5 మార్చి 2024న, బొంబాయి హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా, హేమ్ మిశ్రా, ప్రశాంత్ రాహి, విజయ్ టిర్కీ, మహేష్ టిర్కీలను వారిపై ఉన్న అన్ని అభియోగాల నుండి నిర్దోషులుగా ప్రకటించింది. కేవలం 33 ఏళ్ల పాండు నరోటే జైలులో ఉండగానే మరణించాడు. నిజానికి ఇది కస్టడీ హత్య అని, సంబంధిత అధికారులపై విచారణ జరిపి శిక్షించాలన్నారు. ఎంతటి క్రూరత్వం అంటే.. అతను అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ కూడా జైలు పాలకవర్గం అతనికి వైద్యం చేయించలేదు. అతని జీవితపు చివరి రోజుల్లో కళ్ళ నుండి, మూత్రంలో రక్తస్రావం జరిగింది.
మిగిలిన ఐదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ హైకోర్టు తన తీర్పులో “ఇంటర్నెట్ నుండి కమ్యూనిస్టు లేదా నక్సలైట్ సాహిత్యాన్ని డౌన్‌లోడ్ చేయడం లేదా కమ్యూనిస్ట్ తత్వశాస్త్రం పట్ల సానుభూతి చూపడం ఉపా చట్టం ప్రకారం నేరం కాదు” అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వంతో వున్న ఎలాంటి భిన్నాభిప్రాయమయినా నేరంగా పరిగణిస్తున్న నేటి కాలంలో, హైకోర్టు చేసిన అటువంటి వ్యాఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది.
జెఎన్‌యు విద్యార్థి, రాజకీయ, సాంస్కృతిక కార్యకర్త హేమ్‌మిశ్రా, ఇదే కేసులో ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాతో పాటు అండా సెల్‌లో బందీ అయి, నిర్దోషిగా విడుదల కావడానికి ముందు 2015లో బెయిల్‌పై బయటకు వచ్చినప్పుడు ‘క్యాచ్ న్యూస్’ అనే మీడియా పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలాగే చెప్పారు. “ఏ భావజాలాన్నీ, మావోయిజాన్ని కూడా విశ్వసించడం నేరం కాదు”. దీన్ని అర్థం చేసుకోవడానికి బాంబే హైకోర్టుకు 10 ఏళ్లు పట్టింది.
ఈ కేసులో బాంబే కోర్టు రెండోసారి అందరినీ నిర్దోషులుగా ప్రకటించడం గమనార్హం. భారతదేశ న్యాయ చరిత్రలో ఇదొక అద్భుతమైన కేసు. గత సంవత్సరం 2022 అక్టోబర్ 14 న, ముంబై హైకోర్టు విచారణ సమయంలో పోలీసులు చేసిన, సాంకేతిక అవకతవకల (అది కూడా చట్టవ్యతిరేకంగా) ఆధారంగా నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది,. కానీ మావోయిజం అనే దెయ్యం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంతగా వెంటాడుతోంది అంటే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వెంటనే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది, ఆ తర్వాత సుప్రీంకోర్టు ప్రత్యేక విచారణలో హైకోర్టు నిర్ణయాన్ని నిలిపివేసి, “ఉగ్రవాద లేదా మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించి, మెదడు మరింత ప్రమాదకరమైనది; ప్రత్యక్ష ప్రమేయం ఉండాల్సిన అవసరం లేదు” అని వ్యాఖ్యానించింది.
మహారాష్ట్ర ప్రభుత్వంతో ఏకీభవించిన సుప్రీంకోర్టు సాంకేతిక లోపాల ఆధారంగా (అవి చట్టవిరుద్ధమైనవే అయినా) మళ్లీ విచారణ జరపాలని ఆదేశించింది. దీని ఆధారంగా మార్చి 5న ఈ కేసులో నిందితులందరినీ మళ్లీ నిర్దోషులుగా విడుదల చేసింది. దీంతో ఈ మొత్తం కేసు బూటకం మాత్రమే కాకుండా కల్పితం అని, అక్రమంగా నడిచిందని రుజువైంది. కానీ దురదృష్టవశాత్తు, పోలీసు పరిపాలనపై లేదా దానికి బాధ్యులైన వ్యక్తులపై ఎటువంటి కేసు నమోదు అవదు. ఇది ఈ న్యాయ వ్యవస్థకున్న వైఫల్యమూ, పరిమితి.
