(ఢిల్లీ నుంచి వచ్చే *నజారియా* పత్రికలో ఒపి జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీలో లా విద్యార్థిని రాసిన వ్యాసం ఇది . సాధారణ ఎన్నికల మీద భిన్న రాజకీయ కోణాల్లో చర్చలు  జరుగుతున్నసందర్భంలో మే 21, 2024 సంచికలో ఇది అచ్చయింది. వసంత మేఘం టీం )

ఇటీవలి సాధారణ ఎన్నికల సందర్భంగా కేరళలోని  వాయనాడ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్‌లోని అనేక జిల్లాలు, ఇతర ప్రాంతాల నుండి సీపీఐ (మావోయిస్ట్) కార్యకర్తలు “ఎన్నికలను బహిష్కరించండి!” అనే నినాదంతో ప్రచారం చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నినాదం వెనుక ఉన్న సంభావ్య తార్కిక కారణాన్ని అర్థం చేసుకోవడానికి ఈ వ్యాసం ప్రయత్నిస్తుంది. రివిజనిస్ట్ పార్టీలు చేసిన ప్రతివాదాలు, అందుకోసం భారత ప్రజల ముందుకు వెళ్లే మార్గం ఏమిటి?  మొదలైనవాటి గురించి చర్చిస్తుంది.

ప్రగతిశీల రాజకీయాలకు ఓటు వేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ వామపక్ష-పార్లమెంటరీ పార్టీలు ఇండియా కూటమి చుట్టూ గుమిగూడి ప్రచారం చేస్తున్నప్పుడు, భారతీయులు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి.  విదేశీ ప్రయోజనాలకు సేవ చేసే ఒక క్రూరమైన, ప్రతిఘాతుక రాజ్యానికి వ్యతిరేకంగా మనం యుద్ధంలో ఉన్నాం. ఫాసిజాన్ని ఓటుతో  తీసివేయలేమని చరిత్ర మనకు రుజువు చేసింది. ఈ పరిస్థితుల్లో భారత “ప్రజాస్వామ్యం” ఎన్నికల ప్రహసనంలో పాల్గొనడం అనేది ప్రజాద్రోహం తప్ప మరొకటి కాదు.

ఓటు వేయడం “నైతికంగా” సరైనదా, కాదా అనే అమూర్త భావనల నుండి ఈ విశ్లేషణను చేయడం లేదు. ఇది శాస్త్రీయ గతితార్కిక భౌతికవాద సూత్రాల ద్వారా జల్లెడ పట్టిన నినాదాన్ని స్వీకరించడానికి దారి తీసిన నిర్దిష్ట పరిస్థితుల నుండి వచ్చిన విశ్లేషణ. నజారియా చేస్తున్న ఈ విశ్లేషణ విముక్తి వైపు భావోద్వేగ ఆకర్షణ లేదా అవకాశవాదంలో కూరుకుపోయిన హ్రస్వ దృష్టితో కూడిన భావావేశపూరిత విజ్ఞప్తి కాదు, విముక్తి వైపు సరైన మార్గం కోసం అంచనా వేసిన  విశ్లేషణ.

 దోపిడీకి గురవుతున్న, అణగారిన ప్రజలకు ప్రతి కొన్ని సంవత్సరాలకు, ఎన్నికల ప్రక్రియ ద్వారా తమను ఎవరు పాలించాలో ఎన్నుకొనే అవకాశాన్ని పాలక వర్గాలు కల్పిస్తాయి అని కార్ల్ మార్క్స్ అంటాడు. భారతదేశ సందర్భంలో, ఇది ప్రత్యేకించి నిజం. భారతదేశం ఒక అర్ధ-వలస, అర్ధ-భూస్వామ్య దేశం. అంటే భారతదేశం సార్వభౌమత్వాన్ని నాశనం చేసే సామ్రాజ్యవాద నియంత్రణ ఉడుంపట్టులోనే కాదు భూస్వామ్య సంబంధాలలో కూడా బందీగా వుంది. కార్పొరేట్లు తమ ప్రయోజనాల కోసం పార్టీలను విదేశీనిధుల ద్వారా నియంత్రిస్తాయి. తుపాకీ మొనల కింద ఓటు వేసేలా ఓటర్లను తయారు చేస్తాయి.

మణిపూర్‌లోని పశ్చిమ ఇంఫాల్‌లో సాయుధ దళాలు ప్రాక్సీ ద్వారా 100 ఓట్లు వేశాయని వార్తలు వెలువడిన తరువాత ఈవీఎంలు ధ్వంసం అయ్యాయి. మణిపూర్ ప్రజలను ఓటు వేయడానికి బయటకు రావద్దని సాయుధ బలగాలు హెచ్చరించాయి – మణిపూర్‌లో అత్యల్పంగా 68% ఓటింగ్ నమోదైంది. సంభాల్‌లో, ముస్లిం జనాభాపై పోలీసులు లాఠీఛార్జి చేసారు. వారిని ఓటు వేయకుండ చేయడానికి వారి పత్రాల చెల్లుబాటును నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.

గుజరాత్‌లో 500 మంది ముస్లిం ఓటర్ల పేర్లనును ఉద్దేశపూర్వకంగా తొలగించారు. ఓటు వేయడానికి అనుమతి దొరికిన ముస్లింలు “మాకు వేరే మార్గం లేదు కాబట్టి బిజెపికి ఓటు వేస్తాము. ఓటు వేస్తే మా నివాస ధృవీకరణ పత్రం వస్తుంది” అని  అన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియ పట్ల ఏదైనా భ్రమవుంటే  పోవడానికి హింస అనేది రాజ్య శక్తుల సాధనంగా ఎలా పనిచేస్తుందో మాత్రమే కాకుండా, పాలకవర్గాలు తమ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం పార్లమెంటరీ వ్యవస్థలోని నియమాలు, నిబంధనలు ఫాసిజానికి ద్వారాన్ని ఎలా తెరుస్తాయో కూడా ఈ ఉదాహరణలు చూపిస్తున్నాయి.

స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల సమస్య సామాజిక ఉత్పత్తి సంబంధాల సమస్యతో లోతుగా ముడిపడి ఉంది. సమ్మతిని స్వచ్ఛందగా ఇవ్వకపోతే (బలవంతంగానూ, తప్పనిసరిగానూ కాకుండా) అది సమ్మతి అని చెప్పలేము అనే ప్రాథమిక ఆలోచనపై ఆధారపడి ఉంటుంది. స్వేచ్ఛాయుత సమ్మతి ప్రాథమిక ప్రజాస్వామిక విలువ. సమ్మతి అనే అంశాన్ని మరింత లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రజాస్వామిక విలువ చారిత్రకంగా ఎలా అభివృద్ధి చెందింది? అని అడగాల్సిన అవసరం వుంది.

పెట్టుబడిదారీ యుగంలో స్వేచ్ఛ, సమానత్వం, సార్వభౌమత్వం అనే నినాదాలతో ప్రజాస్వామిక విప్లవాన్ని పూర్తి చేసిన దేశాలలో పార్లమెంటు ప్రగతిశీల సంస్థగా ఉన్న పాత్రను చారిత్రక విశ్లేషణ చూపిస్తుంది. ఏదేమైనా, గుత్తాధిపత్య పెట్టుబడిదారీ విధాన దశలో ఉన్న సామ్రాజ్యవాద యుగం పార్లమెంటును భిన్నంగా చూస్తుంది; కొమింటెర్న్ రెండవ కాంగ్రెస్ “ఇది అబద్ధం, మోసం, హింస, బలహీన పోసుకోలు కబుర్ల సాధనంగా మారింది” అని వ్యాఖ్యానించింది.

నయా వలసవాద దశలో (ఒక సామ్రాజ్యవాద పద్ధతి; ఒక దేశంపై ఒక విదేశీ రాజ్య పరోక్ష నియంత్రణ), సామ్రాజ్యవాదులు పీడిత దేశాలలో నకిలీ పార్లమెంట్లను సృష్టించి ప్రజలను మోసం చేశారు, వారి వనరులను లాక్కొన్నారు, వారి చౌకైన శ్రమను దోపిడీ చేశారు. 1947 ఆగస్టు 15 నాడు చేసిన స్వాతంత్య్ర ప్రకటన బూటకం. భారత ఆర్థిక వ్యవస్థ స్వతంత్రంగా లేదు, భారతదేశం తన విధానాలు, నిర్ణయాలపై పరోక్ష నియంత్రణ నుండి విముక్తి పొందలేదు.

