నేడు మన నిరుద్యోగ యువత ప్రభుత్వం ఉపాధి కల్పించమని రోడ్లపైకి వస్తే పోలీసుల లాఠీదెబ్బలు తిని చేసి జైలుకు వెళ్లాల్సి వస్తున్నది .
కానీ కేవలం ఏడు దశాబ్దాల క్రితం, పూర్తిగా యిందుకు భిన్నంగా పాలన ఉన్న దేశాలు ఉన్నాయి. అంటే, మీరు పని లేదా ఉద్యోగం చేయకూడదనుకుంటే, మిమ్మల్ని అరెస్టు చేసి ‘లేబర్ క్యాంపు’లో శ్రమ చేయడానికి పంపిస్తారు. మీరు పరాన్నజీవి వర్గానికి చెందినవాళ్ళు కాబట్టి మీరు పని చేయకూడదని అనుకుంటున్నారని భావిస్తారు. ఈ దేశాల్లో, 18 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలందరికీ ఉపాధి హామీ వుండింది. ఈ దేశాలను సోషలిస్టు దేశాలు అని పిలిచేవారు, ఆ దేశాలలో ప్రజల విప్లవం ఫలితంగా ఉనికిలోకి వచ్చాయి. ఒకప్పుడు, ప్రపంచ ప్రజలలో 40 శాతం మంది సోషలిస్టు దేశాల నివాసితులు.
మహా మాంద్యం సమయంలో, ప్రపంచం మొత్తం మాంద్యంలోకి కూరుకుపోతున్నప్పుడు, పెట్టుబడిదారీ దేశాల ప్రజలు చాలా మంది వీధుల్లోకి వచ్చేసినప్పుడు, సోషలిస్టు సోవియట్ యూనియన్‌లో 0 శాతం నిరుద్యోగం ఉండింది. అది మాత్రమే కాదు, సోవియట్ రష్యాలో జిడిపి 10 శాతం చొప్పున పెరుగుతూండింది.
వ్యభిచారం, మద్యపానం, ద్రవ్యోల్బణం, పేదరికం, నిరక్షరాస్యతలను ఈ సోషలిస్టు దేశాల నుండి పూర్తిగా నిర్మూలించారు. ఈ విషయం డైసన్ కార్టర్ ప్రసిద్ధ పుస్తకం ‘సిన్ అండ్ సైన్స్’లో చదవవచ్చు. సోవియట్ రష్యాను చూసి వచ్చిన తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్, రామవృక్ష్ బేనిపూరి వంటి భారతీయ రచయితలు కూడా దీనిని ధృవీకరించారు.
కానీ నేడు ఈ గొప్ప విజయాలపై చాలా ప్రణాళికాబద్ధంగా దాడి చేస్తున్నారు. ఇక్కడ ఒక ఉదాహరణ సరిపోతుంది. 2011లో, ఫ్రాంక్ డికోటర్ రాసిన పుస్తకం – ‘మావోస్ గ్రేట్ ఫెమైన్’ (మావో గొప్ప కరువు) ప్రచురితమైంది. అందులో ‘గ్రేట్ లీప్ ఫార్వర్డ్ (గొప్ప ముందంజ)’ సమయంలో, చైనాలో ఆకలితో 4 కోట్ల మంది మరణించారని రాసాడు. పుస్తకం ముఖచిత్రంపై ఆకలితో అలమటిస్తున్న పిల్లల ఫోటో వుండింది. ఆ ఫొటో 1946 నాటిది. (తరువాతి ముద్రణలలో ఈ ఫోటోని తీసేసారు) అయితే చైనా విప్లవం 1949లో జరిగింది. మీరు చైనాలో 1959-60 నాటి కరువు గురించి రాస్తున్నారు, కానీ కవర్‌పై ఉన్న ఫోటో 1946 నాటిదని ప్రశ్న వచ్చినప్పుడు, ఆ కాలం నాటి ఫోటో నాకు దొరకలేదు అని రచయిత సమాధానం ఇచ్చాడు.
