చావంటే భయం లేని వాళ్లకు భయపడి చంపేశాడు.
చచ్చి అమరత్వం పొందిన వాళ్లకు భయపడి స్థూపాలను డైనమెట్లతో కూల్చేసాడు.
నక్సలైట్లే దేశభక్తులు, నక్సలైట్లకు జోహార్లు, నక్సలైట్లు నాతో చేతులు కలిపితే ఢల్లీి ఎర్రకోటపై ఎర్రజెండా ఎగరవేస్తానని నర్సంపేట, ములుగు, ఏటూరు నాగారం సభల్లో వాగ్దానం చేసిన (విప్లవకారుల దృష్టిలో ప్రగల్బాలు పలికిన) ఎన్.టి.ఆర్. 1985 సెప్టెంబర్ 3న డాక్టర్ రామనాథం హత్యతో తీవ్ర నిర్బంధం ప్రారంభించాడు. అక్కడి నుంచి పౌర హక్కుల సంఘం, ప్రజా సంఘాల నాయకుల హత్యలను, టాడా ప్రయోగాన్ని, మిస్సింగ్ కేసులను (కొడవటి సుదర్శన్ ఆర్.వై.ఎల్. కార్యకర్త) కె.ఎస్. వ్యాస్ నాయకత్వంలో కుఖ్యాతి వహించిన గ్రేహౌండ్స్‌ను ప్రారంభించినట్లే అమరుల స్థూపాలు డైనమెట్లు పెట్టి కూల్చే ప్రక్రియ కూడా ప్రారంభించాడు.
ఈ జనవరి 1న ప్రారంభించి ఎడతెరిపి లేకుండా ఎన్‌కౌంటర్లతో జూలై 24 దాకా దండకారణ్యంలో బస్తర్ అడవుల్లో బీజాపూర్ నుంచి మాడ్ దాకా ఎందరో ఆదివాసులను, నర్సింహులు (జోగాలు) స్థాయి రాష్ట్ర నాయకుల దాకా చంపేసిన పోలీసులు జూలై 25న అమరుల జ్ఞాపకార్థం ఆదివాసులు నిర్మించుకున్న స్థూపాలను కూల్చివేసే పని పెట్టుకొని ఆ విధ్వంసాన్నంతా వీడియో తీస్తూ ఎప్పటికప్పుడు అనుకూలమైన టీవీ ఛానల్‌ల ద్వారా సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేశారు. దండకారణ్యంలో కేంద్ర కమిటీ నాయకులు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు మొదలైన వాళ్లు అమరులైనప్పుడు వాళ్ల పద్ధతులలో స్మారక స్థూపాలు నిర్మించుకున్నట్లు విన్నాం. టి.వి. ఛానల్లో చూసాం. గాలింపు చర్యలకు పోయినప్పుడో, ఎన్‌కౌంటర్లు చేసినప్పుడు తిరిగి వస్తూనో, లేదా తమకు తీవ్రమైన నష్టాలు విప్లవకారులు, ప్రజల చేతుల్లో జరిగినప్పుడో పోలీసులు ఆ స్థూపలను కూల్చివేస్తున్నారు. ముఖ్యంగా దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేత పేరుతో అప్రకటిత యుద్ధంలో పాల్గొంటున్న వివిధ కేంద్ర, రాష్ట్ర అర్ధ సైనిక బలగాలు, సాల్వాజూడుంకు మరో రూపంలో డి.ఆర్.జి., బస్తర్ ఫైటర్స్ ఈ స్థూపాలలో కొన్నిటిని కూల్చివేయడం కూడా జరుగుతున్నది. ఈ ప్రక్రియ కూడా ప్రజా యుద్ధంలో ఆటుపోట్లు వంటి అనుభవమే కానీ స్మారక స్థూపమనేది అమరుల జ్ఞాపకాలను పదిలపరిచి ప్రచారం చేసే ఒక ప్రజా సంప్రదాయం. కనుక ఈ జూలై 25కు దండకారణ్య పోరాటాన్ని తెలంగాణ బొడ్డు తాడుతో కలిపే సంబంధమేమన్నా ఉందా? అని అనిపించింది.
మన అందరి మూలాలు అడవిలో, ఆదివాసుల్లో ఉన్నట్లుగానే జ్ఞాపకాన్ని ఒక కొనసాగింపుగా గుర్తు పెట్టుకునే సంప్రదాయం కూడా మనకు ఆదివాసుల నుండే వచ్చింది. ఆదివాసుల్లో ఎవరు చనిపోయినా పాతిపెట్టి ఒక మొక్క నాటుతారు. ఆ మొక్క మన నాగరీకుల (కాళీపట్నం రామారావు గారు ‘జీవధార’ కథలో చెప్పినట్లుగా) క్రోటన్ల వంటివి కావు. మద్ది, సాల, టేకు వృక్షాలు కాగల మూలాలు. ఒక విధంగా అడవియే అదివాసులు తమ జీవన శైలితో పోరాట సంస్కృతితో మనకు మిగిల్చిన ఒక ఆదరువు. అడవి ఆదివాసుల తల్లి. ఆదివాసుల సంతానం. జ్ఞాపకాల మూలాధారాల మీద నిర్మాణమైన పోరాటం.
