ఆధిపత్య సామాజిక వ్యవస్థల్లో (ప్రపంచంలో ఇతర దేశాలతో పోల్చినప్పుడు మన దేశంలో కులం మౌలికంగా వర్గంతో పాటు ఒక ఆధిపత్య నిర్మాణం) సుదూర గత చరిత్రలోకి వెళ్లకుండా చూసినప్పుడు యూరోపియన్లు ఆక్రమించుకున్నప్పటి నుండి అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆసియా ఖండాల్లో ఆదివాసులు తెగలుగా, జాతులుగా ప్రాణం విలువతో కాకుండా పెట్టుబడిదారీ ప్రమాణాల్లో వనరుతో తూకం వేయబడుతున్నారు. ఇతర ఇంధనాలతో పాటు, ఒక దశలో అన్నిటికన్నా మార్కెట్లో రెండవ ప్రపంచ యుద్ధ కాలం నుంచి ప్రాబల్యంలోకి వచ్చిన చమురు అనే వనరు దృష్ట్యా ఇస్లాం మతావలంబకులైన జాతులు అధికంగా ఉన్న దేశాలు (పాలస్తీనా, ఇరాన్‌, ఇరాక్‌, ఈజిప్టు, సిరియా, జోర్డాన్‌ల నుంచి ఆఫ్ఘనిస్తాన్‌ల దాకా) లోని ప్రజల ప్రాణాల విలువ నేల మీద పడగానే ఆవిరైపోయే ఏ చమురు విశేషానికి పోల్చలేనంత చవక.

మామూలుగా ప్రాణాలను మార్కెట్‌ ప్రమాణాలతో వెలకట్టకూడదు. విలువ అనేది సాంస్కృతిక, నైతిక విలువగా కాకుండా, అన్నిటికన్నా మించి మానవీయ విలువగా కాకుండా, మార్కెట్‌ విలువతో పోల్చడం సామ్రాజ్యవాద పెట్టుబడి మన భావజాలంలోకి తెచ్చింది. భారతదేశంలోని వర్ణ వ్యవస్థలో అస్పృశ్యత, నిచ్చెన మెట్ల వ్యవస్థ అసలు ఒక విలువనే ఆమోదించలేదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యేతరులకూ అదే చట్రం. పాలకవర్గాలు, అంటే ఆధిపత్య వర్గాలు ఆచరణలో రాజ్యాంగానికిస్తున్న నిర్వచనం లేదా వ్యాఖ్యానించి ఆచరిస్తున్న తీరు జనవరి 1న మంగ్లీ అనే పసిపాప హత్య మొదలు నిన్నటి నారాయణపూర్‌ ఎన్‌కౌంటర్‌ దాకా నిత్య ఎన్‌కౌంటర్‌ హత్యల్లో ఆదివాసీ ప్రాణాలకిస్తున్న అమానవీయ విలువలో చూడవచ్చు. అట్లే 2023 అక్టోబర్‌ 7 నుంచి సరిగ్గా గత ఎనిమిది నెలలుగా అమెరికా, ప్రేరేపిత ఇజ్రాయిల్‌ దాడుల్లో చూడవచ్చు.

