కాటెపోగు రత్నంయేసేపు (కెఆర్‌వై) తెస్తున్న మొదటి కవితా సంకలనం యిది. కవితలన్నీ చార్వాక కలం పేరుతో రాసినవే. మొత్తం 25 కవితలు. 12 కవితలు విద్యారంగానికి సంబంధించినవి కాగా, మిగిలినవి వివిధ సందర్భాల్లో జరిగిన సంఘటనలకు స్పందించి అక్షరీకరించిన కవితలు. తనకున్న తాత్విక భావజాల కోణంలోంచి వీక్షించి కవితలుగా మలిచారు. అన్నీ వస్తు ప్రధానమైన కవితా ఖండికలే. భావ ప్రాధాన్యాన్ని బట్టి కవితల్లో శైలి, శిల్పం వాటంతకవే అమరిపోయాయి. విషయాన్ని చెప్పడంలో స్పష్టత, సూటిదనం, ప్రతి కవితలో మనం చూడొచ్చు. కవితలు రాయాలని రాసినవి కావు. సంఘటనలకు స్పందించి రాసిన కవితలే అన్నీ.

 ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ రచనా వ్యాసంగాన్ని విస్తృతపరచుకున్నాడు. తన చుట్టూరా సమాజం పరిణామదశల్ని, నిశితంగా పరిశీలిస్తూ, ఆలోచనాపరుడుగా స్పందించాడు. ప్రజాస్వామ్యమంటే ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు సమానంగా అందాలి. ఆచరణలో దేశసంపద కొందరి చేతుల్లోనే బందీ అవుతోంది. కాదు కాదు బలవంతంగా సంపదను లాక్కుంటున్నారు. ఇది సరైంది కాదు దీనికి పరిష్కారం కావాలి. భూమి, నీరు, ఖనిజ సంపద, మిగతా ప్రకృతి వనరులు అన్యాక్రాంతమై పోతున్నాయి. కాని జనంలో గ్రహించే చైతన్యం లేదు. ఆ చైతన్యం పెంచేందుకే ఈ కవితా సంకలనం.

స్వాతంత్య్రం లభించి ఏడు దశాబ్దాలైనా విద్యారంగంలో పురోగతి లేదు. నానాటికి ప్రభుత్వ విద్యారంగం కుచించుకుపోతుంటే, కార్పోరేటు విద్యారంగం నానాటికి విశ్వరూపం దాల్చుతూ ‘విద్య’ను అంగడి సరుకుగా మార్చేసింది. చివరికి కార్పోరేటు శక్తుల ఇంగ్లీషు భాష వివిధ జాతుల మాతృభాషలను మింగేసే దశకు చేరుకుంది. పాలకవర్గాలు అందుకు తమవంతు సహకారం అందించి విజన్‌ లేని దివాలాకోరులుగా మిగిలిపోయాయి.

సమాజ మార్పుతోనే విద్యారంగం మార్పు తధ్యమని కవి నమ్మకం. అందు కోసమే విద్యారంగంలో లుప్తమైపోతున్న విలువను గురించి ఆవేదన, ఆక్రోశం వెలిబుచ్చాడు తన కవితల్లో. మనిషిని మనిషిగా చూడలేని మనువాద సంస్కృతిపైన, తల్లి, చెల్లి లాంటి మహిళ మీద జరుగుతున్న అత్యాచారాల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. తన కవిత ద్వారా కులోన్మాదం, మతోన్మాదం కలగలిసి మూలవాసులపై చేస్తున్న దాడిని ఎండగడతాడు .    బహుపరాక్‌ అని హెచ్చరిస్తాడు.

‘బాల్యం ఓ నాస్తాల్జియా’ మొండిగోడల బడిలో కారుతున్న తాటాకు గుడిసెల్లో తన బాల్యపు జ్ఞాపకాల్లోకి వెళ్ళి, నడకలు నేర్పిన బట్టతల మాష్టారు, నీతికతలు చెప్పిన నశ్యంపొడుం మాష్టారును గుర్తుకు తెచ్చుకుంటాడు. మరచిపోలేని జ్ఞాపకాల అలల్లో ఈ దాడి నేటి వ్యాపార సంస్కృతి బడుల్లో పసిపిల్లల అగచాట్లను పత్తిచూపిస్తాడు. తల్లిదండ్రులారా! మాకోసం ఏడ్వకండి ‘మీకోసం నెరవేరని మీ కలల కోసం ఏడ్వండి’ అన్న వాక్యం ప్రతి హృదయమున్న తల్లిదండ్రుల గుండెల్ని పిండేస్తాయి. ‘‘వాంటెడ్‌ క్వాలిఫైడ్‌ టీచర్స్‌ టు టీచ్‌’’ కవితలో నాటికి నేటికి బడిపంతుళ్ళ వైఖరుల్లో వచ్చిన మార్పును చూపెట్టి, గతం, సమీప వర్తమానంలోని గురువులు సమాజానికి చేసిన సేవను, త్యాగాల్ని మరవద్దు అని జీవితమంటే వేతనాలు, వ్యసనాలు మాత్రం కాదు. గురువుకు విశాల దృక్పథం ఉండాలి. సమకాలీన సమాజ సవాళ్ళను పదుర్కొనేందుకు విద్యార్థులను సిద్ధం చేసేవారే  నిజమైన గురువని, సామాజిక బాధ్యత నెరవేర్చిన వాడే నిజమైన గురువని ఉపాధ్యాయవర్గాన్ని గుర్తించమంటాడు. అమెరికా పాఠశాలల్లో తరచుగా జరుగుతున్న కాల్పులకు స్పందనగా రాసిన కవిత ‘‘బాలలారా! బహుపరాక్‌’’ కవితలో ‘‘ప్రపంచ పెద్దన్న సొంతింట్లో, బడికి బాల్యానికి భద్రత కరువు’’ అని పద్దేవా చేస్తాడు. ‘జ్ఞానం’ వికసించాల్సిన చోట ‘గన్‌’ గర్జిస్తున్నాయి. చికిత్స చేయాల్సింది పిల్లలకు కాదు వికృతి అమెరికా సమాజానికంటాడు. విద్యారంగానికి సంబంధించిన విషయాలు ఇలా మిగతా కవితల్లో ‘మృత్యుభోజనం’ ‘బాల్యమే శరణార్థి’, ‘అమ్మభాష’ ‘తిరగబడుతున్న కాలం’ కవితల్లో విద్యారంగ సంక్షోభంలోంచి ఏర్పడుతున్న సమస్యల్ని పత్తిచూపాడు.

