ద్రవ్యోల్బణం అనేది ఆర్థిక శాస్త్రంలో కనిపించే ఒక గణాంకం. అంతకు మించి, సామాన్య ప్రజల జీవితాల ను నిశ్శబ్ధంగా కుదిపేసే సామాజిక, ఆర్థిక వాస్తవం. ఆర్థిక ప్రపంచంలో అత్యంత కీలకమైన, మ‌నుషుల జీవితాల‌ను చాలా ప్రభావితం చేసే అంశం ‘ద్రవ్యోల్బణం’.  ద్రవ్యోల్బణం అంటే మీ చేతిలో ఉన్న డబ్బు యొక్క కొనుగోలు శక్తి తగ్గడం.  ప్రభుత్వం విడుదల చేసే ద్రవ్యోల్బణ శాతాలు, ధరల సూచీలు, గణాంక నివేదికలు సాధారణంగా నిపుణుల చర్చలకే పరిమితమైన అంశాలుగా కనిపించినప్పటికీ, వాటి అసలు ప్రభావం ప్రతి మ‌నిషిపై, ప్ర‌తి ఇంటిలోనూ ఉంటుంది. ద్రవ్యోల్బణం వినియోగదారులు, వ్యాపారులు, పెట్టుబడిదారులపైనే గాక‌ మొత్తం ఆర్థికవ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. ఇది మితమైన, సాధారణ ద్రవ్యోల్బణానికి, అసాధారణంగా అధిక ద్రవ్యోల్బణానికి మధ్య తేడాను గుర్తించగలదు. వస్తువు లు, సేవల ధరలు పెరగడం వల్ల ప్రజల జీవన వ్యయం భారీగా పెరుగుతుంది. దీనితో వారి వేతనాలు సరిపోక జీవన ప్రమాణాలు పడిపోతాయి. 

జూన్ నెలలో టోకు ధరల ద్రవ్యోల్బణం 9.87 శాతానికి పెరగడం, 2024 ఏప్రిల్ తర్వాత ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయికి చేరుకోవడం భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ఒత్తిడిని స్పష్టం చేస్తున్నది. మే నెలలో అది 9.68 శాతంగా ఉండగా, ఒక్క నెలలోనే మరింత పెరగడం ఆహార ధరల అసాధారణ పెరుగు దల ఎంత తీవ్రంగా ఉందో సూచిస్తోంది. అదే సమయంలో గృహ వినియోగదారులు ఎదుర్కొనే చిల్లర ద్రవ్యోల్బణం కూడా నాలుగున్నర శాతానికి చేరుకోవడంతో పరస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ద్రవ్యోల్బణం అధికంగా ఉండటం వల్ల ఎక్కువగా నష్టపోయేది మధ్యతరగతి, దిగువ ఆదాయ వర్గాలే. ఆహారం, విద్యుత్, ఇంధనం, వైద్యం, విద్య వంటి నిత్యావసరాలపై కుటుంబాలు ఎక్కువ మొత్తాన్ని వెచ్చించాల్సి వస్తుంది. ఆదాయం గ‌తంలో మాదిరి అదే స్థాయిలో ఉన్నప్పటికీ కొనుగోలు శక్తి తగ్గిపోవడం వల్ల జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. 

