ఆధునిక యుగంలో ఆంధ్ర దేశానికే గాక తక్కిన ప్రాంతాలకు గూడా అల్లూరి సీతారామరాజు పోరాటం రాజకీయ ప్రాముఖ్యం గల విషయం. దాన్ని సాకల్యంగా సమీక్షించుకొని గుణపాఠాలను స్మరించు కోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

     గాంధీ శకం శాసనోల్లంఘన, సహాయ నిరాకరణ ఉద్యమాలతో ప్రారంభమై, ఒక ఉప్పెన పొంగిన కొద్దికాలానికే చౌరీచౌరా ఘటనతో వాటిని ఉపసంహరించడం జరిగింది. 1922 మార్చిలో గాంధీ బందీ అయ్యాడు. మరొక ఐదారు మాసాలలోనే సీతారామరాజు పోరాట పతాకం ఎత్తాడు. తెలుగుదేశానికి సంబంధించి పల్నాటి పుల్లరి సత్యాగ్రహం, పెదనందిపాడు పన్నుల నిరాకరణ పోరాటం, చీరాల-పేరాల మునిసిపాలిటీ వ్యతిరేక పోరాటం, మధ్యతరగతి ప్రజల వరకైనా జాతీయ స్వాతంత్ర్య వాంఛని తీసుకెళ్ళి, గుండెలను కదిలించి రగిలించాక, అల్లూరి సీతారామరాజు గాంధీ మార్గానికి ప్రత్యామ్నాయంగా సాయుధ పోరాటాన్ని మెరుపు దాడుల జ్వాలా

తోరణాన్ని ఆంధ్రదేశం ఈ దిక్కునుంచి ఆ దిక్కుదాకా రగిలించాడు.

తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల ఏజెన్సీ భూముల మన్యంలో మన్నె జమీందార్లు, ద్వారబంధాల చంద్రయ్యలాంటి వ్యక్తులు లోగడ సాగించిన పోరాటాలు గాని, 1917-18లో లాగరాయి పితూరీగాని, నేరుగా రాజకీయ స్పర్శలేని ఉద్యమాలని అంగీకరించ వలసి వచ్చినా, జాతీయ వాదం లాంటి రాజకీయాదర్శ బలం లోపించిన ఉద్యమాలే. అందులో పాల్గొని నాయకత్వం వహించిన మనుష్యులవి పరిమిత లక్ష్యాలు. వాటికి ప్రజల చైతన్యంతో, నిమిత్తం లేదు. అవన్నీ పందొమ్మిదవ శతాబ్దపు రాజులు, భూస్వాముల, పాలెగాళ్ళ, జమీందార్ల పితూరీల సంప్రదాయాలకి చెందినవి మాత్రమే.సీతారామరాజు నడిపిన ఉద్యమాన్ని బ్రిటిషువాళ్ళు “రంప పితూరీ” అని తప్పు పేరు పెట్టారు. అది పితూరీ కాదు. కోయ ప్రజల నుంచి సమకూరిన అంగబలంతోటి ఆధునిక రాజకీయ చైతన్యం గల ఒక విలక్షణ వ్యక్తి ఒక పథకం ప్రకారం నడిపించిన సైనిక పోరాటం. నేటి రేపటి విప్లవ సైనిక పోరాటాలకు పనికివచ్చే విషయాలు కొన్ని దానిలో ఇమిడివున్నాయి. 

           బెంగాలీ టెర్రరిస్ట్  ఉద్యమానికి లాగా, జాతీయోద్యమంలోని అతివాద సంప్రదాయానికి (తిలక్, అరవింద ఘోష్) లాగా, గాంధీతత్వానికి లాగా, అల్లూరి సీతారామ రాజుకు గూడా కొన్ని తప్పనిసరి భేదాలతో, తారతమ్యాలతో గూడిన, మత వాసన గల ఒక ప్రాతిపదిక వుంది, తానొక బాలరుషిగా, మంత్రశక్తి గల మహిమాన్వితుడుగా, సాముద్రికం చెబుతూ, మందులూ మాకులూ ఇస్తూ, జన్మ చక్రాలు వేసి యిస్తూ, సీతారామరాజు కోయల అమాయకత నుంచి ఆకర్షణను, ప్రధాన ప్రాబల్యాలను స్థానికంగా సంపాదించు కొన్నాడు. ఇది అతని మూలధనం. పోలీసులు కూడా తుపాకులను కింద పడవేసి పరుగు లంకించుకొనే ముందు, సీతారామ రాజు అవి మోగకుండా మంత్రం వేసేవాడని అనేవారంటే, ఈ ఊహా మహత్తు మిత్రులనూ, శత్రువులనూ సమానంగా ప్రభావితం చేసినట్లు అర్థమౌతుంది. ఆతని జీవిత చరిత్ర రాసినవాళ్ళు కూడా పనిగట్టుకుని ఈ తపస్సంపన్నతనే ప్రచారం చేశారు. సన్యాసు లంటే సాధువులంటే భక్తి అయాచితంగా పొంగి పొరలే మన జనాభా. సీతారామ రాజును ధర్మపరుడుగా చెయ్య పూనింది.

   అయితే ఈ మత విశ్వాసం అతని దౌర్బల్యాలలో కూడా ఒకటి అనే విషయాన్ని విస్మరించింది. పోలీసు స్టేషన్లమీద దాడి చేసేముందు, ముహూర్తాలు గుణించుకొనే వ్యక్తి శకునాలు కూడా. అయితే అతని సైనిక వ్యూహం దెబ్బతినక తప్పదు. విరోధికి గూడా అలాంటి తిక్క ఉంటే పూజలూ, ఉత్సవాలూ వగైరా తన అనుచరుల  భావాలను సానుకూలంగా వాడుకొనే నేర్పరితనం గాకుండా, తన సొంత మత మూర్ఖత కూడా అయ్యే పక్షంలో వృథా కాలయాపన ఒకటి. నిర్దాక్షిణ్యానికి పేరు మోసిన విరోధికి అనుకూలత కలిగించడం ఇంకొకటి అవుతుంది.

