రాయలసీమ కవిత్వాన్ని పరిచయం చేస్తూ నేను ఒకానొక ప్రాంతీయ అస్తిత్వ సాహిత్యాన్ని గురించి చెప్పడం ద్వారా ఆ ప్రాంతాన్నీ, దాని వేదనలనూ, ఆకాంక్షలనూ, ఆశాభంగాలనూ, అక్కడే పుట్టిపెరిగిన ఆలోచనాపరుల రాతల్లో నుంచి పరిచయం చేసే పని చేశాను
– జి. వెంకటకృష్ణ
***
ఆధునిక రాయలసీమ కవిత్వాన్ని సమీక్షించడం చిన్న విషయమేమీ కాదు. ఎందుకంటే, కాల ప్రవాహంలో వచ్చి చేరిన కొత్త చేర్పులనూ, కొత్త మార్పులనూ, అవి కవిత్వం లో ప్రవేశింపజేసే విభిన్న వస్తు శిల్పాల పోకడలనూ డైసెక్ట్ చేస్తూ, మొత్తంగా ఆయా కవుల దృక్పధాన్ని అంచనా వేసి, పాఠకులకు చేరవేయడం శ్రమతో కూడుకున్న పని. ఈ పనిని ఇటీవల కవి సమ్మేళం లో ధారావాహికంగా జి. వెంకటకృష్ణ చేశాడు.
ఈ సమీక్షా వ్యాసాలను కవిసమ్మేళనం ప్రచురణలు “రవ్వలసవ్వడి” పేరుమీద ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చి ఇటీవలే అనంతపురంలో ఆవిష్కరించారు.
విద్వాన్ విశ్వం మొదలుకొని ఇటీవల రాస్తున్న అనేక మంది కవుల కవిత్వాన్ని 45 వ్యాసాలలో పొందు పరిచాడు. ఇందులో కొన్ని వ్యాసాలు పరిచయాలు గానూ, ఇంకొన్ని సమీక్షల లాగానూ విభజించవచ్చు. అయితే 275 పేజీలున్న ఈ గ్రంధాన్ని కవిత్వ పరిచయంగానే అట్టమీద ప్రకటించారు. వాళ్ళ పాఠకుల కోసమే వదిలేయకుండా, సాధారణంగా పుస్తకాలు చదివే పాఠకులను దృష్టిలో పెట్టుకొని “కవి సమ్మేళనం ప్రచురణలు” క్రింద ఈ పుస్తకాన్ని తీసుకొని రావడం రాయలసీమ సాహిత్యానికి ఆ సంస్థ ఇచ్చిన గౌరవం కూడా! ఆ రకంగా ఇతర ప్రాంతాల సాహిత్యాభిమానులకు చేరువ కావొచ్చు.
కథకుడిగా, కవిగా, వక్తగా అందరికీ పరిచయం ఉన్న రాయలసీమ వాది వెంకటకృష్ణకు కవి సమ్మేళనం ఈ పని అప్పగించి మంచి పని చేసింది. తన ప్రాంత ప్రజలు పట్ల అపార గౌరవం, వారి సాదకభాధల పట్ల ఆందోళన, వాటిని ఎదుర్కోవడానికి ప్రజలు చేసే ఉద్యమాలలో భాగస్వామి గా ఉన్న వెంకటకృష్ణ అనేక సందర్భాల్లో, అనేక వేదికల మీద రాయలసీమ సాహిత్యం గురించి ప్రసంగించడంతో పాటు, రాయలసీమ కరువు ఇతరత్రా సమస్యలను, వెనుకబాటుతనాన్నీ బలమైన కథలు,కవితలు రాస్తూ ప్రపంచం ముందు ఉంచుతున్నాడు. ఈ గ్రంధం దానికి కొనసాగింపు.