ఒక నిర్ణీత కాలంలో వస్తువుల ధరల్లో వచ్చే క్రమానుగత పెరుగుద‌ల‌నే ద్రవ్యోల్బణం అంటారు. అంటే ద్రవ్యం విలువ (వస్తువులను కొనే సామర్థ్యం) తగ్గి వస్తువులకు డిమాండ్ పెరగడం. కేవలం కొన్ని వస్తువుల కు అత్యధిక ద్రవ్యం వెచ్చించడాన్ని ద్రవ్యోల్బణంగా పేర్కొనవచ్చు. అంటే మార్కెట్‌లో ద్రవ్య సరఫరా పెరిగినప్పుడు వస్తువులకు డిమాండ్ పెరిగి, తద్వారా ఆ వస్తువుల ధరలు క్రమానుగతంగా పెరుగుతాయి. ద్రవ్యోల్బణం ఫలితంగా ఒక వస్తువును కొనడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఉదాహరణకు, గతంలో రూ.100 లకు లభించిన వస్తువు ధర, ద్రవ్యోల్బణం కారణంగా రూ.150 లకు పెరిగితే, అదే వస్తువును కొనడానికి మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. అంటే మీ వద్ద ఉన్న డబ్బు విలువ తగ్గినట్లు భావించాలి. భారత ఆర్థిక వ్యవస్థపై ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) తీవ్రమైన, విస్తృతమైన ప్రభావాలను చూపుతుంది. ఇది వినియోగదారుల కొనుగోలు శక్తిని తగ్గించడం ద్వారా జీవన వ్యయాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ద్రవ్యో ల్బణాన్ని అదుపు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వడ్డీ రేట్లను పెంచే చర్యలు తీసుకుంటుంది. దీనివల్ల ప్రజలకు, వ్యాపారస్తులకు రుణాలు ఖరీదై ఆర్థిక వృద్ధి మందగించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆహార ధరలు పెరగడం వల్ల సామాన్యులపై భారం పడుతుండగా, జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం 6.36 శాతంతో అత్యధిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నది.

ద్రవ్యోల్బణం ఆవిర్భవించే మూలాన్ని బట్టి దీన్ని మూడు రకాలుగా పేర్కొనవచ్చు. అంటే ద్రవ్యోల్బణం దేని ద్వారా సంభవిస్తుందో, దాన్ని బట్టి ద్రవ్యోల్బణాన్ని మూడు రకాలుగా విభజన చేశారు. 1. డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం, 2. వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం, 3. బిల్ట్ ఇన్ ద్రవ్యోల్బణం. ఈ మూడు రకాలను ట్రయాంగిల్ మోడల్ అని కూడా అంటారు. 

డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటే, ఇలాంటి ద్రవ్య్లోల్బణం ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల సరఫరాను మించి డిమాండ్ ఏర్పడినప్పుడు వాటి ధరలు పెరుగుతాయి. దీన్నే గిరాకీ ప్రేరిత ద్రవ్యోల్బ ణం అని కూడా అంటారు. అంటే ప్రజల కొనుగోలు శక్తి పెరిగినప్పుడు, వారి వద్ద ద్రవ్య సరఫరా కూడా పెరిగినప్పుడు, అదే స్థాయిలో వస్తువుల సరఫరా ఉన్న‌ప్ప‌టికీ, అత్యధిక ద్రవ్యం అత్యల్ప వస్తువుల స్థాయిని వెంటాడే స్థితిని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు. ప్రైవేట్ , ప్రభుత్వ వ్యయాలు పెరిగినప్పుడు, పెట్టుబడి వ్యయం కూడా అధికమైనప్పుడు ఈ రకమైన ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. ఇలాంటి ద్రవ్యోల్బణం ఆర్థక వ్యవస్థకు లాభదాయకమైంది. ఎందుకంటే ద్రవ్య సరఫరా పెరిగినప్పుడు వస్తువులకు గిరాకీ పెరిగి… తద్వారా అధిక పెట్టుబడులకు దారితీసి అది పారిశ్రామిక వృద్ధికి ఊతమి స్తుంది. 

వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటే, దీన్నే సప్లయ్ షాక్ ద్రవ్యోల్బణం అని కూడా అంటారు. ఇది సాధారణ వస్తువులు అవసరం కంటే తక్కువ సరఫరా ఉన్నప్పుడు సంభవిస్తుంది. ఇది సాధారణంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సాధారణ ధరల సరఫరా కంటే మరింత సరఫరా తగ్గి, వస్తువుల సరఫరా తగ్గినప్పుడు వాటికి గిరాకీ ఏర్పడి ధరలు పెరుగుతాయి. అదేవిధంగా మధ్యంతర వస్తువుల (అంతిమ వస్తువుల ఉత్పత్తిలో ఉపయోగపడేవి) ధరలు పెరిగినప్పుడు కూడా ఆయా అంతిమ వస్తువుల ధరలు పెరుగుతాయి. 

