. ఆధునిక రివిజనిజానికి ఏకైక విరుగుడు. రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలనే పీడితుల చిరకాలపు కల. కనుక అది చావలేదు. పెద్ద ఎదురుదెబ్బ తర్వాత కూడా విప్లవ పంథా,విప్లవ స్ఫూర్తి, రివిజనిస్టులు, వర్గ శత్రువుల పట్ల ద్వేషం కొనసాగింది. నిర్బంధం ఉక్కు పాదాలను చీల్చుకొని విప్లవోద్యమం మళ్లీ వికసించింది. ఒకవైపు శత్రువుల సంఖ్య పెరగగా, మరోవైపు ఉద్యమం కొత్త ప్రాంతాలకు విస్తరించింది. నక్సల్ బరీ అనేక ఇతర చోట్ల తోపాటు తెలంగాణ, బీహార్ రాష్ట్రాల మైదాన ప్రాంతాల్లో మళ్ళీ పుట్టి పెరిగింది. అది దండకారణ్యం, జార్ఖండ్, ఆంధ్ర, ఒరిస్సా లాంటి ప్రాంతాల అడవులకు విస్తరించింది. అనేక సంవత్సరాల పోరాటం తర్వాత ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం ఏర్పడి దండకారణ్యం, జార్ఖండ్ తదితర అనేక ప్రాంతాలలో ప్రజల అధికారం స్థాపించబడింది. విప్లవ అభివృద్ధిని చూసి బెంబేలెత్తిపోయి శత్రువు రకరకాల అణచివేతలను ప్రయోగించాడు. కానీ విప్లవోద్యమం, ప్రజాధికారం వాటన్నింటిని తట్టుకొని నిలబడింది. చివరకు సామ్రాజ్యవాదులు, రివిజనిస్టు ద్రోహులైన జియోనిస్టుల సహాయంతో శత్రువు విప్లవ ప్రజలపై, విప్లవ అధికారం పై, విప్లవ పార్టీపై రక్త దాహంతో దాడి చేస్తున్నాడు. విప్లవోద్యమానికి, విప్లవ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగలడంతో నక్సల్బరీని మట్టుపెట్టామని భారత పాలక వర్గాలు మళ్లీ పగటి కలలు కంటున్నాయి.
కానీ భారతదేశ చరిత్ర అందుకు భిన్నంగా నిరూపించింది. ప్రతి తీవ్రమైన ఎదురు దెబ్బ తర్వాత నక్సల్బరీ ఒక ఫీనిక్స్ పక్షి లాగా పైకి లేచింది. నక్సల్బరీ రాజకీయాలు, నక్సల్బరీ స్ఫూర్తి ఉద్యమానికి మళ్ళీ మార్గ నిర్దేశం చేసి ఎదురు దెబ్బల నుండి విప్లవోద్యమాన్ని బయటపడవేస్తుంది. గొప్ప గొప్ప అమరవీరుల రక్తం, చెమటా వేలాది కొత్త విప్లవకారులను ప్రజా వర్గయుద్ధంలో చేరేలా ప్రేరేపిస్తుంది. నక్సల్బరీకి మరణం లేదు. అది బతికే తీరుతుంది.
ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విప్లవాత్మక సంక్షోభం తీవ్ర రూపం దాల్చుతున్నందున నక్సల్బరీ తన చారిత్రాత్మక కర్తవ్యాన్ని మరింత వేగంగా నెరవేర్చుకోవడానికి మళ్లీ పుంజుకుంటుంది.
అసలు నక్సల్బరీ ఎందుకు?
భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ నాయకులు మొదటి నుండి పూర్తిగా అవకాశవాద రాజకీయాలను, ఆచరణను అనుసరిస్తున్నారు. విప్లవాన్ని పరిపూర్తి చేయడానికి స్పష్టమైన కార్యక్రమం గాని ,ఆచరణ గాని వాళ్ళ దగ్గర లేదు. ప్రజలు చేస్తూ వస్తున్న భూస్వామ్య వ్యతిరేక పోరాటాలకు, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలకు నాయకత్వం వహించడానికి వారికి ఎటువంటి చొరవా లేదు. వారు కాంప్రడార్ బడా భూస్వామ్య వర్గాల ప్రతినిధి అయిన కాంగ్రెస్ పార్టీకి తోకగా వ్యవహరించారు. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, విస్తృత ప్రజానీకం చేసిన అనేకానేక వీరోచిత పోరాటాలకు, త్యాగాలకు వారు ద్రోహం చేశారు.
