“కేవలం జీవితంలోని బాధలను చిత్రించడమే ప్రధానం కాదు.అది చదివినా, విన్నా, తిరగబడాలనే కసిని పెంచకపోతే, ఆ రచన నిరుపయోగం” అంటాడు కొండపల్లి సీతారామయ్య.కవిత్వంలో ప్రతీకారేచ్చ ఉంటుంది. ఎవరిపై!?అసమానతలపై, వాటి దొంతరలపై,దాని దృష్టి కేంద్రీకృతం అవుతుంది.
అది శక్తివంతమైన భావాలుగా విస్పోటనం చెందుతుంది.
సరిగ్గా బాలు అగ్నివేష్ కవితా సంకలనం నా చేతికి వచ్చే నాటికి, ఒక సీనియర్ ఉపాధ్యాయుడు తను దళితుడు అయిన కారణంగానే తనకు రూమ్ దొరకలేదని, కులం తెలిశాక దొరికిన రూమ్ లో నుంచి, ఆ ఊరి వాళ్ళు వెళ్ళగొట్టారని, అంతేకాకుండా, ఆ ఇంటి అల్లుడు సైతం,తను ఆ ఇంట్లో ఉన్నందువల్ల ఆ ఇంటికి రానని తమ బంధువులకు చెప్పాడని, ఒక అంటరానోడు ఉన్న రూమ్ లో,వాడు వాడుకున్న బాత్రూంనూ నేను వాడుకోవాలా? అంటూ
ఆ ఇంటికి రావడం మానేశాడని,చాలా ఆవేదనతో నాతో మాట్లాడాడు.అదే టీచర్ తన విద్యార్థికి (బీసీ కులం) ఎస్సీ గురుకులంలో సీటు వస్తే,మాల-మాదిగ పిల్లల మధ్య ఉండడం ఇష్టం లేక వెళ్లలేదని,తన ఆవేదనను వ్యక్తం చేశాడు.
ఈ అనుభవాలను చాలా బాధతో నాతో పంచుకున్నాడు.
ఇవి అతని అనుభవాలే.
కానీ, ఓ కవి ఈ అనుభవాన్ని ఎదుర్కొన్నప్పుడు
అది కవిత్వంగా మారుతుంది.విస్ఫోటక స్థితిలోకి పరివర్తిస్తుoది.
అందుకే కావచ్చు బాలు అగ్నివేశ్
“ఇండ్లు వీళ్ళకే ఇవ్వబడతాయి వెజిటేరియన్స్ ఓన్లీ.
కులాలు లేవు.
మా కులం తప్ప.
మతం ప్రమాదంలో ఉంది
మేము అధికారంలో ఉన్నంతవరకూ”
అంటూ 6 పాదాల్లో ఒక కవిత రాశాడు. ఆ కవిత కేవలం తన అనుభవమే కాదు. ఈ దేశంలో కోట్లాదిమంది ప్రజల అనుభవాన్ని సూక్ష్మ రూపంలోకి కుదించి,ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు.
కనుక కవిత్వం ఒక ప్రతీకర చర్య.దాని దృష్టి ఆధిపత్య కేంద్రాలపై, అసమానతలపై కేంద్రీకరించి ఉంటుంది.
దానికి కొనసాగింపుగా మరో కవిత..
“కారంచేడు, నీరుకొండ,
చుండూరు కంబాలపల్లి
ఐర్లాండ్ హత్రాస్
ఆఫ్రికన్ అమెరికన్
జిల్లాలు మారినా దేశాలు ఏవైనా
అన్నీ అంటరాని వెతలే” అంటాడు.
నిజానికి ఆఫ్రికా అమెరికా బానిస వ్యవస్థ కన్నా భారత కుల వ్యవస్థ దారుణమైంది. ఈ మాట అంబేద్కర్ బాలగంగాధర్ తిలక్ కు సమాధానంగా రాశాడు ఒకచోట. కంబాలపల్లిలో దళిత టీచర్ పై హిందూత్వ గుండాలు దాడి చేసి, విద్యార్థి కాళ్ళను ప్రదానోపాధ్యా యుడితో మొక్కించారు. ఖైర్లాoజిలో అయితే దళిత ఆడపిల్లలను చెరిచి, మర్మంగాల్లోకి కర్రలు చొప్పించారు.
కారంచేడులో మాదిగను నరికి చంపారు. చుండూరులో మాలల హత్యలకు ఇప్పటిదాకా దిక్కులేదు.
ఇన్ని దారుణాలను ఒక వరుస క్రమంలో పేర్చి, కవితగా నిర్మించాడు మిత్రుడు. కవిత శక్తివంతమైన భావాలతోటి విస్ఫోటనం చెందడమంటే ఇదే.చదువుతూ ఉన్నప్పుడు బయట విధ్వంసం లాగే మన లోపల ఒక విధ్వంసం సంచరిస్తూ ఉంటుంది.