భారతదేశంలోని అన్ని ఎన్నికల పార్టీలు పాలక వర్గ ప్రయోజనాల వ్యక్తీకరణలు. అవి భారతదేశంలోని పాలకవర్గాలకు అంటే కాంప్రడార్ బ్యూరోక్రాటిక్ బూర్జువాకి (దళారీ నిరంకుశ బూర్జువా -విదేశీ నిధులు, పెట్టుబడిని  ఉత్పత్తి చేయడానికి కార్పొరేటీకరణకు మద్దతుగా ప్రభుత్వ విధానాలపై ఆధారపడే వర్గం), తమ సామ్రాజ్యవాద యజమానులకు సేవ చేసే బడా భూస్వాములకు సేవ చేయడానికి వున్న ప్రజా వ్యతిరేక పార్టీలు. సామ్రాజ్యవాద పెట్టుబడి కోసం ఆదివాసీలను నిర్వాసితులను చేస్తున్న, నిర్మూలిస్తున్న, ఆదివాసీ మహిళలపై అత్యాచారాలు చేస్తున్నఛత్తీస్‌గఢ్ అభివృద్ధి ప్రాజెక్టులలో దీన్ని చూడవచ్చు. “ప్రభుత్వ మార్పు”తో  ఎంత త్వరగా హస్‌దేవ్ నాశనమైందో చూడవచ్చు.

ఒక స్వతంత్ర దేశాన్ని అభివృద్ధి చేయాలనే పేరుతో, పాలక వర్గాలు భారతదేశం పెట్టుబడి, సాంకేతిక పరిజ్ఞానం కోసం సామ్రాజ్యవాద శక్తులపై ఆధారపడేలా చేశాయి. రూ. 266.78 లక్షల కోట్ల జివిఎలో (జి‌వి‌ఎ- స్థూల విలువ ఆధారిత అంటే ఉత్పత్తి అయిన వస్తువులు, సేవల విలువ కొలత) సేవల రంగం వాటా 54.86 శాతం వుండడం అనే వాస్తవం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. అదే సమయంలో జివిఎ రూ. 73.50 లక్షల కోట్ల రూపాయలలో పారిశ్రామిక రంగం వాటా 27.55 % ఉంది. భారతదేశం జిడిపిలో వృద్ధిని చూస్తుండగా, ఉపాధి-ఉత్పాదకతలో గుణాత్మక మార్పు లేదు, ఇది నిరుద్యోగ వృద్ధి ధోరణిని చూపిస్తుంది. ప్రజల ప్రాథమిక అవసరాలు, సౌకర్యాలు పట్టించుకోని వృద్ధి నిజమైన అభివృద్ధా? భారతదేశంలో అనేక మైనింగ్ ప్రాజెక్టులను ఆ ప్రాంతంలోని ఆదివాసీలు వ్యతిరేకిస్తున్నారు. జిందాల్, పోస్కో, వేదాంత వంటి సామ్రాజ్యవాద నిధులతో కూడిన బహుళజాతి సంస్థలు వీటిని ఏర్పాటు చేస్తాయి. ఇవి వనరులను వెలికితీసేందుకు అవసరమైన రహదారులు, సైనిక క్యాంపులు వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తాయి. అదే సమయంలో, ఈ ప్రాజెక్టులు ప్రజల జీవన విధానాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి, వారి సంస్కృతిని నాశనం చేస్తున్నాయి. సైనిక క్యాంపులకు చేరుకోవడానికి ఆదివాసీలను నిర్వాసితులను చేయడం ద్వారా విస్తృత రహదారులు నిర్మిస్తున్నారే తప్ప వారి విద్య కోసం పాఠశాలలను నిర్మించడం లేదు.

ఏదేమైనా, ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ సమధాన్-ప్రహర్, సూరజ్‌కుండ్ పథకం, ఆపరేషన్ కగార్ వంటి విధానాల రూపంలో భారత ప్రభుత్వం అప్రకటిత యుద్ధ ప్రకటన, అలాగే సల్వా జుడుమ్, రణవీర్ సేనా వంటి భూస్వామ్య శక్తుల ప్రైవేట్ హంతకుల ముఠాలకు రాజ్యమద్దతు విదేశీ పెట్టుబడికి లొంగిన భూస్వామ్య శక్తులు-కాంప్రడార్ పెట్టుబడిదారుల మధ్య సంబంధానికి అనుకూలంగానూ, దేశంలోని విశాల ప్రజానీకానికి వ్యతిరేకంగానూ వున్న రాజ్య ధోరణిని స్పష్టంగా చూపిస్తున్నాయి.

భారతదేశంలోని అర్ధ-వలస, అర్ధ-భూస్వామ్య పరిస్థితులు బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిజం ఆధిపత్యానికి దారితీశాయి. భారతదేశ ఆధిపత్య కుల, హిందూ పాలక వర్గాల ప్రయోజనాలను కాపాడే క్రమంలో తీవ్రమవుతున్న సామ్రాజ్యవాద సంక్షోభానికి ప్రతిస్పందనగా వచ్చిన ఫాసిజం ఒక తత్వశాస్త్రం. ఫాసిజం ప్రభావంతో, శాసన సభలు తరచుగా ఆధిపత్య కులాలకు చెందిన భూస్వాములతో నిండిపోయాయి. ప్రజల ఆర్థిక ఆందోళనలు, సామాజిక అవసరాలను పరిగణనలోకి తీసుకోవాల్సి వున్నప్పటికీ, భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థ రాజకీయాలకి బదులు మత, కుల-ఆధారిత మెజారిటీని ప్రోత్సహించడాన్ని చూస్తుంటే అంతిమంగా ఓటింగ్ విధానాలను నిర్ణయించేది మత, కులాల పరిగణన అని చూపిస్తుంది. అంబేద్కర్ గుర్తించినది ఇదే.

అంతేకాకుండా, ఓట్లు కొనడానికి నగదు, మద్యం, మాదకద్రవ్యాలను తరచుగా ఉపయోగించడం గణనీయమైన వనరులు ఉన్నవారు మాత్రమే సమర్థవంతంగా పాల్గొనగలరు అనే ఎన్నికల వర్గ-ఆధారిత స్వభావాన్ని నొక్కిచెబుతుంది. ఇక్కడ. కులానికి, వర్గానికి మధ్య వున్న సంబంధాల ఆధారంగా లోక్‌సభ ఓటింగ్ విధానాలను అధ్యయనం చేసినపుడు 1990ల్లో ప్రజాస్వామ్య పురోగతికి ఉన్న పరిమితులు; పేదలు, అణగారిన వర్గాల రాజకీయాలను నిర్దిష్టపరచడంలో ఉన్న ఇబ్బందులు వెలుగులోకి వచ్చాయి. అంటే పార్లమెంటరీ వ్యవస్థ ప్రజాస్వామిక హక్కులు, అభివృద్ధిలను సాధించగలిగే స్థలం కాదని, తద్వారా భారతదేశంలో ఎన్నికల పనికిరానితనాన్ని చూపిస్తుంది. భారతదేశంలో ఓటింగ్, ప్రజాస్వామ్యాల కుల-వర్గ స్వభావం గురించి మా వ్యాసం ఇండియన్ పార్లమెంట్- ది నర్సరీ ఆఫ్ ఫాసిజంలో మరింతగా వివరించాం.

పార్లమెంటు అనేది కాంప్రడార్ బ్యూరోక్రసీని చట్టబద్ధం చేయడానికి, మరింత బలోపేతం చేయడానికి, అంటే దేశంలోని ప్రాథమిక ప్రజానీకానికి ఎలా సేవ చేయాలనే దాని కంటే విదేశీ కార్పొరేట్ల ప్రయోజనాలకుఎంతవరకు సేవ చేయగలమనే దాని ఆధారంగా ప్రభుత్వ విధానాలను రూపొందించే ఒక సాధనం తప్ప మరొకటి కాదు. సరిపోని కార్మిక చట్టాలను కూడా రద్దు చేసి భారతదేశంలో ప్రత్యేక ఆర్థిక మండలాలను (ఎస్‌ఇజెడ్) ఏర్పాటు చేయడం దీనికి ఒక చక్కని ఉదాహరణ. భారతదేశంలో స్థానిక చట్టాలను రద్దుచేయడం ద్వారా, విదేశీ సంస్థలు తమ తయారీ యూనిట్లను స్థాపించుకొని మన దేశ కార్మికులను కనీస వేతనంతో గరిష్ట పని చేయించి దోపిడీ చేస్తారు. ఈ ప్రక్రియలో ఉత్పత్తి అయిన మిగులు విదేశాలకు వెళుతుంది. 2023 నాటికి నామమాత్ర జిడిపిలో 18.9 శాతం విదేశీ రుణమే వుంది. ఇవి సాంప్రదాయిక గణాంకాలు.

