ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఒక వికారమైన, వికృతమైన క్రీడ నడుస్తున్నది. మనిషికి అత్యంత మౌలికమైన, ప్రాధమికమైన జీవించే హక్కుకి అధికారికంగా తూట్లు పొడవటం ఈ క్రీడకి సంబంధించిన ఒక ముఖ్య పార్శ్వం కాగా, ఇటువంటి క్రీడని వెనకేసుకరావటం, ఇతోధికంగా మద్ధతు తెలపడం, మద్ధతు తెలిపేలా అన్ని మాధ్యమాల ద్వారా సామాన్య ప్రజానీకాన్ని రెచ్చకొట్టడం మరొక పార్శ్వం. ఈ క్రీడ పేరు కష్టోడియల్ హింస. ఇంకా సూటిగా చెప్పాలంటే కష్టోడియల్ మరణాలు. ఎటువంటి శషభిషలు లేకుండా చెప్పుకోవాలంటే కష్టోడియల్ హత్యలు- ఇదే సరైన పదం కూడా.
గత ఒక్క నెలలోనే ఆంధ్ర ప్రదేశ్ లో కనీసం ముగ్గురు ఈ కష్టోడియల్ హత్యాలకి బాధితులు లేదా పోలీసు హింస బాధితులు. ముందుగా ఒకొక్కరి గిరించి చెప్పుకుందాము.
గాదె సాయికృష్ణ. పాతిక సంవత్సరాల వయసు ఉండిన యువకుడు. కాపు కులానికి చెందినవాడు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో కృష్ణలంక ప్రాంతానికి చెందినవాడు. తండ్రి లేదు. తల్లి ఒంటరిగా పెంచింది. ఒక సోదరి ఉంది. పెరుగుతున్న కొద్దీ అలవాట్లతో పాటు కేసులూ పెరిగాయి. కేసుల తీవ్రత కూడా పెరుగుతా వచ్చి చివరికి హత్య కేసు కూడా నమోదు అయ్యింది. చాలా వరకు కేసులలో నిర్ధోషిగా తేలడమో, రాజీ పడటమో జరిగింది. మే నెల నాటికి ఒక 3-4 కేసులు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. అందులో రెండు కేసులకి సంబంధించి తన మీద స్థానిక న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ చేసింది. నాన్ బెయిలబుల్ వారంట్ అంటే ఆ వ్యక్తి ఎక్కడున్నా కూడా పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేసి కారాగారంలో పెట్టడం అన్నమాట. ఇందులో ఒక వారంట్ ఎన్డీపిఎస్ చట్టానికి సంబంధించినది. అంటే రోజువారీ భాషలో గంజాయి కేసుకి సంబంధించినది. మరొకటి ఒక వ్యక్తి మీద దాడి చేసిన కేసుకి సంబంధించినది. బహుశా ఈ కారణం చేతనో లేదో ఇంకేదైనా కారణం చేతనో సాయికృష్ణ విజయవాడ వదిలి మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలో గత కొద్ది నెలలు నివసించాడు. తన మీద ఈ వారంట్లు ఉన్నాయి కాబట్టి కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుండి ఒక కానిస్టేబుల్, ఎన్టీఆర్ పోలీస్ కమీషనరేట్ టాస్క్ ఫోర్స్ నుండి ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఇద్దరు కానిస్టేబుల్స్ మే 6 ఉదయం మూడు గంటలకి తనని మార్కాపురంలో అరెస్ట్ చేసి, ఉదయం 7 గంటలకి కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చారు.