    “చక్రవర్తి వస్తున్నాడు” అని సీతారామరాజు అనుచరులు అరుచుకుంటూ ఊళ్ళలో ప్రవేశించే వారని ప్రభుత్వ నివేదికల్లో ఉంది గాని నమ్మ వీలుగాదు.”మహాత్మాగాంధీకి జై” అనేవారంటే నమ్మదగ్గదే. అహింస తోటి దాస్యబంధం లోని కొనపోచ గూడా తెగదని అనుకున్నా,సీతారామరాజు “దౌర్జన్య” చర్యలను ఆచరించలేదు. కవర్డ్, హైటర్లను కాల్చి కూల్చివేశారని తన అనుచరులను కోపపడ్డాడని కొందరు రాసిన మాట నిజం కాకపోవచ్చు, ఎందుకంటే, ఆ  పోరాటంలో తాను స్వయంగా ఉన్నాడు. లేకుంటే, తమ తుపాకీ గుండ్లకు భారతీయ పోలీసులు చావకుండా కాపాడలేక పోయినందుకు చింతపోయి ఉండవచ్చు. విరోధి వర్గంలోని వారైనా సరే. కిరాయి తుపాకి మూకలైనా సరే, ప్రాణ నష్టం- కలిగించ గూడదనే వెర్రి ఒకటి అతనికి ఉన్నట్లుంది. వెర్రి ఎందుకయిందంటే, ఆ మూకలకు మాత్రం అలాంటి ఉదారభావం నాస్తి.మేజర్ గుడాల్ చివరకు సీతారామ రాజును తుపాకి కెరవేశాడను కున్నా, పట్టి తెచ్చినవారు మాత్రం భారతీయ పోలీసులే.  గాము మల్లుదొరను కాల్చివేసింది వాళ్ళే. ఊళ్ళమీద పలుపులు విప్పిన పసరాలై పది మాన భంగాలతో, దెబ్బలతో భీతావహాన్ని  కలిగించి సీతారామరాజు కుండిన కొద్దిపాటి ప్రజా పునాదినీ అతని కాళ్ళ కింది నుంచి తొలిచి తొలగించిందీ వాళ్ళే. పరాయి ప్రభువుల బంట్లు వాళ్ళు. రాజ్యం అనేది అవతరించి నప్పుడు, వాళ్ల రూపంలోనే బయల్పడింది. పూటకు నోచుకోని వాళ్ళలో మెరికల్నీ, మొరకల్నీ, ఏరి ఆస్తిపరులు తమ కాపలా కుక్కలుగా పెంచి బలిపిస్తేనే చరిత్రలో “రక్షక” భటవర్గం ఏర్పడింది.  పోలీసు బంట్రోతుల్నీ కానిస్టేబుల్నీ మాత్రమే గాక, సబిన్స్పెక్టర్లనీ, గూఢచారుల్ని, ఏజంట్లని పట్టుకొని విందుల్లాంటి మర్యాదలు కూడా చేసి, వివరాలడిగి జీవితేచ్ఛ తెలుసుకుని ముందు ముందైనా బుద్ధిగా మసలు కొండని హెచ్చరికలతో సంతృప్తిపడి విడిచి పెట్టేవాడు. “క్షాత్ర ధర్మం” పాటిస్తూ క్షత్రియ వీరుడిలా సీరారామరాజుచే అలా విడిచి పెట్టబడిన వాళ్ళలో , చివరి కతన్ని పట్టి తెచ్చిన వాళ్లున్నారు. పాముని దయ తలచడమంటే ఇదే కావోలు ! బ్రిటిష్ వాడేమో పగవాడు, వాడి బంటు చెలికాడు. పాము చుట్టం, పడగ పగ అనుకోవడం తెలివి తక్కువ అని సీతారామరాజు నిరూపించాడు – ‘వీర’ మరణం ద్వారా గాక, ‘ఘోర’ మరణం ద్వారా.

సీతారామరాజు కుడి ఎడమ భుజాలైన గాము గంటం దొర, అగ్గిరాజు నాయకుడితో పోలిస్తే ‘దుందుడుకు వాదులు’. చివరి దశలో  పడాల్ , రాజుతోటి నాయకత్వ విషయంలో పోటీదారయ్యాడు కూడా. అప్పటికి రాజు తాలూకు  మహత్తు వట్టి భ్రమ అని తేలి పోయింది. అతని ప్రభాచక్రం వాడి మాసి పోయింది. అతడు మట్టి మనిషిగా నిరూపితుడయ్యాడు.

 మొదట్లో రక్తి వల్ల, నిజ మైన అభిమానం వల్ల కూడా పరోక్షంగా మౌనంగానైనా సాయపడిన మన్య గ్రామాల ప్రజలు ఇంగ్లీషు వాడి క్రమబద్ధమైన సైనిక దౌర్జన్యానికి, శిక్షలకూ, సామూహిక జరిమానాలకూ భయపడి నిస్సహాయులై పోయారు. సీతారామరాజు దండుకు ఎప్పటి కప్పుడు కొత్త వాళ్లు వచ్చి చేరక పోవడమే గాక, పూట పూట తిండికి గూడా సంకట పరిస్థితి ఏర్పడింది.  గ్రామస్థుల్లోనే స్కూలు మాస్టర్లిద్దరూ, కరణాలూ, అంతకంటే హెచ్చుగానూ ముఖ్యంగానూ ముఠాదార్లన బడే గ్రామ పెద్దలు శత్రువు చెవులు కొరుకుతూ , సీతారామరాజు చర్యల గురించి వర్త మానం అందించ బూనారు. అంతేనా? కాదు. దొరికిన వాళ్ళను పట్టుకొని, దొరకని వాళ్ళను దొరికించుకొనీ విరోధికి అప్పగించడంతో గూడా ఊరుకోలేదు. దొరికిన వాళ్ళను తామే చంపివేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. గ్రామసీమల నుంచి మొదట అద్భుతంగా అలగా లేచిన సానుభూతి రెండేళ్ళ వ్యవధిలో తీవ్ర వ్యతిరేకతగా కూడా మారిందంటే చుక్కెదురైందన్న మాట.

ఈ ప్రతికూల వాతావరణం లోనే గాము గంటం దొర, అగ్గిరాజు, ఎండూ పడాల్ లాంటి ‘అతి’ వాదులు శత్రువు నెలాగో శత్రువు బంట్లను కూడా అలాగే చెయ్యి చేసుకోవాలని పట్టు బట్టారు,చేసుకున్నారు కూడా. అగ్గిరాజుకు పేరు వచ్చింది కూడ అలాగే. వేగిరాజు సత్తిరాజు భీమవరం (పశ్చిమ గోదావరి) తాలూకా కుముదపల్లి గ్రామానికి చెందిన యువకుడు, తొలుత సీతారామ రాజులా  “సాత్వికుడే”- ఎంత సాత్వికుడంటే, గాంధీ పటాన్ని వూరేగించి తొలి సత్యాగ్రహోద్యమంలో పాల్గొన్న గాంధేయుడే. గాంధీ పంథా తెరుచుకోవడమే తడవుగా మూతబడి పోవడం చికాకు కలిగించగా, సీతారామరాజు “క్షత్రియోచిత” కృత్యాల గురించి విని, రైలు బండెక్కి అన్నవరం దగ్గర దండులో కలిసి అచిర కాలంలో పైకి వచ్చిన ఘటం ఈ వేగిరాజు సత్తిరాజు ఉరఫ్ అగ్గిరాజు.