ఈ కూల్చిన విధ్వంస మూకకు తెలియకపోవచ్చు గాని జూలై 25, ఏభై ఏళ్ల క్రితం సిపిఐ ఎంఎల్ (సిఒసి) సిద్దిపేట ప్రాంతంలో ప్రజల్లోకి వెళ్లిన సూరపనేని జనార్దన్ నాయకత్వంలో లంక మురళీమోహన్, ఆనందరావు, సుధాకర్, భిక్షపతిలను గిరాయిపెల్లి అడవుల్లో చెట్లకు కట్టేసి, మొదటి నలుగురిని కాల్చేసి ‘ఎన్‌కౌంటర్’ ప్రకటించిన దినం. అది సరిగ్గా ఎమర్జెన్సీ ప్రకటించిన నెల రోజులకు జరిగింది. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత, అప్పటికే తెలంగాణ రీజినల్ కమిటీ రూపొందించిన విప్లవానికి బాట వెలుగులో ప్రజాపంథాను అమలు చేస్తూ, జగిత్యాల జైత్రయాత్ర విప్లవ భూసంస్కరణలు చేపట్టి జన్ను చిన్నాలు నాయకత్వంలో వరంగల్ జిల్లాకు విస్తరించినప్పుడు పైడిపల్లి (వరంగల్ పరిసర గ్రామం)లో ఈ గిరాయిపల్లి మృతవీరుల స్థూపాన్ని కె.ఎస్. ఆవిష్కరించాడు. అది 1979 అక్టోబర్ 17న. ఆ మర్నాడు అంటే అక్టోబర్ 18న, ఆ ఆవిష్కరణ సభ ఫొటోలు వరంగల్ ఫొటో స్టూడియోలో కడిగించుకొని వస్తున్న జన్ను చిన్నాలును పోచమ్మ మైదాన్ సి.కె.ఎం. కాలేజీ దేశాయిపేట రోడ్డు మీద రాజ్య ప్రేరేపిత అతివాద, మితవాద మాఫియా గుండాలు గొడ్డళ్లు, కత్తులతో నరికి చంపారు. ఊళ్లోనే ఉన్న కె.ఎస్. చిన్నాలును సమాధి చేసిన చోట వ్యవసాయ విప్లవం అంటే రైతు వ్యవసాయం చేయడం వంటి నిరంతర ప్రక్రియ అని, ఈ హత్యకు ప్రతీకారం అటువంటి వ్యవసాయ విప్లవ పోరాటంతోనే సాధ్యమని చెప్పాడు. గిరాయిపల్లి అమరుల స్థూపం పక్కన జన్ను చిన్నాలు అమరత్వ స్థూపం కూడా ప్రజలు నిలుపుకున్నారు. సిపిఐ ఎంఎల్ సిఓసి కాస్త 1980లో పీపుల్స్‌వార్ అయింది. దండకారణ్య పర్స్‌పెక్టివ్ రచించుకొని పెద్ది శంకర్ నాయకత్వంలో ఒక దళాన్ని సిరొంచ – గడ్చిరోలీ అడవులకు పంపింది. ఏడు దళాలను బస్తర్‌కు పంపింది. 1980 నవంబర్ 2న కామ్రేడ్ పెద్ది శంకర్ మొయిన్ బిన్‌పేట ఎన్‌కౌంటర్‌లో అమరత్వం దండకారణ్య ప్రజా యుద్ధానికి నెత్తుటి చాలు వేసింది.