ఇలా తీసుకువచ్చిన ఒకటి రెండు రోజులకి ఈ విషయం తన తల్లి అయిన గాదె విజయలక్ష్మికి తెలిసింది. ఆవిడ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి తన కొడుకుని విడిచిపెట్టమని వేడుకుంది. కుటుంబసభ్యులు వచ్చినంత మాత్రాన విడిచిపెట్టాలి అని చట్టంలో ఉంది అని ఇక్కడ చెప్పటం లేదు కానీ, అలా వచ్చి అడిగినప్పుడు ఆ ముద్దాయి వివరాలు మాత్రం తన కుటుంబసభ్యులకి తెలియచేయాలి. అది కనీస నియమం, హక్కు కూడా. అయితే అవన్నీ తుంగలో తొక్కుతూ కృష్ణలంక స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్. వి. వి. నాగరాజు ఒక సారేమో సాయికృష్ణ ఎవరో తనకి తెలియదని, ఇంకొకసారేమో సాయికృష్ణని కాటికి పంపటం తధ్యం అని, తనకి దిక్కున్న చోట చెప్పుకోమని తల్లిని బెదిరించడం, అవమానించడం చేశాడు. విజయలక్ష్మి భయంతో, ఆందోళనతో న్యాయవాది అయిన తన సోదరి కనకదుర్గని తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. మళ్ళీ అదే అహంకారపూరిత జవాబు. దీని తరువాత కనకదుర్గ కొంతమంది న్యాయవాదులని తీసుకుని వెళ్ళింది. వాళ్ళకి కూడా అదే జవాబు. వెరసి నా స్టేషన్, నా ఇష్టం, నా లాఠీ, నా సత్యం అన్నట్టు ప్రవర్తించాడు. ఈ మధ్యలో విజయలక్ష్మి స్టేషన్లో తన కొడుకు గాయాలతో ఉండటం, తన కేకలు వినటం కూడా జరిగింది.
ఆ తరువాత కొన్ని రోజులకి సాయికృష్ణ స్టేషన్ లో కనిపించడం కూడా మానేశాడు. అంటే ఏమయ్యాడో తెలియదు. అడిగితే జవాబు లేదు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో 60 మంది సిబ్బంది ఉన్నారు. ఒక్కరంటే ఒక్కరికీ కూడా తెలియకపోవటం అంటే, అందులోనూ పోలీసులకి తెలియకపోవటం అంటే ఎవ్వరూ నమ్మరు. నమ్మవలసిన అవసరం కూడా లేదు. ఇటువంటి విషయాలలో పోలీసుల మాటలు నమ్మేవాళ్ళు అమాయకులైనా అయ్యి ఉండాలి లేదా అదే నిజం అని నమ్మితే తప్ప ఉండలేని నిస్సహాయులైనా అయ్యి ఉండాలి. అయితే విజయలక్ష్మి అంత అమాయకురాలు కాదు, అంత నిస్సహాయురాలూ కాదు. తన సోదరులు కుల సంఘాలలో నాయకులుగా ఉన్నారు. వారి మద్ధతుతో ఈ విషయం గురించి ప్రశ్నలు లేవనెత్తుతూ హై కోర్ట్ లో జూన్ 2 నాడు హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలు చేసింది. హెబియస్ కార్పస్ అంటే సదరు వ్యక్తిని ప్రవేశపెట్టండి అని. అప్పుడు హై కోర్ట్ కి సెలవలు. అయితే సెలవలప్పుడు కూడా అత్యవసర కేసులు వినటానికి కొంతమంది న్యాయమూర్తులు ఉంటారు. వెకేషన్ బెంచ్ అంటారు వాళ్ళని. అటువంటి వెకేషన్ బెంచ్ దగ్గరికి ఈ కేసు వచ్చింది. ప్రభుత్వం/పోలీసుల తరుపున అడ్వకేట్ జనరల్ వచ్చి ఈ విషయం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సమయం కావాలి అని అన్నాడు. జూన్ 15 కి మళ్ళీ ఈ కేసుని వేశారు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. అడ్వకేట్ జనరల్ అంటే రాష్ట్రంలో అతి పెద్ద న్యాయ అధికారి. ప్రభుత్వానికి చాలా ముఖ్యమైన కేసులలోనే అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తారు. ప్రతి కేసుకి అడ్వకేట్ జనరల్ రారు. రోజువారీ కేసులకి సంబంధించి గవర్నమెంట్ ప్లీడర్ లేదా సహాయ గవర్నమెంట్ ప్లీడర్ ఉంటారు. హెబియస్ కార్పస్ కేసులకి చాలా వరకు ఈ గవర్నమెంట్/సహాయ గవర్నమెంట్ ప్లీడర్లే ప్రభుత్వం/పోలీసుల తరుపున వాదనలు వినిపిస్తారు. అటువంటిది ఈ కేసులో, అందులోనూ సెలవ రోజులలో, అడ్వకేట్ జనరల్ వచ్చి సమయం కోసం అడిగారు. బహుశా అప్పుడే కొన్ని విషయాలు అర్థం అయ్యుండాల్సింది.