శత్రు మూకలు విడిది చేసిన శిబిరాలను తగుల బెట్టడం శత్రుపుల కడుపు నింప బోతూన్న బకాసురుని బండ్లను ఆపి, తిండి దినుసులను కొల్లగొట్టడం, వగైరా మంచి పనులతో బాటుగా, గ్రామాల అమాయక ప్రజలను అదర కొట్టడం లాంటి ఆత్మహత్యాకర మైన పనులకు గూడా దిగాడు. శత్రువు ఏజంటు నొకణ్ణి ముక్కు చెవులు కోయించి పంపాడని ప్రతీతి. గాము గంటందొర ఊళ్ళమీద పడి తుపాకి చూపించి బియ్యం, గొర్రెలు, కోళ్ళు తరలించుకు పోవడంతో బాటు ప్రభుత్వోద్యోగులను చెట్లకు కట్టించి కొట్టించడం లాంటి పనులు కూడా చేశాడు.

పోరాట వాస్తవం తన అవసరాలను తానే సృష్టించుకొని తన తొలి ఆదర్శ బలాన్ని అందమైన భ్రమగా నిరూపించి వేస్తుందని సీతారామరాజు ఊహించి ఉండడు. అరణ్య ప్రాంతాన్ని చక్కని పోలీసు శిబిరంగా మార్చి, బయటి ప్రపంచం నుంచి దిగ్బంధం అమలు జరిపి, తన దండు తిండికి మాడిపోక తప్పని పరిస్థితిని బ్రిటిష్ దొరతనం కల్పించింది. మొదట్లో తాను రొక్కమిచ్చి వస్తువులు తీసుకుంటూ వచ్చాడు. జనం కూడా సమ్మతించే ఇచ్చేవాళ్ళు. అంతా తారుమారైంది. బలప్రయోగం అవసరమైంది తనకు ఇష్టం లేకున్నా సరే !

సీతారామరాజు చేసిన పెద్ద పొరబాటు బయటి ప్రపంచం మీద ఆశలు పెట్టు కోవడం ! కాంగ్రెస్ వారు వచ్చి కలుస్తారని అనుకున్నదీ లేనిదీ తెలియదు గాని వారి నుంచి తాను ఒక పిడికెడు సానుభూతినైనా ఆశించాడంటే అది పూర్తిగా తన తప్పే కాదు. కొన్ని కాంగ్రెస్ కమిటీలు (పెద్దాపురం) ఆ సానుభూతిని తీర్మానంలో ఇరికించాయి. ఇదికూడా కాంగ్రెస్ పెద్దలకు నచ్చలేదు. సత్యాగ్రహులకు ఈ దోపిడీ ముఠాతో ఎలాంటి ఇలాకా ఉండకూడదని ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడైన ప్రకాశం హుకుం జారీ చేశాడు. తన దండులోని సైనికులకు బట్టలు కావలసి, సీతారామరాజు తానూ ముతక ఖద్దరే తొడిగాడు. తన వారిచేత తొడిగించాడు. ఒక వెర్రిబాగుల సత్యాగ్రహి సీతారామరాజు దండును కలిసి నాయకునితో మాట్లాడు దామని బయలుదేరి పోలీసులకు చిక్కాడు (పేరు రెడ్డి అన్నారు పంతులు). సీతారామరాజు మారు వేషంలో కాకినాడ కాంగ్రెస్ సమావేశానికి వెళ్ళి, పంజాబు ప్రతినిధుల శిబిరంలో స్వచ్ఛంద సేవకుడుగా పని చేశాడన్నది కల్పనా కథ. అందరి నాయకుల సందేశాలతో బాటు తన సందేశాన్ని కూడా చదివి వినిపించాలని మహమ్మదాలీని కోరాడన్నది కట్టు కథ. అయినా ఆ సందేశం ఏమిటి ? పోరాటంలో సహాయం కావాలి! మనుషులు కావాలి. డబ్బు కావాలి ! రెండింటినీ కాంగ్రెస్ తనకు సమకూరు స్తుందని రాజు ఆశించి వుంటే, అతని కంటె పెద్ద మూర్ఖుడు ఉండబోడు. అన్ని సాయుధ పోరాటాలను ప్రజల హింసా చర్యలనూ టెర్రరిస్టు ఉద్యమాలనూ మింగివేసిన రక్కసి కాంగ్రెస్ మాత్రమే. పుట్టడమే అది, ప్రజల పోరాట పంథా కు ప్రత్యామ్నాయంగా. పాశ్చాత్య విద్యావంతుల, మధ్యతరగతి వాళ్ళ రాజ్యాంగబద్ధ, శాంతియుత పోరాట పంథాకే అంకితమై పుట్టింది. గాంధీ వచ్చి కాంగ్రెసును తిలక్, అరవింద ఘోష్ కొద్దిపాటి, మెల్లకంటి “ప్రజా” “వెల్లువల నుంచి తప్పించి గోఖలే వాదానికి అంటగట్టి వేశాడు. గాంధీవి అన్నీ కరణం ఎత్తులే, నక్కజిత్తులే తప్ప, ప్రజాసామాన్యాన్ని పోరాటంలోకి తెచ్చే దానికి స్వచ్ఛంద రాజకీయ కార్యాచరణ ద్వారా జాతీయ స్వాతంత్ర్యాన్ని సమకూర్చగల ఎత్తుగడలు కావు.రాజీలతో, బేరసారాలతో,బెదిరింపులతో, లాలింపులతో, రాజ్యాధి కారాన్ని బూర్జువా వర్గానికి సంక్రమించేలా చెయ్యడానికే గాని, జన సామాన్యానికి నిజమైన రాజకీయ స్వాతంత్ర్యాన్ని సమకూర్చడం గాంధీ మార్కు జాతీయ వాదానికి లక్ష్యంగా లేదు. కాబట్టి అల్లూరి అర్భకుడై కాంగ్రెసువారి సానుభూతినీ, సహకారాన్ని ఆశించి భంగపడ్డాడు.

