పచ్చ పచ్చనిఅడవుల్లో
పారేటి జలపాతాల్లో
ఎనక ముందు శత్రువులుంటరు చేతులు పట్టుకో
నా బిడ్డా
ఆకలి నేర్పిన దారులలో
సాయుధ పోరు బాటలలో
నవ్వుతూ ముందుకు
నడిచే దారిలో
చేతిని వదలను నా కొడుకా
వీరుల గన్న తల్లులతో
పోరుల కలిసే అక్కలతో
మోదుగు తీగల అల్లుకుపోయి
దండిగ నడువు నా బిడ్డా
గాయం తగిలిన చెల్లెలితో
గేయం పాడినా తమ్ముడితో
త్యాగం నేర్పిన అన్నల బాటల
అడుగులు ముందుకే నా కొడుకా
కమ్మిన కారుమబ్బుల్లో
కురిసే చినుకుల జల్లులలో
ఎముకలుకొరికే గాలుల్లో
ఎదురుగానడువు నా బిడ్డా
బాంబులవర్షపు దారులలో
భారు ఫిరంగుల మోతలలో
అదురు బెదురు అటకనబెట్టి
ముందుకె నడవు నా కొడుకా
మనసుకు భారంఅవుతున్న
దేహం అలిసిపోతున్న
గుండెను దండిగ ధైర్యం చేసి
దళముతోనడువు నా బిడ్డా
కులమేలేని కలయికలో
మతమే లేని మనుషులో
మానవత్వపు విత్తన సాలులో
అరకై సాగు నా కొడుకా
కాళ్లకు చెప్పులు లేకున్నా
కంటికి నిదురే రాకున్నా
కాలం చక్రపుదారులలో
బండై నడువు నా బిడ్డా
కోకిల రాగపు పాటలతో
జింకల గంతుల ఆటలలో
నవ్వుతూ యుద్ధం చేయుటకై
సిద్ధంగుండురా నా కొడకా
అన్నపురాశుల కుప్పలను
ఆకలి మంటల బావులను
సరిచేసేటి దారిలో నువ్వు
సక్కగా నడువు నా బిడ్డా
అనిచివేతల రణమాయి
పీడిత వర్గపు కొలువాయి
ప్రాణం తీపి ఎరుగని దారిలో
రుతువై నడువు నా కొడుకా
ఎర్రని జెండా ఏడున్న
చల్లనిమాటతో కలువమ్మ
వర్గశత్రువును గెలిచే దారిలో ఒకటై నడువు నా బిడ్డా
ఆశయ కలలా దారుల్లో
అమరుల త్యాగపు బాటల్లో
ఎర్రని జెండా నీడలో నువ్వు
ఎన్నడు ఆగకు నా కొడుకా...