ఈ కేసును నడపడం వెనుక ఉన్న న్యాయవ్యవస్థ, దాని రక్షణలో నిమగ్నమైన రాజ్య, పోలీసు వ్యవస్థ ఉద్దేశం, మొత్తం విచారణలో ఒకసారి కాదు చాలాసార్లు బట్టబయలైంది. కాబట్టి, ఈ కేసు ఒక ఉదాహరణ. 2017లో గడ్చిరోలి సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జి.ఎన్.సాయిబాబాతో సహా నిందితులందరికీ జీవిత ఖైదు విధిస్తూ ఇలా అన్నాడు – “నా అభిప్రాయం ప్రకారం, నిందితులకు జీవిత ఖైదు సరిపోదు, (వారిని ఉరితీయాలి) కానీ, చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (UAPA)లోని సెక్షన్ 18, 20లు కోర్టు చేతులను కట్టివేసాయి. నా అభిప్రాయం ప్రకారం, ఇది శిక్షవిధించడానికి తగిన కేసు. ఈ నిర్ణయంలో తన ద్వేషానికి గల కారణాన్ని న్యాయమూర్తి మరింత వివరించారు. గడ్చిరోలి జిల్లా అభివృద్ధికి జి.ఎన్.సాయిబాబా తదితరులను అడ్డంకిగా పేర్కొంటూ- “గడ్చిరోలి 1982లో ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. నిందితులందరూ దీనికి బాధ్యులు, వారు నిషేధిత సంస్థ సిపిఐ మావోయిస్టు ఫ్రంటల్ ఆర్గనైజేషన్ సభ్యులు. రివల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ ఇక్కడ విదేశీ పెట్టుబడులను అనుమతించలేదు, దాని కారణంగా అది అభివృద్ధి చెందలేదు” అని అన్నాడు.
ఈ తీర్పు న్యాయమూర్తి కున్న న్యాయ పరిజ్ఞానం కంటే పక్షపాత బుద్ధిని ఎక్కువగా వెల్లడిస్తుంది, అతను ఈ పక్షపాతంపై తీర్పునివ్వడంలో కూడా ఆ బుద్ధిని మానుకోలేదు; ఇది చట్టబద్ధంగా తప్పు. న్యాయమూర్తి సానుకూలంగా తీర్పు రాస్తున్న అభివృద్ధి నమూనా; సహజ వనరులను దోచుకోవడం, ఆదివాసీల మారణహోమం సరైనదని భావించే మానవ వ్యతిరేక నమూనా. ఈ నమూనాను ప్రపంచానికి బట్టబయలు చేసిన ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా, హేమ్ మిశ్రా, ప్రశాంత్ రాహి, విజయ్ టిర్కీలకు జీవిత ఖైదు విధించడమే కాక, వారికి ఈ శిక్ష సరిపోదని, కానీ న్యాయవ్యవస్థ చేతులు కట్టేసి వున్నాయని న్యాయమూర్తి వ్యాఖ్యానించాడు. లేకపోతే ప్రొఫెసర్, అతనితో ఉన్న ఇతరులకు మరణశిక్ష విధించి వుండవచ్చు.
నిజానికి, ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా, హేమ్ మిశ్రా, తదితరులు అభివృద్ధికి ఆటంకాలు కాదు, రాజ్యాన్ని రక్షించి, పెంచి పోషిస్తున్న స్వదేశీ, విదేశీ సామ్రాజ్యవాద కంపెనీలు చేస్తున్న వనరుల దోపిడీలే అతిపెద్ద అవరోధం. జైలుకు వెళ్ళేంతవరకు రాజ్య ప్రాయోజిత “ఆపరేషన్ గ్రీన్ హంట్” ఆదివాసీల భూములను, దాని కింద దొరికిన అమూల్యమైన వనరులన్నింటినీ దోచుకుని, ఆదివాసీలపై జరిగిన మారణహోమాన్ని నిరంతరం బహిర్గతం చేసాడు. మొత్తం దేశం, ప్రపంచం ముందు. దోపిడీపై ఆధారపడిన ఈ అభివృద్ధి నమూనాను ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగించడానికి, నిరసన స్వరాన్ని నిశ్శబ్దం చేసేందుకు జి.ఎన్.సాయిబాబా వంటి అనేక మందిని జైల్లో పెట్టారు.
