మే 15వ తేదీన సుప్రీంకోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఈ దేశ నిరుద్యోగ యువతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు భారతీయ యువతలో అసంతృప్తి ప్రకంపనలు సోషల్ మీడియాలో పుట్టించాయి. అతని వ్యాఖ్యలు ఈ దేశం యువతను సోమరిపోతులు గాను, బద్దకస్తులుగాను చెబుతూ, వారిని బొద్దింకలతో పోల్చారు. దీనికి స్పందనగా మే- 16న “కాక్రోచ్ జనతా పార్టీ” పేరుతో సోషల్ మీడియాలో ఈ దేశ యువత మరియు విదేశాల్లో ఉన్న భారతీయ యువకులు పెద్ద ఎత్తున నిరసన తెలియ జేశారు. ఆ తర్వాత జస్టిస్ సూర్యకాంత్ వివరణ ఇచ్చినప్పటికీ, పాలక ఎన్. డి. ఏ. ప్రభుత్వం పై గల అసంతృప్తితో యువత నిరసనలు ఆగలేదు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఎక్స్ లోను, ఇన్స్టాగ్రాం లోను 16.5 మిలియన్ల పౌరులు సభ్యులుగా చేరారు. ఈ పార్టీకి ఆద్యుడు గా బోస్టన్ విశ్వ విద్యాలయంలో చదివిన అభిజిత్ దీపక్ గా చెబుతున్నారు. ఈ పార్టీ ప్రకటిత అంశాలు ఏమిటంటే:-
1) సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసిన వారు పదవీ విరమణ తర్వాత రాజ్యసభ సభ్యులుగా నియమించ రాదు.
2) దేశంలో నిరుద్యోగ నిర్మూలన జరగాలని, అవినీతిని అరికట్టాలని డిమాండ్ చేశారు.
3) చట్ట సభలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలి.
4) ఒకసారి ఒక పార్టీ గుర్తుపై ఎన్నిక కాబడిన ఎంపి, ఎమ్మెల్యేలు పార్టీని ఫిరాయిస్తే 20 సంవత్సరాలు పోటీకి అనర్హులు గా ప్రకటిస్తూ చట్టం చేయాలి.
5) ఆదాని,అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు మీడియాను రద్దుచేస్తూ, స్వతంత్ర సంస్థల మీడియా ప్రసారాలు జరగాలి.
2014 లోనే యూపీఏ ప్రభుత్వం పై యువత అసంతృప్తిగా ఉన్నప్పుడు అన్నా హజారే నాయకత్వం లో “అవినీతి వ్యతిరేక ఉద్యమం” జరిగింది. ఇది ఆ తర్వాత ఎన్నికలలో ఎన్డీఏ కూటమి గెలుపుకి, ఆప్ లాంటి రాజకీయ పార్టీ పుట్టుకకు మూలమయింది. అప్పుడు కూడా యూపీఏ ప్రభుత్వ అవినీతి, కుంభకోణాలు, నిరుద్యోగ సమస్య, ధరల పెరుగుదల, బలహీనమైన భారత ప్రధాని మొదలగు అంశాలను యువత లేవనెత్తడం జరిగింది. వీటన్నింటినీ రూపుమాపుతామని అధికారంలోనికి వచ్చిన ఎన్. డి. ఏ. కూటమి ప్రభుత్వం గత 12 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ ఉద్యోగాల కల్పన లోనూ, ప్రైవేట్ రంగ ఉద్యోగాలలో స్థిరత్వం లేకపోవడం, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడం, గత పది సంవత్సరాల కాలంలో 93 సార్లు జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష పేపర్లు లీకు కావడం, అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందకపోవటం, దేశంలో జాతి, మత, కుల విభజనలు పెరిగిపోవడం, పార్టీ ఫిరాయింపులు, SIR లాంటి అక్రమ పద్ధతులు, రాజ్యాంగబద్ధమైన పాలన లేకుండా సిబిఐ, ఈడి, ఎన్నికల సంఘం మొదలగు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పెద్దల చేతిలో కీలుబొమ్మలుగా మారిపోవటం, చివరికి సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు కూడా ఎన్డీఏ ప్రభుత్వ ప్రభావంతో పనిచేయడం చూసిన యువత, చివరికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ వ్యాఖ్యలతో భగ్గుమన్నారు.
