కేంద్రంలోని నరహంతక పాలకులు షెడ్యూల్ ఐదు అడవి ప్రాంతాలలో ఖనిజ సంపదను బహుళజాతి కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు జనవరి 2024 నుండి కగార్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఆపరేషన్ కగార్ అంతర్యుద్ధం ఈ దేశ సొంత పౌరులను చంపుతూ ముందుకు సాగుతోంది. ఈ ఆపరేషన్ లో అత్యాధునిక ఇజ్రాయెల్ సాంకేతికత, ఆయుధాలను ఉపయోగిస్తూ ప్రజలను విప్లవకారులను చంపుతూ కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. పాలకులు చేస్తున్న ఈ దురాగతాలు వ్యతిరేకిస్తూ ప్రజలకు అండగా నిలిచి పోరాడుతున్న విప్లవ నాయకుడు కామ్రేడ్ అడెల్లు @ భాస్కర్ ఛత్తీస్గఢ్ అడవుల్లో జూన్ ఆరవ తేదీన బూటకపు ఎన్కౌంటర్ లో అమరుడైనాడు. ఆ కామ్రేడ్ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. అత్యంత ఘనంగా జూన్ 9 వ తేదిన వీడ్కోలు పలికారు.

కామ్రేడ్ మైలారపు అడెల్లు (భాస్కర్) తన 51 ఏళ్ల ప్రయాణంలో ప్రజలతో మమేకమై బతికాడని చెప్పడానికి అతని అంతిమ యాత్రనే ఉదాహరణ. తన సొంతూరు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పొచ్చర గ్రామంలో వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి నివాళులు అర్పించారు. తాను బతికున్నప్పుడు తన ఆచరణ ద్వారా తెలంగాణ, ఛత్తీస్గఢ్ , మహారాష్ట్రాలలో వందల గ్రామాలు, వేల మంది ప్రజలను బంధువులుగా సంపాదించుకున్నాడు.

జూన్ ఆరు నాడు ఎన్కౌంటర్ లో చనిపోయాడని తెలిసి కుటుంబసభ్యులు తమ సోదరుని దేహాన్ని తీసుకురావడానికి వెళ్తే‌ అంతకు ముందే తమ ప్రియతమ నాయకుడు ఇక లేడని తెలిసి పదుల సంఖ్యలో ఛత్తీస్గఢ్ ఆదివాసీలు యాబై మైళ్ళు నడిచి బిజాపూర్ ఆసుపత్రికి‌వచ్చి తమ‌ నాయకుడికి వారి ప్రాంతంలో అంతిమ యాత్ర నిర్వహించుకుంటామని కుటుంబసభ్యులను వేడుకున్నారు. వెంటనే అప్రమత్తమైన రాజ్యం పోరు ప్రాంతంలో అంతిమ యాత్రకు అవకాశం లేకుండా రెండు వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి కా.బాస్కర్ మృతదేహాన్ని, కుటుంబసభ్యులను తెలంగాణ బార్డర్ దాటించారు.

కా.భాస్కర్ కు బిజాపూర్ ఆదివాసీలలో వున్న ఆదరణ, ప్రేమ అభిమానాలు ఎంత గొప్పవో అర్థం చేయడానికి ఈ సంఘటన చాలు. కుటుంబసభ్యులది రక్త సంబంధం అయితే ఛత్తీస్గఢ్ ఆదివాసీలది వర్గ సంబంధం. రక్త సంభంధం కన్నా వర్గ సంభందమే మిన్న అని ఆచరణలో రుజువు చేసిన విప్లవకారుడు కామ్రేడ్ భాస్కర్. 

