‘మనిషే మనిషిని చంపుకు తినే ఈ లోకం ఎంతకాలం మనగలదు’

‘మూర్ఖుడా యుద్దాతో దేశాల్ని కొల్లగొట్టగలవేమో సరిహద్దుల్ని జరపగలవేమో మహా అయితే ఇంకో విస్తీర్ణాన్ని నీ కాలి కింద తొక్కి పట్టగలవ్‌ జనం హృదయాలనైతే గెలవలేవు’

‘ప్రేమను పంచడం కంటే మరో మతం లేదు’

‘చివరగా యుద్దం సమస్త జీవరాశిని చంపుతుంది’

…ఇటువంటి కవితావాక్యాలతో పాలస్తీనా`ఇజ్రాయిల్‌  యుద్దానికి వ్యతిరేకంగా..సామ్రాజ్యవాదాన్ని నిరసిస్తూ వచ్చిన కవిత్వమే ఈ గాజాలేని జాగా..ఇప్పుడు దేశాలకు దేశాలు శ్మశానాలౌతున్నాయి. నిత్యం నెత్తుటితో తడుస్తున్నాయి. గాయపడ్డ నేల కాదది..చంపబడ్డ నేల..చెరచబడ్డ నేల..పసికందులని కనికరం లేకుండా బుల్లెట్ల వర్షం కురుస్తున్న నేల..ఇప్పటికీ ఎటుచూసినా దేహాన్ని తెంచుకుని విసిరేయబడ్డ అవయవాలు, వీధులన్నీ నెత్తుటి ప్రవాహాలు, తల్లీ దండ్రుల్ని కోల్పోయి అనాధలైన పసిపిల్లల ఆర్తనాదాలు, గుట్టలు గుట్టలుగా శవాల దిబ్బలు, మారణహోమమంటే ఇలా ఉంటుందని చెప్పే భయానకదృశ్యాలు పాలస్తీనా ప్రాంతంలో ప్రతి అడుగులో కనబడతాయి. కళింగయుద్దంలో నెత్తురు ఏరులై పారిందని చరిత్ర చదివితేనే తెలిసింది. ఇక్కడ మాత్రం నిరంతరం దేశం నిండా నెత్తుటినదులే ప్రవహిస్తున్నాయి. నేలంతా నెత్తుటితోనే తడిసిపోయింది. రక్తమారని పాలస్తీనా నేల నిండా తెగిపడ్డ మానవ అవయవాలే..కన్నీళ్ళన్నీ ఇంకిపోయి, నేత్రాల్లోంచి రుధిరధారలే ప్రవహిస్తున్నాయి. ఇప్పుడది అంతంలేని యుద్దంలా కనబడుతుంది. సూర్యోదయమైనా, సూర్యస్తమయమైనా కాలం తెలియక బిక్కుబిక్కుమని గడుపుతున్న నేల. ప్రపంచంలోని నేతలందరూ చేసే శాంతివచనాలనెవరూ పట్టించుకోవడం లేదు. వారి మాటలు పతాకశీర్షికలకే పరిమితమౌతున్నాయి. ఇప్పటికీ కొనసాగుతున్న దారుణకాండ గూర్చి ‘గాజా లేని జాగా’ దీర్ఘకవిత్వాన్ని ఇటీవల రత్నాజీ నేలపూరి రాశారు.

