విశ్వగురుగా చెప్పుకొంటున్న ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో ప్రపంచ మార్కెట్‌లో రూపాయి విలువ చరిత్రలో ఎన్నడు లేనివిధంగా రికార్డ్‌ పతనాన్ని చవి చూస్తోంది. 2014 మేలో డాలర్‌కు 63 రూపాయలుగా ఉన్న మారకం 2024 డిసెంబర్‌ నాటికి జీవితకాల కనిష్ట స్థాయి రూ.85.25కి పడిపోయింది. ఈ స్థాయిలో పతనం కావడం ముందెన్నడూ లేదు. చరిత్రలో ఇదివరకూ ఎప్పుడూ లేని విధంగా రూపీ క్షీణించడంతో పేద, సామాన్య ధనిక భారతీయులందరిపై ప్రత్యక్షంగా… పరోక్షంగా తీవ్ర ప్రభావం చూపనుంది. వరుస పతనంతో రూపాయి చరిత్రలోనే అత్యంత పేలవ ప్రదర్శనను కనబర్చుతోంది. గడిచిన ఐదేండ్లలో ఈ కరెన్సీ 20 శాతం పైగా పడిపోయింది. భవిష్యత్తు రోజుల్లో ఇది మరింత క్షీణించొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత ఆర్థిక విధానాలతో దేశంలో ఇప్పటికే అధిక ధరలు బెంబేలెత్తిస్తున్న తరుణంలో కరెన్సీ క్షీణత ద్రవ్యోల్బణానికి మరింత ఊతం ఇవ్వనుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెచ్చు ధరలతో ప్రజల ఆదాయం పడిపోనుంది. వస్తువులకు డిమాండ్‌ తగ్గనుంది.. అంతిమంగా ఇది తీవ్ర ఆర్థిక సంక్షోభానికి దారి తీయనుంది.

1947లో ఒక డాలర్‌ విలువ 4 రూపాయలకు సమానం. 1966 వరకు ఇందులో పెద్దగా మార్పు లేదు. కానీ ఆ తర్వాత రూపాయి విలువ పతనం కావడం మొదలైంది. అదికార బదిలీ జరిగిన తొలినాళ్లలో 13 రూపాయల విలువ 1పౌండ్‌ స్టెర్లింగ్‌ లేదా 4 డాలర్లకు సమానంగా ఉండేది. కానీ అనేక కారణాలతో ఈ ఏడున్నర దశాబ్దాల్లో రూపాయి విలువ పతనమై ఒక డాలర్‌కు దాదాపు 85.27 రూపాయల స్థాయికి క్షీణించింది. 1947లో దేశ వాణిజ్య లోటు దాదాపు సున్నా కాగా… ఇప్పుడు రికార్డు స్థాయిలో 31 బిలియన్‌ డాలర్లు చేరడం కూడా రూపాయి విలువ పతనానికి కారణం. అమెరికా డాలర్‌ను అంతర్జాతీయ కరెన్సీకి ప్రామాణికంగా తీసుకోవడానికి ముందు భారత రూపాయి విలువను బ్రిటిష్‌ పౌండ్‌తో పోల్చి చూసేవారు. 1949లో పౌండ్‌ విలువ పతనమైంది. దీంతో రూపాయి విలువ డాలర్‌తో దాదాపు సమానంగా ఉండేది. 1966లో తొలిసారి భారత రూపాయి విలువ అమెరికా డాలర్‌తో పోలిస్తే పతనమైంది. ఆ కాలంలో భారత్‌ తీవ్రమైన ఆర్థిక, రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కోవడమే దీనికి కారణ్‌. రుతుపవనాల ముఖం చాటేయడంతోపాటు కరువు ఏర్పడి పంటల దిగుబడి తగ్గింది, పారిశ్రామిక ఉత్పత్తి కూడా మందగించింది. ద్రవ్యోల్బణం పెరగడంతో… ప్రపంచంలోని మిగితా దేశాలతో పోలిస్తే మన దగ్గర ధరలు భారీగా పెరిగాయి.

