‘ఈళ్ళను కూడా పట్టుకుపొండి. మాకు మీ సామాన్లు అక్కర్లా. నా పిల్లను చంపి సామాన్లు పడేసి పోయారు. నాకు నా పిల్ల కావాలి. పిల్లను చంపిన పోలీసులు, డి.ఆర్‌.జి. గుండాలను ఎంటనే శిక్షించాలి’ ఖరాఖండిగా అన్నాడు బామన్‌ సోడి.

మాసే, బామన్‌ మంగ్లి తల్లిదండ్రులు.

‘మేం చంపలేదు’ పోలీసులు.

‘ఆరోజు దీదీని తరిమింది నువ్వేగా!

నీకు తల్లి లేదా? చెల్లె లేదా? నీకు పిల్లల్లేరా? ఈ నొప్పి నీకు తెలియటంలా?’ మనుకు.

‘నేం కాదు’ పోలీసు.

‘నువ్వొచ్చావ్‌’ పింకీ.

‘రాలేదు’ పోలీసు.

‘నువ్వొచ్చావ్‌? నువ్వొచ్చావ్‌? నువ్వొచ్చావ్‌?’

‘మీరు రాలేదు, మరి ఆ రోజు ఎవరొచ్చారు?’ పింకీ.

‘వేరే. వేరే టీమ్స్‌’ పోలీసులు.

‘మీర్లేరా? మీ మనుషులేగా చంపింది. చంపండి. ఈళ్ళను కూడా. ఇదిగో పట్టుకుపొండి’ ముగ్గురు పిల్లల్ని చూపిస్తూ కట్టలు తెంచిన కోపంతో సుఖరామ్‌.

‘బదులుకు బదులివ్వాలి’ పింకీ.

‘చంపినోళ్ళకు శిక్ష పడాల్సిందే’ సోమ్లి.

‘అవును’ ముక్తకంఠంతో అక్కడ జమైన అందరూ.

ఒకపక్క ముదువెండి చుట్టుపక్కల నుంచి వచ్చిన 15 వేల మంది ప్రజలు.

చుట్టూ ఫెన్సింగుతో. ఇంకోపక్క పోలిసులు, డి.ఆర్‌.జి. గుండాలు. అయినా ప్రజల మీటింగు ఆగలేదు. నినాదాలు ఆగలేదు. తమ న్యాయమైన డిమాండ్‌తో జిల్లాముఖ్య కేంద్రానికి బయల్దేరారు. మార్గమధ్యంలో వారిని పోలీసులు అడ్డగించారు. చుట్టూ పెద్ద, పెద్ద మొద్దులు, ఫైన్సింగ్‌తో ఎవర్నీ కదలనీయకుండా. ఒక కాశ్మీర్‌నో మణిపూర్‌నో తలపించే విధంగా.

ఇంతలో ఒక విలేకరి అక్కడికి చేరుకున్నాడు. తనదైన భాషలో…

‘నక్సలైట్లు చేసిన క్రాస్‌ ఫైరింగులో పిల్ల చనిపోయిందని పోలీసులు అంటున్నారు గదా! వాస్తవం తెలిసి కూడా వెటకారపు ప్రశ్న వేసేటప్పటికీ జనానికి చిర్రెత్తుకొచ్చింది.

‘నక్సలైట్లు లేరూ, ఎవరూ లేరు, మొత్తం జనమే ఉన్నారు’ కోపంతో అన్నాడు మంగ్లి అన్న.

‘పోలీసులు చెప్పేదే నమ్ముతారా?’ జనం మధ్యలో నుండి పింకీ.

‘ఆ…’ అంటూ తటపటాయించాడు విలేకరి.

‘ఆ…ఏంది? పోలీసులే ఫైర్‌ చేసి మా పిల్లను చంపి ‘ఎవరో చంపారని కట్టుకథ చెప్తారు. అసలు ఇప్పటి వరకు తల్లి నుంచి రిపోర్ట్‌ ఎందుకు తీసుకోలేదు. ఘటన జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షులు నలుగురున్నారు. ఆ నలుగురిలో నేను కూడా ఉన్నాను. నా దగ్గరి నుంచి కూడా తీసుకోలేదు. ఇదిగో వీడు నా తమ్ముడు. ఫైరింగ్‌ శబ్దం విని కంగారుగా పరుగెత్తుకొస్తుంటే మధ్యలో పోలీసులు పట్టుకొని చావబాదారు. అయినా వీడు ఉరికొచ్చాడు. రక్తపు మడుగులో ఉన్న తల్లి, పిల్లను చూశాడు. వీడి దగ్గర్నుంచి రిపోర్ట్‌ తీసుకోలేదు. పోలీసులే చంపారు, పోలీసులే రిపోర్ట్‌ ఇచ్చారు’ ఆవేశంగా పింకీ.

