‘శతర’ ఆదివాసీ కవిత్వం పేరుతో కళింగాంధ్ర కవి సిరికి స్వామినాయుడు అతని కొత్త కవిత్వసంపుటిని ప్రకటించాడు. ఈ సంపుటిలోకి అతని తొలి రెండు సంపుటాలు ‘మంటిదివ్వ’, ‘మట్టి రంగు బొమ్మలు’ నుంచితీసుకున్న ఆదివాసీ నేపథ్య కవితలనూ చేర్చాడు.

మొత్తానికి ఈ సంపుటి ఆదివాసీ జీవితాన్ని-జీవన సౌందర్యాన్ని-సాంస్కృతిక విశేషాలను,ఆదివాసీ జీవిత కుదుపులను-ఆ కుదుపులకు కారణమైన ఆర్థిక సామాజిక రాజకీయ అంశాలను అతనికున్నచైతన్యపరిధిలో అతను రాయడం జరిగింది. ఆదివాసీలు పోరాటం చేయాల్సిన ఆవశ్యకతను చెప్పే కవితలనూ స్వామినాయుడు రాయడం మెచ్చదగినది.

ఏ కవికైనా కొన్ని పరిధులుంటాయి. ఆ పరిధులు మూలంగానో లేదా ఏదైనా ఒక ఘటన జరిగినప్పుడు ఆ ఘటనకి తక్షణం స్పందన లేకపోవడం మూలంగానో అన్ని కవిత్వవస్తువులను కవి రాయలేకపోవచ్చు. అప్పుడు కవిని మరీ నిందించాల్సిన అవసరం లేదు. కానీ ఒక సైద్ధాంతిక భూమిక లేకుండా ఒకేసారి రెండు విరుద్ధాంశాలతో సృజన చేయడం వలన కచ్చితంగా ఆ కవి ప్రశ్నించబడతాడు. కవికి శాస్త్రీయమైన వైఖరి వుండటం అవసరం.

ఏ సంకోచాలూ ఏ తెరలూ లేకుండా మాట్లాడాల్సివస్తే.. స్వామినాయుడు అనే కవికి సామాజిక నిర్మాణక్రమం పట్ల, నడుస్తున్న గాయాల చరిత్ర పట్ల వుండాల్సినంత చైతన్య స్థితి లేకపోవడం వలన కొన్ని రాయకూడని పదాలు, వ్యక్తీకరణలూ ఈ సంపుటిలోకొచ్చి చేరాయి. ఆదివాసీ సమూహాల పట్ల సానుభూతి, పోరాట స్ఫూర్తి వుంటే సరిపోదు. ఆయా అంశాలను కవిత్వంలోకి తీసుకొచ్చేటప్పుడు ఏ కొసనైనా ఆదివాసీ సమాజాన్ని చులకన పరుస్తున్నామా అనే ఒక ఏమరపాటు వుండాలి. ఇలా ఎందుకంటున్నానంటే.. ఆదివాసీ వస్తువు చాలా సున్నితమైనది. అరుదైనది. మానవ సమాజ మూలాలు వున్నది. ఆదివాసీ వస్తువును బలంగా చెప్పడంఅనేది ఒక మంచి లక్షణమైతే, ఆ క్రమంలో మిగతా suppressedsections ను గాయపరచకుండా వుండటమూ ఒక గొప్ప లక్షణమే. రెండూ చాలా పరిశీలనాత్మక దృష్టితో సృజనశీలి సాధించాల్సినవి.

నిజానికి స్వామినాయుడు తొలి పుస్తకం నుంచి ఎంతోకొంత మోతాదులో ఛాందసవాద భావనల వైఖరిని మోస్తున్నాడు. అతడికి తెలిసో తెలియకో ఇప్పటికీ అతనితో పాటు ఆ లోపం కొనసాగుతుంది. కొన్ని పోలికలు చేసేటప్పుడు కవి చాలా నిమగ్నతతో వుండాలి. పొరపాటు పోలికలు చేయకూడదు. కవి మెలకువగా వుండటం అవసరం. ‘సామాజిక పరిణామక్రమానికి ఎంతో కొంత ఛోదకశక్తిగా వుండాలి’ అని అనుకునేటప్పుడు ఈ గ్రహింపు తప్పనిసరి. ప్రజల కవిని కాను అనుకునే వాళ్ల సంగతి వేరు.

భిన్నప్రాంతాల నుంచి వస్తున్న ఆదివాసీ స్వరాన్ని ఎరిగినవాడిగా నా పరిశీలనలో తేలిన విషయం- ఆదివాసీ కవిత్వానికి వుండే ప్రధాన లక్షణం ఓజోగుణం. సహజ కాంతితో అది తులతూగడం. ఆ స్వభావం ఈ సంపుటిలో కొంతమేరకే సాధించబడింది. కారణం కవితలోకి కొన్ని తెచ్చిపెట్టుకున్న భావనలు కవిత్వసహజత్వాన్ని విచ్ఛిన్నం చేసాయి.స్వామినాయుడు చాలా మంచి కవిత్వవ్యక్తీకరణలు  చేయగలడు అనేదానికి కూడా ఈ సంపుటి తాజా ఉదాహరణే.

        

‘శతర’సంపుటి జంగిడి, సంత అను రెండు కవితలతో మొదలౌతుంది.ఈ రెండు కవితలూ పల్లం నుంచి కొండకొచ్చిన వ్యాపారి వేసే ఎత్తుగడల వలన ఆదివాసీలు ఎలా మోసపోతున్నారో చెబుతాయి.

‘అప్పటికి..

అడివి నా సేతుల్లో ఉండీది!

ఓ తునకాలు..

ఓ జంగిడితో.. అతగాడొచ్చేడు

ఒళ్లల్లా కళ్లున్న నులకమంచం మీద

జంగిడి పరిసీ.. అంగడన్నాడు!’

అని మొదలౌతుంది ‘జంగిడి’ కవిత. అమాయకపు ఆదివాసీలను తూకంతో ఎలా దెబ్బకొట్టారో, ఆదివాసీల బతుకును ఎలా నొల్లుకుపోయారో అవగాహన కల్గిస్తాడు కవి.‘ఒళ్లల్లా కళ్లున్న నులకమంచం’ అని పోలిక కొత్తగా వుంది.

‘కళ్లు మూసుకున్నాం

తునకాలు అడివిని తూకమేసింది’

అని చారిత్రక వాస్తవాన్నే చెప్పాడు. అడివి పల్లపు దళారుల చేతుల్లోకి ఎలా మళ్లిందో విషదపరుస్తాడు.

‘సంత’ కవిత కూడా ఇదే విషయాన్ని ఎరుకపరుస్తుంది.

‘దళారీ తక్కెడలో

అంతటి కొండా దూదిపింజై తేలిపోతుంది’ అని అంటాడు కవి.

కవిత ద్వారా ఆదివాసీ బతుకులో ఒక చైతన్యపు కాంతిని నాటుతాడు కవి.

‘ఆ రాత్రి.. చీకటికక్ష్యకు ఆవల

పొద్దు పోడుమంటై రాజుకుంటుంది.

అంటూ గొప్ప ఆకాంక్షని వెలిబుచ్చుతాడు.

ఆదివాసీ సమూహాలపై జరిగిన ఈ దోపిడీ రాను రాను విస్తరించి కార్పోరేట్ పడగగా మారి ఎలా అడివి మీద పరుచుకుందో తర్వాత రాసిన కొన్ని కవితల ద్వారా చెప్తాడు కవి. ఈ స్థితిలో ఆదివాసీలు చేయాల్సిన ప్రతిఘటన గురించీ మాట్లాడుతాడు. ‘టమ్మ’ కవిత దీనికి ఉదాహరణ.

‘వాడెవడూ అంటే.. ఏం చెప్తాను ?

బహుశ మన్నెంవీరుడు అల్లూరి గావచ్చు

కాకపోతే కొదమసింగం కొమరంభీం గావచ్చు

లేదూ.. తన ఆవాసం అడవిని కాపాడుకునేందుకు

బరిసె పట్టిన బిర్సాముండా గావచ్చు!’

 అని మొదలౌతుంది ‘టమ్మ’ కవిత. అడవిని పెట్టుబడి ధ్వంసం చేస్తున్న సందర్భంలో శత్రువును ఎదుర్కొనమనే చైతన్యాన్ని ఇస్తుంది.

‘యిపుడీ కొండాకోనా వాగూవంకా

సమస్త ప్రకృతి వనరుల్నీ

సంతలో సరుకులు జేసి అమ్మేస్తున్న దళారీలను

వాళ్లు మోసే బహుళపతాకాల్నీ

నేలకూల్చే విల్లమ్ముగావచ్చు!’

చిన్న స్థాయిలో మొదలైన దోపిడీ కార్పోరేట్ సంతలుగా మారిన స్థితి పట్ల జాగురూకతతో వుండాలని, బహుళ సంతలను కూల్చాలని కవి ఉద్ఘాటన. దోపిడీని చూపే మార్గంలో కవి చూపును ఎంచక్కర్లెద్దు.

        

‘అడవి చుక్కలు’ కవితలో గిరిజన జీవన విధానంలోని సౌందర్యాత్మక గుణాన్ని కవి అక్షరీకరిస్తాడు.

‘వాళ్లు.. ఊసుబోక ఉత్తకబుర్లు జెప్పుకోరు

కొండ.. పోడుమంట.. ఆటా పాటా తప్ప

ఉచ్చెల్ల పనుల ఊసుబోరు’

          అని మొదలౌతుంది కవిత.

          ఈ కవితలో

తిరగలితో చీకటిని విసిరీ విసిరీ

వెలుగు పిండిని ఎసట్లో పోస్తారు

          వంటి అద్భుతమైన వూహలు కనిపిస్తాయి.

 కవిత చివరిలో ఆదివాసీ జీవిత సౌందర్యాత్మకత వెనుక జీవన విషాదాన్ని చెప్పి దుఃఖాన్ని వెదజల్లుతాడు.

‘ఏడాదికో భూగోళాన్ని కడుపున మోస్తూ

పురిటి సముద్రాలీదుతారు

కాన్పు కష్టమైనప్పుడు..

డోలీ తోవలో కంపించే కన్నీటిచుక్కలై యింకిపోతారు’

ఇలా ఆదివాసీ బతుకులో సాధారణంగా కనిపించే డోలీ ప్రయాణం ఎంత దుఃఖాన్ని మిగులుస్తుందో చెబుతాడు.

‘అడవులే అరుణపతాకాలు’ కవితలో అడవి సౌందర్యాత్మకత వెనుక వున్న శ్రామిక జీవనకోణాన్ని దర్శింపజేస్తాడు కవి.

‘ఆకుపచ్చని కాంతులీనుతూ

నేలకు దిగిన ఆకాశంలా.. అడవి

తొలిపొద్దుమబ్బుల్ని తురాయిపూల గబ్బల్ని చేసి

సిగలో తురుముకున్న వనకన్యాలా.. ఆకాశం

మధ్యలో పచ్చని కొండల్ని పూసలదండల్లా ధరించి.. వాళ్లు’

          అని అడవిని వర్ణిస్తూ-

‘జిగ్గితో కొండంతా నరికి పోడు కాలుస్తారు

పేగుల్ని చిదుగులు చేసీ..

