‘దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్’ అని గురుజాడ అన్నారు. దేశమంటే మనిషి కాదు మట్టి అన్నది నేటి ప్రభుత్వాల మాట. మట్టి అంటే మట్టిలో దాగి ఉన్న ఖనిజ సంపద అని. ఖనిజ వనరులతో అభివృద్ది చెంది అగ్రదేశం అవుతాం అని చెబుతారు. అభివృద్దిలో మనిషి ఉండడా అనే సందేహం పెట్టుకోకండి. అభివృద్దిలో లెక్కలు, లాభాల అంచనాలు మాత్రమే ఉంటాయి. లాభాల వేటలో మనుషులు, చెట్లు, జంతువులు, నీరు, గాలి అనే జీవావరణం పోగా లాభాలు మిగులుతున్నాయి. ఈ లాభాల వేటలో ఏమి కోల్పోతున్నామో నాగరిక మానవుడు తెలుసుకోలేని స్థితిలోకి నెట్టబడ్డాడు.
ఈ లాభాల వేటలో షోపేన్, నికోబార్సి అనే రెండు పురాతన ఆదివాసి సమూహాల అస్తిత్వం ప్రమాదంలో పడింది. ఈ తెగలు అండమాన్ నికోబార్ దీవులకు చెందినవి. ఈ ఆదిమ సమూహాలను ‘పర్టిక్యులయర్లీ వలనరబుల్ ట్రైబ్స్ (పివిటీజీ)గా ప్రభుత్వం గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన గ్రేట్ నికోబార్ అభివృద్ది మెగా ప్రాజెక్టు ఈ రెండు సమూహాలనే కాదు మొత్తం అండమాన్ నికోబార్ దీవులతో ముడిపడి ఉన్న పర్యావరణాన్ని ప్రమాదంలోకి నెట్టింది. తొంభై వేల కోట్ల పెట్టుబడితో (మొదలు పెట్టినప్పటి అంచనా డెబ్భైఆరు వేలకోట్లు) మూడు దశలలో 2047 నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యం.
ఈ ప్రాజెక్టు మొదలు అయినప్పటి నుండి దీని మీద పర్యావరణవాదులు, సామజిక కార్యకర్తలు అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తు వచ్చారు. 2020 సెప్టెంబర్ లో ఈ ప్రాజెక్టు కు సంబంధించిన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. 2021 ఫిబ్రవరిలో ప్రాజెక్టు సాధ్య సాధ్యాలకు సంబంధించిన రిపోర్ట్ (ప్రీ- ఫీజబిలిటీ రిపోర్ట్) ను విడుదల చేసింది. 2021 డిసెంబర్ లో ‘ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మేంట్’ డ్రాఫ్ట్ సర్టిఫికేట్ విడుదల చేసింది. ఈ రిపోర్ట్ లోపభూయిష్టంగా ఉందని ప్రాజెక్టు చేపడితే వచ్చే పర్యావరణ సమస్యలు, ఆదివాసి సమూహాల మనుగడ గురించి పట్టించుకోలేదని అనేక మంది నిరసన వ్యక్తం చేశారు. వీటన్నిటి మధ్య ఈ ప్రాజెక్టుకు 2026 ఫిబ్రవరి నెలలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆమోదం తెలిపింది.
ఈ ప్రాజెక్టులో ప్రధానంగా నిర్మించేవి గలాతియా బే ఇంటర్నేషనల్ కంటెయినర్ ట్రాన్స్పోర్ట్ టర్మినల్ (ఐసీటీటీ), విమానాశ్రయం, 450 MVA పవర్ ప్లాంట్, ఒక టౌన్ షిప్ నిర్మాణం చేపట్టనున్నారు. మూడువేల ఎకరాలు భూమి ‘డిఫెన్స్’ కోసం కేటాయించారు. ఇందులో వ్యూహాత్మక సైనిక స్థావరాన్ని భవిష్యత్తు అవసరాల కోసం నిర్మించనున్నారు. ఈ ప్రాంతాన్ని ఏకో టూరిస్ట్ హబ్ గా మార్చే ప్రణాళికా కూడా ఈ ప్రాజెక్టులో భాగం. ఈ నిర్మాణాల కోసం మనుషుల అవసరం చాలా ఉంటుంది. ఇందుకోసం సుమారు మూడున్నర లక్షల మంది బయటి వారు ఇక్కడకు రావాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు చేపడుతున్న ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న స్థానిక జనాభా ఎనిమిదివేలు మాత్రమే. బయటి వాళ్ళు పెద్ద ఎత్తున తరలి రావడం మూలంగా స్థానిక ప్రజల సంస్కృతి దెబ్బ తింటుంది. వారు తమ నేల నుండి, తమ జీవిత విధానం నుండి ‘పరాయికరణ’ చెందుతారు.
