దేని మీదైనా సరే, వ్యాసాలు రాశాక, ప్రసంగాలు చేశాక కూడా సాహిత్యంగా త‌ప్ప మ‌రోలా చెప్ప‌లేనిది మిగిలి ఉన్నప్పుడు రచయితలు కాల్పనిక ప్రక్రియల్లోకి వెళతారు. మానవ అనుభవాన్ని వర్ణించడానికీ, పంచుకోడానికీ సాహిత్య రచన తప్పనిసరవుతుంది. ఆ అనుభవం ఇవ్వాల్టిదైనా కావచ్చు. చరిత్రలోని సుదూర గతానిదైనా కావచ్చు. కానీ, సుప్రసిద్ధ రాయలసీమ రచయిత బండి నారాయణ స్వామి ఇటీవల 600 పేజీల ‘కడపటి యుద్ధం’ నవల రాశాక కూడా తన ఇతివృత్తం గురించి, అందులో తన ప్రతిపాదన గురించి ఆయన మళ్లీ వ్యాసాలు రాయవలసి వస్తున్నది. ఈ పని నవల ‘వెనుక మాట’తోనే ఆయన ఆరంభించారు.

నవల ద్వారా తాను చెప్పాలనుకున్నది పాఠకులకు చేరుతుందో లేదో అనే అనుమానం స్వామికి కలిగినట్లుంది. కాల్పనిక వర్ణనలతో, భావోద్వేగాలతో నవలలో చెప్పిన దానికన్నా నేరుగా, వాచ్యంగా తన భావనలను చెప్పాలనే పట్టుదల కూడా ఉన్నట్లుంది. నవల మీద సామాజిక మాధ్యమాల్లో జరిగిన చర్చలో కూడా జోక్యం చేసుకున్నారు. మే 24న ఆంధ్య్రజ్యోతిలో ‘మతాలన్నీ సనాతనం వైపే’ అనే వ్యాసం కూడా రాశారు. తద్వారా గొప్ప కథా, నవలా రచయితగా పేరు మోసిన స్వామి తన సృజనాత్మకతకు తానే సవాల్‌గా మారిపోయారు. అంతగా ఆయన తన శక్తికి మించిన ఇతివృత్తాన్ని తీసుకొని విఫలమయ్యారు. ఇది ఒక కాల్పనిక రచయిత వైఫల్యం మాత్రమే కాదు. కడపటి యుద్ధం నవలలో, దాని వెనుకమాటలో, ఆ తర్వాత రాసిన వ్యాసంలో ఎంచుకున్న సామాజిక, సాంస్కృతిక దృక్పథమే దీనికంతా కారణం. ఇదీ అసలు సమస్య. ఆయ‌న చాలా ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఈ వైఖ‌రి తీసుకున్నారు. అందువ‌ల్ల ఈ న‌వ‌ల సంద‌ర్భంలో విస్తారంగా మాట్లాడ‌వ‌ల‌సిన చాలా అంశాలు ఉన్నాయి. ఇక్క‌డ కొన్ని మాత్ర‌మే ప‌రిశీలించ‌గం.

‘కడపటి యుద్ధం’ నవలకు ‘ఆది హిందూ చారిత్రక నవల’ అనే టాగ్ ఉంది. నవలను పాఠకులు ఎలా చదవాలో స్వామి ఒక దారి చూపడానికి ఈ ఉప శీర్షిక తగిలించారు. ‘ఆది హిందూ’ అనే భావనకు ఉన్న చారిత్రక అర్థాన్ని ప్రస్తుతానికి అటుంచి, స్వామి తాను ఒక ప్రతిపాదన చేయదల్చుకొని ఈ నవల రాశారు. ఏ సీరియస్ నవల అయినా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఏదో ఒక చారిత్రక, సామాజిక, సాంస్కృతిక ప్రతిపాదన చేస్తుంది. కానీ స్వామి చేయాలనుకున్న ప్రతిపాదన వాస్తవ చరిత్రకూ, మతానికీ, సంస్కృతికీ; వాటి మధ్య ఉండే సంక్లిష్ట సంబంధానికి వ్యతిరేకమైనది. చరిత్రకు ఇవ్వాల్సిన భౌతికవాద వ్యాఖ్యానానికీ, చరిత్రను చూడవలసిన ఆధునిక దృక్పథానికీ’ కూడా వ్యతిరేకమైనది.

