2026 మే 24
మధ్యప్రదేశ్ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఒక తీర్పులో 700 సంవత్సరాల నాటి మసీదును హిందూ దేవత సరస్వతి ఆలయంగా ప్రకటించింది. కోర్టు ఆదేశాల మేరకు పురాతత్వ సర్వే సంస్థ (ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా- ఎఎస్ఐ) నిర్వహించిన గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జిపిఆర్) సర్వేలో—ధార్‌లోని మొదటి జామా మసీదు (సమూహ ప్రార్థనా మందిరం) అయిన 14వ శతాబ్దపు హైపోస్టైల్ (స్తంభాల) మసీదు, కమల్ మౌలా మసీదును—ఇదివరకు అక్కడ ఉన్న ఒక ఆలయంపైన నిర్మించారని పేర్కొంది. భోజ్‌శాల (11వ శతాబ్దపు పరమార రాజు భోజుని మందిరం) అనే ఆధునిక తప్పుడు పేరుతో ప్రాచుర్యం పొందిన ఈ మసీదుకు సంబంధించిన వివాద చరిత్రను, చారిత్రక ఆధారాలను, నిర్మాణాల పునర్వినియోగ ప్రక్రియను మతాల చారిత్రక పరిణామాన్ని అర్థం చేసుకోవడంలో ఎఎస్ఐ చేసిన సర్వే, అలాగే కోర్టు తీర్పు… లోపభూయిష్టంగా ఉన్నాయి.
కమల్ మౌలా మసీదును 11వ శతాబ్దపు ఆలయంగా ప్రకటించడానికి ఈ తీర్పు ఎఎస్ఐ సర్వేపైన ఆధారపడింది. కోర్టు ఉత్తర్వుల్లో నమోదైన ఎఎస్ఐ సర్వే కనుగొన్న సంక్షిప్త అంశాలు మసీదు కింద ఒక పూర్వ నిర్మాణం ఉన్నట్లు సూచిస్తున్నాయి. అది “బహుశా ప్రజా ప్రయోజనాల కోసం నిర్మించిన భారీ నిర్మాణం” (పేజీ.186). ఆ పూర్వ నిర్మాణం “దెబ్బతిన్నది, పునర్వినియోగం కోసం మార్చడం జరిగింది” (అదే పేజీ) అని కూడా పేర్కొంది. ఆ తర్వాత, 189వ పేజీలో ఎఎస్ఐ తన ప్రకటనకు తానే విరుద్ధంగా— “ఈ స్తంభాలు, స్తంభాల వరుసల(కొలనేడ్స్)లోని స్తంభాల కళ, వాస్తుశిల్పం మొదట ఆలయాలలో భాగంగా ఉండేవని సూచిస్తున్నాయి” అని పేర్కొంది.
ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఆ అవశేషాలు ఒకే నిర్మాణం నుండి కాకుండా బహుళ ఆలయాల నుండి వచ్చినవి (పేజీ. 189). మసీదు కింద ఉన్న నిర్మాణాన్ని ఆలయంగా గుర్తించడం అనేది పూర్తిగా మసీదులో పునర్వినియోగించిన వస్తువుల ఆధారంగానే జరిగింది. ఎఎస్ఐ ప్రకారం, ఇస్లామిక్ విగ్రహధ్వంసం (ఐకనోక్లాజం) కారణంగా వికృతీకరించబడినప్పటికీ, పునర్వినియోగింగించిన స్తంభాలపైన చతుర్భుజ దేవతల, గణేశుడి వంటి ఇతర పౌరాణిక దేవతల రూపాలు కనిపిస్తాయి. అయితే, కింద ఉన్న నిర్మాణం ఒక రాజభవనం కావచ్చుననే అవకాశాన్ని లేదా మసీదు నిర్మాణానికి పునర్వినియోగించిన వస్తువులను ఒక రాజభవనం నుండి కూడా సేకరించి ఉండవచ్చుననే కోణాన్ని ఎఎస్ఐ తన సర్వేలో పరిగణనలోకి తీసుకోలేదు. దేవతల శిల్పాలు అనేవి రాజభవన స్తంభాలు, కార్నిస్‌లు (భవన అంచులు), ద్వారాలపై సాధారణంగా కనిపించే ఒక విశిష్టత.
