సంఘటనాత్మక కవిత్వం అంటే సమకాలీనంలో జరిగిన విషయాలపై కవిత్వం రాయటం అనే కురచ అర్థంలోకి మార్చారేమో అనిపిస్తుంది. ఒక జీవితకాల వస్తువుని తీసుకొని దాన్ని సంఘటనలతో పెనుకుంటూ పోవటం సంఘటనాత్మక కవిత్వం అని అనిపిస్తుంది.

కవి తనకు ఎదురైన అనుభవాల్ని, చూసిన మనుషుల జీవితాలని ఒక వరుస ప్రకారం చెప్పుకుంటూ పోతాడు. దీనిని జీవితచరిత్రాకథనం అనవచ్చునేమో…

ఇలా చెప్పుకుంటూ పోయే కవిత్వాన్ని చూసినప్పుడు ఇందులో ఉపమలు తప్పా ఏమున్నాయి, కవిత్వం కాదు అనే వాళ్ళు, అనుకునే వాళ్ళు, లేకపోతే భ్రమించే వాళ్ళు ఉండవచ్చు.

ఇటువంటి కవిత్వం రాయటానికి కవి ఎంచుకునే ప్రధాన మార్గం తనవైన అనుభవాలను.

అందుకే కవి తను చెప్పే వ్యక్తుల జీవితాలకి సంభందించిన సంఘటనలను కథనాత్మకంగా చెప్పటానికి ప్రయత్నిస్తాడు.

ఈ కవిత్వం కూడా అలా సాగిందే.

నీలిక, దాసుని చూడాలి, నల్లతల్లి, నాన్న వంటి కవితలన్నీ కవి సొంత అనుభవంతో రాసినవిగానే తెలుస్తాయి. అందుకే వీటిలో కథనాత్మక శైలి ఉంటుంది.  ఇలా వ్యక్తుల గురించి, అనుభవాల గురించి పెద్దగా రాసే కవిత్వంలో కవిత్వశిల్పం దెబ్బ తినవచ్చు అని కూడా భావించవచ్చు. కానీ కవి తను చెప్పే విషయాలని చదివే పాఠకుడిలో గాఢంగా ముద్ర వేయటానికి చాలా ముఖ్యమైన అనుభవాలనే ఎంచుకుంటాడని మనం మర్చిపోవచ్చు. ఇక్కడ అనుభవాన్ని చిత్రిక పట్టి కవిత్వంగా ఆయా అనుభవాల గురించి మనకు ఎక్కించటంలోనే కవిత్వ శిల్పం ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఇక దళిత, అస్తిత్వవాద నేపథ్య కవిత్వంలో ఈ శిల్పం మరింత ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. దానికి కారణం బలమైన రాజకీయ కోణం.

కవి రాజకీయ దృక్పథంతో రాసేటప్పుడు కవిత్వ శిల్పం దెబ్బతినటమే కాకుండా, దాని గాఢత దెబ్బతిని పలచబారి పోతుందని, కవిత్వం ఒక కరపత్రంగా, రాజకీయ ప్రకటనగా మారిపోయే ప్రమాదం ఉందని అనుకోవచ్చు. ఇది నిజమే. మనకు మార్క్సిస్ట్ సాహిత్యం చాలా వరకూ పేలవంగా తెలిపోవటానికి కూడా ఇదే కారణం. అందుకే ఇస్మాయిల్ ఆనాటి ప్రచార, కరపత్ర కవిత్వానికి వ్యతిరేకంగా చాలా వ్యాసాలు రాశారు. శ్రీ శ్రీ మహాప్రస్థానం కవిత్వం కాదని, ఆయన ప్రభవలోనే మంచి కవిత్వం ఉందని తేల్చి చెప్పారు. ఇంకా ఒకడుగు ముందుకు వేసి, రాజకీయ కోణంలో మహాకవిగా ఎంచుతున్న రష్యన్ కవి మయకోవస్కీ కమ్యునిస్ట్ కాకముందు గొప్ప కవిత్వం రాశాడని, ఆయన కమ్యునిస్ట్ అయ్యాక కవిత్వం తేలిపోయిందని అన్నాడు. దీనిని ఎవరు అంగీకరించినా లేకపోయినా ఇందులో నిజం లేకపోలేదు.

అయితే అసలు ప్రచార కవిత్వం తెలుగులో ఎప్పుడు మొదలైంది అనుకున్నప్పుడు మనం చారిత్రకంగా అనేక సమాధానాలు చెప్పుకున్నా స్పష్టంగా భావ కవిత్వం నుంచే మొదలైంది అనుకోవచ్చు. భావకవిత్వం మార్క్సిస్ట్ సాహిత్యంలా పూర్తిగా మసకబారి పోకుండానే మార్క్సిస్ట్ లు రంగ ప్రవేశం చేశారు. అప్పటికీ భావకవులం అని గూడలు ఎగరేసిన వాళ్ళు లేకపోలేదు. భావ కవిత్వం ఒక విషయానికి (అమలిన శృంగారం. ఇది సంప్రదాయ శృంగార కవిత్వానికి వ్యతిరేకంగా వచ్చింది. సంప్రదాయ శృంగార కవిత్వం మూర్తి వర్ణనతో నిండి ఉంటే, భావకవిత్వం అమూర్త వర్ణనతో నిండి ఉంటుంది) ప్రచారంగా వచ్చినా గాఢమైన కవిత్వాన్ని తీసుకువచ్చింది. అందుకే ఇస్మాయిల్ అంటారు: శ్రీశ్రీ భావకవిత్వంలో నుంచి పుట్టిన మహావృక్షమే అని.