ఈ మెగా ప్రాజెక్టు కోసం 160 చదరపు కిలోమీటర్ల ( సుమారు 40,000 ఎకరాలు) భూమి అవసరం. ఇందులో 130 చదరపు కిలోమీటర్ల ప్రాంతం అటవీ భూభాగం (pristine forest). సుమారు 10 లక్షలకు పైగా చెట్లు ఈ ప్రాజెక్టు కోసం నరికివేయాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించింది. అనధికారికంగా దీనికి మూడు రెట్లు కంటే ఎక్కువ చెట్లు నరకాల్సి వస్తుందని అంచనా. తొలగిస్తున్న ఈ వృక్షాలు వేల సంవత్సరాల నాటివి. పురాతనమైన ఈ చెట్లను తొలగిస్తూ అందుకు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం హర్యానాలో ప్రత్యామ్నాయ అటవీ భూమి కేటాయించాము అనడం సముచితం కాదు. భౌగోళికంగా, జీవ వైవిద్య పరంగా అనేక ప్రత్యేకతలు ఉన్న ఈ ప్రాంతం మరొకటి ఎలా ప్రత్యామ్నాయం అవుతుంది అన్నది ఆలోచించాల్సిన విషయం.
అండమాన్ – నికోబార్ దీవులలో పెద్దైన గలాతియా నది బంగాళాఖాతంలో కలిసే చోట ప్రతి ఏటా 500 పైగా తాబేళ్లు ఆస్ట్రేలియా, ఇతర దూర ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తాయి. ఈ ప్రాంతం మన దేశంలో ఉన్న తాబేలు ఆవాసాల్లో ముఖ్యమైన ప్రాంతం. ఈ ప్రాంతపు భౌగోళిక ప్రత్యేకత వల్ల ఇది తాబేళ్లు ఆవాసం ఉండటానికి అనువుగా ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాలుగా తాబేళ్ల రాకపోకలు నడుస్తున్నాయి. సేపియన్ల కాలం నాటి నుండి కూడా ఈ క్రమం నడుస్తుంది. ఈ ప్రాజెక్ట్ లో ప్రధానమైన గలాతియా బే ఇంటర్నేషనల్ కంటెయినర్ ట్రాన్స్పోర్ట్ టర్మినల్ (ఐసీటీటీ) నిర్మాణం. ఈ నిర్మాణం వల్ల ఈ దీవుల సముద్ర తీరంలో తాబేళ్లు రాకపోకలకు వెళ్ళడానికి అననుకూలత ఏర్పడుతుంది. అలాగే ఇరవై వేలకు పైగా ‘పగడపు కాలనీలు’ ప్రభావితం అవుతాయి. ఇవి సముద్రపు జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. జీవజాల పరంగా వైవిధ్యభరితమైన ఈ ప్రాంతాన్ని యునెస్కో సంరక్షిత ప్రాంతంగా ప్రకటించింది. అలాంటి ప్రాంతం తన ఉనికి కోల్పోయే ప్రమాదం ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఏర్పడింది.
ఇంతటి ఆందోళనల మధ్య కూడా ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజెక్టు విషయంలో వెనక్కి వెళ్లలేదు. కానీ మరి ఈ ప్రాజెక్టు చేపట్టిన ప్రాంతం సురక్షితమా అంటే అది లేదు. మన దేశంలో భూకంపాలు అధికంగా సంభవించే ప్రాంతాలలో ఇది ఒకటి. గత పదేళ్ల కాలంలో నాలుగువందల నలభై నాలుగు భూకంపాలు సంభవించాయి. వీటినే ‘హై సెసిమిక్ హాజర్డ్ జోన్స్’ అంటారు. 2004 సునామీ వచ్చిన సమయంలో ఇక్కడ భూమి 15 అడుగులు వరకు శాశ్వతంగా కుంగిపోయింది. అటువంటి ఈ ప్రాంతాలలో నిర్మాణాలు చేప్పటడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు వచ్చే వీలు ఉంది. వీటన్నిటిని పక్కన పెట్టి మన ప్రభుత్వం ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళుతుంది. దేని కోసం ఇదంతా ?
