ప్రజల హక్కులను పణంగా పెట్టి, అంతర్గత సాయుధ సంఘర్షణ పరిస్థితులలో రాజ్య బలప్రయోగాన్ని నియంత్రించే దేశీయ, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ ఆపరేషన్ కగార్ కింద ఛత్తీస్‌గఢ్‌లో సంవత్సరానికి పైగా కొనసాగుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భద్రతా విధానాన్ని ఖండిస్తున్నాం.
ఇటీవల ఫిబ్రవరి 9నాడు జరిగిన ఎన్‌కౌంటర్ మరణాలతో సహా 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు 30 మందికి పైగా భద్రతా సిబ్బందితో సహా 300 మందికి పైగా మరణాలు సంభవించాయి. మొత్తం అరెస్టులు 1033, లొంగుబాటులు 925 కు చేరుకున్నాయి. 2025లో కూడా మావోయిస్టులు కూడా కనీసం తొమ్మిది మంది పౌరులను చంపారని వార్తా నివేదికలు సూచిస్తున్నాయి. ఆపరేషన్ కగార్ కింద ఈ కాలంలో జరిగిన మొత్తం హత్యల సంఖ్యల గురించి వివిధ అధికారిక, స్వతంత్ర సమాచారాల నుండి వచ్చిన వివరాల మధ్య తేడాలు ఉన్నాయి.
2026 మార్చి నాటికి వామపక్ష తీవ్ర వాదాన్ని నిర్మూలించే ‘అంతిమ చర్య’గా 2024 జనవరిలో అబూజ్‌మాడ్‌లో గృహ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆపరేషన్ కగార్‌ను ప్రారంభించింది. 2005లో సల్వాజుడుం, 2009లో ఆపరేషన్ గ్రీన్ హంట్, 2015లో నేషనల్ పాలసీ అండ్ యాక్షన్ ప్లాన్, 2017లో ఆపరేషన్ సమధాన్-ప్రహార్‌లతో మొదలై ఛత్తీస్‌గఢ్‌లో నిరంతర భద్రతా తీవ్రవాద నిరోధక చర్యలను కగార్ కొనసాగిస్తోంది.
ఆదివాసీలకు వారి భూములు, అడవులు, వనరులపై హక్కులు, స్వయంప్రతిపత్తి, స్వీయ పాలనలను నిరంతరం నిరాకరించడం ఈ ఘర్షణకు మూలమని గుర్తించినప్పటికీ, వరుస ప్రభుత్వాలు ఈ సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయి. పరిష్కారాల కోసం విపరీతమైన సైనికీకరణను ఆశ్రయించారు; ఇది చారిత్రాత్మకంగా మానవ హక్కుల ఉల్లంఘనలకు, చట్టాతీత హత్యలకు, వ్యక్తులు, సంస్థలను నేరస్థులుగా పరిగణించడానికి, అన్యాయమైన జైలు శిక్షకు, సామూహిక అంతర్గత నిర్వాసిత్వానికి దారితీసింది.
ఆపరేషన్ కగార్‌లో భాగంగా ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో సెక్యూరిటీ క్యాంపులను ఏర్పాటు చేసారు. ఈ క్యాంపులు రోడ్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనుల కోసం ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం గతంలో పేర్కొంది. అయితే, కొన్ని అధికారిక పత్రాలు ” వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో నిరాటంక అనుసంధానత, ప్రాంతీయ భద్రత, ప్రాంత ఆధిపత్యాలతో పాటు భద్రతా బలగాల కదలికలు సజావుగా పాటు ఉండడం” అనే లక్ష్యాన్ని సూచిస్తున్నాయి.
ఫిబ్రవరి 9న జరిగిన ఎన్కౌంటర్ తరువాత ఛత్తీస్‌గఢ్‌లో మాజీ ఏడీజీపీ (నక్సల్ ఆపరేషన్స్) మాట్లాడుతూ ” అబూజ్‌మాడ్ (సర్వే చేయని ప్రాంతం), దక్షిణ బస్తర్ వంటి ప్రాంతాల్లో భద్రతా అంతరాన్ని పూరించడంలో ఫార్వర్డ్ క్యాంప్స్ సహాయపడ్డాయి. ఈ క్యాంపులు మావోయిస్టుల కదలికలను పరిమిత్రం చేయడం మాత్రమే కాకుండా బలగాలు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టడానికి కూడా సహాయ పడుతున్నాయి” అని అంగీకరించాడు.