‘అసలు తల్లి కదా! ప్రత్యక్ష సాక్షి. ఆమె దగ్గర్నుంచి రిపోర్ట్‌ ఎందుకు తీసుకోలేదు?’ పరిమళ.

‘జరిగింది బయట పడుతుందని’ సోమారి.

‘ఒకపక్క పిల్ల చనిపోయిన పుట్టెడు దుఃఖంతో ఉంటే, తల్లిదండ్రులను హాస్పటల్‌ పేరుతో బంధించారు’ పరిమళ.

‘తనకు గాయాలయ్యి, ఇంటి దగ్గర పిల్లలు ఏమయ్యారో అని దిగులుతో ఉంటే?’ అన్నది లక్కు.

‘ఇదంతా హాస్పిటల్‌ పేరుతో ఆడుతున్న పోలీసుల నాటకం. నిజం ఎక్కడ బయటపడుతుందేమోన’ని ఆవేశంగా పింకీ.

ఒకరి తర్వాత ఒకరు అందుకొనేటప్పటికి విలేకరికి ప్రశ్నలేవీ దొరకడం లేదు. అయితే, ‘మీరు ఈ పోరాటాన్ని ఆపరా? అన్నాడు విలేకరి.

‘ఆపం, మా డిమాండ్స్‌ తీరేదాక’ తెగేసి చెప్పారు జనం.

‘పిల్లను చంపినోళ్ళకు శిక్ష పడేంత వరకు’ ఖచ్చితంగా చెప్పింది పింకీ.

‘మా అడవి, మా భూములు మాకు దక్కేంత వరకు’ సుపారామ్‌.

జనం నుంచి వచ్చిన జవాబుకు విలేకరి అక్కడ్నుంచి నిష్క్రమిస్తుండగా, ఒక దృశ్యం అతని కంట కనపడిరది. మూడు, ఐదు సంవత్సరాల పిల్లలు గుంపులు, గుంపులుగా కూర్చున్నారు. మంగ్లి ఫోటో ఉన్న ప్లే కార్డులతో. కొద్దిమంది పిల్లలు తమ బుల్లి, బుల్లి గొంతుతో నినాదాలిస్తూ. కొద్దిమంది అవతల ఉన్న మరొక పిల్లల గుంపు దగ్గరికి బుడి, బుడి నడకలతో పరుగెడుతున్నారు. ప్లే కార్డులు పట్టుకొని.

ఒద్దికగా కూర్చుని నినాదాలు ఇస్తున్న బుదిరిపై దృష్టి పడిరది విలేకరికి. దగ్గరకువెళ్ళి…

‘ఏం పేరు పాపా?’

‘బుదిరి’.

‘ఈ ఫోటో ఎవరిది?’

‘మా మంగ్లిది’.

‘నువ్వు చిన్న పిల్లవి, ఎందుకొచ్చావ్‌?’

‘మా మంగ్లిని చంపారుగా!!

‘ఎవరు?’

‘వాళ్ళే’ అక్కడే ఉన్న పోలీసులను, డి.ఆర్‌.జి. గుండాలను సూటిగా చూపిస్తూ.

ఠక్కున లేచింది రూపి. రూపికి ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువే ఉంటాయి. ఉన్నపిల్లల్లో తనే పెద్దది.

‘మొన్న మేం ఆడుకొనే చెట్టును నరికేశారు. పెద్ద మిషనొచ్చి మేం కట్టుకున్న ఇల్లును కూల్చేసింది. మేం వంట వండుకొనే లక్క పిడతలన్నింటిని పగులగొట్టింది. ఇప్పుడు మా మంగ్లిని చంపేశారు.

‘ఇప్పుడేం కావాలి?’’

‘మంగ్లి మాక్కావాలి. మేం ఆడుకొనే జాగా కావాలి, మేం ఆకు కూరని తెంపుకొనే మొక్కలు కావాలి, మాకు నీడనిచ్చే చెట్లు కావాలి’.

‘మా బతుకు మేం బతుకుతాం. మమ్మల్ని బతకనివ్వండి. అందరిలా బతకాలనిమాకు ఉంది’ ఐదు సంవత్సరాల రీతా.