రచయిత స్వయంగా చారిత్రక నవల అనడం వల్ల, ‘అది పదహారవ శతాబ్దం’ అనే వాక్యంతో ఆరంభం కావడం వల్ల పాఠకులు కడపటి యుద్ధాన్ని చారిత్రక దృష్టితో చూస్తారు. కృష్ణదేవరాయల అనంతరం విజయనగర సామ్రాజ్య కాలపు రాజకీయ, మత, సాంస్కృతిక పరిణామాలు ఇందులో చిత్రించారు. నవల ఆరంభంలో కొన్ని పేజీలు కష్టంగా సాగుతుంది. లోపలికి వెళ్లాక సులువు దొరుకుతుంది. కొన్ని భాగాలు వేగంగా, ఆసక్తికరంగా, తీవ్రమైన భావోద్వేగాలతో నడుస్తుంది. మరి కొన్ని చోట్ల మందకొడిగా సాగుతుంది. ప్రధాన ఇతివృత్తాన్ని విస్తరించడానికి తగిన ఉప కథలను కూడా ఎంచుకున్నారు. అవి చదవడానికి బాగుంటాయి. ఆకాలపు చారిత్రక విశేషాలు తెలియజేస్తాయి. మొత్తం మీద స్వామి తాను ఎంచుకున్న కాలంలోని మానవ జీవితాన్ని, అనుభవాన్నీ, ఆచార వ్యవహారాలనూ, రాజకీయ పాలనా రణ తంత్రాలనూ శ్రద్ధగా నవలలోకి తీసుకొచ్చారు. దాని కోసం చాలా పరిశ్రమించారు.

కానీ చారిత్రక నవల అంటే ఇతివృత్త కాలపు జీవిత విశేషాల, రాజకీయ, ఆర్థిక వ్యవహారాల పేర్పు కాదు. నిజానికి అలాంటివి ఎన్నిటిని క్రోడీకరించినా అది చరిత్ర కాదు. చరిత్ర ఎట్లా నిర్మాణమైందో, ఏ ఏ శక్తుల ప్రేరణతో దాని గత వర్తమానాల క్రమం సాగిందో చెప్పడమే చరిత్ర రచన. చరిత్ర నిర్మాణానికి ఏ ఒక్కటో ఏకైక కారణం కాకపోవచ్చు. కానీ ఏది ఎంత ప్రధానమై చరిత్ర రూపొందిందో తెలిసి ఉండాలి. దీన్నే చారిత్రక పద్ధతి అనీ, దానికి సంబంధించిన చూపును చారిత్రక దృక్పథమనీ అంటారు. చరిత్ర గురించి ఇంత చెప్పుకున్నా, ఇదంతా చరిత్ర రచనలోకి రావడం కష్టం. అక్కడే నవల పాత్ర ఉంది. చరిత్ర చెప్పలేకపోయిన వాటినీ, చరిత్రకారుల పద్ధతిలో భాగం కాలేకపోయిన వాటినీ చారిత్రక నవల చెబుతుందని చారిత్రక, సాహిత్య విశ్లేషకులు అంటారు. మళ్లీ దానికి కూడా చరిత్రే ఆధారం.

స్వామి ప్రధానంగా నైసర్గిక రచయిత. గతంలో రాసిన ‘శప్తభూమి’ నవల చారిత్రక నవలే అయినా అనంతపురం ప్రాంతంలోని వర్తమాన దళిత, బహుజన నైసర్గిక పాత్రలను గతంలోకి తీసికెళ్లి, కాల్పనీకరించి రాశారు. కొన్ని చారిత్రక పాత్రలతో, కొన్ని కాల్పనిక పాత్రలతో ఆ నవల నడిచింది. ఆ నవలా ఇతివృత్తంలో నైసర్గికత ప్రధానం కావడం వల్ల కడపటి యుద్ధంలో కనిపిస్తున్న ధోరణి లీలగా అందులో కూడా ఉన్నప్పటికీ చరిత్ర విషయంలో స్వామికి పెద్దగా ఇబ్బంది ఎదురవ్వలేదు.

