సంగరేణి అనగానే లోకానికి వెలుగునిచ్చే నల్లబంగారం గర్తొస్తుంది. నరేష్ కుమార్  సూఫీ దీనిని బంగారు భూమి అన్నాడు. ఆ బంగారు భూమితో తన అనుబంధం, ఆడిపాడిన బాల్యం, ఊహ తెలిసే వయసులో ఉక్కిరి బిక్కిరి చేసిన జీవిత కాఠిన్యం, తీపిని, చేదును పంచిన మనుషులు, నిలువెత్తు త్యాగమై ధగధగ మండిన వాళ్లు, బతుకుపోరాటంలో నిట్టనిలువునా కూలిపోయిన వాళ్లు, బొగ్గుట్టల కింద మాయమైన ఊరితో పాటు కనుమరుగైన వాళ్లు -అన్నిటిని సజీవ జ్ఞాపకాలుగా పరిచయం చేశాడు సూఫీ.    

నరేష్ కుమార్  సూఫీ కి తాను పుట్టి పెరిగిన ఊరు ఇదని మిత్రులతో చెప్పుకోడానికి ఇప్పుడక్కడ ఊరు లేదు. ఒక మానవ సమూహమే అంతర్ధానమైపోయింది. చెట్లు, పుట్టలు, చెరువులు, చెలకలు, కాకా హోటల్‌, పాన్‌ డబ్బా, కోమటి అంగడి ఇవేవీ ఇప్పుడక్కడ లేవు. బొగ్గుకోసం తోడేసి కుప్పబోసిన నల్లమట్టిదిబ్బల మధ్య శిథిలమైన మానవ ఆవాసాల ఆనవాళ్లు అక్కడక్కడా కనపడవచ్చు. పుట్టిన గడ్డమీద మమకారం మానవ సహజం. మనుషులు స్థిర నివాసాలు ఎర్పరచుకున్నప్పటి నుండి సామూహిక జీవన బంధాలు, పనిపాటలతో అల్లుకుపోయిన ఊర్లు పుట్టాయి. తరాలు మారతాయి, జీవన విధానం మారుతుంది, ఊర్లు కొత్త రూపురేఖలు సంతరించుకుంటాయి. చాలా కాలం తర్వాత పుట్టి పెరిగిన ఊరికి పోయిన వాళ్లు, ‘అరె, మా ఊరు ఎంతలా మారిపోయింది’ అని ఆశ్చర్యపోతుంటారు. మార్పు సహజం. కానీ సూఫీ చూసింది అటువంటి మార్పు కాదు.

సూఫీ జ్ఞాపకాలలో తన ఊరు పుట్టడం చెప్పాడు, చావడం చెప్పాడు. చావు పుట్టుకలు మనుషులకే కాదు, ఊర్లకు కూడా ఉంటాయా అని మనం విభ్రాంతికి గురవుతాం. నాగరికతలు అంతరించిపోవడం గురించి చరిత్రలో చదువుకొని ఉంటాం. ఏ నాగరికత ఎలా పుట్టింది, ఎలా అంతరించిందీ అని బోలెడంత చరిత్ర ఉంటుంది. అయితే కళ్ల ముందే మనుషులు ఒక్కక్కరుగా కూలిపోవడం, ఊరు మట్టిగొట్టుకుపోవడం, సింగరేణి మంగలిపల్లెలా యాభై ఏళ్లకే ఊరి ఆయుష్షు తీరిపోవడం వర్తమాన చరిత్రలో ఉంది. దాని గురించి ఎవరు చెప్పాలి? ఏ మైనింగ్‌ కిందనో, భారీ ప్రాజెక్టుల కిందనో ఊర్లు పోతున్నాయని, పోయాయని మనం వింటుంటాం. ఊరు పోవడం అంటే ఏమిటి? ఊరు పోతే అక్కడి చెట్లు, పుట్టలు, పొలాలు, చెరువులన్నీ నశిస్తాయి. పశువులు, పక్షులు చావడమో, దిక్కులేక దిక్కులు వెదుక్కుంటూ పోవడమో చేస్తాయి. మనుషులు కూడా అంతేనా? కాదు. ఆ ఊరుకో పేరుపెట్టి, దానికో అస్తిత్వాన్నిచ్చి, దాన్ని తీర్చిన మనుషులు, నాగరికతలు నిర్మించే మనుషులు, చచ్చిపోయినా తమ ఆనవాళ్లను వదిలివెళ్లే మనుషులు కదా, వారి కథ చిన్నది కాదు.