       రాజకీయంగా

” ఎక్కడో పంజాబు నుంచి తనకు మనుషులు వచ్చి దిగుతారని”  సీతారామ రాజు ఒకమాటు ఆత్మవంచన చేసుకుంటూ అని ఉన్నారు. పృథ్వీసింగ్ను కలిసి చిట్టగాంగ్ వరకు వెళ్ళి, “విప్లవ” కారుల పథకాలు తెలుసుకు వచ్చాడని రాజు గురించి ‘ఒక ‘ఐతిహ్యం’ ఉంది. ఇది నిజాన్ని పోలిన అబద్ధం. రాజమండ్రి జైల్లో వుంటూ వచ్చిన పృద్వీసింగ్ను జైలు తలుపులు బద్దలుకొట్టి విడిపించుకు పోతాడని బ్రిటీష్ అధికారులు భయపడి, పోలీసు కాపలా ఎక్కువ చేశారట గాని, తుపాకులను మందుగుండు సామాగ్రినీ కాకినాడకు తరలించి వేశారని దువ్వూరి సుబ్బమ్మ ఒక కథ చెబితే, అది వాస్తవమని గ్రంథస్థం చేశారు. కొందరు చరిత్రకారులు.పోలవరం లాంటి స్థలం నుంచీ, చాలా మారుమూల పోలీసు ఠాణాల నుంచీ రాజు చేతికి అందకుండా ఆయుధాలను తరలించి వేసిన సందర్భాలు లేక పోలేదు. పంజాబు దాకా ఎందుకు? తునిలో తన చిననాటి చెలికాడిని కూడా అగ్గి రాజు తన దండు లోనికి తెప్పించుకో లేక పోయాడు. ఆతనిది చాలా కొద్దిపాటి దండు. ఎన్నడూ అది ఐదు వందలకు మించలేదు. మొదట్లో వందకు లోపే. చివరకు అది మంచులా కరిగిపోయింది. వట్టి ఆత్మరక్షణకు మాత్రమే రాజు కార్యకలాపాలు కుంచించుకు పోయాక, ముందు ముందు తనకు భూములు వగైరా చేజిక్కుతాయనే ఆశ అడియాసే అనిపించాక, పోలీసుదళ నిర్బంధ చర్యలకు తన స్వజనం మాయ మయ్యారని తెలిశాక, ఎక్కడి దొంగలక్కడే అన్నట్టుగా అనేకులు దండు నుంచి తప్పుకుని తిరిగి తమ తమ వూళ్ళకూ గూళ్ళకూ చేరుకోవడం మొదలైంది. చిట్ట చివరకు పలచబడి వీరి దండు యాభైకి కింది మాటే అయింది. అదీ రెండు ముఠాలుగా చీలి పనిచేయ సాగింది. రాజు మూలబలం ఇలా కరిగి తరిగి పోయింది. ఏకాకిగా వుండగానే రాజును పట్టుకోవడం జరిగిందనే విషయం మరవ కూడదు. పోలీసు దళ నిర్బంధ చర్యల వల్ల అడవి ప్రజలకు కలుగుతున్న క్షోభను చూసీ విసిగి గుండె కరిగి, తానొక్కడు దొరికిపోతే దమన కాండ అంతమొందు తుందని రాజు శత్రువులకు స్వయంగా దొరికిపోయాడనడం, వినడానికి సొంపైన కథేగాని నమ్మడానికి వీలులేని విషయం.

ఇంతకీ ఈ సీతారామరాజు పోరాట ప్రాంతపు మనిషి కాదు. పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లులో పుట్టి, చిన్ననాడే తండ్రి మరణించగా పినతండ్రి (రెవిన్యూ ఇన్స్పెక్టరు) ఆశ్రయంలో నానా వూళ్ళలో వుండి చదువుతూ, చదువులో పైకెక్కి రాకుండా అలివిమాలిన ఊహలతో లోకం మీద పడిన వ్యక్తి. తండ్రి జాతీయవాది, రాజమండ్రిలో ఫోటోగ్రాఫరుగా వుంటూ వందేమాతరం ఉద్యమకాలంలో (1905-1910) విద్యార్థుల పోరాటాలను ఫోటో తీసి, ఇంటిలో “వందేమాతరం” అని అరిచి తృప్తిపడుతూ, సీమ దొరకు సెల్యూట్ కొట్టేందుకు ప్రయత్నించిన తన పిల్ల వాడి చెయ్యి బలంగా దించివేసి సీతారామరాజుకు ఆశ్చర్యం కలిగించాడు. కాకినాడలో చదివే రోజుల్లో, కెంప్ అనే డాక్టరు ఉదంతం వల్ల జాతీయ భావావేశం ఆవరించినప్పుడు, భారతమాత గుండెలపై ఎక్కి తొక్కు తూన్న ఇంగ్లీషువాడిని  తోసి వెయ్యాలంటూ సీతారామరాజు తనకు నాటకంలో వేషం వేసినందుకు వచ్చిన మెడల్ను తీసి పారవేశాడని మద్దూరు అన్నపూర్ణయ్య రాశాడు. మంచి కథే. ఈ బాలవీరుడు క్లాసు చదువు అంటే గిట్టక ధ్యానం, తపస్సు, స్వారీ వగైరాలని,కాలం వెచ్చించే వాడంటారు. ఇంటి నుంచి తరచు పారిపోవడం మాత్రం నిజం, పినతండ్రి చివాట్లూ, తల్లి కన్నీరూ సీతారామరాజు జీవితాన్ని కొంతవరకు మలిచాయి. పిన్నతనంలోనే ఇల్లు విడిచి హిమాలయాల వరకు వెళ్ళి వచ్చాడనేది కొంతకాలం తర్వాత బస్తరు అడవుల గుండా నాసికా క్షేత్రానికి కాలి నడకన వెళ్ళి వచ్చాడనేవీ కథలే.

మన్యంలో ధారకొండ వద్ద తపశ్చర్యలో ఉన్న బాలయోగిగా కోయలకు దర్శనమిచ్చి వాళ్ళ విశ్వాసాన్ని భయ భక్తుల్నీ రాబట్టుకున్న మాట మాత్రం నిజం. పోరాట వీరుడుగా సీతారామరాజు జీవితంలో ఇదే తొలిమెట్టు. మొదట్లో ఆలోచన కూడా పూర్తిగా స్వార్థాన్ని విడిచి పరమార్థానికి గానీ, పరార్ధానికి గానీ అంకితం కాలేదు, దిక్కు దివాణం లేకుండా దరిద్రంతో కుంగిపోతూన్న తన వాళ్ళ కోసం గూడెం  తాశిల్దారు నడిగి కొంత మెట్ట పొలం సంపాదించి, ఒక జల్లు కూడా వేయించాడు గాని తన తపశ్చర్యం మానలేదు. మానలేదు సరిగదా, విలు విద్య నేర్వసాగాడు. ఇది ఎందుకో అధికారులకు అర్ధం కాలేదు. స్థానిక ప్రజలు