మనదేశంలో రాజకీయ అధికార బదలాయింపు తర్వాత, కమ్యూనిస్టు పార్టీ నాయకులు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని వదిలిపెట్టి పందుల దొడ్డి అయిన భారత పార్లమెంటు లోకి దూకి విప్లవోద్యమ లక్ష్యానికి తీరని ద్రోహం చేశారు. పార్లమెంటు ద్వారా రాజ్యాధికారాన్ని సాధించి సామాజిక మార్పును తెస్తామనే భ్రమలను విత్తనాలుగా విత్తారు. బల ప్రయోగంతో రాజ్యాధికారాన్ని స్వాధీనం చేసుకోకుండా సామాజిక విప్లవాన్ని సాధిస్తామని చెప్పడం ఒక లాంటి పౌరాణిక కల్పిత కథను చెప్పడమే అవుతుంది. అంతగా భారత కమ్యూనిస్టు ఉద్యమాన్ని రివిజనిజం ఆవహించింది.
అందుకే రివిజనిస్టులు కృశ్చేవ్ ప్రతిపాదించిన శాంతియుత పరివర్తన భావనను సంతోషంగా స్వాగతించారు. సిపిఐ నుండి సిపిఎం గా విడిపోయినప్పటికీ కమ్యూనిస్టు నాయకత్వం రివిజనిస్టు మార్గాన్నే అనుసరించింది. అభివృద్ధి నిరోధక పార్లమెంటరీ వ్యవస్థలో ఫ్రంట్ ప్రభుత్వాలను ఏర్పరిచి భారత విప్లవానికి పూర్తిగా ద్రోహం చేశారు.
ఇక అంతా అయిపోయిందనుకునే దశలో భారత ఆకాశంలో నక్సల్బరీ సూరీడు ఉదయించాడు. భారత విప్లవమనే వసంతమేఘ గర్జన దేశవ్యాప్తంగా ప్రతిధ్వనించింది. శాంతియుత పరివర్తన అనే పౌరాణిక కట్టుకథను బద్దలు కొట్టింది. రాజ్యాధికారం కోసం ప్రజాయుద్ధ రాజకీయాలను ప్రతిపాదించింది. నక్సల్బరీ భారత కమ్యూనిస్టు ఉద్యమ స్వభావాన్ని శాశ్వతంగా మార్చివేసింది. ఒకవైపు రివిజనిస్టులు శాంతియుత పరివర్తన రాజకీయాలను అనుసరించగా, మరోవైపు నక్సల్బరీ విప్లవకారులు మార్కిస్టు-లెనినిస్టు-మావోయిస్టు విప్లవ పంథాను అనుసరించారు.
నక్సల్బరీ నిజంగానే ఒక కొత్త విప్లవ మార్గాన్ని రచించి కొత్త ప్రజా రాజకీయాలకు తెరతీసింది. ఆనాటి అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో కామ్రేడ్ మావో నాయకత్వంలోని చైనా కమ్యూనిస్టు పార్టీ అనుసరించిన విప్లవ పంథాను నక్సల్బరీ స్వీకరించి భారతదేశం లోని రివిజినిజం తొడుక్కున్న విప్లవ ముసుగును చించివేసింది. మరణాన్ని సైతం ధిక్కరించే ధైర్యం, త్యాగం, తిరుగులేని నిబద్ధతగల కొత్త విప్లవ వారసత్వాన్ని సృష్టించింది. భారత కమ్యూనిస్టు ఉద్యమంలో దీర్ఘకాలంగా మరిచిపోయిన విప్లవ లక్ష్యాన్ని నక్సల్బరీ తిరిగి ఎజెండా మీదికి తీసుకువచ్చింది. రాజ్యాధికారాన్ని బల ప్రయోగంతో చేజిక్కించుకునే విప్లవ రాజకీయాలను కేవలం అక్షరాలలోనే కాదు నిజ ఆచరణలో సైతం అమలుపరిచింది. అమరుల రక్తంతో సరికొత్త విప్లవ రాజకీయాలు రచించబడ్డాయి.
రాజకీయ అధికారాన్ని చేపట్టడమే నక్సల్బరీ రాజకీయాల పునాదిరాయి :
బల ప్రయోగంతో రాజ్యాధికారాన్ని స్వాధీనం చేసుకోవడమే నక్సల్బరీ ప్రధాన విప్లవాత్మక భావన. కామ్రేడ్ చారు మజుందార్ తన చారిత్రాత్మకమైన ఎనిమిది పత్రాలలో స్పష్టంగా ఇలా పేర్కొన్నాడు. కమ్యూనిస్టు పార్టీ రాజకీయ బాధ్యతను నిర్వర్తించడం అంటే పార్టీ ప్రచారాలతో సహా అన్ని ఉద్యమాలు, అన్ని సంస్థల అంతిమ లక్ష్యం శ్రామిక వర్గపు దృఢమైన రాజకీయ అధికారాన్ని స్థాపించడమే అని నిజమైన మార్క్సిస్టులమైన మనకు తెలుసు. ఒకవేళ రాజకీయ అధికార స్వాధీనాన్ని విడిచిపెడితే పార్టీ ఎంత మాత్రమూ విప్లవ పార్టీగా ఉండదు. పేరుకు విప్లవ పార్టీగా ఉన్నప్పటికీ అది నిజానికి బూర్జువాల సంస్కరణ వాద పార్టీగా కుదించబడుతుంది. సరిగ్గా ఇదే నక్సల్బరీ రాజకీయాలకు పునాదిరాయిగా నిలిచింది.