కానీ కడపటి యుద్ధం నవలలో స్వామి తనదై ఒక ప్రతిపాదన చేయదల్చుకున్నారు. దాన్ని వర్తమాన నేపథ్యంలో చెప్పదల్చుకోలేదు అట్లా చెబితే విశ్వసనీయత ఉండదు. అందుకని చరిత్రలోకి వెళ్లారు. అందరికీ తెలిసిన చారిత్రక విశేషాలకు కాల్పనిక రూపాన్ని ఇచ్చారు. నవలలో రాజులు, నవాబులు, వాళ్ల సుఖ జీవితాలు ఉన్నట్లే అట్టడుగు శ్రామికులు, దళితులు, బహుజనులు, ముస్లింలు, ఆదివాసులు, వేశ్యలు ఉన్నారు. వాళ్ల జీవన శైలిలోని తారతమ్యాలు కనిపిస్తాయి. ఆనాటి చరిత్రలో ఉండగల అనేక సమూహాల సాంస్కృతిక వైవిధ్యాలు ఉన్నాయి. వాళ్ల మధ్య ఉండే సంబంధాల, ఉద్వేగాల, అనుభూతుల రూపంలో చరిత్రను చెప్పే ప్రయత్నం చేశారు. అంత వరకే అయితే సమస్య ఉండేది కాదు. ఈ జీవన వాస్తవికత ఆధారంగా స్వామి చరిత్ర మీద కొన్ని కల్పనలు చేశారు. వాటికి చరిత్రతో సంబంధం లేదు. కనీసం స్వామి చెప్పాలనుకున్న పద్ధతిలో సంబంధం లేదు. పాఠకులు చదువుతూపోతే రచయిత తన మౌలిక ప్రతిపాదన కోసమే చరిత్రను కాల్పనీకరిస్తున్నారని, అదే రచయిత వ్యూహమని అర్థమవుతుంది. దాని కోసమే చరిత్రను వర్ణించారనీ తెలుస్తుంది. తాను సేక‌రించిన‌ చారిత్రక విషయాల‌ను తన సూత్రీకరణకు అనుగణంగా పేర్చుకుంటూ వెళ్లారు. చరిత్ర రచనకూ, చారిత్రక నవలా రచనకూ ఇది పూర్తి వ్యతిరేకం.

మళ్లీ నవలలోకి వెళ్లితే, రచయిత చేయదల్చుకున్న ప్రతిపాదన కొన్ని చోట్ల నేరుగా, కొన్ని చోట్ల పరోక్షంగా తెగిపోని ధారలా కొనసాగింది. దాని కోసం కొన్ని సన్నివేశాలు సృష్టించారు. పాత్రల స్వభావాలను మలిచారు. సంభాషణలు నడిపారు. నేరుగా రచయిత జోక్యం చేసుకొని ఒక్కో సందర్భంలో ఒక్కోలా చెప్పారు. ప్రస్తుత చర్చలో క్లుప్తత కోసం అలాంటి వాటన్నిటి సారం తెలియజేసే ఒక వాక్యాన్ని నవలలోంచి ఎత్తి చూపించవచ్చు. అదేమంటే మనిషి ‘తన మతంలో తాను ఉంటూనే, తన వారసత్వాన్ని, పూర్వీకుల సంస్కృతిని కాపాడుకోవలె. భిన్న ప్రవాహాల కలయిక కదా దక్కన్ సంస్కృతి. రెండు సంస్కృతులు అంటు తొడిగితే పూచిన ఒకే పువ్వు కదా హంపీ దక్కనీయం’ అంటారు.

