1

సంధ్యా కిరణం

జీవితం స్తంభించినపుడు

జీవితాలను ప్రతిబింబింపచేసే అమరుల

ఆశయాలతో ఈ అడుగులు వేస్తున్నాను

భూ మొనలపై

బాంబు పేలుళ్లతో

బీళ్ళు పడిన నేలపై పడుకొని

స్వేచ్చా చిత్రాన్ని నా కనులలో చిత్రిస్తున్నాను

డ్రోను, హెలి కాప్టర్ల రెక్కీల నడుమ

కోట్ల తారల నీడలో

పండు వెన్నెల్లో

కొద్ది కాలపు గురుతులను

కురిసే మంచుతోపాటే

నా తనువు అణువణువులో దాచుకుంటున్నాను

వడగాలుల వేడికి హడలి పోతున్న ఈ హృదయానికి

విష్లవమే మందుగా నూరిపోశాను

ఎన్నో నిశీధి చీకట్లను తొలిగించుకుంటూ

తొలి సంధ్యా కిరణానై నిల్చున్నాను

నిలబడిన ప్రతిసారీ

నిట్టూర్చిన క్షణాలే తలచుకున్నాను

తుపాకుల తూటాల నడుమ

మృత్యువును సవాల్‌ చేస్తూ సంధ్యా స్వప్నాల

చాళ్ళలో స్వేచ్ఛా  విత్తులు నాటుతున్నాను

2

నా ఇన్సాస్ 

ఆకులే పరుపుగా మారినప్పుడు

ఆకాశమే చంద్రమై వెలుగుతునప్పుడు

సన్న గాలులే తీయగా పాడుతున్నప్పుడు

బందూకే బంధువై పలకరించింది

సెంట్రీలో తోడుగా నాకన్నా ముందుండి నను నిలబెడుతోంది

రాజ్యపు పాశవిక ఇనుప బూట్ల చప్పుళ్లకు ధీటుగా

నినదించే కీచురాళ్ళను అమురుకుంటోంది

నా కుడిచేతిని తాకుతూ ధైర్యమౌతోంది

ఎరుపుగా మారిన నా మెదడుకు

చురుకుగా చూసే నా కనులకు విశ్రాంతినిస్తూ

కనులలో కళలకు కల్లాన్ని వేసి, ఎన్నో ఆలోచనలకు

మరెన్నో ఆశలకు ఆయువు పోస్తుంది.

జాబు

అలలా ఎగిసే కళలన్నీ పోగేసి

ప్రేమ విప్లవాన్ని

విప్లవపు ప్రేమని

జాబుగా రాశాను

విరిసిన నవ్వులను

వికసించిన హృదయాలను చూస్తూ

బాధల బంధనాలను

బద్దలుకొడుతూ సరిహద్దులు దాటాను

గుండెకు హద్దుకునే ఊసుల కోసమై

ఊసులను పోగేసే మాటల కోసమై

కనులలో నిండిన కన్నీళ్ళను తోసేస్తూ

స్వప్నాలను నింపిన కనులతో చుస్తున్నాను.

3

యాదిలో

ఇంకా గుర్తుకొస్తున్నాయి ఎన్నో చీకటి

రాత్రులలో కనులను తడిపిన

కన్నీటి గురుతులు ఇంకా గుర్తుకొస్తున్నాయి

తలలు వంచీ వంచి తనువులు చాలించిన

ఎన్నో వ్యధలు ఇంకా గుర్తుకొస్తున్నాయి

భారమైన హృదయాలతో బతుకు లీడుస్తూ

నెలసరి వేతనానికి చేమటనమ్ముకొని

నిటారుగా నిలబడి ఊపిరి కూడా పీల్చలేని

వెతలోని బాధలు ఇంకా గుర్తుకొస్తున్నాయి

రక్తం మరుగుతుంటే

తెల్ల ముఖం వేసుకొని ఉండడం దండగ

స్వప్నించిన క్షణాలకై సాయుధమై

వంచించే తలలు పేల్చి

వసంతాన్ని నిలపాలి

నవ వసంతాన్ని తేవాలి.

2 thoughts on “కె కె కవితలు మూడు

  1. kavithalu chala manchiga rasaru . naku rayalani untundhi kani thappulu untayani chintha, miku nachithe nannu contact avagalara ? entho kontha contribute cheyalani naku undhi , ee comment ki reply isthe nen na contact details isthanu thank you

Leave a Reply