వచ్చి పోతున్నారు. సంబంధాలు రాశిలోనూ, గుణంలోనూ పెరుగుతున్నాయి. వారి కష్ట నిష్ఠూరాలు తెలుసుకుంటున్నాడు. ఆలకించి విని అవగతం చేసుకుంటున్నాడు. సానుభూతి చూపుతున్నాడు. సలహాలు చెబుతున్నాడు. ఆ సలహాలు అధికారులకు నచ్చే సలహాలేమీ కావు. వారికి అనుమానం అంకురిస్తుంది. పెను భూతంగా పరిణమిస్తుంది. దేశంలో దావానలంలా వ్యాపించసాగిన సత్యాగ్రహోద్య మానికీ సీతారామరాజుకీ మధ్య లేని లంకెలను వాళ్లు ఊహించు కుంటున్నారు. నరిసీపట్నం వచ్చి స్థానిక పోలీసు స్టేషనులో రోజూ హాజరు వేసుకొని పొమ్మన్నారు. రాజు వచ్చి పోసాగాడు. పోలీసులు అతని సాధుత్వానికి మచ్చికౌతున్నారు. వారి వద్దనే తుపాకి విద్య కూడా నేర్చేంత స్నేహం, నమ్మకం కుదిరాయి ! ఇంతట్లో తాను యాత్ర చేసి వచ్చే నెపాన అధికారుల అనుమతితో అంతర్థానమై, అడవి అనే సముద్రంలో ఇక్కడ మునిగి జయపురం అడవుల వద్ద తేలాడు. అక్కడ ఆ అడవుల్లోని సవరలు దోసాయి శ్రీ హరిదాసు నాయకత్వాన పోరాటానికి నమాయత్తమై గోదాలోకి దిగుతున్నారు. అడవిలో దారి దొరికింది. పోయినవాడు పోయినట్టే గాక కొత్త ఆయుధమైన పోరాట భావాన్ని మోసుకుని తిరిగి మన్యం అడవులకు వచ్చి చేరుకున్నాడు.చేరుకోగానే తన వాళ్ళను మైదాన ప్రాంతానికి తరలించి వేశాడు. బంధాలూ అనుబంధాలూ తెగ దెంచుకోవడం ఇది.

తాను కోయ ప్రజల బాధలు చూశాడు. మైదాన ప్రాంతం నుంచి వచ్చిన దోచుకునే వర్తక వ్యాపారులు, రోడ్డు కాంట్రాక్టర్లు కోయ జనాన్ని నిలువునా దోచు కుంటున్నారు. తాము పుట్టిన నీలారణ్యాల సంపదను తమకు కాకుండా తరలించుక పోతున్నారు. ‘స్వేచ్ఛా జీవుల మెడల చుట్టూ ‘నాగరికత’ పాఠాలు తగిలిస్తున్నారు. అల్ప సంతోషులచేత అరవచాకిరీ చేయిస్తున్నారు. ఈ దోపిడీదారు లందరికీ మద్దతుగా గూడెం తాశీల్దారు నల్లదొర బాస్టియన్ లంచాలు మేస్తూ, అక్రమార్జన చేస్తున్నాడు. ఎదిరించిన వారిని భూముల్ని తొలగిస్తున్నాడు. రైతులను కౌల్దార్లుగా మార్చివేస్తూ, ఇష్ట ప్రకారం వేధింపులు సాగిస్తున్నారు. గ్రామ పెత్తందారీ – ముఠాదారీ  పదవులను లంచాల వేలం పాటకు నిలుపుతున్నాడు. కాదన్న గాం గంటం దొరలాంటి వాళ్ళను బికారులుగా చేస్తున్నాడు. వీడి బలం పోలీసు లాఠీ బలం.

వీడి బలం ప్రభుత్వ బలం విదేశీ ప్రభుత్వ బలం.దోపిడీ ప్రభుత్వ బలం.

దీన్ని ఎదిరించాలం’టే గాంధీ పథం పనికి రావచ్చు. తన పంథాకి పంచాయతీ కోర్టుల ద్వారా చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలను కూడగట్టి, వెట్టి చాకిరీకి పోకుండా జనానికి దైర్యం చెప్పి చూసిన సీతారామరాజు త్వరలో మరో విషయాన్ని గ్రహించాడు. విరోధిది పశు బలం అయినప్పుడు, దానిని పరిమార్చడానికి గాంధీ పథం పనికి రాదు. సాయుధ సోరాటమే ఏకైక పంథా, ‘ఆంధ్రపత్రిక’ విలేకరితో నోరు విడిచి అంత మాటా చెప్పాడు. తమ కష్టసుఖాలు ప్రభుత్వోద్యోగులకు మొరబెట్టుకొని శాంతి యుతంగా కష్ట నివారణోపాయాలు ఉపయోగించు కోరాదా అని ఒక తాశీల్దారు అడిగినప్పుడు, ప్రభుత్వోద్యోగుల పట్ల తనకు నమ్మకం లేదని రాజు జవాబు చెప్పాడు. ప్రభుత్వం అంటేనే పోలీసులూ ఉద్యోగులు అయినప్పుడు, ఆ ప్రభుత్వం దౌర్జన్యం మీదనూ దోపిడీ మీదనూ ఆధారపడి వుంటున్నప్పుడు, దానిని బతిమాలితే పని జరగదు. ఈ విషయం సీతా రామరాజుకు తెలుసు.

    సీతారామరాజు సాయుధ పోరాట పంథాను అనుసరించ డానికి వైయక్తిక మైన కారణం కూడా ఉంది. ఊహాజీవి కావడంవల్ల ప్రాచీనమైన “క్షాత్రధర్మం” మీద మనస్సు తగుల్కొని, కత్తి పట్టడం గురించి భ్రమలు పెంచుకున్నాడని తెలుస్తుంది. ఈ తన పోరాటానికి కావలసింది సత్యాగ్రహులు కాదు, ఆగ్రహులే ! వాళ్ళు ఎక్కడినుంచి వస్తారు ? జనసామాన్యం నుంచి! నిత్య జీవిత సమస్యలే ఆగ్రహానికి పుట్టిళ్ళు. బాస్టియనే ప్రభుత్వము, ప్రభుత్వమే బాస్టియను అయిన వాస్తవ స్థానిక పరిస్థితిలో, దగాపడీ దెబ్బలు తినీ ఉన్న భూమిని పోగొట్టుకొనీ గ్రామ పెత్త నాన్ని కోల్పోయీ ఉన్న ప్రజలనుంచే ప్రజల ఆగ్రహంనుంచే సాయుధ పోరాట సైనికులు పుట్టుకొస్తారు.మన్యం ప్రజలది వట్టి ఆర్థిక సమస్య మాత్రమేకాదు. భూమి సమస్య కూడా. రాజుది మూడోది: దేశ స్వాతంత్య్రం సమస్య. చిన్న సమస్యలు పెద్ద దానితో ముడిబడి వున్నాయి. చిన్న సమస్యలను వదిలి పెద్ద సమస్య మీదనే కేంద్రీక రిండడం కాంగ్రెసు చేసిన విధంగా ప్రజల్ని దగా చెయ్యడమే. స్వాతంత్ర్య సమస్య, భూ సమస్య పెనవేసుకొంటేనే ప్రజల రాజకీయాధికారానికీ హామీ. ఆతనికి తెలియకుండానైనా, అతని పోరాటానికి ఇవి రెండూ ప్రాతిపదిక అయ్యాయి. రెండేళ్ళు సాగిందంటేనే, ఈ పోరాటానికి ప్రజా బలం ఉందని అర్థమవుతుంది. రాజు తాలూకు మత మహత్తుకు మూర్ఛ పోయే వాళ్ళు ఉంటే పోనీ! అతని పాదాలు కడిగిన నీళ్లను తలమీద చిలకరించుకునే మూర్ఖులు ఉంటే ఉండనీ!! సబ్ ఇన్స్పెక్టర్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు తాసిల్దారులు కరణాలు మునసబులు ఈ మధ్య తరగతి సజ్జంతా రాజుని గౌరవించి అతని మంచితనాన్ని గుర్తిస్తే గుర్తించనీ! కాంగ్రెస్ వాళ్లు కొందరైనా అతని దేశభక్తిని తగ్గిస్తే తగ్గించనీ, సీతారామరాజు దండులో పాల్గొన్న సైనికులు నూటికి 99 మంది అసలైన సమస్యను స్వానుభవంగా గుర్తించిన వాళ్లే.