1981 ఏప్రిల్ 20న ఆదిలాబాద్ జిల్లా గిరిజన రైతు కూలీ సంఘం ఇంద్రవెల్లిలో తలపెట్టిన సభకు ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకొని 144 సెక్షన్ విధించి, తుడుం దెబ్బ తప్ప ఏ సంకేతం తెలియక నలువైపుల నుంచి వచ్చిన ఆదివాసులపై పోలీసులు సభాస్థలి నుంచే కాదు, చెట్ల మీంచి కాల్చిన కాల్పుల్లో 60 మంది దాకా ఆదివాసులు అమరులయ్యారు. జలియన్‌వాలాబాగ్‌తో పోల్చి దేశమంతా ప్రచారమైన, బహుశా అంతర్జాతీయంగా ప్రచారమైన ఈ ఇంద్రవెల్లి ఆదివాసి అమరుల కోసం అపూర్వమైన స్థూపాన్ని నిర్మించాలని పార్టీ నిర్ణయించుకున్నది. (అమాయక గిరిజనుల మీద పోలీస్ కాల్పులు ఏమిటని అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్యని అడిగితే వాళ్ల వెనుక పీపుల్స్‌వార్ ఉన్నదట కదా. వాళ్లేం చీపురు పుల్లలతో మా మీదికి యుద్ధం చేయడానికి రారు కదా అన్నాడు.) ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం అధ్యక్షుడు, భారత్ చైనా మిత్రమండలి కార్యవర్గ సభ్యుడు కూడా అయిన గంజి రామారావు గారు భారత చైనా మిత్రమండలి కార్యవర్గం తరఫున చైనా ఆహ్వానంపై వెళ్లినప్పుడు చైనా విప్లవ అమరుల కోసం నిర్మాణమైన ‘తీన్ మీన్ స్క్వేర్’ సాంకేతిక వివరాలన్నీ రాసుకొని వచ్చాడు. (చైనా విప్లవం విజయవంతమై పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అవతరణ గురించి ప్రకటించినప్పుడు లక్షలాది మంది జనంలో ఎందరో అమరుల రక్త బంధువులను చూసిన మావో చౌ ఎన్ లై తో ‘నాకు ఎందుకో వాళ్లందరినీ చూస్తుంటే గొడుగు పట్టుకుని నిలబడ్డ ఒంటరి మాంక్ (సన్యాసి) భావన కలుగుతున్నద’ని తాత్వికంగా మాట్లాడారు.) ఇంద్రవెల్లి కాల్పులు జరిగిన చోటనే టిన్ రేకులతో చిన్న ఒక గది కట్టుకొని ఏడాదిన్నర పాటు దగ్గరుండి ఇంద్రవెల్లి స్థూపం 83 అడుగుల ఎత్తుతో నిర్మాణం చేయించారు గంజి రామారావు గారు. ఈ ఏడాదిన్నర కాలంలో ఆయన ఆదిలాబాద్, నిజామాబాదు జిల్లాలో జరిగిన ఎన్నో రైతు కూలీ సంఘం పోరాటాలలో కూడా పాల్గొని నిజామాబాదు జైల్లో కూడా కొన్ని రోజులు నిర్బంధాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఈ స్థూపావిష్కరణ సభలో గద్దర్, కన్నబిరాన్, బాలగోపాల్ మొదలైన వాళ్లు పాల్గొన్నారు. అల్లం రాజయ్య ‘కొమురం భీమ్’ నవలను అక్కడే బాలగోపాల్ ఆవిష్కరించాడు. ఈ ఆవిష్కరణ సభలో పాల్గొనడానికి దేశంలో దూర దూరాల నుంచి ప్రజాస్వామిక ఉద్యమ నాయకులు వచ్చారు. బగల్పూర్ జైల్లో 11 మంది ఖైదీల కళ్ళలోకి సూదులు గుచ్చి అంధుల్ని చేసిన 1980 డిసెంబర్ ఉదంతంతో దేశమంతా అట్టుడికింది. (… ఇంకేం దేశంలో నేర చికిత్స చేయడానికి సూదులు, యాసిడ్ పట్టుకొని భగల్పూరులో బయల్దేరాడు డాక్టర్ పోలీస్ బీహార్ ప్రభుత్వ నేత్ర వైద్య గౌరవ సర్జన్! ఈ కంటి ఆపరేషన్ అయినా మన ఇంటి వ్యవస్థ గురించి నీ కళ్ళు తెరిపిస్తుందా?) ఆ ఉదంతంపై శోధించి డాక్యుమెంటరీ తీసిన తపన్ బోస్ కూడా వచ్చి కార్యక్రమం అంతా వీడియో తీశాడు కానీ ఏమైందో తెలియదు. ఆ తర్వాత సంవత్సరం 83లో ఇంద్రవెల్లి అమరుల సంస్మరణ సభకు నాగపూర్‌లో జార్జి ఫెర్నాండెజ్‌ను కలుసుకొని కారులో తీసుకొని వచ్చిన హక్కుల కార్యకర్త పంకజ్‌దత్ తిరుగు ప్రయాణంలో బాలగోపాల్, వివిలను కూడా తీసుకొని హైదరాబాద్ వెళుతుంటే పోలీసులు గోండుల ఆహార్యాలు ధరించి నిర్మల్ ఘాట్ రోడ్డుపై కారు మీద పెద్ద పెద్ద బండ రాళ్లు దొర్లిస్తే, కారు అద్దాలన్నీ పగిలినా ఒడుపుతో చాకచక్యంగా తప్పించి తీసుకుపోయాడు. నిర్మల్‌లో జార్జి ఫెర్నాండెస్ మీడియాకు ఈ విషయం చెప్పి నాందేడ్ మీదుగా ఢల్లీికి వెళ్లిపోయాడు. 1984 నాటికి నిర్బంధం మరింత తీవ్రమై అనుమతి కూడా లభించని స్థితిలో మహారాష్ట్ర పౌర హక్కుల (సిడిఆర్‌ఓ) నాయకుడు, సుప్రసిద్ధ ప్రజాస్వామ్యవాది ఏక్‌నాథ్ సాల్వే ఇంద్రవెల్లి స్థూపం దగ్గరికి ఒక్కడే వెళ్లి ఆదివాసి అమరులకు జోహార్లు చెప్పి, నినాదాలు ఇచ్చి అరెస్టై ఆ తర్వాత విడుదలయ్యాడు. 1985లో విజయవాడలో భూమయ్య కిష్టాగౌడ్ స్మారకోపన్యాసం ఇవ్వడానికి రావలసివుండిన ప్రొఫెసర్ మనోరంజన్ మొహంతీ, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ మురళీమోహన్ ఇంద్రవెల్లి స్థూపం చూడడానికి మరికొందరు పౌరహక్కుల నాయకులతో కలిసి వెళ్లి అరెస్టయినపుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.ఆర్. శంకరన్ జోక్యం వల్ల కేసు పెట్టకుండా వదిలేశారు.
