కామ్రేడ్ చీమల నరుసయ్య నవ యవ్వన ప్రాయంలోనే అడవి దారి పట్టాడు. అప్పటికి ఆయన వయసు రెండుపదులు నిండి వుంటాయేమో! అప్పటివరకు ఆయన గురించి మాకు తప్ప బయట ఎవరికి తెలుసు? 1978లో ప్రస్తుత పెద్దపల్లి జిల్లా రాఘనేడు భూస్వాములను ‘సార్లు’ (మల్లోజుల కోటేశ్వర్లు) అపహరించి రైతాంగ డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చలు జరిపిన నాటికి నరుసయ్య ఇంకా వెలుగులోకి రాలేదు. కేశోరాం సిమెంట్ కంపెనీలో కార్మిక నాయకుడిగా చలామణి అవుతూ గూండాగిరి, దాదాగిరి చలాయించే హసనొద్దీన్‌ను నక్సలైట్లు మట్టుబెట్టిన నాటికి కూడ నరుసయ్య సాధారణ ఊరి యువకుడే. మా పొరుగూరు పాల్తెం గన్ను పటేల్ ఆగడాలపై ప్రజాపంచాయతీ జరిపిన నాటికి చీమల నరుసయ్య సంఘ సభ్యుడయ్యాడు. అప్పటికే ఆ ప్రాంతంలో మల్లోజుల భాగమై, చరిత్రతో నడిచి, కోటేశ్వర్లు పేరు చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. అంతకన్నా ఎక్కువగా పెద్దపల్లి ఆర్గనైజర్‌గా బయ్యపు దేవేందర్ రెడ్డి పేరు వింటేనే భూస్వాముకు కునుకు పట్టని పరిస్థితి నెలకొంది. బయ్యపు దేవేందర్ రెడ్డిని యువత ‘దేవన్న అని పిలుచుకునేవారు. మా నరుసన్నకు దేవన్నంటే మహా ప్రాణం, గురువు.
మా ప్రాంత యువతకు కూడా దేవన్న అంటే ప్రాణం. నిజం చెప్పాలంటే, ఆయన దొరతనాన్ని గడగడ లాడిరచిన తీరును మేమంతా ఆయన గురించి కథలు కథలుగా చెప్పుకునే వారమంటే సరిగా వుంటుంది. దేవన్న సంఘటితం చేసిన యువకులలో చీమల నరుసయ్య ఒకరు. సంఘంలో చేరి సంఘంలో స్థానిక నాయకుడయ్యాక చీమల నరుసయ్య చుట్టు పక్కల గ్రామలకు పరిచయమయ్యాడు. పెద్దపల్లి ప్రాంత భూస్వామ్య వ్యతిరేక పోరాటాల కొలిమి నుండి అనేక మందిలా చీమల నరుసయ్య కూడా ముందుకు వచ్చాడు. అలా అపుడపుడే నరసయ్య జనానికి చేరువవుతున్న రోజులు. అవి ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇక ఆ తరువాతి జీవితమంతా ఆయన జోగన్నగానే ఈ ప్రపంచానికి తెలుసు. చీమల నరుసయ్య జోగన్నగా మారడానికి దారి తీసిన పరిస్థితులు తప్పనిసరి తెలుసుకోవాలి. చరిత్ర నుండి పుట్టి, చరిత్రలో భాగమై, చరిత్రతో నడిచి, చరిత్రను సృష్టించిన వారి గురించి చారిత్రకంగానే తెలుసుకోవాలి.
కామ్రేడ్ చీమల నరుసయ్య జయ్యారంలో 1950వ దశాబ్దం రెండవ భాగంలో నిరుపేద దళిత కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లల తరువాత లింగయ్య, భీమరాజులకు జన్మించాడు. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో, ఉన్న కాస్త భూమి కోసం ఊళ్లో దాయాదుల వేధింపులు భరిస్తూనే తల్లి ఎంతో ముద్దుగా నరుసయ్యను సాదుకుంది. ఇద్దరు బిడ్డల పెళ్లిళ్లు చేసిన భీమరాజు కొడుకు మీదే గంపెడంత ఆశలు పెట్టుకొని అన్ని బాధలు భరిస్తూ జీవించింది. నరుసయ్యకు చిన్ననాటినుండి ఎలాంటి చెడు వ్యసనాలు, వ్యాపకాలు లేవు. తల్లితో పాటు కూలీ పనులు, వ్యవసాయ పనులలో పాల్గొంటూ ఎదుగుతున్న క్రమంలో ఆ ప్రాంతంలో ఊపందుకున్న భూస్వామ్య వ్యతిరేక పోరాటాల ప్రభావం నరుసయ్యపై బలంగా పడిరది. జయ్యారానికి దగ్గర్లోనే బసంత్ నగర్ (తక్కెళ్లపెల్లి), రామగుండం, గోదావరిఖని మొదలైన పారిశ్రామిక ప్రాంతాలు అప్పటికే ఏర్పడి వుండడంతో కార్మికుల జీవితాల గురించి కూడ నరుసయ్య తెలుసుకుంటూ వుండేవాడు.
