పలమనేరు బాలాజి కవిత్వం చదివిన వాళ్ళకు తప్పకుండా ఒక ప్రశ్న వెంటాడుతు ఉంటుంది. ఇంత దయతో, ఇంత ప్రేమగా, ఇంత కరుణతో ఈ కవి ఎట్లా మాట్లాడుతున్నాడని? కలిసిన ప్రతి సందర్భాన్ని వెచ్చని ‘టీ’ మయం, పోయెట్రీమయం ఎలా చేయగలుగుతున్నాడని? ఎన్నో సార్లు తన జీవన మూలాల గురించి అడగాలనుకొని ఆగిపోయాను. ఇప్పుడీ ‘ఏకలవ్య కాలనీ’ ఎరుకల జీవన గాథలు చదువుతుంటే పలనునేరు బాలాజి మూలాలు ఎక్కడున్నాయో తెలుస్తాయి. కేవలం తన గురించో, తన కుటుంబ నేపధ్యం గురించో కాదు ఎరుకల జాతి కన్నీటి కథలను వినిపించిన ఎరుకల అస్తిత్వ కథలివి.
అస్తిత్వ ఉద్యమాల చైతన్యంతో ఇప్పటి వరకు స్త్రీ వాద, దళిత, మైనారిటీ, బీసి సాహిత్యం ఎంతో వచ్చింది. కానీ ఇంకా ఆశ్రిత కులాల నుంచి, అట్టడుగు వర్గాల నుంచి రావల్సినంత సాహిత్యం రాలేదు. వాటిలో ఆదివాసీ తెగల నుంచి, గిరిజన తెగల నుంచి, ఎరుకలి తెగల నుంచి ఎంతో సాహిత్యం రావాల్సి ఉంది. పలనునేరు బాలాజీ ” ఏకలవ్య కాలనీ” ఎరుకలకథలు ఆ ఖాళీలను పూరించాయి. ఇదివరకు ఎరుకలి జీవితం గురించి కొన్ని కథలు వచ్చినా అవి ఎరుకలి జీవితంతో సంబంధం లేని రచయితలు రాసిన కథలు. ఎరుకల స్త్రీ జీవితాన్ని, సంస్కృతిని బలంగా చిత్రించిన అరుణ ‘ఎల్లి’ నవల, శిరంశెట్టి కాంతారావు ‘మీరు గెలుస్తారు’ నవల, ఇంకా కొన్ని రచనలు కనబడుతాయి. శివరాత్రి సుధాకర్ సంపాదకత్వంలో ‘ఎరుక’ కథల సంకలనం వచ్చింది. అందులోని నాలుగు కథలు పలమనేరు బాలాజీ రాసినవే ఉన్నాయి. ఎరుకలి జీవితం నుంచి వచ్చిన రచయితే ఆ జీవన మూలాల గురించి మాట్లాడడం వలన చరిత్రలో ఈ కథలకు గొప్పస్థానం ఉంది.
కులం వల్ల దళితులు, బహుజనులు ఎలాంటి పీడనకు గురైనారో ఇది వరకు చదివినం. దళితుల కంటే హీనంగా చూడబడిన వాళ్ళు ఎరుకలి వాళ్ళు. వాళ్ళ జీవన విధానం వేరు. వాళ్ళ భాష వేరు. ఒక తట్ట అల్లినట్లు, ఒక పెద్దజల్ల అల్లినట్లు ఒక్కో కథను ఇతరులెవరూ ఊహించని రీతిలో వాస్తవికంగా వాళ్ళ గాథలను కథలుగా చెప్పిండు బాలాజీ. ఇవి బాలాజీ లేదా బాలాజీ లాంటి రచయితలు తప్ప ఇతరులెవరూ చెప్పలేని గాథలు. ఒక తట్ట అల్లడం ఎంత కష్టమో ఈ కథల్లోని దృశ్యాన్ని ఊహించడం కూడా అంతే కష్టం. బతుకుదెరువు కోసం పందులను, బాతులను, గాడిదలను కాసే జీవితం ఉంది. వాటిని కాయడంలో ఎదురయ్యే ఇబ్బందులు, సమాజంలో వివక్ష, వృత్తిని వదిలి వ్యవసాయం చెయ్యాలనుకున్నప్పుడు ఎదురయ్యే సంఘర్షణలు ఈ కథల్లో ఉన్నాయి. ఏనుగులు ఎక్కువగా ఉండే పలమనేరు స్థానికమైన అంశాలను కథల్లోకి ఒడుపుగా తీసుకొని వచ్చాడు.