అదలా ఉండగా, అప్పటికే సాయికృష్ణని కృష్ణలంక సర్కిల్ ఇన్స్పెక్టర్, పోలీసులు మాయం చేశారు అనే వార్త వ్యాప్తి చెందింది. సాయికృష్ణ ఎక్కడ అనే ప్రశ్న ఊపందుకుంది. ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. ఈ ప్రశ్నలకి కనీసం జవాబు చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. ఒక ప్రముఖ దినపత్రికలో నేర వార్తల బీట్ విలేఖరి మాటల్లో చెప్పాలంటే, ‘ఎన్టీఆర్ పోలీస్ కమీషనర్ కార్యాలయం నుండి రోజూ పనికిరాని పత్రికా ప్రకటనలు వస్తూనే ఉంటాయి. అయితే ఈ విషయం గురించి మాత్రం కనీసం మాట వరసకయినా ఉలూకూ పలుకూ లేదు.’ మామూలుగా అయితే పోలీసుల మీద న్యాయమైన విమర్శ చేసినా కూడా ఒంటి కాలి మీద లేస్తారు. మమ్మల్నే అంటారా అని ఒక ఆగ్రహ ప్రకటన చేస్తారు. వీరినే కాదు ప్రభుత్వంలో ఎవరినైనా విమర్శించే హక్కు ఎవరికైనా ఉంటుంది అనే విషయం వీరికి తెలిసినా తమకి సంబంధం లేదనట్టు వీరి ప్రవర్తన ఉంటుంది అనేది వేరే విషయం. అటువంటి పోలీసులు ఇంత తీవ్ర ఆరోపణకి సంబంధించి కనీసం ఖండన కూడా ఇవ్వలేదు. అలాగని మీ కొడుకు సురక్షితంగానే ఉన్నాడు అనే ప్రకటన కూడా చేయలేదు. బహుశా ఇక్కడ కూడా మరిన్ని విషయాలు అర్థమయ్యి ఉండాలి.
ఇదిలా నడుస్తూ ఉండగా, జూన్ 15 వచ్చింది. ఆ రోజు సహాయ గవర్నమెంట్ ప్లీడర్ వచ్చి సాయికృష్ణ ఆచూకీ ఇంకా దొరకలేదు అని, తన కోసం బృందాలు గాలిస్తున్నాయని హై కోర్ట్ కి తెలియచేశాడు. ఈ విషయాన్ని ఆయన లిఖిత రూపంలో ఇవ్వలేదు. మౌఖికంగానే తెలియచేశాడు. కోర్ట్ కూడా మీ మీద ఈ ఆరోపణలులు వస్తున్నాయి కదా, దాని మీద మీ జవాబు ఏమిటి అనే అడిగే ప్రయత్నం చేయలేదు. జూన్ 29 వరకు సమయం ఇచ్చింది. అంతలోకి సాయికృష్ణను కృష్ణలంక పోలీసులు హత్య చేసి, మృతదేహాన్ని తగాలబెట్టేశారు అనే ఆరోపణలు ఊపందుకున్నాయి. ఈ తీవ్రమైన ఆరోపణకి కూడా పోలీసుల జవాబు మౌనమే. ప్రజలు, మీడియా కూడా ‘సాయికృష్ణ ఎక్కడ?’ అనే ప్రశ్న వేయటం మొదలుపెట్టారు. ప్రతిపక్షం కూడా ఈ విషయం మీద ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించడం మొదలుపెట్టింది. అయితే ప్రతిపక్షం ఈ విషయాన్ని ఒక హక్కుల కోణంలో కాకుండా ఒక కుల కోణంలో ప్రశ్నించడం మొదలుపెట్టింది. కాపు కులానికి చెందిన వ్యక్తి కాబట్టే కూటమి ప్రభిత్వం ఈ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తుంది అని ప్రతిపక్షం ఆరోపణలు చేసిన తరువాతనే ప్రభుత్వం కదిలింది. ముందుగా నాగరాజుని వేకెన్సీ రిజర్వ్ కి పంపింది. ఆ తరువాత సస్పెండ్ చేసింది. ప్రభుత్వం