పాత కరీంనగర్ జిల్లాలోని ఇతర ప్రాంతాల భూస్వాములకు, పెద్దపల్లి ప్రాంత భూస్వాములకు మధ్య కొన్ని విశిష్టమైన తేడాలే వుండేవి. ఇక్కడి భూస్వాములలో కరుడు కట్టిన కర్కశత్వం కాసింత తక్కువే అని చెప్పుకోవచ్చు. భూస్వామ్య వ్యతిరేక పోరాటాలలో చాలా మందే భూస్వాములు అన్నల ముందు ప్రజలతో రాజీలు కుదుర్చుకొని సర్దుకు పోవడానికే సిద్ధమయ్యేవారు. సంఘ నాయకుడిగా ఎదిగి వచ్చిన చీమల నరుసయ్య ఇంకా పెద్దగా అనుభవం గడిరచకముందే జిల్లాలో బూటకపు ఎన్‌కౌంటర్ల పర్వం ప్రారంభమైంది. అప్పటికే జిల్లాలోని సిరిసిల్లా, జగిత్యాల ప్రాంతాలు కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటితమై వున్నాయి. భూస్వామ్య వ్యతిరేక ప్రజా పోరాటాలతో బెంబేలెత్తిన దొరలు పట్టణాలకు పరుగు తీశారు. భూస్వాములకు అండగా రాజ్యం పల్లెలకు చేరింది. పల్లెల్లో దొరల గడీలలో పోలీసు క్యాంపులు వెలువడడం మొదలైంది. పెద్దపల్లి ప్రాంత ఆర్గనైజర్ బయ్యపు దేవేందర్ రెడ్డి కదలికల గురించి సమాచారం పొందిన స్థానిక పోలీసు అధికారి ప్రకాశ్ రెడ్డి జిల్లాలో మొదలైన ఎన్‌కౌంటర్ల పరంపరలో భాగంగా 1980 ఫిబ్రవరిలో శివరాత్రి రోజు దేవన్నని కాల్చిచంపాడు. కామ్రేడ్ బయ్యపు దేవేందర్ రెడ్డి అమరత్వం మా ప్రాంత యువతలో బదులు తీర్చుకోవాలనే బలమైన వర్గకసిని ప్రేరేపించింది.
కామ్రేడ్ బయ్యపు దేవేందర్ రెడ్డి హత్యతో సంతోషించిన దొరలు దేవుడి మొక్కులు తీర్చుకోసాగారు. అలాంటి దొరలు, పెత్తందార్లలో జయ్యారం ప్రాంతపు రామలింగు ఒకడు. జిల్లాలో రెడ్డి, వెలమ, బ్రాహ్మణ, కర్ణం కులాల దొరలతోపాటు అక్కడక్కడ బొందిలి (దిగజారిన రాజపుత్రులు), గౌడ, పెరక, కాపుల ప్రాబల్యం కూడ వుండేది. రామలింగు ఈ కోవలోని వాడే. దేవేందర్ రెడ్డి హత్యతో సంతోషించిన రామలింగు తిరుపతి వెళ్లి వేంకటేశ్వరుడికి మొక్కు తీర్చుకొని తిరిగి వస్తుండగా కబురు దొరికిన చీమల నరుసయ్య కొంతమంది సంఘ కార్యకర్తలను వెంట తీసుకొని దారిలో బస్సును అడ్డగించి రామలింగును బస్సులో నుండి దింపి హత్య చేసి దేవన్న హత్యకు బదులు తీర్చుకున్నారు. ఆ తరువాత గోదావరిఖని వెళ్లి అక్కడి కార్మిక నాయకుడు కామ్రేడ్ కట్ల మల్లేష్ సలహాపై కోర్టులో చీమల నరుసయ్య ఆయన సహచరుడు పసుల రాజయ్య సరెండరయ్యారు.
గోదావరిఖని వాతావరణం అప్పటికే ప్రచండ నిప్పులు చెరుగుతోంది. ఎస్.ఐ. ప్రకాశ్ రెడ్డి మీద చర్య తీసుకోడానికి ఇద్దరు కార్మిక యువకులు గురజాల రవీందర్, సాంబశివరావు విఫల ప్రయత్నం చేసి పోలీసులకు పట్టుబడిన రోజులవి. అలాంటి పరిస్థితులలో చీమల నరుసయ్య బయట వుండలేక విధిలేక కోర్టు ముందు లొంగిపోయాడు.
కోర్టులో లొంగిపోయిన చీమల నరుసయ్య, పసుల రాజయ్యలు దాదాపు 10 మాసాలు జైలులో గడిపి, 1983 మొదటి మాసాలలో బెయిల్‌పై బయటికి వచ్చారు. ఆ వెనువెంటనే వారిద్దరూ అడవిబాట పట్టారు. అడవిలో పసుల రాజయ్య భామ్రాగఢ్ ప్రాంతం వెళితే, చీమల నరుసయ్య ఏటపల్లి ప్రాంతం వెళ్లాడు. ఏటపల్లి ప్రాంతంలో చీమల నరుసయ్య, జోగన్నగా పేరు మార్చుకున్నాడు. 1983-2020 మధ్య 37 సంవత్సరాల కాలమంతా ఆయన జోగన్నగానే జీవించాడు. మధ్యలో అతికొద్ది సమయం (2003-04) గిస్సు పేరుతో అహెరీ ప్రాంతంలో పని చేశాడు. ఇక అక్కడ అడవి ఉద్యమంలో దళితులు అనే ప్రస్తావనకే అవకాశం లేకుండా పోయింది. అడవి గ్రామాలలో అక్కడక్కడ దళితులు వున్నప్పటికీ, వారిని ఆదివాసీలు అస్పృశ్యులుగానే చూస్తున్నప్పటికీ విప్లవకారుల విషయంలో మాత్రం కులం ప్రస్తావనే వచ్చేది కాదు. ప్రజలు తెచ్చేది కాదు. విప్లవ గెరిల్లా దళాలలో అన్ని కులాల వారు వుండేవారు. దళాలలో అధికశాతం వ్యవసాయ శ్రామిక కులాలకు చెందిన వారే వుండేవారనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు.