పశ్చిమ బెంగాల్‌లో బుద్ధదేబ్ ఆధ్వర్యంలో సిపిఐ (మార్క్సిస్ట్) వంటి రివిజనిస్టులు (శత్రు వర్గాల అంటే పాలక వర్గాల ప్రయోజనాల కోసం మార్క్సిజం పేరును ఉపయోగించేవారు) ఎస్ఇజెడ్ వంటి విధానాలను ప్రతిపాదించారు. ఎస్ఇజెడ్‌ల వినాశకరమైన ప్రభావాలను ఈ కింది  పదబంధంలో సారాంశీకరించవచ్చు. “వీటి ద్వారా ఆధునిక భారతదేశ చరిత్రలో అతిపెద్ద భూ కబ్జాలను సృష్టించే అవకాశం ఉంది.” ఎస్ఈజెడ్‌లు ప్రజాస్వామిక విలువలతో  రాజీ పడతాయి.

భారతదేశంలో దళారీ పెట్టుబడిదారీ స్వభావానికి మరో ఉదాహరణగా అదానీని తీసుకోండి. అధికారుల ప్రకారం, గౌతమ్ అదానీ సంస్థల సమ్మేళనం విదేశీ కంపెనీల నుండి 600 మిలియన్ల డాలర్ల మేరకు అప్పును అడుగుతోంది. ఈ అప్పు ఉద్దేశ్యం ఇప్పటికే ఉన్న అప్పుని తీర్చడం.  అంటే అదానీ సంస్థలు ఉత్పత్తి చేసే పెట్టుబడి ఎప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థలోకి చేరదు. హిండెన్‌బర్గ్ నివేదిక అదానీ గ్రూప్‌పై సెబీ దర్యాప్తుకు దారితీసింది. “అదానీ గ్రూపులో పెట్టుబడులు పెట్టే పిపిఐలు నిజమైన ప్రభుత్వ వాటాదారులు కాదని, అదానీ ప్రమోటర్ల (యజమానులు) కోసం ప్రాక్సీ(ప్రతినిధులు)లుగా వ్యవహరిస్తున్నారని” సెబీ సూచన చేసింది.

 అదానీని అప్పులు, యాజమాన్యం ద్వారా (సామ్రాజ్యవాద-నిధులతో) ప్రమోటర్లు (పెట్టుబడి కార్యకలాపాల కోసం డబ్బును సేకరించడంలో సహాయపడే వ్యక్తి లేదా సంస్థ) నియంత్రిస్తున్నారు. అంటే, అడగవలసిన ప్రశ్న – వాస్తవానికి అతని లాభాలు ఎక్కడికి పోతాయి? అయినప్పటికీ భారత ప్రభుత్వం అదానీతో సన్నిహితంగా అతని ప్రాజెక్టులు విజయవంతం కావడానికి పనిచేయడం దాని దళారీ స్వభావాన్ని బహిర్గతం చేస్తోంది. వరల్డ్ టర్న్డ్ అప్‌సైడ్ డౌన్ (2022) లో , అమిత్ భట్టాచార్య దళారీ పెట్టుబడి భావనను ఈ క్రింది పదాలలో వివరించాడు: “ప్రయోజనాలు, పెరుగుదల, వృద్ధి సామ్రాజ్యవాద పెట్టుబడితో ముడిపడి ఉన్నాయి; విదేశీ పెట్టుబడిని తన అధీనంలో ఉంచుకొంటుంది; గ్రామీణ ప్రాంతాలలో భూస్వామ్య శక్తులతో ముడిపడి ఉంటుంది”.

నేటి కాలంలో ప్రపంచ సామ్రాజ్యవాద వ్యవస్థపై అమెరికా సామ్రాజ్యవాదం ఆధిపత్యం చెలాయించడంతో సామ్రాజ్యవాదం పోరాటంలో కొత్త దశలోకి ప్రవేశించింది. ఈ పరిస్థితులలో, రివిజనిస్టులు ఎన్నికలలో మనుగడ కోసం రాజీ విధానాన్ని అవలంబించడం ద్వారా వారి అసలు రంగును చూపించారు, తమ వ్యక్తిగత ప్రయోజనాలను మరింతగా పెంచుకోవడానికి ప్రజలకు ద్రోహం చేశారు. చారిత్రాత్మకంగా, వర్గపోరాటం పదునెక్కి, ప్రజలు విముక్తి పొందే ప్రక్రియలో ఉన్నప్పుడు, పాలక వర్గాలు సృష్టించిన ఆధిపత్య ఏకాభిప్రాయం వల్ల ఏర్పడిన కమ్యూనిస్ట్ వ్యతిరేక భావన, విప్లవ వసంత మేఘ ఘర్జన పెరుగుదలను ఆపడానికి తన వికృత స్వరూపాన్ని వెలికితెస్తుంది.

ఆధునిక కాలంలో, ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులకు అతిపెద్ద ముప్పు రివిజనిజం. ఏదైనా సంకోచం సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాన్ని బలహీనపరుస్తుంది. ఉదాహరణకు సింగూర్‌ను తీసుకుందాం. ఎన్నికల ద్వారా రాజకీయాధికారాన్ని పొందిన, మార్క్సిస్ట్ అని చెప్పుకునే సిపిఎం, రైతుల దారుణ మారణకాండ ద్వారా రైతాంగాన్ని నిర్వాసితులను చేయటానికి, వలస వచ్చిన వారి భూమిని సామ్రాజ్యవాద నిధులు సమకూర్చిన టాటాకు ఎస్‌ఇజెడ్ ద్వారా అప్పగించడానికి మాత్రమే దారితీసింది. దీనితో “బూర్జువా ప్రజాస్వామ్యం” పట్ల భ్రమలు పటాపంచలయ్యాయి. వర్గ సంరక్షణ, అవకాశవాదాలు రివిజనిజంతో పోరాడాల్సిన ఆయుధాన్ని మొద్దుపరచాయి. రివిజనిజంపై దెబ్బకొట్టకుండా సామ్రాజ్యవాదంపై దాడి చేయడానికి మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేమని చైర్మన్ మావో మనకు బోధించారు.

తుపాకీ గొట్టం ద్వారా అధికారం వస్తుందనే కామ్రేడ్ మావో సూక్తి, ప్రత్యేకించి భూస్వామ్య సంబంధాలు ఇప్పటికీ ఆధిపత్యం చెలాయించే సమాజంలో వాస్తవం. ఎన్నికల రాజకీయాలు ఈ నాటకం కోసం ఒక మైదానం. మన జనాభాలో అత్యధికులైన రైతాంగం ఇప్పటికీ కులం, పితృస్వామ్యం ఇతర రకాల ఆర్థికేతర ఒత్తిడిల ద్వారా నిర్దేశించే భూస్వామ్య సంబంధాలకు కట్టుబడి ఉన్నారు. ఉదాహరణకు భూ పంపిణీ నమూనాలను తీసుకోండి. పెట్టుబడిదారీ అభివృద్ధికి అవసరమైన ఏకీకరణను అనుమతించని భారతదేశంలో భూమి ముక్కలుగా విభాజితమై ఉంది.

అందువల్ల, బ్రాహ్మణీయ ఆధిపత్యం ద్వారా భూమి ద్వారా అదనపు ఆర్థిక ఒత్తిడి కలిగించే  భూస్వామ్య విధానపు కొనసాగింపు వుంటుంది. ప్రధానంగా ఆధిపత్య-కుల భూస్వాములు భూమిపై నియంత్రణ ద్వారా అధికారాన్ని కొనసాగించడానికి అవసరమైన సామాజిక-ఆర్థిక ప్రాముఖ్యతను పొందుతారు. ఈ కుల ఆధారిత ఆధిపత్యం వల్ల ఓటు వేయడం కోసం రైతులు ఓట్లు వేయరు, భూస్వాముల కోసం ఓటు వేస్తారు. అంతేకాకుండా, దేశవ్యాప్తంగా జరిగే చాలా ఎన్నికలలో బలశాలులను ఉపయోగించడం మనం చూస్తున్నాము- టిఎంసి కౌన్సిలర్ ఒకరు అందుకు అంతరాయం ఏర్పడినందుకు నిరసనగా నిరాహార దీక్షలో ఉన్నారు.