బిల్ట్ ఇన్ ద్రవ్యోల్బణం అంటే, ఇది కొన్ని వస్తూత్పత్తి కంపెనీలు స్వతహాగా తీసుకున్న నిర్ణయాల వల్ల వస్తుంది. అంటే మార్కెట్‌లో వస్తువుల ధరలు పెరిగినప్పుడు, కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఆయా కార్మికుల జీతాలు కూడా పెంచుతాయి. వారి జీతాలు పెరిగినప్పుడు ఆయా ప్రజల వద్ద ద్రవ్య సరఫరా పెరిగి మళ్లీ మార్కెట్‌లో వస్తువులకు గిరాకీ పెరుగుతుంది. అంటే అది మళ్లీ  ద్రవ్యోల్బణం ఏర్పడటానికి దారితీస్తుంది. ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు కార్పొరేట్ కంపెనీలు మళ్లీ జీతాలు పెంచుతాయి. అది ఒక వృత్తంలా కొనసాగుతూ ద్రవ్యోల్బణం మరింత పెరిగేలా చేస్తుంది. ఈ విధంగా మూడు రకాల కారణాల వల్ల ద్రవ్యోల్బణం సంభవిస్తుంది.  

భారతీయ రిజర్వు బ్యాంక్ ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని 4 శాతం మించకుండా ఉంచాలని ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం వినియోగదారుల ధరల సూచీ 4.4 శాతానికి చేరడం ఆ లక్ష్యాన్ని మించిపోయిన సంకేతం. ఒకవైపు ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించేందుకు వడ్డీ రేట్లను తగ్గించాలని పరిశ్రమలు కోరుతుంటే, మరోవైపు ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో ఆ దిశగా అడుగులు వేయడం సులభం కాదు. ద్రవ్య విధానం ఇప్పుడు మరింత క్లిష్టమైన సమతుల్యతను సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధరల పెరుగుదలకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల అస్థిరత, పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు, సరఫరా గొలుసుల్లో ఏర్పడుతున్న అంతరాయాలు, రవాణా వ్యయాల పెరుగుదల వంటి అంశాలు దిగుమతుల వ్యయాన్ని పెంచుతున్నాయి. దేశీయంగా వ్యవసాయ ఉత్పత్తు ల సరఫరాలో అంతరాయాలు, వాతావరణ మార్పుల ప్రభావం, కొన్ని వస్తువుల కొరత కూడా ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. 

భారత ఆర్థిక వ్యవస్థ గత కొంతకాలంగా ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చే దిశగా ప్రయాణిస్తున్నట్లు కనిపించినా, తాజా గణాంకాలు విధాన నిర్ణేతలకు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. జూలై 14న విడుదలైన ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2026 జూన్‌లో హోల్‌సేల్ ధరల సూచీ వార్షిక ప్రాతిపదికన 9.9 శాతం పెరిగింది. దీనికి ఒక రోజు ముందు విడుదలైన వినియోగదారుల ధరల సూచీ కూడా 4.4 శాతానికి చేరి 17 నెలల గరిష్ఠ స్థాయిని తాకింది. వినియోగదారుల స్థాయిలోనూ, ఉత్పత్తిదారుల స్థాయిలోనూ ధరల ఒత్తిడి పెరుగుతుండటం ఆర్థిక వ్యవస్థకు శుభసూచకం కాదు. హోల్‌సేల్ ధరలు పెరగడం అనేది కేవలం పరిశ్రమల సమస్య కాదు. ఉత్పత్తిదారులు ఎదుర్కొంటున్న వ్యయభారం త్వరలోనే వినియోగ దారులపైకి బదిలీ అవుతుంది. అంటే, ప్రస్తుతం హోల్‌సేల్ ధరల సూచీలో కనిపిస్తున్న తీవ్ర పెరుగు దల రాబోయే నెలల్లో వినియోగదారుల ధరల సూచీపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. అందు వల్ల ఇది తాత్కాలిక గణాంకం కాదని, భవిష్యత్తు ద్రవ్యోల్బణానికి ముందస్తు  హెచ్చరికగా పరిగణించా ల్సిన అవసరం ఉంది.  పశ్చిమ ఆసియా యుద్ధ ప్రభావం, సాధారణం కంటే బలహీనమైన రుతుపవనాల కారణంగా పెరుగుతున్న ఆహార, ఇంధన ధరలతో పాటు వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) కొత్త శ్రేణి ప్రకారం ద్రవ్యోల్బణం పెరిగింది. దీనిలో భాగంగానే జూన్ నెలలో ఆహార ధరలు పెరిగాయి. దీని ప్రభావం వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 4.38 శాతానికి చేరింది. గత 18 నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. 

