భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తున్నామని పదేపదే ప్రగల్భాలకు పోతున్న మోడీ సర్కార్‌… దీనికి భిన్నంగా దేశంలో భారీగా నిరుద్యోగం పెరుగుతోంది. ద్రవ్యోల్బణం అదుపు తప్పింది. పిల్లలకు పోషకాహారం దొరకడం లేదు. ఫారెక్స్‌ నిల్వలు హరించుకుపోతున్నాయి. వాణిజ్య లోటు పెరిగిపోయింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి) ఐదు మాసాల కనిష్టానికి పడిపోయింది. 2015-2023 మధ్యకాలంలో 18 లక్షల సూక్ష్మ చిన్న మధ్యతరహ పరిశ్రమలు (యంఎస్‌యంఇ) మూతపడి 54 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. శ్రామిక శక్తి గణనీయంగా   తగ్గింది. రుణభారం పెరిగిపోతుంది. విదేశీ నిధులు రావడం లేదు. రూపాయి మారక విలువ పడిపోయింది. ప్రజల ఆదాయాలు తగ్గడంతో ప్రజల కొనుగోలు శక్తి క్షీణించింది. పర్యవసానంగా పేదల సంఖ్య పెరిగిపోతుంది. 2023-24లో వృద్ధిరేట్‌ 8.2 శాతం ఉండగా ఆర్థిక సర్వే 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక వృద్ధిరేట్‌ను 6.5 నుంచి 7  శాతానికి పరిమితం చేసింది.

భారత ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా పురోగమిస్తోందని, వినియోగదారులు, ఉత్పత్తిదారులు భవిష్యత్తు పట్ల ఆశాజనకంగానూ, విశ్వాసంగాను ఉన్నారని ఆర్‌ఎస్‌ఎస్‌, గోడీ మీడియా విస్తృతంగా ప్రచారం సాగిస్తోన్నారు. ఇందుకు భిన్నంగా వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ భిన్నమైన కథనాన్ని రాసింది. భారత ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గిందని దీని ప్రభావం మార్కెట్‌పైన, ఉత్పత్తిపైన పడుతుందని పేర్కొంది. 2024-25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో జిడిపి వృద్ధి 6.5 శాతానికి పడిపోయిందని పేర్కొంది. మార్కెట్‌లో కొనుగోళ్లు తగ్గడం వల్ల ఉత్పత్తి కార్యక్రమాలపై ప్రభావం చూపుతోందని, నిరుద్యోగానికి ఉపాధి రహిత స్థితికి కారణమవుతోందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ విశ్లేషించింది.

పేదరికం, రుణభారం అధిగమించకుండా ఆర్థికాభివృద్ధి అసాధ్యమని ప్రపంచ బ్యాంక్‌ అభివృద్ధి నివేదిక-2024 పేర్కొంది. కాలం చెల్లిపోయిన విధానాలపై ఆధారపడడం అభివృద్ధికి ఆటంకంగా ఉందని ప్రపంచ బ్యాంక్‌ పేర్కొంది. అమెరికా తలసరి ఆదాయంలో కేవలం మూడోవంతు చేరుకోవాలన్నా  భారత్‌కు సుమారు 75 సంవత్సరాలు పడుతుందని బ్యాంక్‌ తెలిపింది. బ్రిటిష్‌ వలసవాదుల నుండి అధికార బదిలీ జరిగి 77 సంవత్సరాలు గడిచినా నిరుద్యోగం, పేదరికం, అసమానతలు, విద్యా, వైద్యం, జీవన భద్రత వంటి సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఎన్ని సూచనలు చేసినా పాలకులు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా బిజెపి ప్రభుత్వం సమస్యల తీవ్రతను పెంచుతుంది. సామాజిక అసంతృప్తి పెరుగుతోంది.