ఈ దుర్మార్గాలను వ్యతిరేకించి మాట్లాడతామా, సింపుల్ గా ఒక లేబుల్ నీ ముఖంపై చెక్కబడుతుంది ఒకటి అర్బన్ నక్సలైట్.
రెండు దేశద్రోహి
ఈ వర్తమాన చరిత్రనే 2021 సంవత్సరంలో కవితగా మలిచాడు.
“హక్కులు మాట్లాడితే తీవ్రవాదిగా అర్బన్ నక్సలైట్ గా, దేశద్రోహిగా మార్చేసే రాజ్యాలకి ముగింపు వాక్యం”
అంటూ రాసిన ఈ కవిత తెలంగాణలో ప్రజా సంఘాలు నిషేధింపబడుతున్న సమయంలో రాసింది.
ఇది కవి హృదయ సంచలనానికి, వ్యాకులతకి ప్రతిబింబంలా అనిపిస్తుంది. సామాజిక బాధ్యత, సమాజం పట్ల ప్రేమా,లేకుంటే
ఆ అలజడి కవిలో కలుగుతుందా? కలగదు.
ఈ దేశంలో తరతరాలుగా మనుషులు ముఖ్యంగా దళితులు, నిరుపేదలు, దేనికోసం తపిస్తున్నట్టు?
నిజమైన స్వాతంత్రం కోసం కాకపోతే ఇదిగో
ఆ స్వాతంత్రంపై కవిత రాశాడు
స్వాతంత్రం ఎవరికుందో గానీ ప్రజలకు లేదు. అని చెప్పడం ఆ వ్యంగంలోని అసలు విషయం.
” ఈ స్వాతంత్రం మనది కాదు. విరగ్గొట్టిన వెన్నెముక సాక్షిగా
అర్ధరాత్రి తగలబడిన నిజాలెన్నో మనవును ధరించిన వాళ్ళది.
విగ్రహ రాజకీయాలది.
విదేశాలకు పారిపోయిన అమాయకులది.
దళితులను ఊచకోత కోసిన
కారంచేడు కమ్మలది
చుండూరు రెడ్లది
మూడు రంగుల జెండాలో
రంగులను విడదీసే మనుషులది”
ఈ కవిత నిండా, ఆత్మగౌరవాల మీద జరిగిన హత్యాకాండలు మేలుకొంటూ కనిపిస్తాయి. అక్షరాలు తక్కువ.
భావం విస్తృతంగా. భాష సరళంగా..
ఇట్లా రాయడం నా వరకు నన్నయితే డిస్టర్బ్ చేసింది.
ఈ స్వాతంత్రం ఎవరిదో ఎవరికి వచ్చిందో అట్టడుగు ప్రజల దృక్పథంలోంచి రాసిన కవిత ఇది.
కనుక కవిత్వం ఒక నిరసన కూడా.
ఆ నిరసనలోనుంచే
“బతుకు నిరసన”అంటూ ఒక కవిత ఈ పుస్తకంలో ఉంది.
” ఏం చేసినా ఎంత చేసినా
బతుకు బొందల గడ్డనే.
కూటికి లేని బతుకులు
విగత జీవులై పోతుంటాయి.
పొద్దంతా తిరిగినందుకు మనుషుల కన్నా సూక్ష్మజీవులే దగ్గరైనాయి. ఇంటికాడ
ఎదురుచూసే మనుషులున్నా
పో బుద్ధి అయితలేదు”
మనుషులకన్నా సూక్ష్మజీవులే దగ్గరయినాయి. అనే పదంలో
కవి హృదయం, దాన్ని పొంగిపొరలించిన ఆవేదన కనిపిస్తుంది.
ఈ పుస్తకం చదివి,
ఈ మాటలు రాస్తున్న సమయానికి పహేల్గాం దాడికి ప్రతీకారంగా, భారత్ సైనిక చర్య చేపట్టింది. అంతకుముందు ఆ తర్వాత కూడా మనుషులు మతాలుగా, విభజించబడి,మాట్లాడుకుంటున్నారు. దళితులు ఒకవైపు, ముస్లింలు మరో ఒకవైపు నెట్టబడ్డారు. మోడీ-అమిత్ షా వంటి వాళ్లను నాయకులుగా, దేశభక్తులుగా, ప్రశ్నాతీతులుగా అంగీకరిస్తేనే దేశభక్తి ఉన్నట్టు. లేకపోతే దేశద్రోహులే. అని నాకు ఫోన్ చేస్తూ కొందరు మాట్లాడారు.
కానీ,ఒక ముస్లిం సామాజిక నేపథ్యం ఉన్న మహిళా సైన్యాధికారి పాకిస్థాన్ లో నిర్దేశిత లక్ష్యాలపై దాడి చేయడానికి నేత్రుత్వం వహించింది. ఆమె మహిళా.ముస్లీo మహిళ.