పట్టణ ప్రాంతాల్లో కూడా పార్టీలకు ఓటు వేయడం అనేది రాజకీయాలకు సంబంధించిన అంశం కాదు. డబ్బు, మద్యం, మత, కుల భావాలకు సంబంధించినది. ముస్లింలు దేశ సంపదనంతటినీ దొంగిలించి నిల్వచేసుకుంటారు కాబట్టి వారికి ఓటు వేయవద్దని మతోన్మాదంతో, విద్వేషంతో కూడిన విజ్ఞప్తిని హిందువులకు రాజస్థాన్‌లోని బస్వనారాలో మోదీ చేసాడు.  కాంగ్రెస్ చేపట్టే ముస్లిం అనుకూల సంక్షేమ చర్యలు ముస్లింలు సంపదను నిల్వచేసుకోడానికి దారితీసిన విధానమని, ఫాసిస్ట్ బిజెపికి ఓటు వేయాలని మతపరమైన పక్షపాత, ద్వేషాలను ఉపయోగిస్తూ ప్రజలకు విజ్ఞప్తి చేసాడు.

కార్పొరేట్ సంస్థలు, రాజ్యం, భూస్వామ్య శక్తుల కుమ్మక్కు వల్ల నిల్వ అయిన నిజమైన సంపద ఇది దాచిపెడుతుంది- మోతిలాల్ ఒస్వాల్ నివేదిక ప్రకారం దేశంలోని 100 అగ్రశ్రేణి సంస్థలు 2017-22 మధ్య కాలంలో 92.2 లక్షల కోట్ల రూపాయల మేర నిధులు సమకూర్చుకున్నాయి. అదే సమయంలో, 2023 ఆక్స్‌ఫామ్ నివేదిక ప్రకారం, దేశంలోని 1% ధనవంతులు దేశ సంపదలో 40% కంటే ఎక్కువ కలిగి ఉన్నారు. ఈ పరిస్థితులలో వేయాల్సిన ప్రశ్న చాలా సరళమైనది- ఏదైనా ప్రజాస్వామ్య రూపం అమలవడానికి నిజమైన అవకాశం ఉందా?

హిందూ రాష్ట్రాన్నిపెంచి పోషించే స్థలం పార్లమెంటు భారతీయ పార్లమెంటరీ వ్యవస్థ ఫాసిజనికి సంరక్షణాలయం. సామ్రాజ్యవాదానికి మెరుగైన సేవలందించడానికి, భారత రాజ్యం ఈ దేశ ప్రజలపై పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రారంభించింది. ఏ పార్టీ అయినా తన మనుగడ కోసం సామ్రాజ్యవాద ప్రయోజనాలకు సేవ చేయాలి. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్.వై. ఖురేషి, సీబీఐ మాజీ డైరెక్టర్ డి. కార్తీకేయన్ నాయకత్వంలో సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడించిన,  ప్రచారానికి, ప్రజలను మోసగించడానికి 60 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశారనే వాస్తవాన్ని చూడండి.

సామ్రాజ్యవాద  ప్రయోజనాల పురోగతికి మావోయిజం ఎప్పుడూ ఒక తీవ్రమైన ముప్పుగా ఉంది. ఫిలిప్పీన్స్‌లో అమెరికా మద్దతు గల మార్కో పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజా యుద్ధాలు, భారతదేశ స్వీయ అనుభవం దీనికి సజీవ ఉదాహరణలు. విప్లవం దిశగా ముందుకు సాగడానికి పార్టీ, సైన్యం, ఐక్య సంఘటన అనే మూడు అద్భుత ఆయుధాలను కామ్రేడ్ మావో మనకు అందించారు. ఈ వ్యూహం ద్వారానే జపాన్ సామ్రాజ్యవాదాన్ని ఓడించారు, ప్రపంచ సామ్రాజ్యవాద క్రమం ప్రమాదంలో పడింది. దీనికి ప్రతిస్పందనగా, ప్రపంచంలోని పాలక వర్గాలు విప్లవకర ప్రజానీక పురోగతిని ఆపడానికి విప్లవ ప్రతిఘాతుక దాడులు ప్రారంభించాయి. చారిత్రాత్మకంగా భారతదేశంలో ఎన్నికల పార్టీలు అదే పని చేశాయి.

కాంగ్రెస్ ఆపరేషన్ గ్రీన్ హంట్‌ను ప్రారంభించింది, సల్వా జుడుం (ఛత్తీస్‌గఢ్‌లో ఆదివాసీలపై విధ్వంసం సృష్టించిన భూస్వామ్య శక్తుల ప్రైవేట్ సైన్యం) ఏర్పాటుకు మద్దతునిచ్చింది. మన్మోహన్ సింగ్ మావోయిస్టులను “భారత సమాజానికి అతిపెద్ద అంతర్గత ముప్పు”గా పేర్కొన్నాడు. దాని ఫాసిస్ట్ దాడి బిజెపి ప్రభుత్వంలో ఆపరేషన్ సమాధాన్-ప్రహార్ కింద ఏకీకృతం కావడానికి ముందు ఆపరేషన్ గ్రీన్ హంట్ 2009-2017 వరకు పనిచేసింది.

“పెన్- గన్ అనే రెండు నక్సలిజాల”పై దాడి చేయడాన్ని 2022 సూరజ్‌కుండ్ పథకం ఆమోదించింది. ఒక వ్యక్తి ఏ పార్టీకి చెందినవాడనే పట్టింపు ఫాసిజానికి వుండదు  – భారతదేశంలో ఫాసిజానికి భౌతిక పరిస్థితులు (అర్ధ వలస, అర్ధ భూస్వామ్య పరిస్థితులు) ఉన్నంత వరకు ఫాసిజం మనల్ని పీడిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఫాసిజం అనేది సాంస్కృతిక ఆధిపత్యానికి సంబంధించిన అంశం కాదు, లేదా వ్యక్తులకు సంబంధించినది కాదు, విదేశీ పెట్టుబడి తనను తాను రక్షించుకోవడానికి అవలంబించే అత్యంత ప్రతిఘాతుక, మతోన్మాద, తీవ్రవాద హింసల ఏకీకృత రూపం.

భారతదేశంలోని  బిజెపి-ఆర్ఎస్ఎస్ పాలన అత్యంత ప్రమాదకరమైనదని, ప్రధానమంత్రి మోదీ ఆ దాడికి నాయకత్వం వహిస్తున్నాడనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు. భారతదేశంలో బిజెపి-ఆర్ఎస్ఎస్‌ల రాజకీయ లక్ష్యం స్పష్టంగా ఉంది- బ్రాహ్మణీయ హిందూత్వ రాష్ట్ర భూస్వామ్య బ్యూరోక్రసీని స్థాపించడం, అంటే ప్రపంచంలోని అతిపెద్ద హిందూ రాజ్య స్థాపన కోసం పాలక వర్గం, ఆధిపత్య కుల హిందువుల చేతుల్లో అధికారాన్ని ఏకీకృతం చేయడం ద్వారా నడిచే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం.”

బిజెపి అధికారంలోకి వస్తే కనక , ఈ ప్రాజెక్ట్ వేగంగా అమలు చేయబడుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు – ఆర్టికల్ 370 రద్దు, సిఎఎ – ఎన్‌ఆర్‌సి నోటిఫికేషన్, ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌర చట్టం  అమలు, అయోధ్యలో 2022 జనవరి ప్రాణ ప్రతిష్ట, ముస్లింలు , క్రైస్తవుల ఆరాధనా స్థలాల కూల్చివేత, దళితులు, ఆదివాసీలు, మహిళలు, అణగారిన, దోపిడీకి గురవుతున్న వర్గాలపై పెరుగుతున్న దౌర్జన్యాలు; ఇది 2024 లోక్‌సభ ఎన్నికలలో బిజెపి అధికారాన్ని గెలుచుకుంటే జరగబోయే పూర్తి చిత్రానికి భయంకరమైన ట్రైలర్‌ మాత్రమే., మోడీని గెలిపించకూడదు అని చెప్పే ఒక విషయంలో రివిజనిస్ట్ పార్టీల వైఖరి సరైనది. అయితే పార్లమెంటరీ బాటలో వీటికి పరిష్కారం లభిస్తుందని నమ్మితే మాత్రం వారు కలలు కంటున్నట్లే.