ఈ కవిని దళితకవిగా ముద్రేసి కట్టిపడేయడం నచ్చలేదు. ప్రాపంచిక దృక్పథంతో ఈ దీర్ఘకవిత రాశారు. కవి విశ్వమానవుడని ఊరికే అనలేదు. ఈ కవిత్వానికి ముందుమాట రాసిన అఫ్సర్‌ ‘‘గాజా గూర్చి ఎంతమంది తెలుగు మేధావులు ఎన్ని రాసినా, సాహిత్యజీవుల నుంచి సరయిన స్పందన లేదని నాఫిర్యాదు. ప్రపంచమంతా పనులన్నీ ప్రక్కన పెట్టి, ఈ అన్యాయాన్ని గురించి గొంతెత్తుతున్న సమయంలో కూడా తెలుగు కవులో రచయితకు ఇది పెద్దగా పట్టలేదు. తనదైన ఒక కుటీరంలో తెలుగుకవి ముణుక్కొని కూర్చొని వున్నాడు.’’  అంటాడు. నిజంగా  తెలుగు సాహిత్యసమాజం నుంచి ఆశించినంత కవిత్వం రాలేదనే చెప్పవచ్చు. మనకేదిపట్టనుట్లుండటం మరింత దుర్మార్గమే. రత్నాజీ కవిత్వం చదువుతున్నంతసేపూ ఆయన గాజా నేలలో నడయాడి ప్రత్యక్షంగా ఆ బాధలు చూసినట్లు..అనుభవించినట్లున్నాడనే భావన కలిగేలా కన్నీటి పర్యంతమయ్యేలా రాశాడు.

ప్రపంచాన్ని దివ్యాంగం చేశావు/ఆరడుగుల నేల కూడా/నీసొంతం కాదని తెలిసి/కుబ్జావై కబ్జాలు నేర్చావు అంటాడు.  ఈ కవి రాసిని ఈ కవిత్వం చదివినపుడు బైబిల్‌పై పూర్తి అవగాహన వుందని తెలుస్తుంది. బైబిల్‌ ప్రకారం సృష్టి అరంభం ఆదాము అవ్వలతోనే అని తెలిసిందే. తను బైబిల్‌లోని అనేక మంది పాత్రలను ఉటంకిస్తూనే డార్విన్‌ సిద్దాంతాన్ని, శాస్త్రీయ పరిశోధనల యుద్దతంత్రాలకు సమ్మిళితం చేసి కవిత్వ నడక సాగిస్తాడు. కోరికగా కొరికి తిన్న జ్ఞానఫలంతో/ తెరుచుకున్ని చక్షువుల నాలిక రుచి మొగ్గలు/షడ్రుచుల పరుగులో /విచక్షణ మరచి/లిటిల్‌ బోయ్‌ల విధ్వంసాన్ని రుచిస్తున్నాయి. కవిత్వాన్ని గాఢతగా రాశాడీకవి. కవిత్వంలో ఆక్రోషం, బాధ, సానుభూతి, జీవనదిలా ప్రవహించే కన్నీళ్ళు కనబడతాయి.

కలతపడ్డ కన్నులు/ మాగన్నుగా నిద్రపడుతున్నప్పుడు/ పక్కలో పిడుగు భగ్గుమన్న భూగోళం గది/ఎక్కడ్నుంచో ఎగిరొచ్చిన/లోహపక్షి రెక్కల్లోంచి/సూపర్సానిక్‌ పెలోడ్‌ శబ్దం/ మా తలలపై ఉరిమింది/వేటకుక్కల్లా తరుముతోంది/ఒరిగిన మా జెండాఛాయను/మళ్ళీ మళ్ళీ నిలబెట్టుకుని/ఈ పోరుగడ్డమీదే పదేపదే బొడ్డుపేగు తెంచుకు పుడతాం/ఈ దేశానికి నా నేలకు పరాధీనం చేసే పన్నగ మీద తాండవమాడి తరిమికొడతాం.

ఎంతటి ధిక్కారస్వరంతో రాస్తాడీకవి. ఆ నేలలో పుట్టిన మనిషి ఆ నేలలోనే బతకాలని, ఆ నేలలోనే చావైనా గెలుపైనా అన్న ఆశని బతికిస్తాడు. తన దేశం మీదకెవరు వచ్చినా కుట్రలు, పన్నాగాలు పన్నినా తరిమికొడతామని చెబటం గొప్ప ఆశావాహదృక్పథం. ఈ కవిత్వం నిండా నిరసనలే ఇజ్రాయిల్‌ సాగిస్తున్న అరాచకాలను ఆ దేశానికి వత్తాసు పలికే అగ్రదేశాలను, అవి సాగిస్తున్న సామ్రాజ్యవాద కాంక్షను యుద్దోన్మాదాన్ని ఈ దీర్ఘకవితలో పదనైనకవితావాక్యాలతో అక్షరీకరించారు.