ఇంక డాక్టర్ రామనాథం గారి హత్యతో కేంద్రం చేసిన టాడా చట్టాన్ని పార్లమెంటులో వ్యతిరేకించిన టిడిపి సెప్టెంబర్ 9న ఆంధ్రప్రదేశ్‌లో అమలులోకి తెచ్చి ఆట, మాట, పాట బంద్ అని ప్రకటించింది.
ఆ తర్వాత అదే నెలలో గ్రేహౌండ్స్ పోలీసులు పైడిపల్లిలోని గిరాయిపల్లి మృతవీరుల స్థూపాలు, కామ్రేడ్ జన్ను చిన్నాలు స్థూపం డైనమెట్లతో పేల్చి వేశారు. ఆ స్థలాన్ని నేలమట్టం చేస్తే ప్రజలు చాపి చల్లి దీపాలు పెట్టుకుంటే, ఆర్పి నిషేధం విధించి కాపలా పెట్టారు. డిసెంబర్ 13న మొదటిసారి ఇంద్రవెల్లి స్థూపాన్ని కూడా కూల్చే ప్రయత్నం చేసి ఆదివాసుల ప్రతిఘటనతో అప్పటికి ఆగిపోయారు. స్థూపాల విధ్వంసం అట్లా ప్రారంభించి అప్పటికే కొండాపూర్ ఎన్‌కౌంటర్. కరీంనగర్ జిల్లా పీపుల్స్‌వార్ కార్యదర్శి, జగిత్యాల జైత్రయాత్ర నిర్వహణ నుంచి ఎదిగి వచ్చిన పీడిత ప్రజల నాయకుడు సాయిని ప్రభాకర్ ను కరీంనగర్‌లో అరెస్ట్ చేసి ఎన్‌కౌంటర్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో దళకమాండర్‌గా శత్రువును గడగడలాడిరచిన జ్యోతి ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న జ్యోతిని ఎన్‌కౌంటర్ చేశారు. ఆమె అమరత్వం తర్వాత
వియత్నాం మహిళ ముఖ చిత్రంతో సృజన వెలువడి సంచలనం అయినట్లుగా జ్యోతి సాయుధ గెరిల్లా యూనిఫామ్ తో వేసిన పార్టీ పోస్టర్ బహుళ ప్రచారం పొందింది.(ప్రభాకరుడు ఒరిగి చిన్నబోయిన ఈ భూమి జ్యోతి మలిగి చీకటవుతున్న ఈ భూమి స్థూపాలు కూలి రెచ్చిపోతున్న ఈ భూమి, ఈ భూమి ఏమవుతుందో మరి!)
1986 మార్చ్ ఆఖరి వారంలో ఆదిలాబాద్ జిల్లా ఆలంపెల్లిలో సి.ఆర్.పి.ఎఫ్. క్యాంపుపై పీపుల్స్‌వార్ దళం దాడి చేసి తుపాకులు ఎత్తుకొని పోయింది. ఆ ఘర్షణలో 11 మంది జవాన్లు చనిపోయారు. దళ సభ్యుడు, దాడిలో పాల్గొన్న రామకృష్ణ (గుర్తూరు) అమరుడయ్యాడు. (వరంగల్ జిల్లా పార్టీ కమిటీ సభ్యుడు, పాలిటెక్నిక్ విద్యార్థి ఆ తర్వాత 21 మే 86 లో ఆర్.ఎస్.యు. ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావుతో పాటు అరెస్టయి, ఎన్‌కౌంటర్ అయిన రామకృష్ణ చిన్నాయన కొడుకే ఈ రామకృష్ణ కూడ). ఈ దాడితో దిగ్భ్రాంతి చెందిన ఎన్.టి.ఆర్., అదిలాబాదు ఎక్కడుంటుంది? పీపుల్స్‌వార్ ఎక్కడుంటుంది? ఆ పార్టీతో మాట్లాడాలంటే ఎవరితో మాట్లాడాలి? అని ‘అమాయకంగా’ అడిగాడు. పీపుల్స్‌వార్ రాష్ట్ర కార్యదర్శి.. పార్టీతో మాట్లాడాలంటే అందుకు రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణం కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే అని ప్రకటించాడు. మొత్తానికి ఈ సంఘటనతో డిఫెన్స్‌లో పడిన ఎన్.టి.