చారుమజుందార్, ఆనాటి సిపిఎం లోని తదితర విప్లవకారులకు రివిజనిస్టుల ద్రోహపూరిత చర్యల పర్యవసానాల గురించి కచ్చితంగా తెలుసు. పార్లమెంటు ద్వారా విప్లవం, శాంతియుత పరివర్తన సాధించడమనేది రాజ్యం-విప్లవం పై మార్క్స్ నుండి మావో వరకు జరిగిన సైద్ధాంతిక అభివృద్ధి, శ్రామిక వర్గ విప్లవాల చారిత్రక అనుభవాలతో సహా సాధారణ ఇంగిత జ్ఞానం కూడా లేని రివిజనిస్టు భావనే తప్ప మరొకటి కాదు.
సరిగ్గా ఆనాటి విప్లవకారులు రివిజనిజంపై దాడి చేయడాన్నే తమ లక్ష్యంగా ఎంచుకున్నారు. వారు మార్క్సిజం-లెనినిజం-మావోయిజం ఆధారంగా ఒక దృఢమైన వైఖరిని తీసుకున్నారు. ప్రతిహింసాత్మక విప్లవం లేకుండా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోలేమని వారు నమ్మారు. దానికోసం ప్రజా విముక్తి సైన్యాన్ని నిర్మించి ప్రజాయుద్ధం సాగించాలని వారు భావించారు. మొదటి నుండి ఈ వైఖరికే విప్లవకారులు దృఢంగా కట్టుబడి నిలిచారు. రివిజనిస్టు అబద్ధానికి వ్యతిరేకంగా వారు సైద్ధాంతిక రాజకీయ పోరాటం చేశారు. ఆనాటి విప్లవ కార్యకర్తలు మార్క్సిస్టు- లెనినిస్టు-మావోయిస్టు సిద్ధాంతం పట్ల పూర్తి నిబద్ధతతో చాలా తీవ్రంగా పోరాటం చేశారు. విప్లవం వారి ప్రతిష్టాత్మక లక్ష్యం మాత్రమే కాదు అది వారి చిరకాల స్వప్నంగా, కర్తవ్యంగా, సర్వస్వంగా కొనసాగింది. భారతీయ నూతన ప్రజాస్వామ్య విప్లవానికి ఇరుసు అయిన వ్యవసాయ విప్లవాన్ని కొనసాగించడానికి వందలాదిమంది విద్యార్థులు తమ చదువులను విడిచిపెట్టి గ్రామాలకు తరలి వెళ్లారు.
‘తుపాకీ గొట్టం ద్వారానే రాజకీయ అధికారం ప్రవహిస్తుంది’ అన్న కామ్రేడ్ మావో సూక్తి విశ్వవిద్యాలయాలు, కర్మాగారాలు, గ్రామాలు, మారుమూల గిరిజన గ్రామాలలో సైతం ప్రతిధ్వనించింది. అంటే, కేవలం తుపాకుల లాంటి యంత్రాల ద్వారా కాదు, రక్తమాంసాలున్న ప్రజలు బల ప్రయోగంతో సాయుధంగా మాత్రమే రాజ్యాధికారాన్ని స్వాధీన పరుచుకుని త్యాగపూరిత విప్లవ రాజకీయాలను భారత రాజకీయ రంగం మీదికి తీసుకొచ్చారు. ఇక విప్లవ కార్యకర్తలను ఎంత మాత్రమూ పార్లమెంటరీవాదపు అబద్ధాలతో మోసం చేయలేని రాజకీయ వాతావరణాన్ని నక్సల్బరీ సృష్టించింది.
