డాక్టర్ బి. నాగశేషు  అసిస్టెంట్ ప్రొఫెసర్ గా తెలుగు అధ్యయన, పరిశోధన విభాగం, ముక్త గంగోత్రి, మైసూర్  పనిచేస్తున్నారు. ఇప్పటివరకు వారధి, వ్యాసాలు, ఇరుగుపొరుగు, తెలుగు కన్నడ తులనాత్మక వ్యాసాలు,తగటు, తులనాత్మక వ్యాసాలు, ఏకుదారం, బీరప్ప,  కిలారి నవలలు వెలువరించారు.

మాట్లాడే పుస్తకాల గురించి ఈ పక్షం వసంత మేఘంలో ఇలా అంటున్నారు..

1.నాకు పుస్తకాలు చిన్నప్పటి నుంచి ఇష్టం. అయితే సుదీర్ఘంగా చదివే అలవాటు మాత్రం నా ఎం. ఏ. తెలుగు అయిపోయిన తర్వాత. ఏ పుస్తకాలు చదవాలి ఏ పుస్తకాలు చదవకూడదు అనేటువంటి నిబంధన నేను పెట్టుకోకుండా నాకు చేతికి దొరికిన పుస్తకాలన్నిటిని కూర్చుని చదివేవాడిని. నేను పని చేసే కాలేజీలో పెద్ద లైబ్రరీ ఉండేది. ఆ లైబ్రరీలో కథలు, కవిత్వం, నవలలు, వ్యాసాలు, జీవిత చరిత్రలు ఇలా అనేక పుస్తకాలు అందుబాటులో ఉండేవి. వీటన్నిటిలోనూ నాకు కవిత్వం చదవడం అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత నా పరిశోధనలో భాగంగా కొలకలూరి ఇనాక్ గారి సమగ్ర సాహిత్యాన్ని ఔపోసన పట్టాక సాహిత్యం మీద బాగా మక్కువ ఏర్పడింది. నాకు మొట్టమొస్తారుగా 50 పుస్తకాలను ఆయనే తీసుకువచ్చి ఇచ్చారు మొట్టమొదటి కలెక్షన్ అప్పుడే జరిగింది ఆ తర్వాత చాలామంది అనేక రకాలు పుస్తకాలను పంపించారు. నేను కూడా పుస్తక విక్రయశాలకు వెళ్లి పుస్తకాలను కొనుక్కుని చదువుతుంటాను.

2. నేను చాలా వరకు పరిశోధక విషయాలు సంబంధించిన పుస్తకాలను ఎంపిక చేసుకుంటాను. కారణం నాకు పరిశోధనల మీద విపరీతమైన ఆసక్తి ఉండడం. నేను పుస్తకాలు ఎవరు అడిగినా కూడా ఇస్తుంటాను. అడక్కపోయినా కూడా పుస్తకం బాగుంది నా దగ్గర ఉంది తీసుకోండి అని కూడా ఇస్తుంటాను. నేను చదివిన తర్వాత దాని దాచిపెట్టుకోవాలనే ఆలోచన నాకు చాలా తక్కువ. పుస్తకం కూడా డబ్బులు లాంటిది అది అందరికీ తిరుగుతూ ఉండాలి. ఏమైనా మంచి నవలలు గాని కథలు గాని కవిత్వం గాని నేను చదివితే నాలా ఇష్టపడి చదివే వారికి ఆ నవలను గాని కథలు గాని కవిత్వం గాని నేనే స్వయంగా పంపిస్తుంటాను. లేదా ఫలానా పుస్తకం మార్కెట్లో బాగుంది కొనుక్కోండి అని కూడా చెబుతుంటాను.

3. నేను చదవాలనుకుని చదవకపోయిన పుస్తకాలు ఏవి లేవు నాకు ఫలానా పుస్తకం చదవాలి అనే దానికంటే నేను పరిశోధనకు సంబంధించిన పుస్తకాలు ఎక్కువ చదువుతుంటాను. పరిశోధన పుస్తకాలు ఎందుకు చదువుతాను అంటే, వాటిని చదివి అర్థం చేసుకొని నేను రాసుకోవడానికి బాగా ఉంటాయి అనే ఉద్దేశంతో చదువుతుంటాను. నేను సేకరించాలనుకున్న పుస్తకాలు చాలానే ఉన్నాయి. అయితే వాటన్నింటినీ తొందరలోనే అనేకమంది వ్యక్తుల ద్వారా సేకరిస్తారని నమ్మకం కూడా కుదిరింది. చాలావరకు మంచి నవలా సాహిత్యాన్ని సేకరించడానికి ఇష్టపడతాను. అందునా నేను ఎక్కువగా కన్నడ పుస్తకాలు చదువుతుంటాను. కన్నడ పుస్తకాలలో చాలావరకు నేను కొనుక్కుని నా దగ్గర దాచుకున్నాను. ఇటీవల నవల రాస్తున్న వారందరి నవలలు సేకరించాలని నా ఉద్దేశం.