మబ్బుకుండలతో నీళ్లోసుకున్న కొండను

కంకతో తవ్వీ తవ్వీ..’

          అని ఆదివాసీ చెమటసారాన్ని చెబుతాడు కవి.

          అంతటితో ఆగిపోకుండా- అడవి అందం, ఆదివాసీ కష్టం ఎలా నేలపాలవుతున్నాయో వాస్తవ స్థితినీ చెబుతాడు.

ప్రకృతిసోయగాలతో వన్నెలుకులికే యీ కన్నెధారకొండల్లో..

మరిక కోయిలపిట్టలు కూయవు గావాల

పచ్చని పైటేసుకొని వయ్యారాలుపోయే యీ బయ్యారం కొండల్లో..

కొండగోగుల రేలపాట మరి వినపడదు గావాల’

          అని విషాదగీతాన్ని ఆలపిస్తాడు.

          బతుకుసేద్యం కోసం చిన్న కంకతో కొండను తవ్వుకునే ఆదివాసీ కళ్లెదురుగా కొండ మొత్తాన్ని తవ్వేస్తున్న దృశ్యం గుండెలోతుల్లో పెద్దగాయాన్ని మిగుల్చుతుంది. కవి ఆదివాసీ గాయం లోతును అర్థం చేసుకున్నాడు. అందుకే ‘కొండ’ కవితను రాయగలిగాడు.

‘కొండను పేల్చేస్తున్నపుడల్లా తుళ్లిపడేవి

ఒట్టి రాళ్లే గాదు దాని చుట్టూ ఆవరించి ఉన్న

పచ్చని ఆదివాసీ బతుకు గూడా..’

          అని అంటాడు. కొండ ఎన్నో గురుతులకు నెలవు అని కవి వాపోతాడు.

‘వాళ్లెవరో.. కరకు కోరల తోడేళ్లమందై

కొండను తవ్విపోస్తూనే ఉన్నారు’

          అని అంటూ- విషాదాశ్రువును వూరే గుండెల్లో కలుక్కుమని గుచ్చుకునే ముగింపునిస్తాడు.

‘ఛిద్రమైన కొండగర్భంలోంచి

కందుబారిన ఓ ఆదివాసీ పసికూన..

నెత్తుటిప్రశ్నగా దిక్కుల్లో వేలాడుతున్నాడు’

          అనేక ఏళ్లుగా వేళ్లాడుతున్న ప్రశ్న ఇది.

        

‘వరదగూడు’ కవితలో ఆదివాసీ జీవనోత్సవం గురించి చెప్పిన కవి, ‘ఒక చెట్టు-మరికొన్ని పక్షులు’ కవితలో ఆ జీవనోత్సవం ఎలా విధ్వంసం అవుతుందో చెబుతాడు. రెండు కవితల్లోనూ చెట్టును ఆదివాసీల బతుకుకు ప్రతీకగానే కవి తీసుకున్నాడు.

‘పొద్దు గుంకగానే..

తమ రెక్కలపై చీకటిని మోసుకొస్తూ పక్షులు

చందమామ చుట్టూ పరుచుకున్న

వరదగూడులా తిరుగాడుతూ..

ఆహాహా.. ఎంత సందడి.. ఎంత సందడి’

          అని ‘వరదగూడు’లో రాస్తే-

‘అవనికి పట్టిన

ఆకుపచ్చని గొడుగును కూల్చేసాక

యే కాంక్రీట్ కారడవులు కదిలొస్తాయిక్కడకి?

యే నల్లతాచు రహదారులు నడిచొస్తాయిక్కడికి?

అయినా.. పచ్చని ఆకాశాన్ని కూల్చేయడం

యే ప్రగతికి ఆనవాలురా నాయనా..’

          అని ‘ఒక చెట్టు-మరికొన్ని పక్షులు’ కవితలో రాస్తాడు. చెట్టు ప్రతీకగా ఆదివాసీ బతుకు ఆనందాన్ని, దుఃఖాన్ని వివరించిన కవితలివి.

        

అద్భుతమైన ఆదివాసీ సంస్కృతిని, ఆదివాసీ సాంస్కృతిక విధ్వంసాన్ని బలంగా చెప్పిన కవిత ‘దుర్ల’. ఈ కవిత సగం వరకూ ఆదివాసీ సంస్కృతిని గొప్ప ప్రేమతో వ్యక్తం చేసిన కవి- విధ్వంసం గురించి చెప్పేటప్పుడు కవిత మొదలైనప్పటి ఉద్వేగ స్థాయిని నిర్వహించలేకపోయాడు.

కవికి దృక్పథ స్పష్టత ఎంత అవసరమో, కవిత్వనిర్మాణ చాతుర్యమూ అంతే అవసరం.

చాలా మంచి ఎత్తుగడతో మొదలైన కవిత ముగింపుకొచ్చేసరికి బలహీనమైంది.

‘దుర్ల’ ఆదివాసీ సాంస్కృతిక ప్రయాణం.

‘అప్పటివరకూ.. మబ్బుల కడవలతో ఊరేగి

కొండగాలి పిలుపుతో అడవి మీద కురిసిపోయేది ఆకాశం

మేతకు వచ్చిన తెలిమబ్బులతో ముచ్చట్లాడుతూ.. పచ్చని కొండలు

పొదలమాటున అడవిజింకలా..

మంద్రంగా కురుస్తున్న మంచుతెరల్లోంచి తొంగిచూస్తూ.. సూర్యుడు’

ఇలా మొదలవుతుంది‘దుర్ల’ కవిత. తర్వాత కూడా కవి పోలికలు అద్భుతమైన వూహల్లోకి ఒదుగుతాయి.

‘ఆకాశాన్ని అడ్డగుండార కట్టుకొని

చీకటికురుల చిక్కులిప్పుకుని

తూరుపుకొమ్మన పూసిన సూరీడ్ని తుంచి

సిగలో తురుముకునేవి’

కవి ఆదివాసీ పోలికలు చేసేటప్పుడు- అతని కవిత్వశక్తికి, వస్తువులో నిమగ్నమైన తీరుకి కవిని మెచ్చుకునే తీరాలి.

తర్వాత-

‘చీకటిడప్పు మీద మెరుపుల సిరత దరువులేసి

చాటింపు వేయించాడు జన్నోడు

చెట్టు ముహూర్తం చెప్పేడు దీసరోడు

కొండజాకరను కొలుస్తూ కానికు పోసేడు యజ్జోడు’

ఈ వాక్యాల్లోని జన్నోడు, దీసరోడు, యజ్జోడు ఆదివాసీ సాంస్కృతిక జీవితంలో ఒక భాగం.

ఇలా చెబుతూ వెళ్లిన కవి సాంస్కృతిక విధ్వంసాన్నీ చెబుతూ-

‘ఎవరెవరో ఉద్దరిస్తామంటూ..

మా బతుకుల్లోకి వచ్చినప్పటినుండే

మా ఉనికి మేము కోల్పోయింది’

అని అంటాడు. ఆదివాసీ జీవితంలో సాంస్కృతిక విధ్వంసం మొదలైన తొలిఅడుగులను గుర్తుచేస్తాడు.

ముగింపులో-

‘అదిగో చినుకూ చినుకూ కురిసి వాగైనట్టు

పదం పదం కలసి జనజాతరై దుర్ల కదలబారుతోంది’

ఇక్కడికి కవితని ముగిస్తే సరిపోతుంది. కానీ చివరి వాక్యం రాయడం వలన కవిత్వప్రవాహానికి ఆటంకంగానే అయిందని చెప్పొచ్చు.

‘మీకు తెలుసో లేదో.. ఆది నుండి అడవి ఒక యుద్ధక్షేత్రం!’

ఈ వాక్యం అవసరం లేదు.

‘దుర్ల’కు కొనసాగింపులా వచ్చిన కవిత ‘నెగళ్లు’. ఈ కవిత కూడా ఆదివాసీ జీవనవిధ్వంసాన్నే ప్రశ్నిస్తుంది.

          కవిత ముగింపులో అంటాడు కవి-

‘అంతేనా..

వాళ్లకు అడవి మీంచే వీచే పోరుగాలికి

నెగళ్లై రగలడం తెలుసు

వాళ్ల అడ్డాకు కావుళ్లను దోచుకునేటందుకు

కాటాను తొక్కిపడుతున్న కాలిబొటనవేళ్లను

ఖండించడం తెలుసు

అడవిని అప్పనంగా దోచుకుపోతున్న లారీల చుట్టూ

మానవహారాంలా మూగటం తెలుసు’

          అని విధ్వంసం ఎన్నాళ్లూ సాగదని ప్రకటిస్తాడు కవి.

‘దుర్ల’,‘నెగళ్లు’ కవితలను సాధారణీకరిస్తే ‘జడివాన’ కవిత అవుతుంది. ఆదివాసీ జీవితం, సాంస్కృతిక‌ విధ్వంసాన్ని, విధ్వంసపు తొలి అడుగులను చెప్పే కవిత జడివాన. ‘శతర’చేయాల్సిన పని ఇదే. కవిత్వ శిల్పం ఆకట్టుకుంటుంది.

‘తొలేత గాలే అనుకున్నాను’,‘తోలేత జల్లే అనుకున్నాను’,‘తోలేత మంటే అనుకున్నాను’ అని ఈ వాక్యాలతో మొదలయ్యే మూడు స్టాంజాలు వుంటాయి. చిన్నగా కనిపించే ఇవి తర్వాత అడవిని ఎలా నాశనం చేసాయో కవి చెప్తాడు.

          చివరి స్టాంజాతో కవిత అందుకోవాల్సిన స్థాయికి తీసుకెళ్తాడు.

‘తోలేత అభివృద్ధే అనుకున్నాను

తరాల చీకటిని తరిమేందుకో..

వెలుగుపూల దారిలో నడిచేందుకో..

అవసరమే అనుకున్నాను

ప్రగతి కాస్తా..

పెనువిధ్వంమైనపుడు గానీ అర్థంకాలేదు

నా జాతి మూలాలను తెంచి..

ఆదివాసీని ఆనవాళ్లు లేకుండా చేస్తుందనీ..’

          అభివృద్ధి పేరు మీద జరిగే విధ్వంసాన్ని ఆదివాసీ గొంతు నుంచి కవి ఈ కవితను పలుకుతాడు. 

        

వాకపల్లి నేపథ్యంలో వచ్చిన గాఢమైన కవిత ‘తడారని గీతం’. పూర్వ విశాఖపట్నం జిల్లా జి.మాడుగుల మండలం సుర్మతి పంచాయితీలోని ఆదివాసీ గ్రామం వాకపల్లిలో 2007 ఆగష్టు 20 వ తేదీన జరిగిన ఘోరం లోకానికి తెలిసిందే. ఆ రోజు ఉదయం మావోయిస్టుల కోసం గ్రామాన్ని చుట్టిముట్టిన గ్రేహౌండ్స్ పోలీసులు 11 మంది ఆదివాసీ మహిళలపై ఆత్యాచారం చేసారు. బాధిత గిరిజన స్త్రీలు- ప్రజాసంఘాల, మహిళాసంఘాల మద్దతుతో న్యాయం కోసం కోర్టుకు వెళ్లడం,న్యాయం జరగకపోవడం.. తదనంతర దుర్మార్గ పరిస్థితులను చూసి కుమిలిన కవి గుండె నుంచి వచ్చిన కవిత- ఈ ‘తడారని గీతం’. ఈ కవితని కవి 2012లో రాసాడు.

