ఆగస్టు 24, 2025 వరంగల్‌లో ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా ఒక సభ ఏర్పాటు చేశాం. అప్పుడూ నిన్న పోలీసులు సడన్ గా ఎట్లైతే చెప్పిన్రో , ఆ రోజు కూడా వరంగల్ సభ జరగటానికి వీలులేదు అనుమతిలేదు అని వరంగల్ పోలీసులు ప్రకటించిన్రు. కనుక సభ జరగలేదు, అయితే ఆ సందర్భంగా ఒక సూచన ఏమొచ్చిందంటే, సభ జరగలేదు గానీ వివిధ ప్రాంతాల వాళ్ళు వస్తారు, అక్కడ ఏదో రకంగా చిన్నపాటి నిరసన చేస్తే బాగుండేది అని. సరే పౌరహక్కుల సంఘం అంత ధైర్యం చేయలేక పోయిందానాడు కానీ విరసం ఇవ్వాళ ఇక్కడ చేస్తున్నట్టు ఈ ఫామ్ లో చేస్తే బాగుండేదేమో అని కూడా అనిపిస్తా ఉంది.
మిత్రులారా! ఆపరేషన్ కగారు పై రెండున్నర సంవత్సరాలుగా ప్రజా సంఘాలు మేధావులు కవులు కళాకారులు అందరూ ఐక్యంగా పోరాటం చేశాం. అయినప్పటికిని వాళ్ళు అనుకున్న మార్చి 31 లోగా ఏది చేయాలనుకున్నారో అది చేశారు. చేశామని పార్లమెంటు సాక్షిగా కూడా ప్రకటించారు. మరి ఇంకేం అవసరం ఉంది అని ఆలోచించడం కాదు గానీ ఇది ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది అనేదానికి మనం సిద్ధం కావాల్సిందే. వాళ్ళ సమీక్షలో కూడా కొన్ని అంశాలు తేలుతాయి. ఆ అంశాలు ఏంటంటే మార్చి 31 తర్వాత ఇంకా ఏమీ ఉండదులే అనుకున్నారు. అసలు ఉండవు అనుకున్నారు, కానీ తెలంగాణ పోరాట గడ్డ గనుక మార్చి 31 తర్వాత ఇక్కడ కార్యక్రమాలు ముమ్మరమైనయి. ప్రజా సంఘాలు తమకు తోచిన మేరకు ఏదో రకంగా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నాయి .
మరి అది సహించటం అనేది ఒక సవాలు గానే ఉంటుంది. మార్చి 31 తర్వాత కూడా కార్యక్రమాలు ముమ్మరం కావటమేంటి అనేది వాళ్ళ సమీక్షలో భాగమవుతుంది. ఇదొక అంశం. రెండో అంశం అరసవెల్లి కృష్ణ ప్రస్తావించి ఉన్నాడు పౌరహక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తిరుపతిలో మహాసభలు నిర్వహించాం. అప్పుడు కూడా దానికి కూడా పోలీసులు పర్మిషన్ లేదన్నారు. అయితే హాల్ మేనేజ్మెంట్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో యాజమాన్యం వాళ్ళు అది కమ్యూనిస్ట్ పార్టీ గనుక, బహుశా న్యూ డెమోక్రసీ పార్టీ అయి ఉంటుంది గుర్తులేదు సరిగ్గా. సిపిఐ ఆఫీసు హాలు గనుక వాళ్ళు కార్యకర్తలకు ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి ఎవరు వస్తారో చూద్దాము అని నిలబెట్టడానికి సమాయత్తం అయిండ్రు. ఇది మాది, మా హాల్ కు ఎవరు వచ్చినా కానీ ఈ మహాసభ జరుగుతుంది . జరగనివ్వకపోతే మా శ్రేణులు అందరూ ముందర నిలిచి ఉంటారు. మీరు అనుకున్న శాంతి భద్రతల వాతావరణం ఏర్పడుతుంది. అని స్పష్టంగా చెప్పినందుకు పోలీసులు అక్కడ అడుగు పెట్టలేక పోయిన్రు.
ఆ సభ విజయవంతంగా రెండు రోజులు కొనసాగింది.