దక్కన్ సంస్కృతి అనే భావన నవలలో కొనసాగడానికి ఆనాటి చరిత్రలోంచి స్థల కాల వివరాలు చాలా గాఢంగా తీసుకొచ్చారు. అయితే స్వామి ప్రతిపాదన దక్కన్ సంస్కృతి గురించి కాదు. అది చరిత్రలోని వాస్తవం. అదే ప్రతిపాదించదల్చుకుంటే నవల ఇంకోలా ఉండేది. దక్కన్ సంస్కృతి అనేది ఒకానొక అంశం మాత్రమే. ఈ సంగతి నవల వెనుకమాట ద్వారా చాలా వరకు తెలుస్తుంది. అంతకంటే ఎక్కువ ఆంధ్రజ్యోతి వ్యాసం వల్ల తెలుస్తుంది. ఆయన ప్రధానంగా చెప్పదల్చుకున్నది ఏమంటే.. మనుషులు తమ మతంలో, పూర్వాచారాల్లో ఉండాలి, వాటిని కాపాడుకోవాలి, వాటిపట్ల నిబద్ధులై ఉండాలి.. అంటూ వాటిని వైభవీకరించారు. ఆ పూర్వాచారాలు ఏమిటి? ఆంధ్రజ్యోతి వ్యాసంలో ఇలా అంటారు. ‘సనా’ అంటే సృష్టికి పూర్వం ఉన్నది అని అర్థం. ధర్మం అంటే దానిని చేరుకొనే మార్గం. సనాతన ధర్మం అంటే ‘ఎప్పటి నుండో ఉంటూ వర్తమానంలో కొనసాగుతూ భవిష్యత్తులో కూడా కొనసాగేది అని అర్థం. ఈ ప్రపంచంలో ‘నేను’ అనే అస్తిత్వం ఒకటి ఏర్పడక ముందు, దానికి ఆధారమైన మతతత్వం…ఉంది. ఇలాంటి అయోమయ వాదన ఇంకా చాలా ముందుకు వెళ్లింది. మతానికి ఎన్ని అపభ్రంశ అర్థాలు వచ్చినా, దాన్ని ఎవరు ఎట్లా వాడుకున్నా ఈ మతతత్వంతో చూడాలని తేల్చేశారు.

ఏ పోలికకైనా దాని పరిమితులు, ప్రత్యేకతలు ఉంటాయనే పూర్తి ఎరుకతోనే స్వామి వాదన చదివినప్పుడు హిందుత్వ అంటే ఏమిటి? అనే తొలి తాత్విక విశ్లేషణ చేసిన సావర్క‌ర్ కసరత్తు ఎవరికైనా ఇంకో వైపు నుంచి గుర్తుకు రావచ్చు. కీలకమైన తేడా ఏమిటంటే స్వామి సనాతనత్వాన్ని ఎంచుకున్నారు.

దక్కన్ సంస్కృతిని పాఠకులు తెలుసుకోడానికి తగిన సన్నివేశాలు, జీవిత విశేషాలు, వాటి చారిత్రక ప్రత్యేకతలు నవలలో కనిపిస్తాయి. వాటి ద్వారా దక్కన్ సంస్కృతి అంటే హిందూ ముస్లిం సమ్మిళిత సంస్కృతి అంటారు. స్వామి అక్కడ నిలబడలేదు. ‘హిందువులు’ అనబడే వాళ్లు ఎవరి మతాచారాల‌ను వాళ్లు కాపాడుకోవాలని శ్రీవైష్ణవం స్పూర్తితో చెబుతాడు. అంటే ఎవరి కులాచారాల్లో, కులధర్మాల్లో వాళ్లు ఉండాలి. వైష్ణవంలో భాగం కావడంతో సామాజిక, మేధో స్థాయిలో తేడా వచ్చినప్పటికీ కుల వృత్తులను పాటించే పాత్రలు ఈ నవలలో కనిపిస్తాయి. ఈ కులాచరణ వాళ్లు దక్కన్ సంస్కృతిలోకి రావడానికి తొలి మెట్టు. దక్షిణ భారత దేశంలో, ముఖ్యంగా విజయనగర రాజ్యంలో, ఈ నవలా కాలంలో వైష్ణవానికి అట్టడుగు సామాజిక వర్గాల్లో, అంటరాని కులాల్లో ఎలాంటి స్థానం ఉంది? అది ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? ఆ మేరకు రాచరిక పాలనలో ఏ మార్పులు వచ్చాయి? అనేవి చారిత్రక విషయాలు. చరిత్ర విద్యార్థులు వాటిని అధ్యయనం చేయవలసిందే. కానీ స్వామి అక్కడ మొదలై వాస్తవ చరిత్రను వదిలేసి మతం గురించి తన విశ్వాసాల దగ్గరికి చేరుకున్నారు. ఇప్పటి అర్థం ప్రకారం ఆనాటికి ‘హిందువుల’నబడేవారి మతం సనాతన ధర్మమే. వైష్ణవంలో ఉన్న దళిత పాత్రలు రాముని చుట్టూ తమ ఆధ్యాత్మిక, సామాజిక ప్రపంచాన్ని నిర్మించుకొని ఉంటారు. అదే పరంపరాగత ధార్మిక, సాంస్కృతిక వైభవంగా గుర్తింపు పొంది ఉంటుంది. ‘తమ వారసత్వాన్ని, పూర్వీకుల సంస్కృతిని కాపాడుకోవలె..’ అని స్వామి చెబుతున్నది ‘హిందూ’ రాజులకేనా? కానేకాదు. నవలలో ఉన్న దళిత బహుజన ప్రజలకు. వర్తమానంలోని ప్రజలకూ. ఇవ్వాల్టి సమాజానికీ. అస్పృశ్యత రద్దు కావాలని కోరుకుంటూనే ఈ మాట అంటారు. అందువల్లనే, ‘రెండు సంస్కృతులు అంటు తొడిగితే పూచిన ఒకే పువ్వు’గా స్వామి భావిస్తున్న దక్కనీ సంస్కృతికంటే సనాతనత్వమే ఇక్కడ ప్రధానం.