రివిజనిస్ట్ పార్టీలలో ఎక్కువ భాగం ఇండియా కూటమికి మద్దతునిస్తున్నాయి లేదా అందులో భాగంగా ఉన్నాయి. ఏదేమైనా, ఇండియా కూటమి అనేది పాలక వర్గ ప్రయోజనాల సమ్మేళనం, ఇది దేశంలోని కొత్త భూస్వాములు, భూస్వాములు, సామాజిక ఫాసిస్ట్ సెక్షన్లకు ప్రాతినిధ్యం వహిస్తుంది. భారతదేశం లాంటి ఏ అర్ధ- వలస, అర్ధ – భూస్వామ్య సమాజంలోనైనా రాజకీయ అధికారానికి ఈ వర్గ- కుల ప్రయోజనాలు పునాదిగా ఉంటాయి; దేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహించలేదు.

హిందూత్వ ఫాసిజంను ఎన్నికల ద్వారా ఓడించలేమని గమనించడం ముఖ్యం. దీనికి రెండు కారణాలున్నాయి. ఒకటి, బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిజం ఉధృతంగా ఉన్న కాలంలో ఎన్నికలు మరింత తీవ్రమైన అన్యాయంగా తయారవుతాయి. ఈవిఎంలలో తారుమారు చేయడం, ఓటర్లను బెదిరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల, భారతదేశంలో స్వేచ్ఛయుత, నిష్పక్షపాత ఎన్నికల విషయంలో ఇప్పటికే ప్రహసనంగా ఉన్న బూర్జువా ప్రజాస్వామిక హక్కులు వాస్తవానికి మరింత దూరంగా వుంటాయి. అంతేకాకుండా, ఫాసిజం దానికదే కేవలం మతపరమైన తీవ్రవాదం లేదా సమూల నిర్మూలనా ఉదారవాద వ్యతిరేక ప్రాజెక్ట్ కాదు – ఇది ఒక భౌతిక పునాది నుండి పుడుతుంది. మా మునుపటి వ్యాసంలో  వివరించినట్లు-

” చారిత్రాత్మకంగా ఫాసిజం ద్రవ్య పెట్టుబడి తీవ్ర సంక్షోభ సమయంలో వున్నప్పుడు పుడుతుంది. జర్మనీ, ఇటలీ ఫాసిస్ట్ పాలనల పెరుగుదల విషయంలో, మొదటి అంతర్ సామ్రాజ్యవాద యుద్ధం తరువాతి ఆర్థిక సంక్షోభం అంతర్లీన కారణం. బూర్జువా రాజ్యాన్ని నిలుపుకోవడానికి, ద్రవ్య పెట్టుబడి పరాన్నజీవి విస్తరణ కోసం విస్తృత స్థాయిలో హింస అవసరం వుండింది. ఉదారవాద బూర్జువా ప్రజాస్వామ్య వర్గ స్వభావమే  ఫాసిజంకు కూడా ఉంటుంది- బూర్జువా ప్రజాస్వామ్యం రక్షించే వ్యవస్థలను రక్షించడానికి ఇది ఉద్భవించింది. ఏది ఏమైనప్పటికీ, ఉదారవాద బూర్జువా ప్రజాస్వామ్యాలలో హింస ముసుగులో వుంటుంది, చట్టబద్ధమైనది. ఒక నియమం కాదు. భద్రతా వాల్వ్‌గా కొన్ని అసమ్మతి రూపాలకు అనుమతి దొరుకుతుంది. సంక్షోభ సమయాల్లో, సంక్షోభాన్ని సృష్టిస్తున్న ఆర్థిక వ్యవస్థకు ఈ అసమ్మతి విధ్వంసకారిగా మారినప్పుడు; ఈ పరిణామాన్ని అరికట్టడానికి ఫాసిజం తలెత్తాల్సిన అవసరం వుంటుంది. భారతదేశం వంటి అర్ధ-వలసలు సామ్రాజ్యవాద దోపిడి పరాన్నజీవి దురాశను ఎన్నడూ సంతృప్తి పరచలేవు కాబట్టి నిరంతర ఆర్థిక సంక్షోభం ఉంటుంది.

అందువల్ల, ఫాసిజానికి బీజాలు భారతదేశంలోని పార్లమెంటులాంటి దాని సంస్థల్లోనే ఉన్నాయి; అధికారంలో ఎవరు వున్నారనే దానితో సంబంధం లేకుండా ఫాసిజపు కొన్ని కోణాలు ఎప్పుడూ అస్థిత్వంలో ఉంటాయి. భారతదేశంలో, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలవల్ల సామ్రాజ్యవాద పట్టు మరింతగా ఎక్కువైన 1990 లలో నయా – ఉదారవాదం పెరగడంతో పాటు, బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిజం పెరిగింది.

ఫాసిస్ట్ పాలన ఒక ఊహాజనిత శత్రువును సృష్టిస్తుంది, ప్రజల దైనందిన జీవితాన్ని ప్రభావితం చేసే ఆర్థిక సంక్షోభాల నుండి ప్రజల దృష్టిని మళ్లిస్తుంది. అదే సమయంలో ప్రజా ప్రతిఘటనను అరికట్టడానికి ప్రజలపై పూర్తి భీభత్సాన్ని సృష్టిస్తుంది. ఎందుకంటే, వైరుధ్యం తీవ్రతరమైన సమయంలో, ప్రజా ప్రతిఘటన తమ వర్గ పాలనను కూలదోస్తుందనే భయం పాలకవర్గానికి ఉంటుంది.

రాజవంశీయ, భూస్వామ్య, భూస్వాముల ఆధిపత్య కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ, స్థానిక, ‘మార్క్సిస్ట్’ (రివిజనిస్ట్) పార్టీల అపవిత్ర కూటమి ఇండియా అలయన్స్ గెలిచినప్పటికీ, సామ్రాజ్యవాద ప్రయోజనాలు ఫాసిజీకరణ వైపు మొగ్గు చూపుతాయి. 21వ శతాబ్దంలో తీవ్రతరమవుతున్న సామ్రాజ్యవాద సంక్షోభానికి పరిష్కారం కనుచూపు మేరలో లేకపోవడం వల్ల, పెట్టుబడి  ప్రయోజనాలకోసం ప్రజల హక్కులపై మరింత క్రూరమైన అణచివేతను అమలుపరచాల్సి వుంటుంది.

అందువల్ల, ఆదివాసీలపై అణచివేత, ఆపరేషన్ సమాధాన్-ప్రహార్ కింద బస్తర్‌లో మారణహోమం, ఆపరేషన్ కగార్, ఇప్పుడు సూరజ్‌కుండ్ కొనసాగుతాయి; హిందుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న ప్రచారం సున్నితంగానే కొనసాగుతుంది- – కాంగ్రెస్ హయాంలో కూడా ముస్లిం బస్తీలను  కూల్చివేస్తారు, ఘెట్టోవైజేషన్ (సమాజంలోని ఒక నిర్దిష్ట సమూహాన్ని వారు సమాజంలోని ఇతర ప్రాంతాలకు భిన్నంగా ఉన్నట్లుగానూ; వారి కార్యకలాపాలు, అభిరుచులు ఇతరులకు ముఖ్యమైనవి కానట్లుగా భావించడం) ఇంకా కొనసాగుతుంది; కార్మికవర్గం ఇప్పటికీ తీవ్ర దోపిడీ, అణచివేతలను ఎదుర్కొంటుంది. ‘ఎల్‌పిజి’ సంస్కరణల ఆగమనంతో, క్రూరమైన సెజ్‌లను, ఆర్థిక వ్యవస్థలో క్రూరమైన నిరుద్యోగ వృద్ధిని కాంగ్రెస్ ప్రవేశపెట్టిందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు.

పాలకవర్గ ప్రతిపక్ష రాజకీయాలలో ఇప్పటికీ హిందూత్వ ఫాసిస్ట్ పక్షం వైపు మొగ్గు స్పష్టంగా కనిపిస్తోంది- కాంగ్రెస్, ఆప్, సీపీఐ(ఎం)- ఈ ప్రధాన స్రవంతి, “ప్రగతిశీల-వామపక్ష-ఉదారవాద” ముసుగు ధరించే పార్టీలన్నీ రామమందిర ప్రతిష్ఠాపనకు (బాబ్రీ కూల్చివేతలో కాంగ్రెస్ ప్రభుత్వ పాత్రను మనం మరచిపోకూడదు.) ఆర్టికల్ 370 రద్దుకు మద్దతునిచ్చాయి – ఫాసిస్ట్ దాడుల వల్ల అణగారిన ముస్లింలకు ఈ రెండూ ఒక చెంపదెబ్బ. ఈ మద్దతు వారి వర్గ ప్రయోజనాలను సూచిస్తుంది- ప్రభుత్వంలో మార్పు వచ్చినప్పుడు, ఉదారవాద, లౌకిక ముసుగులో వారు ఈ వర్గ ప్రయోజనాలకు మాత్రమే సేవ చేస్తారు.