బాధితుల పక్షాన నిలబడటమే కాకుండా- గాఢంగా కవిత్వ ఉద్వేగస్థాయిని అందుకున్న పరంగానూ ఈ కవిత మొత్తం గొప్ప కవిత.

‘యిపుడిపుడే మచ్చగడుతున్న

ఆ పచ్చిగాయాలనింకా పొడుచుకు తినకండి

యింకుతున్న కంటతడి సముద్రాలనింకా కల్లోలపరచకండి

ఆ పీడకలల కందిరీగలపట్టును మళ్లీ కదిలించకండి’

అని ఒక తీవ్ర స్వరంతో గాఢ అభివ్యక్తితో కవి కవితను మొదలెడతాడు.

‘యిప్పుడు.. వాకపల్లి

కడుపున గాయాల్ని పొదుముకున్న పచ్చిబాలింత

జరిగిన అకృత్యానికి గుండెలు బాదుకుంటూ..

లోకం వాకిలిముందల పెనుకేకలు పెట్టీ పెట్టీ

అలసి కుప్పకూలిన శోకవనిత’

అని వాకపల్లి దుఃఖాన్ని గుండె లోపలపొరల నుంచి వ్యక్తం చేస్తాడు కవి.

‘కళ్లుండీ చూడలేని.. చెవులుండీ వినలేని మీకు

యింకా సాక్ష్యాలు కావాలంటే..

ఆనాడా పశువులు కుమ్మేసిపోయిన పసుపుతోటలనడగండి

ఆ పైశాచిక దాడిలో పగిలిన మట్టిగాజుల నెలవంకలనడగండి

జరిగిన దారుణాన్ని చూసి.. కన్నీరు మున్నీరవుతున్న

ఆ రెళ్లుపొదల రేకులనడగండి’

కవికి వస్తువు చుట్టూ ఉన్న ఆవరణాన్ని కవిత్వంలోకి తీసుకొచ్చే ఒడుపు వొకటి బలంగా వుందని నిరూపించడానికి ఈ కవితని చాలా మంచి ఉదాహరణగా చెప్పొచ్చు. ఇది స్వామినాయుడికి అలవాటైన వ్యక్తీకరణ కూడా.

చివరిలో కవి అంటాడు-

‘ఏ నేల వాకపల్లి తల్లుల కన్నీళ్లతో తడిసిందో

ఆ నేల మీదే న్యాయం ఉదయించనపుడు

తూరుపు కనుమల్లోని వెదురు వనాలు

విల్లమ్ములై వంగి ప్రతిఘటిస్తాయని హెచ్చరిస్తారు’

 స్వామినాయుడు కవితల్లో అభివ్యక్తిలోతు సాంద్రంగా పరుచుకున్న కవిత ఇది.

వాకపల్లి ఘటనికి ప్రత్యక్ష సాక్షి అప్పటికి ఎనిమిదో తరగతి చదువుతున్న డానియల్. ఉరఫ్ దాసురాం. ఈ ఘటన తదనంతరం తన ఆదివాసీ స్త్రీలకు‌ న్యాయం జరగకపోవడాన్ని చూసిన డానియల్- అడవి గాయాలకు పరిష్కారం విప్లవోద్యమమే అని గాఢంగా నమ్మి అందులోకి వెళ్లడం, 2016 అక్టోబర్ లో జరిగిన మల్కన్ గిరి ఎన్ కౌంటర్ లో అమరుడవడం- ఈ వాకపల్లి గాయానికి తోడుఇంకో గాయం.

        

స్వామినాయుడు కొన్ని కవితలకు గొప్ప సొబగను అందించే ప్రత్యేకమైన శిల్పం వొకటి వుంది. అది ‘మంటిదివ్వ’ నుంచి కొనసాగుతుంది- సంభాషణాత్మక శిల్పం అది. అయితే ఆ శిల్పం కొన్ని కవితల్లో విఫలమైంది. కొన్ని కవితల్లో సఫలమైంది. ఈ సంపుటిలో ఈ సంభాషణాత్మక శిల్పం సఫలమైందనే చెప్పొచ్చు. ‘పొన్నపూల వాన’అని ఒక కవిత వుంది.

ఈ కవితకు కవిత మొత్తం ఉదహరిస్తే గాని స్వామినాయుడు సృజించిన శిల్పరహస్యం మనకు తెలియదు.

‘ఆ అరప మీద సవర బాలుడు

పినలగర్రతో పాటందుకున్నాడు’

అని మొదలౌతుంది కవిత.

‘ఆకులచెవులొగ్గి వింటూ

ఎంతగా పరవశించిందో.. అడవి

అంతసేపూ వాడి తలమీద

పొన్నపూల వాన కురుస్తూనే వుంది!’

స్వామినాయుడు అలవోకగా కొన్ని వాక్యాలు రాస్తాడు‌. దాన్ని మనం మెచ్చుకునే తీరాలి.

తర్వాత కవిత కొనసాగింపులో-

‘కాసేపటికి తేరుకునీ.. అడవి

ఇలా అడిగింది..

‘బతుకు గట్టుమీద ఇంకా

నాలుగు అడుగులు వేసినట్టే లేదు

ఇంత చిన్నప్రాయంలో

ఎక్కడదీ అనుభవ’మనీ..!’

దానికి అతను జవాబు చెప్పాడు-

‘ప్రాయాన్ని బట్టి గాదు

తగిలే గాయాల్ని బట్టి వచ్చింద’న్నాడా బాలుడు

పచ్చిక బయళ్ల మీద బక్కల్ని మేపుతూ..’

ఇదే శిల్పాన్ని ఇదే సంపుటిలో ఒక కవిత ముగింపులో కూడా స్వామినాయుడు వ్యక్తం చేసాడు. అక్కడ కూడా ఈ శిల్పం విజయవంతమైంది. కవిత పేరు ‘కోన’.‘కోన’కవిత-‘పరాజిత ఆదివాసీ స్త్రీ’మీద కవిత.

‘అడవంతటా చీకట్లు పొటమరించే వేళ..

ఆమెను అడిగాను

‘ఇంతకీ.. అడవిదీ నీదీ ఏ బంధమని?’

ఆల పొదుగును కుమ్ముతున్న పెయ్యిని చూపిందామె

ఆరని కన్నీళ్లతో..’

          నేనన్న శిల్పాన్ని ఇక్కడా గమనించొచ్చు.

స్వామినాయుడు కొన్ని ముగింపులు imagination powerని ఎత్తులకి తీసుకెళ్తాయి. Magic realism ఛాయలు అద్దుకుంటాయి. ఈ ‘కోన’ కవిత ముగింపులోనేదానిని చూడొచ్చు.

అడవి పరాయికరణకు గురైన స్థితిని ఒక గిరిజన స్త్రీ వైపు నుండి చెబుతుందీ కవిత.

‘యిక్కడ దీపాలార్పేసీ

ఎవడి వెలుగుల కోసమీ మృత్యుప్రస్థానం?

కొండ.. యిప్పుడో వథ్యశిల’

అంటాడు కవి.

ఇప్పుడు ముగింపు చూడండి-

‘ఆమె లొల్లూడిలోని సూరీడు మీద

తురాయిపూల వాన కురుస్తోంది’

లొల్లూడి అంటే జోల. జోలలో పిల్లాడి మీద అడవిపూల వాన కురుస్తోందని అంటున్నాడు కవి.

ఆ తర్వాత-

‘అతడు మెల్లగా ఒడి జారి..

తూరుపు జమ్మిచెట్టు మీదకెగబాకుతున్నాడు’

అని ముగిస్తాడు.

ఈ నాలుగు వాక్యాల వ్యక్తీకరణలో magic realism ఛాయాలను మనం గమనించొచ్చు.

ఇదే magic realism ‘కాటిబుగ్గి’ అనే కవితలో అద్భుతంగా పలికింది. కవిత మొత్తం magic realismలోనే తూగింది.

‘అమాస రేయి

అడవిలో నెత్తుటి వాన కురుస్తున్న వేళ..

ఆమె..

తెగిన పేగుల్ని ముడేసుకొనీ

జల్లెళ్లయిన ఒరిగిన వీరుల దేహాల్లోంచి

చిమ్ముతున్న నెత్తుటిదారను

కడవలకెత్తుకొనీ.. వాగులో కలుపుతోంది!’

వాగు..

ఎరుపెక్కిన ఆకాశంలా..!

ఆమె..

రాలిపోయిన పొద్దులకు

చీకటివాగులో చితిమంటల స్నానం జేసీ

చల్లారిన చితిని చేటకెత్తి

విత్తులు వెదజల్లినట్టు

పిడికిళ్లతో కాటిబుగ్గిని పొలాల్లో జల్లుతోంది!

పోడు..

పోరువంతమైన ఆకుబట్టలా..!

ఈ కవితలో సంభాషణాత్మక శిల్పం కూడా వుంది.

ముగింపులో

‘ఎవరమ్మా వీళ్లంతా..’

దగ్ధకంఠంతో ఆమెనడిగాను దుఃఖపు దారిలో..!

అమె చెప్పింది-

‘ఈ దేశపు నుదుటాకాశం మీంచి

రాలిపోయిన కుంకుమ పొద్దులు..

పేగుతెగిన తల్లుల కడుపుకోతలు’ అందామె

ఓ శోకదేవతలా నడిచిపోతూ..!! “

అయితే స్వామినాయుడు ఇంత అద్భుతమైనటువంటి వస్తుశిల్ప సమన్వయంతో కవిత్వం రాస్తున్నప్పుడు కొన్ని కొన్ని అనవసరమైన పదాలను, వాక్యాలను తొలగించుకోవల్సిన అవసరం వుంది.

ముగింపులో ‘రాలిపోయిన కుంకుమ పొద్దులు’ అనే ప్రతీక తిరుగులేకుండా ఛాందసవాద భావన నుంచి వచ్చినదే. అలాగే ‘శోక దేవత, శోక మూర్తి’ అని అనడం కూడా. ఇలాంటి చిన్న చిన్న వాటిని స్వామినాయుడు వదిలించుకోవాల్సిన ఆవశ్యకత వుంది.

        

పోలవరం ప్రాజెక్ట్ వలన నిర్వాసితులైన ఆదివాసీల వైపు నిలబడి రాసిన కవిత ‘నిర్వాసిత’. ఈ కవిత ఆదివాసీ అస్తిత్వస్పృహకు చెందిన కవిత. కవితలో వస్తువు, శిల్పం సమపాలల్లో సాగాయి. ముగింపు బాగుంది.

‘ఒక దుఃఖపునేల మీంచి వస్తున్నాను

బతుకుపోరులో ఓడిపోయీ..

అడవిలో ఆకుల్లా రాలిపోయిన పురాజ్ఞాపకాల

ఆదివాసీగూడల్లోంచి వస్తున్నాను

పాపికొండల అందాలమాటున పడగలెత్తిన జలకోర

గూడల్నీ.. గూడల్లోని బతుకుల్నీ మింగేసాక..

