పాలస్తీనా జర్నలిస్టులపై దాడులు ఎప్పుడూ విస్తృతంగానే జరుగుతున్నాయి. పాలస్తీనా మీడియా ఉద్యోగులను ఇజ్రాయెల్ అధికారులు తరచూ “రెచ్చగొడుతున్నారనే” నేరారోపణతో “రహస్య సాక్ష్యం” వుందని, “పరిపాలనా సంబంధ ఖైదీలు”గా జైలు శిక్షకు గురిచేస్తారు. ఈ రెండు ఆరోపణలు కూడా అబద్ధం. ఇజ్రాయెల్ నేరాలను బహిర్గతం చేయకుండా జర్నలిస్టులను అడ్డుకునేందుకు ఉద్దేశించినవే.
ఇతర ఖైదీల మాదిరిగానే ఇజ్రాయెల్ జైళ్లలో జర్నలిస్టులు హింస, కొరడా దెబ్బలు, అవమానం, హింసలకు గురవుతున్నారు. అంతేకాదు, వారికి బయటి ప్రపంచంతో ఎలాంటి సంపర్కమూ లేదు.
2024 జులై 11 నాటికి ఇజ్రాయెల్ జైళ్లలో ఆరుగురు పాలస్తీనా మహిళా జర్నలిస్టులు ఉన్నారు. నిత్యమూ ఇజ్రాయెల్ గార్డుల హింసకు గురవుతున్న వారు యిప్పుడప్పుడే విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
బుష్రా అల్ తవీల్ : రామల్లాహ్ కు చెందిన బుష్రా అల్ తవీల్, గత మూడేళ్లలో అయిదవసారి అరెస్టు అయింది. ఇజ్రాయెల్ షిన్ బెట్ ఆదేశాల మేరకు ఆమె ఆరు నెలల పాటు పరిపాలనా సంబంధ నిర్బంధంలో ఉంది. ఆమె నొప్పితో అరవడాన్ని, సైనికులను శపించడాన్ని సాక్షులు వివరించారు.
ఇక్లాస్ సలెహ్ సవల్హాను డయర్ షరాఫ్ లోని ఒక సైనిక తనిఖీ కేంద్రం దగ్గర అరెస్టు చేశారు. ఆమె భర్త, జర్నలిస్ట్ ఇబ్రహీం అబూ సఫీయా 2022 నుండి ఒఫెర్ జైలులో వున్నాడు కాబట్టి ఆమెను అరెస్టు చేశారనేది వాస్తవం. ఇక్లాస్ డిసెంబర్, 2023 నుండి దాదాపుగా దానంతటదే కొనసాగే పరిపాలనా నిర్బంధంలో ఉన్నది.
రులా హస్సేనైన్: రామల్లాహ్‌కు చెందిన జర్నలిస్టు రులా హస్సేనైన్ దానంతటదే కొనసాగే పరిపాలనా నిర్బంధంలో ఉన్నది. తల్లి కనపడక బెంగపడి ఏ ఆహారమూ తీసుకోక అనారోగ్యం పాలయిన ఆమె బిడ్డకు వైద్యులు జోక్యం చేసుకొని ఇంట్రావీనస్ ఇంజెక్షన్లు ఇవ్వాల్సి వచ్చింది.
అస్మా హరిష్: గతేడాది ఏప్రిల్ నెలలో రామల్లాకు పశ్చిమాన ఉన్న బేతునియాలోని ఆమె ఇంటిపై ఇజ్రాయెల్ సైనికులు దాడి చేసి జర్నలిస్టు అస్మా హరిష్‌ను తీసుకెళ్లారు. ఆమె తండ్రి నోహ్ హరిష్, సోదరుడు అహ్మద్ ఇజ్రాయెల్ జైలులో వుండడం ఆమెను ఖైదులో వుంచడానికి కారణం అనేది వాస్తవం.
రష హర్జల్లా : 39 ఏళ్ల రష హర్జల్లా సోషల్ మీడియా వేదికలపై ఉగ్రవాదాన్ని ప్రేరేపించినట్లు ఇజ్రాయెల్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఆమె వాఫా వార్తా సంస్థకు చెందిన జర్నలిస్ట్ అయిన మొహమ్మద్ హెర్జల్లా సోదరి. 2022లో నాబ్ లూస్‌లో ఇజ్రాయెల్ సైనికులు ఆయనపై కాల్పులు జరిపినప్పుడు కలిగిన గాయాల వల్ల నాలుగు నెలల తరువాత మరణించారు.
అమల్ అల్ షుజైయా: విద్యార్ధిని అమల్ అల్ షుజైయాను తూర్పు రామల్లాహ్‌లోని డీర్ జారిర్‌లో వున్న ఆమె ఇంటి నుండి ఇజ్రాయెల్ సైనికులు రాత్రిపూట తీసుకెళ్లారు. సైనిక న్యాయస్థాన విచారణ కోసం ఎదురు చూస్తోంది. అమల్ రామల్లాహ్, బిర్జీత్ విశ్వవిద్యాలయంలో జర్నలిజం చదువుతోంది. ‘ఆమె లేకపోవడంతో మా ఇంట్లో ఒక పెద్ద శూన్యం ఏర్పడింది’ అని తల్లి ఆవేదన పడుతోంది.
మహిళా ప్రెస్ ఫ్రీడమ్ మహిళా జర్నలిస్టులపై హింసాకాండను, అరెస్టులను ఖండిస్తూ, వారందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
11/07/24
డాక్టర్ మార్వాన్ అస్మర్ మిడిల్ ఈస్ట్ వ్యవహారాల కవర్ చేసే అమ్మన్ ఆధారిత పాత్రికేయుడు.
https://countercurrents.org/2024/07/israel-holds-6-palestinian-female-journalists-in-jail