డా.తండ హరీష్ గౌడ్ మహబూబాబాద్ జిల్లా పెద్దగూడూరు ప్రాంతానికి చెందిన కవి. నీటీదీపం,

ఇన్బాక్స్, గాలిలేని చోట, వంకతాడు నాలుగు కవితా సంపుటాలు,’పిట్టగూడు’ దీర్ఘ కవిత వెలువరించారు.

1. మీకు పుస్తకాలు ఎలా ఎప్పుడు ఎక్కడ ఎవరి ద్వారా పరిచయం అయ్యాయి?

నా చిన్నప్పటి పాఠ్యపుస్తకాల్లో ఉన్న తెలుగు పాఠ్యాంశాలే మొదటగా నన్ను ప్రభావితం చేశాయి.’పిలుపు’ అనే పాఠం ద్వారా తిలక్  పరిచయం అయ్యారు. శైశవగీతితో శ్రీశ్రీ పరిచయమయ్యారు.

‘తామసి’ పాఠంతో దాశరథి కృష్ణమాచార్యులు పరిచయమయ్యారు.ఆ తర్వాత కాలంలో వాళ్ళ పుస్తకాలను వెతుక్కొని చదివాను.

పాఠశాలలో చదువుకునే రోజుల్లో పాటలు పాడేవాన్ని. అక్కడ పింగిళి శ్రీనివాస్ గారు ప్రోత్సాహమిచ్చారు.

దేశభక్తి పాటలకు సంబంధించిన పుస్తకాలు ఇచ్చి అందులోంచి పాడమనేవారు.ఆ పుస్తకం పేరు

” విజయవిపంచి”.అందులో చాలా పాటలు పాడేవాన్ని. స్వామి వివేకానంద ఉపన్యాసాన్ని పరిచయం చేసే పుస్తకాలు కూడా వారి ద్వారానే చదివాను. అలా పుస్తకాలు పరిచయమయ్యాయి.

సాహితీ వాతావరణపు బీజం అక్కడే పడింది.

విమర్శావ్యాసాల వైపుగా నా మార్గాన్ని నడిపించింది మా గురువు డా.ఎస్.రఘు.పి.హెచ్.డి ప్రవేశం పొందాక వారే నవోదయిబుక్ హౌస్ కి తీసుకెళ్ళి ఇరవై విమర్శావ్యాసాల పుస్తకాలు కొనిపించటం మరిచిపోలేను.

2. మీరు పుస్తకాలను ఎంపిక చేసుకునే పద్ధతి, సేకరించే విధానం గురించి, భద్రపరిచే పద్ధతుల గురించి.

నేను కవిత్వం రాస్తుంటాను కాబట్టి, మొదట్లో కేవలం కవిత్వానికి సంబంధించిన పుస్తకాలే చదివేవాన్ని. మంచి వచనం కూడా మంచి కవిత్వం రాయడానికి తోడ్పడుతుంది అని తర్వాత తర్వాత కొంతమంది పెద్దవాళ్ళ మాటల ద్వారా అర్థమయింది.

అంతకు ముందు చలాన్ని, గోపిచంద్, గురజాడ, బుచ్చిబాబు, దాశరథి రంగాచార్య, కేశవరెడ్డి మొదలైన వారి రచనలు చదివాను. ఈ మధ్యకాలంలో వేరే భాషలోంచి అనువాదమయిన నవలలు చదువుతున్నాను.

సాహిత్యఅకాడెమీ, నేషనల్ బుక్ ట్రస్ట్, ఛాయ పబ్లికేషన్స్ వారు ముద్రించినవి చదువుతున్నాను. ఈ మధ్యకాలంలో బుకర్ ప్రైజ్ గ్రహీత బాను ముష్తాక్ గారి పుస్తకం తెలుగులో ‘హృదయదీపం’ అనే పేరుతో వచ్చింది. ఛాయ వేసింది. అది చదివాను. జయకాంతన్, పెరుమాళ్ మురుగన్ రచనలు చదివాను. ఈ వరుస క్రమాన్ని చెప్పటంలో ఉద్దేశం ఏంటంటే నాకు రచనల్లో వినూత్నత అంటే ఇష్టం. సృజనలోని కొత్తదనమే నన్ను ఆకట్టుకుంటుంది.