అటువంటి కథ చెప్పడం మొదలుపెట్టాడు సూఫీ. అది తన జ్ఞాపకాల శకలాలను పేర్చి మంగలిపల్లెని పునర్నిర్మించే ప్రయాస. ఇది కేవలం నాస్టాల్జిక్‌ గొడవ కాదు. సూఫీకి చాలా ప్రశ్నలున్నాయి. తనకు సూపర్‌ వుమెన్‌గా కనిపించిన మంగలి గట్టవ్వ, దేనికీ భయపడని ధీశాలి, ఎంతో మందికి పురుడు పోసిన గ్రామీణ వైద్యురాలు తన చేతుల్లో పుట్టి పెరిగిన పిల్ల పటేలుతో బూతులు తిట్టించుకుని కండ్లనీళ్లు నింపుకున్నది ఎందుకు? నాయన హిందీ టీచర్‌ అయినా మంగలి సార్‌ అని అంటారెందుకు? నువ్వు లేకుంటే కాన్పుకు దిక్కులేదు అని చేతులు జోడిరచి బతిమాలి అమ్మతో వైద్యసహాయం పొంది, ప్రతిఫలం అడిగితే బిచ్చెగత్తెలా అవమానించి పంపే అమానుషత్వం ఏమిటి? తను మాత్రం, బడిలో మదిగ రాజేష్‌ను దూరం పెట్టలేదా? వాడు ప్రేమగా పంచబోయిన కూరను ముట్టుకోకుండా వాడిని ఏడిపించలేదా? కదిపితే సలిపే గాయాల్లా ఆ జ్ఞాపకాలు. అప్పటికన్నా ఇప్పుడే ఎక్కువ నొప్పిపెట్టే అనుభవాలు.

ప్రతి మనిషికీ ఒక కథ ఉంది, ప్రతి ఊరికీ ఒక చరిత్ర ఉంది అన్నట్లు మంగలిపల్లెకూ తనదైన ప్రత్యేకతలున్నాయి. ఆ ఊరి సమ్మక్క మనుషులే తయారు చేసుకున్న దేవుడు అంటూ సూఫీ ఆ ముచ్చట చెప్పేటప్పుడు, అది ఏ మసీదూ కూలగొట్టకుండా, ఏ మనిషీ సావకుండా పుట్టిన దేవుని ముచ్చట అంటాడు. గాలి దుమారానికి కిందవడ్డ చెట్టు లేచి నిలబడిన ముచ్చట గురించి చెప్తాడు. ఆ చెట్టు దేవతైతే, పుట్ట పోశమ్మ అయింది. పోశమ్మకు అయ్యగార్లు, మంత్రాల పూజలు ఉండవు. ఒక ఆడామె దీపం బెట్టి పోతుంది. రంగురంగుల గుడ్డ ముక్కలతో చేసిన పోశమ్మ శిల్కలు కట్టి, కోళ్లూ, మేకలు కోసి జనం మొక్కులు తీర్చుకుంటారు. ఆ ఊరి చెట్ల తీర్థం అనే తిండి జాతర కూడా ఓ బహుజన సామూహిక సాంస్కృతిక వైభవ చిహ్నం.

ఇవికాక జీతాల నాడు ఊరంతా చేసుకునే సంబరం. ‘‘పంచుకుతినుడు అలవాటైన సంస్కృతి ఇచ్చిన సంబురం’’ అంటాడు సూఫీ. అయితే ‘‘చేతుల ఆడే పైసలు ఎప్పుడైతే బేంకుల నంబర్లైనయో, అప్పటి నుంచే మనుషులు లెక్కలకు అలవాటైనారని’’ ఆ మార్పు గురించీ చెప్తాడు.

అదలా ఉంచితే ఓపెన్‌ కాస్ట్‌ మైనింగ్‌ వచ్చాక దేవుని చెట్టు మట్టికుప్పలకు ఎండిపోయి మోడయ్యింది. పోశమ్మ పుట్ట ఏ మట్టిబెడ్డల కింద కూలిపోయిందో? చెట్లే మోడుబారాక ఇక చెట్ల తీర్థాలు ఎక్కడివి? రోజూ ముక్కే చెట్టు పోయింది తలాపున పారే గంగా ఎండిపోయింది.