ఏకలవ్య కాలనీలోని పద్దెనిమిది కథలను స్వీయ కథనాత్మక కథలు, వర్తమాన రాజకీయ కథలు, కులవివక్షతను చెప్పె కథలు, ఎరుకలివాడల్లోని మానవీయ మూర్తులను గురించి చెప్పే కథలుగా నాలుగు విభాగాలుగా వర్గీకరించుకొని విశ్లేషించవచ్చు.
అమ్మ, నాన్న, కాంతమ్మత్త గురించి రాసిన స్వీయ కథనాత్మక కథల్లో రచయిత బాల్యం కనబడుతుంది. తాను ఎదిగివచ్చిన జీవితం మనల్ని ఆర్ద్రపరుస్తుంది.
పలమనేరు బాలాజీ ఎరుకలి కులంలోనే పుట్టినా చదువుకున్న రెండవ తరం వాడు. నిజానికి వాళ్ళ తాత, నాయనలు పొందిన వివక్ష , పేదరికంతో పోలిస్తే తాను పొందినది కొంత తక్కువే . తాను అనుభవించని వాటిని అనుభవించినట్టు ఎక్కడా రాయలేదు. ఇదే రచయిత నిజాయితీకి నిదర్శనం. కానీ చిన్నప్పటినుండీ ఆ సమాజంలోనే పెరగడం వల్ల తాను చూసిన ఆ ఎస్టీకాలనీలోని పేదరికం, వృత్తిలోని కష్ట సుఖాలను వాస్తవికంగా రాశాడు. రచయిత తండ్రి ఫారెస్టు గార్డుగా ఉద్యోగం చేసినా చాలిచాలని జీతంతో పేదరికాన్ని అనుభవిస్తూ పిల్లలను చదివించాడు. ” పదకొండు నెలల జీతగాడి కథ” లో రచయిత తండ్రి ఎంత నిజాయితీగా బతుకుతాడో కనిపిస్తుంది. కట్టెలు కొట్టుకోవడానికి, ఆవులను మేపడానికి వచ్చే వాళ్ళ దగ్గర ఫారెస్టు ఆఫీసర్లు డబ్బులు వసూలు చేస్తుంటే నాగయ్య వాళ్ళకు బుక్కెడు బువ్వ తినిపించి పంపిస్తాడు. ఒక వైపు తండ్రిలోని మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తూనే మరొక వైపు ఇచ్చిన టార్గెట్ల కోసం సామాన్యులను బలి చేసే అధికారుల చర్యలను చూపిస్తాడు.
ఎరుకలి వాళ్ళంటే పందులను కాస్తూ, తట్టలల్లుతూ, శుచి శుభ్రత లేకుండా అనాగరికులుగా ఉంటారని ఈ సమాజం వాళ్ళను దూరంగా పెడుతుంది. ‘కాంతమ్మత్త’ లాంటి వాళ్ళు ఈ జీవితాలు మారడానికి చదువుకోవాలని లోకానికి చెప్పిండ్రు. ‘అమరజీవి కాంతమ్మత్త’ కథలో కాంతమ్మత్త ఒక ఉదాత్తమైన మనిషితనానికి చిరునామా. ఎరుకలి వాడలో మార్పు తీసుకు రావడానికి జీవితాంతం పోరాడింది. తన సొంత పిల్లలనే కాదు ఎరుకల వాడిలోని పిల్లలందరూ చదువుకునేలా తన వంతు సాయం చేసింది. చదువుకోని, తాగుడుకు బానిసైన తల్లిదండ్రులకు చదువు విలువ చెప్పి ప్రజల్లో చైతన్యం తెచ్చింది. నిజానికి ఇప్పుడే ఇంకా కాంతమ్మత్త లాంటి వాళ్ళ అవసరం చాలా ఉందని ఒకవైపు తెలియజేస్తూనే ఎస్టీ కాలనీలో ఇలాంటి గొప్ప మనుషులు కూడా ఉన్నారని కొత్త చరిత్రకు దారులు వేస్తాడు రచయిత.