1962 చైనా, 1965 పాకిస్థాన్‌లతో భారత్‌ యుద్ధాలు చేయాల్సి వచ్చింది. దీనికి కరువు తోడవడంతో.. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడిరది. స్థూల ఆర్థిక సూచీకలు బలహీనపడటంతో.. తొలిసారి రూపాయి విలువ పడిపోయింది. 1966, జూన్‌ 6న ఇందిరా గాంధీ ప్రభుత్వం డాలర్‌తో రూపాయి మారకం రేటును ఒకేసారి రూ.4.76 నుంచి రూ.7.50కి తగ్గించింది. రూపాయి విలువ డాలర్‌తో 36.5 శాతం తగ్గగా, డాలర్‌ విలువ 57.4 శాతం పెరిగింది. 1991లో భారత్‌కు ఫిక్స్‌డ్‌ ఎక్స్‌ఛేంజ్‌ సిస్టమ్‌ ఉండేది. ఆ సమయంలో భారత రూపాయి విలువ మనదేశంతో వాణిజ్యం జరిపే దేశాలతో పోలిస్తే దాదాపు ఒకే విలువను కలిగి ఉండేది. 1991 చివరి నాటికి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో పడిరది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటడంతో… చెల్లింపులు కూడా కష్టమయ్యాయి. 1966 నాటి పరిస్థితులు పునరావృతమయ్యాయి.

ఫలితంగా ద్రవ్యోల్బణం పెరగడం, బడ్జెట్‌ లోటు అంతరాలు, చెల్లింపులు జరపలేని స్థితిలోకి భారత ఆర్థిక వ్యవస్థ దిగజారింది. దీంతో పివి నర్సింహారావు ప్రభుత్వం పరిస్థితులను చక్కదిద్దడం పేరిట 1991 జూన్‌లో సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక సంస్కరణలకు తెర తీసింది.  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు రూపాయి విలువను భారీగా తగ్గించింది. 1991 జూలై 1న 9శాతం, రెండు రోజుల అనంతరం 11 శాతం చొప్పున రూపాయి విలువను తగ్గించింది. దీంతో ఆ ఏడాది జూన్‌ 30న రూపాయితో పోలిస్తే 21.14గా ఉన్న డాలర్‌ విలువ మరుసటి రోజుకు రూ.23.04కు చేరింది. జూలైన 3న ఆర్‌బిఐ మరోసారి రూపాయి విలువ తగ్గించడంతో.. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారక రేటు రూ.25.95కి పడిపోయింది. మూడు రోజుల వ్యవధిలోనే రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 18.5 శాతం, పౌండ్‌తో పోలిస్తే 17 శాతం పతనమైంది.

1991 నుంచి రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే ఏటా 3.74 శాతం చొప్పున (3.74 సిఎజిఆర్‌) పతనమైంది. ద్రవ్యోల్బణం.. అమెరికా, భారత్‌ మధ్య వడ్డీ రేట్లలో తేడాలే దీనికి కారణమనేది నిపుణుల మాట. 2000-2007 మధ్య ఒక డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.44.48 మద్య దాదాపు నిలకడగా ఉంది. 2007 చివర్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 39 రూపాయలకు చేరుకుంది. దేశంలోకి విదేశీ పెట్టుబడుల నిలకడగా రావడమే దీనికి కారణం. కానీ 2008 ఆర్థిక మాంద్యం తర్వాత విదేశీ పెట్టుబడిదారులు మనదేశంలో పెట్టిన పెట్టుబడులను తమ దేశాలకు మళ్లించుకోవడంతో రూపాయి విలువ పతనం ప్రారంభమైంది. 2009 తర్వాత డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ వేగంగా పతనమై రూ.46.5 నుంచి రూ.79.5కి పడిపోయింది. 2013 ఆరంభంలో రూపాయి విలువ వేగంగా పతనమైంది. ఆ ఏడాది జూన్‌, ఆగష్టు మధ్యలో కరెన్సీ విలువ 27 శాతం పతనమైంది.

ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు అమెరికా డాలర్‌ రిజర్వ్‌ కరెన్సీగా ఉంది. దిగుమతుల ధరలు అధికమైనప్పుడు.. దేశీయంగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థలో కొనుగోలు శక్తి తగ్గుతుంది. దిగుమతుల ధరలు పెరగడం వల్ల కరెంట్‌ అకౌంట్‌ డెఫిషియెన్సీ కూడా పెరుగుతుంది. ఏప్రిల్‌-జూలై 2022 మధ్య భారత వాణిజ్య లోటు వంద బిలియన్‌ డాలర్లకు పైనే ఉంది. వాణిజ్య లోటు పెరగడం వల్ల కూడా రూపాయి బలహీన పడుతుంది. రికార్డు స్థాయిలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 2022 జూలై నెలలో 80కి పడిపోయింది. ముడి చమురు ధరలు పెరగడంతో పాటు ఇతర కారణాల రీత్యా అమెరికా డాలర్‌కు డిమాండ్‌ పెరిగింది. గ్లోబల్‌ మాంద్యం కారణంగా మదుపరులు గ్రీన్‌బ్యాక్‌లో ఆశ్రయం పొందుతారు.

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, చమురు ధరలు పెరుగుతాయన్న అంచనాలు కూడా రూపాయి విలువ పతనానికి కారణాలుగా చెబుతున్నారు. మొత్తం మీద రూపాయి వేగంగా పతనం చెందడంతో ఇప్పుడు ఒక డాలర్‌ విలువ 85 రూపాయలకు పైగా చేరింది. దీంతో రిజర్వు బ్యాంకు వద్ద ఉన్న విదేశీ నిల్వలు వేగంగా కరిగిపోవడం ప్రారంభమైంది. స్టాక్‌ మార్కెట్‌లోని విదేశీ పెట్టుబడులకు రెక్కలు వస్తున్నాయి. తమ పెట్టుబడుల విలువలు తగ్గిపోతుండటంతో విదేశీ మదుపర్లకు భారత మార్కెట్‌ ఆశాజనకంగా కనిపించడం లేదు. ఒక్క నవంబర్‌ నెలలోనే 38 బిలియన్‌ డాలర్లను విదేశీ పోర్టు ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐలు) ఉపసంహరించుకున్నారు. ఈ ఉపసంహరణ కొనసాగుతూనే ఉనిది. దేశీయ మార్కెట్‌పైనా ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. కొంతకాలంగా సెన్సెక్స్‌ నేల చూపులు చూస్తుండటమే దీనికి నిదర్శనం.

భౌగోళిక, రాజకీయ, దేశీయ పరిణామాలు కారణంగా మనదేశ కరెన్సీ రూపాయి మారక విలువ ఎన్నో ఒడిదుడుకులకు గురవుతోంది. దేశీయంగా వృద్ధి మందగించడం, వాణిజ్యలోటు పెరగడం, దేశీయంగా పెట్టుబడులు సన్నగిల్లడం, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ ఆగకపోవడం తదితర కారణాలు రూపాయి విలువను మరింత దిగజారుస్తున్నాయి. డిసెంబర్‌ మాసంలో  డాలర్‌ దెబ్బకు రూపాయి ఏమాత్రం నిలబడలేకపోతున్నది. ఫారెక్స్‌ మార్కెట్‌లో అమెరికా కరెన్సీతో  పోల్చితే భారతీయ కరెన్సీ మారకం విలువ మళ్లీ ఆల్‌టైమ్‌ కనిష్టానికి దిగజారింది. గత డిసెంబర్‌ మాసంలో డాలర్‌ దెబ్బకు రూపాయి ఏమాత్రం నిలబడలేకపోతున్నది. ఫారెక్స్‌ మార్కెట్‌లో అమెరికా కరెన్సీతో పోల్చితే భారతీయ కరెన్సీ మారకం విలువ మళ్లీ ఆల్‌టైమ్‌ కనిష్టానికి దిగజారింది. మరి డిసెంబర్‌ 24న మరో 4 పైసలు పడిపోవడంతో మునుపెన్నడూ లేనివిధంగా 85.23 వద్దకు చేరింది. గడిచిన రెండు వారాలుగా అమెరికా డాలర్‌తో రూపాయి మారకం రేటు అపసోపాలు పడుతోంది. డిసెంబర్‌ 26న డాలర్‌తో రూపాయి 12 పైసలు నష్టపోయి 85.27కి చేరింది. అంతకు ముందు రెండు రోజుల్లోనూ 13 పైసలు నష్టపోయింది. పరిస్థితులు ఇలానే కొనసాగితే వచ్చే కొద్ది రోజుల్లోనే డాలర్‌తో రూపాయి మారకం రేటు 86కు పతనమయ్యే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాల అంచనా.