మనుషుల అలికిడిలేని మరుభూముల్లోంచి వస్తున్నాను’

అని అద్భుతమైన ఎత్తుగడతో కవిత సాగుతుంది. ఒక ఆదివాసీ ఎన్ని విధ్వంసరూపాల్లోంచి నడక సాగిస్తాడో వాటన్నిటినీ ఈ కవిత స్పర్శిస్తూ నడుస్తుంది.

స్వామినాయుడు కవిత్వంలో వున్న మరో మంచి లక్షణం- ఒక సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన చుట్టుపక్కల గ్రామాల దుఃఖాన్ని వాటి పేర్లతో సహా తీసుకురావడం కూడా. ఈ లక్షణాన్ని ‘మంటిదివ్వ’ నుంచి స్వామినాయుడు కొనసాగిస్తున్నాడు.

వస్తువే శిల్పాన్ని demand చేస్తుంది. వస్తువు గొప్పదైనప్పుడు- పదేళ్ల ముందు ఉపయోగించిన శిల్పం పదేళ్ల తర్వాత పునర్జనితమైనాఢోకా లేదని నేను భావిస్తున్నాను.

అంటాడు స్వామినాయుడు-

‘ఒక అరణ్య రోదనలోంచి వస్తున్నాను

బతుకుతెరువు కానరాక బావురుమంటోంది పైడిపాక

మౌనంగా తలబాదుకుంటోంది మామిడిగొంది

దశాబ్దాల దుఃఖం ముందు చేతులెత్తేసింది చేగొండపల్లి

పొగిలి పొగలి రోదిస్తోంది పోలవరం’

అని సాగుతూ

‘దశాబ్దాల వనవాసం ముగిసినా..

ఇంకా వెలుతురు ఛాయలు కనిపించని

వందలాది గిరిజన గూడేల

చీకటి కన్నీళ్లను చేదుకుంటూ వస్తున్నాను’

అని ఒక బలమైన గొంతును నిర్వాసితుల పక్షాన మోగిస్తాడు.

          ‘నిర్వాసిత’కవిత స్థాయిలోనే ‘పోడు’ కవితని కూడా చెప్పొచ్చు.

‘మీ అటవీ చట్టాల కంటే

ముందే పుట్టిన ఆదివాసీలం

అనాదిగా ఈ మట్టిసారాన్నే

ఒంటికి పులుముకున్న మూలవాసులం’

‘పోడు’ కవితలోని స్ఫూర్తి గొప్పది. ఈ స్ఫూర్తి పుస్తకమంతా ప్రవహించి వుండాల్సింది. కవిలోని పురోగమన శక్తి ఎంత గొప్పగా పలికిందో చూడండి.

‘కాకులగూళ్లను కూల్చేసి

గెద్దలు కొండల్ని తన్నుకుపోతున్న చోట

పెద్ద పులులుకు

అప్పనంగా అడవినప్పగించీ..

కొండమేకల‌ మీద

ఆయుధాలెక్కుపెడుతున్న చోట

పదేపదే అదే మాట చెబుతున్నాం

పోడు మా జనహక్కనీ..

పోరు మా రక్త చలనమనీ..’

స్వామినాయుడు రాసిన కవితల్లో మరో ముఖ్యమైన కవిత ‘అస్తిత్వం పేరు అడవి’. అడవి మీద ఆదివాసీ హక్కును గురించి ఈ కవిత చాలా బలంగా మాట్లాడుతుంది. ‘అడవి నుంచి మమ్మల్ని బయటకి నెట్టేస్తే మేమెలా బతకగలమని’ ప్రశ్నిస్తాడు కవి ఆదివాసీల గొంతుగా.

‘మా పీసా చట్టం పీక పిసికేసీ..

ఐదవ షెడ్యూల్ అటవీచట్టాన్ని అడుగేసి మట్టేసాక..

కాట్లో కొరివిలా మండుతోందివాల కొయ్యూరు

చింతనిప్పులు చెరుగుతోంది చింతపల్లి

బందూకుల మధ్య బంధీయైపోయింది గొందిపాకల

చావుశంఖం పూరిస్తోంది సమగిరి

ఎర్రిచూపులు చూస్తోంది ఎర్రవరం

అల్లకల్లోలమైపోతుందివాల అల్లూరిజిల్లా’

అని అల్లూరి జిల్లా ఎర్రవరం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కు నిరసనగా ఆదివాసీల పక్షాన కవి గొంతు ఎక్కుపెడతాడు.‘నిర్వాసిత’ కవితలోని చెప్పిన ఊరుపేర్లను కవితలోకి తీసుకురావడం అనేది- ఈ కవితలోనూ repeat అయ్యింది.

‘యిల్లు పిల్లాదిమొదలు కిల్లోలమని ఏడ్చీ ఏడ్చీ

కంటివాగులో యింకిపోయాయి నీళ్లు’

అని స్థానికగొంతును పలికిస్తాడు.

 కవిత ముగింపులో అంటాడు.

‘మా అస్తిత్వం పేరు అడవి.. మా తెగువ పేరు ఆయుధం’

స్వామినాయుడు రాసిన ‘పిల్లి పండుగ’ కూడా మంచి కవిత.

ఈ కవిత ముగింపులో కవి అంటాడు-

‘యివాల పిల్లుల్ని గాదు

కొండల్లో కలియతిరిగే పెద్దపులుల్ని వేటాడేందుకు..

తురాయి పూల కళ్లతో పహారా కాస్తూ..

విల్లమ్ములు ఎక్కుపెడుతోంది అడవి’

అని.

అయితే స్వామినాయుడు కవితను natural గా ముగియనివ్వలేదు. Natural గా ముగిసినప్పుడు దాని సొంత సౌందర్యంతో కవిత వెలుగుతుంది.

కవిత ఎత్తుగడ, నడక సొంత సౌందర్యంతో సాగుతూ సాగుతూ- చివరకొచ్చేసరికి కవి చొరబాటు వలన కొన్ని కవితలు సహజ సౌందర్యాత్మక గుణాన్ని కోల్పోయాయి. మంచి‌కవిత అయ్యే అవకాశం వుండి ఆ అవకాశాన్ని కోల్పోయాయి.

        

‘అడవి మాట్లాడుతోంది’ కవిత కూడా స్వామినాయుడు రాసిన ఒక ముఖ్యమైన కవితే.

బ్రిటీష్ వారు భారతదేశానికి రాక మునుపు నుంచి ఆదివాసీలు ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరు సలిపిన చరిత్ర వుంది. ఏభైఅరవై ఏళ్ల కిందట కళింగ నేల మీద జరిగిన గిరిజన రైతాంగ తిరుగుబాటును ఈ కవిత మననం చేస్తుంది.

ఆదివాసీల గతం నుంచి వర్తమానం మీదుగా ప్రయాణం చేసి ఆదివాసీల చైతన్యాన్ని నినదిస్తుంది ఈ కవిత.

‘ఒక ఆకుపచ్చనిపొద్దు కళ్లముందే గుంకిపోతుంటే..

వాళ్లైనా ఏంజేస్తారు జెప్పూ..?

వెలుగును మింగేసిన చీకటికాలాన్ని శపించటం తప్ప!

ఈ నేలమీదింకా తెల్లచీకటి కొమ్ముకోకముందే..

ఈ పచ్చని ఒడిలో పారాడింది వాళ్లు’

అని వర్తమానాన్ని, చరిత్రను కలగలిపి ఈ కవితలో మాట్లాడతాడు కవి.

‘ఇయ్యాల.. వాళ్లు

పోడు చేయకుండా రాజ్యం తవ్వేవి

కందకాలు కాదు గిరిజన సమాధులే’

అని లోలోపల నుంచి ఒక ధిక్కారపు గొంతును ప్రకటిస్తాడు.

‘తరాలుగా షెడ్యూల్ ఏరియాలో చేరని

పోడు భూముల్లో పెట్టుబడిజెండాలు పుట్టుకొస్తున్నా..

నిమ్మకు నీరెత్తినట్టున్న ఐదవ షెడ్యూల్

పల్లెత్తు మాటాడదు గాక.. మాటాడదు

వాళ్లు వరకట్టిన కొండపోడుకి పట్టాలివ్వదు!’

 అంటూఆదివాసీ విషాదాన్ని కళ్లముందు నిలుపుతాడు కవి.

‘అడవి మాట్లాడుతోంది’ కవిత స్పష్టంగా ఆదివాసీ ఆత్మగౌరవాన్ని గురించి మాట్లాడుతుంది.

‘రేలారే..!’ కవిత కూడా ఒక చైతన్య ప్రవాహంలోంచి ఉబికినదే. అమరుడైన ఒకానొక విప్లవవీరుని గొంతుగా ధ్వనించాడు కవి ఇక్కడ.

అంటాడు-

‘తల్లీ.. నేను బతికే ఉన్నాను

నవ్వుతూ కనిపిస్తాను పూసే ప్రతి పూవులో..

స్పృశిస్తాను నీ పాదాలను పొడిచే పొద్దులో..’

అని ‘వీరుని స్ఫూర్తి రగిలించిన సజీవత’ను కవి ముందుకు తీసుకెళ్తాడు.

‘అస్తమించలేదమ్మా.. రేపటి తూరుపు గర్భాన

మళ్లీ పొద్దునే పురుడోసుకుంటున్నా..’

అని ఒక ప్రాణవంతమైన వాక్యాన్ని సృజిస్తాడు.

కవిత ముగింపులో

‘తల్లీ.. పూసినపుడు నేనొక పూవునే..

రాలిపోయినపుడు ఒక యుద్దవ్యూహాన్ని..

శిరసెత్తిన నెత్తుటిజెండాని..!’

అని అంటాడు.

స్వామినాయుడు అనవసరపు వాక్యాలను తగ్గించుకోవాలి. ఈ కవితలో చివరివాక్యం కన్నా ముందే కవిత flow ఆగింది. అక్కడకు కవితను పూర్తి చేస్తే సరిపోతుంది.

‘తడిమంటల్లో..!’ కవిత అరుకులోయ విధ్వంసమౌతున్న స్థితిని కళ్లకుగడుతుంది.

పెట్టుబడి వ్యూహాలచేతిలో అరుకు సౌందర్యం కోల్పోతున్న స్థితిని కవి వర్ణిస్తాడు.

‘లూఠీ చేయబడ్డ ఆంధ్రాఊటీ అంతటా

బాక్సైట్ శుద్ధికర్మాగారాల విసర్జక రసాయనాల దుర్గంధమే’

అని అంటాడు కవి. ఇదీ అరుకు అరుకులా లేకపోవడానికి మూల కారణం. ఆ మూలకారణం గురించి కవి ఎలుగెత్తుతున్నాడు. స్వామినాయుడు రాసిన కవిత్వంలో కొత్త వ్యక్తీకరణలు కవితో మన ప్రయాణాన్ని సజీవంగా నిర్దేశిస్తాయి.

‘సూరీడు కట్టిన ఏడురంగులు ఉయ్యాలా ఉండదు గావాలా..’

అని అంటాడు. అంటే వర్షం ముందు వచ్చే ఇంద్రధనస్సు మరి వుండదని కవి దిగులు. దానర్థం వాన రాదని.

ఇంత విషాదాన్ని పాడిన కవి- కవిత ముగింపులో ఆశాజ్యోతిని వెలిగిస్తాడు.