***
” మీ జాతి బుద్దే అంతా” అని ఎరుకల వాళ్ళను అవమానించిన సంఘటనలను, నేరస్థులను చేసిన సంఘటనలను చెబుతూనే ఎరుకల జాతి గొప్పతనాన్ని, ఎరుకల జాతిలోని నిజాయితీని, ధైర్యాన్ని, మాటతప్పని గుణాన్ని ఈ కథల్లో వివిధ పాత్రల ద్వారా చూపించారు.
కబాబ్ కపాలి కథలో ఆర్ముగం షాపులో ఇరవై వేలు పోతే కపాలిని దోషిగా నిలబెడుతారు. ‘అదే ప్రశ్న? కథలో నాయుడు, రెడ్డి ఇండ్లల్లో కమలమ్మ పని మనిషిగా చేస్తున్నప్పుడు ఏ చిన్న వస్తువు పోయినా అది కమలమ్మనే దొంగతనం చేసిందని అనుమానిస్తారు. కపాలి, కమలమ్మ ఎంత నిజాయితీ గలవారో ఆ యాజమానులే తర్వాత గుర్తిస్తారు.ఒక ఎరుకల స్త్రీ ఇండ్లల్ల పని చేయడానికి పోయినపుడు ఎదురైన ఇబ్బందులే ” అదేప్రశ్న” కథ. ఎరుకలి వాళ్ళు అంటేనే అంటరానివాళ్ళుగా చూసే సమాజం వాళ్ళతో ఇండ్లల్ల పనిని చేయించుకుంటారా? అనే సంఘర్షణే ఈ కథను నడిపిస్తుంది. కులం చూసి ఇల్లును అద్దెకు ఇచ్చే ఆధునికసమాజంలో బతుకుతున్నాం. ఇంట్లో పని చేయడానికి కూడా కులం చూసి పని ఇచ్చె మనుషుల స్వభావాలను, ఈ కులసమాజపు అసలు రూపాన్ని చూపించాడు రచయిత. కులం కారణంగా పొందిన అవమానాల అనుభవాలలోంచి తన కులాన్ని ధైర్యంగా చెప్పుకునే విధానం కమలమ్మ పాత్రలో కనబడుతుంది.
ఈ కథల ద్వారా రచయిత దొంగలుగా ముద్ర వేసిన చరిత్రను తుడిచేసి అడిగితే ప్రాణాలైనా ఇవ్వడానికి వెనుకాడని ఏకలవ్యుని జాతిచరిత్రను పరిచయం చేస్తున్నాడు. ఎరుకలి వాళ్ళలోని నిజాయితీ, ధైర్యం, ప్రేమ – ఎట్లాంటివో చదవాలంటే ఈ కథలబుట్టలను ఎత్తుకోవాలి. ఈ కథట్లో కేవలం కులపీడనను, కుల రాజకీయాలను మాట్లాడడమే కాకుండా ఎరుకలి వాడల్లో ఉన్న మానవీయ మూర్తుల గురించి చెప్పాడు.
ఎరుకలి కపాలి వంటలు బాగా చేస్తూ కబాబ్ కపాలిగా ఊరంత పిలిచేలా బ్రతికిన జీవితం ఒక స్ఫూర్తిగాథ.
ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకున్న ఉడుకోడు ఊరఫ్ ఎరుకలి నరసింహులు విజయ గాథ . ఎరుకలోల్లంటే ఇట్లానే ఉంటారు అనుకునే సమాజానికి ఇలా కూడా ఉంటారు చూడండిరా అని పోరాట గాథలు
చెప్పాడు బాలాజీ. వాళ్ళు చనిపోయికప్పుడు ఊరు ఊరంతా కలిసి నడిచే దృశ్యాలను చదువుతుంటే ఎన్ని కులగోడలను కూల్చీ అందరిచేత మన్ననలు అందుకున్నరో అనిపిస్తుంది . వాళ్ళు ఈ తరానికి పాఠాలు.
***
దళిత, బహుజనుల చేతుల్లోకి అధికార పగ్గాలు రావడానికి ఎన్నో ఏండ్లు పట్టింది. అటువంటిది ఊరికి దూరంగా ఉంటూ, అర్థ సంచార జీవనం సాగించే ఎరుకల సామాజిక వర్గం దాక చేరడం ఎంత కష్టమో మనం ఊహించవచ్చు. ఈ కథలు అస్తిత్వ పోరాట కథలుగా మలుపు తీసుకోవడానికి వర్తమాన రాజకీయ అంశాలను కూడా బలంగా చెప్పడం.
