ఓ దుఖం
పెనుగంగలా ఉప్పొంగి
జీవితాన్ని ముంచెత్తి
మనశ్శాంతిని భగ్నం చేసినప్పుడు
కనుచూపుమేరా
ప్రియమైనవన్నీ దూరమైనప్పుడు
నీ హృదయానికి పదేపదే ఇలా చెప్పు
“ఈ పాడుకాలం గడిచిపోతది”
అంతులేని శ్రమ
నీ సంతోషగానాల మీద
మౌనపు తెరల గమ్మినప్పుడు
ప్రార్థించడానికి సైతం
నీ పెదాలు వొణుకుతున్నప్పుడు
ఈ సత్యం
మబ్బుల తొలగించి
నిన్ను తేలికపరచనీ
“ఈ పాడుకాలం గడిచిపోతది “
జీవితం
విలాసవంతమై
భౌతిక సుఖాలలో
కాలం దొర్లుతున్నప్పుడు
ఈ మాటలు
నిన్ను ఎప్పుడూ వెంటాడనీ
“ఈ పాడు కలం గడిచిపోతది”
నీ శ్రమ జీవజలంలో
కీర్తి కాంతులు పుష్పించినప్పుడు
ప్రపంచంలోనే
ఉన్నతమైనవి నీకందివొచ్చినప్పుడు
ఈ జీవితం
ఒక అంతులేని, అద్భుత కథ అని గుర్తించుకో
జీవితం దుర్భరమైన చోట
జీవించడం మానకు
అవిశ్వాసం లేనేలేదు
మనకు తెలియకుండానే
పెదాలు తిరస్కరించినచోట
మనసు విశ్వాసంతో ఉరకలేస్తుంది
**
Elizabeth Y.case (1840),
” This too shall passaway”కు
స్వేచ్చానువాదం : ఉదయమిత్ర




