చరిత్ర మళ్లీ మొదటికే వచ్చింది. తెలంగాణలో మళ్ళీ ఎనకౌంటర్లు మొదలయ్యాయి. మూడేళ్ళ తరువాత మళ్ళీ తెలంగాణ నేల విప్లవకారుల రక్తంతో తడిసింది. జూలై 25న దామరతోగు  అడువుల్లో జరిగిన కాల్పులలో నలమారి అశోక్‌ అలియాస్‌ విజేందర్‌ చనిపోయినట్టు పోలీసులు ప్రకటించారు. మరొక వైపు అనారోగ్యంతో ఉన్న అశెక్‌ను  పట్టుకుని చంపివేసినట్టు విప్లవ పార్టీ ప్రకటించింది. వీటిలో వాస్తవాలు ఏవైనా.. ఎన్‌కౌంటర్ల పట్ల తెలంగాణ ప్రభుత్వ వైఖరి ఏమిటని తేలాల్సి ఉన్నది.   ప్రజాస్వామిక వాదులు, తెలంగాణ సమాజం  ప్రభుత్వాన్ని అడగవల్సిన ప్రశ్న ఇది. ఒక్క ఎన్‌కౌంటర్‌కే ఇలా అడగవచ్చునా? అనేవాళ్లు కూడా ఉంటారు.  కానీ ఇది ఇక్కడితో ఆగే వ్యవహారం కాదు. గతం తెలిసిన వాళ్లెవరికైనా ఇది  తెలిసిన విషయమే.

జూలై 4 న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కేంద్ర హోంశాఖ మంత్రి  అమిత్‌షాను కలిశారు. ఈ కలియకలో తెలంగాణలో చర్ల  మండలం కొండవాయి,  వెంకటాపురం మండలం అలుబాక దగ్గర క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరారు. వీటి సరిహద్దులోనే  దామరతోగు ఎన్‌కౌంటర్‌ జరగింది. అలాగే ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లాను తిరిగి మావోయిస్టు ప్రభావిత జిల్లాగా మార్చాలని అడిగారు. అందులో ఇప్పుడు మూడు జిల్లాలు ఉన్నాయి. అక్కడ కూడా క్యాంపులు ఏర్పాటు చేయాలని అడిగారు. క్యాంపులు రావడం అంటే అక్కడి ప్రజలు అక్కడి నుండి వెళ్లగొట్టబడటమే.

ఇప్పటికే క్యాంపులు ఉన్న ఛత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్రలాంటి చోట్ల నుండి వస్తున్న వార్తలు చూస్తూనే ఉన్నాం. అక్కడి జరుగుతున్న హింస గురించి తెలుగు సమాజం  మాట్లాడుతూనే ఉంది. ఛత్తీస్‌ఘడ్‌  కాంగ్రెస్‌ కమిటీ నాయకులే క్యాంపుల వల్ల జరుగుతున్న హింస గురించి   హైదరాబాద్‌లో కూడా మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే. విచిత్రంగా ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏమో తెలంగాణలో క్యాంపులు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని  అడుగుతున్నది. ఇది మావోయిస్టుల సమస్యగా రేవంత్‌ రెడ్డి చెబుతున్నాడు. కానీ ఇది అంతా కార్పొరేటీకరణ కోసం జరుగతున్న విషయంగా అందరికీ తెలిసిన విషయమే. సింగరేణి ప్రవేటీకరణను  కాంగ్రెస్‌ ప్రభుత్వం అడ్డుకోకపోగా ముందుకు తీసికెళుతోంది. దానిని గత బిఆర్‌ఎస్‌  పాలన వ్యవహారంగా చెప్పి తప్పుకోవాలని చూస్తున్నది.   మరో వైపు అదే ప్రాంతాన్ని తిరిగి మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించాలని సీఎం కోరాడు. ఆ ప్రాంతంలో గతంలో సింగరేణి కార్మిక సమాఖ్యలో పని చేసి, అరెస్టయి విడుదలయ్యాక ఇంటి వద్ద ఉన్న విప్లవ  రచయిత హుస్సేన్‌ను పాత తప్పుడు కేసులో అరెస్టు చేసి జైలుపాలు చేసింది. విప్లవకారులను చంపేయడం, ప్రజాసమస్యల మీద మాట్లాడే, రాసే రచయితలను, మేధావులను అరెస్టు చేయడం కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానమని తేలిపోయింది. ఈ విషయంలో అనుమానాలు ఉన్న వాళ్లకు నివృత్తి చేస్తూ కాంగ్రెస్‌ తన పాత విధానాన్ని మరోసారి రుజువు చేసుకున్నది. 