తమ భౌతిక ప్రయోజనాలకు ఈ పాలనలో రక్షణ వుంటుంది కాబట్టి ఈ మారువేషాల ద్వారా సంతృప్తి చెందేది, తద్వారా  మోసపోయేది ప్రగతిశీలులమని చెప్పుకునే పాలక వర్గం, పెటీ బూర్జువాలోని ఉన్నత స్థాయికి చెందినవారు. కార్మికవర్గం, రైతాంగం, మధ్యతరగతి, అణగారిన మతాలు, మహిళలు, జాతీయ మైనారిటీలు- సామ్రాజ్యవాద సంక్షోభాన్ని, ఫాసిజపు క్రూరమైన దాడిని ఎదుర్కొంటూనే ఉంటారు.

పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు బహిష్కరణకు పిలుపునిచ్చే రాజకీయ పనిని చేపట్టలేని “విప్లవకారుల” గురించి లెనిన్ తన ” బహిష్కరణ” (1906) అనే కరపత్రంలో విమర్శించాడు. బహిష్కరణ పిలుపు ఇవ్వడానికి నిర్దిష్ట పరిస్థితుల మూల్యాంకనం చేయడం అవసరం కానీ  విప్లవ పార్టీ నిష్క్రియాత్మకంగా వుండకూడదు అని లెనిన్ ఈ సమస్యపై విశ్లేషణ చేసాడు. ఈ పరిస్థితులను సృష్టించేందుకు, “శత్రువును అగాధంలోకి నెట్టడానికి మనం సిద్ధం కావాలి, క్యాడెట్‌ల లాగా , తనకు తానుగా అగాధంలో పడిపోవటంపై “ఆశలు పెట్టుకోకూడదు” అని లెనిన్ రాసాడు . విప్లవకర పురోగమననానికి నిర్దిష్ట పరిస్థితులు అవసరమైనప్పటికీ, బూటకపు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేసే కార్యక్రమాన్ని పార్టీ చురుకుగా చేపట్టకపోతే దానికదే జరగదని ఇది స్పష్టంగా తెలియచేస్తుంది.

1907లో, డూమా ఎన్నికలలో పాల్గొనడానికి ఇష్టపడని ఉదారవాద బూర్జువాని లెనిన్ విమర్శించాడు. ఎందుకంటే వారు “తమ స్వభావానికి తగినట్టుగా వున్నారు. వారు పోరాట రూపాన్ని ఎన్నుకోవడంలో, రైతుల కోపాన్ని ఏదో ఒక రూపంలోకి మలచడంలో చురుకుగా సహాయం చేయకూడదనుకున్నారు, లేదా వారికి అలా చేయగల సామర్థ్యం లేదు. అవును, చరిత్రలో ఆ నిర్దిష్ట సమయంలో బోల్షివిక్ పార్టీ బహిష్కరణను ప్రతికూలంగా చూసిందనేది  నిజమే. ఏది ఏమైనప్పటికీ, ఒక సమస్య సారాంశాన్ని నిర్దిష్టంగా విశ్లేషించడానికి రూపం గూర్చి పూర్తిగా తెలుసుకోవాలి అని మనకు మావోయిజం బోధిస్తుంది. ఆ దృష్టిలో ఎన్నికల బహిష్కరణ నినాదం సరైనదా కాదా అని అంచనా వేయాలి. 1906 డుమా స్వభావం భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థ స్వభావానికి గుణాత్మకంగా భిన్నంగా ఉంటుంది.

1906 డూమా ఎన్నికల సమయానికి, రష్యాలో బూర్జువా ప్రజాస్వామ్య విప్లవం జరిగింది. తన పార్టీని దృఢపరచుకోంది. ఎన్నికల సమయంలో, ద్వంద్వ అధికారం ఉంది, అంటే పాలకవర్గాలను పడగొట్టినట్లయితే, కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలకు ప్రత్యామ్నాయ ప్రభుత్వ నమూనాను అందించగలదు. ప్రభుత్వంలో ఈ మార్పు రష్యాలో విప్లవాత్మక ఉద్యమంలో గుణాత్మక మార్పుకు దారితీసింది, సామాజిక పరివర్తనకు మార్గం సుగమం చేసింది. ఏది ఏమైనప్పటికీ, భారతదేశం అర్ధ భూస్వామ్య పార్లమెంట్‌ వున్న జాతీయతల అర్ధ వలస, అర్ధ భూస్వామ్య కారాగార గృహం. ఉత్పత్తి విధానం అలాగే ఉన్నట్లయితే ప్రభుత్వంలో మార్పు అనేది కేవలం అలంకారప్రాయం మాత్రమే అవుతుంది.

ఈ రివిజనిస్ట్ పార్టీలు స్వయంగా ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ వంటి ఫాసిస్టుల కోసం భారతదేశ కూటమి ద్వారా ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రజా వ్యతిరేక పార్టీలు కూడా బిజెపి లాగా, సామ్రాజ్యవాదానికి మెరుగైన సేవ చేయడానికి ప్రజలపై బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిజాన్ని విచ్చలవిడిగా ప్రయోగిస్తుంది. అదే సమయంలో, భారతదేశంలో ఓటింగ్ సరళికి నిర్ణయాత్మక శక్తిగా ఉన్న వర్గ, కులాల బలమైన కోటను విస్మరించలేము. భారతదేశంలో ఎన్నికలు రాజకీయ పరిగణనలపై ఆధారపడినవి కావని, ప్రజాస్వామ్యాన్ని హరించే, “స్వేచ్ఛా ఎంపిక” సామర్థ్యానికి ఆటంకం కలిగించే, ముందస్తుగా అస్థిత్వంలో ఉన్న సామాజిక సంబంధాలపై ఆధారపడి ఉన్నాయి అని యిది చూపిస్తుంది.

ప్రత్యామ్నాయ “ప్రజల ప్రజాస్వామ్యం” పైన అదే అవకాశవాద ధోరణిలో వున్న సిపిఐ ఎంఎల్ (లిబరేషన్) వంటి రివిజనిస్టుల వాదనలను తప్పనిసరిగా మూల్యాంకనం చేయాలి. కాంగ్రెస్ అయినా, బిజెపి అయినా, ‘వామపక్ష ఉగ్రవాదం’ అనేది చారిత్రాత్మకంగా దేశ ప్రజలపై పాలక వర్గ పార్టీలు జాతి నిర్మూలన, అణచివేత కార్యకలాపాలను ప్రారంభించిన ప్రహసనం.

  మావోయిస్టులను ఉగ్రవాదులుగా పిలుస్తున్న రాజ్యాన్ని వ్యతిరేకించాలని “ సిపిఐ (మావోయిస్ట్): ఎ మార్క్సిస్ట్-లెనినిస్ట్ అసెస్‌మెంట్ (2024) ” అనే తన వ్యాసంలో లిబరేషన్ పేర్కొంది. అయితే, అదే పత్రంలో, CPI (మావోయిస్ట్) “ఉగ్రవాద చర్యలు” చేపడుతుందని కూడా అన్నది. “మావోయిస్ట్ శ్రేణులలో నిస్సందేహంగా చాలా మంది నిబద్ధత కలిగిన,  ధైర్యవంతులైన కార్యకర్తలు ఉన్నారు, అందులో ఆదివాసీ ప్రజల నుండి అభివృద్ధి చెందిన వారు, మారుమూల, నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలలో పని చేయడానికి ప్రాణాలను పణంగా పెట్టారు ”అని చెప్పిన ‘ప్రజానుకూల పార్టీ’ ఇలా అంటోంది.

అప్పుడు విముక్తి సమస్య చాలా సులభం అవుతుంది: తుపాకీలు, వైమానిక బాంబులు, అత్యాచారం, అణచివేత దమననీతి ద్వారా రాజ్యం వారిపై చేస్తున్న క్రూరమైన యుద్ధం నుండి రక్షించుకోవటానికి సాయుధ పోరాటం ద్వారా తమ ఆత్మరక్షణ హక్కును కాపాడుకొనే ఆదివాసీలు ఉగ్రవాదులా? ప్రజలను మూర్ఖులు, అమాయకులు, హేతుబద్ధమైన ఆలోచనకు అసమర్థులు అని పిలవడానికి వారి అవగాహన ఇదేనా? ఏ పార్టీఅయినా తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికి, స్వతంత్రంగా చొరవ చేయలేని కేవలం బంటులుగానే ప్రజలను చూస్తున్నదా? వారు “మావో జెడాంగ్ ఆలోచనను” అనుసరిస్తున్నట్లు చెప్పినప్పటికీ, “తన” ఆలోచనను సమర్థించే ఈ “కమ్యూనిస్టుల” లొంగుబాటువాద, ఉన్నత వర్గాల వాదనలను వింటే కామ్రేడ్ మావో తన సమాధిలో ఆగ్రహంతో, ఆక్రోశంతో కొట్టుమిట్టాడుతాడు.

