కుంభమేళా ముగిసింది. గంగానది ప్రవాహం కొనసాగుతోంది. కోట్ల మంది మనుషుల శరీర వాసనను నది తన నీటితో శుద్ధి చేసింది. నది రాత్రివేళ తనతో తను సంభాషించుకుంటుంది. ఇన్ని కోట్ల మంది మనుషులు.. సగ భారతదేశం నాలో మునక వేసిందా ఆని. నిరంతర ప్రవాహగతిలో నది నిశ్చల  జలధి  తరంగం.

సముద్రతీరం లేని ప్రాంతంలో జీవించలేను అన్నాడు శ్రీరంగం శ్రీనివాసరావు. అతని జీవన మజిలీలు విశాఖపట్నం, చెన్నపట్నం. సముద్రంతో మనుషులకు ఉన్న భావోద్వేగ స్థితిని శ్రీశ్రీ పలవరించారు. నదులు మానవ నాగరికతా వికాసానికి జీవనోత్సవాన్ని ఇచ్చాయి. నది నుండి మానవులు  ఎంత స్వీకరించాలో అంతకు  మించి  వశం చేసుకున్నారు . నదిలేని పల్లెను, నగరాన్ని ఊహించలేం. అనేక మౌన నిశ్శబ్దాలను దాచుకుని నది ప్రవాహగానమైంది.

 వంశధార, తుంగభద్ర, మంజీరా  లానే ఆనేక నదుల ప్రవాహం  ఈ దేశం . మనుషులు చలనంలానే నదుల జీవనగీతి ఉంటుంది. నిశీధి వేళ నది దగ్గర కూర్చున్నప్పుడు, నది వినిపించే నీటిశబ్ధం ఒక అనుభవం. పిల్లకాలవల ద్వారా నీటి ప్రవాహం వరినారును తాకుతుంది.  భూమి నిండా రంగు మారిన నీరు అలుముకుంటుంది. మానవుల, భూమి దాహార్తిని ఒకేసారి నది తీరుస్తుంది . మూడు రుతువుల సమ్మేళనంలో అనేక ఇంద్రధనస్సులు నదిలో మొలకెత్తుతాయి. నీటి జాలు లేకుంటే దాహార్తితో మానవుల గొంతు ఎండిపోయేది . వెన్నెల ధారలాంటి నది దేశంలో ఎక్కడ పారిన ఒకటే. జీవనదులు, ఉపనదులు నీటిపాయలు, ఎచ్చుతగ్గుల కొలత అసమ సమాజంలానే నదులకు కూడా వర్తిస్తుంది.

నదులకు పుష్కరాలుంటాయి. నదీస్నానం ఆధ్యాత్మికతో ముడిపడి  ఉన్న దేశంలో నదికి హారతులు ,పసుపు, కుంకుమలను సమర్పించి ‘మాప్రాంతాన్ని సస్యశ్యామలం చేయి  తల్లి’ అని ప్రార్ధించిన మనుషులున్న ప్రాంతం. వారిలోని ధార్మిక చింతనను తప్పు పట్టలేం. వారి నమ్మికలో తల్లి వంటి స్థలం నది. మానవ జీవితంలానే నదికి కూడా కుల , వర్గ స్వభావం లేదని అనలేం.  భౌతిక  స్థితిని భావవాదంగా మార్చిన బ్రాహ్మణీయ కులవ్యవస్థ రూపమది. నదికి భావవాద ఛాయలను పులిమే సంస్కృతి ఉండనే ఉన్నది . నది మైలపడుతుందనే భావన కూడా . ఇవన్నీ స్వీకరించని, పట్టించుకోని నది తన మానాన తాను  ప్రవహిస్తూనే ఉంది.

 కుంభమేళాలో అరవై కోట్ల మంది  స్నానం చేశారట.  కోట్ల రూపాయల ధనం ఖర్చయింది. గంగానదిలో మునగడం ఒకానొక పవిత్ర కార్యమట.  మోదీ , అమిత్ షా, అంబానీ నుండి ఈ దేశంలోని రూపాయి, రాజకీయ జ లగలన్నీ నదిలో మునక వేసాయి. మనుషులను జలగలతో పోల్చడం సరికాదు. జలగ కూడా రక్తపిపాసి.  నదిని శుద్ది చేయడంలో జలగ చూపే జీవన  వైవిధ్యం వేరు. జలగ నదిలో అంతర్భాగం . సగం భారతదేశం గంగానదిలో స్నానించింది . గంగలో మునగని వారు హిందువులు కారు .. సంఘ్ పరివార్ ఉవాచ. అరవై కోట్ల మంది గంగానదిలో స్నానం చేసారు అనే  నిర్ధారణ కూడా అసత్యమే . పాత పాపాలు నుండి కొత్త పాపాలు చేయడానికి  నదీ స్నానం ద్వారా  కొందరు అనుమతి పొందారు అంటే సరి పోతుంది.

