చాలా సులభమైన విధంగా చాలా అర్థవంతంగా ఇందులో మొత్తం 15 కథలు ఉన్నాయి.
ప్రతి కథ తాత్వికచింతనతో కూడుకున్నది. ప్రతి కథలో రాజకీయాలు ఉంటాయి.
మత రాజకీయం, ఎన్నికల రాజకీయం, కుల రాజకీయం, ప్రేమ రాజకీయం, సాహిత్య రాజకీయం, అనేక కోణాలలో అన్ని రకాల రాజకీయాలు మనకు ఈ కథలో కనిపిస్తాయి.
దేశంలో రాజకీయం ఏ వైపుగా సాగుతుందో ఆ రాజకీయం వల్ల జరిగే అనర్ధం ఎంతగా జరుగుతుందో ఫాసిజాన్ని ఎంత వేగంగా విస్తరింపజేస్తున్నారో నియంత ప్రజల ఆలోచనలను ఏ వైపుగా డైవర్ట్ చేస్తున్నారో, ఎన్నికలలో గెలుపు ఓటముల మధ్య జరిగే విధానం కూడా EVM ను, అక్కడున్న ఆఫీసర్లను ఎలా వాడుకొని, ప్రజల మద్దతు లేకపోయినప్పటికీ అధికారాన్ని ఎలా దక్కించుకుంటారో, నియంత ‘మన్ కీ బాత్’ మాటలు చెప్పి ప్రజలను ఎలా దారి మళ్లిస్తుందో మనం ఈ పుస్తకంలో చూడవచ్చు.
అంతేకాదు 76 ఏళ్ల రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఉన్న సోషల్ మీడియాని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. వాట్సాప్ యూనివర్సిటీలలో జరిగే అబద్ధపు ప్రచారం, ముస్లిం సమాజం పట్ల హిందుత్వ పేరుతో సోషల్ మీడియా ఎట్లా ఎహత్యను పెంచి పోషిస్తుందో కూడా మనకు అర్థం అవుతుంది. కోర్టులలో జడ్జీలతో సహా న్యాయాన్ని సైతం నియంత తన గుప్పెట్లో పెట్టుకోవడం ఎంత దుర్మార్గం అయిందో మనందరం చూస్తున్నాం.
ఇందులో మొత్తం 15 కథలు తెలంగాణ జీవితాలే. ప్రతి కథలో జీవితం ఉంటుంది.
* ఇంక మనం కథలోకి వెళ్తే మొదటి కథ 15 శాతం. అది మొదలవుతుంది 15 శాతం కథలో అమ్జద్ సీనుల దోస్తానా మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా సీను హిందుత్వ రాజకీయాల వలలో చిక్కుకొని ఎంతలా బాధపడతాడు ఆ మతంలో ఉన్నన్ని రోజులు సీను ముస్లింలను తిడుతూ వాళ్లంతా కూడా తుక్కుడా గ్యాంగ్ అంటూ ఈ దేశం వాళ్ళది కాదు వాళ్లంతా ఉగ్రవాదులు ఈ దేశంలో నుండి వెళ్ళగొట్టాలి, కోసి కారం పెట్టాలి అని మనిషికి మనిషికి మధ్య మానవత్వం కూడా మరిచిపోయి తిడుతుంటారు. అంతే కాదు, ఈ కథలో సోషల్ మీడియా విద్వేషంగా ఎలా ఉంటుందో సాయబులను ఎలా తిట్టాలో కూడా వారు చెప్తారు. అందులో ఉన్నన్ని రోజులు సోషల్ మీడియాలో ఎలా మాట్లాడాలో సాయబులను ఎలా తిట్టాలో అలా తిడుతూ ఎలా ఫేమస్ అవ్వాలో అది వాళ్ళ పార్టీ సిద్ధాంతంలో నడిపిస్తుంటారు. ఎవరి మనోభావాలు దెబ్బ తిన్నా వారికి అవసరం లేదు వారు చేసేదంతా దేశం కోసం ధర్మం కోసం అన్నట్టు ఉంటుంది. అనేక విషయాలను గమనించిన సీను కండ్లు తెరుచుకొని తను కోల్పోయిన తన ప్రాణ స్నేహితుడు అమ్జద్ దగ్గరికి వెళ్లి కలుసుకుంటారు. అలా ఈ కథలో హిందీలో ఫాసిజం వెనుక ఉన్న సోషల్ మీడియా దుర్మార్గం అక్కడున్న యువత ఆలోచనా విధానం మనకు ఈ కథ ద్వారా అర్థం అవుతాయి.