రిజర్వేషన్ వలన అధికారం వస్తే మన జీవితాలు బాగు పడుతాయని అనుకుంటాం. కానీ మనం బొంగరంలాగ తిరుగుతున్నా తాడు మాత్రం పైవర్గాల చేతుల్లోనే ఉన్నాయని ఈ కథలు చెబుతాయి. అభ్యర్థిగా ఒక దళితుడినో, ఎరుకలి వాడినో పెట్టి వెనుకంగ రాజకీయం చేసే ఆధిపత్య వర్గాల ఊరి రాజకీయాలను బట్టబయలు చేయడం ఈకథల ప్రత్యేకత. ‘ చప్పుడు’ కథ చాలా భిన్నమైన కథ. రాజకీయ ఎత్తుగడలను చూపించిన కథ.
గ్రామ సర్పంచ్ అయ్యుండి కూడా రెడ్డి చెప్పినట్టే నడుచుకునే ఎరుకల శ్రీనయ్య ఈ కథలోని ప్రధాన పాత్ర.
ఊరిలో భార్య సర్పంచ్ అయితే భర్త ఆధిపత్యం చెలాయించి పాలన చేయడం, అదే ఒక దళితుడు సర్పంచ్ అయితే వాళ్ళ మీద ఆధిపత్యం ఆ ఊరి అగ్రకుల నాయకులది ఉంటుంది. అధికారుల మెప్పు కోసం ‘ఎరుకలోల్లని మేము ఇంటిలోకి రానిచ్చాం’ అని చెప్పుకునే అభ్యుదయ నాయకులు ఏ గడప వరకు రానిచ్చారో ఈ కథలో స్పష్టంగా మనం చూడొచ్చు.
ఊర్లలో పైవర్గాలు రెండుగా చీలి, క్రింది వర్గాల ప్రజలను తాము అధికారంలోకి రావడానికి ఎట్లా పావులుగా వాడు కుంటారో చెప్పే కథలు ఉన్నాయి. ఊర్లలో ఎరుకల కుటుంబాలు ఒకటో, రెండో ఉంటాయి. ఎలక్షన్లు వచ్చినపుడు మాత్రమే వాళ్ళు గుర్తొస్తారు.
ఊరికి ఎస్టీ రిజర్వేషన్ వచ్చిందని తెలిసి దొరస్వామిని మచ్చిక చేసుకునే ఈశ్వర నాయుడు, రామకృష్ణా రెడ్డిల రాజకీయ కుట్రలు ” వెదుర్లు” కథలో చూస్తాము.
తాగుడుకు బానిసై పై వర్గాల చేతుల్లో కీలుబొమ్మలుగా మారుతున్న వాళ్ళుకు దొరస్వామి పాత్ర ఒక ప్రతీక.
అందులోంచి బయట పడేయడానికి చదువుకున్న నీలమ్మ ఎంతో ప్రయత్నం చేస్తుంది. కానీ భర్త మారడు.నీలమ్మ వ్యవసాయం చేయాలనుకొని సేద్యం చేస్తే ఆ ఊరి దొరలు తోటను నాశనం చేస్తారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా వ్యవసాయం వదిలేసి బుట్టలల్లుకొని బ్రతుకుతాను అనే ఆత్మ విశ్వాసం నీలమ్మలో కనబడుతుంది.
బాలాజీ కథల్లోని స్త్రీ పాత్రలు ఎంతో చైతన్యంతో ఉంటూ
కుటుంబాన్ని కాపాడుకుంటారు. పైకి కోపంగా మాట్లాడినా ఎవరింట్లో ఆపదొచ్చినా ఆదుకునే దయామయి జయమ్మ, కాంతమ్మత్త లు ఉన్నారు. ఆధిపత్య వర్గాలకు ఎదురుతిరిగి ధిక్కారంగా జీవించే స్త్రీలు ఉన్నారు . గురి కథలో మునిరాజు, వెదుర్లు కథలో దొరస్వామి, తాగుడుకు బానిసైన వాళ్ళు, వాళ్ళ అలవాటు కారణంగా ఊరి దొరలు చెప్పినట్లు వింటారు.మునిరాజు భార్య మంజుల, దొరస్వామి భార్య నీలమ్మ పాత్రలు ఎంతో చైతన్యం కల్గిన వాళ్ళు. చదువుకున్న వాళ్ళు. దొరల ఆధిపత్యం ఎలాంటిదో తెలిసిన వాళ్ళు. ఆర్థికంగా బాగుంటేనే జీవితాల్లో మార్పు వస్తుందని ఎరుక కలిగిన వాళ్ళు. కులవృత్తితో పాటు వ్యవసాయం వైపు మళ్ళే ఎరుకల కుటుంబాల పరిణామం కూడా ఈ కథల్లో కనబడుతాయి .