2019 నుంచి వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో 277 సిఆర్‌పిఎఫ్ క్యాంపులను, అదే కాలంలో పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బ్యూరో (బిపిఆర్‌డి) 199 కొత్త బిఎస్ఎఫ్ క్యాంపులను కూడా ఏర్పాటు చేసిందని హోంమంత్రి తెలిపాడు. 2019 నుంచి బస్తర్ లో 250 సెక్యూరిటీ క్యాంపులు ఏర్పాటు అయాయని, 2024 ఫిబ్రవరిలో మరో 50 క్యాంపులు ఏర్పడతాయని బస్తర్ డివిజన్ ఐజీపీ ప్రకటించాడు.
ఈ అంచనాల ప్రకారం ప్రస్తుతం బస్తర్‌లో ప్రతి తొమ్మిది మంది పౌరులకు ఒక భద్రతా సిబ్బంది ఉన్నాడు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి ప్రత్యేక మౌలిక సదుపాయాల పథకం (ఎస్ఐఎస్), ప్రత్యేక కేంద్ర సహాయం (ఎస్‌సిఎ) కింద ఈ కార్యకలాపాల కోసం కేంద్ర ప్రభుత్వం మరింతగా నిధులను సమకూర్చింది. 2026 మార్చి వరకు, ప్రత్యేక మౌలిక సదుపాయాల పథకం కోసం కేటాయించిన మొత్తం 1160 కోట్ల రూపాయలకు విస్తరించింది.
గ్రామ సభలకు తగిన, ముందస్తు, సమాచారం ఇచ్చి, అనుమతి తీసుకోకుండా పాఠశాలలతో సహా తమ ఐదవ షెడ్యూల్ భూములలో సెక్యూరిటీ క్యాంపులను ఏర్పాటు చేసినందుకు ఛత్తీస్‌గఢ్‌లోని ఆదివాసీలు కనీసం 2021 నుండి నిరసన వ్యక్తం చేస్తున్నారు. క్యాంపులకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలపైన ఛత్తీస్‌ఘఢ్ పోలీసులు కాల్పులు జరిపారు. సిలంగేర్‌లో జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించారు; ఎనిమిది మందిని అరెస్టు చేశారు.
ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున సైనిక బలగాల మోహరింపు నేపథ్యంలో విస్తృతంగా హత్యలు జరుగుతున్నాయి. ఏప్రిల్ లో కాంకేర్-నారాయణ్‌పూర్‌లో, మే లో పిడియాలో, అక్టోబర్‌లో దంతెవాడ-నారాయణ్‌పూర్ సరిహద్దులో, నవంబర్‌లో సుక్మాలో, 2025 జనవరిలో ఛత్తీస్‌గఢ్ -ఒడిశా సరిహద్దులో, ఇటీవల ఫిబ్రవరి 09 న బీజాపుర్‌లోని ఇంద్రావతి నేషనల్ పార్క్‌లో జరిగిన ఘటనలు మొదలైనవి ఈ అంతులేని ఘటనల జాబితాలో ఉన్నాయి.
నారాయణపుర్ జిల్లాలోని కుమ్మమ్, లెకావాడలలో 2024 డిసెంబర్ 11-12 తేదీల్లో జరిగిన దాడుల్లో భద్రతా బలగాలు ఏడు మందిని చంపడమూ, నలుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారనే వార్త ఆందోళన కలిగిస్తోంది. మావోయిస్టులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపినట్లు పోలీసులు ప్రకటించినప్పటికీ, మృతి చెందిన వారిలో ఐదుగురు పౌరులు ఉన్నారని స్థానికులు పేర్కొన్నారు. అంతేకాకుండా, వారు “నక్సల్స్” వారిని “కూలీలుగా లేదా మానవ కవచాలుగా” ఉపయోగించే అవకాశం ఉందని పిల్లలపై కాల్పులు జరపడాన్ని ఐజిపి బస్తర్ విభాగం సమర్థించింది. ఊహాగానాల ఆధారంగా చిన్నారులు, పౌరులపై ప్రభుత్వ బలగాలు కాల్పులు జరిపిన తీరు ఆందోళన కలిగిస్తోంది.
