ఉమ్మడి అనంతపురం జిల్లా ఎప్పటినుంచో కరువు ప్రాంతంగా పేరుగాంచింది. తక్కువ వర్షపాతం, భూగర్భ జలాల తగ్గుదల, సాగు, తాగునీటి కొరత కారణంగా రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదవుతున్న జిల్లాలలో రాజస్థాన్ తర్వాత ఉమ్మడి అనంతపురం జిల్లా రెండవ స్థానంలో ఉంది. ముఖ్యంగా గార్లదిన్నె, పెద్దవడుగూరు, పామిడి, నార్పల, శిగనమల, యాడికి, బుక్కరాయసముద్రం మండలాల్లో చీని, నిమ్మ, అరటి లాంటి పండ్ల తోట పంటలను రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ పంటలను హెచ్.ఎల్.సి ((హై లెవల్ కాలువ) ఆయకట్టు ప్రాంతాలలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. గత సంవత్సరం కర్ణాటక ఎగువ ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాల కారణంగా టీవీ టైం గేట్లు దెబ్బ తినడం వల్ల సరైన సమయంలో హెచ్ ఎల్ సి కి నీరు అందకపోవడం, జిల్లాలు తక్కువ వర్షపాతం నమోదు కావడం కారణంగా భూగర్భ జలాలు కూడా అడుగంటి పోవడం రైతుల పాలిట శాపంగా మారింది. వేలాది ఎకరాల్లో సాగుచేసిన చీని, నిమ్మ, అరటి పంటలు నీళ్లు లేక ఎండిపోవడంతో రైతులు అప్పులపాలై జీవనోపాధి కోల్పోతున్నారు. ఒకప్పుడు లాభదాయకమైన ఉద్యాన పంటగా పేరొందిన చీని, నిమ్మ, అరటి ఇప్పుడు రైతులకు భారంగా మారింది. 300 అడుగుల వరకు బోర్లు వేసిన నీళ్లు పడని దీనస్థితి జిల్లాలో కనిపిస్తోంది.

జిల్లాలో సాగుకు యోగ్యమైన భూమి 35 నుంచి 40 లక్షల ఎకరాలు ఉండగా అందులో కేవలం 25 లక్షల ఎకరాలు మాత్రమే సాగవుతోంది. అది కూడా ప్రతి ఏడాది వర్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షాలు కురవకపోతే బోర్లు, చెరువులు ఎండిపోవడం సహజమైపోయింది. భూగర్భ జలాలు 800 నుంచి 1200 అడుగుల లోతుకు పడిపోవడంతో కొత్త బోర్లు వేయడానికి రైతులు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్న ఆశించిన ఫలితం లభించట్లేదు. ఈ పరిస్థితుల్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం రైతుల పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది.

ఉమ్మడి అనంతపురం జిల్లాకు ప్రధాన నీటి వనరుగా భావించిన హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఈ ప్రాజెక్టు ద్వారా అనంతపురం, సత్యసాయి జిల్లాలోని 300 చెరువులకు పైగా నీరు అందించాలని లక్ష్యంతో ప్రారంభమైనప్పటికీ ఆ లక్ష్యం పూర్తిగా సాధించడంలో ప్రభుత్వాల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు ప్రభుత్వం మాత్రం ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఈ ఏడాది 40 టిఎంసిల నీటిని హంద్రీ – నీవా కాలువ ద్వారా అనంతపురం, సత్యసాయి జిల్లాలకు ఇచ్చినట్లు ఆర్భాటం చేస్తోంది. కానీ గణాంకాలు మాత్రం వాటికి విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా రాప్తాడులో 28, ఉరవకొండ 23, గుంతకల్లు 6, సిగనమల 2,రాయదుర్గం1, ధర్మవరం 3 మొత్తం 63 చెరువులకు మాత్రమే నీరందింది. ఈ చెరువుల నీటి నిల్వ సామర్థ్యం కూడా 3 నుంచి 4 టిఎంసిలు మాత్రమే. ఈ చెరువుల కింద కూడా పూర్తిస్థాయిలో ఆయకట్టు సాగులో లేదు. ఈ ప్రాజెక్టు కింద కొత్త ఆయకట్టు స్థిరీకరణ అసలే జరగలేదు. మరి ప్రభుత్వం “మేం 40 టిఎంసిల నీళ్లు ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఇచ్చాము” అని చెబుతున్న నీళ్లు ఎక్కడ? అని జిల్లా రైతాంగం ప్రశ్నిస్తోంది. 