కొన్ని చారిత్రక వాస్తవాలనూ, వాటి కాల్పనిక రూపాలనూ ఆశ్రయించి సాగిన ఈ నవల అంతస్సారం మతం, అదీ స్వమతావలంబన, స్వమత పరిరక్షణ ఉద్దేశంతో నడవడం. ఒక వాక్యంలోనే మతం అనీ, సంస్కృతీ అనీ సమానార్థకాల్లో స్వామి రాశారు. వేరే చోట ఆయన మతానికి అలౌకిక కోణమేగాక సామాజిక కోణం కూడా ఉంటుందని అంటూ త మతం`సంస్కృతి ఒకటే అనడం, అదే చారిత్రకం అనడం, నిర్దిష్టంగా ఈ స్వమతావలంబనే ఆది హిందూ భావన అనడం పొసగని వ్యవహారాలు. స్వధర్మే నిధనం శ్రేయ: అనే భావన స్వామి మత, ఆధ్యాత్మిక, సాంస్కృతిక దృక్పథం వెనుక ఉన్నదని అనుకోవచ్చు. కాకపోతే స్వధర్మంలోని లోపాలను సరిదిద్దుకొని కాపాడుకోవాలని అంటారు. ’రెండు సంస్కృతులు అంటు తొడిగి దక్కనీయ సంస్కృతి అనే పువ్వు పూయడాని’కి ఈ దేశంలోని దళితులు, బహుజనులు, ఇంకా శ్రామిక ప్రజలు మొదట తమ మతంలో, మత సంస్కృతిలో ఒదిగి ఉండాలి. నిజానికి శ్రీవైష్ణవం పేరుతో రచయిత రాముడ్ని కేంద్ర స్థానంలోకి తీసుకొచ్చారు. ఈ ఆధ్యాత్మికత స్వామి ఆలోచనాధారలో ముందు నుంచే ఉన్నది. మీ రాజ్యం మీరేలండి నవలలో, శప్తభూమి నవలలో కూడా ఇది కనిపిస్తుంది. అక్కడ దళిత బహుజన ఆధ్యాత్మికత, బైరాగుల నైసర్గిక చింతన రూపంలో ఉండేది. స్థానీయ, బ్రాహ్మణేతర రూపంలో ఉండేది. ఈ నవలలో శ్రీవైష్ణవ భక్తి చింతన రూపంలో నేరుగా రాముడి దగ్గరికి చేరుకున్నది. ఇప్పుడది విరాట్రూపం తీసుకున్నది. అంతే తేడా. ఇక్కడ వివరాల్లోకి వెళ్లలేంగాని, ఇంకో వైపు నుంచి చూస్తే, భక్తి ఉద్యమాన్ని, ముఖ్యంగా వైష్ణవ భక్తి ధారనూ, సామాజిక పరిణామాల్లో, విపరిణామాల్లో దాని పాత్రనూ విమర్శనాత్మకంగా చూడటానికి కూడా ఈ నవల, స్వామి ఆలోచనలు ఒక సందర్భంగా ముందుకు వచ్చాయి.