8 జూన్‌ శనివారం రోజు ఇజ్రాయిల్‌ సైన్యం ముసైరల్‌ శరణార్థుల శిబిరం (సెంట్రల్‌ గాజా) పై చేసిన బాంబు దాడిలో 274 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఎందుకింత పెద్ద దాడి అంటే ఆ శిబిరాన్ని కవరుగా చేసుకొని హమాస్‌ అక్టోబర్‌ 7న తొలి బందీలుగా పట్టుకున్న నలుగురు ఇజ్రాయిలీల కోసం దీనికి ఒక్క అమానవీయ విలువే కాదు, సాంస్కృతిక కోణం ఉంటుంది. ఆ నలుగురికి పేర్లు ఉంటాయి. 1. నోవా ఆర్గమని, 2. అల్మాగ్‌ మీర్జాన్‌ 3. హండ్రీ కోజ్లోవ్‌ 4. ష్లోమీజిర్‌ ((Noa Argamani, Almog meirjan, Andrey kralov and Shlomi zir) అంతేకాదు ఈ ఎమిది నెలలు హమాస్‌ ఈ బందీలను, శిబిరంలోని శరణార్థులైన తమ వాళ్లతో పాటే మర్యాదగా చూసుకున్నది. ఇజ్రాయిల్‌ సైన్యం ‘‘కొనసాగుతున్న సంఘర్షణలో ఇజ్రాయిల్‌ నిర్వహించిన అత్యంత పెద్దదైన బందీ విముక్తి చర్య (ఆపరేషన్‌) లో విజయవంతంగా నలుగురిని విముక్తం చేసి స్వేచ్ఛను ప్రసాదించింది ‘‘ ( ఇది సైన్యం ప్రకటన.) వాళ్లను చేర్చిన సైనిక సంరక్షణ స్థలంలో ఉన్న నోవా ఆర్గమనీ అనే మహిళా బందీతో ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు విడుదలైన మొదటి బందీగా అభినందిస్తూ ఆమె ఆరోగ్యాన్ని పరామర్శించాడు. ఎప్పుడైనా హమాస్‌ గాని, ఐక్యరాజ్య సమితి ఏజెన్సీలు గానీ చెప్తే తప్ప మరణించిన 274 మంది పాలస్తీనియన్ల పేర్లు తెలియవు. ఆసుపత్రి బాధ్యులు, ఐక్యరాజ్య సమితి ఏజెన్సీలు తప్ప గాయపడిన వాళ్ళ పేర్లు తెలియవు.

తలల మీద లక్ష, 5 లక్షలు, 8 లక్షల విలువకు ఎన్‌కౌంటర్‌ మృతులైన ఆదివాసులకు మావోయిస్టులని చెప్పడం కోసం నిర్ణయిస్తున్నారు కనుక భారత అర్ధ సైనిక బలగాలయినా, పోలీసు అధికారులయినా, వాళ్ల ఫొటోలు, పేర్లు ఇస్తున్నారు గానీ వాళ్లను గుండెలయలున్న మనుషులుగా గుర్తించి కాదు. ఇజ్రాయిల్‌ దాడిని యుద్ధమని పేర్కొంటున్నది. అది కూడ తమ మీద అక్టోబర్‌ 7న రాకెట్‌ లాంచర్స్‌తో మిస్సైల్స్‌తో ఒక సాంస్కృతిక ప్రదర్శనపై దాడి చేసి కొందరు ఇజ్రాయీలను బందీలుగా చేసిన హమాస్‌ నుంచి బందీలను విడిపించుకోవడమే కాదు, పక్కలో బల్లెం వలె ఉన్న హమాస్‌ పట్టు నుంచి గాజాని తప్పించి తమకు శత్రుశేషం లేకుండా చేసుకోవడానికి అని కూడా చెప్తున్నది.

మూడు వందల సంఖ్య కూడా మించని ఇజ్రాయిల్‌ బందీల కోసం (అంతకన్నా ఎక్కువ సంఖ్యలోనే వేలల్లో పసిపిల్లలతో సహా పాలస్తీనా పౌరులెందరో ఏళ్ల తరబడి ఇజ్రాయిల్‌ జైళ్లలో మగ్గుతున్నారు)