“ప్రపంచ భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, సరఫరా గొలుసు అంతరాయాల వల్ల తలెత్తుతున్న నిరంతర ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను, ఆర్‌బిఐ మధ్యకాలిక లక్ష్యం 4 శాతాన్ని మించిన జూన్ నెల సిపిఐ ద్రవ్యోల్బణం 4.4 శాతంగా ఉండటమే ప్రతిబింబిస్తుంది”, అని నైట్ ఫ్రాంక్ ఇండియా నేషనల్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ వివేక్ రాథీ అన్నారు. “దేశీయంగా చూస్తే, వాతావరణ సంబంధిత అంతరాయాల వల్ల వ్యవసాయ ఉత్పత్తికి కలిగే ఆటంకాలు ,కొన్ని ప్రాంతాలలో రుతుపవనాల పంపిణీలో అసమానతల కారణంగా ఆహార ద్రవ్యోల్బణం ఒక కీలక చోదకంగా మిగిలిపోయింది” అని ఆయన అన్నారు. భవిష్యత్తు ను చూస్తే, ఐసిఆర్ఎ ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ ప్రకారం, గత నెలతో, గత సంవత్సరం జూలైతో పోలిస్తే 2026 జూలైలో కూడా రిటైల్ ఆహార ధరలు పెరుగుతూనే ఉన్నాయి, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ లు అమలు చేసిన ఇంధన ధరల పెరుగుదల కారణంగా, సిపిఐలోని రవాణా విభాగంలో ద్రవ్యోల్బణం మే నెలలోని 1.7 శాతం నుండి జూన్ 2026 నాటికి 4.3 శాతంకి పెరిగింది. “ఆహార వస్తువులతో పాటు, పెరిగిన ఇంధన ధరల ప్రభావం ఇతర వస్తువుల ధరలపై పడటం వలన, ఆహారేతర విభాగం కూడా ఈ నెలలో ప్రధాన సిపిఐ గణాంకాలపై ఒత్తిడిని కలిగించవచ్చు” అని ఆమె తెలిపారు. 

పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అధిక ద్రవ్యోల్బణం ఉంది. జూన్ నెలలో పట్టణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.92 శాతంగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇది 4.74 శాతంగా నమోదైంది. పట్టణ ప్రాంతాల్లో ఆహార ద్రవ్యోల్బణం 5.09 శాతంగా  ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 5.45 శాతంగా ఉంది. గృహ నిర్మాణ రంగంలో ద్రవ్యోల్బణం  గ్రామీణ ప్రాంతాల్లో 2.66 శాతంగా, పట్టణ ప్రాంతాల్లో 1.90 శాతంగా ఉంది. వినియోగదారుల వ్యక్తిగత సంరక్షణ, సామాజిక రక్షణ, ఇతర వస్తువులు, సేవల విభాగంగాలో ద్రవ్యోల్బణం 16.72 శాతంతో అధిక స్థాయిలోనే కొనసాగింది. ఆహార పదార్థాల్లో అల్లం ధరలు అత్యధికంగా పెరిగాయి. టమాటా ద్రవ్యోల్బణం ఏడాది ప్రాతిపదికన 31.92 శాతంగా ఉండగా, కిస్‌మిస్, పెద్ద ఎండు ద్రాక్ష ద్రవ్యోల్బణం 20.52 శాతంగా నమోదైంది. బంగారం, వజ్రాలు, ప్లాటినం అభరణాల ద్రవ్యోల్బణం 36.82 శాతంగా నమోదైంది. 