కామ్రేడ్ చారుమజుందార్ ఎత్తి చూపినట్లుగా, ఆనాటి కొత్త విప్లవ పార్టీ రాజ్యాధికారాన్ని బలప్రయోగంతో లాక్కోవడాన్ని కీలకమైన లింకుగా తీసుకొని భారత విప్లవం తన కార్యక్రమాన్ని, తదనుగుణమైన వ్యూహాన్ని అభివృద్ధి చేసింది. భారతీయ సమాజాన్ని వర్గపరంగా విశ్లేషణ చేసి, దాని ఆధారంగా వారు సరైన నూతన ప్రజాస్వామిక దీర్ఘకాలిక ప్రజా యుద్ధాన్ని భారత విప్లవ మార్గంగా రూపొందించారు. సాయుధ పోరాటాన్ని ప్రధాన పోరాట రూపంగా ఎంచుకొని ప్రాంతాలవారీగా రాజ్యాధికారాన్ని స్వాధీనం చేసుకుంటూ స్థావర ప్రాంతాలను ఏర్పరచడమే విప్లవానికి ప్రధాన కర్తవ్యం అని కమ్యూనిస్టు పార్టీ భావించింది. ఆ విధంగా సాయుధ పోరాటం ద్వారా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకునే విప్లవ కర్తవ్యాన్ని చేపట్టేందుకు ఒక పూర్తిస్థాయి విప్లవ పార్టీ నిర్మించబడింది.
అనతి కాలంలోనే సాయుధ పోరాటం భారతదేశంలోని అనేక ప్రాంతాలకు విస్తరించింది. అంటే, దేశంలో ఒక స్పష్టమైన విప్లవ కార్యక్రమం,ఆచరణలతో కూడిన ఒక విప్లవ పార్టీ స్థాపించబడింది. అది క్రమంగా పాలకవర్గాల హృదయాలలో భయాన్ని నాటిన ఒక సంస్థగా అభివృద్ధి చెందింది. అప్పటివరకు సంస్కరణ వాదంలో చిక్కుకున్న భారత కమ్యూనిస్టు ఉద్యమంలో రాజకీయాధికార స్వాధీనం అనే విప్లవ రాజకీయాలకు బలమైన పునాదులు పడ్డాయి.
రాజ్యం-విప్లవం: పైన పేర్కొన్నట్లుగా భారత కమ్యూనిస్టు ఉద్యమంలో రాజ్యం-విప్లవం పై సరైన మార్క్సిస్టు లెనినిస్టు అవగాహనను నక్సల్బరీ తిరిగి స్థాపించింది. ఈ విషయంపై స్పష్టత కోసం మనం మహోపాధ్యాయుల బోధనలను ఒకసారి మళ్లీ పరిశీలిద్దాం.
” రాజ్యం అనేది వర్గ వైరుధ్యాల అసంబద్ధతకు సంబంధించిన ఒక ఉత్పత్తిగా, ఒక వ్యక్తీకరణగా ఉంటుంది. అలాగే రాజ్యం అనేది వర్గ పాలనకు సంబంధించిన ఒక అంగంగా ఉండి , మరొక వర్గం అణిచివేతకు ఒక అంగంగా ఉండి వర్గాల మధ్య ఈ అణచివేతను చట్టబద్ధం చేయడంతో పాటు శాశ్వతీకరించే ఒక వ్యవస్థను సృష్టిస్తుంది అని మార్క్సిజం మనకు బోధిస్తుంది. నిజానికి పశ్చిమ యూరప్ లోని ఆధునిక ప్రజాస్వామ్య రిపబ్లిక్కులు కూడా బూర్జువా నియంతృత్వాలే అని లెనిన్ స్పష్టపరిచాడు. ఒక తటస్థ రాజ్యం అనేది ఉండదని, వర్గ ప్రయోజనాలకు అతీతంగా రాజ్యం ఉంటుందనేది కూడా పూర్తిగా అబద్ధమని, తద్విరుద్ధంగా రాజ్య యంత్రాంగం సహాయంతోనే వర్గ దోపిడీ, వర్గాధిపత్యం పరిరక్షించబడి శాశ్వతీకరించబడతాయని మార్క్సిజం మనకు బోధిస్తుంది.
సర్వాధికార నియంతృత్వం పతనమైన కాలంలోనే బూర్జువా సమాజానికి ప్రత్యేక లక్షణమైన కేంద్రీకృత రాజ్యాధికారం ఉనికిలోకి వచ్చిందని కూడా మార్క్స్ వివరిస్తాడు. మార్క్స్ ఎంగెల్స్ లు బ్యూరోక్రసీ, రెగ్యులర్ సైన్యం వంటి రెండు వ్యవస్థలు రాజ్య యంత్రాంగంలో చాలా ముఖ్యమైన వని, అవి వేలాది లింకులతో బూర్జువాలతో అనుసంధానించబడి ఉన్నాయని మార్క్ ఎంగెల్స్ లు తమ రచనలలో పునరుద్ఘాటించారు.