హమాస్‌ దాడి జరిగిన 2023 అక్టోబర్‌ 7న నరేంద్ర మోడీ మొహాన తెల్లవారి వెంటనే 140 కోట్ల భారతీయుల పక్షాన నెతన్యాహుకు మద్దతు ప్రకటించినట్లు కాదు కదా చరిత్ర గమనం. దానికి ఇంచుమించు ఎనుభయి ఏళ్ల చరిత్ర ఉన్నది. రెండవ ప్రపంచ యుద్ధ కాలం నుంచి పాలస్తీనియన్లు పిలుచుకునే నఖ్బా (1967-68 ) నుంచి నేటిదాకా – ఇప్పుడు ఈ బందీల కోసం 36 వేల మంది అందులో పదహారు వేలమంది పసి పిల్లలు ఇజ్రాయిల్‌ సైనిక దాడిలో పోరాడుతూ మరణించారు. ఇళ్లపైన, ఆసుపత్రుల పైన, స్కూళ్ల పైన, విశ్వవిద్యాలయాల పైన, సాంస్కృతిక కేంద్రాల పైన,  పాలస్తీనా అత్యంత ప్రాచీన చరిత్ర, సంస్కృతి, విజ్ఞానాలకు నెలవులయిన ఎన్నో ప్రాంతాలపైన గురిచూసి వేస్తున్న బాంబుల దాడులతో మరణిస్తున్నారు. అంతర్జాతీయంగా ముఖ్యంగా అమెరికన్‌ విశ్వవిద్యాలయాల్లో మూడో ప్రపంచ దేశాల విద్యార్థులే కాదు, అమెరికన్‌, యూరోపియన్‌ విద్యార్థులు కూడా ఈ విశ్వవిద్యాలయాల కు నిధులు ఇస్తున్న ఇజ్రాయిల్‌ కార్పొరేట్‌ కంపెనీల రక్తసిక్త హస్తాలను పోల్చుకొని మాట్లాడమని నినదిస్తున్నారు కానీ యుక్రేయిన్‌ కైనా అమెరికన్‌ ఆయుధాల చేరవేత ఆలస్యం అయిందేమో కానీ అందువల్ల రష్యా సైన్యాలు యుక్రేయిన్‌లో ఒక గ్రామాన్ని ఆక్రమించుకోవడం సాధ్యమైందేమో కానీ బైడెన్‌ ఆయుధాల, బాంబుల సరఫరా ఇజ్రాయిల్‌కు ఏమాత్రం ఆపకుండానే తక్షణ కాల్పుల విరమణ – ఇజ్రాయిల్‌ బందీల ఒప్పగింత అని అటు ఇజ్రాయిల్‌కు ఇటు హమాస్‌కు విజ్ఞప్తులు చేస్తున్నాడు. జూన్‌ 8న బాంబు దాడిని, యూరోపియన్‌ యూనియన్ అత్యున్నత దౌత్యవేత్త కూడా ‘‘మారణకాండ’’ అని ఖండించాడు  కానీ అమెరికా ఇంకా ఏమీ స్పందించలేదు. ఐక్యరాజ్య సమితి బాధ్యుడు మార్టిన్‌ గ్రిషిత్‌ ఇప్పటికిది ఎన్నిమార్లో దృశ్యాలను బీభత్స మారణకాండలుగా అభివర్ణించడం.

క్షేత్రస్థాయి బీభత్స విషాదం మాత్రం మానవ హృదయాలను కలచి వేస్తున్నది. అల్‌ – ఆక్సా అమరుల స్మారక ఆసుపత్రి (al – aqsa martyrs hospital)) తమ ఆసుపత్రికి 109 పాలస్తీనియన్ల మృతదేహాలు వచ్చాయని అందులో ఇరవయి మంది పసి పిల్లలు, పదకొండు మంది స్త్రీలు ఉన్నారని చెప్పారు. ఆసుపత్రి కనుక పేర్లు తెలుసుకోవడానికన్నా ముందు మృతులు పిల్లలు, స్త్రీలు, ఇతరులుగా నైనా మనకు చెప్పగలిగింది. అందరూ పాలస్తీనియన్లని చెప్పగలిగింది. అక్కడ మరో వంద మంది గాయపడిన వారికి చికిత్స చేశారు. ఆల్‌ – అవ్డా అనే ఆసుపత్రికి నూరు కన్నా ఎక్కువే పాలస్తీనియన్ల మృతదేహాలు వచ్చాయి. గాజాలో పాలస్తీనియన్లు తాము ప్రేమించిన మనుషుల మరణాల గురించి దుఃఖిస్తుంటే ఇజ్రాయిల్‌ రాజధాని టెల్‌ అనీక్‌లో మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారి మిగిలిన బందీలను విడిపించుకోవడమే ‘‘ఇజ్రాయిల్‌ ప్రభుత్వం మీద ఉన్న ఒత్తిడి’’, అంటున్నాడు. ఏదైనా ఒప్పందం చేసుకోండి, బందీలను విడిపించండి ప్రభుత్వ వ్యతిరేక బందీల విడుదల ఇజ్రాయిల్‌ ప్రదర్శకుల డిమాండ్‌ ఇది.