తన ప్రాంత భౌతిక, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక విషయాల పట్ల వెంకటకృష్ణ కు గొప్ప అవగాహన ఉన్నట్టు ఈ పుస్తకం చదువుతున్న క్రమంలో పాఠకులకు అర్థమౌతుంది. అంతేకాదు ఒక సమీక్షకుడిగా, రాయలసీమ వాదిగా కేవలం ఆ ప్రాంత కవులు రాసిన కవిత్వం కాబట్టి పొగడ్తల దగ్గరే ఆగిపోకుండా, అవసరమైన చోట ఏ మార్పులు అవసరమో సూచనలు కూడా చేశాడు. నిజానికి అన్ని సామాజిక రాజకీయ అస్తిత్వ ధోరణులను ఆయా కవుల స్థాయీభేధాలు పట్టించుకోకుండా పరిచయం చేయడం పాఠకులకు ఊరటనిచ్చే విషయం. ఇందులో మళ్ళీ, రాయలసీమ అస్తిత్వ ఉద్యమాలు ఊపులో ఉన్నప్పుడు రాసిన కవిత్వాన్ని పరామర్శిస్తూనే అభ్యుదయ, విప్లవ కవులను, సంస్థలు వెలువరించిన పుస్తకాలనూ, పాఠకులకు పరిచయం చేయడం గమనించవచ్చు. అంటే రాయలసీమ ఆధునిక కవిత్వాభివృధ్ధిలో పాలుపంచుకున్న అందరినీ పరామర్శించాడు వెంకటకృష్ణ! ఈ నేపధ్యంలో ఆయా కవులూ,సంస్థలు వేసిన ప్రభావాన్నీ గుర్తించడం రచయిత సూక్ష్మదృష్టికి
1955 విద్వాన్ విశ్వంతో మొదలుకొని సాక్ష్యం.
రాయలసీమ ఆధునిక కవిత్వ పరిణామ క్రమాన్ని రెండుగా కాలాలుగా విభజించాడు. ఒకటి 1956 విద్వాన్ విశ్వంతో ఆధునిక కవిత్వం మొదలైందని నిర్ధారించడం, రెండు 1990 లో నాటికి ఎ.ఎన్. నాగేశ్వర్రావు కవిత్వంతో కొత్త మలుపు తీసుకుందనీ 1955 – 1990 లమధ్య కాలం అంతా రాయలసీమ ఆధునిక కవిత్వానికి స్తబ్దతా దశగా నిర్ధారించాడు. ఇలా భిన్న దశలను నిర్ధారించడానికి అవసరమైన బలమైన పరిశీలనా, పరిశోధనా వెంకటకృష్ణ చేశాడని పాఠకులకు అర్థం అవుతుంది. ఇక్కడితో ఆగిపోకుండా జూపల్లి ప్రేమచంద్ ను ( “అవేద” సంపుటితో ) “రాయలసీమ మొదటి ఆధునిక దళిత వచన కవిగా నామకరణం చేశాడు. ఇది కూడా ఒక సాహసోపేత నిర్ధారణ.
సీమ కవిత సంకలనం గురించి రాస్తూ ” ఇలాంటి ఓ కవిత్వ సంకలనం 2000 దాకా ( 2000 సంవత్సరం రాయలసీమ ఆధునిక కవిత్వానికి లాండ్ మార్క్ గా చెప్పాడు) రాకపోవడాన్ని ఉటంకిస్తూ ఇందులో కవిత్వాన్ని మూడు విభాగాలుగా (స్వయంస్పృహ, భావచైతన్యం, ధిక్కారం) విడదీసాడు. ఈ విభజన కూడా అందరినీ ఆశ్చర్యపరిచేదే! చరిత్ర క్రమాన్ని భిన్నదశలలోనే మనం అవగాహన చేసుకుంటాం. ఈ అవగాహన నిజానికి గతితర్కమైంది. కాలంతో పాటు వచ్చే మార్పులనూ, అభివృద్ధినీ రికార్డ్ చేయడం చరిత్ర రచనలో ముఖ్యమైన భాగం. ఆ సంప్రదాయం సరైనదని ఈ పుస్తకం మరోసారి రుజువు చేసింది.