అంటే ప్రచారంతో పాటు, పాతతనం మీద వ్యతిరేకతతో పాటు, అనుభూతి చెందే కవిత్వం ఉంది. అలా భావకవిత్వం తర్వాత దళిత, అస్తిత్వవాద కవిత్వం ఆ పని చేసింది.

భావ కవులకు ఊహాప్రేమ నేపథ్యం అయితే దళిత, అస్తిత్వవాద కవులకు తమ జీవితాలే నేపథ్యం. వీళ్ళు కూడా సాంప్రదాయ కులవ్యవస్థ మీద తిరుగుబాటుగా కవిత్వాన్ని ప్రచారానికి వాడుకున్నారు. అయితే ఇందులో మార్క్సిస్ట్ కవిత్వంలాగా పల్చబడి పోకుండా ఉండటానికి కారణం వారి కవిత్వంలోని చిత్రిక పట్టిన అనుభవ సంఘటనలే. వీరు కుల వ్యవస్థ గురించి వ్యతిరేకించటానికి కేవలం వారి జీవిత అనుభవాలనే చెప్తే చాలనే స్పృహ ఉంది. అందుకే ఈ కవిత్వంలో రాజకీయ కోణం ఉన్నా, కవిత్వ గాఢత తగ్గకుండా ఉంది.

ఈ కవిత్వానికి ఉన్న ప్రత్యేకశైలి కథనాత్మక శైలి అన్నప్పుడు, శ్రీ శ్రీ రాసిన కొంపెల్ల జనార్ధన్ కవిత, తిలక్ గొంగళి పురుగు, సైనికుడి ఉత్తరం, నెహ్రూ కవితలు ఉన్నాయి కదా, అవీ ఈ విధంగానే సాగాయి అనవచ్చు. శ్రీ శ్రీ కొంపెల్ల కవిత, తిలక్ నెహ్రూ కవిత స్మృతీ కవితలు అని మనకు తెలుసు. తిలక్ గొంగళి పురుగు, సైనికుడి ఉత్తరం స్మృతీ కవితలు కాకపోయినా అవి కేవలం ఆ సంఘటనల మీద మనకు ఒక ఆర్ద్రత కలగాలనే ఉద్దేశ్యంతో మాత్రమే కవి రాస్తాడు. గొంగళి పురుగు కవితలో ఆర్ద్రత ఉండదు మధ్య తరగతి జీవి ఉట్టి చాతగాని తనాన్ని,అస్సహాయతను చాటుతాడు అంతే.

దళిత, అస్తిత్వవాద కవిత్వం అనుభవ రూపకమై వ్యక్తుల జీవిత చరిత్రలలాగున్నా అది స్మృతీ కవిత్వం ఏ మాత్రం కాదు. అందులో ఒక తిరుగుబాటు తనం ఉంటుంది. అతను జీవితాన్ని చూపించి కవిత్వాన్ని చెబుతాడు. ఇవి సమాజం పొట్టని,సిద్ధాంత జ్ఞానంతో కాకుండా అనుభవతనంతో చీల్చి చూపిస్తాడు. ఈ పని మద్దూరి కవిత్వంలో నిండుగా కనిపిస్తుంది. కలేకూరి చాలా వరకూ రాజకీయ నినాదాలు ఇస్తాడు. కానీ ఆయనది కవిత్వం చెడని రాజకీయ ఆగ్రహ ప్రకటన.

ఎండ్లూరి సుధాకర్, మద్దూరి, కలేకూరి కలిసిన కవిలా కనిపిస్తాడు. వాళ్ళ ప్రభావం గురించి కాదు నేను చెబుతుంది. మద్దూరి ఆవేశపూరితుడు అయినా కవిత్వంలో ఆవేదన నిండుకొని ఉంటుంది. కలేకూరి రాజకీయ కవే ప్రధానంగా. ఈ రెండు విషయాలను కలిగిన కవి ఎండ్లూరి అనటానికి కారణం ఆయన చూపు రాజకీయం వైపు మళ్లి ఉండి, దానిని చెప్పేటప్పటికీ ఆవేదన కూడా తోడవుతుంది. దీనికి పైన చెప్పిన ‘నల్లతల్లి’ కవితను గమనించవచ్చు. అలా అని ఆ ఒక్క కవితతో అంచనా కట్టి ఈ మాట చెప్తున్నాను అని కాదు. ఆయన కవిత్వాన్ని జాగ్రత్తగా గమనించిన ఎవరైనా దీనిని తెలుసుకోవచ్చు.

Leave a Reply