అంతేకాదు సీను లాంటివారు ఎంతో మంది యువత చరిత్ర తెలుసుకోకుండా చెప్పుడు మాటలు విని మతం వలలో చిక్కుకుంటున్న విధానం మనమీ కథలో చూడవచ్చు.
•ఎప్పటికైనా ఒక షార్ట్ ఫిలిం తీయాలి తర్వాత సినిమా డైరెక్టర్ అవ్వాలి అనే రమణ ఆలోచన నుండి బాటలు అనే కథ మొదలు అవుతుంది. అలా రమణ తన లక్ష్యం కోసం పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుని కథలు చదువుతూన్న క్రమంలో రమణకి జయసూర్య అనే సీనియర్ రచయిత రాసిన పుస్తకాలలో ఒక కథ ఎంతో నచ్చి ఆ కథను షార్ట్ ఫిలింగా తీయాలనుకొని నిర్ణయించుకుంటారు అందులో భాగంగా వాళ్ళ ఫ్రెండ్ సజెషన్ తో కథ రాసిన రచయిత పర్మిషన్ లేకుండా కథను డైరెక్ట్ గా తీసుకోకూడదు అది నేరం అవుతుంది అని తెలుసుకొని రచయిత జయసూర్యని కలిసి మాట్లాడి అతన్ని ఒప్పించి, జయసూర్య కూడా సంతోషంగా ఒప్పుకుంటాడు. అలా వారి పరిచయం రమణ సినిమా వైపు కూడా కొనసాగుతుంది.
జయ సూర్యకి కూతురు ఉండడం ఆమెకి ఇంకా పెళ్లి కాకపోవడం తనకి ఎలాగైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అని జయ సూర్య తో పాటు రమణ కూడా బాధ్యతగా ఫీల్ అవుతాడు, అదే సినిమా ఇండస్ట్రీలో కో డైరెక్టర్ గా పని చేస్తున్న రాజేంద్ర ని చూసి కొన్నాళ్ళకి జయ సూర్య కూతురికి కో డైరెక్టర్ రాజేంద్ర కి పరిచయం చేపించి వీడియో కాల్ కూడా మాట్లాడిస్తాడు రమణ కానీ ఇదంతా జయ సూర్యకి చెప్పినప్పుడు అసలు విషయం అక్కడే అర్థమవుతుంది, రమణ కి జయ సూర్యకి ఆ పెళ్లి ఇష్టం ఉండదు. ఎందుకని ఆరా తీసినప్పుడు వారి కులం అబ్బాయి ఉంటే చూడు అంటాడు జయ సూర్య. నిజానికి ఈ కథ రమణనే కాదు మనందరినీ ఆలోచింపజేస్తుంది. ఒక అభ్యుదయ వాది సీనియర్ రచయిత అయిన సమాజంలో ఇంత గొప్ప పేరు ఉన్నప్పటికీ కులం కంపు జయ సూర్య దగ్గర కొడుతూనే ఉండడం మనందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఒక మనిషిలో మానవత్వం మనిషికీ మనిషికీ మధ్య కుల వైరుధ్యాలు లేని సమాజం ఇంకా ఎక్కడ ఉంటుంది అనే ప్రశ్న రమణతోపాటు మనందరిలో కలుగుతుంది. ఇదంతా చూసి విసిగిపోయిన జయ సూర్య కూతురు లలిత ఎలా ఎదిరించి పెళ్లి చేసుకుంటుందో నో కాస్ట్ నో రిలీజియన్ అనే సర్టిఫికెట్ పై ఎలా రాయించుకుంటారో బాటలు అనే కథ మనకి చూపిస్తుంది.