‘‘సింగరేణి తవ్వకాలకోసం జల్లారం చెరువు పూడిపోయింది. కొన్ని రోజులకు ఊర్లో సేదబావులన్నీ ఎండిపోయినాయి. చేతి బోరింగుల్లో కూడా నీళ్లు ఊరడం బందయ్యింది. తలాపుకు అంత గోదారిగంగ  ఉండంగ కూడా నీళ్లు ఊరుడు బందయ్యింది.’’ కంపెనీ వాళ్లే వేసిన నీళ్ల పంపు దగ్గర వంతుల కోసం కోట్లాట. పెట్టుబడి వచ్చింది, ప్రజల నుండి వనరులు లాగేసింది. కొత్త మార్పు ఏమైనా తెచ్చిందా? చెరువు నీళ్లు పోయి పంపు నీళ్లు వచ్చినా వదలని కులం కంపు, అంటరానితనం.

నిజానికి సూఫీ ఒక్కో కథనీ సరదాగా చెప్పడం మొదలు పెడతాడు. స్కూలు పిల్లలు దోస్తులతో చెప్పుకునే ముచ్చటలాగే కథ నడుస్తుంది. సూఫీ మిత్రబృందంలో మనమూ చేరిపోతాం. పల్లె చుట్టూ, లెవెనియ్యబాయి (11 ఎ బొగ్గుబాయి) చుట్టూ తిరుగుతాం. ఇంతలో వ్యవస్థ కాఠిన్యం అమాయక జీవితాల్లో చొరబడి ముల్లుగా గుచ్చుతుంది. సూఫీ పరిచయం చేసే మిత్రులు సాకలోళ్ల ఎంకటేశం, పొన్నం నరేందర్‌, ఎరుకల రాజేశం, ఔసులోళ్ల రమేషు, రాయమల్లు మామ ఎంత అద్భుతమైన మనుషులో కదా అనుకునేంతలో అత్యంత విషాదంగా ఆ కథలు ముగిసిపోవడం పాఠకుల్ని కుదుపుకు గురిచేస్తుంది. అది ఎంతటి విషాదమంటే మనుషులు కళ్లముందే అలా రాలిపోతుంటారు. జీవితాలు డొల్లబారి కుప్పకూలిపోతుంటాయి. బతుకు అగమ్యగోచరమై యువకులు పిచ్చిలేసి పోతుంటారు. ఓపెన్‌కాస్ట్‌ మైనింగ్‌ చేసిన విధ్వంసం ఒకటైతే అది వెంటతెచ్చిన సరుకుల మార్కెట్‌ కనిపించని మహావిధ్వంసం. చస్తే కుటుంబానికొచ్చే పెన్షెన్‌ కోసం, కారుణ్య నియామకం కోసం భార్యాబిడ్డలే హంతకులయ్యే మానవ విధ్వంసం. డబ్బుల కోసం కొడుకు తండ్రిని చంపేసే సాంస్కృతిక పతనం.

‘‘మా ఊరిని సింగరేణి మింగకపోయుంటే, మాకిట్లాంటి సావులు వచ్చి ఉండేవా’’ అనే ప్రశ్న అన్ని విషాదాల వెంటా సుడితిరుగుతుంది.

అలా దుఃఖపుపొరతో ముగిసే కథలే ఎక్కువ. ఒక కథ ముగిసాక వెంటనే ఇంకో కథలోకి వెళ్లాలంటే మనసు కూడదీసుకోవాల్సిందే. చాలా అలవోకగా చెప్పినట్లు అనిపించే ఈ కథల్లో శిల్పవిశేషం ఇదే.

సింగరేణి అంటే నల్ల బంగారమేనా, ఆ నల్లటి బొగ్గు కణకణ మండిన కార్మికోద్యమం గుర్తొస్తుంది. సూఫీ జ్ఞాపకాలలో గోడమీద ఎర్రటి జాజుతో రాసిన అక్షరాలు కూడా ఉన్నాయి. ఆ అక్షరాల వెంట సింగరేణి సమ్మన్న రోమాంచిత పోరాట గాథ కూడా ఉంది. సూఫీ వంటివారిలో సుడిదిరిగే ప్రశ్నల వెంట ఎంతో మంది సమ్మన్నలు వచ్చారు. ఊర్లను మింగేసే కార్పొరేట్‌ రాకాసితో తలపడుతున్నారు. ఊరు మరణించడం ఎలా ఉంటుందో సూఫీ చెప్పాడు. ఇది చదివాక ఊరు ఏరు, చెట్టూ చెలకా, అడవీ, ప్రకృతి సజీవంగా మన మనసులో నిలవాలి. వాటి కోసం మనం ఒక్క నినాదమైనా కావాలి. సూఫీ కోరుకునేది ఇదే కావచ్చు.

Leave a Reply