అదేవిధంగా హెచ్‌ఎల్‌సీ (హై లెవల్ కాలువ) కి కూడా సరైన సమయంలో నీరు విడుదల కాకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కర్ణాటక ఇవ్వు ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా తుంగభద్ర డ్యాం (TB) గేట్లు ధ్వంసమై ఆ ప్రాజెక్ట్ నీళ్లన్నీ కృష్ణా ద్వారా సముద్రం పాలయ్యాయి. కారణంగా హెచ్ఎల్సీ ద్వారా అనంతపురం రైతాంగానికి అత్యవసర సమయంలో నీరు అందకపోవడం వల్ల విత్తిన పంటలు ఎండిపోతున్నాయి. కొన్నిసార్లు నీరు వచ్చినా అది చివరి ప్రాంతాలకు చేరక ముందే ఆగిపోతోంది. కాలువల్లో పూడిక పేరుకుపోవడం, గండ్లు పడటం, నిర్వహణ లోపించడం వల్ల నీటి పంపిణీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. దీంతో నీటి వృథా పెరిగి, సాగు భూములకు నీరు చేరడం ఆ ప్రాంత రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది.

ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్న చెరువుల పునరుద్ధరణ ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన అవసరం చాలానే ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా చిన్నవి, పెద్దవి కలిపి సుమారు 1481 చెరువులు ఉన్నాయి. ఇవి ఒకప్పుడు గ్రామీణ వ్యవసాయానికి ప్రాణాధారంగా ఉండేవి. వర్షాకాలంలో చెరువులు నిండితే భూగర్భ జలాలు పెరిగి బావులు, బోర్లు నీటితో నిండిపోయేవి. కానీ ప్రస్తుతం చాలా చెరువులు పూడికతో నిండిపోవడం, ఆక్రమణలకు గురికావడం, కాలువలు మూసుకుపోవడం వల్ల వాటి నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది.

ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ఈ చెరువులన్నింటినీ పూడికతీసి పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. చెరువులలోని సారవంతమైన పూడిక మట్టిని రైతులకు ఉచితంగా అందిస్తే భూముల సారవంతత కూడా పెరుగుతుంది. చెరువుల నీటి నిల్వ సామర్థ్యం పెరిగితే వర్షపు నీరు వృథాగా పోకుండా నిల్వ అవుతుంది. దీని వల్ల భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో బోర్లలో నీటి మట్టం మెరుగుపడుతుంది. అలాగే పశువులకు, ఇతర జీవరాసులకు, గ్రామీణ జీవవ్యవస్థకు కూడా నీటి భద్రత ఏర్పడుతుంది. జిల్లాలో కరువు తీవ్రతను తగ్గించాలంటే కేవలం ప్రాజెక్టులపై ఆధారపడటం మాత్రమే సరిపోదు.

కరువు నివారణ చర్యలు : –

చెరువులు, కుంటలు, వాగులు, వాననీటి సంరక్షణ వంటి సంప్రదాయ నీటి వనరులను కూడా సమర్థంగా అభివృద్ధి చేయాలి. ఆక్రమణకు గురైన చెరువులు, కుంటలను పునరుద్ధరించాలి.

ప్రతి గ్రామంలో వర్షపు నీటిని నిల్వ చేసే నిర్మాణాలు ఏర్పాటు చేయాలి. రైతులను మైక్రో ఇరిగేషన్ పద్ధతులైన డ్రిప్, స్ప్రింక్లర్ వాడకానికి ప్రోత్సహించాలి. ముఖ్యంగా చీని నిమ్మ వంటి ఉద్యాన పంటలకు తక్కువ నీటితో సాగు చేసే ఆధునిక పద్ధతులను అందుబాటులోకి తీసుకురావాలి.

ధ్వంసమైన హెచ్ ఎల్ సి పిల్లకాలువలను పునర్నిర్మించి చివరి ఆయకట్టు రైతుకు నీరందేలా ప్రణాళికలు రూపొందించి, హెచ్‌ఎల్‌సీకి సమయానికి నీళ్లు ఇవ్వాలి.

హంద్రీ–నీవా ప్రాజెక్టును పూర్తిస్థాయిలో పూర్తి చేసి, కొత్త ఆయకట్టును స్థిరీకరించాలి. నీటి నిర్వహణలో పారదర్శకత తీసుకువచ్చి, రైతు సంఘాల భాగస్వామ్యంతో కాలువల నిర్వహణ చేపట్టాలి. నీటి వృథాను అరికట్టేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించాలి.

అడవులను సంరక్షిస్తూ కొత్త అడవుల పెంపకానికి ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టాలి. వీటిపై ప్రజలలోఅవగాహన,చైతన్య కార్యక్రమాలను చేపట్టాలి.

చెరువుల పునరుద్ధరణ, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, భూగర్భ జలాల సంరక్షణ, వర్షపు నీటి నిల్వ – ఇవన్నీ సమన్వయంతో అమలు చేస్తేనే జిల్లా భవిష్యత్తు సురక్షితమవుతుంది. రైతు బతికితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. అందుకే నీటి వనరుల అభివృద్ధిని అత్యవసర ప్రాధాన్యంగా తీసుకొని ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేసినప్పుడే ఉమ్మడి అనంతపురం జిల్లా కరువుకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అందుకు ప్రభుత్వం, ప్రజలు, రైతులు కలిసి  పనిచేసినప్పుడే జిల్లా భవిష్యత్తు తరాలకు పునాది. 

                                                                        మొండి వెంకటేష్

                                                                రాయలసీమ విద్యావంతుల వేదిక

Leave a Reply