మే 27 న ఢిల్లీలో జరిగిన క్వాడ్ దేశాల(అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా) సమావేశపు ఒప్పందాలను చూస్తే ఈ ప్రాజెక్టు ఎందుకు కీలకంగా తీసుకుందో తెలుసుకోవచ్చు. ఈ ప్రాజెక్టు నిర్మాణం చైనా ప్రాబల్యాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది అని భారత ప్రభుత్వం చెబుతుంది. చైనా చేపట్టిన ‘రోడ్డు ఇనీషియేటివ్’(న్యూ సిల్క్ రోడ్డు), ఇండో- పసిఫిక్ లో చైనా ఆధిక్యతను అడ్డుకోవడం లక్ష్యమని ఈ సదస్సు ప్రకటించింది. ప్రపంచ ఆర్ధిక విపణిలో చైనా ఆధిక్యం తగ్గించడం అనేది అమెరికాకు తక్షణ అవసరంగా ముందుకు వచ్చింది.
ఒకప్పుడు ‘ఏసియా – పసిఫిక్’ గా పిలిచిన ఈ ప్రాంతాన్ని ఇప్పుడు ‘ఇండో – పసిఫిక్’ గా నిర్వచిస్తున్నారు. కారణం దీనికి ఉన్న భౌగోళిక ప్రత్యేకత, మారుతున్న ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ స్వరూపం. ఇండో-పసిఫిక్ అనేది ఈ ప్రాంతంలోని ప్రధాన శక్తులను (ఆసియాన్, ఆస్ట్రేలియా, భారతదేశం, జపాన్, అమెరికా), సమృద్ధిగా సహజ వనరులు కలిగిన ద్వీప దేశాలను, ముఖ్యమైన సముద్ర మార్గాలను, ప్రధాన వాణిజ్య మార్గాలను, మలక్కా జలసంధి, తైవాన్ జలసంధి, హోర్ముజ్ జలసంధి, బాబ్-ఎల్-మండేబ్ జలసంధితో పాటు దక్షిణ మరియు తూర్పు చైనా సముద్రాలను కలుపుతుంది. ఆఫ్రికా తీరాల నుండి అమెరికా తీరాల వరకు విస్తరించి ఉన్న ఇండో-పసిఫిక్ ప్రాంతం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు అవకాశాల వేదికగా ఉంది. రాబోయే కాలంలో దీని మీద ఎవరి ఆధిపత్యం ఉంటుందో వారు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ పై పెత్తనం చేయగలుగుతారు. ఇంతటి కీలక ప్రాంతంలోనే ఈ మెగా ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. ఈ మెగా ప్రాజెక్టు నిర్మాణం అవుతున్న ప్రాంతం మలక్కా జల సంధికి 40 నాటికల్ మైళ్ళ దూరంలోనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా వర్తకం చేయబడే వస్తువులలో సుమారు 30% మరియు ప్రపంచ సముద్ర చమురు వాణిజ్యంలో మూడింట ఒక వంతు వాటా ఈ కారిడార్‌కు ఉంది.
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచ మార్కెట్లు చమురు మీద ప్రధానంగా ఆధారపడుతుండేవి. చమరు నిక్షేపాల మీద ఆధిపత్యం ఉన్న దేశాలు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను ప్రభావితం చేస్తూ వస్తున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక ఆర్ధిక వ్యవస్థకు కొత్త అవసరాలు తీసుకువచ్చింది. వర్తమాన కాలంలో ‘రేర్ ఎర్త్ మినరల్స్’ అవసరం భారీగా పెరిగింది. వాటి నిక్షేపాలు ఉన్న ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకోవడానికి సామ్రాజ్యవాద దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాగే రవాణా మార్గాల మీద ఆధిపత్యం కూడా ఆర్ధిక వ్యవస్థలను నిర్దేశించబోతున్నాయి. ఇండో – పసిఫిక్ రీజియన్ లో పెద్ద ఎత్తున రేర్ ఎర్త్ మినరల్స్ నిక్షేపాలు ఉండటం, ప్రపంచ రవాణాలో అరవై శాతంకు పైగా వాటా కలిగి ఉండటం వల్ల ఈ ప్రాంతానికి ప్రాముఖ్యత ఏర్పడింది. వీటిని చేజిక్కించుకోవడం అనేది పెద్ద దేశాల ముందు ఉన్న లక్ష్యం.