       సీతారామరాజు నిర్మించి నడిపించిన దండు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నిర్మించిన ‘రామదండు’ లాంటిది కాదు. సీతారామరాజు దుగ్గిరాల గోపాల కృష్ణయ్యలా ఎచ్చపిచ్చి మనిషి కాదు. గాం సోదరుల పర్యవేక్షణలో అతని దండు నిర్మింప బడింది. వాళ్లు స్థానికులు, ఎవరు ఎందుకు ఏ భౌతిక ప్రయోజనాలను కోరి ప్రాణాల నైనా లెక్కచెయ్యకుండా పోట్లాడుతారో వాళ్ళకు తెలుసు.గంటందొర లక్ష్యం బాస్టియన్ ను చంపడం, లేదా వాడి చేతిలో తాను చావడం ! అందుకనే వాడిచేత నష్ట పోయి కష్టాలపాలైన వాళ్ళే దండులో చేరారు. గూడెం, పెద్దవలస తాలూకా ల్లోని గ్రామాలనుంచే సైనికులు ఎక్కువగా వచ్చారు. సొంతదార్లు కావచ్చునని ఆశలు పెట్టుకున్నారు. కొందరు పోయిన పెత్తనాలను తిరిగి పొందవచ్చునని ఆశలు పెట్టుకున్నారు. ఇలా ఎక్కువగా పేదసాదల వర్గం నుంచే వచ్చారు. అయితే, గ్రామస్తులను దండిస్తూ వచ్చిన గ్రామ పెత్తందార్లు కూడా నలుగురైదుగురు ఇందులో వున్నారు. ఉండడమే కాదు, రాజు తర్వాత చెప్పుకో దగిన నాయకులూ వాళ్ళే. ఎండూ పడాల్ గాని, గాం సోదరులుగాని, మట్టాడం సోదరులు గానీ ఈ శ్రేణికి చెందినవారే. ఇవి చిరుత ప్రజలే అయినా రాజు సమక్షంలో చిరుత పులులు తమ నైజాన్ని మరిచి లేళ్ళతో చెలిమి చేశాయి. వీళ్ళు ఉభయులూ బాస్టియన్ వ్యతిరేకతలో ఐక్యం కాగలిగారు. ఒక స్థానిక పోరాటాన్ని, ఒక ఆర్థిక పోరాటాన్ని దేశీయమైన మహా పోరాటంలో కొత్త పంథాగా మలిచి నందుకైనా, రాజకీయ పోరాటంగా మార్చినందుకైనా అల్లూరి సీతారామరాజు స్మరణీయుడు.

ఆ పోరాటం బ్రిటిష్ ప్రభుత్వ పోలీసు పటాలాన్ని రెండేళ్ళ పాటు (1922-1924) ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించింది. కాంగ్రెస్ పార్టీ ద్రోహంవల్ల లేదా సహాయ నిరాకరణంవల్ల అది ఏకాకియై పోయింది. స్థానిక ప్రజల సానుభూతిని ఎప్పటి కప్పుడు, క్రియాశీలమైన సహకారంగానూ, ప్రజల నుంచి ఎప్పటికప్పుడు వచ్చి చేరే సైనిక పరంపరగానూ మార్చుకోలేక పోయింది, దీనికి కారణం, రాజు అసలు సమస్యను అడుక్కి నెట్టి మన్యం ప్రజలకు పూర్తిగా బోధపడని రాజకీయ విషయానికి అత్యంత ప్రాముఖ్యాన్నిచ్చాడు. గ్రామాలలోని వర్గ సంబంధాలను గమనించి, బాస్ట్రియన్లాంటి ప్రభుత్వోద్యోగులతో మొదలెట్టి వర్గ శత్రువులయిన ముఠాదార్లనూ ప్రభుత్వ బంట్లనూ ఏజంట్లనూ ఏరివేసేందుకు పూనుకొని ఉంటే, తన రాజకీయాశయ పరిపూర్తికి ప్రాథమికావసర మైన ఐక్యత లోపించి, విదేశీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగవలసిన ఐక్యపోరాటం అంతర్యుద్ధంగా పరిణమించగల దని తాను భయపడి ఉండవచ్చు. నిజానికి, ఈ రెండూ ఏక కాలంలో కవలలలా పెరిగి ఉండవలసిన అంశాలు, పైగా, తాను పోరాట ప్రారంభంలో పోలీసుస్టేషన్ల మీద ఆయుధాల కోసం సాగించిన మూడు నాలుగు దాడులు శత్రువులో భయ సంభ్రమాలను కలిగిస్తే ప్రజల్లో సంతోషాశ్చర్యాలను కలిగించాయి. వాటిని కొన సాగించకుండా, సంపాదించుకున్న శత్రు ఆయుధాలను పూర్తిగా శత్రువు మీద వాడ కుండా, లేనిపోని “క్షాత్రనీతి” కోసమో “మానవ ప్రేమ” కోసమో చేతికి దొరికిన శత్రువులను విడిచివేస్తూ, చివరకు ప్రభుత్వ దిగ్బంధ విధానం ఫలితంగా తిండికి కటకటపడి తన అసలు పునాది అయిన గ్రామాలమీదనే పడి, నయాన భయాన ఆహారాన్ని సంపాదించుకోవలసిన పరిస్థితి ఏర్పడగా ఈ వరకే ప్రభుత్వ నిర్బంధ విధానానికి గగ్గోలుపడిన ప్రజల నుంచి వారి సానుభూతి నుంచి క్రమక్రమంగా దూర మయ్యాడు. ఆత్మరక్షణ ఒక్కటే పరమార్థంగా, శత్రుసైనిక చర్యల నిరాఘాట మైన పరిస్థితిని కలిగించి, వారి ఆత్మవిశ్వాసాన్ని దినదినాధికం చేసేందుకు తోడ్పడ్డాడు.