ఈ నవలలో వైష్ణవ ప్రభావంలో రాయలవారే దళితుల రామాలయ ప్రవేశానికి అనుమతించి ఉండవచ్చు కానీ దళిత బహుజన కుల‌స్థులకు ఆ ‘తక్కువ’ కుల గుర్తింపు పోలేదు. కుల అంతరాలు రద్దు కాలేదు. ఇక్కడ మన సామాజిక నిర్మితితో, దాని చరిత్రతో నిమిత్తం లేకుండా స్వామి కుల వ్యవస్థ పునాదిగా ఉన్న ‘తన మతంలో తాను ఉంటూనే, తన వారసత్వాన్ని, పూర్వీకుల సంస్కృతిని కాపాడుకోవాల’ని చెప్పారు. మళ్లీ ఇక్కడ కుల అంతరాలు నశించాలనీ, మతమంటే ఆధ్యాత్మికతే కాదనీ కూడా స్వామి అంటారు. అవన్నీ రద్దయి, సనాతన ధర్మం నిలిచి ఉండాలని కోరుకుంటారు.

అసమానతలు, ఆధిపత్యాలు లేకుండా సనాతన ధర్మం ఉనికే లేదు. కులవ్యవస్థ, పితృస్వామ్యం లేకుంటే సనాతనత్వం బతికిబట్టకట్టలేదు. మన సామాజిక సంఘర్షణా చరిత్ర చెబుతున్న వాస్తవం ఇది. కానీ స్వామి దీన్ని అంగీకరించరు. ‘బ్రాహ్మణాధిపత్యం లేని శూద్రుల హైందవంతో మన జాతీయ ఆసక్తులకు కొత్త రూపం ఇద్దాం’ అన్నారు. చరిత్రను చారిత్రక శక్తుల వైపు నుంచి కాకుండా సనాతన ధర్మ దృష్టితో చూస్తారు. దాని ప్రకారం చరిత్ర, సంస్కృతి నిర్మాణం అయ్యాయని అంటారు. ‘సమాజంలో సామరస్యానికి మతాల మధ్య కృత్రిమమైన అగాధాలను పూడ్చడానికి’ సనాతనత్వాన్ని ఎంచుకున్నారు. చరిత్ర మీద, సామాజిక వాస్తవికత మీద తన మత, ధార్మిక, సాంస్కృతిక భావనలను పులుముతారు. చరిత్రను చూడవలసిన ఆధునిక చింతనను తిరస్కరిస్తారు. మతం కూడా చరిత్రలో భాగం. అట్లని మత దృష్టితో చరిత్రను చూడ్డానికి లేదు. కానీ స్వామి ఈ విషయంలో ఎంత దృఢంగా ఉన్నాడంటే ఆయన మానవ సమాజ చరిత్రనే కాదు, ప్రకృతిని అధ్యయనం చేసే వైజ్ఞానిక దృక్పథాన్ని కూడా సవాల్ చేశారు. లేదా దాన్నీ సనాతన ధర్మంలో ముంచి తీశారు. ఆయన ఏమంటారంటే సైన్స్ చెప్పే ‘ఆటోమేటిక్ డివైన్ యాక్షన’ కూడా ప్రకృతి నియమాలకు అతీతంగా పని చేయగలదని భారతీయ యోగులు నిరూపించారని అంటారు.

అన్ని మతాలకూ పూర్వ దశలో సనాతనత్వం ఉంటుందని చెబుతూ భారతీయ ముస్లింలు ‘వారు పుట్టి పెరిగిన ఈ నేల, ఈ జాతి, ఈ రక్తం(డిఎన్‌ఎ) మీదుగా నిర్మాణం అయిన దేశీయ సంస్కృతిని సొంతం చేసుకోవలె. భారతీయ ముస్లింలుగా ప్రపంచ ముస్లింలలో తమ విశిష్టతను చాటుకోవలె’ అంటారు.

