నక్సల్ ప్రభావిత జిల్లాల్లో సర్వేలు నిర్వహించేవారు మావోయిస్టుల మద్దతు గల గ్రూపుల నుంచి నిరసనలు, దాడులను ఎదుర్కొంటున్నారు.

భారతీయ రైల్వేలు, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వమూ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతంలో రైలు మార్గాలను వేయడానికి, రైలు సేవలను ప్రారంభించడానికి కృషి చేస్తున్నాయి. రైల్వే అధికారులు ఒక వివరణాత్మక ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసే ముందు సర్వేలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత దశాబ్దాల తరబడి రెడ్ కారిడార్‌గా ఉన్న ప్రాంతాల్లో రైలు సేవలు తొలిసారిగా ప్రారంభం కానున్నాయి. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా బస్తర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేశాయి. కానీ ఒక సమస్య ఉంది.

నక్సల్ హింస ప్రభావిత జిల్లాల్లో సర్వేలు నిర్వహించే వారికి మావోయిస్టుల మద్దతు గల గ్రూపుల నుంచి నిరసనలు, దాడులు ఎదురవుతున్నాయి.

బస్తర్‌లోని నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్ఎస్ఎల్) నిర్వహించడంలో అధికారులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి రైల్వే బోర్డు చైర్మన్ గురువారం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి లేఖ రాశారు.

రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్ జూన్ 26వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖను హిందుస్తాన్ టైమ్స్ పత్రిక  చూసింది. ఈ ప్రాంత అభివృద్ధికి రైల్వే ప్రాజెక్టు ఎంతో కీలకం కావడంతో ఆ ప్రాజెక్టును హోం మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తోందని ఆయన లేఖలో పేర్కొన్నారు.

కొత్తగూడెం (తెలంగాణ) నుండి కిరండల్ (ఛత్తీస్‌గఢ్) వరకు ప్రతిపాదిత రైల్వే లైన్ అత్యంత నక్సల్ ప్రభావిత జిల్లాలైన సుక్మా, బీజాపుర్, దంతేవాడ జిల్లాల గుండా వెళుతుందని ఈ విషయం గురించి తెలిసిన వారు చెప్పారు. ప్రతిపాదిత మార్గం మూడు రాష్ట్రాలైన తెలంగాణ (9.5 కిలోమీటర్లు), ఆంధ్రప్రదేశ్ (12.32 కిలోమీటర్లు), ఛత్తీస్‌గఢ్‌లోని 138.51 కిలోమీటర్ల పొడవైన ప్రాంతం గుండా వెళుతుంది.

ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాలలో, ఇతర రెండు రాష్ట్రాలలో ఎఫ్‌ఎస్‌ఎల్ పూర్తయినప్పటికీ, బీజాపుర్, దంతెవాడ జిల్లాలలో సర్వే చేస్తున్న బృందాలు ప్రతిఘటనను ఎదుర్కొంటున్నాయని కుమార్ తన లేఖలో పేర్కొన్నారు. దంతేవాడ నుంచి 26 కిలోమీటర్ల దూరం, బీజాపుర్ జిల్లా నుంచి 35 కిలోమీటర్ల దూరం సర్వేలు నిర్వహించాల్సి ఉంది. ఈ రెండు జిల్లాలు ఇప్పటికీ వామపక్ష తీవ్రవాద ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల జాబితాలో ఉన్నాయి.

ఇతర ప్రాంతాల్లో సర్వే పూర్తయినప్పటికీ దంతేవాడ జిల్లా, బీజాపూర్ జిల్లాల్లో సర్వే పనులు సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, స్థానిక ప్రతిఘటనల కారణంగా ఆటంకాలు ఎదురవుతున్నాయని రైల్వే బోర్డు ఉన్నతాధికారి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన సమావేశంలో జిల్లాల కలెక్టర్లకు ఈ విషయంపై సమాచారం అందించినట్లు ఆయన తెలిపారు.

జూన్ 9న దంతేవాడలో సర్వే చేస్తున్న సమయంలో సర్వే బృందాలను స్థానిక గ్రామస్తులు అడ్డుకుని దాడి చేశారని కూడా ఆ అధికారి తెలిపారు. ఈ ఘటనపై దంతేవాడ జిల్లా మేజిస్ట్రేట్, అదనపు పోలీస్ సూపరింటెండెంట్, ఎస్పీలకు వెంటనే సమాచారం అందించారు. ఈ అంతరాయాల కారణంగా దంతేవాడ జిల్లా, బీజాపూర్‌లలో సర్వే పనులు నిలిచిపోయాయి. ప్రతిపాదిత రైల్వే లైన్ కోసం ఎఫ్ఎస్ఎల్ పని ఈ ప్రాంత అభివృద్ధికి చాలా ముఖ్యమైనది. దీనిని హోం మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తోంది” అని లేఖలో పేర్కొన్నారు.