కదిలాకానే ప్రభుత్వ అనుకూల పత్రికలు, ఛానళ్ళు దీని గురించి రాయటం, చెప్పటం మొదలుపెట్టాయి. జూన్ 19 నాడు విజయలక్ష్మి నాగరాజు మీద ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుని అనుసరించి తన మీద హత్య నేరం, అక్రమంగా ఒక వ్యక్తిని నిర్బంధించిన నేరం, సాక్ష్యాలు ధ్వంసం చేసిన నేరం కింద కేసు కట్టారు. ముందుగా ఒక సహాయ పోలీస్ కమీషనర్ స్థాయి అధికారిని విచారణ అధికారిగా నియమించారు. విమర్శలు తీవ్రం అవ్వడంతో ఒక ఇన్స్పెక్టర్ జనరల్ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. వారు విచారణ మొదలుపెట్టాక తెలిసింది ఏమిటంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిసిటివి రికార్డింగ్ మొత్తాన్ని ముందే తొలగించారు అని. అక్కడైతే తొలగించారు కానీ, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో రికార్డింగ్ ఉండే అవకాశం ఉంది కదా అనే ప్రశ్న మీద ఈ బృందం ఇప్పటివరకు మౌనంగా ఉంది. విచారణ కొనసాగుతున్నది. మొత్తానికి జరిగినది అంటే, ఒక వ్యక్తిని అక్రమంగా నిర్బంధించి, పాశవికంగా హింసించి, హత్య చేసి, మృతదేహాన్ని కూడా మాయం చేశారు. తదుపరి ఎప్పుడైనా పోలీసులు ఆగ్రహ ప్రకటన చేస్తే కనుక ఈ విషయాన్ని గుర్తు చేస్తే సరిపోతుంది. పాశవిక హంతకులకి ఈ పోలీసులకి తేడా ఏమిటో మరి వారే చెప్పాలి. ఎన్కౌంటర్లు నేరాలు తగ్గిస్తాయి అని మనస్పూర్తిగా నమ్మే పోలీసులు మరి ఇటువంటి పోలీసు నేరాలు తగ్గించటానికి ఏమి చేయాలో కూడా సెలవిస్తే ఇంకా బాగుంటుంది. నాగరాజు ఇప్పుడు రాజమండ్రి కేంద్ర కారాగారంలో న్యాయస్థానం కస్టడీలో ఉన్నాడు.
ఇప్పుడు ఇదే నాగరాజు బలి తీసుకున్న మరొక వ్యక్తి గురించి చూద్దాం. పేరు పేరుపోగు క్రాంతి కుమార్. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో లబ్బీపేతా నివాసి. వయసు 42 సంవత్సరాలు. మాదిగ కులానికి చెందిన వ్యక్తి. వృత్తి క్యాబ్ డ్రైవర్. ముగ్గురు సంతానంలో ఒకడు. తన తండ్రి పేరుపోగు వేంకటేశ్వర రావు మాదిగ సామాజిక/రాజకీయ/విప్లవ ఉద్యమాలకి సుపరిచితుడు. బహుశా ఆ నేపధ్యంలోనే కొడుక్కి క్రాంతి అనే పేరు పెట్టి ఉండవచ్చు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు. క్రాంతి కుమార్ మీద కూడా వివిధ రకాల కేసులు ఉన్నాయి. గతంలో రౌడీ షీట్ తెరిచి, ఆ తరువాత సస్పెక్ట్ షీట్ లో పెట్టారు. ఇప్పుడిప్పుడే జీవితాన్ని గాడిలో పెట్టుకుంటున్నాడు. పోనీ వీటితో ఏమైనా సంపాదించాడా అంటే బందరు కాలువ గట్టున రెండు చిన్న గదుల ఇంట్లో నివాసం.