ఒకవైపు ఎన్నుకోబడని బ్యూరోక్రసీ ఎన్నికైన ప్రభుత్వం తరఫున రోజువారీ వ్యవహారాలను నడుపుతుండగా, మరోవైపు రాజ్యం సాయుధ దళాలు దోపిడీకి గురవుతున్న ప్రజలను అణచివేస్తూ లొంగదీసుకుంటాయి. మార్క్స్ చెప్పినట్లుగా ఈ రెండూ రాజ్యానికి మూల స్తంభాలుగా ఉంటాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం తెరవెనుక నుండి పాలకవర్గాలు నడిపే తోలుబొమ్మలాట తప్ప మరొకటి కాదు. మరింత కచ్చితంగా చెప్పాలంటే సాయుధ బలగాలు, బ్యూరోక్రసీలు వారి దోపిడీ, ఆధిపత్యాలను కొనసాగించడానికే నిర్మాణమైన పాలకవర్గాల ప్రధాన అంగాలు. వాటి నాయకత్వం పాలకవర్గాలు లేదా వారి నమ్మకమైన తొత్తులచే నింపబడి అవి స్పష్టంగా వర్గ స్వభావాన్ని కలిగి ఉంటాయి. బూర్జువా ప్రజాస్వామ్యపు డొల్లతనాన్ని మార్క్సిజం పూర్తిగా బహిర్గతపరిచింది.
బ్యూరోక్రాటిక్- సైనిక రాజ్య యంత్రాంగాన్ని బద్దలు కొట్టండి:
కార్మిక వర్గపు మొట్టమొదటి గొప్ప విప్లవమైన ప్యారిస్ కమ్యూన్ సామాజిక మార్పు తీసుకురావడానికి దోపిడీ వర్గాల పాత రాజ్య యంత్రాంగాన్ని ఉపయోగించుకోలేమని నిరూపించింది. కాబట్టి దోపిడీకి గురైన వారు రాజకీయ అధికారాన్ని స్వాధీనం చేసుకొని పాలకవర్గ ప్రభుత్వ యంత్రాంగాన్ని బద్దలు కొట్టాలి. కామ్రేడ్ మార్క్స్ పారిస్ కమ్యూన్ అనుభవాలను సంశ్లేషణ చేసి ఒక కొత్త అవగాహనను సంక్షిప్తంగా వ్యక్తపరిచాడు.
” శ్రామిక వర్గం కేవలం సిద్ధంగా ఉన్న రాజ్య యంత్రాంగాన్ని పట్టుకొని దానిని తన సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోజాలదని ప్యారిస్ కమ్యూన్ ద్వారా రుజువయింది”. అతడింకా ఇలా అంటాడు: నా 18వ బ్రహ్మేరులోని చివరి అధ్యాయంలో చెప్పినట్లుగా ఫ్రెంచ్ విప్లవం చేయాల్సిన తదుపరి ప్రయత్నం మునుపటిలాగా అధికార వర్గ సైనిక యంత్రాన్ని కేవలం ఒక చేతి నుండి మరొక చేతికి బదిలీ చేయడం కాదని దానిని బద్దలు కొట్టడమే నిజమైన ప్రజల విప్లవానికి ముందస్తుగా ఉంటుంది సరిగ్గా ఇదే పనిని ప్యారిస్ లోని మన కామ్రేడ్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
( Neue zeit, Vol.XX,1, 1901-02; P 709). ఇక్కడే కామ్రేడ్ మార్క్స్ ముఖ్యంగా బ్యూరోక్రాటిక్-సైనిక యంత్రాంగపు విధ్వంసాన్ని ప్రత్యేకంగా ఎత్తిచూపుతూ, విప్లవం పాలకవర్గాల రాజ్య యంత్రాంగాన్ని విధ్వంసం చేయాలని పిలుపునిచ్చాడు.
అలాగే కామ్రేడ్ లెనిన్ ప్రతి హింసాత్మక విప్లవం లేకుండా నే కాదు పాలకవర్గం సృష్టించిన రాజ్యాధికార యంత్రాంగాన్ని నాశనం చేయకుండా కూడా అణగారిన వర్గానికి విముక్తి అసాధ్యమని చెప్పాడు అదేవిధంగా సాయుధబలంతో రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం యుద్ధం ద్వారా సమస్యను పరిష్కరించడం విప్లవానికి ప్రధాన కర్తవ్యం అని కామ్రేడ్ మావో పేర్కొన్నాడు. ఒక్క చైనాకే కాదు అన్ని ఇతర దేశాలకు కూడా ఈ మార్క్సిస్టు లెనినిస్టు సూత్రమే వర్తిస్తుందని ఆయన చెప్పాడు.(యుద్ధ సమస్యలు- వ్యూహం, నవంబర్ 6,1938, సెలెక్టెడ్ వర్క్స్, వాల్యూమ్ 1, P 219)
శ్రామిక వర్గం అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకుంటే అది రాజ్యానికి చెందిన సాయుధ దళాలను ఎదుర్కొని ఓడించాలి. అప్పుడు మాత్రమే బ్యూరోక్రాటిక్ యంత్రాంగాన్ని బద్దలు కొట్టడం అనే కర్తవ్యం పరిపూర్తి చేయబడి శ్రామిక వర్గ నియంతృత్వానికి తగిన సొంత రాజ్య యంత్రాంగం రూపొందగలదు.