మార్కెట్ల పునర్విభజన కోసం, ఆధీనంలో ఉన్న ప్రాంతాలను కోల్పోకుండా ఉండటం కోసం పెద్ద దేశాలు పోటీపడుతున్నాయి. అందుకు అనుగుణంగా పెద్ద ఎత్తున సైనిక సామర్ధ్యాలను, ఆయుధ సామగ్రిని సమకూర్చుకుంటున్నాయి. తమ అధీనంలో ఉన్న చిన్న దేశాలను ఇందులోకి లాగుతున్నాయి. ఇరాన్ మీద అమెరికా చేస్తున్న దురాక్రమణ ఇందుకు మంచి ఉదాహరణ. మధ్య ప్రాచ్యంలో సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని దెబ్బతీస్తూ తన అధిపత్యాన్ని కాపాడుకుంటూ వస్తుంది. ప్రస్తుతం నికోబార్ దీవులలో చేపట్టిన ఈ మెగా ప్రాజెక్టు కూడా ఇలాంటిదే. అమెరికా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం అనేక వ్యూహాత్మక కూటములను ఏర్పాటు చేస్తుంది. వీటిలో సైనిక స్థావరాలు ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు కూడా నికోబార్ దీవులలో ఏర్పాటు అవుతున్న సైనిక స్థావరంలో అమెరికా తన బలగాలను ఉంచిన/ నేరుగా సైనిక బేస్ లు ఏర్పాటు చేసిన కూడా ఆశ్చర్యం లేదు.
ఫైనాన్స్ కాపిటల్ రాజకీయ, ఆర్ధిక దురాక్రమణకు అనుగుణంగా మానవ ఆలోచనలను మార్చివేసింది. రాజకీయ భావజాల రంగాలలో అందుకు అవసరమయిన మార్పులను తీసుకువచ్చింది. ఆధిపత్యం, ఆక్రమణ అనేవి నేడు మామూలు విషయాలుగా మారిపోయాయి. స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో మార్కెట్ల, ఆర్ధిక సరళీకరణలను తీసుకువచ్చింది. సరళీకరణలు అభివృద్దిలో భాగం అని అంగీకరించడం ‘నాగరిక’ లక్షణాలుగా ఉనికిలోకి తీసుకువచ్చింది. మన దేశంలో అభివృద్ది, దేశభక్తి కలగలసిపోయాయి. ఈ రెంటి కలయిక రాజకీయ, భావజాల రంగాలలో దాడి చేస్తుంది. పర్యావరణం పెట్టుబడి దృష్టిలో సంపదే. తన మార్కెట్ల విస్తరణ కోసం, లాభాల కోసం దేనినైనా అమ్మగల, కొనగల స్వభావం పెట్టుబడికి ఉంది. అభివృద్ధికి లాభాలే కొలమానం. అందుకే అన్నిటికి లెక్కకట్టి వినియోగిస్తుంది. ప్రతిదీ దాని దృష్టిలో సరుకే. బైలాడిల్లా, తిజీమాలి, నికోబార్ దీవులలో చూస్తుంది అదే. నష్టపరిహారం ఇస్తున్నాం, మరొక చోట పునరావాసం కల్పిస్తున్నాం అని దానికి ఒక చట్టబద్ద ఆమోదం తీసుకువచ్చింది. అంతరించిపోతున్న ఆదివాసి సమూహాలు, పర్యరణ సంక్షోభం, భవిష్యత్తు తరాల ఇబ్బందులు దానికి పట్టవు. వీటిని అర్ధం చేయించి భావజాల, రాజకీయ రంగంలో పోరాటాలు చేపట్టాల్సిన అవసరం మన ముందు ఉంది. లేకపోతే ఒకనాటి రెడ్ ఇండియన్లు, ఆస్ట్రేలియా ఆదివాసుల లాగా మన దేశంలో కూడా ఆదివాసి సమూహాలు అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఆదివాసి సమూహాలు అంతరించడం మాత్రమే కాదు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వల్ల వాతావరణంలో పెను మార్పులు సంభవించి అతివృష్టి, అనావృష్టి పెరిగిపోతుంది. ఇది అన్నిటికన్నా పెద్ద సంక్షోభానికి దారితీస్తుంది. దీనిని నివారించడం అనేది మన ముందు ఉన్న బాధ్యత.