తన నివేదికల ద్వారా ఈ అభివృద్ధి నమూనాను బహిర్గతం చేస్తున్న జార్ఖండ్‌కు చెందిన స్వతంత్ర పాత్రికేయుడు రూపేష్ కుమార్ సింగ్ కూడా మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నాడనే ఆరోపణలపై భాగల్‌పూర్ జైలులో ఉన్నాడు. నిజానికి ఇది ఒక్క చోటే కాదు దేశం మొత్తానికి సంబంధించిన కథగా మారింది. సామ్రాజ్యవాద దోపిడికి ఎలాంటి ఆటంకం కలగకుండా, ఈ అభివృద్ధి నమూనాను వ్యతిరేకించే వారిని వెంబడించే పనిలో రాజ్య పోలీసు ఏజెన్సీలు – ఎన్‌ఐఎ, ఎటిఎస్ మొదలైనవాటిని ఏర్పాటు చేశారు. భీమా కోరేగావ్ కేసు కుట్ర దీనికి సరైన ఉదాహరణ; దీని కింద ఈ అభివృద్ధి నమూనాకు వ్యతిరేకంగా మాట్లాడేవారు, వ్రాసేవారు, మాట్లాడేవారు జైలులో ఉన్నారు, బయట ఉన్నవారికి అదే గతి పడుతుందని బెదిరిస్తున్నారు. భీమా కోరేగావ్ ప్రభుత్వ కుట్ర ప్రపంచ వ్యాప్తంగా రాజ్య అణచివేతకు నిదర్శనంగా మారిందని, దీనిపై పుస్తకాలు రాస్తున్నా, వ్యాసాలు రాసినా, విజ్ఞప్తులు ఇస్తున్నా ప్రభుత్వం ఏ మాత్రం లెక్క చేయడం లేదు.
ఉత్తరప్రదేశ్‌లో మరో భీమా కోరెగావ్ కేసు రూపొందించే సన్నాహాలు
జీఎన్ సాయిబాబా మావోయిస్టు కనెక్షన్ కేసు, భీమా కోరెగావ్ కేసు కుట్ర తర్వాత ఎన్‌ఐఎ, ఎటిఎస్‌లు భీమా కోరెగావ్ కేసును దేశవ్యాప్తంగా చాలా చోట్ల నమూనాగా మార్చి ప్రభుత్వంతో విభేదించే వారిపై కేసులు పెట్టి వారిపై దాడులు చేస్తూ వేధిస్తున్నారు. వారి యిళ్లపై దాడులు చేస్తున్నారు. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ 75వ వార్షికోత్సవానికి ఒక రోజు ముందు, ఉత్తరప్రదేశ్‌లోని రాజకీయ కార్యకర్త ప్రభ అలియాస్ అనితా ఆజాద్‌కు జైలులో గర్భస్రావం జరిగింది. ఆమె ఆరోగ్య పరిస్థితిని ఉద్దేశపూర్వకంగా విస్మరించడం బాధాకరమైన, క్రూరమైన ఘటనకు దారితీసిందని చెప్పడం మరింత సముచితం. అసమ్మతిని అణచివేయడానికి ఇవి అత్యంత క్రూరమైన పద్ధతులు; ఇవి జైలుకు పంపిన తర్వాత కూడా కొనసాగుతాయి. ప్రభుత్వంతో విభేదించే వారిని శారీరకంగా, మానసికంగా హింసించడమే వారి ఏకైక ఉద్దేశ్యం. అనిత బిడ్డ హత్యపై పౌరసమాజంలో కనిపించాల్సిన ఆగ్రహం, ఆగ్రహావేశాలు బయటికి రాలేదు. అనిత తన ఆరోగ్య పరిస్థితిని చెప్పినప్పటికీ, ఎటిఎస్ ఆమెను రాయ్‌పూర్‌లోని ఆమె తల్లి ఇంటి నుండి లక్నోకు తీసుకువచ్చింది. లక్నో ప్రత్యేక కోర్టులో హాజరైన సందర్భంగా ఆమె తన ఆరోగ్య పరిస్థితిని కూడా తెలియజేసింది. గర్భస్రావం జరగడానికి 10 రోజుల ముందు, అయితే ఆమెకు ఇప్పటికే కొన్ని నెలల క్రితం గర్భస్రావం జరిగిందని ప్రస్తావించినా కూడా లక్నో ప్రత్యేక న్యాయస్థానం వైద్య కారణాలపై దాఖలు చేసిన అనిత బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఏడాదిలో ఆమెకు ఇది రెండో గర్భస్రావం.