కామ్రేడ్ జోగన్న పని చేస్తున్న ఏటపల్లి ప్రాంతంలో సంపన్న ఆదివాసీ మాడియా తెగ పెత్తందారులు జిల్లాలోని మిగితా ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువ సంఖ్యలోనే వుండేవారు. వారికి ప్రభుత్వ వ్యవహారాలతో, రాజకీయ పార్టీలతో దగ్గరి సంబంధం వుండేది. ఒడ్జెర, బిడ్రి, ఏమిలీ, పిపిలీ, తుమిరిగుండ, గేదే, చందన్ వెల్లి, కుదిరి, చౌకెవేడ, కోయందూడ్ టోలా, జప్పీ, గట్ట, సిరిపూర్ మున్నగు చోట్ల నిరంకుశ ఆదివాసీ తెగ భూస్వామ్య, పెత్తందారులు వుండేవారు. వారికి అహెరీ రాజకుటుంబానికి సన్నిహిత సంబంధాలు వుండేవి. చట్టసభలలో ప్రజలకు ప్రాతినిధ్యం వహించేది ఎక్కువ వరకు ఈ రాజకుటుంబమే. గ్రామాలలో ఈ తెగ పెత్తందార్లకు తెలువకుండా ప్రజలు ఏది చేయాలన్నా ఎంతో సాహసం చేయాల్సిందే. మరోవైపు ఈ పెత్తందార్ల పొడ గిట్టనివారు గెరిల్లాలను ఎంతో ఆదరించేవారు. ఇలాంటి గ్రామాలలో కోయందూడ్, కుదరి, మోహర్డీ, గొట్ట, బూర్జ, హెట్టడ్ కస మున్నగు పలు గ్రామాలు వుండేవి. గ్రామాలలో పెత్తందార్ల ప్రభావమే అధికంగా వుండడం, నక్సలైట్లంటే ప్రజా వ్యతిరేక శక్తులనీ పోలీసులు చేసిన ప్రచారంతో పాటు వాస్తవాలు తెలియని ప్రజలలో తొలినాళ్లలో గెరిల్లాల పట్ల ఆదరణ తక్కువనే చెప్పవచ్చు.
సాధారణ ప్రజలలో గెరిల్లాలంటే సానుభూతి, ప్రేమ వున్నప్పటికీ, పెత్తందార్ల భయంతో అది చాలా కాలం వరకు అవ్యక్తంగానే వుండిరది. గ్రామాలలో గెరిల్లాలకు తిండి దొరకదనే సమస్య వుండేది కాదు, కానీ, అది ఏ పట్ట పగలో, నడి రాత్రో తెచ్చి పెట్టేవారు. అడవిలో డేరా వేసిన దళం ఆకలితో నకనకలాడే స్థితి గమనించి తిండి విషయం వాకబు చేయడానికి జోగన్న దళ సభ్యులను వెంట వెంట ఊళ్లోకి ిపంపేవాడు. ఊళ్ళలో ఇల్లిల్లు తిరిగి ఇంటికింత అన్నం-కూర జమ చేసి దళం కోసం అడవికి తేవడం అనేది చాలా చోట్ల ఇల్లరికం వచ్చిన అల్లుళ్ల (లామడే) పై ఆధారపడి ఉండేది. ఇలాంటి ఉచిత సేవలన్నీ వాళ్లు చేయాల్సిందే. ఇవన్నీ గడ్‌చిరోలి జిల్లాలో తెగ భూస్వామ్య పెత్తందారీతనం ప్రభావం అధికంగా వున్న ఏటపల్లి తాలూకా లోనేఎక్కువుగా ఉండేవి. తొలినాళ్ళలో గెరిల్లాలు ఎదుర్కొన్న కష్టాలు చెబితే ఈ తరం కథలుగా వింటున్నారు. ఎందుకంటే, నాలుగుదశాబ్దాల క్రితం తమ కుటుంబాలు అనుభవించిన ఇబ్బందులు, పస్తులున్న రోజులు, మహిళల అర్ధనగ్న జీవితాలు ఈ తరానికి తెలియవు. విప్లవోద్యమ కృషితో, త్యాగాలతో తర్వాతి తరాలకు అవి తెలియకుండా పరిష్కారం కావడానికి జోగన్న లాంటివిప్లవకారులు, విప్లవోద్యమమే కారణం.