కా.భాస్కర్ దాదాపు రెండు దశాబ్దాల పాటు దండకారణ్యంలోని అడవి ప్రాంతాలలో ఆదివాసీలకు బతుకుదెరువు చూపిస్తూ, రోగమొస్తే వైద్యమందిస్తూ వారిలో ఒక్కడిగా బతికాడు. వారి భాష, యాస, సంస్కృతిలో లీనమై ఆదివాసీలలో కలిసిపోయాడు‌. అక్కడి ప్రజలు నివసిస్తున్న అడవి నేషనల్ పార్క్(జాతీయ అభయారణ్యం) గా మార్చబడి ఒక సందర్భంలో అక్కడ నివసిస్తున్న ఆదివాసీలను నిర్వాసితులుగా మార్చుతున్న సందర్భంలో వారికి అండగా నిలిచింది సిపిఐ మావోయిస్టు పార్టీ.అ యితే పార్టీ చేపట్టిన ఆ పోరాటానికి కా. భాస్కర్ ప్రత్యేక్షంగా నాయకత్వం వహించాడు. వారికి వ్యవసాయం నేర్పించారు. జల్, జంగల్, జమీన్ పాఠాలు బోధించారు. కూడు, గూడు, చదువు నేర్పిన ఆ నాయకుడు లేడని ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఆదివాసీలు ఎంత బాదపడినారో అదే స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజలు అంతే దుఃఖ పడినవారు. తాను ఎక్కడ అడుగుపెట్టిన నలుగురు బంధువులను సంపాదించుకునే కా.భాస్కర్ కి ఉమ్మడి ఆదిలాబాద్, బిజాపూర్ జిల్లాలు రెండు కళ్ళు. తాను ఎక్కడున్నా ఆదిలాబాద్ జిల్లా ప్రజలకై పరితపించాడు.

1974లో ఏర్పడిన రాడికల్ స్టూడెంట్ యూనియన్ అనతి కాలంలో జిల్లాలకు, మండలాలకు, గ్రామాలకు పాకినప్పుడు కా.భాస్కర్ నిర్మల్ డివిజన్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతూ ఆర్ ఎస్ యూ లో చేరాడు. కళాశాలలో పేద దళిత బహుజన విద్యార్థులను పీడిస్తున్న ఎబివిపి గుండాలను ఎదిరించడంతో అనతికాలంలోనే విద్యార్థుల అభిమానులను పొందాడు. కళాశాల అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. విద్యార్థి నాయకుడిగా అత్యంత చురుకైన పాత్ర పోషిస్తూ ప్రజల సమస్యలపై దృష్టి సారించారు. విప్లవోద్యమ రాజకీయాలు మొదటి పరిచయం తన గ్రామానికి చెందిన సోదరుడి వలన జరిగినప్పటికీ రాడికల్స్ ప్రభావం తనని చివరి వరకు నిలబెట్టింది. తను చిన్నతనంలో వారి గ్రామంలో నెలకొన్న కులవివక్ష, అంటరాని తనం, దొరతనం ఆగడాలను కంటి నిండా చూస్తూ పెరిగాడు.భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడాలని నిశ్చయించుకొని పొచ్చెరలో దళిత బహుజన యువకులతో కలిసి భూపోరాటం నడిపాడు. ఆ గ్రామంలో జరిగిన భూ పోరాటం ప్రభావంతో ఆ గ్రామంలోని దళిత వాడ నుండి మగ్గురు యువకులు పూర్తి స్థాయి కార్యకర్తలుగా సిపిఐ ఎంఎల్ పీపుల్స్ వార్ కార్యకర్తలుగా చేరారు. అందులో ఒక్కరు కామ్రేడ్ భాస్కర్ గా మారిన కా.మైలారపు‌ ఆడేళ్ళు. దోపిడి, వివక్షతల నుండి‌ పోరాటాలు, ఉద్యమాలు ఎగిసిపడ్తాయాని అందులో నుండి నాయకులు ఉద్భవిస్తారనడానికి ఉదాహరణ కా.భాస్కర్ ప్రస్థానమే. అలా మొదలైన కా.భాస్కర్ ప్రస్థానం ముప్పై ఏళ్ళుగా వెనుదిరిగి చూడకుండా ముందుకు సాగింది.