జూన్ నెలలో అత్యధికంగా 6.36 శాతం రిటైల్ ద్రవ్యోల్బణంతో తెలంగాణ అగ్రభాగాన ఉంది. దీని తరువాత ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలో 5.39 శాతంతో రెండో స్థానంలో నిలిచాయి. మూడో స్థానంలో ఉన్న తమిళనాడులో రిటైల్ ద్రవ్యోల్బణం 5.24 శాతంగా నమోదైంది. ఒడిషాలో 5.15 శాతం ద్రవ్యోల్బణంతో టాప్ 5 స్థానాల్లో ఉంది. త్రిపురలో అత్యల్పంగా 1.65 శాతం మాత్రమే రిటైల్ ద్రవ్యోల్బణం నమోదైంది. అతి తక్కువ ద్రవ్యోల్బణం నమోదు చేసిన రాష్ట్రాల్లో త్రిపుర తరువాత స్థానాల్లో మిజోరాంలో 1.63 శాతం, మేఘాలయాలో 2.64 శాతం, నాగాలాండ్‌లో 2.83 శాతం, ఢిల్లీలో 2.96 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాలుగా మారింది. ఈ క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించడం కంటే పెంచే దిశగా ఆలోచించే పరిస్థితి ఏర్పడుతోంది. జూన్‌కు సంబంధించిన తాజా గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నెలవారీ ప్రాతిపదికన వినియోగదారుల ధరలు 1.03 శాతం పెరగడం వివిధ రంగాల్లో ధరల ఒత్తిడి పెరుగుతున్న సంకేతంగా విశ్లేషకులు భావిస్తు న్నారు. రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే, దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 18 ర్రాష్ట్రాల్లో రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన 4 శాతం మించి ద్రవ్యోల్బణం  నమోదైంది.

ద్రవ్యోల్బణం రేటులో తగ్గుదలనే ప్రతి ద్రవ్యోల్బణం(డిస్ ఇన్‌ప్లేషన్) అంటారు. ద్రవ్యోల్బణ తగ్గింపు అనగా వస్తువులు, సేవల ధరలు పెరుగుదల వేగం నెమ్మదించడం లేదా మార్కెట్లో ధరలు దిగిరావడం. అంటే ప్రతి ద్రవ్యోల్బణం  ద్రవ్యోల్బణం భావనకు వ్యతిరేకమైనది. ఆర్థిక వ్యవస్థలో వస్తువులు, సేవల ధరలు నిరంతరం, విస్తృతంగా తగ్గిపోవడం ఉంటే దాన్ని ప్రతిద్రవ్యోల్బణం అంటారు. దీనివల్ల డబ్బు యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఈ పరిస్థితిలో ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకు ద్రవ్యోల్బణ పునరుద్ధరణ విధానాలు, పద్ధతులు చేపడుతుంది. అవి ద్రవ్య సరఫరాను పెంచడం, వడ్డీ రేట్లను తగ్గించడం, పన్నుల ను తగ్గించడం, ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం వంటివి ఉంటాయి. ఇక్కడ ధరల సూచీ మైనస్(-)లో ఉంటుంది. దీంతో వచ్చే పరిణామాలు, దీని వెనుకున్న కారణాలు మొదలైనవన్నీ ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఉంటాయి. 

ప్రతి ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణం కంటే ప్రమాదకరమైనది. ఎందుకంటే ప్రతిద్రవ్యోల్బణం ఉన్నప్పుడు అనేక పరిణామాలు చోటుచేసుకుంటాయి. అవి 1) వస్తువులకు గిరాకీ ఉండదు. 2) వస్తూత్పత్తి తగ్గించాలి. 3) అదనపు ఉద్యోగులను తొలగించాలి దీంతో నిరుద్యోగం పెరుగుతుంది. 4) ప్రజల కొనుగోలు శక్తి తగ్గు తుంది. 5) ప్రజల మధ్య ద్రవ్య సరఫరా తగ్గి అది మళ్లీ మార్కెట్‌లో వస్తువుల గిరాకీ తగ్గిస్తుంది. ఈ విధంగా క్రమంగా మొత్తం ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుంది. ఆర్థిక వ్యవస్థలో ప్రతిద్రవ్యోల్బణం ఉన్నప్పుడు ప్రభుత్వం తన విధానాల ద్వారా ద్రవ్యోల్బణాన్ని పెంచడాన్ని పునర్బలణం అంటారు. అంటే ఆర్థికవ్యవ స్థకు వేగం చేకూర్చి తద్వారా వస్తువులకు గిరాకీ పెంచి ఆర్థిక వ్యవస్థను పునర్‌నిర్మిస్తుంది. 