 కోట్ల మంది మునక నా అస్తిత్వం అని నది ఏనాటికి భావించదు. మనుషుల జీవన వికాసం నది.  నది కోరేది కుంకుమ, పసుపు, నమస్కారాలు , జంధ్యపు పోగులు కాదు . గంగానదిలోని పూడికకు మరొక పూడిక కలగలిసింది . గంగానది శుభ్రతకు దీర్ఘకాలం పట్టవచ్చు. ఎంతగా కలుషితం అయినానో కోట్ల మంది  స్నానాదుల తర్వాత  నది  గ్రహించింది . నదికి  మాట ఉంటే అనేక ప్రశ్నలు ఉండేవి.

కుంభమేళా స్నానానికి అనేకమంది వెళతారు . అందులో అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఉండవచ్చు.  నదీస్నానం తమ జీవితాన్ని ఉద్దీపన చేస్తుందనే భావన ఉండవచ్చు. నదికి కూడా సంపన్న వర్గపు భావజాలాన్ని రాజ్యం ,పెట్టుబడి, బ్రాహ్మణీయత కలగలిపి ఆపాదించాయి. అనేక స్వీయ మరణాల, ముఖ్యంగా స్త్రీల హత్యాస్థలి నది . జీవనశక్తి కలిగిన మనుషులు తనలోకి దూకి జీవితాన్ని ముగించడం నదికి మిగిలిన గర్భశోకం. బతకలేని స్థితి కల్పించిన అసమ  సమాజ అసంతృష్టి . గంగానది ప్రవహించినంత మేరా అనేక స్వీయమరణాలు నమోదు అవుతాయి . శరీరాలు కూడా దొరకని  కాలం కూడా ఉన్నది. కుంభమేళా జరిగిన కాలంలో బలవన్మరణం పొందిన మనుషుల జాబితా ఎక్కువే.  స్టేట్ ఒక విజయోత్సవాన్ని జరుపుకుంటుంది. కరోనా కాలంలో వేల శవాలను గంగానది తనలో దాచుకుంది . ఆమరణాల సంఖ్య గురించి ప్రపంచానికి ఇంకా తెలియలేదు. కొత్త నీరు రావచ్చు. అక్కడే స్నానం ముగిసింది.

  భక్తి , విశ్వాసం, మతం హెచ్చు మీరుతున్నాయి . శతాబ్దాలుగా నది ప్రవహిస్తున్నది. ఇంతటి  ఉన్మాద  ప్రకోపాన్ని నది జీర్ణం చేసుకోలేదు. జనానికి  నది మాతృమూర్తి స్తన్యం. కాలక్రమణికలో నది వాణిజ్య సరుకుగా మారింది . నదిని పడవ మోసుకుపోతుంది అన్న ఆధునిక కవి మాట ఇవాళ్టి రుజువు. నది  ఇవాళ పైసలు నింపుతుంది . నది కోట్లాది రూపాయల సరుకు. నదిని పారతో గుచ్చి ఇసుకను తరలించుకుపోయే కోట్లాది రూపాయల సంపాదన రాజకీయ దళారుల చేతుల్లోకి చేరుతుంది. నదిలో పొట్టకూటికోసం  చేపలు పట్టేవారు నేరస్తుడైనాడు. ఆర్థిక వనరుగా నదిని మార్చిన దళారీ మనుషులు . నది సాగునీటి, తాగునీటి కోసం కాదు, ఈ బహుళ జాతి సంస్థలకు వనరుగా  మారింది.

 గంగానది పూడిక తీయడం కాలం చెల్లిన మాట. గంగా నదిలో అనేక శవాల గుంపు , శిలాజాల రాశి ఉంటుంది. ఒకవేళ  పూడిక తీసినా మానవ కళేబరాలు బయటపడతాయి. అవి పదుల సంఖ్యలో ఉండవు. వేలాదిగా ఉంటాయి. కుంభమేళాలో స్నానం ఆచరించినవారు తమ ముందటి హనన చరిత్రను జ్ఞాపకం చేసుకోరు. పాప ప్రక్షాళన  వారి ధ్యేయం .ఇదే ఈదేశ ఆధ్యాత్మికత పరిధి. భావవాద స్వప్నాలను నదులు సాకారం చేస్తాయని జనం విశ్వాసం.

 మరుసటి  కుంభమేళాకు ధార్మిక మనుషులు తయారుగా ఉంటారు. ఆ కాలానికి అయినా నూతన భారతదేశం ఏర్పడాలి. రంగు, వర్గం లేని మనుషులు  నిత్యం సంభాషించగల మనుషులు నదిని ఒక ప్రకృతి వనరుగా చూసి దాని చుట్టూ ఒక ప్రజాస్వామిక సంస్కృతిని రూపొందించుకునే నూతనతరం ఆవిర్భవిస్తే జీవనదులు ప్రవహించనంత మేరా వికాసమే. నది నుండి మానవులు  పొందే మేలు అదే . 

25-2-25

Leave a Reply