ఒకవైపు ఈ పరిణామాలకు ముందు కర్రెగుట్టల మీద భారత వాయుసేన దాడులు చేస్తన్నది. మహిళా నక్సలైట్లే ఎక్కున చనిపోయినట్టు వార్త.
మహిళల బతుకు మాములు కాదు ఈ నేలపై.అదొక సవాలు. ఎదురీత.అందుకే వాళ్ళ మీద గౌరవo,ప్రేమా ఉండాలి.ముఖ్యంగా మార్పును కోరుకునే వాళ్ళు దాన్నుంచి తప్పిoచుకో సాధ్యం ఔతుందా? కాదు.
అందుకేనేమో, స్త్రీని ప్రేమించని వాడి రచనల్లో గొప్ప లోపం ఉండి తీరుతుంది అంటాడు చలం.
ఆ మహిళల మీద “ఆమె”అనే కవిత రాశాడు.
” నువ్వు నడిచే దారిలో
ఆమె రాల్చిన రక్తపు బొట్టు ఉంది నువ్వు పీల్చే ప్రతి శ్వాసలో
ఆమె ఊపిరి ఆడని క్షణాలు ఉంటాయి నువ్వు రాసే సంతకం ఆమె వదులుకున్న అక్షరానికి చిరునామా”
స్త్రీ తనకు, తాను కరిగిపోతూ
సమాజాన్ని వెలిగిస్తున్న త్యాగమూర్తి.
ఇందులో కొన్ని కవితలు ప్రధానంగా స్త్రీలను ఉద్దేశించి ఉన్నాయి. తప్పక పై పాదాలు ఒక ఉదాహరణ మాత్రమే.
ఇందులో ప్రేమ కవిత్వమూ ఉంది. స్త్రీని గౌరవించడం ఉంది.ఆడబిడ్డలని దృష్టిలో పెట్టుకుని మరో కవిత సైతం ఉంది. ఇది ఆరు సంవత్సరాల కిందట రాసింది.
” పగలు అలసిన రాత్రి సొలసినా ఆమెది అదే చోటు.
వాడికో వారసుడిని ఇస్తే సరి.
కానీ అది అమ్మాయి అయితే”
అనేవి ఈ కవిత్వంలో ఒక ముఖ్యమైన ఉద్దేశ్యాన్ని బయటకు ప్రదర్శిస్తాయి.
ఆడబిడ్డని మగ బిడ్డని కనడం తన చేతిలో లేదని, అది ఎక్స్- వై క్రోమోజోముల ఫలితం అని,
తెలియని చాలామంది మహిళలని బలి పెడుతున్నారు కదా, ఈ కవితలో పై పాదాలు చదవడం పూర్తయ్యాక, ఆడపిల్ల జన్మిస్తే, ఆ జన్మను ఇచ్చిన తల్లి పరిస్థితి ఏమిటో అనే భయంకరమైన ప్రశ్న మనం మెదడులో పుడుతుంది. ఆలోచనని మనకు వదిలేస్తాడు కవి.
కవిత్వమంటే అర్థం కాని పదాలు వాడటం, పదాడంబరాన్ని ప్రయోగించడం, భక్తి ఉధృతిలో కొట్టుకుపోవడం, ఆది ప్రాసలు, అంత్యప్రాసలు వాడటం,
ఎంగిలి పడ్డ పదాలను వాడటమే కాదు
తెలిసిన పదాలని పట్టుకొని, మనుషుల మీదికి ప్రయోగించి ఉద్యుక్తం చేయడమే కవిత్వానికి పొందాల్సిన లక్షణం. ఈ విషయంలో బాలు మొదటి అడుగులు వేస్తున్నాడు. కవిత్వానికి కావాల్సిన భావోద్వేగం, ఆ భావోద్వేగానికి వెనకున్న భౌతిక పరిస్థితులు, ఇవి కవితా ప్రవాహాన్ని నిర్ణయిస్తాయి.అందులోని హెచ్చుతగ్గులు కవితా నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయి. బాలు కవితల్లో ఒకటి రెండు చోట్లా వచనం డామినేట్ స్థితిలో ఉన్నట్టు అనిపించింది. అదేమీ అదిగమించడానికి వీల్లేనిదేమీ కాదు.మొదటి పుస్తకమే ఆయినా, మంచి పరిణితితో రాస్తున్నాడు. పైన ఊటంకించినవే కాకుండా, బాలు స్వయానా మైక్రో బయాలజీ విద్యార్థి కనుక, సూక్ష్మ జీవులను ప్రేమించాడు, వాటిని సైతం కవిత్వంలోకి తెచ్చాడు. ఈ పుస్తకం పేరు సైతం సూక్ష్మజీవి అదొక ఆసక్తికరమైన విషయం. కనక ఈ కవిత్వాన్ని తప్పకుండా చదవండి.
అతడి నుంచి మరింత చిక్కని కవిత్వాన్ని ఆశిస్తూ….
Thankyou Suryachandra Anna…