అయితే ఆకస్మాత్తుగా మే 21 నాడు క్రాంతి కుమార్ నీలి రంగు గుళికల మందు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. తన పోస్ట్ మార్టం నివేదికలో కూడా తన కడుపులో నీలి రంగు పొడి ఉంది అని నిర్ధారణ అయ్యింది. తన ఆత్మహత్యని సెల్ఫీ వీడియోలో రికార్డ్ చేశాడు. నాగరాజు పెట్టే వేధింపులు తట్టుకోలేకపోతున్నాను అని, తన కులం కారణంగా కూడా ఆ వేధింపులు తీవ్రంగా ఉంటున్నాయని, ఈ వేధింపులు భరించటం ఇక తన వల్ల కాదు అనేది ఆ వీడియో సారాంశం. అయితే ఆ వీడియో బయటకి రాలేదు. కృష్ణలంక పోలీసులు ఆత్మహత్య కేసుగా నమోదు చేశారు. తన తండ్రికి కూడా ఈ వేడియో గురించి తెలియలేదు. అయితే కొన్ని రోజుల తరువాత ఈ వీడియో గురించి తన తండ్రికి తెలిసింది. నాగరాజు మీద ఫిర్యాదు చేస్తే పోలీసులు ఆ ఫిర్యాదు తీసుకోవటానికి కూడా ఒప్పుకోలేదు. అయితే ఏ రోజయితే నాగరాజు సాయి కృష్ణ విషయంలో సస్పెండ్ అయ్యాడో, ఆ రోజు ఈ వీడియో బయటకి వచ్చింది. అప్పటికాని ధైర్యం వచ్చినట్టు లేదు.
నాగరాజు సాయి కృష్ణ, క్రాంతి కుమార్ లాంటి వాళ్ళన్నీ తన పనులకి వినియోగించుకుంటాడు అనేది ఆ ప్రాంతంలో బహిరంగ సత్యం. తను చెప్పిన పనులు చేయకపోతే వాళ్ళని తీవ్రంగా వేధిస్తాడు అనేది కూడా అంతే బహిరంగ సత్యం. క్రాంతి కుమార్ ఇంటికి పలు మార్లు కానిస్టేబుల్స్ ని పంపించి బెదిరించడం, పోలీస్ స్టేషన్ కి పిలిపించింది వేధించడం జరిగాయి. ఒక స్థాయి వరకు క్రాంతి కుమార్ భరించాడు. ఇక భరించలేను అనుకున్నప్పుడు తన ప్రాణం తీసుకున్నాడు. తీసుకున్నాడు కన్నా నాగరాజు తీసుకునేలా ప్రేరేపించాడు అనటం న్యాయబద్ధంగా ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి కేసు పెట్టలేదు. సాయి కృష్ణ కేసులో వచ్చిన ఆగ్రహ జ్వాల ఈ కేసులో మచ్చుకైనా లేదు. అన్యాయాన్ని ప్రశ్నించడానికి కూడా కులం ఒక ప్రాతిపదిక అనేదానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ.
ఇక మూడవ కేసు కోసం కర్నూలు జిల్లా కౌతాళం మండలం బదినేహల్ గ్రామానికి వెళ్ళాలి. అక్కడ గంగమ్మ. బేగరీ కులానికి చెందిన వ్యక్తి. తనకి వీరేంద్ర అనే 1 సంవత్సరాల కొడుకు ఉన్నాడు, దర్గయ్య అనే ప్రియుడు ఉన్నాడు. తన కొడుకు వీరేంద్ర తప్పిపోయాడు అని నవంబర్ 2024 లో గంగమ్మ కౌతాళం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆ కేసు విచారణలో ఏమీ తేలలేదు. కొడుకూ దొరకలేదు. తన కొడుకు కేసుకి సంబంధించి పోలీసుల విచారణ సరిగ్గా లేదని, విచారణని సిబిసిఇడి లాంటి సంస్థకి అప్పగించమని హై కోర్ట్ లో ఏప్రిల్ 2025 లో కేసు దాఖలు చేసింది. దానికి సంబంధించి మే 2026 లో కోర్ట్ తీర్పునిస్తూ ఈ కేసు విచారణ కోసం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారి నేతృత్వంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయమని హై కోర్ట్ డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ను ఆదేశించింది. గుంటూరు అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయిన సుప్రజ అనే అధికారి నేతృత్వంలో ఆ బృందాన్ని 13 సభ్యులతో ఏర్పాటు చేశారు.
అయితే ఈ బృందం పని విచారణ “చూసిరమ్మంటే కాల్చివచ్చారన్న” విధంగా ఉంది. గత కొంత కాలంగా గంగమ్మ, దర్గయ్య మధ్య వివాహేతర సంబంధం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. గంగమ్మ కొడుకు వీరేంద్ర దానిని వ్యతిరేకించినందుకే గంగమ్మ, దర్గయ్యలు వీరేంద్రను చంపారన్న ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తు బృందం పోలీసులు గంగమ్మ, ఆమె ప్రియుడు దర్గయ్యలే వీరేంద్రని హత్య చేశారని తమ విచారణలో తేల్చారు. అయితే వారు వీరేంద్ర శవాన్ని ఎక్కడ పూడ్చి పెట్టారని తెలుసుకోవడానికి గంగమ్మ, దర్గయ్యలను తీవ్రమైన చిత్రహింసలకు గురిచేశారు. ఆ క్రమంలోనే గంగమ్మ మృతిచెందగా, దర్గయ్య పోలీసుల పహారా మధ్య ప్రభుత్వ ఆసుపత్రిలో చావు బతుకులమధ్య పోరాడుతున్నాడన్నది వాస్తవం.
