పాణి రాసిన శికారి నవలలో నన్ను అమితంగా మెప్పించిన పాత్ర, నాకు నచ్చిన పాత్ర గుమ్లి. ఏ వర్గంలో అయినా స్త్రీలు సమాజ కట్టుబాట్లకు తల వంచక తప్పదేమో అని గుమ్లి పాత్ర ద్వారా నాకు అనిపించింది. భర్త ఎలాంటి వాడైనా పిల్లల కోసం స్త్రీ జీవన పోరాటం చేయక తప్పడం లేదు. ఇది ఈ సమాజంలో స్త్రీల స్థానాన్ని తెలియజేస్తుంది.
గుమ్లి భర్త డొక్కోడు రెండో పెళ్లికి చెల్లించే కట్నం కూడా తానే ఇవ్వాల్సి వస్తుందేమో అని ఆమె అనుకుంటుంది. అప్పుడు భర్త రెండో పెళ్లికంటే దానికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వాల్సి వస్తుందనుకున్నప్పుడు గుమ్లి పడిన వేదిన వర్ణనాతీతం. చివరగా గుమ్లి తన తెగ ఆచారాలకు లొంగిపోతుంది. బళ్లారి పున్నమినాడు తన సవతి రానూతో కలిసి పండుగ జరుపుకోవడం ఆశ్చర్యకరం.
ఈ నవలలో మరో పాత్ర శాము. వేట, సారాయి కాచడం వృత్తులుగా ఉన్న శికారీల జీవితంలో సారాయి కాయలేని పరిస్థితుల్లో తన తెగలో ధైర్యసాహసాలను నింపిన వ్యక్తి శాము. ఒక రాజకీయ నాయకుడి అన్యాయానికి బలైపోతాడు. ఇది నవలలో చాలా బాధ కలిగించే విషయం. ఇక నానా అనే వృద్ధుడి పాత్ర ఒకటి ఈ నవలలో ఉంది. నానా తన జాతి పూర్వాపరాలు చెప్తూ ఉంటాడు. అప్పుడు ఆయన పడిన వేదనకు మనం కూడా అతీతులం కాదనిపిస్తుంది.
మరో పాత్ర లీల. ఎంతో నేర్పు, ఓర్పుగల స్త్రీగా శికారీ మహిళలను అర్థం చేసుకోడానికి లీల దారి చూపుతుంది. డొక్కోడ తన చెల్లెలు వరసైన అనరను దళితుడు పెళ్లి చేసుకున్నందుకు శికారీలు దూరం పెడతారు. ఆమెకు ఆపద వచ్చినప్పుడు డొక్కోడు ముట్టుకొని సాయం చేస్తాడు. కట్టుబాట్లను ఉల్లంఘించినందుకు కుల పెద్దలు ఏ శిక్ష విధిస్తారో అని భయపడిపోతాడు. అది మనల్ని కదిలిస్తుంది.
ఇలాంటి ఆచారాలు, కట్టుబాట్లు శికారీలలో చాలా ఉన్నాయి. ఏ జాతి, తెగ, కులం, మతాన్నయినా ఇలాంటి ఆచారాలు ముందుకు పోనివ్వవు. అంధకారంలోకి తోస్తాయి. మానవత్వాన్ని, అభివృద్ధిని దెబ్బతీస్తాయి. సంద్రాయాలేవీ మనుషుల స్వేచ్ఛకు అడ్డంపడకూడదు. అలాంటి ఆచారాలను పాటించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం.
ఈ నవల చదువుతున్నంత సేపు తప్పనిసరిగా వీలు దొరికితే కర్నూలు వెళ్లి కేసీ కెనాలు పక్కన ఉన్న శికారీల దగ్గరికి పోవాలనిపించింది.
నవల చివరిలో ఉన్న పాఠకుడి నోట్స్ ప్రకారం ఈ నవలా కాలం 2003 వరకు శికారీల జీవితాన్ని ఈ నవల చిత్రించింది. మరి ఈ ఇరవై ఏళ్ల కాలంలో వారి జీవితాల్లో వచ్చిన మార్పులను రచయిత మరో నవలగా రాయాలసి ఆశిస్తున్నాను.