ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రెండు  ప్రధానమైన విషయాలు చర్చనీయాంశంగా వున్నాయి.మొదటిది భావ ప్రకటనా  స్వేచ్ఛపై నియంత్రణ. రెండవది కూటమి ప్రభుత్వం చాగంటి కోటేశ్వరరావు వంటి సనాతన వాదిని ప్రభుత్వ సలహాదారుగా నియమించుకోవడం . ఈ రెండు విషయాలు పరిష్పర ఆధారితాలు. భావ ప్రకటన స్వేచ్ఛను తెలుగుదేశం పార్టీ  తన ప్ర త్యర్థి జగన్ కాంగ్రెస్ నుండి లాక్కోవడం  మాత్రమే కాదు. ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడితే పోలీసుల దగ్గర పంచాయితీ ,అరెస్టులు ఉంటాయనే విషయాన్ని చంద్రబాబు, పవన్ చెబుతున్నారు. వందలాదిమంది   యూట్యూబర్లను  పోలీస్ స్టేషన్ కు పిలిచి రాద్ధాంతాన్ని క్రియేట్ చేస్తున్నారు.

   పదేళ్ల కాలంలో విభజిత ఆంధ్రప్రదేశ్ లో  సామాజిక మాధ్యమాల పరిధి  విస్తరించడం  రెండు ప్రధాన  పార్టీలు మధ్య ఉన్న రాజకీయ శత్రుత్వం కారణంగా సామాజిక మాధ్యమాలు కూడా వ్యక్తిత్వ హననానికి  తెర తీసాయి. ఇది  రెండు వైపులా జరిగింది.  పార్టీల అధికారలాలస   స్త్రీలను కూడా వదిలిపెట్టలేదు. కుటుంబ జీవితాలలోని అనేక చీకటి కోణాలను బహిర్గతం చేసింది. వీటి వెనుక వాస్తవాలు ఏమిటి అనేది వేరే చర్చ. జరగాల్సిన నష్టం జరిగింది.ఇక్కడ అధికారం కేంద్రంగా సామాజిక మాధ్యమాల ఆధిపత్యం   కొనసాగుతుంది.

    ఈ భావ ప్రకటనా  నియంత్రణ ఏదో ఒక మలుపు దగ్గర ఆగదు. నరేంద్ర మోది  అమల పరుస్తున్న నిర్భంద విధానాలు   రాష్ట్రాల వరకు చేరుకున్నాయి. పాలకవర్గాలు మరింతగా ఈ అణిచివేత ధోరణిని  అనుసరిస్తున్నాయి. పాలకవర్గాల పట్ల ప్రజల అసంతృప్తి ఏదో ఒక రూపంలో వ్యక్తం కావాలి. పత్రికలు, ప్రధాన చానళ్లు  అధికార పార్టీల వైపు వకల్తా తీసుకున్న సమయంలో ప్రజల వ్యక్తీకరణగా సామాజిక మాధ్యమాల  ప్రతిస్పందన  ముందుకు వచ్చింది. దీనిని సహించలేని నరేంద్ర మోది,చంద్రబాబు పవన్ లు  ఈమాధ్యమాల నియంత్రణకు కారణాలు  వెతికారు. వారికి జగన్ పార్టీ కనబడింది.

 ప్రభుత్వ వ్యతిరేకత, పాలనాపరమైన వైఫల్యాలు ఉండనే ఉన్నాయి.  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో విచిత్రమైన స్థితి కూడా ఉన్నది. ఇవన్నీ షార్ట్ కట్ రాజకీయాలు. ఇక్కడ ముఖ్యమంత్రి . అన్ని రంగాలలో  వైఫల్యతతో పాటు తన పార్టీ నేతలను కూడా అదుపు చేయలేని స్థితిలో డబ్బు మాత్రమే స్థిరమైన సంపాదన అనే భావంలో మొత్తం రాజకీయాలు తయారు అయ్యాయి.ఇక్కడే  సామాజిక మాధ్యమాల నియంత్రణ ముందుకు వచ్చింది. ఇది బీజం మాత్రమే..ప్రజాస్వామ్యం నిరంకుశంగా  ఉంటుందనే  భావనను వ్యాప్తి  చేసిన మోదిషాల  వారసత్వమిది.ఇది కేవలం కొన్ని పార్టీల వ్యవహారం అనుకుంటే పొరపాటు. సోషల్ మీడియా నియంత్రణ మాత్రమే కాదు సారాంశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ పై  నిషేధం వేలాడుతుంది. సామాజిక మాధ్యమాలలో  కొంతమేర అతి  ఉండడం గమనించదగినది. వ్యక్తిగత, మానసిక హననం ద్వారా వీ క్షకుల మద్దతు కోసం సాగే  వెంపర్లాట. కేవలం రాజకీయమే కాదు,వీలైనంత వేగంగా వీక్షకులను పెంచుకోవడం అనే కారణం గా దీనిని చూడాలి.