1986-87లో ఆంధ్రప్రదేశ్ నుండి విప్లవోద్యమం దండకారణ్యానికి బదిలీ చేసిన పటేల్ సుధాకర్ రెడ్డిని (తరువాతి కాలంలో కేంద్రకమిటీ సభ్యునిగా ఎదిగి 2009లో అమరుడైనాడు) ఏటుపల్లి ప్రాంతంలో కమాండర్‌గా నియమించారు. ఆయన రామన్న పేరుతో కమాండర్ బాధ్యతలలో వుండగా, పద్మ (వనజ-అడవి పుత్రిక రచయిత) సభ్యురాలుగా, జోగన్న ఉప కమాండర్ బాధ్యతలలో వుండేవారు. ఆ రోజుల్లో నాయకత్వ బాధ్యతలలో వున్న మల్లోరaుల కోటేశ్వర్లు (రాంజీ) కూడ ఆ ప్రాంతానికి తరచుగా వెళ్లేవాడు. జిల్లా నాయకత్వం కేంద్రీకరణ పెరిగింది. వీటన్నింటితో, ఏరియాలోని సమరశీల యువతరాన్ని ఉద్యమం వైపు ఆకర్షించి ప్రజా సంఘాలలో వారిని సంఘటితం చేయడం మొదలై, ప్రజాపోరాటాలు ఊపందు కోవడంతో ఏరియా పెద్ద కుదుపుకు లోనైంది.
అప్పటి వరకు గెరిల్లాలలో అత్యధిక శాతం మైదాన ప్రాంతం నుండి వెళ్లిన తెలుగువారే వుండేవారు. వారు ఇంటి వద్ద అనుభవించిన జీవితానికి గెరిల్లా జీవితం పూర్తి భిన్నం. అడవిలో గెరిల్లా జీవితంలో వుండే కష్టాలు, ఇబ్బందులకు పూర్తిగా అలవాటు పడకపోవడంతో, దళాలలో పలు సమస్యలు ముందుకు వచ్చేవి. వాటిని అర్ధం చేసుకొని వారిని నిలుపుకోవడానికి జోగన్న చూపిన విశాలత్వం, సహనం, అదనపు ఇబ్బందులను భరించే సంసిద్ధత ఆయనలోని శ్రమజీవి స్వభావాన్ని, విప్లవ పట్టుదలను తెలుపుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ఎండ వేడిని భరిస్తూ తునికాకు సేకరణ కూలీల పోరాటాలు నిర్వహించడంలో గెరిల్లాలు చాలా కష్టపడేవారు. వేసవి ఎండలు, వడదెబ్బ సమస్య, నీళ్ల కటకట, డీహైడ్రేషన్‌తో మూత్రంలో మంట, వేసుకున్న యూనిఫాం రోజంతా చెమటతో ఎన్నిసార్లు తడిసి, ఆరినా స్నానాలకు, బట్టలు ఉతుక్కోవడానికి తరచుగా అవకాశం లేకపోవడం, పోలీసుల దాడుల మూలంగా రోజూ కనీసం మూడు సార్లు మకాం మార్చాల్సి రావడం, అలసట, నిత్యం 24 గంటలు సెంట్రీలు చేయడం, అడవిలో వేసిన మకాం నుండి ఊళ్లోకి వెళ్లి ప్రజలను కలిసి రావడం, దూరంగా వుండే గ్రామాల యువతను దళం వద్దకు పిలుచుకు తేవడం, పార్టీ కాంటాక్టులకు వెళ్లి మరో దళాన్ని కలిసి రావడం, దళంలో బరువులు మోయడం మున్నగు శారీరక శ్రమలకు సంబంధించిన పనులలో ఎవరు వెనుకాడినా, వారు చేయని పనులు ముందుకు వచ్చిచేయడంలో కష్టజీవి జోగన్న ముందుండేవాడు. ఎవరూ పనులకు సిద్ధపడనపుడు ‘‘సరే, జోగన్నను పంపుకుందాం’’ అని బాధ్యులు కూడ ఎంతో భరోసాగా వుండేవారు.
సిద్ధాంతానికి, ఆచరణకు మధ్య వున్న వైరుధ్యం పనిలోకి దిగినపుడే ముందుకు వస్తుంది. విప్లవంలో చాలా కష్టాలుంటాయని సిద్ధాంతపరంగా చెప్పని వారుండరు. కలం బలం వున్నవాళ్లు, వాగ్ధాటి కలవారు ఒకింత ఎక్కువే చెపుతారు. కానీ, వాటిని ఆచరించాల్సి వచ్చేసరికే ఆ వైరుధ్యం బయట పడుతుంది. దానిని పరిష్కరించుకుంటూ విప్లవించడమే జోగన్నలాంటి వాళ్లు మనకు నేర్పుతారు. ప్రజలను సంఘటితం చేయడంలో, ఎవరైనా విప్లవోద్యమంలో దృఢంగా నిలబడటానికి అందులో ఉన్న కష్టాలు తెలుసుకోవడం ఒక ముఖ్యమైన విషయం. మార్పు కోసం ముందు తరం అనుభవించిన ఇబ్బందులు, పడిన శ్రమ, ఆవేదన, అధిగమించడానికి వారు చూపిన రాజకీయ చైతన్యంతో కూడిన పట్టుదల అర్ధం చేసుకోవడం చాలా అవసరం.