రాజప్రాసాదాలతో సహా నివాస గృహాలను అలంకరించడానికి పవిత్రమైన లౌకికమైన శిల్పాలను ఏ విధంగా వినియోగించారో ‘సమరాంగణ సూత్రధార’లోని గృహ నిర్మాణ శైలిగురించి 2010 నాటి తన అధ్యయనంలో ఫెలిక్స్ ఆట్టర్ వివరించారు. ‘సమరాంగణ సూత్రధార’ అనే సంస్కృత గ్రంథాన్ని 11వ శతాబ్దపు పరమార రాజు భోజుడికి ఆపాదించడం సరికాదు, వాస్తవానికి ఈ గ్రంథాన్ని పలువురు రచయితలు కలిసి రూపొందించారని ఆట్టర్ నిర్వహించిన రచన విశ్లేషణ స్పష్టం చేస్తోంది.
మసీదులో పునర్వినియోగించిన సామాగ్రి కేవలం ఒకే నిర్మాణం నుండి కాకుండా, అనేక మూలాధారాల నుండి వచ్చిందనే తన సొంత పరిశోధనను కూడా సర్వే విస్మరిస్తుంది (పే. 189). అంతేకాకుండా, ముందునుండే ఉన్న నిర్మాణమే దెబ్బతిని, మసీదులో పునర్వినియోగించబడిందనే తన వాదనకు సర్వే ఎటువంటి ఆధారాలను అందించలేదు. అక్రమంగా కూల్చివేసిన బాబ్రీ మసీదు కింద పూర్తిస్థాయిలో తవ్వకాలు జరిపినా, దాని కింద ఉన్న నిర్మాణం ధ్వంసమైందని చూపించలేకపోయిందని 2019 అయోధ్య తీర్పు (పే. 906-907) నిరూపించింది. అలాంటప్పుడు, కేవలం ఒక జిపిఆర్ సర్వేతోనే కింద ఉన్న నిర్మాణం ధ్వంసమైందని సర్వే ఎలా నిరూపించగలుగుతుంది?
“ముందున్న నిర్మాణం బహుశా ఒక రాజభవనం కావచ్చు అనే భావనకు ‘వాగ్దేవి’ విగ్రహం ‘ఆవిష్కరణ’ కూడా మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఇది మొదటగా 12వ పేజీలో రాశారు. ఆ విగ్రహం ‘ముస్లిం పాలకులు అక్కడ పూడ్చిపెట్టిన వాగ్దేవి అమ్మవారి (మా సరస్వతి) విగ్రహం’ అని ఆరోపించారు. దీని తర్వాత ఇచ్చిన ఒక వెబ్సైట్ లింక్‌లో అందులో ‘బ్రిటిష్ మ్యూజియం’ స్పెల్లింగ్ తప్పుగా ఉండడంతో అది పని చేయని లింక్‌గా మారింది. ఈ విగ్రహం గురించి 44వ పేజీలో మళ్లీ చర్చించారు. ఇక్కడ కూడా ‘బ్రిటిష్ మ్యూజియం’ స్పెల్లింగ్‌ను తప్పుగా రాయడం వల్ల ఆ వెబ్సైట్ లింక్ ఎక్కడికీ దారితీయదు. సరైన వెబ్సైట్ లింక్ ఒక ఆసక్తికరమైన చిత్రాన్ని చూపుతుంది. ఆ ప్రదర్శన వస్తువును ‘ఒక గరుకు తెల్లటి రాతితో (మార్బుల్) చెక్కిన జైన యక్షిణి అంబికా నిలువెత్తు రూపం’ గా పేర్కొన్నారు. బ్రిటిష్ మ్యూజియం వెబ్సైట్లో ఎక్కడా కూడా ఈ రూపాన్ని సరస్వతి అమ్మవారిగా గుర్తించలేదు.”