లేనిచో రాజ్యాధికార స్వాధీనం, సామాజిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పు సాధ్యం కాదు. ఇందుకు ప్యారిస్ కమ్యూన్ యే ప్రబల సాక్ష్యం. ఎందుకంటే ” ప్యారిస్ కమ్యూన్ రాజ్యాధికారాన్ని చేజిక్కించుకొని సైన్యాన్ని తొలగించి, దాని స్థానంలో కొద్దిమంది కార్మికులతో కూడిన జాతీయ రక్షక దళాన్ని మాత్రమే ఏర్పరిచింది. కానీ రెగ్యులర్ సైన్యాన్ని అణచివేసి, దానికి ప్రత్యామ్నాయంగా సాయుధ దళాల వ్యవస్థ ఉండి తీరాలి”అని ఆయన అన్నాడు.
ప్రజల సాయుధ దళాలు విప్లవానికి తప్పనిసరి:
పాలకవర్గ సాయుధ బలగాలను ఓడించడానికి విప్లవ వర్గాలు తమ సొంత విప్లవ సైన్యాన్ని నిర్మించుకోవాలి. పాలకవర్గ సైన్యాన్ని అణచివేసి ఓడించడం ద్వారా మాత్రమే విప్లవ వర్గాలు అధికారాన్ని స్వాధీనం చేసుకుని శ్రామిక వర్గ నియంతృత్వంతో విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతాయి. సారాంశంలో విప్లవ సాయుధ బలగాలు పాలకవర్గాల సాయుధ బలగాలను ఓడించడమే అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఒక ముందస్తు షరతుగా ఉంటుంది.
ఇది విప్లవం లేదా అధికారాన్ని చేజిక్కించుకోవడంలో అత్యంత కీలకమైన అంశం. అణగారిన వర్గాల సాయుధ బలగాలు లేకుండా ఇది సాధ్యం కాదు. రష్యన్, చైనా శ్రామిక వర్గ విప్లవాల ద్వారా ఇదే నిరూపించబడింది. రష్యన్ ఎర్రసైన్యం, చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన ప్రజా విముక్తి సైన్యం ఆ దేశాల్లో విప్లవాన్ని సాధ్యం చేసిన ప్రధాన అంగాలు. వియత్నాం విముక్తి యుద్ధం కూడా ఈ విషయాన్ని నిస్సందేహంగా నిరూపించింది. పై దేశాలలోని విప్లవకారులందరూ ప్రపంచంలోని ఆధునిక సామ్రాజ్యవాద సైన్యాలకు వ్యతిరేకంగా పోరాడి కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలోని ప్రజా సైన్యంతో ప్రజాయుద్ధం చేయడం ద్వారా మాత్రమే తమ విముక్తిని సాధించుకున్నారు. ” ప్రజా సైన్యం లేకుండా ప్రజలకు ఏమీ ఉండదు” అని కామ్రేడ్ మావో ప్రజాసైన్యం ఆవశ్యకతను వివేకవంతంగా వివరించాడు.
పార్లమెంటరీ మార్గం- రివిజనిస్టు పౌరాణిక కట్టుకథ:
రివిజనిస్టులు ఎల్లప్పుడూ బూర్జువా పార్లమెంటు ఎన్నికలలో విజయం సాధించడం గురించి, సామాజిక మార్పును ముందుకు తీసుకెళ్లడం గురించి మాట్లాడతారు. కామ్రేడ్ లెనిన్ ఆ బూర్జువా పార్లమెంటు తాలూకు రివిజనిస్టు భ్రమను ఇలా బట్ట బయలు చేస్తున్నాడు. ” మన సోషలిస్టు విప్లవ వాదులు, మెన్షె విక్కుల వంటి పెటీ బూర్జువా ప్రజాస్వామ్యవాదులు, వారి కవల సోదరులు, పశ్చిమ యూరప్ లోని సామాజిక దురభిమానులు, అవకాశవాదులందరూ సార్వత్రిక ఓటు హక్కునుండి “మరింత ఎక్కువ ప్రయోజనాన్ని” ఆశించారు. “ప్రస్తుత స్థితిలో” సార్వత్రిక ఓటు హక్కు అనేది మెజారిటీ శ్రామిక ప్రజల అభీష్టాన్ని బహిర్గతం చేసి, దాని సాక్షాత్కారాన్ని పొందగలదు అనే తప్పుడు భావనను ప్రజల మనసుల్లోకి చొప్పించారు. కానీ అది అసాధ్యమని చరిత్ర రుజువు చేసింది. చరిత్రలో ఇంకా మరికొన్ని ఉదాహరణలను కూడా మనం పరిశీలిద్దాం.