మొన్నటివరకు గాజా స్ట్రిప్‌లో రద్దీగా ఉండే తీరంలో అల్‌-మవాసి అరుదైన అందాల ప్రదేశం. ఖాన్‌ యూనిస్‌ మరియు రఫా మధ్య సుమారు 12 కిమీ విస్తరించి ఉంది. ఇది బంగారు ఇసుక దిబ్బలతో అత్యంత అద్భుతమైన బీచ్‌ ప్రాంతాలలో ఒకటి. దాని అందమైన ప్రకృతి దృశ్యం, ఉత్కంఠభరితమైన సూర్యాస్తమయాలు మరియు ప్రశాంతమైన సముద్రపు గాలి కుటుంబాలకు ఇది ఒక ప్రసిద్ధ ప్రదేశం. కానీ అల్‌-మవాసి, ప్రశాంతమైన బీచ్‌ స్పాట్‌ ఇప్పుడు లేదు. ఇజ్రాయెల్‌ యొక్క మారణహోమం దానిని వినోద ప్రదేశం నుండి అంతులేని భయానక ప్రాంతంగా మార్చింది.గాజాలో నేటికి కురుస్తున్నక్షపణుల వాన చేస్తున్న విధ్వంసం చూస్తుంటే దాడులు సడలించే సంకేతాలను లేదనే తెలుస్తుంది. గాజాలోని ప్రతి భాగాన్ని లక్ష్యంగా చేసుకుని యుద్దం చేస్తున్నారు.ముఖ్యంగా, అల్‌-మవాసి జోన్‌లో భారీ వైమానిక బాంబు దాడి జరిగడంలో  గాజా ప్రాంతం రక్తసిక్తమైంది. ఇదంతా ఎందుకు చేస్తున్నట్లు..! ఏం సాధించాలని..!!మానవత్వాన్ని మరిపించే మతమెందుకనే ప్రశ్న ఉత్పన్నమౌతుంది. పాలస్తీనా దేశమంతా యుద్దం విస్తరించి బాంబుల మోతతో ప్రాణాలు తీస్తూనే వుంది. కవి గాజాను మాత్రమే ఎన్నుకోవడానికి ఎక్కువ శిరస్సులు చిద్రమైన నేలఅది.

ఇవి మతం ముచ్చు తోడేళ్ళు/ఎవడి భూమిలో/ ఎవడు గొయ్యి తవ్వి/మందుపాతరలేసి ఎవర్ని ఎవరు/ శిథిల రోధనల కింద/ పాతుకుంటున్నారో/ ఏ దేశమైనా సరే యుద్ద శిబిరాల్లో / ఆడదాని అంగాలే ఛిద్రమవ్వాలా!?/ పసిపిలల్ల మెదళ్ళే పేలిపోవాలా??/ నువ్‌ ఇశ్రాయేలీయుడవైతే ఏంటి/ పాలస్తీనా పౌరుడవైతే ఏంటి/చంపేది చంపుతున్నది చచ్చేది/ ఆ మనిషే కదా జీవవాయు ఊదిన/దేవుడు పోలికని పోల్చుకున్నది నువ్వేకదా