మోడీ ప్రభుత్వం మూడోసారి కూడా అధికారంలోకి వచ్చింది. స్వంత బలం లేకున్నా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ దేశ ఆర్థికవ్యవస్థ మాత్రం గాడిలో పడటం లేదు. ప్రజలు పీకల్లోతు అప్పుల్లో, కష్టాల్లో కూరుకుపోతున్నా… సర్కారు కార్పొరేట్లకే జై కొడుతోంది. ఆర్థిక వృద్ధి అంటే సెన్సెక్స్‌ పరుగులు పెట్టడం కాదన్న విషయాన్ని ప్రభుత్వతం అర్థం చేసుకోలేకపోతోంది. ఫలితంగా దేశ ఆర్థికవ్యవస్థ రోజురోజుకూ దిగజారుతూనే ఉంది. ప్రజల వినియోగ వ్యయం గణనీయంగా పడిపోతోంది. దూరపు కొండలు ఎప్పుడూ నునుపే. దూరం నుండి చూస్తే అంతా అందంగా, అత్యద్భుతంగా ఉన్నట్లు కన్పిస్తుంది. ‘మేడి పండు చూడ మేలిమై ఉండును… పొట్ట విప్పి చూడు పురుగులుండు’ అన్న చందంగా మన ఆర్థిక వ్యవస్థ ఉంది.

భారత ఆర్థిక వ్యవస్థ మందగించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) ఏప్రిల్‌ నుంచి జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) వృద్ధి 6.7 శాతానికి పడిపోయింది.15 నెలల కనిష్టానికి క్షీణించిందని శుక్రవారం స్వయంగా కేంద్ర ప్రభుత్వ గణాంకాల మంత్రిత్వ శాఖనే వెల్లడించింది.  ఆర్‌బిఐ అంచనాలు మించి జిడిపి పతనం కావడం ఆర్థిక వ్యవస్థ పట్ల ఆందోళన కలిగిస్తోంది. జూన్‌ త్రైమాసికంలో భారత జిడిపి 7.1 శాతం పెరగొచ్చని ఇటీవలే ఆర్‌బిఐ అంచనా వేసింది. 2024-25లో స్థూలంగా 7.2 శాతంగా ఉండొచ్చని తెలిపింది. దీనికి భిన్నంగా కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసు (ఎన్‌ఎస్‌ఒ) ఫలితాలను వెల్లడిరచడం విశేషం. జిడిపి పడిపోతుందంటే దేశంలో ఆర్థిక కార్యకలాపాలు సన్నగిల్లుతున్నాయని అర్థం. ఎన్‌ఎస్‌ఒ గణాంకాల ప్రకారం… గడిచిన క్యూ1లో వ్యవసాయ రంగం వృద్ధి ఏకంగా 2 శాతానికి పడిపోవడం ఆందోళకర అంశం. ఈ రంగం 2023-24 ఇదే త్రైమాసికంలో 3.7 శాతం వృద్ధిని కనబర్చింది. ఇదే సమయంలో ఆర్థిక సేవలు, రియల్‌ ఎస్టేట్‌, ప్రొఫెషనరల్‌ సర్వీసెస్‌ రంగాలు 12.6 శాతం వృద్ధిని కనబర్చగా… గడిచిన క్యూ1లో 7.1 శాతానికి మందగించాయి.