దీంతో ఇంటర్‌ బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్సేంజ్‌లో డిసెంబర్‌ నాలుగవ వారంలో రూపీ 85పైనే ఉంటున్నట్టయింది.  డిసెంబర్‌ నెల ముగుస్తుండటంతో దేశీయ మార్కెట్‌లోని దిగుమతిదారులపై చెల్లింపుల ఒత్తిడి ఉంటుందని, ఈ క్రమంలోనే డాలర్లకు పెరుగుతున్న డిమాండ్‌… రూపీని మరింత  బలహీనపరుస్తున్నదని ఫారెక్స్‌ ట్రేడర్లు చెప్తున్నారు. పైగా జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రాబోతున్నారు. దీంతో మళ్లీ సుంకాల సమరం మొదలవుతుందన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని గమనించి డాలర్ల కోసం భారతీయ దిగుమతిదారులు ఎగబడిపోతున్నారు. కాగా, ఫెడ్‌ రిజర్వ్‌ కఠని ద్రవ్య వైఖరి దిశగా వెళ్తుండటం కూడా రూపీ కష్టాల్ని పెంచిందన్న అభిప్రాయాలూ ఉన్నాయి. వరుసగా రూపాయి పతనం వల్ల దిగుమతులు భారంగా మారనున్నాయి.

ఇక దేశీయ మార్కెట్ల నుంచి ఆగని విదేశీ మదుపరుల పెట్టుబడుల ఉపసంహరణలు సైతం పరిస్థితుల్ని ఇంకా దిగజార్చుతున్నాయి.  మొత్తానికి రూపాయి పతనం… దేశీయ దిగుమతుల్ని ఖరీదెక్కిస్తుండగా, ద్రవ్యోల్బణం, ద్రవ్య పరపతి, చివరకు దేశ ఆర్థిక వ్యవస్థల్నే ప్రమాదంలోకి నెడుతున్నది. రూపాయి పడిపోయేందుకు చాలా కారణాలు ఉన్నాయని చెప్పవచ్చు. అయితే అందులో ప్రధానంగా అంతర్జాతీయంగా పెరుగుతున్న క్రూడ్‌ ఆయిల్‌ ధరలు, దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఇతర దేశాల మార్కెట్లలోకి తరలించడం వంటివి మన దేశ కరెన్సీ రూపాయి విలువపై ఒత్తిడి పెంచుతున్నాయని చెప్పవచ్చు. దీంతో నేడు జీవన కాల కనిష్ట స్థాయి అయిన రూ.85.25ని చేరింది. ప్రస్తుతం పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొద్దిరోజుల క్రితం గ్లోబల్‌ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధర 70 డాలర్ల వద్ద ఉండగా… అది ఇటీవలే దాదాపు రూ.74కి పెరిగింది. త్వరలోనే ఇది మరింత 80 డాలర్లకు చేరువవుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే ద్రవ్యలోటు పెరుగుతుంది. దీంతో క్రూడ్‌ ఆయిల్‌ దిగుమతుల కోసం ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి వస్తోంది. ఎక్కువ మొత్తం చెల్లించి డాలర్లు కొనుగోలు చేయాల్సి వస్తుండడంతో రూపాయి విలువ పతనమవుతోంది.