రైతులు, రాజకీయ కార్యకర్తలు అయిన అనిత, బ్రిజేష్‌లు 2023 అక్టోబర్ 18నాడు ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఎటిఎస్) 2019లో నమోదు చేసిన కేసులో నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో వారిని 2019లో విచారణకు పిలిచి, వదిలేసారు. 4 సంవత్సరాల క్రితం 2019లో వారి ఇంట్లో సోదాలు జరిపి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాల ఫోరెన్సిక్ విచారణ నివేదిక ఆధారంగా వారిని అరెస్టు చేసినట్లు ATS తెలిపింది. వారిద్దరూ ‘మజ్దూర్ కిసాన్ ఏక్తా మంచ్’, ‘సావిత్రీబాయి ఫూలే సంఘర్ష్ సమితి’ వంటి మావోయిస్టు పార్టీ కోసం సంస్థలుగా ఏర్పడి పనిచేస్తున్నారని ఎటిఎస్ తెలిపింది. ఈ రెండు సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా దంపతులు మావోయిస్టు, దేశ వ్యతిరేక భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. కార్మికులు, రైతుల ఐక్యత గురించి మాట్లాడటం, సావిత్రిబాయి ఫూలే ఆలోచనలను వ్యాప్తి చేయడం ఏ విధంగానూ దేశ వ్యతిరేక చర్య కాదని సంస్థల పేరును బట్టి స్పష్టమవుతుంది.
ఉత్తరప్రదేశ్ ఎటిఎస్ ఇక్కడితో ఆగలేదు. ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా అభియోగాల నుంచి విముక్తి పొందిన రోజు మార్చి 5న, దంపతుల కేసుపై పోరాడిన న్యాయవాది కృపా శంకర్, హైకోర్టులో టైపిస్టుగా పని చేస్తున్న ఆయన భార్య బిందాను ఇదే కేసులో ఎటిఎస్ అరెస్టు చేసింది. మావోయిస్టులు. మావోయిస్టుల ‘అర్బన్ నక్సల్’ లేదా ‘ఓవర్ గ్రౌండ్ వర్కర్’ కథనం సమాజంలో వ్యాప్తి చెందాలనే రాజ్య ఉద్దేశాన్ని ఇది స్పష్టంగా చూపిస్తుంది. నిజానికి, కృపా శంకర్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన మానవ హక్కుల న్యాయవాది; ప్రజలపై రాజ్య అణచివేతకు వ్యతిరేకంగా కోర్టులో పోరాడుతున్నాడు. అతను ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా చేస్తున్నాడు. యుఎపిఎ వంటి అణచివేత చట్టాలను అర్థం చేసుకోవడానికి ప్రత్యేకంగా అధ్యయనం చేసాడు. అతను యుఎపిఎ చట్టంలోనైపుణ్యం కలిగిన న్యాయవాదిగా ఎదుగుతున్నాడు; కానీ తానే స్వయంగా ఈ చట్టపూ కోరల్లో చిక్కుకుని జైలుకు వెళ్ళాడు. భీమా కోరెగావ్ కేసులో జైలులో ఉన్న సురేంద్ర గాడ్లింగ్, కృపా శంకర్‌ల పరిస్థితి ఒకేలా ఉంది. ఇద్దరూ జైలుకు వెళ్లి తమ న్యాయ పోరాటానికి మూల్యం చెల్లించుకుంటున్నారు. 6 సంవత్సరాల క్రితం జిఎన్ సాయిబాబా, యింకా అనేకమంది కోసం న్యాయ పోరాటాలు చేసి జైలుకు వెళ్లి మూల్యం చెల్లించుకున్న సురేంద్ర గాడ్లింగ్ విషయంలో ఇదే జరిగింది. నేడు కృపా శంకర్ కూడా ప్రజాస్వామ్య హక్కులను కాపాడటం కోసం అదే మూల్యాన్ని చెల్లిస్తున్నాడు.