జూన్‌ 8 ఇజ్రాయిల్‌ సైనిక దాడి సందర్భంగా 1976 లో ఇజ్రాయిల్‌ ప్రభుత్వం ఉగాండాలో నిర్వహించిన ఆపరేషన్‌ ఎన్టెబీ (antebbe) తో పోల్చి మాట్లాడుకుంటున్నారు.

అరబ్‌, ఇజ్రాయిల్‌ సంఘర్షణలో భాగంగానే ఆపరేషన్‌ ఎన్టెబీ జరిగింది. దానిని అధికారికంగా ఆపరేషన్‌ థండర్‌ బోల్ట్‌ అన్నారు టెల్‌ అనీక్‌ (ఇజ్రాయిల్‌ రాజధాని) నుంచి ప్యారిస్‌కు పోతున్న ఒక ఎయిర్‌ బస్‌ను ఎథెన్స్‌లో ఆగినప్పుడు ఇద్దరు పాలస్తీనియన్‌ పిఎఫ్‌ఎల్‌పి, ఇద్దరు జర్మన్‌ ఆర్‌ జెడ్‌ తీవ్రవాద సంస్థకు చెందిన వాళ్లు హైజాక్‌ చేసి లిబియా మీదుగా ఉగాండాకు మరలించారు. వీళ్లకు అప్పుడు లిబియా అధినేత ఇద్దీ అమన్‌ మద్దతు ఉంది. ఆ ఎయిర్‌ బస్‌లో ఇప్పటి ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు సోదరుడు ఉన్నాడు. అతన్ని రక్షించుకోవడం కోసం ఇజ్రాయిల్‌ ప్రభుత్వం ఆపరేషన్‌ ఎన్టెబీ నిర్వహించింది కానీ ఆ చర్యలలో 100 మందికి పైగా విమాన ప్రయాణికులు మరణించారు. అందులో ప్రధాని నెతన్యాహు సోదరుడు కూడా మరణించాడు.

మన ప్రభుత్వం కూడా కేంద్రంలో మంత్రిగా (వాజపేయి ఎన్‌డిఏ ప్రభుత్వం) ముఫ్తీ మహమ్మద్‌ కూతురును కశ్మీరీ మిలిటెంట్లు ఆఫ్ఘనిస్తాన్‌కు పోతున్న కాందహార్‌ విమాన సర్వీసును హైజాక్‌ చేసినప్పుడు ఇప్పటి ఎన్‌ఐఎ, ఎన్‌ఎస్‌ఎల సలహాదారు దోవల్‌ను పంపి, కశ్మీరీ మిలిటెంట్లు కోరిన ఐదుగురు బందీలను విడుదలచేసి మంత్రి కూతురును హైజాక్‌ నుంచి విడిపించుకొని వచ్చాడు. ముఫ్తీ మహమ్మద్‌ కూతురు, నెతన్యాహు తమ్ముడు, నలుగురు ఇజ్రాయిలీ బందీల ప్రాణాల వంటివి కావు పాలస్తీనియన్ల, ఆదివాసుల ప్రాణాలు. ఈ ఆధిపత్య వ్యవస్థ ప్రమాణాలను ప్రశ్నిద్దామా? లేదా?

11`6`2024

Leave a Reply