“ఈ రూపాన్ని జైన యక్షిణి అంబికాగా గుర్తించడం అనేది ఆ విగ్రహంపైన ఉన్న శాసనం ఆధారంగా జరిగింది. ఈ శాసనం ప్రకారం ఈ శిల్పం క్రీ.శ. 1034 కాలానికి చెందినది. వరరుచి అనే వ్యక్తి వాగ్దేవి, ముగ్గురు జినా (తీర్థంకరుల) విగ్రహాలను చెక్కిన తర్వాత, ఈ అంబా చిత్రాన్ని (విగ్రహాన్ని) తయారు చేసినట్లు అందులో పేర్కొన్నారు. నిజానికి, ఆ శాసనంలో వరరుచి తనను తాను జైన మతానికి చెందిన శాఖలైన చంద్రనగరి, విద్యాధరి ధర్మాలపై ఆసక్తి కలిగినవాడిగా పేర్కొన్నాడు. కాబట్టి ఈ శిల్పం ఒక జైన యక్షిణిది మాత్రమే కాదు, దీనిని తయారు చేసింది కూడా ఒక జైనుడే. ఈ సమాచారాన్ని 12వ పేజీలో పూర్తిగా విస్మరించారు. ఎలాంటి ఆధారాలు చూపకుండానే వాగ్దేవి, అంబాలిద్దరినీ సరస్వతి అమ్మవారి రూపాలుగా పేర్కొంటూ ఒక హాస్యాస్పదమైన వాదనను చేశారు! ధార్‌లోని ఒక నగర రాజభవన శిథిలాలలో జైన యక్షిణి విగ్రహాన్ని 1875లో కలోనియల్ (బ్రిటిష్ కాలపు) సర్వేయర్ విలియం కిన్కైడ్ కనుగొన్నారనే మరొక ముఖ్యమైన విషయాన్ని కోర్టు తీర్పు నుండి పూర్తిగా వదిలేసారు. ఈ సమాచారం బ్రిటిష్ మ్యూజియం వెబ్సైట్లో స్పష్టంగా ఉన్నప్పటికీ, కోర్టు ఉత్తర్వుల్లో మాత్రం ఇది పూర్తిగా కనిపించకుండా పోయింది.”
“ఇక్కడ పరమార రాజు భోజుడు నిర్మించిన సరస్వతి ఆలయం ఉండేదని జైన యక్షిణి అంబికాను సరస్వతి విగ్రహంగా ఉద్దేశపూర్వకంగా తప్పుగా చిత్రీకరించడం జరిగిందని చెప్పడం మాత్రమే ఆ ఆలయాన్ని క్రీ.శ. 1034లో నిర్మించారని ఆరోపించడానికి చూపిన ఏకైక ఆధారం. ఈ కేసు మొత్తానికి ఈ విగ్రహాన్ని తప్పుగా చూపించడం ఎంత కీలకమైనదో గమనిస్తే ఆ విగ్రహం ఆలయంలో కాదు ఒక రాజభవనంలో దొరికిందని అది జైన మూలాలకు చెందినదని స్పష్టం చేస్తున్న బ్రిటిష్ మ్యూజియం వెబ్సైట్ లింక్‌ను, కోర్టు ఉత్తర్వుల్లో ఒక్కసారి కాదు ఏకంగా రెండుసార్లు ఉద్దేశపూర్వకంగానే తప్పుగా రాశారా అనే అనుమానం కలుగుతుంది.
1875లో కిన్కైడ్ కనుగొన్న ఈ రూపం రాజభవన శిథిలాలలో దొరికిందని అది ఒక జైన యక్షిణి అని 1875లోనే కిన్కైడ్ మాత్రమే కాకుండా, 2012లో భోజ్‌శాల గురించి మైఖేల్ విల్లీస్ చేసిన అధ్యయనంలో కూడా ఇప్పటికే నిరూపితమైంది. గతంలో అక్కడ ఉన్న నిర్మాణం జైన మూలాలకు చెందినది కావచ్చు అనే భావనకు మరింత బలాన్ని చేకూరుస్తూ.. కోర్టు ఆదేశాల ప్రకారం ఎఎస్ఐ నిర్వహించిన సర్వేలో మసీదు ప్రాంగణంలో ఒక జైన తీర్థంకరుడి విగ్రహం దొరికింది.
