మిత్రులార!
విరసం ఆవిర్భావ సభను ఏ పార్టీ అధికారంలో ఉన్నా, జరగనివ్వక పోవడమనేది చాలా బాధాకరమైన విషయం. గత ఎన్నికల్లో మేము అందరం కూడా తెలంగాణలో ప్రజాస్వామ్యం కోసమని ఎంతో ప్రయత్నించాం. అంతకు ముందు బిఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా రాజ్యాంగ విలువలను గౌరవించడం లేదని చిన్నచిన్న సభల్ని,16సంస్థల్ని కూడా నిషేధించడం అన్నీ దృష్టిలో పెట్టుకొని, ఆ పార్టీ మళ్లీ కొనసాగితే ప్రజాస్వామ్య విలువలు ఏమాత్రం కూడా దక్కవనే ఉద్దేశంతో మనమంతా కూడా చాలా సభలు నిర్వహించి రాజ్యాంగాన్ని రాజ్యాంగ విలువల్ని కాపాడుకోవాలని అంటూ మనం కాంగ్రెస్ పార్టీ ముందు డిమాండ్ పెట్టినప్పుడు ఆ పార్టీ ఈ అంశాన్ని తన మానిఫెస్టోలో ఏడవ వంశంగా చేర్చింది.
ప్రజాస్వామ్యాన్ని మీరు ఎట్లా నిర్వచిస్తారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్దరణ అన్నారు కదా. అంటే మీకు నచ్చే విషయాలు నచ్చని విషయాలు లేక మిమ్మల్ని విమర్శించే విషయాలు, ఈ సమాజంలో చెడుపోయి మంచి సమాజం రావాలి అనేటువంటి చర్చ ఒకటి ఉంటుంది కదా. ఒక సమాజం తనను తాను మార్చు కోవాలని, దుర్మార్గమైన దోపిడీ పోవాలి. దోపిడీ దౌర్జన్యం హింస లేని సమాజం రావాలి అని కోరుకునే హక్కు ఆ ప్రజలకు ఉంటుందా లేదా?
“లిబర్టీ” అంటే స్వేచ్ఛ పైన ఎలాంటి అణచివేత లేకపోవడం. ఎలాంటి అభిప్రాయమైనా అది చర్చలో ఉండాలి. చరిత్రలో ఏ భావాలైతే ఒక సమాజంలో చర్చకు వచ్చాయో అవే ఆసమాజాన్ని ముందుకు నడిపించాయి…
ఈ సీఎం గారితో ఒక టీవీ ఛానల్ లో జరిగిన చర్చలో నేను చెప్పాను. మీరు అధికారంలోకి వస్తే అధికారానికి స్వేచ్ఛకు మధ్య నిరంతరంగా ఉండే ఒక ఘర్షణ ఉంటుంది దాన్ని మీరు గౌరవించాలి అని చెప్పినప్పుడు సార్ మీరు అసెంబ్లీలో ఈ విషయంపై మాట్లాడాలి అని అన్నారాయన. సరే, అంత వెసులుబాటు ఉంటుందని మనం అనుకోలేదు కానీ అది అట్లా ఉంచి ఇవాళ మనం అడిగేది కాంగ్రెస్ పార్టీ ఫాసిజాన్ని అంగీకరిస్తున్నదా? రాహుల్ గాంధీ అందరూ ఫాసిజం గురించి మాట్లాడుతూనే ఉన్నారు. నెహ్రూ గారు అయితే 1948లోనే జయప్రకాశ్ నారాయణ గారికి రాసిన ఒక లేఖలో మనమందరం ఐక్యమవ్వాల్సిన అవసరం చాలా ఉంది, దేశంలో ఫాసిస్టు శక్తులు చాలా బలంగా ఉన్నాయి. మనం కలవకపోతే ఫాసిజం ఈ సమాజాన్ని కబళిస్తుంది అని అవ్వాళ్లే ఆయన నొక్కి చెప్పారు. అంబేద్కర్ కూడా మాట్లాడారు ఈ విషయాన్ని. అదంతా ఓ చరిత్ర సరే, 1974లో ఎమర్జెన్సీ పెట్టారు. మనకు అదొక భయానక అనుభవం. ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎన్సీఈఆర్టీ ద్వారా 9వ తరగతి పుస్తకంలో ఎమర్జెన్సీ గురించి అది ఏమంటుంది. దాంట్లో పిల్లలకి ఏం చెప్పారు. అప్పుడు ఎమర్జెన్సీలో సభలు పెట్టుకోనివ్వ లేదు, మాట్లాడనివ్వలేదు. రాజకీయ నాయకుల్ని జైళ్లల్లో పెట్టారు అని. మరి ఇవాళ సభ జరగనివ్వకుండా చేసినప్పుడు ఆ పిల్లలు ప్రశ్నిస్తే ఉపాధ్యాయుడు వాళ్లకు ఏం చెప్పాలి?వాళ్ళు ఎమర్జెన్సీ పై పాఠం పెట్టారు కానీ ఇవాళ్ళ మీరేం చేస్తున్నారు?