* ఖల్ బలి కథలో నరేష్ తల్లి కరోనా సమయంలో చనిపోతే తను ఫ్రెండ్ ముస్లిం అయినప్పటికీ హిందూ సాంప్రదాయాల ప్రకారం తల్లిని ఖననం చేసి మానవత్వాన్ని చాటడం కావచ్చు;
ముఖ్యంగా మేరా బాప్ ఖయ్యూం అనే కథలో జాయిజ్ పుట్టుక గురించి తన కన్న తండ్రికి తాను పుట్టాడు అని నిరూపించుకోవడం కోసం ఆత్మ గౌరవం నిలబెట్టుకోవడం కోసం కొడుకు చేసే ప్రయత్నం కావచ్చు;
•సామాజిక స్పృహ అనేది లేకపోతే వారి జీవితాలల్లో వారు తీసుకునే నిర్ణయాలు చివరికి వారి పతనానికి కారణం అవుతాయి.
అలాగే సౌందర్య కథలో కూడా శ్రీలక్ష్మి జీవితం అలాగే ఉంటుంది. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో వాళ్ళ మేనమామ చేరదీస్తారు. వారికి ఉన్న హోటల్లో సర్వర్ గా పెట్టుకొని పనిమనిషిలా చూస్తారు. తనని బడికి కూడా పంపరు, అన్ని పనులు తనతోనే చేయించుకోవడం వల్ల అత్తయ్య మామ చాలా ధీమాగా ఉండేవారు.
శ్రీలక్ష్మి చేసే శ్రమ వల్ల రాను రాను ఆ హోటల్ కి శ్రీ లక్ష్మీ హోటల్ అనే పేరు కూడా పడిపోయింది. అలా శ్రీలక్ష్మి జీవితం అంతా హోటల్లో పనిమనిషి గానే బాల్యాన్ని దాటేసింది. నిజానికి శ్రీలక్ష్మి చాలా అందంగా కూడా ఉంటుంది అందుకే ఎప్పటినుండో మాటు వేసిన సత్యవ్వ కనులల్లో పడుతుంది. ఇక్కడే శ్రీలక్ష్మి జీవితం మలుపు తిరుగుతుంది.
సత్యవ్వ చెప్పిన మాటలు ‘దొర్సాని లెక్క బతకచ్చు’ అనే మాట మీద ఆశపడుతుంది శ్రీలక్ష్మి. నిజానికి సత్యవ్వ సిల్క్ స్మిత అనే హోటల్ నడుపుతుంది. బయటికి అది హోటలే కానీ లోపల అంతా సానికొంప. అక్కడికి సిక్కు డ్రైవర్లు రెగ్యులర్ కస్టమర్లు. శ్రీలక్ష్మితో చేసిన వ్యాపారం బాగా సాగడంతో శ్రీ లక్ష్మికి సౌందర్య అనే పేరు పెడుతుంది.
కొన్నాళ్లకి ఇదంతా గమనించిన సౌందర్య అక్కడి నుండి పారిపోయి హైదరాబాదుకు చేరుకొని ఒకరిని పెళ్లి చేసుకుంటుంది.
కానీ చివరికి సౌందర్యకి ఎయిడ్స్ వ్యాధి వచ్చి రోడ్డు పక్కన పడి ఉంటుంది. అప్పటివరకు ఒక రకంగా చూసిన జనాలు ఇప్పుడు ఆమెను చూడడానికి కూడా కనీసం సహాయం చేయడానికి కూడా ముందుకు రాకపోవడంతో సౌందర్య అక్కడే చనిపోతుంది. ఆ శవాన్ని కూడా సఫాయి వాళ్లు ఖననం చేస్తారు.
నిజానికి మనదేశంలో సొంత ఆలోచన లేకపోవడం ఎవరో చెప్పిన మాటలు విని వారి చేతుల మీద వారి జీవితాలను నాశనం చేసుకున్న సౌందర్యలు ఎంతోమంది కదా. నిజానికి ఈ వ్యాధి మన దేశంలో మూడో స్థానంలో ఉంది.