ఉత్పత్తి పరిమాణంలో, ఉపాధిలో ఎలాంటి క్షీణత లేకుండా ధరల స్థాయిని తగ్గించడమే డిసిన్‌ప్లేషన్. ఇది సాధారణంగా ప్రభుత్వం తీసుకునే చర్యలకు అనుగుణంగా తగ్గుతుంది.  ద్రవ్యోల్బణం కొనుగోలు శక్తిని ప్రభావితం చేస్తుంది. ఇది ఆర్థిక ప్రణాళిక, పెట్టుబడి నిర్ణయాలకు కీలకం. ద్రవ్యోల్బణాన్ని అదుపు లో ఉంచడం, కొన్ని రుణ సేవా ఖర్చులను తగ్గించడం, రియల్ ఎస్టేట్స్, స్టాక్స్ వంటి కొన్ని మార్కెట్ రంగాలకు ప్రయోజనం చేకూర్చడం వంటివి దీని సానుకూల అంశాలలో ఉన్నాయి.

– ద్రవ్యోల్బణం  ఆర్థిక వ్యవస్థ గురించి చర్చిస్తూ వస్తువులు, సేవలు సాధారణ ధరల స్థాయిలో నిరంతరం పెరుగుదలనే ద్రవ్యోల్బణంగా నిర్వచించి, కొనుగోలు శక్తిపై దాని ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.  కాలక్రమేణా డబ్బు కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. 

– నిత్యావసరాలపై అధిక వ్యయం కారణంగా, పెరుగుతున్న ద్రవ్యోల్బణం తక్కువ ఆదాయం ఉన్న వినియోగదారులను మరింత తీవ్రంగా దెబ్బతీస్తుంది. 

– ద్రవ్యోల్బణం వాస్తవ రుణ వ్యయాలను తగ్గించడం ద్వారా స్థిర-వడ్డీ రేటు రుణాలు తీసుకున్న రుణగ్రహీతలకు ప్రయోజనం చేకూరుస్తుంది. 

– రియల్ ఎస్టేట్, కొన్ని స్టాక్‌లు ద్రవ్యోల్బణం నుండి రక్షణ కల్పించగలవు. తరచుగా అటువంటి సమయాల్లో బాగా రాణిస్తాయి.

– ద్రవ్యోల్బణం తగ్గడం వల్ల ఖర్చు తగ్గడం, పెద్ద ఎత్తున రుణాలు ఎగవేతలు జరగడం వంటివి జరిగి, బ్యాంకింగ్ సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉంది. 

ద్రవ్యోల్బణం యొక్క సాధారణ ప్రభావాలను, అది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే సంభవించే ప్రభావాల నుండి వేరు చేసి చూడటం చాలా ముఖ్యం. భారతదేశానికి ద్రవ్యోల్బణం కుదుపులు తప్పవని, తప్పించుకోలేదని.. ఇప్పటికే ఈ ప్రభావం కనిపిస్తోందని ఆక్స్ ఫర్డ్ ఎకనామిక్స్ లో పశ్చిమాసియా పరిశోధనా విభాగం అధిపతి అలెగ్జాండర్ హెర్మన్ ప్రసాద్ అన్నారు. ఈ ఏడాది ఆఖరుకు రిజర్వ్ బ్యాంకు అంచనా వేసిన దానికంటే ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా సామాన్యుడి కొనుగోలు శక్తి పడిపోవడం, పెట్టుబడులు మందగించడం, ఉత్పత్తి ఖర్చులు పెరగడం వంటి ప్రధాన సమస్యలు వస్తున్నాయి. దీనిని అదుపు చేయడానికి కేంద్ర బ్యాంక్(ఆర్‌బిఐ) వడ్డీ రేట్లను పెంచాల్సి వస్తుంది. ఫలితంగా రుణాలు ప్రియమై ఆర్థిక వృద్ధి, డిమాండ్ తగ్గిపోతాయి. ఒక శతాబ్దానికి పైగా మితమైన ద్రవ్యోల్బణం అనేది ఒక వాస్తవంగా ఉంది.

Leave a Reply