ఇంతకాలంగా మనం తెలంగాణలో కొన్ని సభలు పెట్టుకోవచ్చు మాట్లాడొచ్చు అని చెప్తున్నాం. ఇప్పుడేం చెప్పాలి? కాంగ్రెస్ పాలన బిజెపి పాలన కన్నా భిన్నంగా ఉన్నదని ఏం మాట్లాడాలి? మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆలోచించాలి కదా! ఎందుకని సభ జరగనివ్వలేదు. సభలో ఆపరేషన్ కగార్ పై మాట్లాడితే అది ఒక చరిత్రే కదా… జరిగింది కదా. ఆ అగ్ర నాయకులు బయటకు వస్తే మీరు వాళ్ళతో మాట్లాడారు. మీ అభిప్రాయాన్ని మీరు ఆయుధాలు లేకుండా ప్రకటించుకోవచ్చు అన్నారు వాళ్ళతో. మీ అభిప్రాయాన్ని భావాల్ని చెప్పుకోవచ్చని మీరు వాళ్ళతో అన్నప్పుడు, ఇక్కడ ఏమైంది?
ఈ సంస్థకు (విరసం) గొప్ప చరిత్ర ఉంది. విప్లవ రచయితల సంఘం మొత్తం సాహిత్య ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. ఇవాళ ఈ మాత్రమైనా రాజ్యంతో మాట్లాడడానికి, విరసం లాంటి సంఘం ఇచ్చిన మేధస్సు పాట కళారూపాలే కదా? గద్దర్ని ఎంతగానో ఆదరించి ఎంతో చేశారు మీరు ఆయన్ని ఆకాశానికి ఎత్తారు మేము చాలా సంతోషించాం ప్రజలు సంతోషించారు కానీ గద్దర్ ఏం చెప్పాడు. అట్లాంటి వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు? ఇవన్నీ ఏమాత్రం ఆలోచించకుండా, విరసం ఆవిర్భావ సభలు, అదీ ఫాసిజం మీద పెడితే నిరాకరిస్తారా!
ప్రపంచంలో హిట్లరూ ముసోలిని చేసిన దుర్మార్గాలు మనకు తెలుసు. ప్రపంచ మానవాళి తిరుగుబాట్లు కూడా తెలుసు. స్వేచ్ఛను మానవ హక్కుల్ని గౌరవించాలని జరిగిన కృషిలో మనం కూడా భాగమే కదా. అంతర్జాతీయ హక్కులు భారత రాజ్యాంగం ఇవన్నీ కాదని ఇలాంటి నిర్బంధాన్ని ప్రయోగిస్తే దాని పర్యవసానాన్ని ప్రపంచమే చవిచూసింది. ఈ దేశంలోని మేధస్సు, ప్రజలు నియంతృత్వాన్ని సహించరని మనం చూశాం కదా. ఇట్లాంటి చారిత్రక అనుభవాలు ఉన్నప్పుడు కూడా ఒక సభ పెట్టుకోనివ్వక పోవడం ఏంటి?