‘కానీ

విల్లమ్ములెక్కుపెడుతూ అడవంటోందీ

కొండలు ఛిద్రమవుతున్నాగుండెధైర్యమింకా చెదరలేదనీ..

యీ నేలకు పోరాటం కొత్తేమీగాదనీ..!’

కొండలని, కొండ జీవితాన్ని కవిత్వం చేసినప్పుడు గొప్ప పోలికలు తెస్తాడు కవి. అడవికి ఆవల వున్నవాళ్లకి ఇవి కొత్త. ఇక్కడ కవి success అయ్యాడు. కానీ ముందే చెప్పుకున్నట్టు పదజాలం వద్ద గానీ, వ్యక్తీకరణ వద్దగానీ- కవికి ఎక్కడలేని ఏమరపాటు వుండాలి.అది స్వామినాయుడులో ఎంతోకొంత కొరవవడం వలన‘కొండగోగులు’ కవితలో

‘పచ్చని పయ్యాడ మాటున ఎత్తైన కొండలూ..’

అని అన్నప్పుడు ఒక ఆదివాసీ స్త్రీ స్తన్యాలతో కొండలను పోల్చడం సరైనది కాదు. కవికి తెలిసి చేసిన తప్పు కాదు, అందుకే వ్యక్తీకరణ పట్ల కవికి concentration వుండాలి అంటుంది.

Conclusionలో

‘దశాబ్దాల పోరాటంలో

గెలుపెవరిదైతేనేమిలే గానీ..

ఓడిపోయింది మాత్రం

ముమ్మాటకీ మానవతే’

అంటాడు కవి.

‘దశాబ్దాల పోరు’ అంటే రాజ్యానికి విప్లవకారులకు మధ్య జరుగుతున్న యుద్ధం గురించి కవి మాట్లాడుతున్నాడని అర్థమైపోతుంది.

‘గెలిపెవరిదైతేనేమిలే గానీ..’ అని ఒక వాక్యాన్ని వాడాడు కవి. కవికి ద్వంద్వ వైఖరి వుండకూడదు.

ఆదివాసీల పక్షాన నిలబడి పోరాడుతున్న విప్లవకారులకు, ప్రజావ్యతిరేక రాజ్యానికి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని గెలుపోటములతో నిర్ణయించడం దగ్గర కవి చిన్న చూపు కనిపిస్తుంది.

మానవత ఎక్కడ ఏ పక్షంలో ఓడిపోతుందో సృజనకారుడికి అవగాహన వుండాలి.

ఈ కవితలోనే

‘అవునులే..

యిదిపుడు పులులు సంచరించే రాజ్యం కదూ

కాళ్ల కింద ఖనిజ సంపద కోసం

తరాలుగా యిక్కడ తిరుగాడే కొండమేకల్ని

తరిమి తరిమి వేటాడటం వాళ్ల సహజ లక్షణం కదూ!’

అని అన్న కవి- యిలాంటి ముగింపునివ్వడం అవగాహనా రాహిత్యమే. దాన్నుంచి కవి బయటపడాలి.

సైద్ధాంతిక పునాధి లోపించడం స్వామినాయుడి ప్రధాన లోపం. ఆదివాసీ జీవితం అనేక పొరల కూడలి. ఒక్కో పొరని ప్రేమతో ఆర్తితో తడమాలి. ఒక వ్యతిరేకాంశతో తడిమినా కవి పట్ల ఇష్టమే కాదు, నమ్మకమూ పోతుంది. ఏ కవికైనా ఇది వర్తిస్తుంది.

        

‘శిశిరం నడిచిన జాడలు’ స్వామినాయుడు రాసిన మరో మంచి కవిత. గిరిజన సంస్కృతి విధ్వంసమౌతున్న తీరును గురించి చెప్పే కవిత ఇది. ఏ మతం లేని గిరిజన గూడేల్లోకి తొలుత కాషాయధారులు, తర్వాత క్రైస్తవం రావడాన్ని ఆదివాసీ సహజ సంస్కృతి నాశనం కావడాన్ని ప్రశ్నిస్తున్నాడు కవి. సాంస్కృతిక  విధ్వంస రచన ఇక్కడ కుదరదు అని అంటున్నాడు.

‘మతాన్ని మోసుకుంటూ మా కొండకోనల్లోకొస్తున్న దైవ జనులారా..

శిలువ కంటే బరువైన బతుకుబండల్ని మోస్తున్నవాళ్లం

గిరిజన గోవిందమంటూ

మా గూడేల్లో ఊరేగుతున్న కాషాయధారులారా..

పదునాలుగేండ్లు కాదు

బతుకు బతుకంతా వనవాసం చేస్తున్న వాల్మీకి వారసులం’

అని చాలా బలమైన వ్యక్తీకరణ చేస్తాడు కవి.

తర్వాత-

‘చింతంబలీ, టెంకంబలీ జుర్రటమే తప్ప

ఏ మతం, మా ఆకలి కడుపున పట్టెడన్నం పెట్టింది కనుక..

గోచియే తప్ప, యే వలపాతాలేని మా ఒంటిమీద

యే మతం జానెడు గుడ్డను కప్పింది కనుక..’

అని ఒక ప్రశ్నను గుండె లోపల సుడులు తిప్పుతూ బయటికి ఎగజిమ్ముతాడు.ఆదివాసీ మూల సంస్కృతి నాశనం కావడాన్ని కవి అంగీకరించడు.

‘శిశిరం నడిచిన జాడలు’ కవితలాగే ‘కొండగాలి’ కవితా- ఆదివాసీ సంస్కృతిని హిందూ, క్రైస్తవ మతాలు ఎలా ధ్వంసం చేస్తున్నాయో చెప్పుకొస్తాడు.

‘అడవిని బుగ్గి చేయాలంటే అగ్గే పెట్టనక్కర లేదు

తనదైన సంస్కృతిని భాషను ధ్వంసంజేస్తే చాలు’

అని నిజం చెప్తాడు కవి.

తర్వాత-

‘పరాయికూత ముందల చిన్న బోయింది తరాల జీవద్భాష

యిది ఆకుపచ్చనితనాన్ని కోల్పోయిన అడవి ఆత్మఘోష’

అని వేదనపడతాడు.

‘కొండగాలి’ ముగింపు ద్వారా ఒక తీవ్రమైన ప్రశ్న వేస్తాడు స్వామినాయుడు.

‘అడవి నాగరికతను హత్తుకుందో.. లేదూ

నాగరికతే అడవిని ఆవాహన జేసుకుందో గానీ

పచ్చనికొండల మీంచి దుఃఖం మాత్రం

ఇయ్యాల పాయలు పాయలుగా ప్రవహిస్తోంది’

నాగరికత లేదా నాగరికత పేరు మీద నడుస్తున్న కథ ఉత్త అబద్ధం అని తేల్చిపడేస్తున్నాడు.

‘శిశిరం నడిచిన జాడలు’,  ‘కొండగాలి’-ఈ రెండు కవితల ద్వారా మతాధిపత్యానికి సంబంధించి ఏ విషయాన్నైతే కవి చెప్పాడో దానికి పరిష్కారంగా ‘కొండ మేకలు’ కవితలో ఈ వాక్యాలను మనం చూడొచ్చు.

‘అడవి నేలమీద పడ్డ ప్రతి పరాయి పాదముద్రనీ

ధిక్కరించే వేనవేల ప్రతిఘటనా సమూహాలం’

అనిఆదివాసీ గొంతుతో తన గొంతు కలుపుతూ- అంటాడు కవి.

ఆదివాసీ సమూహాల మూల సంస్కృతిని విచ్ఛిన్నం చేస్తున్న హైందవీకరణను గానీ, క్రైస్తవీకరణను గానీ ధిక్కరించిన కవిత ఇది.

ఈ కవిత ముగింపులో

‘యెవరే సంకరవిత్తుల్ని నాటి పోయారో..

యీ చీకటిపొద్దుమీద మీ పద్దు రాస్తూనే ఉన్నాం’

అని అంటాడు. అయితే ఈ సాంస్కృతిక విధ్వంసం గురించి కవిత్వం రాసిన కవిలో ఏ మూలైనా వున్న హైందవ ఆధిపత్య భావజాల ఛాయలను తొలగించుకోవాల్సిన బాధ్యత వుందని అంటున్నాను.

ఎందుకు నేనీ మాటని అనాల్సి వచ్చిందంటే.. ‘శిశిరం నడిచిన జాడలు’, ‘కొండగాలి’, ‘కొండ మేకలు’ ఈ మూడు కవితల్లోనూ కవి ఆదివాసీ మూలసంస్కృతిని గురించి మాట్లాడేక్రమంలో ‘మా సనాతన ఆదిమ సంస్కృతల మీద అగ్గిపోస్తుంటే’ అని ‘శిశువు నడిచిన జాడలు’ కవితలో, ‘అనివార్యంగా పల్లం ముందల మోకరిల్లింది సనాతన ఆదిమ సంస్కృతి’ అని ‘కొండగాలి’ కవితలో, ‘ఏ కార్పొరేట్ మాల్స్ మా కొండల్లోకొచ్చి మా సనాతన సంతల్ని మాయంజేసాయో’ అని ‘కొండ మేకలు’ కవితలో కవి వాడటం జరిగింది. ఈ మూడు వాక్యాల్లో సామాన్యంగా సనాతన అనే పదం వుంది. ‘సనాతన’ అనే పదం హైందవ ఆధిపత్య భావజాలానికి సంబంధించినది. ముందే చెప్పుకున్నట్టు స్వామినాయుడు తెలిసో తెలియకో కొన్ని పదాలను, భావనలను రాయడం జరుగుతుంది. వాటిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వదిలించుకోవాలి.

        

          ‘నిత్యగాయాల నెలవంక’ అని ఒక కవిత వుంది. అడవి ఎన్ని రకాలుగా నిత్యగాయాల నెలవంక అవుతుందో కవి చెప్తాడు. ఈ పోలిక చేయడం కవిగా స్వామినాయుడి success యే.

‘ఆకుపచ్చని దీపం కింద

అలుముకున్న చీకటి సముద్రం.. అడవి’

అని మొదలౌతుంది కవిత.అడవి బహుళజాతి సంతవ్వడం గురించి వేదన పడతాడు.

‘ఒకచోట జలసమాధి జేసి

మరోచోట కొండదేహాన్నొక ఖనిజంగా తవ్విపోసి

కాళ్ల కింద నేలను తన్నుకుపోతున్నాయి

గండభేరుండాలు’

అని- వాస్తవంగా అడవుల్లో జరుగుతున్న విధ్వంసాన్నే చెబుతాడు.

నా observation లో సంపుటి మొత్తంలో-అదే వస్తువు పదేపదే repeated అయినా సరే బలంగానే వ్యక్తం చేయగలిగాడు స్వామినాయుడు. కానీ-నడుస్తున్న సామాజిక చరిత్ర పట్ల, భిన్న సమూహాల పట్ల ఏర్పరచుకోవాల్సిన స్పష్టమైన వైఖరి ఒకటి కొరవడటం వలన స్వామినాయుడులో వెనుక చూపు వొకటి కనిపిస్తుంటుంది.

కవి రాసే ఒక వాక్యం లేదా ఒక భావన ఏ పీడిత సమూహాన్నైనా గాయపరచకూడదు.