పై పరిణామ క్రమమంతా తెలియజేస్తున్నది ఏమంటే, గతంలోని యూపీఏ ప్రభుత్వం, ఇప్పటి ఎన్ డి ఏ పాలకుల పట్ల దేశంలో గల విద్యావంతులు, నిరుద్యోగ యువత అసంతృప్తితో ఉన్నారన్నది నిజం. అయితే వారి దారి ఎటువైపు అన్నదే ఇక్కడ ప్రశ్న. ఈమధ్య కాలంలో శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ మొదలగు దేశాలలో జరిగిన జెన్ – జెడ్ ఉద్యమాలు తదనంతరం ఎన్నికల్లో ఒక్క నేపాల్లో తప్ప వారు పెట్టిన ఏ జెన్- జెడ్ పార్టీ ఎన్నికల ద్వారా అధికారంలోనికి రాలేకపోయింది. 2014 తర్వాత పుట్టిన ఆప్ పార్టీ కూడా ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో కూరుకు పోయింది. మతతత్వ సెంటిమెంట్ తో బి.జె.పి.పార్టీ అడ్డదారుల్లో అధికారాన్ని చేజిక్కించు కుంటున్నది. అయితే నేటి భారతీయ యువత అసంతృప్తి ఏదో ఒక మార్పుకి కారణం అయితే మంచిదే. కానీ దాని గమనం ఎలా ఉంటుందో ఇప్పుడు ప్రశ్నార్ధకమవుతుంది. సిద్ధాంతం లేని ఆచరణ- ఆచరణలేని సిద్ధాంతం గుడ్డెద్దు చేలో పడినట్లే అవుతుంది. ఈ సందర్భంగా మనం 1970 నాటి విశాఖ విద్యార్థుల పిలుపును గుర్తు చేసుకోవాలి. నక్సల్బరి, శ్రీకాకుళ ఉద్యమాల అనంతరం రచయితలారా! మీరు ఎటువైపు? అని ప్రశ్నించిన తదనంతర ఆరు దశాబ్దాల విప్లవోద్యమాన్ని నిర్మించిన చరిత్రను మనం చూసాం. నాటి వారి ఆశలు, ఆశయాలు పూర్తి కానప్పటికీ, భారతీయ సమాజంలో చాలా మార్పులు సంభవించాయి. దళిత,ఆదివాసి, కార్మిక, రైతాంగ జీవితాల్లో ఆ విప్లవోద్యమం వెలుగులను నింపింది. కానీ ఈ జెన్- జెడ్ ఉద్యమంలో కనీసం రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు ఆశించినట్లుగా భూమి, పరిశ్రమలు, విద్య, వైద్యం ప్రభుత్వ అధీనం లోనే ఉండే విధంగా వాటిని జాతీయం చేయాలన్న డిమాండ్ లేదు. నిరుద్యోగానికి, ఉపాధి లేమికి, అవినీతి అక్రమాలకు మూలమవుతున్న మౌలిక అంశాలపట్ల నేటి యువత నిర్లక్ష్యంగా ఉంది. 1990ల తర్వాత దేశంలో జరిగిన, జరుగుతున్న ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ విధానాల పట్ల ఇంతవరకు కెరీరిజంలో కొట్టుకుపోయిన యువత ఉద్యమాలకు దూరంగా ఉంది. ఇప్పుడు ఆ ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, సరళీకరణ విధానాల విష ఫలితాలు అన్ని రంగాలు నాశనం కావడానికి కారణం అవుతున్నందువలన, నేటి యువతలో అసంతృప్తి జ్వాలలను రగిలిస్తున్నాయి. ఈ జ్వాలలు ఉపరితల అంశాలను కాకుండా, పునాది అంశాలను గుర్తించి భవిష్యత్తు కార్యాచరణకు పూనుకుంటే, అది ఈ కుళ్ళిన వ్యవస్థను సమూలంగా మార్చి, దేశవ్యాప్తంగా విప్లవాత్మక మార్పులు వస్తాయి. ఆ దిశగా భారతీయ యువత ఆలోచన చేయనంత కాలం ఒక శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ జెన్ -జెడ్ ఉద్యమాలు మాదిరిగానో, కేజ్రీవాల్ పెట్టిన ఆప్ పార్టీ మాదిరిగానో, పుబ్బలో పుట్టి మఖలో అంతరించి పోతుంది. ఇదే మనకు చరిత్ర చెప్పిన సత్యం.
——- పేడాడ కృష్ణారావు,
జిల్లా కార్యవర్గ సభ్యులు, ప్రజాసంఘాల ఐక్యవేదిక, శ్రీకాకుళం.