2024-25లో జరిగిన ఈ ఎన్కౌంటర్ల గురించి ఎటువంటి అధికారిక సమాచారం బహిరంగంగా అందుబాటులో లేదు. మహారాష్ట్ర రాష్ట్రం (2014) లో స్వతంత్ర, న్యాయమైన దర్యాప్తు జరిగేలా చూడాలి. భద్రతా దళాల వాదనలను పరిశీలించడానికి విచారణ కమిషన్లను కూడా ఏర్పాటు చేయలేదు.
2024-25లో జరిగిన ఈ ఎన్కౌంటర్ల గురించి ఎటువంటి బహిరంగంగా అందుబాటులో ఉన్న అధికారిక సమాచారం లేదు; స్వతంత్ర, న్యాయమైన దర్యాప్తును నిర్ధారించడానికి పియుసిఎల్ వి. స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర (2014) లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసారా లేదా దర్యాప్తు చేసారా అనే సమాచారం లేదు. భద్రతా బలగాల వాదనలను పరిశీలించడానికి విచారణ కమీషన్‌లను కూడా ఏర్పాటు చేయలేదు.
ప్రజల విచక్షణారహిత హత్యలపైన, సెక్యూరిటీ క్యాంపుల ఏర్పాటుపైన ప్రశ్నలు లేవనెత్తిన వ్యక్తులు, సంస్థలను ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నేరస్థులుగా ప్రకటించింది. ఉదాహరణకు, వివిధ ఎఫ్ఐఆర్‌ల కింద ఇప్పటికీ జైలులో ఉన్న సునీతా పోట్టంను 2024 జూన్‌లో అరెస్టు చేయడం, ఛత్తీస్‌గఢ్ ప్రత్యేక ప్రజా భద్రత చట్టం (సిఎస్‌పిఎస్‌ఎ) కింద అక్టోబర్ 2024 లో మూల్‌వాసీ బచావో మంచ్ (ఎమ్‌బిఎం) పై విధించిన నిషేధం వంటివి ఇందులో ఉన్నాయి.
చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (యుఎపిఎ), నిషేధింత సంస్థలతో అనుబంధం ఉన్నదనే ఆరోపణలపై భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్) వంటి చట్టాల కింద ఛత్తీస్‌గఢ్‌లో రాజకీయ, సాధారణ జీవితాన్ని కూడా నేరంగా పరిగణిస్తున్నారు.
ఇలాంటి ఘటనలలో రాజ్యం చేపడుతున్న చర్యలను ఒక సీనియర్ పోలీసు అధికారి సమర్థించడాన్ని చూస్తుంటే ప్రస్తుత పరిస్థితులు “వామపక్ష తీవ్రవాద” నిర్మూలన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కొనసాగిస్తున్న పనితీరులో భాగమని స్పష్టం చేస్తుంది.
ఈ సందర్భంలో, ప్రత్యక్షంగా పాలుపంచుకోని ఒక పోలీస్ స్టేషన్ ద్వారా జరిగే నిర్దిష్ట హత్యల్లో పియుసిఎల్ మార్గదర్శకాలు స్వతంత్ర దర్యాప్తుకు హామీ ఇస్తాయా అనేది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. అందువల్ల, అంతర్జాతీయ మానవతా చట్టం ప్రకారం అంతర్గత సాయుధ సంఘర్షణకు సంబంధించిన నిబంధనలను పోలీసులు, భద్రతా బలగాలు పాటించాయా లేదా అని నిర్ధారించడానికి న్యాయపరంగా పర్యవేక్షణ ఉన్న దర్యాప్తు అత్యవసరం. వీటిలో సాయుధ పోరాట యోధులు, పౌరుల మధ్య వ్యత్యాసం, నిష్పాక్షికత, ముందు జాగ్రత్త మొదలైన నియమాలు ఉన్నాయి.