3. మీరు చదవాలనుకుని చదవలేకపోయిన లేదా సేకరించాలనుకుని సేకరించలేకపోయిన పుస్తకాల గురించి

తెలుగు సాహిత్యంలో ప్రముఖులుగా చెప్పుకునే వారి కవిత్వం చదివాను. కానీ పాశ్యాత్యుల కవిత్వాన్ని తక్కువ చదివాను. ఇంకా వారి కవిత్వాన్ని చదవాల్సి ఉంది.

ముకుందరామారావు గారి నోబెల్ సాహిత్యం పుస్తకంలో నోబెల్ బహుమతి గ్రహీతల కవిత్వానువాదాలు చదివాను. ఆ ప్రభావంతో వారి పూర్తిస్థాయి రచనలను చదవాలనే కాంక్ష పెరిగింది. ఆ దిశగా ప్రయత్నం సాగుతుంది.

4. ఎంతో ఇష్టమైన, మీరు పోగొట్టుకున్న పుస్తకాల గురించి.

మంచి పుస్తకం ఒక చోట ఒకరి దగ్గరే ఉండదు. అది ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. అలా పయనించాల్సిన అవసరమున్న కాలంలో ఉన్నాము.

స్టేపాన్ త్సైక్ రచనను పొనుగోటి కృష్ణారెడ్డి విరాట్ పేరుతో తెలుగులోకి అనువదించారు. ఆ పుస్తకం ఎంత వెతికినా కనబడటం లేదు. అది నాకు ఇష్టమైన పుస్తకం. బహుశా ఎవరికైనా ఇచ్చుంటానో గుర్తుకులేదు.

5. మీకు ప్రాణ సమానమైన పుస్తకాల గురించి.

నన్ను ప్రభావితం చేసిన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. కవిత్వ పరంగా కొన్ని ఉన్నాయి. కథల పరంగా కొన్ని ఉన్నాయి.

విమర్శాపరంగా కొన్ని ఉన్నాయి. ఇవే అని చెప్పలేను. వీరే నాకు ఆరాధ్యులు అని అనలేను. ప్రాణప్రదమైన వాక్యం ఎక్కడున్నా, రచన ఎక్కడున్నా కళ్ళకద్దుకుంటాను. గుండెల్లో నిలుపుకుంటాను. ఇంకా ఇంకా సృజనాత్మకత రచనలు వస్తున్నాయి. మంచి రచయితలు, కవులు పుట్టుకొస్తున్నారు. ఇప్పటి ప్రస్థానంలో నాణ్యమైన రచనలు చేస్తున్న సాహితీవేత్తలే నాకు ఇష్టులు.

6. ఏ సమయంలో ఎలా ఎక్కడ మీరు పుస్తకాలను చదివే పద్ధతుల గురించి.

నేను పుస్తకాలను చదవడానికి సమయమేమి పెట్టుకోలేదు.

పాఠశాలలో ఖాళీ పీరియడ్ లలో పుస్తకపఠనం చేస్తాను. ఇంటి దగ్గర రాత్రి పడుకునే ముందు ఒక కవితో, కథో చదువుతాను. ఈ ఇంటర్వ్యూ ఇచ్చే సమయానికి రాళ్ళబండి శశిశ్రీ గారి అనుమంద్రం కవితా పుస్తకాన్ని చదువుతున్నాను. ఒక్కసారిగా పూర్తి చేయకుండా కొంత కొంత చదువుతూ వెళ్ళటం నేను అనుసరించే పద్ధతి. తీరికదొరికినప్పుడల్లా ఫేస్ బుక్ మాధ్యమం ద్వారా ‘కవి సంగమం’లో  కూడా కవిత్వం చదువుతుంటాను.

7. మీలో, మీ జీవితంలో పుస్తకాలను చదవడం వల్ల వచ్చిన మార్పుల గురించి.

    పుస్తకాలు చదవడం వల్ల నాలో ఎంతో మార్పు వచ్చింది. ఈ సమాజంలోని సంక్లిష్టతను అర్థం చేసుకోగలిగాను. మనిషిని ప్రేమించడం అనేది నాకు పుస్తకమే నేర్పింది. కేవలం విషయం పట్ల అవగాహనను కలిగించడమే కాదు. జీవితపులోతులను పట్టి చూపించింది. నన్ను నన్నుగా నిలబెట్టింది పుస్తకమే. ఇప్పుడు పుస్తకం నా శరీరంలో ఓ అవయవం. నేను శ్వాసిస్తున్నది దానితోనే…

Leave a Reply