దేశీయ కరెన్సీ వరుస పతనం వల్ల ముఖ్యంగా దిగుమతి ఉత్పత్తులు భారంగా మారనున్నాయి. విదేశీ విద్యా, అంతర్జాతీయ ప్రయాణాలు. వాహనాలు, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, చమురు, బంగారం, వంటనూనెలు, పప్పు దినుసులు తదితరాల ధరలు మరింత పెరుగుతాయి. విదేశాల్లో చదువుకునే భారతీయ విద్యార్థులు విద్యా, వీసాలు, వసతి కోసం భారీగా చెల్లించాల్సి వస్తుంది. అదానీ కోసం కేంద్రం భారీగా బగ్గు దిగుమతులకు అనుమతిస్తోన్న విషయం తెలిసిందే. ఈ రంగానికి అధికంగా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఆ బగ్గుతో ఉత్పత్తి చేసిన విద్యుత్‌ ప్రజలకు భారం కానుంది. దేశం మొత్తం చమురు వినియోగంలో 85 శాతం దిగుమతుల నుంచి సమకూర్చుకుంటున్నదే.. చమురు దిగుమతులపై భారీగా చెల్లింపులు జరుగుతున్నాయి. దీంతో పెట్రోల్‌, డిజిల్‌ ధరలు మరింత పెరుగనున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ బలహీనంగా ఉండటంతో ఇప్పటికే వాణిజ్య లోటు అమాంతం పెరుగుతోంది. ఈ పరిణామాలు భారత్‌లో అధిక ధరలకు ఆజ్యం పోయనున్నాయి. ఈ క్రమంలో ద్రవ్యోల్బణం మరింత ఎగిసిపడనుంది.

హెచ్చు ద్రవ్యోల్బణ కట్టడికి ఆర్‌బిఐ వడ్డీ రేట్లను పెంచాల్సి రావొచ్చు. ఇప్పటికే హెచ్చు వడ్డీ రేట్లతో అన్ని రకాల రుణాలు ప్రియమయ్యాయి. రూపాయి దెబ్బతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున రాబోయే ఆర్‌బిఐ ఎంపిసి సమీక్షలో వడ్డీ రేటు పెంచడానికి మెండుగా అవకాశాలున్నాయి. అది జరిగితే అన్ని రకాల రుణాలు మరింత భారం కానున్నాయి. ప్రస్తుత వాయిదా చెల్లింపుల (ఇఎంఐ) విలువ పెరగనుంది. దీంతో గృహ, వాహన అమ్మకాలపై ఒత్తిడి పెరగనుంది. అధిక ధరలు, హెచ్చు వడ్డీ రేట్లు ప్రజల కొనుగోలు శక్తిని హరించనున్నాయి. దీంతో వస్తు డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడనుంది. ప్రపంచ మార్కెట్‌లో రూపాయి విలువ మరింత పడిపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గడిచిన ఐదేండ్లలో 20 శాతం క్షీణించగా… వచ్చే ఐదేండ్లలోనూ ఇదే స్థాయిలో పతనం కావొచ్చని పలు రిపోర్టులు చెబుతోన్నాయి. 2030 నాటికి అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 100కు పడిపోవచ్చని దిక్వింట్‌ ఓ కథనంలో వెల్లడించింది .

భారత్‌లోకి వచ్చి.. పోయే విదేశీ కరెన్సీ ఆధారంగా లెక్కించే కరెంట్‌ అకౌంట్‌ ఖాతా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీ లోటును ఎదుర్కోవచ్చని స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది. డాలర్‌ విలువ పెరగడం.. రూపాయి అమాంతం బక్కచిక్కడంతో ప్రపంచ దేశాల నుంచి భారత్‌ తీసుకున్న అప్పులపై అధిక వడ్డీలు చెల్లించాల్సి ఉంటుంది. దిగుమతులు, అప్పులు, వడ్డీలకు చేసే విదేశీ చెల్లింపులతో భారత మారకం నిల్వలు వేగంగా కరిగిపోనున్నాయి. ఈ పరిణామాలకు తోడు హెచ్చు ద్రవ్యోల్బణం రూపాయిని, దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టవచ్చని నిపుణలు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి విలువను మరింత పటిష్టం చేస్తామని… ఎట్టి పరిస్థితుల్లోనూ డీలా పడనివ్వమని 2014 ఎన్నికల ప్రచార సమయంలో నరేంద్ర మోడీ చేసిన ప్రచార ఆర్బాటానికి… వాస్తవ పరిస్థితులు అత్యంత భిన్నంగా ఉన్నాయి.