స్థానిక యువత ఉద్యమంలో చేరడం మొదలయ్యాక పైరకం సమస్యలు చాలా వరకు తగ్గాయి. స్థానిక యువత ముందుకు రావడంతో గ్రామాలలో ప్రజా సంఘాలు సమరశీల పాత్ర పోషించాయి. ప్రజా సంఘాలలో సంఘటితమైన యువత ఉద్యమ నిర్మాణాలలో (సెల్స్), ప్రజా మిలీషియా నిర్మాణాలలో సంఘటితమైనారు. మిలీషియా సాయుధం కావడం మొదలైంది. గ్రామాలలో ప్రజలు చైతన్యవంతులై తమ సమస్యలపై తాము కదలడం మొదలయ్యేసరికి వారిని నియంత్రించడానికి పోలీసులు వారిని తప్పుడు కేసులలో అరెస్ట్ చేయడం, జైలుకు పంపడం, లంచాలు మేయడం, వారిపై చేయి చేసుకోవడం పెరిగిపోయాయి. దానితో పోలీసుల దౌర్జన్యాలను ప్రజలు నిలదీయడమే కాకుండా, గోడ్సూర్-కొత్తకొండ లాంటిగ్రామాలలో వారితో బాహాబాహి యుద్ధానికి దిగిన ఘటనలు ముందుకు వచ్చాయి. పోలీసులతో గెరిల్లాలకు ఎదురుకాల్పులు క్రమంగా పెరగసాగాయి. అమరత్వాలు చోటుచేసుకోసాగాయి. గెరిల్లాల ప్రతిఘటన కూడ అనివార్యమైంది. రామన్న, జోగన్న అప్పటికే కొన్ని చోట్ల పోలీసుల కాల్పుల నుండి బయటపడ్డారు. ప్రజలు పోలీసులనే నిలదీయడం చూస్తున్న గ్రామాలలోని తెగ పెత్తందార్లు చాలా చోట్ల తోకముడిచారు. గ్రామాలలో వారి మాట చెల్లుబాటు కాని పరిస్థితి వచ్చింది. చౌకేవేడ లాంటి గ్రామాలలో కరుడుగట్టిన తెగ భూస్వాములను గెరిల్లాలు శిక్షించారు. వర్గపోరాటంలో ప్రజలు రాటుతేలడం గమనించిన రాజ్యం ఉన్నత స్థాయి విప్లవ ప్రతిఘాతకత్వానికి దిగింది.
ఆంధ్రప్రదేశ్‌లో అప్పటికే విప్లవోద్యమాన్ని అణచడానికి ప్రయోగాత్మకంగా రూపొందించిన గ్రేహౌండ్స్ తరహాలో గడ్‌చిరోలీలో 60 మంది ఆదివాసీ యువకులతో 1992లో ‘‘క్రాక్ కమాండోస్’’ (సీ-60) ఉనికిలోకి వచ్చింది. వీళ్లలో అత్యధికులు ప్రజా వ్యతిరేక కుటుంబాలకు లేదా విప్లవోద్యమంతో శిక్షలను అభవించిన కుటుంబాలకు చెందిన వారే కాకుండా లంపెన్ స్వభావం కలిగినవారు కూడ కావడంతో వారిని ప్రజలకు వ్యతిరేకంగా మలచుకోవడం పోలీసులకు చాలా సులువైంది. నూతనంగా పోలీసులలో చేరకూడదనీ, ప్రజలకు వ్యతిరేకంగా మారకూడదనీ విప్లవోద్యమం చాలా ప్రచారం చేసింది. ప్రచారాన్ని పెడ చెవిన పెట్టిన కొన్ని కుటుంబాలపై నియంత్రణలు విధించింది. మరోవైపు ప్రజలలో భయోత్పాతాన్ని సృష్టించడానికి మొదట ‘టాడా’’, ఆ తరువాత ‘పోటా’ చట్టాలు పెద్ద ఆయుధంగా పోలీసులు వినియోగించారు. ఆ రోజులలో పాత్రికేయులు పుణ్య ప్రసూన్ వాజ్ పేయి (తరువాతి కాలంలో అనేక ప్రముఖ పత్రికలు, టీవీ ఛానల్స్‌లలో పని చేసి హిందుత్వ శక్తుల దాడులతో వాటిని కోల్పోయి ప్రస్తుతం యూ-ట్యూబర్‌గా కొనసాగుతున్నాడు) విదర్భలోని చంద్రపూర్, భండారా, గడ్ చిరోలీ జిల్లాలను అధ్యయనం చేసి టాడా బాధిత ఆదివాసీ ప్రజలపై ఒక ప్రత్యేక నివేదికను తయారుచేశారు. పోలీసుల అణచివేతకు సాధికారతను కల్పించడానికి మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం విప్లవోద్యమ నిర్మూలనకు ‘‘స్పెషల్ ఆక్షన్ ప్రోగ్రాం’’ ను రూపొందించింది. దానిని ఈనాటి ఆకాంక్ష జిల్లాలకు తొలి రూపం అనుకోవచ్చు. ఈ అణచివేత-సంస్కరణల వెనుక మనం ఆనాడు దేశంలో ముందుకు వచ్చిన సామ్రాజ్యవాద ఆర్థిక విధానాలలో భాగంగా ముందుకు వచ్చిన వ్యవస్థాగత సంస్కరణలను చూడకుంటే అసలు చిత్రమే బోధపడదు. మూడు దశాబ్దాల క్రితమే అప్పటి ప్రభుత్వాలు అనుసరించిన అణచివేత-సంస్కరణల గురించి (కంద-కర్ర నీతి) తెలుసుకోవడం ద్వార ఈనాటి హిందుత్వశక్తుల పాలనలో అమలవుతున్న పాశవిక విధానాలను తిప్పికొట్టడానికి తోడ్పడుతుంది. జోగన్న లాంటి వారిని అర్థం చేసుకోవడం ద్వారా ప్రజా వుద్యమాల నిర్మాణం బోధపడుతుంది.