బుదిరి, రీతా మాట్లాడిన వెంటనే పిల్లలందరూ ‘ఇంగో’ అన్నారు.

‘మమ్మల్ని చంపొద్దు. మాకూ బతకాలని ఉంది. అమ్మ ఒడిలో ఆడుతూ, పాడుతూ…’ బుదిరి.

విలేకరికి నోట మాట రాలేదు. పిల్లల్ని రకరకాలుగా ప్రశ్నలేద్దామనుకొన్నాడు. కానీ పిల్లలే విలేకరిని జవాబు చెప్పమని ప్రశ్నించారు. పిల్లలడిగిన ప్రశ్నలకు విలేకరి దగ్గర జవాబులు లేవు.

జనవరి ఒకటి నూతన సంవత్సరం రోజే బి,జె.పి. డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం, ఎంగిలి మెతుకులకు ఆశపడే పోలీసులు, డి.ఆర్‌.జి. గుండాలు బీజాపూర్‌ జిల్లా ముడువెంది గ్రామంలో సాయంత్రం నాలుగంటల సమయంలో ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తల్లి ఒడిలో సేద దీరుతున్న ఆరునెలల పసిపాప సోడి మంగ్లి ప్రాణం అనంత వాయువుల్లో కలిసి పోయింది. తల్లి సోడి మాసే చేతి వేళ్ళు తెగి పోయాయి. కాల్పుల శబ్దం విని పరుగెడుతున్న తండ్రి సోడి బామన్‌కు గాయాలయ్యాయి. ఇదీ జరిగింది. కానీ ఈ పుటనను బీజాపూర్‌ ఎస్‌.పి. ఒక కథ అల్లి జనాన్ని, దేశాన్నే మభ్యపెట్టటానికి ప్రయత్నించాడు.

హృదయ విదారకంగా ఉన్న ఈ పటన అన్ని సెక్షన్ల ప్రజలను కదిలించింది. ఎస్‌.పి. చేస్తున్న ప్రచారం కట్టు కథ అని, కావాలనే పొలీసులు ప్రజలను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారని, తమకు న్యాయం కావాలని ఉద్యమిస్తున్నారు. ఈ ఉద్యమం బస్తర్‌ సంభాగ్‌లోని వెచ్చపాల్‌ పూండ్రి, ముడహనార్‌, ఓర్చా, ఇరుకబట్ట్టి, తోయమెట్ట, తోడుగట్ట, వెచ్చఘాట్‌, నందిచువ్వలలోనే కాకుండా ఉత్తర ఛత్తీస్‌ఘడ్‌్‌ లోని హసదేవ్‌..అలా దేశవ్యాప్త ఉద్యమమైంది. జ్వాలలా ప్రజ్వలిస్తున్న ఉద్యమాన్ని చల్లార్చటానికి ఆయా పార్టీల మంత్రులు, వారి మీడియా ప్రయత్నించింది. కానీ ప్రజల తెగువ ముందు వారి ప్రలోభాలేవీ పారలేదు.

ధర్నా స్థలం దగ్గరికి బీజాపూర్‌ ఎమ్‌.ఎల్‌.ఎ. విక్రమ్‌ మండావి వచ్చాడు. విలేకరి అడిగినట్టే పొంతన లేకుండా అడగటంతో జనంలో అలజడి లేచింది. కొద్దిమంది పళ్ళు పట పటా కొరుకుతున్నారు. కొద్దిమందికైతే ఈయనతో మాటలేంది? అన్నట్టున్నారు.

‘అబ్బో, ఇప్పుడొచ్చి అడుగతున్నాడు’ పన్నెండవ తరగతి చదువుతున్న ముఖేష్‌.

ఏదన్నా మాట్లాడితే మీద పడేటట్టున్న జనాన్ని చూసి ఎమ్‌.ఎల్‌.ఎ. గొంతు సవరించుకొన్నాడు. మెల్లగా మొదలెట్టాడు.

‘నేను అడిగేదానికి చెప్పండి. నేను కూడా ఘటన గురించి విన్నాను. పోలీసులు ఒక రకంగా చెప్పుతున్నారు. నేను వాళ్ళ మాట వినను. మీ మాట విందామనివచ్చాను’ తన వర్గ బుద్ధిని కప్పి పుచ్చుకొంటూ.

ఘటన మొత్తం సోమారు దాదా చెప్పాడు.

‘అలా అయ్యిందా!’ మొఖం నిండా ఆశ్చర్యాన్ని పులుముకొంటూ.