అలా ఎందుకు అంటున్నామంటే అనేక కారణాలు ఉన్నాయి. పోలీసుల అదుపులో ఉన్న గంగమ్మ అనారోగ్యం కారణంగా మృతిచెందడం వాస్తవమైతే, ఆమె శవానికి పోస్టుమార్టం చేయవలసిన అవసరం ఉంటుందా? ఆమెను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చకుండా, మే 31, శనివారం సాయంత్రం అంబులెన్సులో తీసుకొనివెళ్లి కర్నూలు కిమ్స్ ఆసుపత్రికి ఎందుకు చేర్చినట్టు ? ఆమె అక్కడ జూన్ 1, ఆదివారం ఉదయం 7 గం లకు మృతిచెందగా, వారు 1 టౌన్ పోలీసుస్టేషన్, కర్నూలులో కేసును నమోదుచేసి, పోస్టుమార్టం చేయించారు. ఆమె ఒంటిమీద గాయాలను డాక్టర్స్ ఎంతమాత్రం సవ్యంగా రికార్డుచేసి ఉంటారన్నది సందేహమే! అంతే కాక గంగమ్మ శవానికి అంత్యక్రియలకు ముహూర్తం జూన్ 01 జూన్ తేదినే జరపాలన్నది దర్యాప్తు బృందం పోలీసులే నిర్ణయించారు. అంత్యక్రియలకు తరపున బంధువులు వచ్చారో, లేదో తెలియదు కాని, దానికి దర్యాప్తు బృందం పోలీసులతో పాటు, స్థానిక పోలీసులు 20 – 30 మంది అదేరోజు సాయంత్రం 5.30 గంలకు బదినేహాల్ చేరుకొని 7 గంల కల్లా శవాన్ని పూడ్చి పెట్టడం జరిగింది. గంగమ్మ చావుకు దర్యాప్తు పోలీసుల ప్రమేయం లేకుంటే, వారే గంగమ్మ శవానికి దగ్గరుండి అంత్యక్రియలకు హడావిడిగా జరపవలసిన అవసరం ఏముంది? అదే విధంగా దర్యాప్తు బృందం పోలీసుల కథనం ప్రకారం దర్గయ్య బైక్ మీద నుండి కిందపడిన కారణంగానే దెబ్బలు తగిలాయి. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో దర్గయ్య తనకు తగిలిన దెబ్బలకు చికిత్సకోసం చేరడం వాస్తవమైతే, దర్గయ్యను ఎవరినీ కలవనీయకుండా పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు? వీటిల్లో ఏ ఒక్కదానికి నేటి వరకు ఆ దర్యాప్తు బృందం పోలీసులు కానీ, స్థానిక పోలీసులు కానీ, ప్రభుత్వం కానీ జవాబు ఇవ్వలేదు. ఇక్కడ కూడా మొత్తం మౌనమే.
ఈ మూడు కూడా గత నెల రోజులలో జరిగినవి. ఇక గత రెండు సంవత్సరాల విషయం తీసుకుంటే అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కులవర్ధన్ అనే వ్యక్తి పోలీసులు తీసుకువెళ్తుంటే తప్పించుకోబోయి చెరువులో పడి చనిపోయాడు. అచ్చు గుద్దినట్టు అదే విధంగా కాకినాడ జిల్లా తునిలో నారాయణరావు అనే ముసలి వ్యక్తి కూడా అలాగే పోలీసులు తీసుకువెళ్తుంటే చెరువులో పడి చనిపోయాడు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో హుస్సేన్ అనే వ్యక్తి పోలీ స్టేషన్లోనే చనిపోయాడు. వీళ్ళు ముగ్గురూ కూడా పోక్సో కేసులో నిందితులు. ఈ కేసుల్లో నిందితులే చెరువులో ఎందుకు పడుతున్నారు అంటే కేసు విచారణ చేసి, శిక్ష వేయించడం కన్నా కూడా చెరువులో శవంగా తేల్చడం తేలిక కదా. చేతిలో తుపాకీ ఉంటే చట్టాలు, న్యాయస్థానాలు, విచారణాలు ఎందుకు అని పోలీసుల ఉద్దేశం కాబోలు.