చిలీలో అలెండీ నాయకత్వంలోని సోషలిస్టు ప్రభుత్వం ఎన్నికలలో విజయం సాధించి సామ్రాజ్యవాద సంస్థల అధీనంలో ఉన్న రాగి గనులను జాతీయం చేయడానికి ప్రయత్నించింది కానీ చిలీ సైన్యం సామ్రాజ్యవాదులతో చేతులు కలిపి సోషలిస్టు ప్రభుత్వాన్ని పడగొట్టి అలెండీని చంపివేసింది. వేలాదిమంది కమ్యూనిస్టులను, దేశభక్తులను హతమార్చి దశాబ్దాల పాటు సైనిక నియంతృత్వం దేశాన్ని పాలించింది.
అలాగే వెనిజులాలో పాత రాజ్య వ్యవస్థతో అమెరికా వ్యతిరేక విధానాలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించిన బొలివేరియన్ విప్లవం ఘోరంగా విఫలమయింది.
ఇండోనేషియాలో కూడా కమ్యూనిస్టు పార్టీ తిరోగమన శక్తులచే నాశనం చేయబడిన చరిత్ర కూడా మనకు తెలుసు. ఇండోనేషియా కమ్యూనిస్టు పార్టీ నిరాయుధంగా ఉండి సుహార్నో ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. కానీ సీఐఏ మద్దతుతో సాగిన సైనిక తిరుగుబాటులో సుహార్నో ప్రభుత్వం పడగొట్టబడింది. అభివృద్ధి నిరోధక సుహార్తో సైనిక పాలన సిఐఏ ప్రత్యక్ష ప్రమయంతో లక్షలాది మంది కమ్యూనిస్టులను చంపివేసింది.
అలాగే నేపాల్ లో ప్రచండ గ్రూపుకు సంబంధించిన రివిజనిస్టు ఆచరణ ఎవరికైనా కళ్ళు తెరిపించగల తాజా ఉదాహరణగా నిలుస్తుంది. నేపాల్ కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) నాయకత్వంలో జరిగిన గొప్ప ప్రజల యుద్ధం అక్కడి రాచరికాన్ని కూలదోయడానికి దారితీసింది. కానీ ఆ తర్వాత ప్రచండ రివిజనిస్టు గ్రూపు ప్రజా యుద్ధాన్ని వదులుకొని తిరోగమన ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. అది ప్రజా విముక్తి సైన్యాన్ని కూడా రద్దు చేసింది. ప్రజా యుద్ధం సృష్టించిన ప్రజల అధికార అంగాలను కూడా రద్దు చేసింది. చివరకు విప్లవకారులు రివిజనిస్టులుగా మారిపోయారు. ప్రజా యుద్ధాన్ని వదులుకున్నారు. ప్రజా సైన్యాన్నీ వదులుకున్నారు. ప్రజల అధికారాన్ని కూడా వదులుకొని చివరకు పాలకవర్గ ప్రతినిధులలో అంతర్భాగమయ్యారు. ఫలితంగా వారు నేపాల్ లో దుష్ట అవకాశవాద రాజకీయ నాయకులుగా తేలిపోయారు. పార్లమెంటరిజం ద్వారా జరిగిన విప్లవ ద్రోహానికి ఇది తాజా ఉదాహరణ. సారాంశంలో పార్లమెంటరిజం ప్రజలకు, విప్లవానికి ద్రోహం చేస్తుందని రుజువయింది.
మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా- బ్యూరోక్రసీ, సాయుధ దళాలు రాజ్యానికి ప్రధాన స్తంభాలుగా ఉంటాయి. ఎన్నికైన ప్రభుత్వం ప్రజలను మోసం చేయడానికి ఒక భూషణం మాత్రమే. కాబట్టి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు అధికారం ఒనగూరదు. రాజ్యాధికారాన్ని బలప్రయోగంతో హస్తగతం చేసుకోవడం ద్వారా, పాత రాజ్య వ్యవస్థను నాశనం చేయడం ద్వారా మాత్రమే ప్రజలకు నిజమైన అధికారం వస్తుంది. ఇది రివిజనిస్టులచే తరచుగా మరుగుపరచబడే ప్రాథమిక రాజకీయ సత్యం.