విద్యుత్‌, గ్యాస్‌, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సర్వీసెస్‌ రంగాలు 10.4 శాతం పెరిగాయి. ఈ రంగాలు గతేడాది ఇదే జూన్‌ త్రైమాసికంలో 3.2 శాతం మాత్రమే వృద్ధిని కలిగి ఉన్నాయి. వాణిజ్యం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్స్‌ అండ్‌ సర్వీసెస్‌ విభాగాల వృద్ధి ఏకంగా 5.7 శాతానికి మందగించింది. ఈ రంగం గతేడాది ఏకంగా 9.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత ముఖమైన ఎనిమిది కీలక రంగాలు డిమాండ్‌ లేకపోవడంతో పడకేశాయి. ప్రస్తుత ఏడాది జూలైలో కీలక రంగాల వృద్ధి 6.1 శాతానికి పరిమితమయ్యింది. 2023 ఇదే మాసంలో బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, స్టీల్‌, సిమెంట్‌, విద్యుత్‌ లాంటి ఎనిమిది కీలక రంగాలు 8.5 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి జూలై కాలంలో ఈ రంగాలు 6.1 శాతం మాత్రమే పెరిగాయి. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో ఈ రంగాలు ఏకంగా 40.27 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇంతటి ప్రాధాన్యత గల రంగాల వృద్ధి పడిపోవడం ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపనుంది.

ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పన, పరిశ్రమలలో ప్రభుత్వ వ్యయం, యువతలో నైపుణ్యాభివృద్ధి, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం వంటి సకారాత్మక చర్యలు చేపడితేనే, ప్రపంచ పారిశ్రామిక ఉత్పాదక శక్తిగా దేశాన్ని కీలకస్థానంలో నిలపడంతో ప్రధాన పాత్ర పోషిస్తాయి. మోడీ 10 సంవత్సరాల పాలనలో దేశం పారిశ్రామిక, ఉత్పాదకతకు దారితీయలేదు సరికదా, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం, పెట్టుబడులను ఆకర్షించడం – మేక్‌ ఇన్‌ ఇండియా ప్రచారం వంటి పథకాలు ప్రారంభానికి కూడా నోచుకోలేదు.  దేశంలో నెలకొన్న పేదరికాన్ని తగ్గించే విషయంలో కేవలం ఉత్పాదకత ఒక్కటే సరిపోదు. వివిధ రంగాలను వివిధ ప్రాంతాలలో అభివృద్ధి చేయవలసి ఉంది. ముఖ్యంగా అభివృద్ధి అత్యధికంగా పట్టణ ప్రాంతాలలో కేంద్రీకతృతమై ఉండకూడదు. ఆర్థిక అభివృద్ధి దీర్ఘకాలిక ప్రక్రియ వృద్ధిగా మాత్రమే కాకుండా, నిర్మాణాత్మకతో కూడినదై ఉండాలి.

నరేంద్ర మోడీ ప్రభుత్వం సామాన్యులనే కాదు…. నిరుద్యోగ యువతనూ నిలువునా ముంచేసింది. వారి ఆశలపై నీళ్లు చల్లింది. 2014లో సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తామంటూ తీయని కబుర్లు చెప్పి చివరికి మొండిచేయి చూపింది. మోడీ పాలనలో ఉద్యోగాలు వస్తాయని, తమ జీవితాలు బాగుపడతాయని, కుటుంబాలు చల్లగా ఉంటాయని ఎన్నో కలలు కన్న యువతను తీవ్రంగా నిరాశ పరిచింది. దేశంలోని నిరుద్యోగ యువతలో మూడిరట రెండు వంతుల మంది విద్యావంతులే. అయినప్పటికీ వారి అర్హతలకు తగిన ఉద్యోగాలు లభించడం లేదు. చదివిన చదువులకు, చేస్తున్న ఉద్యోగానికి సంబంధమే లేకుండా పోతోంది. జీవనోపాధి కోసం ఏదో ఒక ఉద్యోగం సంపాదించినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటోంది. బతుకు  బండి లాగడమే దుర్భరంగా మారింది. పొరుగు దేశాలతో పోలిస్తే గత సంవత్సరంలో మన దేశంలోనే నిరుద్యోగ రేటు అధికంగా ఉన్నదని ప్రపంచ బ్యాంక్‌ తెలిపింది. నిరుద్యోగ రేటు మన పొరుగున ఉన్న పాకిస్తాన్‌లో 11.3 శాతం, బంగ్లాదేశ్‌లో 12.9 శాతం, భూటాన్‌లో 14.4 శాతం ఉండగా మనదేశంలో 23.22 శాతంగా ఉంది. దేశంలో నిరుద్యోగమే అతి పెద్ద సమస్య.