మరి సౌందర్యకు ఆ వ్యాధి రావడానికి కారణం ఏమిటి? సిల్క్ స్మిత హోటల్ నుండి తను ఎలా తప్పించుకుంది, హైదరాబాదు వచ్చి ఎవర్ని పెళ్లి చేసుకుంది, శ్రీలక్ష్మి నుండి సౌందర్య గా మారడానికి కారణాలు ఏమిటి, ఇలాంటి ప్రశ్నలు మన మస్తిష్కంలో పరిగెడుతూనే ఉంటాయి. ఈ కథలో ఉన్న సౌందర్య లాంటి వారి జీవితాలను మనం చదివితే మనం తీసుకునే నిర్ణయాలు మన ఆలోచనలు ఎంత బలంగా ఉండాలో సౌందర్య కథ ద్వారా మనకు అర్ధమవుతుంది.
* స్వచ్ఛత అనే కథలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఇద్దరు కళాకారులు ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న విధానం, చేసుకున్నాక వారి మధ్య కులం కంపు ఏ విధంగా పనిచేస్తుందో, చివరికి వారి పెళ్లికి కన్న తల్లిదండ్రులను కూడా రావద్దు అనడం, కనీసం వారి పిల్లల్ని కూడా ముట్టుకోనివ్వకపోవడం కూడా మనం ఈ కథలో చూడవచ్చు.
•మనదేశంలో స్వేచ్ఛగా ట్రాన్స్ జెండర్లుగా మారుతున్న వైనం మనం ఇప్పుడు చూస్తున్నాం. అలాంటి ఒక ట్రాన్స్ జెండర్ కథే సుగంధ . తల్లిదండ్రులు పరువు కోసం ఓ మహిళకి ఇచ్చి పెళ్లి చేస్తే ఆ తర్వాత జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో ట్రాన్స్ జెండర్ గా తను పడిన అవమానం, బాధలు, తను చేసిన పోరాటం, నమ్మిన మనుషుల తీరు, వారి జీవన విధానాలు, ఎవరు ఎలా బ్రతకాలో చెప్పే విధానం మనకు స్పష్టంగా అర్థం అవుతుంది.
•ప్రస్తుతం మన దేశంలో ఆదానీ అంబానీలదే రాజ్యం.
వాళ్ళు చెప్పిందే శాసనంగా మారింది. దానికి తోడు రాజకీయం ఎలా పనిచేస్తుందో ఫాసిజాన్ని ఎలా పెంచి పోషిస్తుందో బాధ్యత గల పౌరుడు ఈ దేశంలో ఇది కరెక్ట్ కాదు అని ప్రశ్నిస్తే ప్రశ్నించిన బుద్ధి జీవుల మీద సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టిన వారి మీద కూడా కేసులు పెట్టి వారిని ఎలా శిక్షిస్తున్నారో కూడా మనం చూస్తున్నాం.
అలాంటి ఈ తరుణంలో అనేక కథల రూపంలో మన ముందుకు ఈ కథలను తీసుకొచ్చిండు, రచయిత. రకరకాల ఎమోషన్లతో ట్రావెల్ అవ్వడమే కథలు రాయడం అంటాడు మన రచయిత.
అలాగే కథలను రాస్తున్నప్పుడు కొన్నిసార్లు గుండెలు పిండేస్తున్నట్లు కూడా అవుతుంది. కథంటే అదేగా జీవితాలను అవపూస పట్టడం అంటాడు హుమాయున్ సంఘీర్ .
అలా కథలను అవపూస పట్టిన హుమాయున్ సంఘీర్ ఎలాగైనా ఎవరికి వారు ఎప్పటికప్పుడు ఉన్మాదాన్ని ప్రశ్నించాలి, నిలదీయాలి అంటూ తనకు తెలిసిన సాహిత్యం ద్వారా రచయిత ప్రశ్నిస్తున్నారు. మనం కూడా తనకు తోడుగా ఒక అడుగు ముందుకేసి ప్రశ్నిద్దాం రండి. అలాగే ఇప్పుడు మేరా బాప్ ఖయ్యూం అనే పుస్తకం మనందరం చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
దుర్మార్గమైన రాజకీయాలపై సామాజిక అంశాలపై ఈ పుస్తకాన్ని రచించిన హుమాయున్ సంఘీర్ గారికి మరియు ఇంతటి అద్భుతమైన పుస్తకాన్ని మా అందరికీ పరిచయం చేసిన వెన్నెలపిట్ట టీం కి మా కృతజ్ఞతలు.