ఇంత ఉక్కపోతలో
కాసింత ఊరటకి సంతోషపడిపోవడం
గురించి కాదు..
వచ్చే మంటల ఊడ్పుల
మండుటేసవి గురించే దిగులంతా -
ఊచలు వంచుకొని
రాజ్యం కోరలు వంచి
బయటకురావడం చూసి
కళ్ళు చెమర్చడం గురించి కాదు ..
మనసు చిగుర్చడం గురించి కాదు..
చేయని నేర నిరూపణలలోనే
జీవితాల హరణ గురించే వేదనంతా-
మనుషుల ఉదాసీనత మేత మేసి
రాజ్య క్రూరత్వం ఇబ్బడిముబ్బడి కావడం
వెచ్చని సుఖ జీవితాలు
చల్లబడిన రక్తాల విరామ స్థలాలవడం
రంగువెలసిన ఎర్రరంగులు
ఒక సమాధానపడిన ఎర్రగా
బొగులుపోవడం గురించే
అసలు భయమంతా..
పొడిచిన సూర్యోదయం లేఎండలో
కాసింత ఒళ్లు కాగుతున్నంతలోనే
ప్రజా జీవితాల పొద్దు కుంగుతుందేమోనని
అభద్రతాఅనకొండ చుట్టుకౌగిలిలో
పెనుగులాటల గురించే..
కొన్ని నల్లకోటుల పట్టుదలలు
కొన్ని వసంతాల ప్రేమలతలు
అండా సెల్లో
పళ్ళ బిగువున ఒక చక్రాలకుర్చీ దివ్యాంశ యుద్ధం
జీవితాశల తరువుకి
ఒక లేతాకులా
రోజు రోజు పుట్టుకురావడం చూస్తున్నాను.
గబ్బుగియ్యంలో ఒక
వెలుగు చీలిక కదలికలు చూడకపోలేదు.
చరిత్ర పొడవునా పరుచుకున్న
నమ్మించి గొంతు కోసే రాజ్యం గురించే..
ఇప్పటిదాకా వెంట నడిచిన మనిషి
పలాయనం గురించే..పతనం గురించే..
ఏ విలువా లేకుండా
చచ్చిపోయిన విలువయిన మనుషుల గురించి
ఏ కదలిక లేని నాలో లేని మనిషి గురించే..
పది సంవత్సరాల దుర్భర కాలం
నాకు మామూలవడం గురించే..
గొంతు చించుకోకపోయినా..
అవసరానికి గొంతు పెగల్చుకోలేని
నాలోని నా గురించే..
నిలువెల్లా నిస్సహాయతను
నటిస్తున్న నాలోని మనిషి గురించే..
నా అనుమానమంతా.
Related
బావుంది
చాలా బాగుంది.
సాయి బాబా గారికి నివాళి