ఇప్పుడు తోడేళ్ళు మాత్రం ముమ్మాటికీ అమెరికా, బ్రిటన్‌, ఇజ్రాయిల్‌లతో పాటు సామ్రాజ్యవాదానికి వత్తాసు పలుకుతున్న దేశాలు. ఒక దేశాన్నే నేలమట్టడం చేయడానికి ఇన్ని చేతులు కలవాలా, ఇన్ని దుష్టపన్నాగాలు, ఇన్ని కుతంత్రాలు పన్నాలా? సోలోమోన్‌ చెప్పాడా..తను నిర్మించిన దేవాలయాన్ని పున:ప్రతిష్టిచమని..ఆయా దేవాలయాలను ధ్వంసం చేసిన బాబిలియోన్లు, రోమన్లు  చేసిన చారిత్రకతప్పు ఇజ్రాయిల్‌ కూడా చేస్తుందనిపిస్తుంది. వాళ్ళు దేవాలయాలను మాత్రమే ధ్వంసం చేశారు. మరి వీళ్ళు గాజానొక్కటే కాదు పాలస్తీనా భూభాగాన్నంతా భౌగోళిక చిత్రపటంలో లేకుండా చేసి నెత్తుటితో తడిసిన ఆ నేలపై లక్షల గొంతుకలు ఆఖరిశ్వాసను వదిలిన ఆ నేలపై సామ్రాజ్యవాదం అజేయమనే జండాను ఎగరేయాలని  చూస్తున్నారు. యుద్దం వల్ల ఆరడుగుల నేల కూడా ఎవ్వరికీ ఉండదని విషయాన్ని యుద్దానికి యుద్దోన్మాదానికి కాలు దువ్వుతున్న ప్రతి దేశమూ తెలుసుకోవాలి. 

అందుకే రత్నాజీ..

నా మనిషితనం ఏ మతం మీదైనా/తిరగబడమనే చెబుతుంది/ రక్తపాతమే మతం అభిమతమైతే/ మనుషుల చావులతోనే/ దాని ఆకలి తీరుతుందనేది /నిజమైతే/ ఆ మతం పులిని మట్టుబెట్టడానికి/ ఆ దేవుణ్ణి శిక్షించితీరతాను. కవికి ఎంత కవితావేశం ఉందో చూడండి. కవితావేశం నిప్పుకణికల్లా ప్రతి కవితావాక్యంలో ప్రవహిస్తోంది.

బెంజిమన్‌ నెతన్యాహు సాగిస్తున్న యుద్దానికి ఏడాది కావస్తున్నా ముగింపు లేదు. గాజా నేలమట్టమైనా ఇజ్రాయిల్‌ నెత్తుటి దాహం తీరలేదు. పాలస్తీనా భౌగోళిక ముణచిత్రం చిద్రమై తన స్వరూపాన్ని కోల్పోయినా భూభాగం నిండా క్షిపణులు, రాకెట్లు విరచుకుపడుతూనే ఉన్నాయి. మనిషిని చంపే హక్కు ఎవరిచ్చారు. మనిషిని చంపమని ఏ బైబిల్‌ బోధించింది, ఏ ఖురాన్‌ చెప్పింది. ముప్పై రెండు వేల మంది ప్రవక్తలు బోధించని హింసను వీళ్ళు మాత్రమే ఎందుకు చేస్తున్నట్లు..?

అందుకే కవి ఈ దీర్ఘకావ్యంలో ‘‘ప్రాణం పోయలేనివాడికి/ ప్రాణం తీసే హక్కు ఎవడిచ్చాడు’’ అంటాడు. నిజమే కదా..? ఇంకో బలమైన మాట చెప్పాతీ కవి ‘‘వాడు అమెరికా సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ చెట్టు చాటు నుండి అమాయక జనాలపైకి బాంబుల మోతతో విరచుకుపడుతున్నాడు.’’ ఇజ్రాయిల్‌ ఎవరి బలంతో..ఎవరి ప్రోద్భలంతో ఈ దుర్నీతి యుద్దం చేస్తుందో తెలుస్తుంది కదా..యుద్దం ఎవరి చేసినా..ఎందుకోసం చేసినా ఆ దేశపు సామాన్య పౌరులు, పిల్లలు, మహిళలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో ఎందరో బలౌతారు. ఐక్యరాజ్యసమితిలాంటి అంతర్జాతీయ సంస్థలు ఆయా దేశాల వీధుల్లో ఉత్సవవిగ్రహాల్లా ఊరేగడానికేనా..నోటితో జోకొట్టి చేతులతో తొడను గిల్లే వైఖరి ప్రదర్శిస్తున్నట్లుంది.