ఆర్. ఇంద్రవెల్లి స్థూపం కూల్చివేతతో గాయపడిన ఆదివాసుల మనసులకు సాంత్వన లేపనం పూయక తప్పని పరిస్థితికి నెట్టబడ్డాడు. ఇంద్రవెల్లి స్థూపాన్ని పునర్నిర్మాణం చేయాలనే డిమాండ్‌కు ప్రజామోదం విస్తృతంగా పెరిగింది. తెలుగుదేశం పార్టీ పెట్టి గెలిచిన 9 నెలలకే ఎన్.టి.ఆర్. ముఖ్యమంత్రి అయినప్పుడు విలేకరులు ఆయనను ఇంద్రవెల్లి మారణకాండ గురించి మీరు ఏమనుకుంటారు అని అడిగారు. ఎందుకంటే టంగుటూరి అంజయ్య, భవనం వెంకట్రాంరెడ్డి ప్రోద్బలంతోనే ఎన్.టి.ఆర్. రాజకీయాల్లోకి వచ్చాడు, కనుక ఆత్మగౌరవ సమస్యతో కాంగ్రెస్‌లో చేరడం కన్నా తెలుగుదేశం పార్టీ పెట్టడానికి అనుకూల సమయమని సత్యనారాయణ ద్వయంగా పిలుచుకునే ఆయన సలహాదారులు ఆయనకు సూచించారు. టంగుటూరి అంజయ్య వ్యాఖ్య తెలుసు గనుక ఎన్.టి.ఆర్. ఏమంటాడోనని అడిగారు. ‘అదొక బహిరంగ విషాదం’ అన్నాడు. కానీ ఆయన పాలనలో మూడు సంవత్సరాలు పూర్తికాకముందే ఆ స్థూపాన్ని ఆయన హయాం లో ఏర్పడిన వ్యవస్థ గ్రేహౌండ్స్ పేల్చివేశారు. ఇన్ని ఒత్తిళ్ళ వలన, ఇంద్రవెల్లి స్థూప పునర్నిర్మాణానికి ఉత్తర్వులు ఇచ్చాడు. కానీ ఇప్పుడు మనం చూస్తున్న ఇంద్రవెల్లి స్థూపం 83 అడుగులు లేదు. చాలా చిన్నది. అట్లాగే స్థూపానికి ఎర్ర రంగు బదులు తెల్ల రంగు వేశారు. అయినా 1986 నుంచి 90 ఏప్రిల్ 20 దాకా ఏప్రిల్ నెల ఆరంభం నుంచి నిషేధాజ్ఞలు విధించి ఎవరిని అక్కడికి అనుమతించలేదు. మళ్లీ 1990 ఏప్రిల్ 20న మాత్రమే దాదాపు లక్ష మంది ప్రజలు, జననాట్యమండలి బృందంతో విరసం, ఎపిసిఎల్‌సి ప్రతినిధులు రాగా అక్కడ ఇంద్రవెల్లి అమరులను స్మరించుకున్నారు. ఆ తర్వాత 91 నుంచి మళ్ళా నిర్బంధ, నిషేధాలే చాలాకాలం కొనసాగినవి.
ఇంద్రవెల్లి అమరులు నిప్పు రవ్వలై ఎగిసి దండకారణ్యం విప్లవోద్యమం పురోగమించి 1995లో గ్రామ రాజ్య కమిటీల రూపంలో జనతన రాజ్యానికి బీజరూపాన్ని పరికల్పన చేసింది. ఇంద్రవెల్లి సభకు పార్టీ నుంచి బాధ్యత వహించిన ఆనంద్, ఆనంద్ దూలాగా జనతన రాజ్యానికి, సెంట్రల్ రీజినల్ బ్యూరోకు, కార్యదర్శిగా కొనసాగి అమరుడై ఏడాది గడిచిపోయింది. ఈ విప్లవోద్యమానికి అంతా మార్గదర్శకత్వం వహించిన ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులను 99 డిసెంబర్ 2న ఎన్‌కౌంటర్ చేసినారు. ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి మురళి (శీలం నరేశ్) మృతదేహాన్ని పెద్దపల్లి మార్చురీ నుంచి ఆయన స్వగ్రామం జగిత్యాలకు ఎంత వేగంగా తరలించి, జగిత్యాల చుట్టూ పహారా పెట్టి తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి అంత్యక్రియలు చేయించారంటే ఎ.పి.సి.ఎల్.