***
ఎరుకలివాడ ఏకలవ్య కాలనీగా అభివృద్ధి కావడానికి కావల్సిన భవిష్యత్తు ప్రణాళికను బొమ్మ గీసి ఇచ్చినట్లు ఇస్తాయి ఈ కథలు. ఎరుకలివాడను ఏకలవ్య కాలనీగా మార్చడం అంటే కేవలం పేరు మార్చడం కాదు. బడి, ఆసుపత్రి, గ్రంథాలయం, నీటి వసతి సౌకర్యాలన్నీ ఉండేలా చూడడం కూడా. కేవలం పేరును మార్చితేనే మార్పు వచ్చినట్లా అని కొందరనుకోవచ్చు. మాల, మాదిగ వాడలను మహరాజుల కాలనీగా, అదే విధంగా ఎరుకలి వాడలను ఏకలవ్య కాలనీగా మార్చడం అంటే వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం . వాళ్ళు దేనిలోను తక్కవ కాదు అని వాళ్ళలో ఆత్మ విశ్వాసాన్ని నూరి పోయడం. పూర్వీకుల చరిత్రను గుర్తు చేస్తూ వర్తమానంలోకి ధైర్యంగా అడుగులు వేయడం. రచయిత ఈ కథల ద్వారా అదే పని చేసిండు.
ఈ కథలు ఎదిగిన తరం చేయవలసిన బాధ్యతను గుర్తు చేస్తాయి. దళిత బహుజనుల్లో ఎదిగిన కొంతమంది తిరిగి వాళ్ళ మూలాల్లోకి తొంగి చూడరు. తమ కులం పేరు చెప్పుకుంటే ఎక్కడ చిన్న చూపు చూస్తారో అని భయం.
కానీ అంతోఇంతో చదువుకున్న వాళ్ళు, ఎదిగిన వాళ్ళు ఒక చేయుతనివ్వడం ద్వారా మన జీవితాల్లో మార్పు తీసుకొని రావొచ్చని ఈ కథలు నిరూపిస్తాయి. ‘ ఏకలవ్య కాలనీ’ కథలో రచయితను రమణ తిట్టే సందర్భం ఒకటుంది. “నీ ఉద్యోగమేదో నీవు చేసుకుంటా నిమ్మళంగా వుండలేవా. యస్టీ కాలనీ కథలన్నీ నీకెందుకు? అని అరుస్తాడు రమణ.
“నేను వచ్చింది ఆ ఎరుకల కులంలోంచే, అదే కాలనీలోంచే కదా రమణా. వాళ్ళనెట్లా దూరంగా పెడతాను ‘ అనే మాటలు మన మూలాల మీద మనకుండవలసిన ప్రేమను, బాధ్యతను గుర్తు చేస్తాయి. మూలాలు మరిచిపోయి సంస్కృతీకరణ చెందుతున్న ఇప్పటి పిల్లలందరికి కనువిప్పు లాంటిది ఈ కథ. నీళ్ళు, కరెంటు, మరుగుదొడ్లు, కనీస సౌకర్యాలు లేని ఎరుకలి వాడలు ఇంకా ఉన్నాయి. చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళు, ఏ పంట వేయాలో తెలియని వాళ్ళు , ఇంకా కులం చేస్తున్న దాడిలో గాయపడుతున్న వాళ్ళు, పింఛన్లు రాని వాళ్ళు ఎందరో ఉన్నారు. ఆయా కులాల నుంచి ఒక భరోసా ఇచ్చే మనుషులు రావాలని ఈ కథలు చదువుతుంటే అనిపిస్తుంది.