గడ్‌చిరోలీ జిల్లా విప్లవోద్యమంలో ఒక బలమైన ప్రజాపునాది కలిగిన కేంద్రంగా ఏటపల్లి ప్రాంతం ముందుకు రాసాగింది. అక్కడి ప్రజా నిర్మాణాలు, రాజకీయ నిర్మాణాలు చాలా మిలిటెంట్ స్వభావాన్ని సంతరించుకోసాగాయి. వాటి నుండి మెరుగైన శక్తులు విప్లవోద్యమంలో పూర్తికాలం విప్లవకారులుగా భాగం కాసాగారు. మైదాన ప్రాంతాల నుండి లేదా విప్లవోద్యమ అనుభవాలను అధ్యయనం చేయాలనుకున్న శక్తులను విప్లవోద్యమం దండకారణ్యంలోని ఇతర ప్రాంతాలతో పాటు గడ్‌చిరోలీకి పంపించేది. అలా గడ్‌చిరోలీకి వచ్చిన వారిలో మొదట కామ్రేడ్ గద్దర్, తరువాత కామ్రేడ్ ఐ.వీ. సాంబశివరావు (మాస్టారు)వున్నారు. గద్దర్ చివరి రోజులలో తన వారసులు ఎవరు అంటూ ఆవేదనతో గీతాలాపన చేసిన సందర్భంగా గడ్‌చిరోలిని గుర్తు చేసుకోవడం తెలిసిందే. ఆనాడు అడవిలో కామ్రేడ్ గద్దర్‌ను కామ్రేడ్ జోగన్న కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఆయన సైతం అడవిలో ఎలాంటి ప్రత్యేకతలు కోరుకోలేదు. గెరిల్లాలకు ఆదర్శంగానే వుండేవాడు. వర్షాలతో తడిసి వణుకేస్తుంటే మాత్రం ఒంటికి కాస్తా వెచ్చదనం కోసం నెగడు ఏర్పాటు చేయగలిగితే సంబురపడేవాడు. కామ్రేడ్ గద్దర్ అడవిలో ప్రజలను, సమస్యలను, సంస్కృతిని అధ్యయనం చేయడంతో పాటు మిలిటరీ శిక్షణా శిబిరంలో పాల్గొని యుద్ధవిద్యలు అభ్యసించాడు. ఆరు మాసాలు గడిచేసరికి గద్దర్ హైదరాబాదు వెళ్లాలనే పిలుపు చేరడంతో ఆయన అడవి నుండి విదా తీసుకున్నాడు. ఆ తరువాత కొద్ది కాలానికే కామ్రేడ్ ఐ.వీ. సాంబశివరావు అడవికి చేరాడు. అప్పటికే జోగన్న గ్రేనెడ్ టెస్టింగ్‌లో కంటి చూపు పోయి మూడేళ్లు దాటాయి. నాటు గ్రేనేడ్ తయారీ, ప్రయోగాలలో విప్లవోద్యమానికి అనేక ప్రమాదాలు, నష్టాలు తప్పలేదు.
జిల్లాలోని తిప్పాగఢ్ ప్రాంతం తరువాత ఏటపల్లి ఏరియా చేరిన కామ్రేడ్ సాంబిశివరావు అక్కడ జోగన్న వెంటవుంటూ తన అధ్యయనాన్ని కొనసాగించాడు. అప్పటికే, సాధన రచించిన మొదటి నవల అడవిలో అన్నలు (సరిహద్దు)వెలువడిరది. అడవిలో గెరిల్లాల జీవితాలను ప్రతిబింబించే ఆ నవల తరువాత సాధన అడవిలో ప్రజల జీవితాలను ముఖ్యంగా ఆదివాసీ ప్రజల ఆచార సంప్రదాయాలు, మహిళలపై అమలవుతున్న పురుషాధిపత్యం, మహిళలు సాయుధం కావడం ఇతివృత్తంగా రాగో నవలకు పూనుకున్నాడు. అడవిలో అన్నలు వెలువడడానికి మిత్రులు బేతి శ్రీరాములు గారు ఎంతో సన్నిహిత సహకారాన్ని పోస్టులో చేరవేసుకునే ఉత్తరాల ద్వారానే అందించాడని సాధన పలు సందర్భాలలో కృతజ్ఞతా పూర్వకంగా గుర్తుచేసుకోవడం తెలిసిందే. కానీ, రోగో రచించే నాటికి మాత్రం ప్రత్యక్షంగా సాంబశివరావు మాస్టార్ అందుబాటులో ఉండడంతో సాధనకు, రాగో రచనకు జోగన్నే ఆతిథ్యం ఇవ్వడం ఈ సాహితీ కళాకారులు ఎన్నటికి మరువలేనిది. ఆ క్రమంలో ప్రజల, విప్లవ కేడర్ల విశ్వాసాన్ని చూరగొన్న కామ్రేడ్ జోగన్న 1994 చివరి వరకు డివిజనల్ కమిటీ సభ్యుడిగా ఎన్నికైనాడు.