గత ఏడాది కాలంగా ఉత్తరప్రదేశ్‌లో మరో భీమా కోరెగావ్ కేసును బనాయించేందుకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. విద్యార్థులు, రాజకీయ కార్యకర్తలు, మానవ హక్కుల కార్యకర్తలు, న్యాయవాదుల ఇళ్లపై ఎన్‌ఐఏ నిరంతరం దాడులు చేస్తూ ‘ఎల్గార్ పరిషత్’ తరహాలో తప్పుడు కథనాన్ని అల్లుతోంది. ఈసారి ప్రధానమంత్రి హత్యకు కుట్ర పన్నడమే కాకుండా ఉత్తర భారతంలో మావోయిస్టులు పావులు కదుపుతున్నారనేది కథనం. ఈ వ్యక్తులు మావోయిస్టు పార్టీకి చెందిన ‘ఓవర్ గ్రౌండ్ వర్కర్లు’. ‘అర్బన్ నక్సల్’ కొనసాగింపు అయిన భారతీయ బ్రాహ్మణవాద హిందుత్వ ఫాసిస్ట్ రాజ్య కొత్త పదజాలంలో ‘ఓవర్ గ్రౌండ్ వర్కర్స్’ భాగం. ఉత్తర భారతదేశంలోని హిందీ బెల్ట్‌లో మావోయిస్టు పార్టీ పనిని పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎన్‌ఐఎ తెలిపింది. ఈ కథనం ఆధారంగా మావోయిస్టుల పేరుతో ప్రజాస్వామ్య గొంతుకలు నలిగిపోయేలా ఎన్ఐఎ పలు చోట్ల దాడులు నిర్వహిస్తోంది. ఇటీవల ఎన్‌ఐఎ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో దీనికి సంబంధించిన స్పష్టమైన చిత్రం కనిపిస్తుంది, మావోయిస్టు సంస్థ దుష్ట ప్రణాళికలను తిప్పికొట్టడానికి ఎన్‌ఐఎ గత నెలల్లో దూకుడుగా కదులుతున్నట్లు వారు చెప్పారు. ఈ ప్రచారాన్ని వ్యాప్తి చేయడంలో చాలా హిందీ వార్తాపత్రికలు ముఖ్యమైన పాత్ర పోషించాయి. ఇటువంటి వార్తాపత్రికలు గత కొన్ని సంవత్సరాలుగా వివిధ సమయాల్లో ఎటువంటి వాస్తవాలు, సూచనలు లేకుండా ఈ ప్రభుత్వ ప్రాయోజిత ప్రచారాన్ని వ్యాప్తి చేయడంలో ఎన్‌ఐఎ వంటి ఏజెన్సీ కంటే ఒక అడుగు ముందున్నాయి.
ఉపాను రోజువారీ క్రిమినల్ చట్టంగా ఉపయోగించడం
ప్రజాస్వామ్య హక్కుల ఉద్యమాలను ఎదుర్కోవడంలో తెలంగాణకు రాజ్య అణచివేత క్రూరమైన చరిత్ర ఉంది. గతంలో గూఢచార సంస్థలతో చేతులు కలిపి అనేక మంది ప్రజాస్వామిక హక్కుల కార్యకర్తలను బూటకపు ఎన్‌కౌంటర్లలో పోలీసులు బహిరంగంగా హతమార్చారు. గత ఏడాది కాలంలో 140 మందికి పైగా పౌర సమాజం, ప్రజాసంఘాల నాయకులను ఉపా కేసుల్లో చేర్చి ఆశ్చర్యకరమైన సంఖ్యలో ఎఫ్‌ఐఆర్‌లను తెలంగాణ చూసింది. చాలా మందిపై మూడు నుంచి నాలుగు యుఎపిఎ కేసులు కూడా నమోదయ్యాయి. ఈ ఎఫ్‌ఐఆర్‌లలో చాలా ఏళ్ల క్రితం మరణించిన చాలా మంది పేర్లు కూడా ఉండడంతో అందులోని నిజం బయటపడింది.
భీమా కోరేగావ్ కేసు మాదిరిగానే, దేశవ్యాప్తంగా ప్రసిద్ధ ఉద్యమకారులు, మేధావులపై తప్పుడు కేసులను రూపొందించడానికి భారత ప్రధానిని హత్య చేయడానికి కుట్ర పన్నుతున్నట్లు ఆరోపించిన కొన్ని అనుమానాస్పద లేఖలను ఎన్‌ఐఎ ఉపయోగించింది. అదే తరహాలో తెలంగాణలో కొత్త కథ అల్లారు. అరెస్టయిన మావోయిస్టు నాయకుడి వద్ద ఒక డైరీ దొరికిందని, అందులో చాలా ముఖ్యమైన సమాచారంతో పాటు ఈ కార్యకర్తల పేర్లు ఉన్నాయని గోది మీడియా ఒక కథనాన్ని సృష్టించింది.