ఈ కవితలో-

‘గూడెం మధ్యలో కొలువైన

జాకరమ్మను మింగేస్తుంది కిరస్తానీ గొర్రెపిల్ల’

అని అన్నప్పుడు కవి కోరుకున్న positive vibes కన్నా negitivevibes నాకెక్కువుగా వినిపిస్తున్నాయి. ‘కిరస్తాని గొర్రెపిల్ల’ అనడంలో వెటకరింపే నాకు కనిపిస్తుంది. ఏ మతమైనా ఆదివాసీ మూలాలను చెరిపేస్తుందన్న మాట- తిరుగులేని వాస్తవం. కాని ఇతర మతాలను విమర్శించేటప్పుడు ఏ కొంచెమైనా వెటకరింపు గొంతు కనిపించకూడదు.

పుస్తకానికి శీర్షికగా కుదిరిన కవిత ‘శతర’ ద్వారా కవి వ్యక్తం చేసిన దుఃఖం గాఢమైనది.

‘నాగరికత మోజులో శృతి తప్పిందివాల సవర పాట

తడబడింది థింసా అడుగు

దరువు తప్పింది రాటదిగిన తుడుంకుండ

పట్నంగాలి ఒంటబట్టాక చెమటవాగులింకుపోయీ

చెట్టెక్కలేక చతికిలపడుతోంది సవర గూడ’

అని ఆదివాసీల తీర్చలేని దుఃఖాన్ని సాంద్రమైన గొంతుతో పలుకుతాడు కవి.

నిజానికి కవి ఆదివాసీ సమాజ‌ దుస్థితికి కారణమైన అసలు శత్రువుని గుర్తించలేకపోయాడనే చెప్పాలి. ఈ కవిత నేనన్నమాటకి రుజువునిస్తుంది.

‘శతర’ కవితలో కూడా క్రైస్తవం ఆదివాసీ గూడేల్లోకి వెళ్లి చొరబడటం గురించి కలత చెందుతాడు. ఆదివాసీ అస్తిత్వం అస్తవ్యస్తమౌతుందని కవి దుఃఖపడతాడు. అంతవరకూ అంగీకరించవచ్చు కవిని. కానీ క్రైస్తవమతం మీద వెటకరింపు వాక్యాలు ఈ కవితలోకీ వచ్చాయి.

‘శతరగొబ్బిని మింగేస్తోంది శిలువకోర

‘శిలువ కోర’ అని పోలిక చేయడం ముమ్మాటికీ తప్పే.

‘కొత్తల్నీ.. కొండజాతరల్నీ..

పుట్టిముంచేస్తున్నాయి పునర్జీవ పండగలు’

అని అంటూ

‘నుదుట పొద్దు చెరిపేసుకొనీ..

తెల్లని ఆకాశాన్ని ముసుగేసుకొనీ..

పరిశుద్ధాత్మ ముందు మోకరిల్లింది జాకరమ్మ!’

          ‘జాకరమ్మ’ వైపు కవి నిలబడటం, అస్తిత్వం నిలవాలనే కాంక్ష కలగనడం గొప్ప ఆశయమే. మూలాలను చెరిపేసేది ఏ మతమైనా సరే దాన్ని వ్యతిరేకించాల్సిందే.

కానీ- ఈ వాక్యాల్లో-

‘నుదుట పొద్దు చెరిపేసుకొనీ..’అని కవి అన్నాడంటే.. హైందవ ఛాందసభావజాలాన్ని మోస్తున్నట్టే.

హైందవమతంలో స్త్రీ నుదుట మీద బొట్టుని చైతన్యానికిప్రతీకైన సూర్యుడుతో పోల్చడమే పెద్ద తిరుగమనం నిజానికి.

‘గూడ’ కవిత స్ఫూర్తివంతమైన కవిత.

‘పెనుగాలి రాకమునుపే

పిట్ట తన గూటికి చేరుకున్నట్టు

ఓసారి గూడకు పోయిరావాల..!’

అని కాంక్షని వ్యక్తం చేస్తాడు కవి.

ఈ కవిత ముగింపులో

‘యే పొదలచాటున

యే పులులు పొంచి ఉన్నాయో

యే పుట్టలమాటున

యే పాములు బుసగొడుతున్నాయో

ఓసారి చూసిరావాల.. గూడకు పోయిరావాల..

నా నేల మీద నా ఉనికిని నిలబెట్టుకోవాల..

దించేసిన విల్లమ్ములు మళ్లీ చేతబట్టాల..’

అని స్ఫూర్తివంతమైన వాక్యాలను రాస్తాడు.

కానీ..

‘కూలిపోయిన మహావృక్షాలు

గుళ్ల ముందర ధ్వజస్తంభాలై నిలబడకముందే

కిరస్తానీ తెల్లచీకటి కొండల్ని కమ్మేయకముందే

ఓసారి గూడకు పోయిరావాల..’

అని అంటాడు. ఆహ్వానించాల్సిందే. ఈ వాక్యాల్లో ‘కిరస్తానీ’ అనే పదం వాడకుండా వుండాల్సింది.‌ ప్రజల వైపు వుండే కవి ఆధిపత్య చిహ్నాలను ఎంత  త్వరగా విదిలించుకుంటే అంత గొప్ప పని చేసినట్టు కూడా.  suppressed sections కొన్ని పదాల పట్ల విముఖతతో వున్నప్పుడు అలాంటి‌ పదాలను కవి నిలువరించుకోవాలి.

        

‘నడిరేయి సూరీడు’ కవిత- ఒక ఆదివాసీ యువతికి, విప్లవోద్యమంలో వున్న తన ప్రేమికుడికి మధ్య కథ.

ఈ కవిత-

‘ఆకుపచ్చని వాగు

అవతల ఒడ్డున అతడు.. ఇవతల ఒడ్డున ఆమె

తురాయిపూలదారుల్లో

ఒక స్వప్నాన్ని వెతుక్కుంటూ.. అతడెళ్లిపోయేడు’

అని మొదలవుతుంది. విప్లవోద్యమంలో వున్న ప్రేమికుడు విప్లవోద్యమ కార్యాచరణలో భాగమవడం గురించి కవి చెబుతున్నాడు.

తర్వాత-

‘గూడ నిదురోయే వేళ..

ఒకనాడు చీకటివాగునీదుకుంటూ అతడొస్తాడు

నడిరేయి ఆమెకు సూర్యోదయమవుతుంది

ప్రాణాలు రెండూ ఒకే దేహమై ముచ్చట్లాడుకుంటాయి

ఎన్నో శిశురాలు మోసీ మోసీ..

ఎదురుచూసిన వసంతాలు

వెళ్లిపోకుండా ఉంటే ఎంత బావున్ననుకుంటుంది’

విప్లవప్రదేశం నుంచి వచ్చి- ఆమెను కలుసుకుని- ఆమె నుంచి సెలవు తీసుకొని ప్రేమికుడు విప్లవోద్యమంలోకి వెళ్లిపోతాడు.

కొన్నాళ్లకు-

‘ఒకనాటి సాయంత్రాన.. ఆమె

పడమటకొండల మధ్య పొద్దు గుంకిపోవడాన్ని చూస్తుంది

నెత్తుటికళ్లాపి చల్లినట్టు ఆకాశం ఎర్రబారటం చూస్తుంది

నేలతారక నింగికెగయడాన్ని చూస్తుంది

ఆయుధం ముందు ఆమె కల కూలిపోయిందని

ఓ బగిడిపిట్ట ఆమెకు వర్తమానం మోసుకొస్తుంది’

చివరకు-ప్రియుడు విప్లవోద్యమ కార్యాచరణలో అమరుడౌతాడు. ఆ దుఃఖాన్ని ఆమె పంచుకుంటుంది.

ఈ కవిత ముగింపులో

‘ఆమె కడుపున ఆనాడతడు నాటిపోయిన విత్తు

పురుడోసుకుంటోంది రేపటి దండకారణ్యమై

స్వేచ్ఛ కోసం.. నిర్బంధాలను ఛేదించటం కోసం..’

అని కవి కవితను ముగిస్తాడు. చాలా ఉదాత్తమైన గొప్ప భావన వున్న కవిత ఇది.

‘కుంతలి’ కవిత ఆదివాసీల పెళ్లిచూపుల సంస్కృతిని గురించి చెప్పే సాంస్కృతిక వ్యక్తీకరణ వున్న కవిత. కవితలో కథ చెప్పటమూ స్వామినాయుడి ఒకానొక కవిత్వ లక్షణమే. ఈ లక్షణాన్ని స్వామినాయుడి అనేక కవితల్లో మనం గమనించొచ్చు.

కవితని సుదీర్ఘంగా నడిపే క్రమంలో కథ ఇమిడిపోతుంది.

ఈ కవితలో-పెళ్లిచూపుల సంబరంలో మునిగి వున్న ఆదివాసీల మీద తుపాకీచేతుల దుర్మార్గం చెరబడటం, ఆదివాసీలు  నిస్సహాయులవడం- మొత్తం ఇదే కవిత. ఒక రాజ్య పాసవికచర్యను కవిత మన ముందు వుంచుతుంది.

కవిత ముగింపులో కవి అంటాడు-

‘ఆనాటి ఆకృత్యాన్ని కడుపున మోస్తుందా.. అన్నట్టు కుంతలి నీళ్లోసుకుంది

అడవి మీద కమ్ముకున్న చీకట్లను తరిమి కొట్టేందుకు

తూరుపుదిక్కై అడవి పురిటినొప్పులు పడుతోందిపుడు’

‘నడిరేయి సూరీడు’, ‘కుంతలి’ రెండు కవితల్లోని ఆదివాసీ స్త్రీల గర్భానికి కారణాలు వేరు వేరు అయినా- రెండు కవితల్లోని ఆదివాసీ స్త్రీల పురిటినొప్పులకు సామ్యం వుంది.

రాజ్య దుర్మార్గచర్యలను నియంత్రణ చేయడానికి పడిన పురిటి నొప్పులివి. కవి ఆ విషయాన్ని సరిగ్గానే ఈ రెండు కవితల్లో convey చేసాడు.

        

‘శకుంతల’, ‘దారమండ’, ‘తోడేలు’ ఈ మూడు కవితలు- ఆదివాసీ స్త్రీలను మోసం చేస్తున్న పరాయి పురుషుల ఆగడాలను చెబుతాయి. ‘శకుంతల’ మోసపూరిత పట్నంపురుషుడి చేతికి చిక్కిన ఆదివాసీ ఆడపిల్ల కథ. అనేక ఆదివాసీ ఆడపిల్లల కథ.‌

‘అప్పటివరకూ.. గంపకింద కోడిపిల్లలా

హాస్టల్ జైలుగదిలో మగ్గిపోయిన అడవిమల్లె

ఒక్కసారిగా మితిమీరిన స్వేచ్ఛకు

ప్రతిబింబమవుతుంది

చదివిన చదువు జ్ఞానమివ్వదు

నమ్మిన పోడు బతుకునివ్వదు’

అని మొదలైన ‘శకుంతల’ కవిత పట్నం ఆకర్షణలో పడిన తర్వాత ఎలా తనని తాను, తన సహజమైన ఆదివాసీతనాన్ని కోల్పోతుందో చెబుతుంది.‘మితిమీరిన’ అన్న పదం ఇక్కడ వాడకుండా వుండాల్సింది. ‘మితిమీరిన’ అన్న బదులు ‘అపరిమిత’ లేదా ఇంకేదైనా పదం వాడినప్పుడు తీవ్రత తగ్గిపోతుంది. అనుకున్న భావం కూడా వస్తుంది.