ఆరోగ్యవంతులు కలిగిన దేశంలో అభివృద్ధి వేగంగా జరుగుతుంది. ఆరోగ్యతంలో పోషకాహారం కీలకపాత్ర వహిస్తుంది. పౌష్టికాహార లోపం భారంతో మనదేశం గణనీయమైన సవాలును ఎదుర్కొంటోంది. ఈ సమస్య దేశంలోని సామాజిక, ఆర్థిక సాంస్కృతిక వ్యత్యాసాల సంక్లిష్ట మిశ్రమంతో ముడిపడి ఉంది. పోషకాహార లోపం అనేది ఐదేళ్ల కంటే తక్కువైన పిల్లల్లోను, గర్భిణీ స్త్రీలలోనూ, యుక్త వయస్సు వారిలో ఎక్కువగా ఉంటుంది. ఒక వ్యక్తి ఒక సంవత్సరం వ్యవధిలో రోజువారీ కనీస ఆహార శక్తి అవసరాలను తీర్చడానికి తగినంత ఆహారాన్ని పొందలేకపోవడాన్ని పౌష్టికాహార లోపం అని అంతర్జాతీయ సంస్థలు నిర్వచించాయి. పోషకాహాల లోపాన్ని వేస్టింగ్‌ (ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం), స్టంటింగ్‌ (వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం), తక్కువ బరువు కలిగి ఉండడం, విటమిన్లు మినరల్స్‌ లోపాలు అనే నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు.

ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహర భద్రత పోషకాహార స్థితి తాజా నివేదిక 2024 ప్రకారం దేశజనాభాలో 55.6 శాతం ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో లేదు. ఐదేళ్ల వయస్సు కంటే తక్కువ ఉన్న పిల్లల్లో వేస్టింగ్‌ 18.7 శాతం, స్టంటింగ్‌ 31.7 శాతం. తక్కువ బరువు 27.4 శాతం పిల్లలు ఉన్నారని తెలిపింది. 15 నుండి 49 మధ్య వయస్సు మహిళలో పోషకాహారలోపం 18.7 శాతం ఉంది. దేశ జనాభాలో సరైన ఆహరం లభ్యంకాక 16.6 శాతం పోషకాహార లోపంతో ఉన్నారని, కనీసం 38 శాతం అనారోగ్యకరమైన ఆహారాన్ని తింటున్నారని ఈ యేడాది మే 29న విడుదల చేసిన గ్లోబల్‌ ఫుడ్‌ పాలసీ రిపోర్టు 2024 తెలిపింది. అనాథ పిల్లలు, వృద్ధులు ఎక్కువ శాతంలో పోషకాహార లోపానికి గురవుతారు. గిరిజనులు, సామాజికంగా వెనుకబడినవారు. మురికివాడ నివాసితులు, సంచార జాతులు తదితర వారికి తగినంత ఆర్థిక పరిపుష్టి లేక సమతుల్య ఆహారాన్ని పొందలేకపోతున్నారు.