   ఈ కారణాలను చూపి  భయపెట్టి  కొంతమందిని సైలెంట్ చేయగలిగారు. ఇదొక పార్శ్వం అనుకుంటే, రెండోవైపున ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సనాతనం  వైపు దారి  చేసుకుంటున్నాయి. హిందుత్వ రాజకీయాలకు  ఆంధ్రప్రదేశ్ లో ఇంకా  చోటు దొరకలేదు   దానికి అనేక కారణాలు ఉన్నాయి. దేవుడు, మతం వ్యక్తిగతమని ఇక్కడ ప్రజల భావన ఆస్తికులుగా ఉంటూనే మత భావనకు సామాజిక  జీవితంలో చోటు ఇవ్వరు. ఉత్తరాంధ్ర, రాయలసీమ వంటి ప్రాంతాలలో  వెనుకబాటు తనం ఈనాటికీ వుంది.  శ్రమ కేంద్రంగా జీవితాలు అల్లుకొని ఉన్నాయి.  కోస్తాంధ్ర దీనికి కొంత  మినహాయింపు. ఈ మూడు  ప్రాంతాల వైవిధ్యంలో చోటు కోసం ప్రయత్నిస్తున్నది . దీనితో రెండు శిబిరాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చీలిపోయాయి. ఒకటి సనాతనం. రెండవది దానికి వ్యతిరేకమైనది. ఈ రెండు రాజకీయంగా  భిన్నధృ వాలు అని అంచనా వేయలేము. ఇక్కడే చాగంటి కోటేశ్వరరావు ప్రభుత్వ సలహాదారునిగా నియమితులు  కావడం వెనుక సనాతన తత్వాన్ని బలపరచాలనే  నిర్ణయం పాలక పక్షంలో ఉంది. జగన్ ప్రభుత్వం ఈ పదవి ఆఫర్ చేసినప్పుడు అతను తిరస్కరించాడు. కూటమి ప్రభుత్వ  ప్రతిపాదనను  అంగీకరించాడు.చాగంటి కోటేశ్వరరావు ప్రచార సాధనాల ద్వారా ప్రాచుర్యం పొందాడు. అతని గొంతు నిండా సనాతనం నిండి ఉంటుంది. ఒక పదేళ్ల  కాలంలో మూఢత్వాన్ని, భక్తిని,పురుషాధిక్యతను  తన ప్రసంగాల ద్వారా చెప్పకనే చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ సామాజిక తలాన్నిబ్రాహ్మణీ  కరించడంలో కొంత ప్రయత్నం చేశాడు. మానవీయ, ప్రగతి శీల  సమాజం దగ్గర నైతికత పేరుతో సనాతనత్వాన్ని ప్రచలితం చేసే ప్రయత్నం చేస్తున్నాడు.