ఇప్పుడు అదే మనం ఎందుకు అడగకూడదు. ఇందాక కూర్చున్నప్పుడు కూడా మాట్లాడుకున్నాం. సిపిఎం వాళ్ళు ఏం చేస్తున్నారు. అసలు ఈ చరిత్ర ఇవ్వాల్టిది కాదు. ఆ ఆఫీస్ సిపిఎం ఆఫీసా లేదా తెలంగాణ గవర్నమెంట్ నడిపించే ఆఫీసా, లేదా కేంద్ర ప్రభుత్వం గీసిన హద్దుల్లో మాత్రమే అనుమతులు ఇచ్చే హాలా? అనేదివాళ మనకు సవాలు గానే ఓ ప్రశ్నగానే మిగిలి ఉంది. కొన్ని సంవత్సరాలుగా పౌరహక్కుల సంఘం మాత్రం (ఎస్వీకే)సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో సభ నిర్వహించు కోవడానికి వీలు లేదని కొంతకాలం మామీద నిషేధం కూడా పెట్టింది. తర్వాత వాళ్ళంతటవాళ్లే దాన్ని తొలగించడం అనేది జరిగింది. ఆ తర్వాత అట్లా ఎన్నో సందర్భాల్లో.. అంతెందుకు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక జూన్ 14 , 2014 లో సభ పెడితే తాళాలు వేసుకొని పోయిన్రు. వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళ సొంత హాలుకు వేరే వాళ్ళు వచ్చి ముఖ్యంగా పోలీసులు వచ్చి తాళం వేసేది ఏంటి అని, అదొక ప్రముఖ పార్టీ కద! వాళ్ళు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది .
ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇటీవలి కాలంలో జూన్ రెండు నాడు అట్టహాసంగ తెలంగాణ ఆవిర్భావ సభలు నిర్వహించుకొని, ఆ తర్వాత జరిగిన మొట్టమొదటి నిర్బంధ చర్య ఏంటంటే జూన్ 14 నాడు అనుకుంటా ఐఏపిఎల్ వాళ్ళు ఒక సభ నిర్వహించుకున్నారు. ఆపరేషన్ కగార్ మిగిల్చిన చేదు జ్ఞాపకాలు మిగిలే ఉన్నాయని. దానికి అనుమతి లేదంటే ఇక్కడే ఈ ప్రెస్ క్లబ్ లో ఆ సభ నిర్వహించాలి. ఈ తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారి చేసిన నిర్బంధ చర్య. సభలకు అనుమతి సంబంధించి, పౌరహక్కుల సంఘం నగర శాఖ జూన్ 25 ఎమర్జెన్సీ డేకి సంబంధించి ఒక సభ నిర్వహిద్దామని జూన్ 25 నాడే వెళ్తే బుక్ చేసు కోవడానికి లేదు. పోలీస్ పర్మిషన్ రావాలి అన్నారు. అంటే మా మీద ఇట్లా ఎన్నో సార్లు నిర్బంధం పెడుతూనే ఉన్నారు. అదేంటి పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా రద్దు నిషేధించినప్పుడు ప్రెస్ మీట్ పెడదామని ప్లాన్ చేస్తే ప్రెస్ మీట్ ను కూడా నిర్వహించ నివ్వలేదు. నన్ను,నారాయణరావుని తీసుకెళ్లి ఆ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో గంటల తరబడి కూర్చో బెట్టిన్రు. ఇవ్వాళ కూడా ఇక్కడ దీన్ని ఖండిస్తూ ఏర్పాటు చేసిన ఈ ప్రెస్ మీట్ కూ, ఇదిగో కింద మీరందరూ చూసే ఉంటారు పోలీసు మూకలు.
మిత్రులారా! ఏ పార్టీ వచ్చినా పోలీసు రాజ్యమే కొనసాగుతూ ఉంటుంది. అనేది మనకు సంపూర్ణంగా అర్థమైపోతుంది. ఇంకెందుకు మళ్ళీ మళ్ళీ మాట్లాడు కోవటం అంటే.. ఆయన పౌరహక్కులను నిలబెడతాను అన్నాడు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాను అన్నాడు. ఇగో! ఇంతెందుకు ఇది నా ఏడో గ్యారెంటీ అన్నాడు, మరి ఎక్కడ ఈ ప్రజాస్వామ్యం? ఏడో గ్యారెంటీ.