పేలవమైన పారిశుద్ధ్యం, పరిశుభ్రత పద్ధతులు వ్యాధులకు కారణమయ్యే పరాన్న జీవులకు గురికావడాన్ని పెంచుతుంది. ఇవి శరీరంలోని పోషకాల శోషణ వినియోగాన్ని ప్రభావితంచేసి పోషాకాహార లోపాన్ని పెంచుతున్నాయి. జాతీయ ఆరోగ్య విధానం 2025 నాటికి ప్రభుత్వ ఆరోగ్య వ్యయాన్ని జిడిపిలో ప్రస్తుతమున్న 1.2 శాతం నుండి 2.5 శాతానికి పెంచాలన్న సిఫార్సును అమలుచేయాలి. పోషకాహారం, ఆహారభద్రత, పేదరికం ఒకదానితో మరొకటి విడదీయరాన్ని సంబంధం కలిగి ఉంటాయి. ముఖ్యంగా పిల్లల్లో శారీరక, మానసిక అభివృద్ధి జరగక అభ్యాస సామర్థ్యాలు, విద్యాపనితీరు సరిగా జరగదు. యుక్త వయస్సులో పోషకాహార లోపం వల్ల ఉత్పాదకత తగ్గి దేశ జిడిపి తగ్గుతుంది. రక్తహీనత తల్లులు అనారోగ్య శిశువులకు జన్మనిచ్చి పోషకాహార లోపం తరచుగా ఆర్థికంగా అట్టడుగు, వెనుకబడిన వర్గాలను ప్రభావితం చేస్తుంది. ఇది సామాజిక అసమానతలను పెంచుతుంది.

సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక పరమైన అంశాల ఉమ్మడి ఫలితమే ఆర్థికాభివృద్ధి. ఆర్థిక కారకాలు, సంస్థలు, వ్యవస్థలు ఉమ్మడి ప్రగతి వ్యూహంతో ముందుకు సాగితేనే ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. ఆర్థికవృద్ధి అనేది పరిణామాత్మక మార్పులను సూచిస్తే, ఆర్థికాభివృద్ధి అనేది గుణాత్మక మార్పులనూ సూచిస్తుంది. అయితే, ఒక దేశంలో అభివృద్ధి ఏ మేరకు జరిగిందో తెలుసుకోవడానికి ఉపయోగించే వాటిని అభివృద్ధి సూచికలు అంటారు. సమగ్ర అభివృద్ధి సూచీని ఆర్థికవేత్తలు 11 కొలమానాల ఆధారంగా రూపొందించారు. అవి… ఆరోగ్యం, పౌష్టికాహారం, విద్య, ఉద్యోగిత, కమ్యూనికేషన్స్‌, మౌలిక పారిశ్రామిక వస్తువుల వినియోగం, మన్నిక గల వస్తువుల వినియోగం, పట్టణీకరణ, తలసరి ఆదాయం, సామాజిక వ్యక్తిగత సంక్షేమం, ఇతర సేవలు. జాతీయ ఆదాయం పెరుగుదల ఆర్థికాభివృద్ధి సూచి కాదు.

భారత జాతీయ ఆదాయంలో ఎక్కువ భాగం కేవలం 1 శాతం సంపన్నుల చేతిలోనే ఉండిపోతోంది. అత్యంత సంపన్నులైన 1 శాతం జనాభా ఆదాయం, సంపద వాటాలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. 2022-23లో దేశ ఆదాయంలో 22.6 శాతం, సంపదలో 40.1 శాతం వీరి వద్దే ఉంది. వీరి సంపద వాటా 1961 తర్వాత ఈ స్థాయిలో ఉండడం ఇదే మొదటిసారి. ఆదాయాలు, సంపదలు కొద్దిమంది వద్దే పోగుబడి ఉండడం సమాజం, ప్రభుత్వంపై ప్రభావం చూపుతోంది. 100 కోట్ల డాలర్ల (8,400 కోట్లు) కంటే నికర సంపద ఎక్కువగా ఉన్న భారతీయులు 1991లో ఒక్కరు మాత్రమే ఉండగా 2022 నాటికి వారి సంఖ్య 162కు పెరిగింది. 2024 నాటికి వారి సంఖ్య 200కి చేరింది. వారి నికర సంపద దేశ నికర జాతీయాదాయంలో 1 శాతం నుండి 25 శాతంకి పెరిగింది.