రైల్వే సిబ్బందికి పూర్తి భద్రత కల్పించాలని, స్థానికుల భయాలను తొలగించాలని జిల్లా మేజిస్ట్రేట్, జిల్లా సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తమ పేరు చెప్పవద్దని కోరిన ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల ఆదివాసులపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని రాష్ట్ర ప్రభుత్వం వారికి హామీ ఇచ్చింది. ఇందుకోసం దంతేవాడ, బీజాపుర్ కలెక్టర్లు సర్వే బృందానికి భద్రత, మద్దతు కల్పించాలని, స్థానికుల ఆందోళనలను పరిష్కరించాలని ఆదేశించారు. కేంద్రం కూడా పనులను పర్యవేక్షిస్తోందనీ కొత్త రైల్వే లైన్ నిర్మాణ సమయంలో ఆదివాసీ సముదాయాల ప్రయోజనాలను పరిరక్షించడానికి అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన అన్నారు.

బస్తర్ పరిధిలో నిర్మాణ/అభివృద్ధి పనులను వ్యతిరేకిస్తున్న నిరసనకారులు రెండు రకాల వారు ఉన్నారని ఒక సీనియర్ పోలీసు అధికారి వివరించారు. మొదటిది గ్రామస్తులు; వీరంతా నక్సల్ పాలనలో ఇన్ని సంవత్సరాలు జీవించారు. ఈ ఏడాది వరకు నారాయణపుర్‌లో కూడా రోడ్డు దిగ్బంధనాలు జరిగాయి. అమాయక గ్రామస్తుల మెదళ్ళను నక్సలైట్లు  ఎన్నో సంవత్సరాల నుంచి  ప్రభావితం చేసారు. వారికి సలహాలివ్వడం తరచుగా ఒక పరిష్కారానికి దారితీస్తుంది. రెండో వర్గం నక్సల్స్ ఏర్పాటు చేసిన గ్రూపులు. మాడ్ బచావో మంచ్ వంటి అనేక గ్రూపులను ఇప్పటికే కేంద్రం నిషేధిత గ్రూపులుగా ప్రకటించింది. రోడ్లు మూసివేయడానికి, అభివృద్ధి పనులను అనుమతించకుండా చేయడానికి ఈ గ్రూపులకు నక్సలైట్లు మద్దతు నిస్తున్నారు. మావోయిస్టులు ఆదివాసులకు ఆరోగ్య సంరక్షణ, పాఠశాలలు లేదా ఇతర ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉండకూడదని కోరుకుంటున్నారు కాబట్టి వారు ఈ నిరసనలకు నిధులు సమకూరుస్తున్నారు. ఈ ప్రాంతాలు 4-5 దశాబ్దాలుగా నక్సల్స్ నియంత్రణలో ఉన్నాయి కాబట్టి పర్యాటక రంగాన్ని దృష్టిలో ఉంచుకుని బస్తర్ ప్రాంతాన్ని దేశంలోని ఇతర ప్రాంతాలతో రైలు ద్వారా అనుసంధానించడం ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులలో ఒకటి.

కొత్తగూడెం- కిరండల్ ఎఫ్‌ఎల్‌ఎస్ పనులు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో పురోగమిస్తున్నాయి. కానీ  ఛత్తీస్‌గఢ్ లోని దంతేవాడ జిల్లాలోని గ్రామస్తులు దీనిని వ్యతిరేకించడంతో ప్రస్తుతం ఈ పనులు నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయం, స్థానిక పరిపాలనా యంత్రాంగం మద్దతు ఉన్నప్పటికీ, స్థానిక ప్రతిఘటన కారణంగా పనులు అడపాదడపా ఆగిపోతున్నాయి అని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (సిపిఆర్ఓ) ఎ. శ్రీధర్ అన్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో ఆదివాసుల అనేక నిరసనలకు ప్రతినిధి అయిన సీపీఐ మాజీ నేత మనీష్ కుంజమ్ మాట్లాడుతూ, “రైల్వే అధికారుల సర్వేకు ఎదురవుతున్న ఇలాంటి నిరసనల గురించి నాకు తెలియదు. ప్రతిపాదిత రైల్వే లైన్ గురించి స్థానికంగా ఉన్న ప్రజలకు తెలియదు. అయితే రైల్వే లైన్ అనేది రాష్ట్రం నుండి ఇనుప ఖనిజాన్ని తీసుకెళ్లడానికి ఒక మార్గం అని నేను చెప్పగలను. వారి భూమిని సర్వే చేసే ముందు గ్రామాల ప్రజలను, భూస్వంతదారులను సంప్రదిస్తున్నారా? గ్రామసభలను సంప్రదించకుండా భూమిని కొనుగోలు చేయలేమని 1994 పంచాయతీ రాజ్ చట్టం పేర్కొంది” అని అన్నారు.

2025 జూన్ 8

https://www.hindustantimes.com/india-news/protests-mar-railways-survey-to-lay-tracks-in-bastar-101751060942041.html

తెలుగు: పద్మ కొండిపర్తి

Leave a Reply