సి. అధ్యక్షురాలు రత్నమాల ఆ వ్యాన్ వెనుకనే ప్రయాణం చేసి వెళ్లినా ఆమె వెళ్లే వరకే అంతా అయిపోయి తల్లిదండ్రులను పరామర్శించి మాత్రం రాగలిగింది. ఎర్రం రెడ్డి సంతోష్ రెడ్డి (మహేష్) ఎన్‌కౌంటర్ విషయంలో తల్లి హైకోర్టులో పిటిషన్ వేసినందున రీపోస్టుమార్టం కోసం రామగుండం ఎన్‌టిపిసి ఆసుపత్రిలో మృతదేహాన్ని హైకోర్టు విచారణ ముగిసే వరకు శవాల గదిలో ఉంచి రిపోస్టుమార్టం జరిపి పది రోజుల తర్వాత తల్లికి అప్పజెప్పితే పూర్తి విప్లవ సంప్రదాయంతో అన్ని ఎంఎల్ పార్టీల నాయకులు పాల్గొని విరసం, ఏ.ఐ.ఎల్.ఆర్.సి, జననాట్యమండలి, ఇతర ప్రజాసంఘాల బాధ్యులతో పాటు తల్లి, కాళోజీ చితికి నిప్పంటించారు. మురళి మృతదేహం వలెనే శ్యాం (నల్ల ఆదిరెడ్డి) మృతదేహాన్ని కూడా ఆగమేఘాలమీద కొత్తగట్టు తరలించి అంత్యక్రియలు జరిపించాలని ప్రయత్నం పెరిగినా సందర్శకుల, జర్నలిస్టుల, అన్ని ఎమ్.ఎల్. పార్టీల నాయకుల, ప్రజా సంఘాల నాయకుల ఒత్తిడి వల్ల సాధ్యం కాలేదు. కానీ మృతదేహం వెంట పోవాలని ప్రయత్నించిన ఎమ్.ఎల్. పార్టీల నాయకులను విరసం ప్రతినిధితో పాటు జమ్మికుంటలో అరెస్ట్ చేసి రాత్రి దాకా కూడా వదలలేదు. కొత్తగట్టులో అన్ని వైపుల నుంచి వాహనాల్లో మాత్రమే కాకుండా అడ్డంపడి కాలిబాటన వచ్చేవాళ్లు చీమల బారులా కొనసాగుతుంటే అన్న సుధాకర్ రెడ్డి (ఆయనా మొదలు ఆర్‌ఎస్‌యులో పనిచేసిన వాడే) తల్లి వలె పెంచిన వదిన ఇంకా ప్రజల సందర్శన కోసం ఉంచి మర్నాడు అంత్యక్రియలు జరుపుతామని ప్రకటించారు. హనుమకొండ కరీంనగర్ రోడ్డు మీద ఉన్న కొత్తగట్టు వైపు పోయే బస్సుకు, ఎస్.పి. ఆఫీసు దగ్గరే అనుమానితులను దించేయడానికి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అట్లే హైదరాబాద్ కరీంనగర్ నుండి బస్సులో వచ్చే వారిని అడ్డుకోవడానికి అన్ని వైపులా పోలీసులను మోహరించారు. దానితో ఎక్కువమంది రోడ్డు మార్గాన్ని తప్పించి, హనుమకొండ సిద్దిపేట రోడ్డు మీద ఉన్న హుస్నాబాద్ నుంచి భీమదేవరపల్లి మీదుగా కొత్తగట్టు చేరుకున్నారు. ఆ రెండు రోజులు హుస్నాబాద్, భీమదేవరపల్లి లో పెట్రోలింగ్ చేస్తున్న, లేదా హనుమకొండ సిద్దిపేట రోడ్డు కవర్ చేస్తున్న యాంటీ నక్సలైట్లకు దృష్టి హుస్నాబాద్ స్థూపం మీద పడిరది. శ్యాం(ఆదిరెడ్డి) అంత్యక్రియలు అయిన వారం లోపలనే ఎంఎల్ పార్టీ నాయకులతోపాటు బెంగళూరుకు నిజనిర్ధారణకు ఏ.ఐ.ఎల్.ఆర్.సి., విరసం ప్రతినిధులు వెళ్లిన సమయంలో కేంద్ర అర్ధ సైనిక బలగాలు హుస్నాబాద్ స్థూపాన్ని డైనమైట్ పెట్టి పేల్చివేసారు. 93 అడుగులపైనున్న స్థూపంపై ఎంత దూరానికైనా కనిపించేలా అమర్చిన సుత్తి కొడవలి చిహ్నం ఒక మదగజం వలె నేలకూలి కదిలించలేని కళేబరం వలె ఇప్పటికీ ఉండి పోయింది.