ప్రపంచ అసమానతల ల్యాబ్‌, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి సంస్థ సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలోని అంశాలు రాజ్యాంగ లక్ష్యాలకు వ్యతిరేక దిశలో దేశం ఎంతవేగంగా పయనిస్తుందో తెలియజేస్తోంది. దిగువ 50 శాతం మంది తలసరి ఆదాయం మొదటి పది శాతం మంది తలసరి ఆదాయం కన్నా 20రెట్లు తక్కువగా ఉంది. మొత్తం జాతీయాదాయంలో మొదటి 10శాతం దగ్గర 57 శాతం, మొదటి ఒక శాతం మంది దగ్గర 22 శాతం సంపద పోగుబడిరదని నివేదిక పేర్కొంది.  ప్రపంచంలోనే అత్యంత అసమానతల దేశంగా పేదలు (22.89 కోట్లు) ఎక్కువగా ఉన్న దేశంగా భారతదేశం మారిపోయింది. గత పదేళ్లలో పెరిగినంతగా ఆర్థిక అసమానతలు బ్రిటీష్‌ పాలనలో కూడా పెరగలేదని ప్రపంచ అసమానతల ల్యాబ్‌-2024 ప్రకటించింది. సామాజిక, ఆర్థిక, న్యాయ, విద్య, వైద్య రంగాల్లో ఉన్న తీవ్ర అసమానతలను పాలకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా మన సంస్కృతి, విలువలు పూర్తిగా పతనమై పోతోన్నాయి.  నేటి ప్రభుత్వాలు రాజ్యాంగ లక్ష్యమైన ప్రజా సంక్షేమ బాధ్యత నుంచి పూర్తిగా వైదొలిగి పోయాయి.

సంక్షేమం ఆర్థిక శాస్త్రం (వెల్ఫేర్‌ ఎకనామిక్స్‌) మొత్తం సమాజ శ్రేయస్సును సూక్ష్మ ఆర్థిక పద్ధతుల ద్వారా అంచనా వేస్తుంది. సమాజ సంక్షేమం, ప్రజల శ్రేయస్సును కొలువడానికి ఉపయోగపడుతుంది. ఆర్థికాభివృద్ధి అనేది ఒక దేశం సామర్థ్యాలను అంచనా వేయడానికి, అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించడం కోసం కార్యచరణను రూపొందించడానికి, తద్వారా సమాజ శ్రేయస్సును మెరుగుపరచడానికి దోహదపడుతుంది. ఈ మూల్యాంకనం సాధారణంగా ఆర్థికవ్యాప్త స్థాయిలో జరుగుతుంది. సమాజంలోని సభ్యుల మధ్య వనరులు, పంపిణీని అంచనా వేయడానికి ప్రయత్నిస్తుంది. ఆర్థికాభివృద్ధిని కొలిచేటప్పుడు పలు కారకాలను పరిగణలోకి తీసుకుంటారు. అవి: 1. వాస్తవ తలసరి ఆదాయం పెరుగుదల 2. జీవన నాణ్యత 3. మానవాభివృద్ధి సూచిక 4. లింగ సమానత 5. పేదరిక సూచిక 6. నిజమైన జిడిపి. ఈ ఆర్థిక సంక్షేమ కొలమానం (ఎంఈడబ్య్లూ) సూచీని విలయం నర్ధవస్‌, జేబ్స్‌ టోబిన్‌ అనే ఆర్థికవేత్తలు రూపొందించారు.