నా దృష్టిలో హాల్ మీటింగ్లకు అనుమతి అవసరమే లేదు. బహిరంగ సభలు ఊరేగింపులు కూడా పోలీసుల నిర్వహణ బాధ్యత ఉంటుంది కాబట్టి చెప్పడం. ప్రభుత్వ జోక్యం అవసరం ఉండకూడదు. మీరెప్పుడూ శాంతి భద్రతలని ఆలోచిస్తారు. మేము స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని గురించి. ఎందుకంటే పౌరులుగా మాకు మాట్లాడుకునే అవకాశం ఉండాలి కదా. రేవంత్ రెడ్డి గారు, మీరు గెలవడానికి వాళ్లు చేసిన నియంతృత్వం పాలు ఎంతో ఉందని మీరే స్వయంగా నాతో అన్నారు. తెలంగాణలో ప్రజలు పొట్ట మీద కొట్టినా సహించుతరు గాని వాళ్ళ స్వేచ్ఛపై దాడి చేస్తే సహించరని. మరి ఇవాళ ఇట్లా ఎందుకు చేస్తున్నారో మీరు జవాబు చెప్పాలి. ఇది నేను చేస్తున్న హెచ్చరిక అనుకోండి లేదా నా సలహా అనండి భవిష్యత్తులో ఏ సంస్థ, హాల్ మీటింగ్ లేదా పబ్లిక్ మీటింగ్ పెట్టుకోడానికి ఎట్లాంటి అడ్డంకి ఒత్తిడి ఉండకూడదు.
ఇవాళ విప్లవ రచయితల సంఘం ఈ ప్రెస్ మీట్ లో స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, స్వేచ్ఛ లేని సమాజం అది మానవ సమాజం కాదు. ఆ స్వేచ్ఛనే మీరు తీసుకున్నాక మీరు ఎందుకు పరిపాలన చేస్తున్నారో, రాజ్యం ఎందుకు వచ్చిందో, మానవజాతి చరిత్రతో చేసిన సంభాషణలో స్పష్టం చేస్తుంది. కనుక ఇవాళ ఈ ప్రెస్ క్లబ్ నుండి మీకు ఒక హెచ్చరికగా చెప్పేదేంటంటే ఇది ఒక రాజకీయ నిర్ణయమే. పోలీసులకు సర్వాధికారాలు ఇస్తే మిమ్మల్ని ఓడగొట్టడానికి మరో రాజకీయ పార్టీ ప్రతిపక్షం అక్కర లేదు. పోలీసుల విధానమే అట్లుంటది. మీ ఆలోచనా విధానం భిన్నంగా ఉండాలి కదా. ఈసారి తెలంగాణ ప్రభుత్వం ఆలోచించకపోతే పర్యవసానము చాలా భిన్నంగా ఉంటుంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇట్లాంటి ఉద్యమాలు వస్తాయో మీకు తెలుసు కనుక ఈ చరిత్రను దృష్టిలో పెట్టుకోండి. నిన్న విరసం సభను జరగనివ్వక పోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ఆలోచించి తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్తులో ఇట్లాంటిది జరగకుండా చూసుకోవాలని, మనందరి మాటగా ఈ ప్రెస్ ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియ జేస్తున్నాను. విరసం తన కర్తవ్య నిర్వహణలో నిరంతరం ఇలాగే సభలు జరుపుతూనే ఉండాలని మేమంతా మీతో ఉన్నామని తెలియజేస్తున్నాను.
విరసం ఆవిర్భావ సదస్సు జూలై 5, 20 26 ను అడ్డుకున్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నిర్వహించిన ప్రెస్ సమావేశం 5/7/26న, ప్రసంగించిన ప్రొఫెసర్ జి .హరగోపాల్ గారు