రూపాయి మారక విలువ పడిపోవడం వల్ల దిగుమతుల ఖర్చులు పెరుగుతాయి. ఇది ద్రవ్యోల్భణం పెరుగుదలకు దారి తీస్తుంది. కొనుగోలు శక్తి పడిపోతుంది. రూపాయి విలువ క్షీణించడంతో భారతీయ కంపెనీలు అధిక ఖర్చులను ఎదుర్కొంటాయి. కార్పొరేట్‌ బ్యాలెన్స్‌ షీట్లను దెబ్బ తీస్తుంది. పెట్టుబడులకు అవరోధం ఏర్పడుతుంది. విదేశీ మదుపరులను ప్రభావితం చేసి పెట్టుబడులకు తరలించుపోవడానికి దారి తీస్తుంది. అధిక ద్రవ్యోల్బణం, తగ్గిన పెట్టుబడి కలిసి ఆర్థిక వృద్ధిని నెమ్మదిస్తుంది. వచ్చే మార్చికి డాలర్‌ విలువ 86 రూపాయలకు చేరొచ్చని ఆర్థిక సేవల సంస్థ నువామా ఇన్‌స్టిట్యూషనల్‌ అంచనా వేస్తోంది. ఆ స్థాయి కంటే కూడా పెరిగే అవకాశం ఉందని కోటక్‌ సెక్యూరిటీస్‌ భావిస్తోంది. కొత్త గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా సారథ్యంలో, ఫారెక్స్‌ మార్కెట్‌లో ఆర్‌బిఐ జోక్యంపై ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు. దేశీయంగా బ్యాంకింగ్‌ వ్యవస్థలో నగదు కొరత దాదాపు 7 నెలల్లోనే అత్యధికంగా ఉందని పన్నుల చెల్లింపు, రూపాయి క్షీణతను ఆపేందుకు ఆర్‌బిఐ ఫారెక్స్‌ నిల్వలను వాడటం ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.

2014లో నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా ఎన్నిక కావడానికి దోహదం చేసిన అనేక కారణాల్లో రూపాయి పతనం కూడా ఒకటి. 2014వ సంవత్సరంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 62.33గా ఉండిరది. మోడీ అండ్‌ కో దీనినే దేశ ప్రజల ముందు భూతద్దంలో చూపారు. తాము అధికారంలోకి వస్తే రూపాయిని చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా బలోపేతం చేస్తామని, రూపాయి కోసం విదేశాలు క్యూలు కట్టే విధంగా చేస్తామని ప్రచారం చేశారు. కానీ, జరిగింది వేరు. మోడీ హయాంలో దాదాపుగా ప్రతి ఏడాది రూపాయిది పతనోన్ముఖమే। బలహీనమైన రూపాయి కారణంగా దిగుమతులు మరింత ఖరీదుగా మారుతున్నాయి. ఆ స్థాయిలో ఎగుమతులు లేకపోవడంతో వాణిజ్య లోటు భారీగా పెరుగుతోంది. దీనికి తోడు ఉపాధి అవకాశాలు కుదించుకుపోవడం, తలసరి ఆదాయం పెరగకపోవడం, నిత్యావసర వస్తువుల ధరలు పైపైకే పోతుండటం, జీవన ప్రమాణాలు పడిపోవడం వంటివి దేశీయ ఆర్థిక రంగాన్ని మరింత సంక్షోభం వైపు నెడుతున్నాయి. ఈ పరిస్థితి నుంచి బయట పడాలంటే దిగుమతుల ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవాలి. అంతర్జాతీయ మార్కెట్‌ స్థాయిలో నాణ్యమైన ఉత్పత్తులు చేసి ఎగుమతులు పెంచుకోవాలి.

Leave a Reply