‘పిల్ల చనిపోయింది. తల్లి చేతి వేళ్ళు తెగిపోయాయి. హాస్పిటల్‌ పేరుతో తల్లిదండ్రులను డిమిర్‌పాల్‌ పట్టుకు పోయారు. ఒక రూమ్‌లో బంధించారు. ఏ ఒక్క విలేకరిని గానీ, సామాజిక కార్యకర్తను గానీ చివరికీ కుటుంబీకులను కూడా కలవనీయలేదు. ఇద్దరు, ముగ్గురు ఏవరన్నా కలవటానికి ప్రయత్నిస్తే కూడా వెనక్కి తోసేశారు.

‘ఇంటి దగ్గర పిల్లలున్నారు నన్ను పంపమని తల్లి ప్రాథేయపడిరది. అయినా కూడా పంపలేదు’ కోపంతో జుగ్గాయ్‌.

‘ఘటన జరిగిన రోజే ఒకటవ తారీఖున పిల్ల శవాన్ని, తల్లిదండ్రులను పోలీసులు పట్టుకుపోయారు. మూడవ తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు పిల్ల శవాన్ని తెచ్చారు. పోలీసులు, డి.ఆర్‌.జి. గుండాలే బలవంతంగా అంతిమ సంస్కారాలు చేశారు. మా సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం చేస్తామన్నాం గానీ వినలా’ సోమారు.

‘అయ్యోయ్యో కనీసం సాంప్రదాయాల ప్రకారం కూడా చేయలేదా?’ ఎమ్‌.ఎల్‌.ఎ. మొసలి కన్నీరు కారుస్తూ…

‘మా చెట్లను నరుకుతుంటే చూస్తా ఎలా ఊరుకొంటాం? చెట్లే మా దేవతలు.ఒక్కొక్క చెట్టుని మేం ఒక్కొక్క దేవతగా మొక్కుకొంటాం. అందుకే అడ్డం వెళ్ళాం. దానికి మా పిల్లనే బలి తీసుకొన్నారు. తూ….ఏం బతుకులురా మీవి? అన్నాడు మూడుకాళ్ళ మంగ్లు తాత.

‘ఇన్ని సంవత్సరాల నుంచి రోడ్డు గుర్తు రాలేదు. ఇప్పుడు గుర్తొచ్చింది. మరి క్యాంపేసేటప్పుడు, రోడ్డేసేటప్పుడు ఎందుకు రాలా నువ్వు? ఊరి జనాన్ని అడగాలిగా. పెసా చట్టపు గ్రామసభ చెపుతుందిగా. మీకవన్నీ ఉండవు. చట్టాలను మీ చేతుల్లోకి తీసుకొన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఆరు రోజులు తల్లిదండ్రులను హాస్పిటల్‌ పేరుతో పోలీస్‌ కస్టడీలో ఉంచారు’. అక్షరం ముక్క తెలిసిన ఐతవారీ దీది అన్నది.

‘నేను ఇప్పుడే రాయపూర్‌ వెళుతున్నాను. పెద్ద, పెద్దోళ్ళు కలుస్తారు. వాళ్ళతో మాట్లాడుతాను’ ఎమ్‌.ఎల్‌.ఎ అన్నాడు

‘వీడు వచ్చాడు చూడండి పెద్దమనిషి. ఇప్పుడొచ్చి అడుగుతున్నాడు. ఘటన జరిగి ఇన్ని రోజులయ్యాక, క్యాంపులు వచ్చినప్పుడు రాకుండా. మా అడవిని నాశనం చేస్తున్నారు. మా భూమిని, ఆఖరికి మమ్మల్ని కూడా. మా సంపదను కార్పొరేట్లకివ్వాలి. మమ్మల్ని చంపాలి’ ముఖేష్‌. మాట్లాడుతున్న ముఖేష్‌ కళ్ళుఎర్ర బడ్డాయి. నిప్పు కణికల్లా.

‘సహాయం అని చెప్పి ప్రజల్ని ఎంతోమందిని అరెస్టు చేశారు, మరెంతో మందిని జైల్లో వేస్తున్నారు. సహాయం అని ఊకదంపుడు మాటలూ.  ఈ పెద్దమనిషిని చూడండి. చదువుకొన్న వారికి ఉద్యోగాలు లేవు. జనమంతా కరువుతో చచ్చి పోతుంటేవారికి సహాయం ఇవరూ. కావడే గ్రామంలో క్యాంపు వేశారు. మూడు పుటనలు చేశారు. ఇంకా ఎంత మందిని చంపుతారు? కావడే గ్రామ పిల్లను కొట్టారు, పిల్లగాడ్ని జైల్లో పెట్టారు’ హాసరామ్‌ అన్నాడు.