నక్సల్బరీ విప్లవ పంథా: రాజ్యాధికారం విప్లవానికి సంబంధించిన మార్క్సిస్టు- లెనినిస్టు- మావోయిస్టు అవగాహనను నక్సల్బరీ సంపూర్ణంగా అర్థం చేసుకున్నది. రివిజనిస్టుల పార్లమెంటరీ మార్గాన్ని దృఢంగా తిరస్కరించింది. పార్లమెంటరీ ఎన్నికలను బహిష్కరించి సాయుధ విప్లవ మార్గాన్ని ఎత్తి పట్టింది. శాంతియుత పరివర్తన అనే రివిజనిస్టు సిద్ధాంతాన్ని పూర్తిగా తిరస్కరించింది.
భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం అనే పిలువబడేది సామ్రాజ్యవాద యజమానులు, కాంప్రడార్ బడా బూర్జువాల, భూస్వామ్య వర్గాల కీలుబొమ్మ తప్ప మరొకటి కాదని నక్సల్బరీ పూర్తిగా బట్టబయలు చేసింది. భారత రాజ్యాన్ని, దాని వర్గ స్వభావాన్ని నాశనం చేయవలసిన అవసరాన్ని ఇది స్పష్టంగా బహిర్గతపరిచింది.
నక్సల్బరీ రాజకీయాలు రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకోవాలనే భావనకు ప్రత్యేక ప్రాధాన్యతని చ్చాయి. నక్సల్బరీ తిరుగుబాటు నుండి నేటి వరకు జరుగుతున్న పోరాటం కేవలం భూమి కోసం కాదు, రాజకీయ అధికారాన్ని స్వాధీనం చేసుకోవడం కోసమే నక్సల్బరీ నాయకత్వం దానిని పదే పదే నొక్కి చెప్పింది. నక్సల్బరీ రివిజనిస్టుల సంస్కరణవాద రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడింది. రాజ్యాధికారాన్ని సొంతం చేసుకోవడమే లక్ష్యంగా ఉండాలని, అందుకు విప్లవ ప్రజానీకానికి అవగాహన కల్పించడాన్ని నొక్కి చెప్పింది. ఒక్క మాటలో చెప్పాలంటే నక్సల్బరీ అన్ని రకాల సంస్కరణ వాదాలకు వ్యతిరేకంగా పోరాడింది.
నక్సల్బరీ రాజకీయ అధికారాన్ని స్వాధీనం చేసుకోవడాన్ని ఒక శుష్క నినాదంగా ముందుకు తీసుకురాలేదు. ఇది ప్రజా సైన్యాన్ని నిర్మించడానికి పిలుపునిచ్చి, దానిని ఆచరణలో నిర్మించింది. మునుపటి కాలంలోని సాయుధ దళాలన్నీ మావోయిస్టు పార్టీ ప్రజా విముక్తి గెరిల్లా సైన్యంగా ఎదిగాయి. సాయుధ పోరాట రాజకీయాలను ప్రచారం చేయడమే కాకుండా ఆచరణలోకి తెచ్చి అభివృద్ధి చేసింది. రాజకీయ అధికారాన్ని స్వాధీనం చేసుకోవడం కోసం సాయుధ విప్లవాన్ని సమర్థించి, ఆచరించింది. నక్సల్బరీ మార్గం అత్యంత క్లిష్ట పరిస్థితులలో అపారమైన త్యాగాలతో రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రజాసైన్యాన్ని నిర్మించింది. దండకారణ్యం,జార్ఖండ్, తదితర కొన్ని ప్రాంతాలలో నక్సల్బరీ ప్రజల రాజ్యాధికారాన్ని నిర్మించే దశకు అభివృద్ధి చెందింది. ప్రజా అధికార వ్యవస్థలు గ్రామస్థాయి నుండి అభివృద్ధి చెంది ప్రత్యామ్నాయ విప్లవ నమూనాను చూపుతున్నాయి. నక్సల్బరీ దీర్ఘకాలిక ప్రజా యుద్ధాన్ని అమలు చేసి ప్రాంతాలవారీగా అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నించింది. నక్సల్బరీ విప్లవాన్ని విప్లవ కార్యకర్తల లక్ష్యంగా, చిరకాల స్వప్నంగా ముందుకు తీసుకువచ్చింది. ఆచరణలో విప్లవం, సాయుధ పోరాటాలకు గల అనివార్యతను దృఢంగా అంచనా వేయడం ద్వారా నక్సల్బరీ లెనిన్ నాయకత్వాన బోల్షెవిక్ పార్టీ, మావో నాయకత్వాన మహత్తర చైనా కమ్యూనిస్టు పార్టీల అడుగుజాడల్లో ఒక కొత్త విప్లవ పార్టీని నిర్మించిందనేది మన కాలపు తిరుగులేని చారిత్రక సత్యం.




