నిజమే! అప్పుడప్పుడు
మరణాలు గురించి మాటాడుకుంటాం,
జీవితం నిండా విజయదరహాసాలను
వెదజల్లుకుంటూ నడిచిన ప్రయాణాల గురించి
చర్చించుకుంటాం

మరణం దాకా
ప్రవహించిన ఎగుడుదిగుళ్ళ ప్రవాహాల గురించీ
మాట్లాడుకుంటాం..

దారులలో ముళ్ళను ఏరుకుంటూ గాయాల మూటల్లోకి
బతికుని సర్దుకుంటూ
అనుకున్న పనులు నిర్వహించుకుంటూ శ్వాస ఆగేదాకా
సాగిన ప్రవాహాల గురించి చర్చించుకుంటాం

అతడు మిగిల్చిపోయిన పనులని స్నేహితుల మధ్యలో పంచుకుంటాం
దేహంలో అరణ్యం లా అతడి భావాల్ని పెంచుకుంటాం

అంతరంగం నిండా అతడిక్కడ వొదిలి వెళ్ళిన
ఉద్యమ పవనాల్ని పీల్చి ఆ గాలిలో అతడి ప్రాణాన్ని వెదుక్కుంటాం
అతడెప్పటికీ మనల్ని వీడిపోలేదనే ఆలోచన మన నడకలో వేగాన్ని పెంచుతుంది

మరణాలతో మనం దేహాల్ని కోల్పోవచ్చు
కానీ చాలా మరణాలు జీవించడాన్ని కోల్పోవు

అవి తమసహచురల ఆచరణలో దీపాల్లా
వెలుగుతుంటాయి

గాలి లాగా అగ్ని లాగా
పరిణామక్రమంలాగా
కెరటాల హోరులాగా
కాలచక్రంలాగా
చాలా వాటికి మరణం ఉండదు

వాళ్ళ ఆచరణలో వెంటనడిచిన గాలీ,
వాళ్ళ నినాదాల్లో ఊపు నింపిన అగ్నీ
పిట్టల గొంతు విడిచే రాగాలాపనా
మరణం లేనివి
మరణించడం చేతగానివి...
కొన్ని మరణాలని మరణాలని అనలేం
అవి అనంత విశ్వాసం నింపుతూ ఉండే స్నేహహస్తాలు!

Leave a Reply