బెంగళూరుకు ఈ సమాచారం తెలియగానే అక్కడ పత్రికల వారికి చెప్పి, హుస్నాబాద్‌లో కరీంనగర్ అమరుల చిహ్నమైన స్థూప నిర్మాణం గురించి చెప్పడమే కాకుండా 1995 ఫిబ్రవరిలో ఢల్లీిలో ఏఐపిఆర్‌ఎఫ్ జాతుల సమస్యపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుకు గూగి తన సహచరి జర్రీతో పాటు వచ్చి హైదరాబాద్ హనుమకొండలలో విరసం, నిజాం కాలేజీ, ఇఫ్లు, కాకతీయ యూనివర్సిటీ సభలలో ప్రసంగించాక జర్నలిస్ట్ పి.వి. కొండల్‌ను తీసుకొని హుస్నాబాద్ స్థూపాన్ని కూడా సందర్శించాడు గనుక ముగ్గురు పీపుల్స్‌వార్ కేంద్ర కమిటీ నాయకులను ఎన్‌కౌంటర్‌లో చంపేయడమే కాకుండా, శ్యాం అంత్యక్రియల సందర్భంలో హుస్నాబాద్ స్థూపాన్ని కూడా కూల్చేశారని గూగికి రాయడం జరిగింది. దానికి ఆయన మీ దేశంలో, తెలంగాణలో విప్లవం మౌ మౌ విప్లవం వలె ఒక గత స్మృతి (నాస్టాల్జియా) కాదు. మీ ప్రజలు తెలంగాణ రైతాంగ పోరాటాన్ని నక్సల్బరీ పంథాలో కొనసాగిస్తున్నారు. మీ ప్రజా యోధులు వీరమరణం చెందుతారు. మీరు వాళ్ళ జ్ఞాపకాలతో స్మారకాలు నిర్మించుకుంటారు. అవి తుడిచేస్తారు. మళ్లీ మీ పోరాటం కొనసాగుతుంది – మీ విప్లవంలో ఒక నిరంతర ప్రవాహ గుణం ఉందని రాశాడు.
ఇంతకూ ఈ హుస్నాబాద్ ఎక్కడుంది. ఎప్పుడు ఎందుకు ఈ స్మారక స్థూపాన్ని నిర్మించారు. తెలంగాణలో దండకారణ్య పోరాటానికి ఇంద్రవెల్లి నుంచి ఇప్పటిదాకా ఆదిలాబాద్ జిల్లా తల్లి అయినట్లు, మైదాన ప్రాంత ఉద్యమానికి జగిత్యాల జైత్రయాత్ర ద్వారా కరీంనగర్ కన్నతల్లి అయింది. పీపుల్స్‌వార్ స్థాపన కాలం నుంచి (1980) నుంచి 1993 వరకు రాష్ట్ర కార్యదర్శులు ముగ్గురు, కరీంనగర్ జిల్లాలోని క్షేత్రస్థాయి గడ్డివేళ్ళ పోరాటం నుంచి వచ్చిన వాళ్లే.
1990 మేలో వరంగల్‌లో చారిత్రాత్మక రైతు కూలీ సంఘం మహాసభలు జరిగి బహిరంగ సభలకు, ప్రజా సంఘాలకు మాత్రమే కాదు పార్టీ కార్యకలాపాలకు కూడా కొంత సమయం చిక్కినప్పుడు 1978లో లక్ష్మీరాజ్యం, పోశెట్టిలు మొదలు అమరులైన కరీంనగర్ జిల్లా పార్టీ అమరులు 93 మంది కోసం 93 అడుగుల స్మారక స్థూపం నిర్మించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకున్నది. అప్పుడు రాష్ట్ర కమిటీ కార్యదర్శి ముప్పాళ లక్ష్మణరావు (గణపతి) కరీంనగర్ జిల్లా కార్యదర్శి సందె రాజమౌళి (ప్రసాద్) ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా చేసి అమరుడైన మాసాని రవీందర్ తల్లిని ఈ స్తూప నిర్మాణాన్ని పర్యవేక్షించవలసిందిగా కోరింది. అది చెన్నారెడ్డి రెండవసారి (1990) ఎన్నికై జననాట్యమండలి నాయకులు గద్దర్, సంజీవ్, పద్మలు, ఆర్ వై ఎల్ కార్యదర్శి బి.ఎస్. రాములు అజ్ఞాతాల నుంచి బయటికి వచ్చి నిజాం కాలేజీ గ్రౌండ్, నిజామాబాద్ మంతెనలలో రెండున్నర లక్షలు, లక్ష, 60 వేల జనంతో బహిరంగ సభలు జరుపుకున్న రోజులు. అజ్ఞాత జీవితంలోంచి బహిరంగ జీవితంలోకి వచ్చిన వాళ్లను అదే వరుసలో ఆహ్వానించడానికి కాకుండా ఇంద్రవెల్లి ఆదివాసి అమరుల కోసం ఇంద్రవెల్లి (20 ఏప్రిల్ 1990)లో, కార్మిక వర్గ పోరాట సేనాని, నాయకుడు, ద్రష్ట మార్గదర్శి లెనిన్ పుట్టినరోజు పార్టీ పుట్టినరోజు, బెల్లంపల్లి అమరుల స్థూపం దగ్గర (పెద్ది శంకర్, గజ్జల గంగారం మొదలు అప్పటికి మరెందరో) లక్ష చొప్పున రెండు బహిరంగ సభలు నిర్వహించి, వరంగల్ జిల్లా కమలాపూర్ అడవిలో రెయాన్స్ ఫ్యాక్టరీ కార్మికుల మధ్యన మేడేని నిర్వహించిన పరాకాష్టగా వరంగల్ లో మే 5, 