ఆ మిడ్జిల్‌లో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసినందుకు జెడ్పిటీసి సభ్యుడిగా గెలిచినందుకు 20 సంవత్సరాలు దాటిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయినందుకు పెద్ద ఎత్తున సభ. ఆ సభకు అనుమతి ఎక్కడ ఉంది అని అడుగుతా ఉన్నాం. ఆ పెద్ద సభకు అనుమతి ఉన్నప్పుడు హాలుకు పరిమితమైన ఈ సభకు ఎందుకు అనుమతి ఉండదు?
అయితే జూన్ 14 నాడు అనుమతి ఇవ్వనందుకు మనం మాట్లాడలేదు. మనం గుర్తు పెట్టు కోవాల్సింది ఏంటంటే జూన్ 25 నాడు ఆ పౌరహక్కుల సంఘం తలపెట్టిన సభ జరగనివ్వనప్పుడు మనం మాట్లాడనందుకు, ఇవాళ
ఆ రిఫ్లెక్షన్ విరసం సభలు జరగకుండా చేయటం దగ్గర తేలింది. అందుకనే ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా మనమందరం తక్షణమే కలవాల్సిన అవసరం ఉంది. మొత్తం పార్టీలు, ప్రజా సంఘాలు మన గొంతును వినిపించడానికి, సంఘాలు మేధావులు అందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని దీని మీద కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం మిగిలే ఉంది. సభలు సమావేశాలు మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు.
నీవు అనుమతి లేదనే పేరుతో మా సభలను రద్దు చేస్తున్నావంటే ఒక ప్రజాస్వామ్య హక్కు గా, నీ ఫాసిజం గురించి మేం స్పష్టంగా ప్రజలకు చెబుతాం. దాని కోరలు ఎట్లా ప్రజల మీద రకరకాల రూపంలో దాడి చేస్తాయో మాట్లాడటం కోసమే కదా తపనబడి విరసం ఈ సభ పెట్టింది. ప్రజలు శాంతిని కోరు కుంటే ,ప్రభుత్వాలు ఒక నిరంకుశాన్ని ,హింసను నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నాయి. ఎటువంటి నిర్బంధ పరిస్థితుల్లో ప్రజలు మగ్గిపోతున్నారు అనేది ప్రజల ముందుకు,
మీ ముందుకు తీసుకొస్తే దానికి సంబంధించిన పాలసీ విధానాలు రూపొందించడం కోసం మీకు ఉపయోగ పడుతుంది కదా!..
ఆ సభ ఉద్దేశం ఒక శాంతి భద్రతల సమస్యను సృష్టించడం కోసం కాదు కదా? శాంతి నెలకొనాలని ప్రజలు భద్రంగా ఉండాలని ప్రజలు స్వేచ్ఛగా యథేచ్ఛగా గొంతులు విప్పాలనే ఉద్దేశంతో కదా !ఈ సంస్థ అక్కడ సభను ఏర్పాటు చేసింది. నీవు సభకు పర్మిషన్ ఇచ్చి ఆ సభను సజావుగా కొనసాగనిచ్చి ఉంటే ఏం మాట్లాడుతామో నీకు అర్థమయ్యేది. ఒకవేళ శాంతిభద్రతలకే విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తే, అప్పుడు నీకు అన్ని చట్టాలు ఉన్నాయి అన్ని సెక్షన్లు ఉన్నాయి. మీరు ఏ చర్యలు చేపట్టాలో ఆ చర్యలు చేపట్టవచ్చు కానీ ముందుగానే కారణం చెప్పకుండా ఇదేంటి?
ఏ కారణం చేత రద్దు చేశారో చెప్పాలి కదా? దీన్ని తెలంగాణలో ఉన్న సివిల్ సొసైటీ అంతా అడగాలి కదా! ఈ సందర్భంలో పౌర హక్కుల సంఘం తెలంగాణ, విరసం ఆవిర్భావ సభ జరగకుండా చేసిన ప్రభుత్వ దమనకాండను తీవ్రంగా ఖండిస్తుందని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు.
5 /7/2026 విరసం ప్రెస్ మీట్
ప్రొ.జి.లక్ష్మణ్ పౌరహక్కుల సంఘం తెలంగాణ




