లేను నేను ఏ కర్రెగుట్టల్లో 
మధ్య భారతాన్ని ఏలే ఏ దండకారణ్యంలో
దిక్కులు దద్దరిల్లే ఏ యుద్ధ క్షేత్రంలో
తిరగపడ్డ ఏ గలాల గర్జన పరిధిలో
దూసుకొచ్చే ఏ తూటాల దారిలో

అయినా
నాలో యుద్ధ చురకలు ఉరకలెత్తుతున్నాయి
అమరుల గుండె నెత్తుటి వేడి నాలో ప్రవహిస్తుంది
వెనుతిరగని వీరత్వం అటు వైపుగా నడిపిస్తుంది

నా ప్రశ్నకు నీ సమాధానం తూట అయితే
నా ధైర్యాన్ని చంపే ఆయుధం నీ దగ్గర లేదంటాను
నా గమనాన్ని నిలిపే ముగింపు మరణమే అయితే
నా ఆలోచనలను ఆపే నీ బలగాలు సరిపోవంటాను

తిప్పుతాను దిక్సూచినై నీ వైపు అందరి చూపులని
కాల్చుతాను నిప్పునై నీ కుట్రల కపట తెరలని
బద్దలగొడతాను ఫిరంగినై నీ కాషాయ కోట గోడలని
కళ్ళకు కడతాను దండకారణ్య జనతన రాజ్యాన్ని

దిక్కు మార్చి దృష్టి మార్చి
తీక్షణంగా పరికించు
గ్రామo నగరం కదులుతుంది
కనిపించని కల్లోలం రగులుతుంది

ఎర్రని బావుట అస్తమించని అరణ్యంలో
రవినై వస్తున్నాను !
మినుగురునై వస్తున్నాను !
కలం పట్టి గళం విప్పి కాలు దువ్వి
కవినై వస్తున్నాను !
నేల రాలిన ఆదివాసుల హక్కునై
దిక్కరిస్తూ వస్తున్నాను !
పోరు మార్గంలో
ప్రజా దండునై
సాయుధ రధ సారధినై వస్తున్నాను !
నీ రాజ్యాన్ని
నీ అధికారాన్ని కూలదోసే
విప్లవాన్నై వస్తున్నాను !

2 thoughts on “వస్తున్నాను

Leave a Reply