కామ్రేడ్ జోగన్న స్వయం కృషితో ఉద్యమంలోనే చదువునేర్చుకున్నాడు. ఉద్యమ నిర్మాణ సూత్రాలు అర్థం చేసుకున్నాడు. విప్లవ విజయానికి సంఘటిత ప్రజల శక్తే తిరుగులేని ఆయుధంగా తెలుసుకొని ప్రజా సంఘాల నిర్మాణానికి అలుపెరుగని కృషి చేశాడు. ఇవేవైనా ప్రజా యుద్ధాన్ని శక్తిమంతంగా నిర్వహించడానికి ఉపయోగపడే పూరకాలేనన్న ఉన్నతమైన చైతన్యంతోనే ఆయన ఒక గెరిల్లా సైనికుడిగా మారడానిక ిఎంతగానో శ్రమించాడు. ఆ క్రమంలో ఆయన కంటి చూపు పోయింది. అయినప్పటికీ, ఆయన పలు సైనిక శిక్షణా శిబిరాలలో పాల్గొన్నాడు. ‘‘మార్క్స్ మెన్ షిప్’’ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆయన తొలుత తన ఏరియాలోని పైడి వద్ద జరిగిన మాటుదాడిలో పాల్గొని పోలీసులను ఖంగు తినిపించాడు. తన 42 ఏండ్ల గెరిల్లా జీవితంలో ఆయన పదుల ఎన్‌కౌంటర్ల నుండి సురక్షితంగా బయటపడినాడు. పోలీసులపై గెరిల్లాలు జరిపిన పలు మాటు దాడులలో పాల్గొన్నాడు. కానీ, చివరన తన 66 ఏళ్ల వయసులో వేలాది మంది పోలీసులు తనను చుట్టుముట్టి తుటాల వర్షం కుమ్మరిస్తుంటే, తన వారిని కాపాడడానికి, తన ఆయుధాన్ని వారికి ఇచ్చి ‘‘విప్లవాన్ని కొనసాగించండి’’ అనే ఆదేశం ఇస్తూ సోదర కామ్రేడ్స్‌కు చిరునవ్వులతో చేయి కలిపి అమరత్వాన్ని ఆస్వాదించాడు.
విప్లవం అంటేనే రాజ్యాధికార సమస్య అని అర్థం చేసుకున్న జోగన్న 2005 నుండి 2016 వరకు ఏటపల్లి తాలూకా కసంసూర్ ప్రాంతంలో జనతన సర్కార్ల నిర్మాణం కోసం అహర్నిశలు అలుపెరుగని కృషి చేశాడు. ఏరియా స్థాయిసర్కార్ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు నిర్వహించడమే కాకుండా, ఉన్నత స్థాయిలో ఏర్పడిన దండకారణ్య జనతన సర్కార్‌సన్నాహక కమిటీలో ఒక సభ్యుడిగా గడ్ చిరోలీ నుండి ప్రాతినిధ్యం వహించాడు. అప్పటికి ఆయన రీజినల్ కమిటీస్థాయి కామ్రేడ్‌గా పదోన్నతుడై వున్నాడు. ప్రజల ప్రత్యామ్నాయ ప్రభుత్వ అధ్యక్షుడిగా వున్న కామ్రేడ్ జోగన్న ప్రజల వ్యవసాయంలో, సాగబడిలో, దిగుబడిలో మార్పు తేవడానికి మైదాన ప్రాంతంలోని ఒక వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన రైతు జీవితానుభవంతో పని చేశాడు. తన యవ్వన ప్రాయంలో సంఘటిత ప్రజా పోరాటాల ద్వారా ఆదివాసీ రైతులు వేలాదిఎకరాల అటవీ (సాగు) భూములు (వీటిని మహారాష్ట్ర ప్రభుత్వం జబరన్ జోత్ ..దౌర్జన్యంతో సాగు చేసుకుంటున్న భూములంటుంది) కైవశం చేసుకున్నారు. అలా వారి జీవితాలలో మౌలిక మార్పులకు పునాదులు వేసిన జోగన్న తన మధ్యవయసు నాటికి దోపిడీ ప్రభుత్వ చట్టాల ప్రకారం ఆ భూములపై మాత్రమే ప్రజలు యాజమాన్య హక్కులు పొందడం కాకుండా మొత్తం జల్-జంగల్-జమీన్ పైనే పెసా ప్రకారం గ్రామసభలకు చట్టబద్ధంగా అధికారం పొందారు. అయితే, ఆ చట్టబద్ధభూములకు, ఆ చట్టబద్ధ (గ్రామసభలకు ఆచరణలో వీసమెత్తయినా విలువ లేదనీ, వాటిని ప్రభుత్వాధికారులు ఖాతర చేయరనీ, ఆ చట్టాలను రూపొందించిన ప్రభుత్వమే వాటిని ఘోరంగా ఉల్లంఘిస్తూ ఆదివాసుల భూములను, అడవులను కార్పొరేట్‌వర్గాలకు అప్పగిస్తుందనీ జోగన్నకు తెలుసు. అందుకే ఆయన విప్లవోద్యమం ద్వార నిలుపుకున్న గ్రామసభలు, జనతనసర్కార్లు లేకుండా సాధించుకొని సంస్కరించుకున్న భూములు ప్రజలకు దక్కవనీ, ఈ దోపిడీ ప్రభుత్వా లను శాశ్వతంగా గద్దెదించకుండా అడవులకు రక్షణ లేదనీ జోగన్న ప్రజలను నిరంతరం అప్రమత్తం చేసేవాడు. అందుకే నేటి తరం కార్పొరేట్ కగార్‌ను అర్థం చేసుకోవడం ద్వారానే తమ భూములను, అడవులను కాపాడుకో గలుగుతారు. జోగన్న లాంటి అమరులత్యాగాలతో సాధించుకున్న ప్రజాధికారాన్ని నిలుపుకోగలుగుతారు. జోగన్న మృదుభాషి, మితభాషి. పొదుపరి. గడ్‌చిరోలీ విప్లవోద్యమంలో పోరాట సంప్రదాయాలలో భాగంగా ముందుకు వచ్చిన వర్క్-డేల (ప్రజలు తమ ఒక రోజు శ్రమశక్తిని విప్లవోద్యమం కోసం స్వచ్ఛందంగా అందించడం)నిర్వహణ గత మూడు దశాబ్దాల కాలంగా ఏటపల్లి ప్రాంతంలోని అనేక గ్రామాలలో నేటికీ కొనసాగు తుండడం వెనుక జోగన్న నిర్మించిన ప్రజా పునాదే కారణం. పోలీసు దాడులతో గెరిల్లాలు ప్రజలను వెంట వెంట కలువలేక పోతున్నప్పటికీ గెరిల్లాలు కలిసే వరకు ప్రజలు భద్రంగా నిధులను కాపాడుతున్నారంటే, జోగన్న నేర్పిన విప్లవ రాజకీయాలే కారణం. పోలీసులకళ్లు గప్పి ఇప్పటికీ ప్రతి యేటా ప్రజలు సమష్టిగా భూమి చదును-మళ్ల నిర్మాణం-సాగు నీటి వ్యవస్థ రూపకల్పన కేంపెయిన్‌లో పాల్గొంటున్నారంటే, ప్రజల జీవితాలలో మార్పులకు బీజాలు వేసిన విప్లవ సంస్కరణలను జోగన్న నాయకత్వంలో ప్రజాప్రభుత్వాలు అమలు చేయడమే అందుకు కారణం.
