కథలు జీవన విధానాల, అనుభవాల, ఎన్నెన్నో సంఘటనల నిదర్శనాలు. కాలగర్భంలో కలిసిపోయిన ఊరు, అక్కడి జీవన సారాంశాలను నరేష్కుమార్ సూఫీ తనదైన పాత్రను పోషిస్తూ రాసిన కథలు ‘మెమొరీస్ ఆఫ్ మంగలిపల్లె’గా రూపం దాల్చుకున్నాయి. రచయిత తన చిన్నతనాన్ని వెతుక్కుంటూ మళ్ళీ ఓ సారి వాళ్ల ఊరికి వెళ్ళి బాల్యాన్ని, బడిని… ముఖ్యంగా అక్కడి పరిస్థితులను ఇలా అన్నింటిని గుర్తుచేసుకుంటూ వివరిస్తున్న విధానం పాఠకులందరినీ కూడా వాళ్ళ చిన్నతనాన్ని నెమరువేసుకునేలా చేస్తాయి.
కథల్లో ఓ ప్రతిస్పందన, వెతుకులాట ఉంటుంది. అది రచనా పరిణితిని బట్టి కథల అనుభూతి ఉంటుంది. ఈ పుస్తకంలోని కథలు చాలా చోట్ల మనల్ని అక్కున చేర్చుకుని, మన సొంత ఊర్లని జ్ఞప్తికి తెస్తాయి. ప్రస్తుతమున్న పోటీ ప్రపంచంలో మూలాల్ని ఆదరించే తీరిక చాలా తక్కువ మందికి ఉంటుంది. అలాంటి వారందరికీ ఈ పుస్తకమొక జ్ఞాపకాల తరువు. అయితే అభివృద్ధి బాటలో కొట్టుకుపోయిన మంగలిపల్లె, అక్కడి మనుషుల భావోద్వేగాలు ఇందులో పొందుపరచబడ్డాయి.
తెలంగాణ యాస అంటే ముఖ్యంగా గుర్తుకొచ్చేది కరీంనగర్, మంచిర్యాల అలాగే సింగరేణిని గర్భంలో మోస్తున్న గోదావరిఖని/ ఇలా వీటి చుట్టు ప్రక్కల ఉన్న గ్రామాల్లో ఒక్కటైన మంగలిపల్లె గురించి, ఆ ఊరి అస్తిత్వం కనుమరుగైన విధానం గురించి అక్కడి యాసలో వివరించారు. కథలు నిజజీవితం నుండే వెలువడతాయి. ‘అనుపపూల వాసన’ కథలో మంగలి గట్టవ్వ ఆత్మాభిమానం, ‘మా ఊరి సమ్మక్క సారక్క జాతర’, ‘ మా వాడ చెట్ల తీర్థాలు’ కథలో అక్కడి వాళ్ళ పండుగ జరుపుకునే విధానం, ‘మోంబత్తీల పండుగ’లో రాసిన రచయిత అనుభవం, ‘అల్లిపూలు’లో ఎవరో తెలియని ఒకాయన చెరువులో దిగి పూలు కోసివ్వడం అందరినీ ఆకట్టుకుంది. ఇలాంటి పాత్రలు మనకి పరిచయం ఉన్నట్లుగా అనిపిస్తుంది. అలాగే వాడుకలో ఉండి కనుమరుగవుతున్న కొత్త పదాలు దర్శనమిస్తాయి.
ప్రపంచానికి వెలుగులివ్వడానికి తనని తాను ఆహుతి చేసుకున్న మంగలిపల్లె ఎన్నో మాయమైపోయిన గ్రామాల తరుపున ఓ గొంతుక వినిపిస్తుంది. సింగరేణి గనుల్లో కూరుకుపోయిన ఆ గ్రామ ప్రజల జీవనోపాధి నుండి బాధ్యతలను, బాల్యాన్ని కాలం తనలో కలిపేసుకుంది. పల్లెలంటేనే వివిధ వృత్తులతో నిష్కల్మంగా ఎదుగుదలకు, అరుగుదలకు మధ్య ఒదుగుతూ కలిసికట్టుగా కాలం సాగించే స్థలాలు. అలాంటి ప్రాంతం జనసమూహం లేకుండా ఒక్కొక్కరూ ఊరు విడిచి వెళ్తుంటే నిర్ఘాంతపోయి, నిశ్చలంగా, నిశ్శబ్దంగా ఉన్న మంగలిపల్లె మనందరి మనస్సులో నిండిపోతుంది.