4. నాకు చాలా ఇష్టమైన పుస్తకాలు చదివి నేనే ఇతరులకు పంపిస్తుంటాను. కాబట్టి నేను పుస్తకాలు పోగొట్టుకున్నాను అని నేను అనుకోను. ఎందుకంటే పుస్తకాలు ఎక్కడున్నా, ఎన్ని ఏండ్లున్నా, ఎక్కడో ఒకచోట ఎవరికో ఒకరికి విజ్ఞానాన్ని పంచుతూనే ఉంటాయి. అందువల్ల నేను పరిశోధక విద్యార్థులకు ఉచితంగానే పుస్తకాలు పంపిస్తుంటాను. నా దగ్గర అడిగి తీసుకుని మళ్లీ ఇవ్వకపోయినా కూడా నేనేమీ అనుకోను. ఆ పుస్తకం నాకన్నా వారికే ఎక్కువ ఉపయోగపడుతుందని వారు అనుకున్నప్పుడు అంతకు మించిన ఆనందం లేదని నేను అనుకుంటాను. పుస్తకాలు చాలా విలువైనవి అయితే అంతే విలువైన మనిషి దగ్గర పుస్తకం ఉన్నప్పుడే అవి విలువైనవిగా, అనిపిస్తాయి. కాబట్టి విలువైన మనుషులు దగ్గర ఉన్న పుస్తకాలు ఎప్పుడూ మన నుండి దూరం కావు.

5. నాకు అత్యంత ఇష్టమైన పుస్తకాల్లో అమృతం కురిసిన రాత్రి, ఆధునిక మహాభారతం, శ్రీ శ్రీ మహాప్రస్థానం, మల్లెల నరసింహమూర్తి కవిత్వం, సినారె విశ్వంభర, యాములపల్లి నర్సిరెడ్డి కవిత్వం, బండి నారాయణస్వామి శప్తభూమి, వి. ఆర్. రాసాని ముద్ర, ఇనాక్ ఊర బావి, ఎస్ఎల్ బైరప్ప, వసుదేంద్ర వీరి పుస్తకాలన్నీ నాకు చాలా ఇష్టం.

6. నేను పుస్తకాలు చదివే సమయం చాలా వరకు రాత్రి పూట ఉంటుంది. లేదా తెల్లవారుజాము సమయంలో లేవగానే నాకు ఇష్టమైన పుస్తకం చదువుతాను. ఉద్యోగరీత్యా నేను చదువుతో సంబంధం ఉన్న ఉద్యోగం చేయడం వల్ల చాలా వరకు నేను పుస్తకాలు పగలంతా వాటితోనే నా స్నేహం. నిర్దిష్టమైన సమయం చెప్పాలంటే ఎక్కువసేపు రాత్రిపూట చదువుతాను.

7. నాలో నేను ఒంటరిగా భావించుకున్నప్పుడు నన్ను చేరదీసిన హస్తం పుస్తకం. నేను ఒక మనిషిగా గుర్తింపు పొందడానికి పుస్తకాలు నాకు ఎంతో దోహదపడ్డాయి. సమాజంలో నాకు ఒక స్థాయిని  తీసుకువచ్చింది పుస్తకాల సాంగత్యం ఏర్పడిన తర్వాతే. పుస్తకాలు చదవడం వల్ల నేను ద్వేషాలు, అసూయలు చాలా వరకు మర్చిపోయా. అంతేకాకుండా మనిషిని ప్రేమించే తత్వాన్ని పుస్తకాల ద్వారా నేర్చుకున్నాను. అగాధమైన భాధలో ఉన్నప్పుడు నన్ను చేరదీసింది పుస్తకాలు మాత్రమే. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనకు తోడుగా ఉండేవి పుస్తకాలు మాత్రమే. అందువల్ల పుస్తకాలు చదవడం వల్ల ఒక పరిపూర్ణ వ్యక్తిగా నేను నన్ను రూపొందించుకున్నాను. ఇప్పుడు ఉన్న నేను పుస్తకాలు తీర్చిదిద్దిన పుణ్యమే.

Leave a Reply