అయితే, 234వ పేజీలోని తీర్పు దీనిని సమర్థిస్తూ ఇలా వివరించింది. ‘భారతదేశంలో జైనమతం, హిందూమతం వేర్వేరు విభాగాలు కావు. ఈ రెండు మతాలలో పూజా విధానాలు వేరువేరుగా ఉన్నప్పటికీ, రెండు విశ్వాసాలు ప్రాచీన కాలం నుండి ఒకదానికొకటి సమాంతరంగా అభివృద్ధి చెందాయి ఒకే పరమాత్మను ఆరాధిస్తాయి’.”
“ఈ వాదన చారిత్రకంగా నిలవలేనిది. జైన చరిత్రపై జరిగిన అధ్యయనాలు (పీటర్ ఫ్లూగెల్ 2006, జూలియా హెగేవాల్డ్ 2013, 2025 చంపకలక్ష్మి 1996 చూడండి) జైనమతం మూలాలు వేదాల అధికారాన్ని తిరస్కరించడంలోనూ, వైదిక మతంలో బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని ప్రతిఘటించడంలోనే బలంగా నాటుకుపోయాయని చూపుతాయి. 8వ-9వ శతాబ్దాలలో అనేక జైన రాతి గుహాలయాలు శైవ లేదా వైష్ణవ ఆలయాలుగా ఏ విధంగా మార్చబడ్డాయి అనే విషయాన్ని కె.ఆర్. శ్రీనివాసన్ తమిళనాడులోని రాతి గుహాలయాలపైన తాను చేసిన అధ్యయనంలో (1975) వివరించారు. మధ్యయుగ కర్ణాటకలో కూడా ఇదే పద్ధతి కొనసాగింది, అక్కడ వీరశైవ మతం రావడంతో 12వ, 13వ శతాబ్దాల కాలంలో జైన క్షేత్రాలు వీరశైవ దేవాలయాలుగా పెద్ద ఎత్తున మార్పిడికి గురయ్యాయి (హెగేవాల్డ్, 2013).
ఆళ్వార్లు, నయనార్ల భక్తి గ్రంథాలు బౌద్ధమతాన్ని, జైనమతాన్ని తమ స్వంత మతం కంటే భిన్నమైన ప్రత్యేక మతాలుగా పరిగణించాయి. అంతేకాకుండా, ఆళ్వార్-నయనార్లకు, బౌద్ధ-జైనులకు మధ్య ఉన్న శత్రుత్వాన్ని (కొన్ని సందర్భాల్లో హింసాత్మక శత్రుత్వాన్ని) కూడా అవి ప్రస్తావించాయి. దీనివల్ల 8వ, 9వ శతాబ్ద కాలంలో దక్షిణ భారతదేశంలో బౌద్ధమతం అంతరించిపోవడానికి, జైనమతం క్షీణించడానికి దారితీసింది (చంపకలక్ష్మి, 1996).
జైనమతం, హిందూమతం వేర్వేరు విభాగాలు కావు అని గుర్తించడం అనేది, ‘ముస్లింలు కానివారు, క్రైస్తవులు కానివారు’ హిందువులు అంటూ వలసరాజ్యాల కాలం (కలోనియల్) నాటి హిందూమత నిర్వచనాన్ని మళ్లీ నొక్కిచెప్పినట్లు అవుతుంది. హిందూమతం గురించిన ఈ తప్పుడు అవగాహనను వలసరాజ్యాల సర్వేయర్లు కూడా అనుసరించారు. ముఖ్యంగా జేమ్స్ ఫెర్గూసన్, 1876 నాటి తన భారతీయ వాస్తుశిల్ప గ్రంథంలో జైన బసదులను, బౌద్ధ స్థూపాలను ‘హిందూ వాస్తుశిల్పం’ అనే శీర్షిక కిందనే వర్గీకరించారు.”
