యుద్ధం
నిజంగా ముగిసిందా?

యుద్ధం ముగిసిపోతే
అమ్మ లేని నేను
ఎక్కడున్నట్టు మరి

యుద్ధం ముగిసిపోతే
తూటాలు పేలిన నా కన్నులలో
చూపులెందుకు లేవు మరి

యుద్ధం ముగిసిపోతే
ఊడిన నా చేతులూ కాళ్ళూ
ఎందుకని దొరకడం లేవు
నాలో ఒంటరితనం
ఎందుకని పోవడం లేదు

యుద్ధం నిజంగా ముగిసిపోతే
అమ్మ లేదనే
ఈ శూన్యభావనలను ఏమంటారు?

యుద్ధమిప్పుడు
బాంబుల వర్షంగానో
తూటాల శబ్దంగానో లేదు
అమ్మతో మాటను పంచుకోవాలని
తహతహలాడిన గాత్రంలో ఉంది
కన్నులలోంచి జలపాతమై జారిన
దుఃఖకాంతులలో ఉంది

అమ్మను కోల్పోయిన పసిపిల్లాడి పొట్టలో,
అమ్మ కోసం చూసే ఎదురుచూపుల్లో
తాండవమాడుతుంది యుద్ధం

యుద్ధమిప్పుడు
గాయపడ్డ బాల్యంలో ఉంది
హత్యకాబడ్డ మానవీయత మీద
నర్తిస్తూ ఉంది

యుద్ధం ముగిసిందనే వార్త విని
అమ్మను తలుచుకుంటూ ఏడుస్తున్న
పిల్లవాడి ఎక్కిళ్ళ శబ్దాల మధ్యన వుంది యుద్ధం

యుద్ధం ముగిసిందనే వార్త విని
పిల్లలను వెతకడానికి పరుగు తీసిన
తల్లి గుండెసడిలో దాగి వుంది యుద్ధం

ఇక్కడ యుద్ధం
కేవలం వార్త కాదు
నిత్య జీవితంలో భాగం.

(బాంబుల వర్షం పాలస్తీనాలో ముగిసిందో లేదో తెలియదు గానీ, బస్తర్ లో కురుస్తూనే వుంది)

05.02.2025

Leave a Reply