రాయలసీమ చైతన్యం తో సంబంధం లేకుండా, అభ్యుదయం లేదా విప్లవ చైతన్యం తో రాసిన కవులను కూడా ఇందులో స్థానం కల్పించాడు. హెచ్ఛార్కే, సౌదా, ఇంద్ర వెళ్ళి రమేష్, పాణి, సగిలేటి నాగరాజు వంటి విప్లవ కవుల గురించి రాస్తూ వాళ్ళు రాయలసీమ అస్తిత్వ కోణంలో నుంచి రాశారా లేదా అని ఆరా తీసాడు. అలా రాసిన ( అప్పటికి) విప్లవ కవులు లేరు అని ఒకింత నిరాశకు గురైనట్టు కూడా ఉన్నాడు. ఇది చర్చనీయాంశమే!
1991 లో విడుదలైన లఘు కవితా సంకలనం “అంకురం” గురించి రాస్తూ, 1991 కాలానికి ఆధునిక రాయలసీమ సాహిత్యం లేదని రూఢి చేసిన సింగమనేని మాటల్ని ఉటంకిస్తూ, అంకురం కవితా సంకలనం రావడం వెనుక కారణాలను వివరిస్తూ, అప్పటికే విప్లవోద్యమం రాయలసీమ లో ఉన్నా రాయలసీమ అస్తిత్వాన్ని పట్టించుకోలేదనీ అభిప్రాయం పడ్డాడు. ఈ అభిప్రాయం తో ఏకీభవించవచ్చు లేదా వదిలేయవచ్చు కానీ విప్లవోద్యమం ఇక్కడ మొదలవ్వడానికి రాయలసీమ ప్రాంత వెనుకబాటు తొలి కారణం. రాయలసీమ లో అనంతపురం జిల్లా, రాయచోటి ప్రాంత వాసులకు ఈ విషయం బాగా తెలుసు. ఇవి రెండు కరువు పీడిత ప్రాంతాలే కాక భుస్వామ్యం అగ్రవర్ణ ఆధిపత్యం రాజ్యమేలిన ప్రాంతాలు కూడా! ఆ ప్రాంతాల్లో, నల్లమల అటవీ ప్రాంతంలో విప్లవోద్యమం వేసిన ప్రభావాన్ని తక్కువ చేసి చూడడానికి లేదు. విప్లవ చైతన్యం, అస్తిత్వ చైతన్యాన్ని ఒకే గాటన కట్టడానికి లేదు రెండింటి మౌళిక స్వభావం వేరు. ఆ మాటకొస్తే రాయలసీమ ఉద్యమానికి సేవకుడిగా చెప్పే రమణారెడ్డి తొలుత విరసం సభ్యుడు, పైగా రాయలసీమలో కార్మీక ఉద్యమాన్ని నిర్మించినవాడు. అసలు రాయలసీమ అస్తిత్వ ఉద్యమంలోనే సవాలక్ష మలుపులున్నాయి, లోపాలున్నాయి. రాయలసీమ కోసం 1985 లో పోరాటం మొదలైనప్పటి నుంచి పాలక వ్యక్తులు ఎన్ని విద్రోహాలు చేసినా ఇప్పటి దాకా అనేక వేదికల ద్వారా సీమ కరువు, నీటి వాటా, భూస్వామ్య సాయుధ ముఠాలు మొదలైన వాటన్నిటి మీద విప్లవోద్యమమే పని చేస్తూ వచ్చింది . అసలు రాయలసీమ అస్తిత్వం తెలంగాణలో లా, కోస్తాలో లా రూపుదిద్దుకుందా! ఈ అంశాలను వెంకటకృష్ణ పరిగణలోనికి తీసుకోలేదు. రాయలసీమ ఆకాంక్షల పట్ల నిజమైన నిజాయితీ, నిబద్ధత ప్రదర్శించింది ఒక్క విప్లవోద్యమమే!