దీని ఆధారంగా వివిధ న్యాయవాదులు, విద్యార్థులు, జర్నలిస్టులు, ప్రొఫెసర్లు, ప్రజాస్వామిక హక్కుల కార్యకర్తల ఇళ్లపై దాడులు నిర్వహించడంతో అదే కథనం పునరావృతమైంది. అనేక మంది కార్యకర్తలను తప్పుడు కేసుల్లో ఇరికించడానికి ఎన్‌ఐఎ భారతదేశం అంతటా ఇటువంటి అనేక నకిలీ డైరీలను సాధనంగా ఉపయోగిస్తుంది.
మైనారిటీలు లక్ష్యంగా
మావోయిస్టు భావజాలం ప్రస్తుత సమాజంలో వున్న సంబంధాలపై ఆధారపడిన వ్యవస్థపైనే దాడి చేస్తుంది కాబట్టి ఇది ప్రస్తుత వ్యవస్థ లక్ష్యంగా ఎందుకు ఉందో మనం అర్థం చేసుకోవచ్చు; అయితే అణచివేత పరిధి ఇంతకు మించి ఉంది. ఈ వ్యవస్థలో ప్రజాస్వామ్య సంస్కరణలను సమర్థించే వారిపై కూడా దాడి జరుగుతోంది. 2019లో పౌరసత్వ చట్టం అమలులోకి వచ్చినప్పుడు, ‘ఢిల్లీ అల్లర్ల కుట్ర’ కేసు కల్పితం, ఇది కేవలం నాయకులను మాత్రమే కాకుండా, దానికి వ్యతిరేకంగా గళం విప్పిన, ఉద్యమానికి మద్దతు ఇచ్చే వారిని కూడా లక్ష్యంగా చేసుకుంది. ఇంకా శోచనీయం ఏంటంటే.. విద్యార్థులు/యువకులను అరెస్టు చేసి జైల్లో పెట్టారు; వీరిలో చాలా మంది 4 ఏళ్లు దాటినా బయటకు రాలేకపోయారు. బాలికల హాస్టల్ సమయపాలన పెంచాలన్న డిమాండ్‌తో ‘పింజ్రా తోడ్’ (పంజారాన్ని విరగ్గొట్టండి) ఉద్యమాన్ని ప్రభుత్వం సహించలేకపోయింది. అందరి మీద ప్రతీకారం తీర్చుకుంటూ, కల్పితం ‘ఢిల్లీ అల్లర్ల’ కేసును పెట్టి అనేక మంది విద్యార్థులు, ఉద్యమకారులు, సాధారణ ముస్లింలను జైలుకు పంపింది. కాగా, ఢిల్లీ అల్లర్లను ప్రేరేపించిన వారికి, ‘గోలీ మారో సాలోన్ కో’ అనే నినాదం ఇచ్చిన వారికి ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కింది. ఢిల్లీ అల్లర్ల కేసు ప్రత్యేకంగా మైనారిటీలు, మహిళలపై పెట్టింది. ఇక్కడ కూడా ప్రభుత్వం బెయిల్ నిరాకరించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ‘ఢిల్లీ అల్లర్ల’ కేసు నేడు మైనారిటీలపై నమోదైన కేసులకు ప్రాతినిధ్య కేసు; వారిని ‘తీవ్రవాదులు’, ‘దేశ ద్రోహులు’ అని ముద్ర వేయడానికి ఇటువంటి కల్పిత కేసులు దేశవ్యాప్తంగా చాలా ఉన్నాయి.
వలసరాజ్యాల కాలంలో, వలసవాద దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజా ఉద్యమాన్ని అణిచివేసేందుకు, తద్వారా విప్లవ స్రవంతిలోని ప్రజలను అణిచివేయడానికి మీరట్ కుట్ర, లాహోర్ కుట్ర లాంటి కల్పిత కేసులను పెట్టారు. ప్రస్తుత కాలంలో, బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్ట్ బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ ప్రభుత్వం, తన వలస ప్రభువుల నుండి సూచనలను తీసుకుంటూ, దోపిడీ, అణచివేతలకు, దేశ వనరులను దోచుకుంటున్న విదేశీ, స్థానిక కార్పొరేట్లు వ్యతిరేకంగా గళం విప్పే వారిని అణిచివేసేందుకు అవే వ్యూహాలను ప్రయోగించడం మనం చూస్తున్నాము..