ఈ వాక్యాలు చదువుతోంటే పాఠకులకు ఏమనిపిస్తున్న‌ది? ఎవరు గుర్తుకు వస్తున్నారు? ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఆయన లెక్క ప్రకారం అన్ని మతాలకు ఉన్నట్లే హైందవానికి భారతీయ సనాతన ధర్మం మూలం.. అదే దేశీయ సంస్కృతి. ఇంకో భాషలో చెప్పాలంటే ‘జాతీయ సంస్కృతి’. దాన్ని ముస్లింలు, క్రైస్తవులు పాటించాలి. ఆయన ఈ నవల ద్వారా ప్రతిపాదించదల్చుకున్న విషయం కోసం చరిత్రలో చాలా వెనక్కి వెళ్లి ఇవ్వాల్టి వర్తమానంలోకి చేరుకున్నారు. గతానికి, వర్తమానానికి తన భావనలతో వారధి కట్టారు. ఇంకోలా చెప్పాలంటే, ఈ చారిత్రక సందర్భంలో తాను చేయాలనుకున్న నిర్ధారణల కోసం చరిత్రలోకి వెళ్లి ఇంత క‌స‌ర‌త్తు చేశారు. వ‌ర్త‌మాన సంక్షోభాన్ని గ్ర‌హించి ఏ వైఖ‌రి తీసుకోవాలి? అనేది దృక్ప‌థంతో, భావ‌జాలంతో ముడిప‌డిన విలువ‌ల‌కు సంబంధించిన విష‌యం. స్వామి ఈ విష‌యంలో త‌న భావ‌జాలాన్ని చెప్పుకోడానికీ, విలువ‌ల‌ను ప్ర‌క‌టించుకోడానికి చ‌రిత్ర అనే గ‌తంలోకి వెళ్లి, అక్క‌డి నుంచి గంభీర‌మైన ముఖంతో వ‌ర్త‌మానంలోకి వ‌చ్చారు. ఆయ‌న న‌వ‌ల‌లోనూ, ఇత‌ర‌త్రా చాలా విస్తార‌మైన చ‌ర్చ చేశారు. తెలుగు సాహిత్య‌, మేధో రంగాల‌కు తాను మ‌తం గురించి కొత్త‌గా జ్ఙాన భిక్ష పెడుతున్న‌ట్లు సూత్రీక‌ర‌ణ‌లు చేశారు. ఇవేవీ ఆధునిక‌త‌కూ, ప్ర‌గ‌తికీ నిల‌బ‌డేవి కావు. పైగా ‘మతానికి ఉన్న సామాజిక పార్శ్వాన్నిక‌మ్యూనిస్టులు గుర్తించాల్సి ఉన్నదని’ అన్నారు. దీనికి విస్తారమైన మార్క్సిస్టు విశ్లేషణను ఇక్కడ ఉటంకించనవసరం లేదుగాని మార్క్స్ సుప్రసిద్ధ సూత్రీకరణ ‘మతం మత్తుమందు’ అనే మాటకు ముందు వెనుకల ఏం ఉన్నదో ఒకసారి గుర్తు చేసుకుంటే చాలు.

మతాన్ని రాజకీయాలకు వాడుకుంటున్న మతతత్వవాదుల ధోరణిని స్వామి వ్యతిరేకిస్తారు. కానీ చారిత్రక పరిశీలన పేరుతో, తాత్విక చర్చ రూపంలో, మతానికి ఉండే అలౌకిక, సామాజిక పార్శ్వాల విశ్లేషణ పేరుతో వారి పెరటిలోకే వెళ్లిపోయారు. దీన్ని ఆయన మతాన్ని ప్రజాస్వామికీకరించడమని అన్నారు. నేరుగా చెప్పకపోయినా ఈ కడపటి యుద్ధ సన్నివేశం ముస్లిం రాజుల చేతిలో అళియ రాయల ఓటమి లేదా ఆయనకు జరిగిన ద్రోహం ప్రస్తావనతో నవల ముగిసింది. నవలలోకంటే గట్టిగా వెనుకమాటలో ఈ ఓటమికి మత కారణాలు ఉన్నాయని అన్నారు.

Leave a Reply