ఇనుప కచ్చడాల్లో కునుకుతూ,
పువ్వును పువ్వు అని,
నవ్వును నవ్వు అని ఎలా అంటావ్?

కనులు మూసుకుని కౕంచెలు దాటే కవీ!
ఇది నీకు కాలం కాదయ్యా.
జతలకు, పూలతలకు,
కవితలకు, ప్రేమ సుధలకు
ఇది కాలం కాదయ్యా!

హృదయాలను ఒరుచుకు పారే నదులకు,
కురిచే మేఘాలను ఒడిచి పట్టే సంద్ర ఝరులకు,
అంతర్ బహిర్ మథనాలను ముడేసే వారధులకు,
నా మాటగా కూడా చెప్పు.
ఇది కాలం కాదని...

జేగురు విడిచిన పొద్దులా పడి ఉన్నాను.
ఐదు తరాలుగా విముక్తి లేని
బూడిద కుప్పల్లోని పితరుల్లా వేచి ఉన్నాను.

ఒడ్డూపొడవూ ఆకర్షణలు దాటి,
అలవాటైన బాటలు విడిచి,
సాదాసీదా సవ్వడులతో,
నా స్నేహం కోసం వస్తే..
రమ్మను నదులను...

వలల వేటను, సొర కోరలను,
తప్పుకోగలిగితేనే,
గర్జించమను సముద్రాలను..

నొప్పి మాత్రలను,
కత్తుల మీద నడిచే నేర్పును,
బట్వాడా చేయలేకపోతే
కూలిపొమ్మను వారధులను..

కంజీర మీటుతూ కంచెలు దాటే కవీ!
కాలం కాని కాలంలో
పువ్వులు పువ్వులు కానట్టే,
నవ్వులు నవ్వులు కానట్టే,
నదులూ నదులు కావు.
సముద్రాలూ సముద్రాలు కావు.
వారధులూ వారధులు కావు.

ప్రకృతి పరాగాలకు తోడు,
గంధకాలనూ అద్దుకుని
రమ్మను నా ప్రియుడినీ, నీ ప్రియురాలినీ..

One thought on “కంచె

Leave a Reply