NIA @ నేషనల్ ‘ఇంప్లికేటింగ్‘ (ఇరికించే) ఏజెన్సీ
ప్రజాస్వామిక హక్కులను అణచివేయడంలో ఎన్‌ఐఎ నేడు అగ్రగామిగా ఉంది. ఎన్‌ఐఎ ఏర్పడినప్పటి నుండి చాలా మంది సామాజిక-రాజకీయ కార్యకర్తలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలలో సామాన్య ప్రజలను తీవ్రవాద సంబంధిత కేసుల్లో పెట్టింది. వారు నిర్దోషులుగా విడుదలయ్యారు. వారిపై వచ్చిన అభియోగాలు చాలామటుకు అబద్ధమని తేలింది. నేడు తప్పుడు కథనాలను రూపొందించడంలో ఎన్‌ఐఎ కంటే మెరుగైన ఏజెన్సీ లేదు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే కేసుల్లో ఒక సాధారణ కథనం కల్పిస్తారనే విషయం వారి ప్రతి పత్రికా ప్రకటనలో కనిపిస్తుంది. మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా లేదా కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న ‘భయానక నక్సలైట్’ని అరెస్ట్ చేసినట్లు చెబుతారు. గత రెండేళ్లలో, ఈ కథనం ఆధారంగా చాలా మందిని ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. బహుశా ఏ రాజకీయ పార్టీలోకన్నా మావోయిస్టు పార్టీలోనే ఎక్కువ మంది కేంద్ర కమిటీ సభ్యులు వున్నారు.
ఆ తర్వాత, ఆ రాష్ట్రంలో లేదా దాని చుట్టుపక్కల ఉన్న సరిహద్దు రాష్ట్రాల్లోని వివిధ కార్యకర్తల నివాసాలపై దాడులు ప్రారంభమవుతాయి. ఈ రోజుల్లో అంతకు మించి దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. పట్టుబడిన ‘భయానక నక్సల్’ వద్ద దొరికిన జాబితాలో వున్నాయని చెబుతున్నవ్యక్తుల పేర్ల ఆధారంగా దాడులు జరుగుతాయి. నేడు, ‘భయానక నక్సల్’, నిరసన స్వరం రెండూ ఒకే కోవలోకి వస్తాయి. ఈరోజు, మీకు సమీపంలో ఉన్న వ్యక్తిని మావోయిస్టు అనే ఆరోపణపై అరెస్టు చేస్తే, ఆ ప్రాంతంలో పౌర సమాజాన్ని లేదా నిరసన స్వరాన్ని అణిచివేసేందుకు సన్నాహాలు చేశారని అర్థం చేసుకోండి. నేడు, ఎన్‌ఐఎ అనేది జాతీయ దర్యాప్తు సంస్థగా కాకుండా, ప్రజలను తప్పుడు ఆరోపణలలో ఇరికించే ఏజెన్సీగా మారింది; అసమ్మతి స్వరాన్ని అణిచివేసి ప్రజల్లో భయానక వాతావరణాన్ని సృష్టించడానికి ఈ రోజుల్లో ‘టెర్రరిస్ట్’, ‘మావోయిస్ట్’ లేదా అత్యంత ప్రజాదరణ పొందిన ‘ఓవర్ గ్రౌండ్ వర్కర్’ పేరుతో ప్రజలను అరెస్టు చేస్తోంది.
చిన్న జైలు నుంచి పెద్ద జైలుకు
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హేమ్ మిశ్రా మాట్లాడుతూ.. “ఇన్నాళ్లు జైల్లో ఉండి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత పరిస్థితుల్లో చాలా మార్పు కనపడుతోంది. నేను చిన్న జైలు నుండి “పెద్ద జైలు”కి తిరిగి వచ్చాను, దీని పరిధి దేశవ్యాప్తంగా ఉంది. ఇక్కడ అణచివేత భీభత్సం విస్తృతంగా ఉంది. భిన్నాభిప్రాయానికి శిక్ష జైలు” అన్నారు.