‘పిల్లను చంపి ఏడు లక్షల రూపాయలిస్తాం అన్నారు. ఇవిగో ఈ బియ్యం, పప్పులు, ఉల్లిపాయలు, ఇగో బ్రాందీ సీసాలు పడేసి పోయారు పోలీసులు. ఇవి ఎవరిక్కావాలి? ఇదంతా రోడ్డు కోసం, బైలాడిల్లాి కోసం’ కోసి అన్నది.

‘విశ్వాసం – అభివృద్ది – రక్షణ. ఇవేగా మీరు మాట్లాడేది.

ఎవర్ని విశ్వసించాలి?

ఎవరికీ కావాలి అభివృద్ధి?

ఎవరి కోసం రక్షణ? చట్టాలనే వమ్ము చేసే విధానాలు.

మా అభివృద్ధే ముఖ్యమనుకుంటే మా అడవిని ఎందుకు నాశనం చేయాలి? మా భూముల్నెందుకు కాజేయాలి? మా రక్షణే ముఖ్యమనుకుంటే మమ్మల్నెందుకు చంపాలి? ఈ క్యాంపులు ఎందుకు? ఒక్క నెల్లోనే ఇన్ని క్యాంపులు? డిశంబర్‌ 8న పాలనార్‌, ఇరవై ఒకటవ తేదీన డిమిరిపాల్‌ – పాలనార్‌ మధ్య, ఇరవై ఎనిమిదవ తేదీన కావడే గ్రామంలో. ఈ క్యాంపులపై విశ్వాసంతో బతకాలా?

ఈ క్యాంపులొచ్చాక రాత్రి, పగలు తేడా లేకుండా మా మీద పోలీసుల బెదిరింపులు, దాడులు. ఆరుగాలం కష్టపడి సంపాదించుకొన్న డబ్బును దొంగిలించారు. ఎండ బెట్టుకొన్న మాంసం, చేపలను కూడా లూరీ చేస్తున్నారు. ఇంట్లో ఉన్న సామానూ చిందర-వందర చేశారు. మేం ఏం తినాలి? ఎట్టా బతకాలి? చివరికి కట్టుకొనే బట్టలను కూడా వదల్లేదు. పాలనార్‌ క్యాంపు వేసిన రోజే పద్దాదన్ను, పద్దా బుధరామ్‌ లను తోడశ గ్రామం నుంచి తాతి అశోక్‌, తాతి శంకర్‌ లనుపట్టుకొని కొట్టారు. పద్దా బుధరామ్‌ మేకను తిన్నారు. మూడు ఇళ్ళ నుండి రెండువందల యాభై గుడ్లను దొంగిలించారు. ఇళ్ళల్లో జొరబడి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారు. ఇన్ని జరుగుతున్నా నీకేం తెలియదా? కావడే గ్రామంలో క్యాంపు వేసిన పోలీసులు మరుసటి రోజే ముడువెంది వరకు రోడ్డును వేయటం మొదలెట్టారు. మేం అడగలేదుగా రోడ్డు కావాలని. దాని కోసం అడవిని నరుకుతున్నారు. భూములను నాశనం చేస్తున్నారు. అందుకే జనమంతా జమయ్యాం. మా అడవిని, భూములను నాశనం చేయొద్దని మిషన్లకు అడ్డం వెళ్ళాం. మమ్మల్ని కొట్టారు. విచ్చల విడిగా కాల్పులు జరిపారు. మంగ్లీ చనిపోయింది, తల్లి గాయాలయ్యింది. ఇవేం తెలియదా నీకు?’ జరిగిన సత్యాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్తున్నాడు అవినాష్‌.

అవినాష్‌ అడిగిన ప్రశ్నకు ఎమ్‌.ఎల్‌.ఎ. నోరు విప్పలేదు. కొద్ది సేపయ్యాక అది ఇది అని నాన్చుచుండగా జనంలో నుంచి…

‘మంగ్లి నూని (పాప)ని చంపిన పోలీసు, డి.ఆర్‌.జి. గుండాలను శిక్షించాలి’

‘పోలీసు బలగాలు వాపస్‌ పోవాలి’

‘పోలీసు క్యాంపులు తీసేయ్యాలి’

‘కొత్తగా నిర్మించ తలపెట్టిన క్యాంపులను తక్షణం నిలిపి వేయాలి’

‘ప్రజలపై పోలీసులు చేస్తున్న దాడులకు మూల్యం చెల్లించాలి’

‘కాంగ్రెసు, బి.జె.పి. పార్టీలే బాధ్యత పడాలి’

‘బి.జె.పి. డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం నశించాలి’

జనం నుండి డిమాండ్లు నినాదాల హోరు రూపంలో వచ్చేటప్పటికి చప్పుడు చేయకుండా వెనుదిరిగాడు ఎమ్‌.ఎల్‌.ఎ.