   చాగంటి కోటేశ్వరావుకి ఈ పదవి ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమది సనాతన మార్గము అని చెప్పకనే చెప్పింది. హిందుత్వ రాజకీయాలను అర్థం చేసుకోవలసిన మరో  దశ ముందుకు వచ్చింది . దేవుడు, మతం వ్యక్తిగత, లేదా కుటుంబ పరిధిలోని విషయాలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రధాన పక్షాన్ని నిలువరించాలంటే హిందూ మతంలోని సనాతన మార్గాన్ని స్వీకరించాలి. వ్యాప్తి చేయాలి. ప్రజల హేతుబద్ధ  ఆలోచనలు వెనక్కి నెట్టి  హిందుత్వ రాజకీయాలకు మార్గంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మలిచే అవకాశాల కోసం పాలక పక్షం చేస్తున్న ప్రయోగమిది. కేవలం చాగంటి కోటేశ్వరావు నియామకం ద్వారా ఈ పని చేయవచ్చునా అనే సందేహం కూడా రావచ్చు. ఆరునెలల కూటమి పనితీరు స్వయం సేవక్  సంఘ  ఆలోచనా ధారను  పోలి ఉన్నది. బ్రాహ్మణీయ హిందుత్వకు దారి పడుతుంది. ఈదారి ప్రధాన  ప్రత్యర్థిని  అణిచి వేయడానికి అనుకుంటే పొరపాటు. స్థిరమైన  హిందుత్వ రాజకీయాల ద్వారా లబ్ధి పొందాలనే  భావనలో చంద్రబాబు, పవన్  మధ్య పోటీ నెలకొంది. భారతీయ జనతా పార్టీ ఇక సరే సరి.

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక వైచిత్రి ఉన్నది. ఉమ్మడి రాష్ట్రం నుండి  విడిపోయాక ఒక ప్రయోగశాలగా  రాష్ట్రంగా ముందుకు వచ్చింది. ఆ ప్రయోగం ప్రజా వ్యతిరేకమయినది. పాలక  పక్షాలు తమ రాజకీయ స్థిరత్వంలో భాగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. రెండు పాలక పక్షాల మధ్య ఉన్న రాజకీయ శత్రుత్వం వెనుక ప్రజలు ఉన్నారనే  జ్ఞానం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో  రెండు నిర్ణయాలు. ఒకటి సామాజిక మాధ్యమాలను నియంత్రించడం .రెండు చాగంటి కోటేశ్వరరావు నియామకం. పాలనాపరమైన విషయాలు అనుకుంటే పొరపాటు. ప్రభుత్వానికి దీర్ఘకాల ఆలోచన ఉన్నది .సామాజిక మాధ్యమాలు ప్రజలలోని అసమ్మతిని వ్యక్తం చేస్తాయి. కొంతమేర బ్రాహ్మణీయ హిందుత్వం వైపు మళ్ళించడానికి చాగంటి కోటేశ్వరరావు ఇక్కడ అవసరమవుతాడు.

   అంతిమంగా బ్రాహ్మణీయ హిందుత్వను బలపరచడం.ప్రజల అసంతృప్తిని, ఆకాంక్షల ను    పక్కనపెట్టి నరేంద్ర మోది  అనుసరించిన మతవిద్వేష విధానాలలోకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రవేశిస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రగతిశీల, అభ్యుదయ శక్తుల ప్రభావం ఏమిటి? వారేమి చేయాలి? భారతదేశ రాజకీయాలు బ్రాహ్మణీయ హిందుత్వ రాజకీయాలను  స్వీకరించినప్పుడు ఒక వామపక్షం స్వీకరించిన వైఖరి చర్చనీయాంశంగా మారింది .

 ఇది  సాంస్కృతిక భావజాల ఘర్షణ. సనాతనం, ప్రగతిశీలత మధ్య జరుగుతున్న ఘర్షణ . వాస్తవికతపై నిర్మితమైన జ్ఞానాన్ని మరింత వెలుగులో వ్యాప్తి చేయడం. గత కాలం నుండి ప్రపంచం అనుసరించిన విధానాల నుండి మళ్లీ తిరిగి మొలకెత్తాలి.విశాలమవుతున్న మానవ ప్రగతి, సైన్స్  మరింతగా మన చర్చలలోకి రావాలి. దేవుడు, మతం, విశ్వాసం వ్యక్తిగత స్థాయిలో కుదించవలసిన అంశాలు. ఆ బీజం దగ్గరే చాగంటి కోటేశ్వరరావు ఆరంభమైనాడు. అదే స్థలం దగ్గర శ్రమ సంస్కృతిని  వ్యాప్తి చేయగలగాలి.అంతిమంగా

పాలకవర్గాలతో ఘర్షణ పడుతూ ప్రజా సంస్కృతి వైపు నిలబడాలి. ఏదో వంక తో సోషల్ మీడియాను అదుపు చేయగలిగినా ప్రజల అసమ్మతిని నియత్రించ లేరు.

One thought on “ఇదొక హిందుత్వ దారి…

Leave a Reply