ఇప్పటి వరకు అత్యంత కీలకమైన భీమా కోరెగావ్ కుట్ర కేసులో దీన్ని మరింత బాగా అర్థం చేసుకోవచ్చు. ఈ కేసులో 16 మంది ప్రముఖ రాజకీయ-సామాజిక కార్యకర్తలను తప్పుడు కేసులో ఇరికించి ఉపా కింద జైలుకు పంపారు. 2018లో ప్రారంభమైన ఈ కేసు విచారణ ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పటి వరకు ఏడుగురికి మాత్రమే బెయిల్ వచ్చింది. ఈ కేసులో ‘బెయిల్ నియమం, జైలు మినహాయింపు’ అనే ప్రాథమిక సూత్రాన్ని తిప్పికొట్టి, ‘జైలే నియమం, బెయిల్ మినహాయింపును అమలు చేశారు. బెయిల్ వచ్చిన వారికి పెట్టిన షరతులు చదివితే.. వారిని చిన్న జైలు నుంచి బయటకు తీసుకొచ్చి పెద్ద జైలులో బంధించినట్లు కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో గోప్యత అనే ప్రాథమిక హక్కును న్యాయవ్యవస్థనే ఉల్లంఘిస్తోంది. నాగ్‌పూర్ యూనివర్శిటీలో ఇంగ్లీషు విభాగం అధిపతిగా పనిచేసిన షోమా సేన్‌కు ఇటీవల బెయిల్ మంజూరైంది. ఆమె గత 6 సంవత్సరాలుగా జైలులో ఉన్నారు. ఆమె బెయిల్ షరతులు ఇలా ఉన్నాయి-
1) షోమా తన పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేయాలి. రాష్ట్రాన్ని వదిలి బయటకువెళ్లకూడదు.
2) ఆమె తన ఇంటి అడ్రసు ఎన్‌ఐఎకి తెలియచేయాలి.
3) ఆమె తన ఫోన్ నంబర్‌ను ఎన్‌ఐఎకి ఇవ్వాలి; ఆన్ లో వుంచాలి; మొబైల్ జిపిఎస్ ఎప్పుడూ ఆన్ లో ఉండాలి; మొబైల్ ఎల్లప్పుడూ ఎన్‌ఐఎ అధికారికి కనెక్ట్ అయి వుండాలి, తద్వారా ఆమె వున్న స్థలాన్ని తెలుసుకోవచ్చు.
ఆమెకు వ్యతిరేకంగా ప్రాథమిక సాక్ష్యాధారాలు లేవని బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి చెబితేనే ఇన్ని షరతులు ఉన్నాయి.
ఈ కేసులో నిందితుడిగా ఉన్న రచయిత, మానవ హక్కుల కార్యకర్త గౌతమ్ నవలఖా నాలుగు సంవత్సరాల జైలు శిక్ష తర్వాత అనారోగ్యం కారణంగా 2022 నవంబర్ నుండి ముంబైలో గృహ నిర్బంధంలో ఉన్నారు. వీటన్నింటికి మించి, గృహనిర్బంధ సమయంలో అతని భద్రతకు అయిన ఖర్చుల కోసం ఎన్‌ఐఎ ఇటీవల అతని నుండి 1.64 కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది. జైలులోపలి ప్రపంచానికీ, జైలు బయటి ప్రపంచానికీ పెద్దగా తేడాలేనంతగా స్వేచ్ఛా పరిధులు సంకుచితంగా మారాయని ఈ రెండు ఉదాహరణలు స్పష్టం చేస్తున్నాయి. అప్రకటిత ఎమర్జెన్సీ, ఫాసిస్టు యుగంలో, భారత రాజ్యం క్రూరమైన చట్టాల సహాయంతో మేధావులతో పాటు సాధారణ ప్రజలను కూడా అణచివేస్తోంది. మావోయిజం, ఉగ్రవాదాల గురించి ఎన్‌ఐఎ తదితర ఏజెన్సీలు సృష్టించిన కథనాలను అర్థం చేసుకోవడానికి, బహిర్గతం చేయడానికి, ఈ కేసులకు సంబంధించిన వాస్తవాలను తెలుసుకోవడం, బహిర్గతం చేయడం చాలా ముఖ్యం; వాస్తవానికి ఇది కూడా వారి దృష్టిలో ఒక నేరం.
– దీపక్ కుమార్ , రాజ్య అణచివేత వ్యతిరేక ప్రచారోద్యమం సభ్యుడు
DEEPAK JI —I AGREE WITH U SIR—U R RIGHT
==============
BUCHIREDDY GANGULA