‘ఒక వారం సెంటు వాసన

మరో వారం పౌడర్ వాసన వేసే ఆమె

పార్కుల్లోనో.. పబ్ ల్లోనో.. మల్టీప్లెక్స్ మాల్స్ ల్లోనూ..

అబద్దాల బతుకులో అద్దాల బొమ్మలా మెరుస్తూ..’

అని అంటాడు కవి. ఆదివాసీ ఆడపిల్లలను మోసం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గ సంస్కృతి రాజ్యమేలుతున్న వాతావరణంలో చాలా సులువుగా ఆదివాసీ ఆడపిల్లలు దానికి బందీలైపోతున్నారు. దీనికి కారణమెవరు? అనే విషయాన్ని కవి ఇంకాస్త బలంగా చెప్పి వుండాల్సింది. స్త్రీ లైంగిక వస్తువుగా మారుతున్న సందర్భం. ఆదివాసీ ఆడపిల్లలను ఆ కుసంస్కృతికి బలి చేస్తున్నటువంటి వ్యవస్థ నిర్మాణాన్ని కవి ప్రశ్నించాలి. ఆర్థిక సామాజిక కారణాలను చెప్పాలి.

‘వాడ్ని నమ్మీ.. మోహపు తెరలమాటున

తన దేహపు తాళాలు గుత్తినందించే శకుంతలవుతుంది

దోచుకున్నంత దోచుకున్నాక దొంగలా వాడెళ్లిపోతాడు

అంతే.. నిన్నటి కల కన్నీటిలో కరిగిపోతుంది’

అని ఆదివాసీ ఆడపిల్లలు మోసపోతున్న వాస్తవ స్థితిని మన ముందు పరుస్తాడు. ఈ భావనని ఉన్నతీకరించాల్సిన బాధ్యత కూడా కవికి వుండాల్సింది.‘దేహపు తాళాలు గుత్తినందించే శకుంతల’పోలిక ఆదివాసీ స్త్రీల పరంగా ఆలోచించినప్పుడు ఉన్నతంగా అనిపించలేదు. అమాయకపు ఆదివాసీ ఆడపిల్లలు దుర్మార్గపు వ్యవస్థకు బలికావడానికి ముందు జరిగిన తంతుని కవి గట్టిగా చెప్పాలి.

‘శకుంతల’ కవితలో పూర్తిగా ఆదివాసీ ఆడపిల్లల విషాద స్థితిని గురించి కవి మాట్లాడుతాడు. ‘దారమండ’కవితలో అభివృద్ధి ముసుగులో ధ్వంసం కాబడిన అడవిని గురించి కవి చెబుతూ ఒక పాయగా ఆదివాసీ స్త్రీల విషాదం గురించి చెబుతాడు.

‘చిగురాకులాంటి స్వచ్ఛమైన అడవుల్ని

పర్యాటక ప్రాంతాలంటూ ప్రకటించాక

పల్లం పాడుగాలి సోకి రసిగారే పచ్చిపుళ్లై

కూనరిల్లిపోతూ.. కొండమల్లెలు’

అడవులను పర్యాటక ప్రాంతాలుగా ప్రకటించిన తర్వాత ఆదివాసీ స్త్రీలను లైంగిక సరుకుగా మార్చుతున్న వ్యవస్థను ప్రశ్నించడం కవితలో జరిగింది. ఆదివాసీ విధ్వంసంలో ఇదొక కోణం. పుట్టి పెరిగిన చోటే ఆదివాసీ స్త్రీ బలికావడమంటే ఇదే.

శకుంతల‌ కవితలో లేని‌ పోరుకాగడా ఈ కవితలో వెలిగింది.

‘తోడేలు’ కవిత పైరెండు కవితల్లో జరిగిన ఘోరం కన్నా ముందే ఆదివాసీ స్త్రీ ఎదుర్కొన్న ఘోరం. ప్రారంభ దుఃఖం. ఆదివాసీ ఆడపిల్లను పెళ్లాడి కలిసిపోయినట్లు నమ్మించి మోసం చేసిన ఆదివాసేతర తోడేలు పన్నాగం గురించిన కవిత ఇది.

‘ఏ ఇచ్చికాలాడిందో

మా అడవిసుక్కని మనువాడీ..

మా గూడకొచ్చిందో నీలిరంగు పులుముకున్న తోడేలు

మా హక్కులను కొల్లగొట్టడం కోసం

అడవిపిల్లిలా అనిగాసీది’

అని అడవికి కబురు అందిస్తాడు కవి అడవి పిల్లిని గుర్తించమని.

కవిత మొత్తం బాగుంది. అయితే-

‘కన్నుగానక పులి తన పిల్లల్ని తినేసినట్టు’

పోలికనప్పలేదు. ఒక ఆదివాసి- ఆదివాసీ సమాజాన్ని మోసం చేస్తే ఈ పోలిక సరైనదే. కానీ కవి ‘నీలిరంగు పులుముకున్న తోడేలు’ అన్నాడు. అంటే అతడు ఆదివాసేతరుడు.

        

‘వేట’ అను కవిత విప్లవోద్యమ స్ఫూర్తితో మొదలై గతి తప్పుతుంది. కవికి చెప్పే విషయం పట్ల స్పష్టత, దృక్పథ పునాధి కొరవడటం వలన కవిత మొదలైన తీరులోంచి-తర్వాత కొనసాగలేదు.

‘ఆకుపచ్చని వేటాడీ..

అడవికాపుల్ని నిర్మూలిస్తారు సరే..

చిగురించే ఆశయం మాటేమిటి?

అని ప్రశ్నిస్తూ ఒక ఉన్నతమైన దారిలో నడిచింది కవిత. తర్వాత స్టాంజాలో కూడా అదే స్ఫూర్తిని అందుకుంటుంది. చాలా శక్తివంతమైన వ్యక్తీకరణ.

చూడండి-

‘కొండకింద ముడి ఖనిజాన్ని కొల్లగొట్టేందుకు

నెపం ఆయుధం మీద పెట్టి

నిషేధాన్ని అమలు జేస్తావనీ..!’

చైతన్యవంతమైన భావన ఇది. మెలకువ‌వున్న గొంతు ఇది.

తదుపరి-

‘యివాల నిషేధంలోంచి మాట్లాడుతున్నాం

నిశీధి గర్భకుహరంలోంచి

నిప్పుకణికల్ని విసురుతున్నాం..!’

అని అన్న కవి- ఆ తర్వాత రాజ్యాన్ని బతిమాలాడుకుంటాడు- అక్కడే నేను కవికి దృక్పథ పునాధి కొరవడింది అని అంటున్నది. కవి తొలుత పూరించిన ధిక్కారపు గొంతును వదిలేసాడు. రాజ్యంతో చేతులో చెయ్యేసుకుని నడిచే కాంక్షని వెలిబుచ్చాడు. కవి మీద గౌరవం పోతుంది.

‘అందుకే..

మీ పాదాల కింద బావురమంటున్న

పసిడి కలల పోడుభూముల్ని పంచండి’

అని అంటూ- ఇలాంటి వాక్యాలనే మరికొన్ని రాస్తూ-

‘ఛిద్రమైన గిరిజన బతుకుల్ని తలకెత్తుకొనీ

వలసపాట పాడుతున్న గూడల్లో తిరిగి వసంతాల్ని పంచండి!’

వసంతం ఎవరు పంచేది? ఎవరిని అడుక్కునేది? కవికి ఈ తిరోగమన స్థితి ఒప్పదగింది కాదు.

అవును- ఇది రాజ్యం ముందు మోకరిల్లిన కవిత. తర్వాత దీనిని కొనసాగిస్తూ- అంటాడు కవి-

‘ఆ వేల మనం..

ఆయుధాల్లేని.. అంతర్యుద్ధాలు లేని..

నిత్యం నెత్తురోడే అడవుల్లేని

నిజమైన జనస్వామ్యానికి నిలువెత్తు ప్రతీకలమవుదాం’

అని అనడం కచ్చితంగా తిరోగమన చూపే.

కాబట్టే ఈ కవిత తదుపరి వచ్చిన ‘వేకువ పువ్వు’ కవితలో

‘నేను పోరు చేస్తూనే వుంటాను

అడవి కోసం

ఆదివాసీ గర్భస్త శిశువు కోసం

ఆకుపచ్చని నవ్వు కోసం

నెగడై రగులుతూనే వుంటాను

ఏకమై..

అనేకమై..

దుఃఖమై..

దుర్భేద్య సమూహమై..

గెరిల్లా పోరు సాగిస్తూనే ఉంటాను!’

అని అన్నప్పుడు కవి మీద నమ్మకం కలగదు.

ఈ కవితలో కవి అంటాడు-

‘ఎక్కుపెట్టిన శిలకోల ఏ చేయీ దించకుండా..

ఆకుల నిఘానేత్రాలతో..

అడవి నలుచెరగలా

అనునిత్యం పహారాకాస్తూనే ఉంటాను!’

అని కవి ప్రకటిస్తాడు. గాలి వాటంగా ఇలా అన్నాడనే భావన కలుగుతుంది- కవిత తర్వాత కవిత చదివే పాఠకుడికి. ఒకే సారి ఇలా రెండువిరుద్ధాంశాలు కలిగించే ఉక్కిరిబిక్కిరికి నిశ్చేష్ఠుడవుతాడు.

కవిగా స్వామినాయుడు ‘మట్టి దుప్పటి’ కవిత ద్వారా నన్ను total disappoint చేసాడు. స్పష్టతారాహిత్యం,  సైద్ధాంతిక అసమస్థితి. ఇక్కడ విరుద్ధాంశాలే కాదు, అర్ధరహితమైన కవిత ఇది. ‘కవి ఏ చైతన్యాన్ని స్వప్నిస్తున్నాడో ఈ సంపుటి చదివిన తర్వాత అర్ధమవదు’ అన్నంత వ్యాఖ్య కూడా చేయాలనుంది.

పాఠకుడిని total గా miss guide చేయడం.

విప్లవోద్యమంగాని, దాని చరిత్ర నడక వర్తమానం పట్ల గానీ అవగాహన లేకపోవడం- అవగాహన లేకపోయినా ఫర్వాలేదు గానీ ఇంత అస్పష్టతను ఒప్పుకోలేం.

‘ఆకుపచ్చని అలలమీద కమ్ముతుంది నెత్తుటిమబ్బు

ఆయుధం ముద్దాడి నేలకూలిపోయింది

ఎరుపురెక్కల అడవిపావురాయి

రాలిపోయింది వర్గశత్రువంటుంది రాజ్యం

కూలిపోయింది మానవసౌధమంటాను నేను’

ఇలా మొదలవుతుంది కవిత. కూంబింగ్ ఆపరేషన్ లో పాల్గొన్న గ్రేహౌండ్స్ కి చెందిన పోలీస్ గొంతునుంచి వచ్చిన కవితగా కవి ఈ కవితను రాస్తాడు.