“గతంలో అక్కడ ఉన్న నిర్మాణం జైన మూలాలకు చెందినదనే విషయాన్ని ఉద్దేశపూర్వకంగా మరుగున పరచడమే కాకుండా, ఈ ఉత్తర్వు అనేక చారిత్రక ఆధారాలను కూడా తప్పుగా ఉటంకించింది. ఎఎస్ఐ సర్వే ఫలితాలను నివేదిస్తూ 194వ పేజీలో—మేరుతుంగుడు రాసిన 14వ శతాబ్దం నాటి ‘ప్రబంధ చింతామణి’ అనే ఒక జైన గ్రంథాన్ని ఉటంకిస్తూ, ‘పరమార వంశానికి చెందిన ప్రసిద్ధ రాజా భోజుడు మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో భోజశాల ఆలయాన్ని నిర్మించాడు’ అని పేర్కొన్నారు. అయితే, సదరు జైన గ్రంథంలో ఇలాంటి వాక్యం ఎక్కడా లేదు. ఆ సంస్కృత రచనలో ‘భోజశాల’ అనే పదాన్నే ప్రస్తావించలేదు. నిజానికి, ఇది ఒక ఆధునిక పదం కాబట్టి ఈ పదం ఏ సంస్కృత గ్రంథంలోనూ లేదు. ఎందుకంటే దీనిని మొదటిసారిగా 1903లో ధార్ రాజ్యంలో ఎఎస్ఐతో అనుబంధం ఉన్న కె.కె. లేలే రూపొందించారు. ‘భోజశాల’ అంటే భోజుడి పాఠశాల అని లేలే దీనికి అర్థం చెప్పారు. అయితే, మైఖేల్ విల్లీస్ (2012) ఈ పదం ఒక నిరర్థక (చెల్లుబాటు కాని) పదమని నిరూపించారు. ఎందుకంటే సంస్కృతంలో ‘శాల’ అంటే కేవలం ఒక స్థలం అని అర్థం, అదే పాఠశాల అనే అర్ధాన్ని ఇచ్చే సంస్కృత పదాలు ‘విద్యాలయం’ లేదా ‘జ్ఞానపీఠం’.
ఈ ఉత్తర్వు కేవలం హిందూమతం గురించిన బ్రిటిష్ నిర్వచనంపైనే కాకుండా, మసీదు లోపల లభ్యమైన సంస్కృత శాసనాలను అర్థం చేసుకోవడానికి కూడా వలసరాజ్యాల (బ్రిటిష్) ఆధారాలపైనే ఆధారపడింది. మసీదు చుట్టుపక్కల ఒక ఆలయం ఉన్నట్లు నమోదు చేసిన ఏ ఒక్క సంస్కృత ఆధారాన్ని కూడా ఇక్కడ ఉదహరించలేదు. ఇక సంస్కృత శాసనాల విషయానికి వస్తే, వాటిలో చాలా వాటిపైన ఒక జైన పండితుని శిష్యుడైన మదనుడు 13వ శతాబ్దంలో రాసిన ‘పారిజాతమంజరి’ అనే సంస్కృత నాటక పాఠ్యం ఉంది. 13వ శతాబ్దపు పరమార రాజు అర్జునవర్మ సమక్షంలో ఒక సరస్వతి ఆలయంలో ఈ నాటకాన్ని ప్రదర్శించారని ఆ గ్రంథ పీఠిక చెబుతుంది. ఈ నాటక పాఠాన్ని మసీదులో పునర్వినియోగించిన రాతి పలకలపైన చెక్కడం వల్ల, ఆ పీఠిక కూడా దానితో పాటే వచ్చింది. అయితే, ఎలాంటి పురాతత్వ ఆధారాలు చూపించనప్పటికీ, మసీదు కింద సరస్వతి ఆలయం ఉందనడానికి ఇది కూడా ఒక ఆధారంగా మళ్లీ పరిగణించడం జరిగింది.”
“ఒక రాజభవనానికి సంబంధించి లభ్యమైన జైన యక్షిణి అంబికా రూపాన్ని, ఆలయానికి చెందిన సరస్వతిగా ఎలాగైతే తప్పుగా చిత్రీకరించారో—అలాగే వివాదాస్పద స్థలానికి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అబ్దుల్లా షా చంగల్ అనే సూఫీ సంతు సమాధి (దర్గా)లో దొరికిన ఒక శాసనాన్ని కూడా, గతంలో ఉన్న నిర్మాణం ధ్వంసమైందనడానికి ఆధారంగా తీసుకున్నారు. మాల్వా సుల్తానేట్కు చెందిన 15వ శతాబ్దపు పాలకుడు మహమూద్ ఖాల్జీ జారీ చేసిన ఒక శాసనాన్ని 193వ పేజీలో ఉటంకిస్తూ—చంగల్ ‘విగ్రహాల రూపాలను ధ్వంసం చేసి, ఈ ఆలయాన్ని హింసాత్మకంగా మసీదుగా మార్చాడు’ అని ఆరోపించారు.