తెలంగాణలో  ఉన్న అసమానత వల్లే  తెలంగాణ బిడ్డలు ఉద్యమంలోకీ వెళ్ళి పోరాడుతున్నారు అని రేవంత్‌ రెడ్డి మాట్లాడాడు. తెలంగాణలో బీఆరేఎస్‌ పదేళ్ళ పాలన కాలంలో  ప్రజాస్వామ్యం కాలరాయబడిరది అని కూడా రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించాడు. తాము అధికారమంలోకి వస్తే అలాంటి పరిస్థితులు ఉండవని ప్రకటించాడు. ఎలెక్షన్‌ మేనిఫెస్టోలో ప్రకటించని ఏడో హామీగా తెలంగాణలో  ప్రజాస్వామ్యాన్ని పునరిద్ధరిస్తానని చెప్పాడు.      

గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు గతం కంటే కాస్త భిన్నమైనవి. తెలంగాణలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్ల,  కాంగ్రెస్‌ ఇచ్చిన  హామీల వల్ల ఎన్నికల ఫలితాల్లో మార్పు వచ్చిందనే వాళ్లు చాలా మంది ఉన్నారు. దీని వల్లే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందనుకోవడం పొరపాటు. దీని వెనుక భిన్న దృక్పథాలుగల ప్రజస్వామికవాదులు, మేధావులు, ఉద్యమకారుల కృషి ఉన్నది. ఫాసిస్టు వ్యతిరేక పోరాట క్రమంలో   అనేక మంది కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు తెలిపారు. ఇలా భిన్నమైన మనుషుల కలయికతో తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగలిగింది. వీటన్నిటికంటే కూడా  తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక  ఆకాంక్షలు, స్వేచ్ఛా భావన గట్టిగా పనిచేశాయి. అందువల్లనే ప్రజస్వామ్య పునరుద్ధరణ అనే హామీ రేవంత్‌రెడ్డి ఇవ్వాల్సి వచ్చింది.            

ఇలాంటి ప్రత్యేక పరిస్థితిలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ గత బీఆర్‌ఎస్‌కన్నా, కాంగ్రెస్‌కే ఉన్న సుదీర్ఘమైన దోపిడీ అణచివేతల చరిత్ర కన్నా కాస్త భిన్నంగా రేవంత్‌రెడ్డి పాలన ఉంటుందని ఆశించారు. దేశంలో ముంచుకొస్తున్న హిందుత్వ ప్రమాదం వల్ల కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్ల కొంత ఉదారవాద వైఖరి తీసుకోవాలని మేధో వర్గం భావించింది. దేశంలో   బీజేపీ వ్యతిరేక రాష్ట్ర ప్రభుత్వాలు కొన్నయినా ఉండాలని వీరంతా భావించారు. అందువల్ల కొన్ని విషయాల్లో ప్రభుత్వ నిర్ణయాల పట్ల ఉదాసీనంగా ఉన్నారు. ఈ వైఖరి ఫాసిస్టు వ్యతిరేక పోరాటానికి అవసరం అని అనుకుంటున్నారు. 

బిజెపి వ్యతిరేక ప్రభుత్వాల మనుగడ  నేటి స్థితిలో కచ్చితంగా అవసరమే. అయితే ఈ అసమ సమాజంలో ప్రభుత్వమన్నాక ప్రభుత్వమే. బీజేపీ యేతర ప్రభుత్వానికైనా   రాజ్య స్వభావం తప్పక ఉంటుంది. అణచివేత, దోపిడీ విధానాలు దాని సహజ లక్షణాలు. సింగరేణి ప్రైవేటీకరణ వంటి కార్పొరేట్‌ విధానాలు, పోరాటశక్తుల మీద అణచివేత అనేవి కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగించేవే. ఆ పార్టీ గత చరిత్ర ఇట్లాగే ఉన్నదనే సంగతి మర్చిపోడానికి లేదు. ఇలాంటి బీజేపీ యేతర ప్రభుత్వ విధానాల మీద విమర్శ పెట్టకుండా, పాలకులకు  నొప్పి కలిగించకుండా వ్యవహరించాలని ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు మద్దతు తెలిపిన వారు ఆలోచించాలి. అంతగా కాంగ్రెస్‌ ప్రభుత్వపు విధానాలతో ఏకీభవించి మౌనం పాటించం అవసరమా? అని కూడా పరిశీలించుకోవాలి. 

One thought on “తెలంగాణలో మళ్లీ ఎన్‌కౌంటర్లు

Leave a Reply