డికోటర్ పుస్తకంలో ఒక చోట మావోను ఉటంకిస్తూ, సగం జనాభాను చంపమని మావో చెప్పాడని, అలా చేస్తే మిగిలిన సగం మందికి సరిగ్గా ఆహారం ఇవ్వగలమని అన్నాడని రాశాడు. దీన్ని మావో ఎక్కడ రాశాడంటూ ఒక చైనీస్ స్కాలర్ అతన్ని సవాలు చేసినప్పుడు, అతను హాంకాంగ్‌లోని ఆర్కైవ్‌లో ఉంచిన మావో పత్రాలను ఉదహరించాడు. ఆ పత్రాన్ని పరిశీలించిన తర్వాత.. మిగిలిన సగం ప్రాజెక్టులకు సులువుగా నిధులు అందజేసేందుకు వీలుగా సగం ప్రాజెక్టులను మూసివేయాలని మావో మరేదో సందర్భంలో చెప్పినట్లు తేలింది. డచ్ స్కాలర్ డికోటర్ కొత్తగా చైనీస్ భాష నేర్చుకున్నాడు. కానీ మావో , సోషలిజంల పట్ల అతనికి వున్న ప్రతికూల అభిప్రాయం కారణంగా అర్థాన్ని వక్రీకరించాడు. అయినప్పటికీ అతను క్షమాపణ చెప్పలేదు, పుస్తకాన్ని సవరించలేదు కూడా. సోషలిజం, మావోల గురించి విషం చిమ్మినందుకు అతను ‘ప్రతిష్టాత్మక’ శామ్యూల్ జాన్సన్ అవార్డును కూడా అందుకున్నాడు.
సోషలిజం సాధించిన అద్భుత విజయాల గురించి ఎంత చెత్త, దుష్ప్రచారం సాగిందో ఈ ఒక్క సంఘటనను బట్టి అర్థం చేసుకోవచ్చు.
మనం సోషలిస్టు దేశాలలో విద్య గురించి మాట్లాడినట్లయితే, అందులో కూడా సాటిలేని విజయాలు ఉన్నాయి. అయితే ఆ విజయాల గురించి మాట్లాడే ముందు, పెట్టుబడిదారీ దేశాలలో ఎలాంటి విద్యను అందిస్తారో అర్థం చేసుకుందాం? డాక్టర్ హైమ్ గినోట్ తన ప్రసిద్ధ పుస్తకం ‘టీచర్ అండ్ చైల్డ్’లో ఇలా వ్రాశాడు – ‘నేను చిత్రహింసల శిబిర బాధితుడిని. బహుశా ఎవరూ చూడకూడని వాటిని నా కళ్ళు చూశాయి. శిక్షణ పొందిన ఇంజనీర్లు గ్యాస్ చాంబర్ నిర్మించారు. శిక్షణ పొందిన వైద్యులే పిల్లలకు విషం తాగించారు. శిక్షణ పొందిన నర్సులు నవజాత శిశువులను చంపారు. హైస్కూల్, యూనివర్శిటీ చదువుకున్న వారు పిల్లలను, మహిళలను కాల్చి చంపారు. ఇది ఎలాంటి విద్య?’
దీనికి విరుద్ధంగా, సోషలిస్ట్ విద్య ఉదాహరణ చూడండి. సోవియట్ విద్యావేత్త సుఖోమ్లిన్స్కీ తన ప్రసిద్ధ పుస్తకం ‘డెప్త్స్ ఆఫ్ ది చైల్డ్స్ హార్ట్’లో ఒక పాఠశాల ఉదాహరణను ఇచ్చారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో, ఉపాధ్యాయుడు పిల్లలను అడిగాడు, మీరు తినే రొట్టెలకు ఏ ఏ వ్యక్తులు సహకరించారు?అని. ఇక సమాధానాల పరంపర మొదలవుతుంది – “తల్లిదండ్రులు, రైతు, వ్యవసాయ పరికరాలు తయారు చేసిన వ్యక్తి, పొలాల నుండి గింజలు తీసిన ట్రక్ డ్రైవర్, ట్రక్కుపై గింజలు ఎక్కించిన వారు, ట్రక్కును తయారు చేసిన వారు, చమురు బావుల నుంచి పెట్రోలు తీసినవారు వగైరా వగైరా.” ఒక చిన్న పిల్లవాడు మౌనంగా ఉన్నాడు. టీచర్ అతని వైపు తిరిగితే, “నిప్పుని కనిపెట్టినతని సహకారం కూడా ఉంది ఈ రొట్టెలో” అని సిగ్గుపడుతూ అన్నాడు.
మరొక ఉదాహరణతో యింకా బాగా అర్థం చేసుకోవచ్చు. సోషలిస్టు చైనాలో ఓ సినిమా తీశారు – ‘బ్రేకింగ్ విత్ ది ఓల్డ్ ఐడియాస్’ (పాత భావాలను బద్దలుకొడదాం). ఒక స్కూల్లో పరీక్ష జరుగుతున్నట్లు చూపించారు. మిడతల నుండి పొలాలను ఎలా కాపాడాలి అనేది ప్రశ్నపత్రంలో ప్రశ్న. పరీక్షలు జరుగుతున్నప్పుడే వాస్తవంగా మిడతల దాడి జరుగుతుంది. చాలా మంది విద్యార్థులు తమ పరీక్షలను విడిచిపెట్టి మిడతల నుండి తమ పంటలను కాపాడుకోవడానికి వెళతారు. కానీ కొందరు విద్యార్థులు పరీక్షలు రాయడం ప్రారంభిస్తారు. మరుసటి రోజు, పాఠశాలలోనూ, వూరంతటా ఎవరు పాస్ అయారు, ఎవరు ఫెయిల్ అయ్యారు అనే చర్చ ప్రారంభమవుతుంది. సహజంగానే తమ అభ్యాసాన్ని ఆచరణలో పెట్టి వాస్తవానికి మిడతల నుండి పొలాలను రక్షించిన పిల్లలు పాస్ అవుతారు.