అయితే, చంగల్ మరణించిన 300 సంవత్సరాల తర్వాత రాయబడిన ఈ శాసనం, ఆయనకు ఆపాదించిన ఒక ప్రసిద్ధ గాథని మాత్రమే నమోదు చేసింది. ఈ పాఠ్యం అలంకారికమైనదే తప్ప వాస్తవాల ఆధారంగా రాసింది కాదు. అన్నింటికంటే ముఖ్యంగా, ఈ శాసనం కమల్ మౌలా మసీదు ప్రాంగణంలో దొరకలేదు దానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో లభ్యమైంది. కమల్ మౌలా మసీదు స్థలంలో జరిగిందని చెబుతున్న ఆలయ ధ్వంసానికి, చంగల్ సమాధిపై ఉన్న ఈ శాసనానికి ఎలా సంబంధం ఉన్నదో ఎఎస్ఐ ఎక్కడా వివరించలేదు.
ఇక్కడ కింద ఉన్న నిర్మాణం ఆలయమేనని భావించడం, అక్కడ పునర్వినియోగించిన సామాగ్రి గతంలో ధ్వంసమైన ఆలయానిదేనని అనుకోవడం, ఒక జైన రూపాన్ని సరస్వతి విగ్రహంగా భావించడం హిందూమతం-జైనమతం పూర్తిగా వేర్వేరు మతాలు కావు అని సరిపెట్టుకోవడంతో పాటు—గత 700 సంవత్సరాలుగా ఆ నిర్మాణం ఒక మసీదుగా ఉన్న చరిత్రను కూడా పూర్తిగా మరుగున పరిచారు. ఆ స్థలంలో లభ్యమైన ఒక శాసనం ప్రకారం (ఇది కూడా ఎఎస్ఐ సర్వేలో నమోదైంది)—1392-93లో మాల్వా గవర్నర్ దిలావర్ ఖాన్ ఘోరీ ధార్‌లోని మసీదులను మరమ్మతు చేయించినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి కమల్ మౌలా మసీదును 13వ శతాబ్దం ప్రారంభంలోనే, బహుశా ఢిల్లీ సుల్తాన్ అలావుద్దీన్ ఖాల్జీ గవర్నర్ ఉలగ్ ఖాన్ నిర్మించాడని నిర్ధారణ అవుతుంది.”
“ఈ మసీదులో ఒక మిహ్రాబ్ (మసీదు గోడలో ఉండే అర్ధ వృత్తాకార గూడు — సౌదీ అరేబియాలోని మక్కాలో ఉన్న కాబా ఖచ్చితమైన దిశను సూచిస్తుంది), దానిపై ఖురాన్ వాక్యాల శాసనాలు (సూరా అద్-ధారియాత్ లోని శ్లోకాలు), ఒక మింబర్ (ప్రసంగ పీఠం) తో పాటు మధ్య అంతస్తులలో జనానా (మహిళల ప్రత్యేక స్థలం) కూడా ఉన్నాయి. కాబట్టి, ఈ తీర్పు ఆ స్థలానికి ఆ ప్రాంతానికి ఉన్న జైన చరిత్రను మాత్రమే కాకుండా, చిష్తీ సూఫీ సంతు కమల్ మాల్వీ సమాధితో ముడిపడి ఉన్న ఈ నిర్మాణం గత 700 సంవత్సరాలుగా మసీదుగా కొనసాగుతున్న సుదీర్ఘ చరిత్రను కూడా తుడిచిపెట్టేస్తోంది.
-రుచికా శర్మ ఢిల్లీకి చెందిన చరిత్రకారిణి, ప్రొఫెసర్. ఆమె భారతీయ చరిత్రపై ‘డాక్టర్ రుచికా శర్మ అఫీషియల్’ అనే ఒక ప్రసిద్ధ యూట్యూబ్ ఛానల్‌ను నడుపుతున్నారు.
తెలుగు: పద్మ కొండిపర్తి
https://thewire.in/history/what-the-bhojashala-verdict-and-ఎఎస్ఐ-survey-leave-unanswered