సమాజం అభివృద్ధి చెందడం అంటే ఆర్థిక వృద్ధి కాదు, మానవాభివృద్ధి జరుగాలి. ఆధునిక కాలంలో ఆర్థికాభివృద్ధికి మేలైన సూచికగా మానవ అభివృద్ధి సూచిక (హెచ్‌డిఐ)ని భావిస్తున్నారు. 1991లో పాకిస్తాన్‌కు చెందిన ఆర్థికవేత్త మహబూబ్‌ ఉల్‌ హక్‌ (అబుల్‌ హక్‌) హెడ్‌డిఐని రూపొందించారు. ఈ సూచికను రూపొందించడంలో అబుల్‌ హక్‌కు ఆర్థికవేత్త అమర్త్యసేన్‌ సహాయం చేశారు.1990 నుంచి ఇప్పటివరకు ప్రతి సంవత్సరం మానవాభివృద్ధి నివేదికలో భాగంగా యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రొగ్రామ్‌ (యుఎన్‌డిపి) వారు  హెడిఐని తయారుచేసి ప్రకటిస్తున్నారు. అముల్‌ హక్‌ రూపొందించిన హెడీఐని యూఎన్‌డిపి వారికి అనుగుణంగా మారుస్తూ ఆర్థికవేత్త పాల్‌ స్ట్రీటన్‌ అభివృద్ధి చేశారు. హెచ్‌డిఐ సూచీ విలువను లెక్కించడానికి మూడు అంశాలను ఆధారంగా తీసుకుంటారు. అవి.. 1. ఆరోగ్యం 2. విజ్ఞానం/విద్యాస్థాయి 3. జీవన ప్రమాణాలు. మానవాభివృద్ధి సూచికలో భారత్‌ 2024 సంవత్సరంలో 193  దేశాలలో 134వ స్థానంలో ఉంది.

మల్టీడైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌(ఎంపిఇ) అనేది బహుళ విధానం ద్వారా పేదరికాన్ని కొలిచే మరొక పద్ధతి. దీన్ని 2010లో ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యుఎన్‌డిపి) ఆక్స్‌ఫర్డ్‌ పావర్టీ, హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ ఇనిషియేటివ్‌ (ఒపిహెచ్‌ఐ) ద్వారా మల్టీడైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌ ప్రారంభించబడిరది. విద్య, ఆరోగ్యం, జీవన ప్రమాణాలు వంటి రంగాలలో పేదలు ఎదుర్కొంటున్న బహుళ నష్టాలను ఇది ప్రతిబింబిస్తుంది. ఈ పద్ధతి బహు మితీయమైనది అనే ఆలోచనపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచ బహుమితీయ పేదరిక సూచిక 109 దేశాలను పరిగణలోకి తీసుకుంటుంది. దీన్ని సంకలనం చేయడానికి మూడు కోణాలు 1. విద్య 2.ఆరోగ్యం 3.జీవన ప్రమాణం అలాగే పది సూచీలు కవర్‌ చేస్తుంది. 1.పోషకాహారం 2.శిశుమరణాలు 3.పాఠశాల విద్య 4.తాగునీరు 5.విద్యుత్తు 6.గృహ నిర్మాణం 7.ఆస్తులు 8.మరుగుదొడ్డి 9.పాఠశాల హాజరు 10.వంట ఇంధనం సర్వేలో పరిగణలోకి తీసుకుంటుంది.  మల్టీడైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌ అనేది పేదరికం బహుముఖ కోణాన్ని పరిమాణాత్మకంగా ఆవిష్కరించే ఒక సర్వే. ఎంపిఐ సర్వే ప్రకారం 2022లో భారత్‌లో 23 కోట్ల మంది పేదలు ఉన్నారు. 107 దేశాల్లో మనదేశం 63వ స్థానంలో ఉంది.