  అల్లూరి సీతారామరాజు సాగించిన సాయుధ పోరాటం అల్లూరి సీతారామరాజు లాగానే ఎన్నో గుణలోపాలు గల పోరాటం. పాతికేళ్ళ ప్రాయంలో అంత పెద్ద పోరాటాన్ని సాగించిన సీతారామరాజు అసామాన్య వ్యక్తి. మరి ఆ పోరాటం మన కొక పాఠశాల.

[ఈ వ్యాసం ‘పిలుపు’ పత్రికలో 1-5-1974 నుండి 16-2-1975 వరకు మొత్తం నాలుగు సంచికలలో నాలుగు భాగాలుగా వెలువడింది. సం॥]

అల్లూరి సీతారామరాజు (4-7-1897:7-5-1924)

భారత స్వాతంత్ర్య పోరాటంలో వేగుచుక్క అల్లూరి సీతారామరాజు, ఆదివాసుల గుండెల్లో ఆరని జ్యోతి అల్లూరి సీతారామరాజు. అలనాటి తెల్ల ప్రభుత్వానికి సింహస్వప్నం అల్లూరి సీతారామరాజు, అందుకే తెలుగునాట తొలి బూటకపు ఎన్ కౌంటర్ సీతారామరాజుది. నేలతల్లి బిడ్డల విముక్తి కోసం నేలకొరిగిన వీరుడు సీతారామరాజు, అయినా చావులేని సమరశీలి సీతారామరాజు. ఇంతకీ సీతారామరాజు జీవితకాలం కేవలం ఇరవై ఏడేళ్ళు. కాని అల్లూరి ఊసులు, వాసనలు నూరేళ్ళయినా మాసిపోలేదు, మాయం కాలేదు. ఎందుకని ?

అప్పుడు

నా చిన్నప్పుడు రెండో ప్రపంచయుద్ధం ముమ్మరంగా జరుగుతున్నప్పుడు నాజీలు నరజాతిని నెత్తురు టేరుల్లో ముంచెత్తు తున్నప్పుడు ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు తాము నమ్మిన ఆశయాల కోసం కమ్యూనిస్టులు ప్రాణాలని తృణప్రాయంగా అర్పిస్తున్నపుడు …

కోయలు మా ఊరు (కృష్ణాతీరం, కృష్ణాజిల్లా) వస్తుండేవారు. ముఖాలూ, చేతులు చూసి ఏవేవో చెబుతూండేవారు. వారి వేష భాషలు మాకు బాగా నచ్చేవి. అప్పటికే ఆ నోటా, ఆ నోటా అల్లూరిని గురించి విని ఉన్నాం. ఎంతో ఆసక్తిగా అడిగేవాళ్ళం, ఎవరిని అడిగినా, ఎందరిని అడిగినా కోయలందరిది ఒకటే మాట-“రామరాజు చనిపోలేదు, చనిపోడు. బతికే ఉన్నారు. బతికే ఉంటారు.” నిజానికి అప్పటికే అతను చనిపోయి ఇరవైఏళ్ళు గడిచిపోయాయి. ‘అయినా కోయలు ఈ నిజం ఎందు కొప్పుకోరు?’ అని మాలో మేము తర్కించుకునే వాళ్ళం. ‘ప్రజలలో పనిచేసి, ఉద్యమాలు నిర్మించి, పోరాడి, ప్రాణాలిచ్చిన వాళ్ళు ప్రజల దృష్టిలో అమరులు.’ ఇలా సమాధాన పడేవాళ్ళం.

ఉన్నావో లేవో కొందరు నీవున్నావంటారు. ధారగ నీ రక్తము ప్రవహించిన స్థలమందున మేము వీరాగ్రేసర! ఊరు గట్టి నీ పేరు పెట్టెదము. సూర్యచంద్రులున్నంత వరకు ఈ చుక్కలున్నంత వరకు అంటూ బుర్రకథల్లో ఈ మాటలతో బొమ్మలు గీసేవారు.

అల్లూరి సీతారామరాజు పుట్టి, పెరిగి, చదువుకుని చాలా ఊళ్ళు తిరిగాడు. చివరికి కొండల్లోకి, కోనల్లోకి వెళ్ళిపోయాడు. ఆ ప్రజల మధ్యే బతికాడు. వాళ్ళ కష్టాలు కళ్ళారా చూశాడు. అన్యాయాలు, అక్రమాలు, దోపిడి, పీడనలు పసిగట్టాడు. వాటిమీద మండిపడ్డాడు. కళ్లెర్ర జేశాడు. ఎవరి కష్ట ఫలం వారికి దక్కాలన్నాడు. కోయలని కూడగట్టాడు. వారికి ప్రేమపాత్రు డయ్యాడు. మన్యం రగిలించాడు.ఉద్యమ జ్వాల మండించాడు. పోరాట బాట వెంట నడిచాడు. అందరినీ నడిపించాడు.

      అన్యాయం అంతం చేయాలంటే ఆయుధాలు పట్టక తప్పదనుకున్నాడు. వ్యవస్థీకృత మార్పుకోసం జరిగే ప్రయత్నం సాయుధం గానే ఉండాలి. అది ఉత్త మాటలతో పని కాదు. ఈటెలు, కత్తులు, విల్లు, బాణాలు మంటలుగా మండితేగాని దోపిడి, బూడిద పాలు కాదు. తన అనుభవం ద్వారా అల్లూరి ఆకళించు కున్న సత్యం ఇది. ఆనాడు అన్నవరంలో ఆంధ్రపత్రిక విలేఖరితో నిక్కచ్చిగా ఈ మాటలే చెప్పాడు. దీనికి ఎలాటి డోకా లేదు. 

     సీరారామరాజు పోరాడిన ప్రాంతంలో నిప్పు ఏనాటి నించో రాజు కుంటూనే వుంది. రంప పితూరీ (1877)కి ద్వారబంధాల రామచంద్రయ్య నాయకత్వం వహించాడు. లాగరాయి పితూరీ (1916)కి నాయకత్వం వీరయ్య దొర కుటుంబానిది. అక్కడే ఆ తరవాత గరిమెండ పంగరాజు (కొండ కమ్మరి), సిట్టల భీముడు (మాల) పోరాటాలు జరిపారు. ఇవన్నీ సాంతం ఇంకా చరిత్రకెక్కనే లేదు. సీతారామరాజు మన్యం విప్లవం (1922-24) బాగా పేరు పొందింది.

ఆ విప్లవాన్ని తాత్కాలికంగా అణచడానికి ఆనాటి ప్రభుత్వం 40 లక్షల రూపాయలు వెచ్చించిందని అంచనా. మలబారు పోలీసులని, అస్సాం రైఫిల్ దళాన్ని కూడా పంపవలసి వచ్చింది.