                                                                0              0              0

పసిపాప మంగ్లి పాశవిక హత్య వార్త విన్న వెంటనే…సరిగ్గా ఇరవై రెండుసంవత్సరాల కిందట ఖాకీల భీభత్సంలో అసువులు బాసిన మౌనిక గుర్తొచ్చింది. నల్లగొండ జిల్లాలోని రాచకొండ ఏరియాలో సేదదీరుతున్న దళం మకాన్ని పోలీసులు నాలుగు వైపులా చుట్టుముట్టి చేసిన దాడిలో దక్షిణ తెలంగాణా రీజినల్‌ కమిటీ సభ్యుడు కా.ధర్మన్న (దివాకర్‌ -జననాట్యమండలి) తో పాటు మరికొందరు కామ్రేడ్స్‌ అమరులయ్యారు. ఆ ఘటనలో తన తల్లి వెంట వచ్చిన ముక్కు పచ్చలారని చిన్నారి మౌనిక కూడా కర్కశకుల తూటాలకు బలైంది. అప్పటి మౌనిక హత్య గానీ, ఇప్పుడు మంగ్లి హత్య గానీ పోలీసులు కావాలని చేసిందే. కార్పొరేట్‌ వర్గ కావలి కుక్కలు. కోట్ల రూపాయల విలువైన సంపదను స్వాహా చేయటానికి.

మంగ్లి నులి వెచ్చని నెత్తుటి తడి ఆరకముందే…జనవరి 12 వ తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు పోలిసులు పూసనార్‌ గ్రామంలోని తోయపొట్టామ్‌ని పట్టుకొని చంపి బూటకపు ప్రచారం చేశారు. తూర్పు బస్తర్‌ డివిజన్‌లో పోలీసులే చేసిన హత్య,…దంతేవాడ జిల్లా గోటియా గ్రామ నివాసి ఆదివాసీ రైతు మాట (రతన్‌) కశ్యప్‌ మంగనార్‌లో ఉన్న తమ బంధువులఇంటికి వెళ్ళాడు. జనవరి 16 వ తారీఖు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పారామిలటరీ బలగాలు, డి.ఆర్‌.జి. గుండాలు, బస్తర్‌ ఫైటర్స్‌ సంయుక్తంగా మాటకశ్యప్‌ ఉన్న ఇంటిని చుట్టుముట్టి అరెస్టు చేశారు. తలకు ముసుగు కప్పేసి అడవిలోకి ఈడ్చుకొంటూ లాక్కెళ్ళారు. సాయంత్రం ఐదు గంటల వరకు చిత్రహింసలు పెట్టి ఆపై హత్య చేసి ఎన్‌కౌంటర్‌ కథ అల్లారు.

జనవరి 19వ తేదీ రాత్రి పారామిలటరీ, కోబ్రా, డి.ఆర్‌.జి. గుండాలు కలిస ిబీజాపూర్‌ జిల్లాలోని బెల్లంనేండ్రా, గోటుం గ్రామాలను చుట్టుముట్టి నిద్రలో ఉన్న ప్రజల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఇద్దరు మహిళలపై అత్యాచారం చేశారు. ఈ ఘటనకు భీతిల్లిన ప్రజలు చెట్టుకొకరు, పుట్టకొకరు పోయి తల దాచుకొన్నారు. ఇరవయ్యోవ తారీఖు ఉదయం 7.30 గంటలకు పోలీసులు ప్రజలపై విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మైనారిటీ తీరని ఇద్దరు యువతులు బెల్లంగుండ్రా గ్రామ పూనేం నాగి, గోటుం గ్రామ మడకామి సోని, యువకుడు కారంకోసాలు చనిపోయారు.

ఇందులో కారం కోసాకు ఐదుగురు పిల్లలు. భార్య గత సెప్టెంబరులో చనిపోయింది. తల్లిదండ్రులు లేని ఆ ఐదుగురి పిల్లల పోషణ భారం ఎలా? అనేదే అందరి ప్రశ్న.