హక్సా కమిటీ నివేదిక (2014) లాంటి స్వాతంత్ర్యం తరువాతి ప్రభుత్వ నివేదికలు ఆదివాసీలకు రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ హామీలను అమలు చేయకపోవడం, వారి సాంప్రదాయ భూములలో హింస, వెలికితీత అభివృద్ధి పద్ధతులు, సామూహిక నిర్వాసిత్వం స్థాయి మొదలైనవాటిని గుర్తించాయి. అయితే, వరుస ప్రభుత్వాలు ఈ అంశాలను పక్కన పెట్టి, తూర్పు-మధ్య భారతదేశంలో తీవ్ర భద్రతా చర్యలను ఆశ్రయించాయి.
ఈ ప్రాంతంలో ప్రస్తుతం సాయుధ సంఘర్షణ తీవ్రతరం కావడం ‘ఎల్ డబ్ల్యూఈ’ని నిర్మూలించాలనే ఉద్దేశ్యంతోనే జరుగుతున్నప్పటికీ, 2047 వికసిత్ భారత్ ప్రణాళికను 32 ట్రిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక వ్యవస్థను కొనసాగించాలనే ఉద్దేశ్యంతో చదవాలి; ఇందు కోసం రాజ్యం ఖనిజ వనరులను ప్రైవేటు కంపెనీల అందుబాటులో ఉంచాలని చూస్తోంది.
ఈ ప్రయత్నంలో, అభివృద్ధి ప్రాజెక్టులు, సెక్యూరిటీ క్యాంపుల కోసం భూ స్వాధీనం, అటవీ మళ్లింపు విషయాలలో స్వయంప్రతిపత్తి, గ్రామ సభల స్వేచ్ఛాయుత, ముందస్తు, సమాచార సమ్మతిపై ఇప్పటికే దుర్బలంగా ఉన్న హామీలను రాజ్యం మరింత వేగంగా నాశనం చేస్తోంది.
ఈ వివాదానికి పరిష్కారం రాజకీయ ప్రక్రియలో ఉందని; భూమి, వనరులపై ఆదివాసులకు ఉన్న స్వయంప్రతిపత్తిని రక్షించడం కోసం ఐదవ షెడ్యూల్, పంచాయతీ (షెడ్యూల్డ్ ఏరియాలకు విస్తరణ) చట్టం-1996 (పెసా), అటవీ హక్కుల చట్టం- 2006 (ఎఫ్ఆర్ఎ) కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజ్యాంగపరమైన బాధ్యతలను ఖచ్చితంగా నిర్వహించాలని నొక్కి చెబుతున్నాం.
ఐదో షెడ్యూల్, ఆదివాసీ ప్రాంతాలను పూర్తిగా సైన్య రహితం చేయాలని, ప్రస్తుత, గత భద్రతా కార్యకలాపాల కింద ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన హత్యలన్నింటికీ స్వతంత్ర, న్యాయ పర్యవేక్షణతో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి, ప్రత్యేకించి వివక్షత, నిష్పాక్షికత, ముందుజాగ్రత్త సూత్రాలపై రాజ్య బాధ్యుల జవాబుదారీతనం తప్పనిసరిగా ఉండేట్లుగా చూడాలి.
రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలని, నిషేధిత సంస్థలతో అనుబంధం ఉన్నదనే ఆరోపణలతో అరెస్టులు, లొంగుబాటులన్నింటినీ సమీక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. చివరగా, చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, సిఎస్‌పిఎస్ఎ తదితర కఠినమైన చట్టాల ప్రకారం చేసిన అన్ని సంస్థాగత నిషేధాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
హరీష్ ధవన్ , పరమ్‌జిత్ సింగ్
పియుడిఆర్
10 ఫిబ్రవరి 2025