    మన్యం ఇవాళ మన కళ్ళముందు ఇంకా మండుతూనే వుంది. అడ్డతీగల, రంపచోడవరం, గుర్తేడు, కొయ్యూరు ఇంకా ఇంకా వార్తలలోకి ఎక్కుతూనే ఉన్నాయి. పరాయి పాలన ముగిసి 50 ఏళ్ళయినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా  అక్కడ సమస్య మాత్రం అలాగే మిగిలిపోయింది. ఆదివాసులకి అన్యాయం జరుగుతూనే ఉంది. వాళ్ళ జీవ నాధారాలైన అడవులు, భూములు అన్యాక్రాంత మవుతూనే ఉన్నాయిు. దీనిని ఆరికట్ట డానికి ఆనాటి (1917) నుండే ఏదో ఒక మేరకి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. చిట్టచివరికి అది 1/10 అనే చట్టరూపం తీసుకుంది- ‘ఆదివాసుల భూములు అన్యులు కొనగూడదు’. ఈ 1/70 చట్టం ఆచరణలో అడుగడుగునా నీరుగారిపోతూనే ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేయాలని చూస్తోంది. ఈ ప్రయత్నాన్ని మనం తీవ్రంగా ప్రతిఘటించక పోతే ఆదివాసుల జీవనాధారం శాశ్వతంగా పోతుంది. ఆనాటి తెల్ల ప్రభుత్వం మైదాన ప్రాంతాల్లో జమీందారీ వ్యవస్థని నెలకొల్పినట్టే, మన్యంలో ముఠాదారీ వ్యవస్థని నెలకొల్పింది. ఈ ముఠాదారీ వ్యవస్థ చేసే పనులే ఇవాళ ఫారెస్టు డిపార్టమెంటు, రెవిన్యూ డిపార్టుమెంటు, పోలీసు డిపాస్లమెంటు చేస్తున్నాయి. కనుక మన్యం పోరాటం ఇవాళ యింకా ఎక్కువ కష్టభూయిష్ట మయింది. ఆదివాసుల తిరుగుబాటు మీద ఎవరు ఏ వైఖరి అవలంబిస్తారనేది చాలా ముఖ్యం.

      ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అప్పుడు టంగుటూరి ప్రకాశంగారి చెప్పు చేతల్లో వుంది. ‘తెల్ల ప్రభుత్వంమీద తిరుగుబాటు జరుగుతోంది. మమ్మల్నేం చేయమంటార’ని అడిగారు పెద్దాపురం కాంగ్రెసువారు. వారికి తణుకు కాంగ్రెసువాది బ్రహ్మజోస్యుల సత్యనారాయణ గారి ద్వారా వర్తమానం అందింది. ‘దోపిడి దొంగల ముఠాతో చేతులు కలపపద్ద’ని ప్రకాశంగారు తాఖీదు సంపారు. తెల్లదొరలతో షరీకయి గద్దె నెక్కింది కాంగ్రెసు. ఆ కాంగ్రెసుతో ఇవాళ భారతదేశంలో పార్ల మెంటరీ పార్టీలన్నీ చెట్టపట్టాలేసుకుని నడుస్తున్నాయి. ఇది మన కళ్ళముందు కనిపించే సత్యం. అయితే ఆనాటి అల్లూరి బాటలో నడుస్తోంది ఈనాటి యువత. బూటకపు ఎన్ కౌంటర్ల లో రోజూ నేలకొరుగుతూనే ఉన్నారీనాటి విప్లవకారులు. ప్రజల కోసం పోరాడేవారికి అల్లూరి ఊపిరి, ఉత్తేజం. గెలుపు, ఓటమిలకి యిది ఓట్ల జూదం కాదు.ఇది ఉద్యమం, తిరుగుదాటు, పోరాటం, విప్లవం, నిరంతరం కొనసాగేదే విప్లవం. ఏ వ్యవస్థయినా మర్రిచెట్టులా వేళ్ళూని ఉంటుంది, ఊడలు దిగుతుంది. దానిని కూకటి వేళ్లతో పెకలించాలన్నా, ఊడలతో సహా కూల్చాలన్నా ఒట్టి మాటలతో అయ్యే పని కాదు. చెట్టుని మించిన విప్లవ చేవతో ముఖ్యంగా యువత కదిలినప్పుడే యిది సాధ్యమవుతుంది.

అల్లూరి సీతారామరాజు వ్యక్తి కాదు శక్తి. ఒక విప్లవ శక్తి. విప్లవ విజయానికి యుద్ధం ఎంత అవసరమో అల్లూరికి తెలుసు. అందుకు తగిన వ్యూహం, ఎత్తుగడలు ఆతనికున్నాయి. సుశిక్షిత సైన్యం కూడా సమకూర్చు కున్నాడు. తెల్లసైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించాడు. గాము మల్లుదొర, గంటం దొర, వర్షాలు, అగ్గిరాజు లాంటి సేనానులున్నారు. వీరిలో గంటందొర చివరి వరకు పోరాడు తూనే వున్నాడు. సీతారామరాజు చనిపోయిన (7-5-1924) తరవాత నెలవరకు కూడా తన పోరు నిరాటంకంగా కొనసాగించాడు. తెల్ల ప్రభుత్వానికి లొంగలేదు. అంతటితో వూరుకోలేదు ప్రభుత్వం, గంటందొర పోయిన తరవాత కూడ చాలా ఏళ్ళపాటు వందల మంది మీద కేసులు బనాయించి శిక్షల కోసం అండమాన్ పంపింది. అదే బ్రిటిష్ వారి కుతంత్రం, కుటిల నీతి, దమనకాండ. వలసవాదుల, సామ్రాజ్య వాదుల స్వభావమే అంత. సామ్రాజ్యవాదం హిరణ్యాక్షుడిలా ఇవాళ నేలనంతా చాపచుట్టి తన చంకలో పెట్టుకుంటోంది. మనం చూస్తూ ఊరుకోవలసిందేనా ? అల్లూరి స్ఫూర్తితో ముందుకు నడవాలి. సామ్రాజ్యవాదపు కుటిల పన్నాగాలని పసి గట్టాలి. దాని కోటిపడగలని మొదలంటా నరకాలి. మానవజాతికి అప్పుడే నిజమైన విముక్తి. ఈ సామ్రాజ్యవాదం అనే పెనుపాముని దేశ దేశాల ప్రజలనే చలిచీమలు మట్టుబెట్టి తీరతారు.

అల్లూరి సీతారామరాజు నూరో పుట్టినరోజున మనందరం ప్రతిన తీసు కుందాం. అదే అల్లూరికి నిజమైన నివాళి. విరసం చారిత్రక కర్తవ్యం కూడా అదే.

Leave a Reply