పోలీసులు ఇలా చేస్తుంటే ప్రభుత్వం ఏమి చేస్తుంది అని అమాయకంగా అడగవచ్చు. ప్రభుత్వం ఏమి చేసినా చేయకపోయినా మీడియాలో, సామాజిక మాధ్యమలలో మాత్రం ఇవన్నీ సరైన పనులే అని ప్రచారం మాత్రం నిర్విరామంగా, అలుపు లేకుండా చేస్తుంది. సాయి కృష్ణ ను ఎందుకు చంపారు అంటే సాయి కృష్ణ రౌడీ షీటర్, క్రాంతి కుమార్ ను ఎందుకు వేధించి ఆత్మహత్యకి పురిగొల్పారు అంటే అటువంటి వాళ్ళకి ఎర్ర తివాచీ పరచాలా? న్యాయస్థానాల్లో శిక్ష వేయించటం న్యాయం అంటే మీ ఇంట్లో జరిగితే తెలుస్తుంది బాధ. ఇవి జవాబులు.
కష్టోడియల్ హత్యలు హీనాతిహీనమైన చర్యలు అని సుప్రీం కోర్ట్ ఒప్పుకుని, పేర్కొని కూడా దశాబ్దాలు అవుతుంది. ప్రభుత్వం కూడా ఒప్పుకుని దశాబ్దాలు అవుతుంది. అందుకే ప్రతి కష్టోడియల్ మరణానికి సంబంధించి ఒక జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ చేత విచారణ జపించాలి అని సి ఆర్ పి సి లో 2 దశాబ్దాల క్రితమే చేర్చారు. ప్రస్తుతం బి ఎన్ ఎస్ ఎస్ లో అది సెక్షన్. 196(2) లో ఉంది. కష్టోడియల్ మరణం గురించి తెలియగానే జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ తక్షణమే విచారణకి పూనుకోవాలి. అది తప్పనిసరి.
అలాగే అనేక తీర్పులలో సుప్రీం కోర్ట్ కానీ, ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ తో సహా అనేక హై కోర్ట్ లు కానీ, ఇతర కోర్ట్ లు కానీ కష్టోడియల్ మరణాలని తప్పుబడుతూ తీర్పులు ఇచ్చాయి. తాజా ఉదాహరణ తమిళనాడులో జయరాజ్, బెనిక్స్ అనే తండ్రీ కొడుకులని 2020 లో కస్టడీలో హత్య చేసిన పోలీసులకి మధురై జిల్లా కోర్ట్ ఈ సంవత్సరం మార్చ్ లో మరణ శిక్ష విధించింది. మరణ శిక్షను సూత్రప్రాయంగా వ్యతిరేకిస్తూనే కస్టడీ హత్యలలో పోలీసుల మీద హత్యా నేరం పెట్టి, విచారణ చేయటాన్ని స్వాగతించాలి.
ఆంధ్ర ప్రదేశ్ విషయంలో కనీసం జ్యుడీషియల్ విచారణ జరిగిన దాఖలా కూడా లేదు. సాయికృష్ణ మరణానికి సంబంధించి జ్యుడీషియల్ విచారణ కోసం విజయవాడ కోర్ట్ లో పిటీషన్ దాఖలు అయ్యింది. తప్పనిసరిగా చేయవలసిన విషయం గురించి కూడా పిటీషన్ దాఖలు చేయడం అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారిక హింసకి మౌనంతో లేదా మద్దతుతో ఆమోదముద్ర ముద్ర వేయటం అంటే మన హక్కులని మనమే కాలరాసుకోవటం అవుతుంది, వారి హింసాత్మక పాలనకి మనమే పునాదిగా మారటం జరుగుతుంది. ఈ విషయంలో చేయవలసిన కృషి మాత్రం చాలానే ఉంది.
గుత్తా రోహిత్
మానవ హక్కుల వేదిక (HRF)