          అందుకే అంటాడు-

‘ఒకరినొకరు ఎప్పుడూ చూసింది లేదు

                                        చావు మా మధ్యకు సర్రున దూసుకొస్తుంది’

          ఇంతవరకు ఫర్వాలేదు.

 తర్వాత-

‘ఎందుకు కొండెక్కిపోతున్నామో..

ఏ సిద్ధాంతానికి బలి అవుతున్నామో..

ఎరుకలేని ఒకానొక విషాద సందర్భం

కాలం చెల్లిన చలనసూత్రాల మధ్య

సిద్ధాంతమంటూ.. అతడూ

కర్తవ్యమంటూ.. నేనూ

ఎదురుకాల్పుల చితిలో దూకీ

ఎవరికోసం చూస్తున్నామో అర్థం కాని దౌర్భాగ్యం!’

కవి ఏం చెప్తున్నాడో అర్థం కాదు.‘కూంబింగ్ పోలీస్ మావోయిస్టు సిద్ధాంతం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు?’ అన్న ప్రశ్న వస్తుంది. కవిలోని గజిబిజితనం కవితలోకి ప్రసరించింది.

తదుపరి-

‘కొడవలై ప్రశ్నించినందుకు

అతన్ని నాకు శత్రువును చేసింది రాజ్యం

నన్నో వేటకుక్కనుజేసీ అతనిమీదకు ఉసిగొల్పింది

నిజానికి అడవిలో అగ్గిరాజేసిన వాడే

మాకు అసలైన శత్రువు’

          ఒకసారి అది, ఒకసారి ఇది మాట్లాడి గందరగోలపరుస్తున్నాడు కవి.

తర్వాత-

‘తరాలు గడచినా తీరని కన్నీటి వలపోతల మధ్య

ఎవరు గెలిస్తే ఏమి గానీ..

పాడవైపోయింది మాత్రం మనిషి తనమే..’

మళ్లీ కవి ఎందుకు ఎప్పుడు ఏ మాట అంటున్నాడో పాలుపోదు. ఒక కూంబింగ్ పోలీస్ గొంతు నుంచి వచ్చిన కవితగా అర్థమవుతుంది. కానీ అలా రాసినప్పుడు మధ్యలో కవి దూరడం వలనో, స్పష్టతారాహిత్యం వలనో నడవాల్సిన దారిలో కవిత నడవదు.

చివరిగా-

‘మా త్యాగాల మీద నడిచిన నీ వెలుగుల ప్రస్థానమిక చాలు..

యింకెంతకాలమీ వర్గపోరు?

ఎవరి వెలుగుల ప్రస్థానాన్ని కవి ప్రశ్నిస్తున్నాడు? రాజ్యం వెలుగుల ప్రస్థానం గురించే మాట్లాడుతున్నాడా!

తదుపరి వచ్చిన వాక్యాలు చూడండి.

‘ఆయుధం మొన మీద ఏ సూర్యోదయాల్ని కలగంటాం

ఈ రోజు అతడూ.. రేపు నేనూ..

ఈ మట్టిదుప్పటి కలిసే కప్పుకుంటాం

ఒకే శవపేటికలో.. శాంతిచర్చలు జరుపుకుంటాం

వర్గవివక్ష లేని సమాజాన్ని ఉమ్మడిగా కలగంటాం’

అంటే రాజ్యంతో, రాజ్యంలో భాగమైన గ్రేహౌండ్స్ పోలీస్ తోవిప్లవకారుడు కలిసి వర్గవివక్ష లేని సమాజాన్ని ఉమ్మడిగా కలగంటాడట! ఎంత హాస్యాస్ఫోరకంగా వుంది ఈ భావన. కవితను తననుకున్న భావనలో స్ఫూర్తివంతంగా నిర్మిద్దామనుకుని విఫలమయ్యాడు కవి.

ఈ సంపుటిలో చివర కవిత ‘ఎర్రమల్లెల వనాలు’. బిడ్డల్ని విప్లవోద్యమంలోకి పంపిన తల్లులను గురించిన కవిత. నిజానికి ఈ వస్తువు చాలా గొప్పది. విప్లవోద్యమంలోకి వెళ్లిన విప్లవవీరుల తల్లుల దుఃఖం తీర్చలేనిది. విప్లవోద్యమ కార్యాచరణలో అమరులైన బిడ్డల్ని కడసారి చూసే తల్లులు, ఆ చివరి చూపుకు కూడా నోచుకోని తల్లులూ వున్నారు. ఆ పరంగా ఈ కవితావస్తువు అమూల్యమైనది.

విప్లవోద్యమ తల్లుల్ని కవిత్వంలోకి తీసుకువచ్చేటప్పుడు ఆ తల్లులు పడే శోకాన్నే కవీ అనుభవిస్తాడు. స్వామినాయుడు ఆ శోకానుభవవానికి లోనయ్యాడు. కానీ ఈ కవితలో కవి perspective సరైన దారిలో నిర్మాణం కాకపోవడం వలన విఫలమయ్యాడు.

గతంలో ఈ కవిత ‘రహాస్యోద్యమ నాయకురాళ్లు’ పేరుతో పత్రికలో అచ్చైంది. పత్రికలో అచ్చైన రూపానికి, ప్రస్తుతం ఈ సంపుటిలో వున్న రూపాన్ని తేడా వుంది. పత్రికలో అచ్చైన కవితని చాలా మంది చదివి వుండటం వలన-ఈ రెండు రూపాలను గురించీ ఇక్కడ పేర్కొనవలసి వస్తుంది.

ఈ సంపుటిలో వున్న కొత్తరూపానికి వచ్చేసరికి కవి తాను చేసిన తప్పును గ్రహించి సరిదిద్దుకున్నాడు. అయినా కొన్ని లోపాలు మిగిలే వున్నాయి.

కవికి అమరత్వం పట్ల, వీరుల తల్లుల దుఃఖం పట్ల గొప్ప concern వుండొచ్చు- వుండాలి కూడా. కానీ తను వ్యక్తం చేసిన భావనలు ఎటువైపు మళ్లుతున్నాయో, సరైన దారిలోనే వెళుతున్నాయా లేదా అని పదేపదే check చేసుకోవాల్సి వుంటుంది.

‘వీరులు సరే.. వీరుల్ని కోల్పోయిన యిళ్ల గురించీ..’

అని కవిత మొదలౌతుంది‌.

          పత్రికలో అచ్చైన కవిత స్టాంజాలో

‘కానీ.. మోదుగ వనాల్లోకి విసిరి పారేసిన

తల్లుల ఆవేదన గురించీ ఆర్తి గురించీ’

అని వుంది. ‘విసిరి పారేసిన’ అని అనడం సరైనది కాదు. కానీ కవి తర్వాత ఈ వాక్యాలు మార్చుకున్నాడు.

చూడండి-

‘కనీ పెంచీ.. మోదుగు వనాలకంపిన

తల్లుల ఆవేదన గురించీ.. ఆర్తి గురించీ..’

మార్చిన తర్వాత ఎంత గొప్పగా వుందో చూడండి.

          తర్వాత వచ్చే ఒకటి రెండు స్టాంజాలు పత్రికలో అచ్చైన కవితలో, ఈ పుస్తకంలో అచ్చైన కవితలో ఇంచుమించు ఒకేలా వున్నాయి.

కానీ తర్వాత స్టాంజాలో-

‘నెత్తుటి నాలుక చాపిన విప్లవకాళికకు

పిల్లలను బలిచ్చిన యిళ్లు’

అని అంటాడు. ఈ వాక్యాలు పత్రికలో అచ్చైన రూపంలోవి.

ఈ వాక్యాల్లోని రూపకం- విప్లవోద్యమస్ఫూర్తి పట్ల అవగాహనా రాహిత్యం వలనే వచ్చింది. విప్లవోద్యమం పట్ల సానుభూతి వుంది అన్న కవి- ఇలా రాయడు. ఈ సంపుటిలోనే కొన్ని కవితల్లోని కొన్ని వాక్యాలు, ఈ కవితలోనే కొన్ని వాక్యాలూ కవిని విప్లవ సానుభూతిపరుడిగా ప్రకటిస్తున్నాయి కాబట్టే నేనీ మాట అనగలిగాను.

తర్వాత వాక్యాల్లో-

‘తమ బతుకులను

పోరుదేవతకు నైవేద్యమిచ్చిన యిళ్లు’

అని అన్నాడు కవి.

విప్లవం పక్షాన రాస్తున్నామని అనుకునేటప్పుడు కొన్ని పదాలను, వ్యక్తీకరణలను వదులుకోవాలి. ‘పోరుదేవర’, ‘నైవేద్యం’వంటి పదాలు అవసరం లేదు. ఇవి బ్రాహ్మనీయ ఆధిపత్యభావజాలానికి చెందిన పదాలు.

‘బొడ్డుపేగుల్ని వీరతాళ్లుగా వేసి పంపిన తల్లులు’

అని పుస్తకంలో ప్రచురించిన కొత్త కవితలో వుంది. బొడ్డు పేగుల్ని వీరతాళ్లుతో పోల్చడమూ విప్లవభావనకి వ్యతిరేకమే.

‘సమాజ రక్షణ కోసం

క్షేత్ర పాలకులను జేసి దారపోసిన తల్లులు’

ఈ వాక్యాలు ఈ కవితకే నప్పవు.

ఈ కవిత ముగింపు

‘అందరి తల్లులూ.. పిల్లల్ని కంటారు

వీరులతల్లులు మాత్రం విప్లవాన్ని కంటారు’

పత్రికలో అచ్చైన కవితలో, ఈ సంపుటిలో అచ్చైన కవితలో రెండింటిలోనూ ఇదే ముగింపు. చూడండి- ఎంత అద్భుతమైన ముగింపు కుదిరిందో.

నేనంటుంది ఏమంటే.. కవిత్వ స్ఫూర్తి గొప్పది కావొచ్చు. దాన్ని వ్యక్తం చేసేటప్పుడు చాలా involvement తో వుండాలి అని. అంతేకాకుండా వస్తువు పూర్వపరాలను మేలుదారిలో అవగాహన పరుచుకుని విస్తృతి పొందాలి అని. అప్పుడే కవిత అన్ని రకాలుగా బలంగా వస్తుంది.

స్వామినాయుడే కాదు ఏ కవైనా ఈ విషయాన్ని గుర్తెరగాలి.

        

‘పొలికేక’ కవితలో కవి అంటాడు-

‘వస్తారా.. ఎవరైనా..

నాతో పాటీ గిరిజన తండాల్లోకీ..!

కొండలమీద నెగళ్లను

జనం గుండెల్లో రగిలించటానికీ..!’

అవును- తనన్న మంటని తన కవిత్వం ఎంత రగిలించిందో కవి ప్రశ్న వేసుకోవాలి.

స్వామినాయుడు- ఈ సంపుటి ద్వారా సమాజానికి అందించిన తాత్వికత ఏమిటి? అనే ప్రశ్న వేసుకుంటే జవాబు చెప్పడం సాధ్యపడటలేదు. ప్రధానమైన కొన్ని కవితల్లోని అగమ్యత- మొత్తం ఈ సంపుటిని అస్పష్టత తావులోకి నెట్టింది. కారణం- వస్తువు కాదు, కవే.

          కవి perspective బాగుంటే కవిత్వం బాగుంటుంది.

15 – 01 – 2025

Leave a Reply