అర్ధాంతరంగా మనల్ని విడిచి వెళ్ళిపోయిన, రాప్తాడు గోపాలకృష్ణ, నాగప్పగారి సుందర్రాజు గురించి వ్యాసాలు ఆ అమర కవులని గొప్పగా కీర్తించాయి. బహుశా చరిత్ర పొడుగునా మనం చేసుకోవాల్సిన కవులు వీరు.
వెంకటకృష్ణ చాలా జాగ్రత్తగా ఈ పుస్తకం వెలువరించాడు. అలా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, రాయలసీమ పరిస్థితులపై ఆర్తిగా రాసిన తీరప్రాంత కవులైన శ్రీరాం,శ్రీనివాసగౌడ్, అనిల్ డానీ వంటి కవులను కూడా పరిచయం చేశాడు. ఎందుకంటే వీరు రాసిన కవిత్వం రాయలసీమ ప్రాంతం కవులకు అటు ఉద్వేగపరంగా, ఇటు వస్తుపరంగా ఏమి తీసిపోదు. ఏ ప్రాంతాన్నైతే మనం ఈసడించుకుంటామో, ఆ ప్రాంతం నుంచి కూడా మన ఆరాటపోరాటాలకు సంఘీభావం తెలుపుతున్న ప్రజాస్వామిక కవులున్నారనీ, మన ప్రాంతం వారికి అర్థం కావాలి. ఇంతటితో ఆగిపోకుండా ఇప్పటి రాయలసీమ ప్రజా ఉద్యమాలకు కేంద్రంగా ఉన్న కర్నూలు కవుల కవిత్వాన్ని అరసం 2015 “కర్నూలు కవిత” పేరు మీద వెలువరించింది దాని మీద పరిచయం లో ఆ సంకలనం లో డెభ్భై మంది కవుల కవిత్వం ఉందనీ పాఠకులు గమనించదగ్గ విషయం. ఇలాంటి పుస్తకాలు చాలానే వచ్చాయి. అయితే దానికి తగ్గ ప్రచారం సీమేతర ప్రాంతాల్లో జరగడం లేదు. ఈ పుస్తకంలో ఇంకో విశేషం ఏమంటే రాయలసీమ భౌగోళిక పరిధి బయటి రాయలసీమ సాహిత్యాన్ని పరిచయం చేయడం దీనికో నిండుదనం తీసుకొని వచ్చింది. ఈ వ్యాసం సమాచార సేకరణ ముచ్చట గొలుపుతుంది.
తిరుపతి కోనేటి కట్ట కవులు నా పరిచయం చేయడం ఈ పుస్తకం సాధించిన మరో విజయం. అటు అంకురం ఇటు కోనేటి కట్ట అనే గుంపు కవులు ఉన్నారన్న విషయం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు.
రాయలసీమ ఆధునిక కవిత్వం లో మహిళల గొంతు కూడా తక్కువేమీ కాదని “రాయలసీమలో స్ర్తీల కవిత్వం” అనే వ్యాసంతో నిరూపించాడు. రాయలసీమ ఆధునిక కవిత్వంలో తమ వాణి వినిపించిన కె. జయ, నిర్మళారాణి, విజయలక్ష్మి పండిట్, మమత, గండికోట వారిజ, లక్ష్మీ కందిమళ్ళ, డి.శిరీష, కళ్యాణదుర్గం స్వర్ణలత వంటి మహిళా కవులని పరిచయం చేశాడు. దీనికోసం సీమ అస్తిత్వాన్ని పరిగణలోకి తీసుకోక పోవడం గమనార్హం.
ఇలా రాయలసీమ ఆధునిక కవిత్వానికి సంబంధించిన అనేక కొత్త అంశాలను ఈ పుస్తకం పాఠకుల ముందు ఉంచింది. ఈ పుస్తకం వెలుగులో ఇలాంటి పరిశోధన ఇంకా జరగవలసి ఉంది. అందుకు పాదులు వేసిన జి. వెంకటకృష్ణ కి అభినందనలు.