ప్రజలు నిస్సహయులయ్యారు. బతకడమే వాళ్ళకిప్పుడు పెద్దయుద్దం. ప్రతీ సందర్భంలోనూ అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతకడమే వాళ్ళకిప్పుడు ప్రత్యక్షనరకం. అందుకే రత్నాజీ ‘‘ఇప్పుడెవరిస్తారు/ ఆ భయం లేని ప్రపంచాన్ని/ ఎవరు స్థాపిస్తారు/ శాంతి, కరుణ, మైత్రీ వనాన్ని/ మానవ దుర్భల జీవితంలో/ నిర్భయత్వపు వాకిలి ముందు/ యుద్దాన్ని నివారించడానికి/ఇప్పుడో బోధిసత్వుడు అవసరం/ వెన్నుపూసలో దూసుకొచ్చిన/ బుల్లెట్లను తీసి కట్టుకట్టడానికో/ బాలసిద్దార్థుడు రావాలి/ ఆ పసిపిల్లల పెదాల మీద/ నవ్వుల ప్రపంచాన్ని నిలబెట్టాలి.’’ నిజంగా సాధ్యమేనా? ఇంకా ఇంకా నరమేధం జరుగుతూనే వుంది కదా..రాకెట్లు, లాంచర్లు విరచుకు పడుతున్నాయి కదా..మానవదేహం తునకలు తునకలుగా విసిరేయబడుతుంది కదా..కవి ఎంత అమాయకుడు కాకపోతే ఇలా ఎలా ఆశిస్తాడు. పసిపిల్లలు, ముసలివాళ్ళు, యువతులు ఇలా ఎవ్వరినీ కనికరించక, దయచూపక మట్టుబెడుతుంటే ఏ బోధిసత్వడు కాపాడతాడు వీళ్ళని..దాక్కోపాపా/ నిన్ను కూడా చంపేస్తారు వాళ్ళు/ ఈ రాత్రికి నిన్ను నక్కల నోటనుంచి/ తప్పించమని  మా అల్లాతో చెపుతాను/ క్రీస్తును అడుగుతాను/యెహోవా తాతతో పోట్లాడి/ నిన్ను కాపాడతాను/ అయ్యో నీ పొట్టలో/ దూది బయటకొచ్చేసినట్టుంది/ ఎంత రక్తస్రావం అవుతుంది/ సూది దారం కూడా దొరక్కుండా/ హాస్పిటల్‌ మీద నిప్పులదాడి చేసి/ నా స్నేహితుల్ని కూడా చంపేశారు/ రేపటి నుంచి నాతో ఎవ్వరూ బడికి రారు/ ఇక వాళ్ళెవ్వరూ కనపడరు./ నీకు ఆకలేస్తుందా పాపా/ నీకు అమ్మనయ్యి/ పాలు పట్టిద్దామంటే నాకు  పాలిండ్లు లేవు/ ఏడుపొస్తుంది నిన్ను చూస్తే జాలేస్తుంది/ ఈ శ్మశాన పొగల మధ్య/ఎలా నల్లబారిపోయావో చూడు..’’

ఇప్పుడు ఆ దేశమంతా శ్మశానమే..గుట్టలు గుట్టలుగా శవాలను సామూహిక ఖననం చేసేందుకు కూడా జాగా లేని నేల అది. పై వాక్యాలు చాలు ఈ కవిత్వం ఎంత గొప్పదో చెబటానికి..

ఈ దీర్ఘకవితలో ఎవ్వరినీ వదల్లేదు.నరమేధం సృష్టిస్తున్న యుద్దోన్మాదులనందరినీ ఈ కవిత్వం ద్వారా దోషులుగా నిలబెట్టాడు. అది బైడెన్‌ కావచ్చు..నెతన్యాహు కావచ్చు..యుద్దోన్మాదం పై రావలసినంత కవిత్వం రాలేదని..రాయలేదనే అసంతృప్తి ఉన్నప్పటికీ ఈ కవిత్వం చదివాక మనసు నెమ్మదించింది. సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే ప్రగతిశీలవాదులు, ఈ ప్రపంచాన్ని మతోన్మాదం, యుద్దోన్మాదం నుంచి కాపాడుకోవాలనుకునే ప్రతివొక్కరూ ఈ గాజా లేని జాగా చదవితీరాలి.

Leave a Reply