జనవరి 30వ తేదీన పారామిలటరీ బలగాలు, డి.ఆర్‌.జి. గుండాలు, బస్తర్‌ ఫైటర్స్‌ బీజాపూర్‌ జిల్లా ఖైరంగఢ్‌ బ్లాక్‌ ఉతల గ్రామంలో ప్రజలు తమ పిల్లల గుర్తుగా కట్టుకొన్న స్థూపాలను నేలకూల్చారు. ఇదే బ్లాక్‌ ఈతనపార పంచాయతీ బోడగ గ్రామస్తుడు, ఆదివాసీ రైతు పందొమ్మిది సంవత్సరాల రమేష్‌ ఓయామ్‌ను పోలీసులు పొట్టన పెట్టుకొన్నారు. మూడు రోజుల కింద పుట్టిన పసిపాప నామకరణానికి అవసరమైన సామాన్లు తేవటానికి పక్కనే ఉన్న తన మామయ్య ఇంటికి తాడోపోట్‌ గ్రామానికి వెళ్ళి తిరిగి వస్తున్న సందర్భంలో ప్రజలపై పోలీసులు చేసిన కాల్పుల్లో రమేష్‌ హత్య కాబడ్డాడు.

రమేష్‌ భార్య లచ్చిమి ఒళ్ళో మూడు రోజుల పసిగుడ్డుని, పక్కనే ప్రాణం లేని రమేష్‌తో ‘నాకు న్యాయం కావాలని డిమాండ్‌ చేసింది.   కళ్ళ నీళ్ళ పర్యంతమైంది.

ఆ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరి మనసు బాధతో బరువెక్కి కంటతడి పెట్టించింది. కళ్ళు కూడా తెరవని మూడు రోజుల ఆ పసిగుడ్డు పుట్టుకతోనే పోరాటం మొదలెట్టింది. తన తండ్రి లాంటి తండ్రుల కోసం. అందుకే…

‘తన తండ్రిని (రమేష్‌) చంపిన పోలీసులను శిక్షించాలి’

‘బస్తర్లో జరుగుతున్న నరసంహారాన్ని వెంటనే ఆపాలి’

‘బి.జె.పి. డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం నశించాలి’ అని.

ఇప్పుడిక ఏ ఇంటి గడప తొక్కినా పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలే కనిపిస్తారు. ‘కగార్‌’ గద్దల ఆగమనం వలన.

డిశంబర్‌ 20వ తేదీ నారాయణపూర్‌ జిల్లా ఓర్చా బ్లాక్‌ పరిధిలోని రేఖవాయ గ్రామ యువతి లచ్చిమి కోవాచి టమాట తోటకు నీళ్ళు పెట్టి, సాయంత్రం నాలుగ్గంటల సమయంలో ఇంటికి తిరిగి వస్తుండగా డి.ఆర్‌.జి. గుండా లచ్చిమిని పట్టుకొని చంపబోతుండగా గట్టిగా ప్రతిఘటించి వాడి నుంచి తప్పించుకొని బయటపడిరది.

                                                                                0              0              0

ఇవి ఈ రోజు బస్తర్‌లో జరుగుతున్న యథార్థ సంఘటనలు. ఇవి కట్టు కథలు కావు. కాలక్షేపం చేసేవి అంతకన్నా కాదు. కార్పొరేట్‌ కాషాయ మూకల నరసంహారం. ప్రజలు తమదైన అడవిని, భూమిని ఇవ్వమన్నందుకు. ఆదివాసీ ప్రజల నిర్మూలనే లక్ష్యంగా నూతన సంవత్సరం రోజే తల్లి ఒడిలోని పిల్లను మాయం చేసిన నూతన కగార్‌ దాడి. ఈ దాడులకు పేరు ఏదైనా పిల్లలు, పెద్దలు, మహిళలే టార్గెట్‌. బేటి బచావో – బేటి పడావో మోడీ నినాదం గాల్లో కలిసిపోయింది. నామరూపాల్లేకుండా.

కళ్ళముందే మంగ్లి లాంటి పసిపిల్లలు, కనిపెంచిన కారం కోసా, ఓయాం రమేష్‌లాంటి వారు మాయమవుతున్నారు గాబట్టే, ఆ పిల్లలు, ఆ పెద్దలు, ఆ మహిళలు అంత గట్టిగా ప్రభుత్వాలను నిలదీస్తున్నారు. ఎవరో నేర్పితే వచ్చే మాటలు కావు. జీవిత సత్యాలు. అందుకే, ‘మమ్మల్ని చిదిమేయొద్దు, బతకనివ్వండి, మొగ్గలోనే మమ్మల్ని తుంచేయొద్దు, ‘మాకూ పరిమళించాలనుంద’ని పిల్లలు, ‘మా జీవితం మాకు తెలుసు, జీవించటం కోసమే మా పోరాటం’ అని పెద్దలు దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తున్నారు.