పలమనేరు బాలాజీ 1994నుంచి పంచాయతీ రాజ్ వ్యవస్థలో కీలక బాధ్యతలు నిర్వహించాడు. దీని వలన గ్రామీణ స్థాయిలో ఉండే సమస్యలను, రాజకీయాలను చాలా దగ్గరగా చూసిన వ్యక్తిగా గ్రామీణ రాజకీయ చిత్రపటాన్ని తన కథల్లో చూపించగలిగాడు. ప్రయత్నం, ధర్నా కథలు అందుకు మంచి ఉదాహరణ.
ఇంటి పట్టాలు రాని వాళ్ళు, రేషన్ కార్డులు రాని వాళ్ళంతా కలిసి ఎం.ఆర్.ఓ ఆఫీసు దగ్గర ధర్నా చేయడమే ‘ధర్నా’ కథలోని కథాంశం. ఈ కథలో రెవెన్యు వ్యవస్థలోని అవినీతిని, అధికారుల నిర్లక్ష్యవైఖరిని, రాజకీయ నాయకుల జోక్యంను ప్రధానంగా చిత్రిస్తూనే ప్రజలంతా ఐక్యంగా పోరాడాలనే సందేశం కనబడుతుంది.
పంచాయతీ వ్యవస్థ తీరుతెన్నులను, గ్రామంలోని సమస్యలు , గ్రామసభ నడిచె తీరును ” ప్రయత్నం” కథలో కండ్లకు కట్టినట్లు చూపించాడు. గ్రామ సర్పంచ్ తన సొంత డబ్బుతో ఏదైనా పనిచేస్తే ఆ డబ్బు గవర్నమెంటు నుంచి రావడానికి ఎంత తతంగం ఉంటుందో ఈ కథలో చెబుతాడు. ఈ కథలో పంచాయతీ కార్యదర్శి, ఎంపిడిఓ అట్టడుగు జీవితంలోంచి వచ్చిన వారు. ప్రజా సమస్యలు తెలిసిన వారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు సామాన్యులకు అందేలా చూస్తున్న అధికారులు. ఒక అధికారిగా, ఒక ఉద్యోగిగా ప్రజల సమస్యలను ఎలాగైనా తీర్చాలి ఎలాగైనా అర్హులకు ప్రభుత్వ పథకాలను అందించాలని తపన ఈ కథల్లో ఉన్న అధికారి పాత్రకు కనిపిస్తుంది అంటే బహుశా అందుకు రచయిత వ్యక్తిత్వం , జీవితానుభవం కారణం కావచ్చు అనుకుంటాను
ఒక కొత్త జీవితాన్ని కథల్లోకి తీసుకొని వస్తున్నప్పుడు సరళంగా, సహజంగా ఉంటేనే ఎక్కువ మందికి ఆ జీవితం చేరుతుంది.ఎంతో సహజంగా, సరళతతో ఈ కథలు ఉండడం వలన ఎరుకల జీవితాల్లోకి వెళ్ళి వాళ్ళ మధ్య జీవించిన అనుభూతినిస్తాయి. కొన్ని కథల్లో జరుగబోయే విషయాన్ని ప్రతికాత్మకంగా చెప్పి ముగింపునిస్తాడు. ప్రయత్నం కథలో నీళ్ళ సమస్య ప్రధానమైనది . బోరింగు కొట్టడానికి ఆడవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతారో ఒక వైపు చిత్రిస్తాడు రచయిత. మరొకవైపు బోరింగు బాగ చేయడానికి గ్రామ సభలో చర్చ. గ్రామ సభలోని చర్చలు ఎంత వరకు సఫలీకృతం అవుతాయో ప్రతీకాత్మకంగా చెబుతూ చివర్లో “బిందె నిండుతూ ఉంది’ వాక్యంలో ప్రజల సమస్యలు తీరుతాయన్న భరోసా కనబడుతుంది.
చదువుకుంటేనే తమ జాతి బాగుపడుతుందని ఎరుక చెప్తున్న కథలివి. అల్లిక వారసత్వంలోంచి పుట్టిన ఆత్మగౌరవ పోరాట కథలివి. ఎరుకలివాడకు ఏకలవ్య కాలనీ అనే కొత్త బోర్డును చేయించి అభివృద్ధి బాటలు వేసిన పలమనేరు బాలాజీకి శుభాకాంక్షలు.
తగుళ్ళ గోపాల్
18.08.2026