“బహిష్కరణకు వ్యతిరేకంగా”(1907) లో, ఎన్నికల బహిష్కరణ విజయవంతం కావడానికి అవసరమైన పరిస్థితులను లెనిన్ నిర్దేశించాడు. మొదటిది, విప్లవకరమైన పురోగమన పరిస్థితులు నెలకొనడం అవసరం. ఈ పరిస్థితులను విప్లవ సామూహిక దాడిగా అభివర్ణించాడు, దీనిలో పాత పాలన చట్టపరమైన సరిహద్దులు విచ్ఛిన్నమయ్యాయి. బహిష్కరణ నిర్వచన రాజకీయ అంశాన్ని బట్టి వుంటుంది, బహిష్కరణకు పిలుపు యివ్వడం అంటే ఎన్నికలలో పాల్గొనకుండా ఉపసంహరించుకోవడం మాత్రమే కాదు, రాజ్యాంగ భ్రమలకు వ్యతిరేకంగా పోరాటం చేసే ఎత్తుగడ. బూర్జువా నియంతృత్వాన్ని విప్లవకర  ప్రజాధికారంతో భర్తీ చేయడానికి చేసే ప్రత్యక్ష దాడి లక్ష్యం కోసం బూటకపు ఎన్నికలపై ఈ దాడి జరిగింది.

భారతదేశం ఒక బూటకపు ప్రజాస్వామ్యం- అది నిరంకుశంగా వ్యక్తుల వ్యక్తిగత హక్కులు లేదా గౌరవాన్ని నిరాకరిస్తున్న “ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్” ఓటింగ్ విధానం (ఇది బహుత్వ ఓటింగ్ విధానం, ఇందులో ఓటర్లు ఒకే అభ్యర్థికి ఓటు వేస్తారు, ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థి ఎన్నికల్లో గెలుస్తారు) అయినా, లేదా ఒక నిర్దిష్ట పార్టీకి ఓటు వేయమని ఓటింగ్ బూతుల దగ్గర తుపాకీ ఎక్కుపెట్టి నిలబడే భారతదేశ అర్ధ భూస్వామ్య పార్లమెంట్‌లో ప్రజాస్వామ్యానికి స్థానం లేదు. ఎన్నికల్లో ఎంపిక చేసుకోవచ్చు అనే భ్రమను కలిగించినప్పటికీ, ఇది పాలక వర్గానికి, మైనారిటీగా ఉన్న కుల-ఆధిపత్య హిందువులకు మాత్రమే హామీ ఇవ్వబడిన హక్కు.

భారతదేశంలో ఎన్నికలు మెజారిటీపై మైనారిటీ పాలనను నిర్ధారించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఉదాహరణకు, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ద్వారక అసెంబ్లీ నియోజకవర్గం నంబర్ 301లో ముస్లిం ఓటర్లు ఓటు వేశారు. అయితే, ముస్లిం వ్యతిరేక బిజెపి ఓడిపోయే అవకాశాలను తగ్గించడానికి, ఈ సంవత్సరం ఓటరు జాబితా నుండి సుమారు 350 మంది ముస్లిం మత్స్యకారుల ఓట్లను తొలగించారు; కూల్చివేతల తర్వాత అక్కడివారిని గుజరాత్‌లోని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయలేదు.

అదే సమయంలో, అర్ధ వలస, అర్ధ భూస్వామ్య భారతదేశం ప్రచారం చేసిన రాజ్యాంగ భ్రమలనుంచి ప్రజలు తమకు  తాము బయటపడుతున్నారు. “తప్పుడు వాగ్దానాల” కారణంగా ఎన్నికలను బహిష్కరించాలనే గ్రామస్తుల పిలుపు పెరుగుతోంది. ఈ బహిష్కరణను ప్రోత్సహించడానికి CPI (మావోయిస్ట్) చేపట్టిన చర్యలు కూడా పెరుగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో, ఎన్నికల ప్రక్రియలో సహాయంగా మోహరించిన అదనపు పోలీసులు, పారామిలటరీని గ్రామాల్లోకి రావద్దని హెచ్చరించారు.

2024 ఎన్నికల నాటికి నక్సలిజం భారతదేశం నుండి తుడిచివేయబడుతుందని అమిత్ షా చేసిన వాదనలకు విరుద్ధంగా, సీపీఐ (మావోయిస్టు) యోధులు ప్రతికూల భారత రాజ్యానికి నష్టం కలిగించే చర్యలలో విజయవంతమయ్యారు. “అభివృద్ధి” అనే అబద్ధ వాగ్దానాల ఆధారంగా ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలను ప్రోత్సహించడానికి బిజెపి ప్రభుత్వం ఫలించని ప్రయత్నాలు చేస్తోంది, కాని సాయుధంగా లేదా నిరాయుధంగా వారి హక్కుల కోసం పోరాడటానికి ప్రజల సంకల్పం ముందు ఇవి బలహీనమవుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో, సాయుధ పోరాట యోధుల ఒత్తిడి కారణంగా ప్రభుత్వం ఓటింగ్ షెడ్యూల్‌ను తగ్గించుకోవాల్సి వచ్చింది.

అదే సమయంలో, సాయుధ ప్రతిఘటన బలంగా ఉన్న, లేని ప్రాంతాలలో కూడా అనేక ప్రాంతాలలో బహిష్కరణ ప్రకటించారు.  గ్రామసేవక్ అవినీతి ఆరోపణల కారణంగా నాసిక్ వంటి చోట్ల బహిష్కరణకు పిలుపునిచ్చారు. బంద్ పిలుపు తర్వాత నాగాలాండ్‌లోని 6 జిల్లాల్లో ఓటు వేసినవారి సంఖ్య శూన్యం. హర్యానా, బీహార్, ఒడిశా, మహారాష్ట్రతో సహా అనేక రాష్ట్రాలు మూడవ దశ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశాలో ఇప్పటికే 2వ దశ ఓటింగ్‌ను బహిష్కరించాలని పిలుపునిచ్చింది. సెక్టార్ 46లోని గురుగ్రామ్‌లో 8,000 మంది ప్రజలు బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్ట్ బిజెపి ఆధ్వర్యంలో భారతదేశంలోని భయంకరమైన నిరుద్యోగిత స్థితిని సూచిస్తూ, “కామ్ నహీ తో ఓటు నహీ” అనే నినాదం ద్వారా తమ నిరసనను ప్రకటించారు. ప్రజలు మాట్లాడుతున్నారు.

ప్రజానీకానికి ప్రాతినిధ్యం వహించడంతోపాటు ఉత్పత్తి సంబంధాలలో పరివర్తన తీసుకురాగల సామర్థ్యంలో కూడా విఫలమవుతాయి కాబట్టి భారతదేశ  అర్ధ-వలస, అర్ధ-భూస్వామ్య పరిస్థితులలో ఎన్నికలు నిరర్థకమైనవి. కాబట్టి, ఈ కారకాలు కలిసి విప్లవాత్మకమైన ఎదుగుదలకు పరిస్థితులు ఉన్నప్పుడు మార్క్సిస్ట్-లెనినిస్ట్ విశ్లేషణను సమర్థిస్తాయి. రివిజనిస్టులకు వేసే ప్రశ్న ఏమిటంటే – వారు ప్రజానీకంతో పాటుగా నడుస్తారా లేక విప్లవ మార్గంలో, విశాల ప్రజానీకపు నిజమైన విముక్తి మార్గంలో వెనకడుగు వేస్తారా?

ఎన్నికలను బహిష్కరించాలన్న పిలుపు సరైనదే కాదా అని అంచనా వేసేందుకు ‘పార్లమెంటరీ ప్రజాస్వామ్యం’ అని పిలవబడే రాజ్యాంగపరమైన భ్రమలను దాటి దాని సారాంశాన్ని, నిర్మాణమైన పునాదిని విశ్లేషించాలి. అర్ధ-వలస, అర్ధ-భూస్వామ్య భారతదేశంలో ప్రజాస్వామికంగా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు.