దేశాన్ని కార్పొరేట్స్‌కు ధారాదత్తం చేస్తూ, మరోపక్క ‘జల్‌ – జంగల్‌ – జమీన్‌పె ౖఆదివాసీ ప్రజలకే హక్కు’ మోడీ ప్రసంగం రెండు నాల్కల ధోరణికి నిదర్శనం. మోడీ ప్రసంగంలోని నిగూఢ రహస్యాన్ని ‘పొల్లు’ పోకుండా అమలు చేస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయ్‌ అధికారంలో కొచ్చిన మూడవరోజు నుంచే.  హసదేవ్‌ అభయారణ్యాన్ని మొదలంటా నరికేస్తున్నారు. జలగలా ప్రజలనెత్తురు పీల్చే అదానీతో చేసుకొన్న ఒప్పందం కోసం.

లక్షల ప్రజల జీవనోపాధికి, వారి ‘ఊపిరి’కి, కోట్లాది రకాల జీవరాశులు, జంతువులు, వేల రకాలైన పక్షులకు ఆవాసమైన హసదేవ్‌ అభయారణ్యం మైదానమైపోతుంది. ఎన్నో సంవత్సరాల వయసున్న వృక్షాలు క్షణాల్లో జీవం కోల్పోతున్నాయి. 91 హెక్టార్లలో ఉన్న చెట్లను ఐదు వందల రంపపు మిషన్లతో నరుకుతున్నారు. చెట్లను నరుకుతున్న ఆ చోటికి ఎవర్నీ వెళ్ళనీయటం లేదు.

చెట్లు నరకటానికి ముందురోజే హసదేవ్‌ అభయారణ్యంలో 450 మంది పోలీసులు మోహరించారు. తెల్లవారుజామున ఆరు గంటలకే హసదేవ్‌ చుట్టుపక్కల గ్రామాల్లో పోలీసులు హంగామా చేశారు. హసదేవ్‌ అభయారణ్య బచావో సంషుర్ష్‌ సమితి కార్యకర్తలు 15 మందిని హరిహరపూర్‌, గాటబర్ర, పెండ్రామార్‌ గ్రామాల నుండి అరెస్టు చేశారు. అదే రోజు 52 హెక్టార్లలో ఉన్న 15,307 చెట్లను నరికేశారు.

ఇది మోడీ కార్పొరేట్‌ అనుకూల, ఆదివాసీ వ్యతిరేక చరిత్ర.

లక్షలాది జీవరాశులకు జీవితాన్నిస్తున్న హసదేవ్‌ అభయారణ్యాన్ని అంతంచేస్తుంటే, చూస్తూ ఊరుకొనే రకం కాదు ప్రజలు. అందుకే ఊరును దాటారు, సరిహద్దులను దాటారు. పోరాటమే ఊపిరిగా…

‘హసదేవ్‌ అభయారణ్యాన్ని రక్షిద్దాం’

‘అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం మాకొద్దు’

‘అదానీ కంపెనీ వాపస్‌ పోవాలి’

ఇప్పుడిక పిల్లలు, పెద్దలు కోరుకొనేది ఒకటే. మా అడవి, మా భూమి మాకే సొంతం. ఎవరి సొత్తూ  కాదు. మా మట్టి నుంచి మమ్మల్ని దూరం చేయాలనుకొంటే సహించం. దేనికైనా తెగిస్తాం అని. ఇది ఈరోజు మట్టి మనుషుల ఆరాటం. మట్టినే నమ్ముకొన్న వారి జీవిత సత్యం. ఈ సత్యమే వారిని ముందుకు నడిపించింది. కార్పొరేట్‌ వర్గ వ్యతిరేక పోరాట జ్వాలలై. అంతం కానివ్వని మనుగడ కోసం. మట్టిని, మనిషిని వేరు చేయాలని చూసినంత కాలం ఈ పోరాట జ్వాలలు ఆరని మంటలా మండుతూనే ఉంటాయి, కార్పొరేట్‌ వర్గ కగార్‌ దాడులను ఎదిరిస్తూ…

Leave a Reply