ఎదుటివారిని గౌరవించడంలో, వారి అభిప్రాయాలను తీసుకోవడంలో జోగన్న నిజమైన ప్రజాస్వామ్యాన్ని ఆచరించినవాడు. ఏ విషయంపైనైనా నిర్మొహమాటంగా, సూటిగా తన అభిప్రాయాలు చెప్పి మెజార్టీ అభిప్రాయాల్ని విప్లవ క్రమశిక్షణా సూత్రం – కేంద్రీకృత ప్రజాస్వామ్యం ప్రకారం అమలు చేసిన నికార్సయిన విప్లవకారుడు జోగన్న. తప్పు అని తెలిసిన దానిని ఎన్నడూ, ఏ పరిస్థితిలో చేసినవాడు కాదు. విప్లవోద్యమంలో కేవలం తన విధులను తాను నిర్వహించడం మాత్రమే కాదు, ఎదుటివారి బాధలు, సమస్యలు, పరిమితులు అర్ధం చేసుకొని వారి పనులలో సిన్సియర్‌గా సహకరించేవాడు. తనకు ఎవరు సహాయం చేస్తారని ఎదురుచూడడం, చేయనపుడు మధనపడడం, నిందించడం కాకుండా, ఎదుటివారికి సహాయం చేయడం అనేదే జోగన్న ఒక గెరిల్లాగా, కమ్యూనిస్టుగా, నిజమైన కార్మికవర్గ పుత్రుడిగా తెలుసుకుంది, ఆచరించింది. ఆయనలో పురుషాధిక్యతా భావం వుందన్న విమర్శ బహుశా ఎప్పుడూ ఎదురుకాలేదేమో! తన తొలి, మలి జీవిత సహచర కామేడ్స్ (కామేడ్స్ మీనా, హారతి) అమరులైన తరువాత ఇటీవలి కాలంలో కామ్రేడ్ సంగీత నుండి కలసి జీవించడానికి ప్రతిపాదన ముందుకు రాగా అంగీకరించాడు. ఆమె కాకూర్-టేకమెట్ట కాల్పుల దాకా తన జీవిత సహచరుడైన జోగన్న వెంటే వుండి భుజం-భుజం కలిపి నడిచి, ఆయనను వెన్నంటి వుంటూ వచ్చింది. కానీ, చివరి ఘడియలలో విధిలేని పరిస్థితులలో కన్నీటి వీడ్కోలు చెప్పి కాల్పులను ఎదిరిస్తూ సురక్షితంగా తప్పుకుంది. ఆయన ఎప్పుడూ పేరు-ప్రతిష్టలను, కీర్తి కండువాలను ఆశించిన వాడు కాదు. ఆయన యవ్వన వయసులో ‘దాదా’’(అన్న)గా ముదిమి వయసుకు చేరువవుతున్న వయసులో ‘జోగముయితో’ గా అందరి ప్రేమను చూరగొన్న నిజమైన ప్రజా సేవకుడు, విప్లవ నాయకుడు. గడ్‌చిరోలీ విప్లవోద్యమ చరిత్ర పుటలలో ఆపరేషన్ కగార్ సైనిక దాడుల కాలంలో తన అమరత్వంతో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించుకున్న కమ్యూనిస్టు విప్లవకారుడు కామ్రేడ్ జోగన్న.
సేకరణ: చైతన్య
(నోట్: విప్లవోద్యమం అమరుల జీవిత చరిత్రలలో భాగంగా అంతర్జాలంలో విడుదల చేసిన కామ్రేడ్ చీమల నరుసయ్య జీవిత విశేషాల ఆధారంగా మా మిత్రుడికి అర్పించే నివాళిలో భాగంగా దీన్ని తెలుగు పాఠకుల కోసం రాశం. ఇందులో పొరపాట్లుంటే మాదే పూర్తి బాధ్యత జోగన్న మిత్రులు)