 సామాజిక రంగంలో సంక్షోభం, దాని ఫలితంగా సమాజంలో ఏర్పడుతున్న వైరుధ్యాల్ని గూర్చి ‘‘ఇదే మన స్వతంత్రం’ కవితలో పాలకులు ప్రభుత్వాలు మారుతున్నాయి. ‘పాలన’ మాత్రం మారలేదంటాడు. దేశంలో దోచుకునే వాళ్ళకు కావలసినంత స్వేచ్ఛ, కాని ఆకలికి స్వేచ్ఛలేదు, ప్రశ్నకు స్వేచ్ఛలేదని పాలకుల పెట్టుబడిదార్ల ‘స్వేచ్ఛ’యే నిజమైన స్వేచ్ఛగా మారిపోయిందంటాడు.

    ‘‘మేరా భారత్‌ మహాన్‌’’ కవితలో దేశ సంపదను దేశపాలకులు అయిన వారికి అప్పణంగా అప్పగిస్తూ అలగాజనాలకు కూడు, గూడూ, గుడ్డా లేని దైన్యం గురించి వాపోతాడు. ఇదేనా ‘మేరా భారత్‌ మహాన్‌’ అంటే అని నిలదీస్తాడు. ‘బాల్యమే శరణార్థి’ కవితలో ‘మతితప్పిన జాతివైరం వల్ల అగ్రరాజ్యాల చేతుల్లో కీలుబొమ్మలైనపుడు మంచితనమెప్పుడో శరణార్థి. శరణార్థులైన జనంతో పాటు పసిపిల్లలూ పగవారే. అందుకే కలలు పండకుండానే వలసల బాల్యం పసివాడిపోతుంది, దైన్యంగా అంటూ విచారం వ్యక్తం చేస్తాడు. ‘తల్లి భారతీ వందనం’ కవితలో తల్లి భారతిని నిమ్న జగన్మాతవు, భూమాతవు, గంగమ్మవు అన్నారు. పంతైనా నీవు ఆడదానవే తల్లీ. ఇక్కడ ఒళ్ళంతా కొవ్వెక్కిన మతోన్మాద మనువులున్నారు జాగ్రత్త తల్లీ అంటూ హెచ్చరిస్తాడు. అంటే సమాజంలో స్త్రీల స్థితి పంత అధ్వాన్నమైన, భయంకరమైన హింసకు గురవుతున్నదో అర్థం చేసుకోమంటాడు.

 ‘మేరా భారత్‌ మహాన్‌’ కవితలో అక్కడ వందల ప్రాణాలను హరించిన ‘నోట్‌బంద్‌’ సాక్షిగా దిగ్గజాల దావోస్‌ ‘దావత్‌’ల సాక్షిగా డిజిటల్‌ రంగులతో ఆర్భాట హంగులతో పర్రకోటపై జెండా పగురుతూ వుంది. ఇక్కడ దిక్కుముక్కులేని వారి దిసమొలల సాక్షిగా విలవిలలాడుతూ వుంది. దేశసంపదను కొంతమంది కార్పోరేటు శక్తులకు పాలకవర్గం అప్పణ్ణంగా అప్పజెప్పి, మెజారిటీ ప్రజల్ని కూడు, గూడు, గుడ్డకు దూరం చేసే విధానాలను ‘మేరా భారత్‌ మహాన్‌’ అంటే అని ప్రశ్నిస్తాడు.

ఇలా చెప్పుకుంటూ పోతే పాఠకులకు ఏమి మిగలకపోవచ్చు. ఈ కవితలన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డిటిపఫ్‌ అధికార మాసపత్రిక ‘అధ్యాపకజ్వాల’లో రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్‌ డిటిపఫ్‌ అధికార మాసపత్రిక ‘ఉపాధ్యాయక్రాంతి’లో అప్పుడప్పుడు అచ్చయిన కవితలే నేడు కవితా సంకలనంగా పాఠకులు ముందుకు వస్తుంది. స్పష్టత, సరళత మేళవించిన కవితా సంకలనం పాఠకులు చదివి ఆదరించి ప్రశ్నిస్తారని ఆశిస్తూ…

Leave a Reply