ఆదిలాబాద్ జిల్లాలోని గోండు, కోయ, కొలాం ఆదివాసీలకు, దళిత బహుజనులకు కామ్రేడ్ భాస్కర్ కొండంత అండగా నిలబడ్డాడు. కా.భాస్కర్, మరికొందరు విప్లవకారుల మద్దతుతోనే‌ నాడు ప్రజలు పోడు భూములు నరుక్కున్నారు అవి నేడు హక్కు పత్రాల ద్వారా పట్టా భూములుగా మారి నేడు ఆదివాసులకు బతుకుదెరువుగా వున్నాయి. పోడు భూములకు హక్కు పత్రాలకై సాగిన ప్రజా పోరాటాలకు కూడా ఆయన మార్గదర్శకం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి నుండి సిర్పూర్ వరకు కొన్ని  వేల ఎకరాల పోడు భూములు, అడవి భూములను పేద ప్రజలకు హక్కుగా అందచేయడమే కాక ఈ జిల్లాలోని పదుల సంఖ్యలో భూస్వాములను తన్ని తరిమి వారి భూములను దళిత బహుజనులకు పేదలకు పంచారు. అటవిశాఖ అధికారుల ఆగడాలను, దోపిడీని అరికట్టాడు .కామ్రెడ్ బాస్కరన్న దోపిడీ దారులకు, భూస్వామ్య గుండాలకు సింహ స్వప్నం. సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లు, సిమెంట్ కంపెనీల దౌర్జన్యాలను, కవ్వాల్ టైగర్ జోన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పోరాటాలు నిర్మించాడు. మైదాన ప్రాంతగ్రామాలలో రెండు గ్లాసుల పద్దతి, అంటరానితనం నిర్మూలనకు అందరి ఇళ్ళలో జమచేసిన అన్నాన్ని సామూహికంగా తినిపించడం, గ్రామాల్లో కులాంతర ప్రేమ వివాహాలు జరిగినప్పుడు వివాదాలు తలెత్తితే పార్టీ ఆధ్వర్యంలో పంచాయతీ పెట్టి మనుషులంతా సమానమని భోధించేవారు. అదే సమయంలో తానెప్పుడూ తనది పలానా కులమని చెప్పుకోకుండా చాలా హుందాగా కుల నిర్మూలన స్పృహను ప్రదర్శించాడు.

ముప్పై ఏళ్ల తర్వాత బూటకపు ఎన్కౌంటర్ లో చనిపోయి నిర్జీవంగా సొంత గ్రామం పొచ్చరకు వచ్చిన కా.భాస్కర్ ను ఊరుఊరంతా అక్కున చేర్చుకుంది. అన్ని సామాజిక వర్గాల ప్రజలు పనులు మానుకొని ఆ రోజంతా అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఆ అభిమానం చూసిన రాజ్యం పోలీసుల ద్వారా అంతిమ యాత్రలో ఆంక్షలు విధించింది. ఎక్కువ మంది గుమిగూడవద్దని హెచ్చరిస్తూ డిజే వాహనంను తీసుకొని వెళ్ళారు. చనిపోయి కూడా రాజ్యాన్ని భయపెట్టే శక్తి విప్లవ కారులకు వుంటుందని మరోసారి రుజువైంది. తను యువకునిగా వున్నప్పుడు చేసిన భూ పోరాటాల ప్రభావం ఆ గ్రామంలో ఎంతలా వుందంటే‌ ఆ గ్రామంలో నెలకోల్పబడిన జ్యోతిరావు పూలే, సావిత్రి భాయి పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్,శివాజి,బాబు జగజ్జీవన్ రావ్ వంటి మహనీయుల విగ్రహాలే సాక్ష్యం. ఆ గ్రామంలో నెలకొన్న చైతన్యం ఆ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దింది.ఆ వీర గాథలు విన్న నేటి యువత జోహార్ కామ్రేడ్ భాస్కరన్న అని నినదిస్తుంటే వందల భాస్కర్లు ఉదయించకమానరనే స్పష్టమైంది. కామ్రెడ్ భాస్కర్ చనిపోలేదు ప్రజల్లో సజీవంగా ఉన్నాడు.సమాజంలో నెలకొన్న అంతరాలు పోవాలని దోపిడీ నశించాలని అనేక మంది విప్లవకారులు తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేశారు.వారి మార్గంలో‌ ప్రయనిస్తూ కా.భాస్కర్ అమరుడైనాడు. ”ఇక  వెళ్ళి రా‌ కామ్రేడ్,నీ ఆశయం ఇక మాదని చెప్దాం, నీవిత్తిన మొక్కలు పెరుగుతాయని వాగ్ధానం చేద్దాం”

Leave a Reply