ప్రత్యేకించి భూస్వామ్య విధానం నిర్మాణంపై ఆధిపత్యం చెలాయించే దేశంలో సామ్రాజ్యవాద దాడిలో అణచివేయబడిన దేశాల ప్రాతిపదిక అనే భావనకు ప్రజాస్వామ్యం విరుద్ధంగా ఉంటుంది. కుటుంబం ఉత్పత్తివిధానంలో అతి చిన్న యూనిట్‌గా వుండి దాని చుట్టూ సామాజిక సంబంధాలు రూపుదిద్దుకునే భూస్వామ్య వ్యవస్థలో బూర్జువా స్వేచ్ఛ, వ్యక్తిత్వం అనే  స్వేచ్చాయుత భావనలకు చోటు ఉండదు.

ఈ ఉత్పత్తి విధానంలో, భూస్వామి, కుటుంబం కింద వ్యక్తి అణచివేతకు గురవుతాడు. పెట్టుబడిదారీ వ్యవస్థలో వున్నట్టుగా ఒక వ్యక్తికి హక్కులు ఉండవు. పెట్టుబడిదారీ విధానంలో, వ్యక్తిగత శ్రామికుడు ఉత్పత్తి ప్రక్రియలో అతిచిన్న యూనిట్‌గా వుంటాడు కాబట్టి  విలువ వుంటుంది. కొంతమేరకు హక్కులు, స్వయంప్రతిపత్తి వుంటుంది. అదే సమయంలో, భారతదేశ అర్ధ వలస స్వభావం బ్యూరోక్రటిక్ క్యాపిటలిజం ఉనికిని సూచిస్తుంది, ఇది విదేశీ పెట్టుబడి ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్న రాజ్య యంత్రాంగం మద్దతుతో బడా బూర్జువా-సామ్రాజ్యవాద శక్తుల మధ్య కూటమి ఆధారంగా జరిగే ఆర్థికాభివృద్ధి నమూనా. ఎన్నికల బాండ్ల కేసునే తీసుకోండి – ఒక పార్టీ అందుకున్న నిధి దాని ప్రచారంలో, ప్రచార-సృష్టి సామర్థ్యంలో నిర్ణయాత్మక అంశంగా వుంటుంది. ఇది వారి గెలుపు అవకాశాలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. 226.65 కోట్లు విరాళంగా ఇవ్వడం ద్వారా వేదాంత బీజేపీకి నిధులు అందించింది. ఇవి రెండూ విదేశీ మూలధనం ఆధిపత్యంలో ఉన్న కంపెనీలు.

వాస్తవానికి “భారతీయ ఆదివాసీల నుంచి చౌక శ్రమ దోపిడీ ద్వారా వనరులను దోచుకోవడం లక్ష్యంతో చేసే కార్యకలాపాల వల్ల ప్రజలపై, పర్యావరణంపై వాటిల్లిన వినాశకరమైన ప్రభావానికి వేదాంత కుఖ్యాతి చెందింది.” విషయమేమిటంటే, వేదాంత ఏకకాలంలో కాంగ్రెస్‌కు అతిపెద్ద దాతగా ఉంది- అంతిమంగా ఈ రెండు పార్టీలు విదేశీ పెట్టుబడికి మూలాధారాలు.

ప్రజాస్వామికఎన్నికల కోసం అవసరమైన సంబంధాలలో మార్పు పాత భూస్వామ్య సంబంధాలను, వారు సామ్రాజ్యవాదానికి సేవ చేసే విధానాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా, క్రొత్తదాన్ని నిర్మించడానికి వాటిని కూల్చివేయడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. భారతదేశంలో ఈ ప్రక్రియ అసంపూర్ణంగానే ఉంది. అయితే, పాత నుండి కొత్తకు జరిగే ఈ విచ్ఛిన్నం కూడా ఎల్లప్పుడూ సరిపోదు. అమెరికాలాంటి అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాన్ని పరిశీలిస్తే డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య ఎంపిక కూడా నిజమైన ఎంపిక కాదు; ఇది అమెరికన్ ప్రజలకు కూడా స్పష్టంగా తెలిసిపోయింది ఒక అధ్యక్ష అభ్యర్థి అమెరికాలో ఎన్నికల ప్రక్రియ గురించి ఇలా అన్నాడు: “విఫలమైన ద్విపార్టీ వ్యవస్థ వెలుపల వున్న ప్రజలకు ఆ ఎంపికను అందించడానికి నేను అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాను. “

సామ్రాజ్యవాదం బలహీనపడుతున్న యుగపు తత్వశాస్త్రం మావోయిజం. అర్ధ వలస, అర్ధ భూస్వామ్య దేశం నుండి సోషలిజానికి పరివర్తన కోసం అవసరమైన తత్వశాస్త్రం. నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం పిలుపు. సాయుధ వ్యవసాయ విప్లవం ద్వారా సాధించిన సోషలిజం వైపు పరివర్తన కాలం. సామ్రాజ్యవాదం, భూస్వామ్యం, ఫాసిజం దాడులను ఎదుర్కొనేందుకు ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించడమే విప్లవకారులుగా మన ప్రధాన కర్తవ్యం. ఎందుకంటే ఎన్నికలు స్వయంగా దోపిడీ, అణచివేత వ్యవస్థ సంకెళ్ళ నుండి విముక్తి కాకుండా సామూహిక విముక్తికి దారితీయవు కాబట్టి ఎన్నికల్లో పోటీ చేయడం మన ప్రాధమిక కర్తవ్యం కాదు.

ఈ పరిస్థితుల్లో ప్రజలు తమ నిరంతర బాధలకు వ్యతిరేకంగా తమ నిరసనను వ్యక్తం చేయడానికి ఎన్నికలను చురుకుగా బహిష్కరించడం అవసరం. మన ప్రజల శక్తిని హరించి, వనరులను కొల్లగొట్టే, శ్రమను దోపిడీ చేసే పరాన్నజీవుల నుండి రాజకీయ అధికారాన్ని స్వాధీనం చేసుకునే ఉద్దేశ్యంతో ప్రజలను విప్లవకర ప్రజా ఉద్యమంలోకి తీసుకురావాలి. మార్క్సిజం-లెనినిజం-మావోయిజం అగ్ని ద్వారా దీనివైపు మార్గం ఉంది; ఇది రాజకీయ వ్యవస్థపై శత్రువుల పట్టును పారద్రోలడం ద్వారా ప్రజలు తమ సొంత రాజకీయ అధికారాన్ని నిర్మించుకోవటానికి మద్దతు ఇస్తుంది. ప్రజానీకం తమ విముక్తి కోసం ఏ పద్ధతిని ఎంచుకున్నా న్యాయమైన ప్రతిఘటన ద్వారా సాధించగలరు.

చివరగా, చారు మజుందార్ మాటలను పునరుద్ఘాటిస్తున్నాం: “ఎన్నికలను బహిష్కరించండి! నినాదం అంతర్జాతీయ ప్రాముఖ్యత”(1968) : ” పార్లమెంటరీ మార్గానికి కట్టుబడి ఉండటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విప్లవకారులు యుగయుగాలుగా మహత్తరమైన రక్త-ఋణాన్ని పేరుకుపోయేలా చేశారు. ఈ రక్త ఋణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. లక్షలాది మంది అమరవీరులు విప్లవకారులకు పిలుపునిచ్చారు: ‘చనిపోతున్న సామ్రాజ్యవాదాన్ని గట్టి దెబ్బ కొట్టండి; భూమి పైనుండి తుడిచిపెట్టండి!’ ప్రపంచాన్ని కొత్త మార్గంలో పునర్నిర్మించాల్సిన సమయం ఆసన్నమైంది! ఈ పోరాటంలో మన విజయం ఖాయం!”

అందువల్ల, నజారియా మ్యాగజైన్ ప్రజలకు పిలుపునిస్తూంది: 2024 లోక్ సభ ఎన్నికలను బహిష్కరించండి! ప్రజల రాజకీయ అధికారాన్ని నిర్మించండి!

ఒపి జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీలో లా విద్యార్థిని 

తెలుగు: ఉదయిని

REFERENCES:

VI Lenin, Against Boycott (1907) https://www.marxists.org/archive/lenin/works/1907/boycott/index.htm#i

VI Lenin, The Boycott (1906) https://www.marxists.org/archive/lenin/works/1906/aug/21b.htm

Charu Majumdar, Boycott Elections!: International Significance of the Slogan (1968) https://www.marxists.org/reference/archive/mazumdar/1968/12/x01.html

Ramnit Kaur and Aditi Kumar, Indian Parliament: Nursery of Fascism (Nazariya Magazine, 2023) https://nazariyamagazine.in/2023/12/29/the-indian-parliament-the-nursery-of-fascism/ 

Leave a Reply