ఈ రెండు ఉదాహరణల నుండి మీరు సోషలిస్ట్ సమాజంలో విద్య నాణ్యత గురించి అంచనా వేయవచ్చు.
సోషలిస్టు దేశాల విజయాన్ని అంకెలతో కొలవాలంటే ఒక్క అంకె సరిపోతుంది. విప్లవానికి ముందు, రష్యాలో స్త్రీలలో అక్షరాస్యత రేటు 13 శాతం, విప్లవం జరిగిన 10 సంవత్సరాలలో, 100 శాతం అక్షరాస్యత సాధించారు. క్యూబాలో విద్యా దళాన్ని ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన దేశాన్ని అక్షరాస్యులుగా తీర్చిదిద్దే పనిని చేపట్టారు. అక్షరాస్యత అంటే అక్షరాల జ్ఞానం మాత్రమే కాదు. అది స్పృహతో నిండిన అక్షరాస్యత. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, విద్య ప్రారంభం నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు ఉచితం.
ప్రారంభంలో చెప్పినట్లుగా, సోషలిస్టు దేశాలలో ఉపాధి హామీ ఇచ్చారు. కానీ ఈ ఉపాధి నాణ్యత పెట్టుబడిదారీ దేశాల్లోని ఉపాధికి గుణాత్మకంగా భిన్నంగా ఉంది. ఇక్కడ ఎనిమిది గంటల పని, ఎనిమిది గంటల విశ్రాంతి, ఎనిమిది గంటల వినోదం అనే సూత్రాన్ని అమలు చేశారు. ఇక్కడ కార్మికుడు ‘వేతన కార్మికుడు’ కాదు, స్వతంత్రుడు. కర్మాగారాన్ని ఎలా నడపాలి, ఏమి ఉత్పత్తి చేయాలనేది కార్మికుల కమిటీలు నిర్ణయించేవి. నిజానికి దేశ పగ్గాలు కార్మికుల చేతుల్లోనే వుండినాయి.
ఈ సోషలిస్టు విద్య, సామ్యవాద విజయాల కారణంగా ప్రపంచాన్ని కబళించడానికి పూనుకున్న హిట్లర్ ఫాసిజాన్ని ఓడించడంలో సోవియట్ యూనియన్ విజయం సాధించింది. అయితే ఇందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. మీరు దీన్ని ఒక సంఖ్యతో సులభంగా అర్థం చేసుకోవచ్చు. రెండో ప్రపంచ యుద్ధంలో మొత్తం 5 కోట్ల మంది చనిపోయారు. ఇందులో ఒక్క సోవియట్ రష్యాకు చెందినవారే 2.5 కోట్ల మంది చనిపోయారు. అప్పట్లో ఎన్నో గ్రామాలు పురుషులు లేని గ్రామాలు అయిపోయాయి.
సహజంగానే, సోవియట్ పౌరులలో సోషలిస్ట్ విద్యవల్ల మాత్రమే అమరవీరుల స్ఫూర్తి అభివృద్ధి చెందింది. ఇది కిరాయి సైన్యానికి సాధ్యం కాదు.
నేడు మన చుట్టూ ఉన్న అన్ని సమస్యలకు సోషలిజంలో పరిష్కారాలు వున్నాయి. సోషలిజానికి కేంద్రంగా మనిషి తప్ప లాభం వుండదు.
సోషలిస్టు విజయాలను దుమ్ము దులిపి ఆ ఉజ్వల గతాన్ని ప్రపంచం ముందుంచడమే నేటి అవసరం. ఆపై సోషలిజం కొత్త సంస్కరణను సిద్ధం చేయాలి. ఇది తప్ప మరో వికల్పం లేదు.
రోసా లక్సెంబర్గ్ చేసిన హెచ్చరిక 100 సంవత్సరాల తరువాత మరింత సందర్భోచితమైనది – ‘సోషలిజం లేదా విధ్వంసం’
(విద్యార్థులు, యువత గొంతుక ‘మషాల్’ మే-జూన్ సంచికలో ప్రచురితమైన వ్యాసం.)