మోడీ ప్రభుత్వం చెబుతున్నట్లు ప్రపంచంలో అత్యధిక జిడిపి (స్థూల జాతీయ ఉత్పత్తి) గల దేశాల్లో మనం 5వ స్థానంలో ఉన్నమాట నిజమే. మనదేశం త్వరలోనే జపాన్‌, జర్మనీని అధిగమించి మూడవ స్థానానికి చేరుకుంటామనేది అంకెల్లో నిజం కావచ్చును. జపాన్‌, జర్మనీ జనాభా రీత్యా, వైశాల్యం రీత్యా చాలా చిన్న దేశాలు. వాటి జిడిపిని అధిగమించడం గొప్ప ఘనకార్యం మాత్రం కాదు. మొదటి స్థానంలో ఉన్న అమెరికా జిడిపి 29000 బిలియన్‌ డాలర్లు, తలసరి ఆదాయం 85 వేల డాలర్లు, రెండవ స్థానంలో ఉన్న చైనా జిడిపి 18000 బిలియన్‌ డాలర్లు, తలసరి ఆదాయం 13000 డాలర్లు, ప్రస్తుత భారత్‌ జిడిపి 3,942 బిలియన్‌ డాలర్లు, తలసరి ఆదాయం 2730 డాలర్లు. మూడో స్థానంలోకి వచ్చినా జిడిపిలో, తలసరి ఆదాయంతో ఎంతో దిగువలోనే ఉంటాం. యూఎన్‌డిపి ప్రపంచ మానవాభివృద్ధి సూచీలో మనం 134వ స్థానంలో, ఆకలి సూచీలో 111 స్థానంలో ఉన్నాం. మోడీ ప్రభుత్వమే దేశంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్‌ పంపిణీ చేస్తున్నది. నిరుద్యోగం మునుపెన్నడూ లేని స్థాయికి చేరుకుంది. గత 10 సంవత్సరాలుగా మోడీ దేశ ప్రజల్ని ‘‘సబ్‌ కా సాథ్‌ సబ్‌ కా వికాస్‌’’ నినాదంతో మురిపించారు. ‘‘సబ్‌ కా వికాస్‌’’లో రైతులు, యువత, పేదలు మాత్రం లేరు. కార్పొరేట్లు, బిలియనీర్లు ఇబ్బడి ముబ్బడిగా వికసించారు. కేవలం 169 మంది బిలియనీర్ల దగ్గర 78 లక్షల కోట్ల సంపద పోగుపడింది .  10 శాతం కుబేరుల దగ్గర 78 శాతం దేశ సంపద గుట్టపడిరది. మొత్తం మీద మోడీ పాలన కార్పొరేట్ల చేత కార్పొరేట్ల కోసం సాగుతున్న పాలన అయింది.

ప్రజల ఆదాయాలు తగ్గడం, ధరలు పెరుగుతుండడం, నిరుద్యోగం పెరుగుతుతండడం, పోషకాహార లోపం తయారీ రంగ వృద్ధిలో క్షీణత… ఇవన్నీ కలిసి ఒకవైపు ఉధృతమవుతున్న ఆర్థిక దుస్థితిని ప్రతిబింబిస్తున్నాయి. మరోవైపు మనుగడ కోసం ప్రజలు పడుతున్న దుస్థితిని తెలియచేస్తోంది. ఆశ్రితుల ఆస్తుల వృద్ధికి ఆశ్రయం కల్పించం ఆపి, దానికి బదులుగా ప్రభుత్వ వనరులను ప్రజా పెట్టుబడులకు ఉపయోగించి, ఎంతగానో అవసరమైన మౌలిక వసతులను నిర్మించాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఉద్యోగాలు కల్పించబడతాయి. ఆర్థిక వ్యవస్థలో దేశీయ డిమాండ్‌ పెరుగుతుంది. అయితే, దేశ జాతీయ ఆస్తులను దోపిడీ చేయడం ద్వారా తమ లాభాలను గరిష్టంగా పెంచుకునేందుకు విదేశీ, దేశీయ పెట్టుబడులకు మోడీ ప్రభుత్వం విధేయత కనబరుస్తున్నందున, ఈ సంక్షోభం మరింత అధ్వాన్నంగా మారనుంది. భారతదేశ సంపదను ఆర్థిక వ్యవస్థ వృద్ధిని, ప్రజల సంక్షేమానికి పెట్టుబడిగా పెట్టేలా చూసేందుకుకు గాను ప్రభుత్వ అధికార పగ్గాలు బిజెపి చేతుల్లో ఉండకుండా చూడడం ఎంతో ముఖ్యం.

Leave a Reply