6 తేదీలలో 14 లక్షల మందితో రైతు కూలీ సంఘం మహాసభ జరిగింది. ఈ వాతావరణం ఉండగానే హుస్నాబాద్‌లో కరీంనగర్ అమరులకు స్థూప నిర్మాణం చేపట్టి జిల్లా రాజకీయ నాయకుల, జర్నలిస్టుల, బిజెపి మినహా అన్ని పార్టీల సహకారం కూడా లభించి ఈ నిర్మాణం పనులు అమరుడు మాసాని రవీందర్ తల్లి అక్కడే గుడిసె వేసుకొని పర్యవేక్షించింది. కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా చేసి అమరుడైన పులి రాములు తండ్రి స్థూపాన్ని ఆవిష్కరించాడు, విరసం, జననాట్యమండలి, ఏఐఎల్‌ఆర్‌సితో పాటు అన్ని ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. భోరున వర్షం కురుస్తూ హైదరాబాదు కరీంనగర్ రోడ్డు రాకపోకలు వాహనాలను రద్దు చేశారు. అటువంటి వర్షాకాలంలో (నర్మెట పోలీసు స్టేషన్‌లో ఆర్.వై.ఎల్ కార్యదర్శి కళ్యాణం చంద్రమౌళి అరెస్టుపై వేలాది మంది తరలివచ్చి విడిపించుకోవడానికి ప్రయత్నించగా పోలీసు కాల్పులు జరిగి నిర్బంధం మొదలుకావడానికి కొద్ది రోజుల ముందు) ఈ స్థూపావిష్కరణ జరిగింది. పార్టీ రాష్ట్ర కమిటీ అయినా కరీంనగర్ జిల్లా కమిటీ అయినా హుస్నాబాద్ ఎంచుకోవడానికి భౌగోళిక, రాజకీయ, సాంస్కృతిక కారణాలు ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ కరీంనగర్, మెదక్, వరంగల్ జిల్లాలకు హనుమకొండ, సిద్దిపేట, కరీంనగర్‌లకు కూడా అందుబాటు దూరంలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలు, కేంద్రంలో విదేశాంగ, రక్షణ, హోం మంత్రి పదవులు కూడా నిర్వహించి ఇందిరా, రాజీవ్ గాంధీ లకు సన్నిహితుడుగా, సలహాదారుడిగా ఉన్న పి.వి. నరసింహారావు గ్రామం వంగర అయినా, ఆయన కార్య క్షేత్రాలు, మంతెన, హుస్నాబాద్, విద్యా, సాహిత్య, సాంస్కృతిక సంబంధాలు మేనమామల వలన వరంగల్. హుస్నాబాద్ భూస్వామి లక్ష్మీ కాంతారావు పి.వి.కి సమీప బంధువు. అప్పటికి ఇంకా పీపుల్స్‌వార్ పై కేంద్ర ప్రభుత్వ అవగాహనకు మేధో మార్గదర్శకత్వం ఆయనదే. అల్లం రాజయ్య ‘ప్రత్యర్ధులు’, కథ, ‘వసంతగీతం’ నవల చదివిన వారికి ఇంతకన్నా వివరంగా చెప్పనక్కర్లేదు. అప్పటికే ప్రధాని రాజీవ్ గాంధీ బొంబాయిలో కాంగ్రెస్ పార్టీ శతవార్షికోత్సవం లో దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకుపోతానని సామ్రాజ్యవాదం అనుకూల దళారీ రాజకీయార్థిక లక్ష్యాన్ని ప్రకటించాడు. 1991 ఎల్.పి.జి. నూతన ఆర్థిక విధానాలు ప్రకటించడానికి నెలలే మిగిలినవి, పి.వి. ప్రధాని కావడం వల్ల. కనుక అట్లా శత్రువుకు ఆయువు పట్టయిన కోట ముందే కరీంనగర్ పార్టీ అమరుల స్థూపాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగా ఆదివాసుల ఆశాజ్యోతిగా ఇంద్రవెల్లి, మైదాన ప్రాంత ప్రజల గుండె చప్పుడుగా హుస్నాబాద్ స్థూపాల నిర్మాణం జరిగింది. హుస్నాబాద్ స్థూప నిర్మాణం వరకే ఇంద్రవెల్లి స్థూపం కూల్చివేత, పునర్నిర్మాణం జరిగిపోయాయి. ముఖ్యంగా హనుమకొండ – సిద్దిపేట రోడ్డుపై – వరుసగా ముల్కనూరు, కొత్తపల్లి వంటి పోరాట గ్రామాల్లో ఉండడం హుస్నాబాద్ స్థూపం ఒక సందర్శన స్థలం అయింది. ఇంచుమించు తొమ్మిదేళ్లపాటు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని, సిపిఐ లో కొనసాగిన విప్లవ సానుభూతిపరుడుగా మేర మల్లేశం అంతకపేట గ్రామమైనా హుస్నాబాద్ లోనే విప్లవ అభిమానులందరికీ అండగా ఉండేవాడు. ఆయన స్వీయ చరిత్ర-కవితలు-పాటలు డా. ముత్యం సంపాదకత్వంలో అన్నవరం దేవేందర్ ప్రచురించాడు.
కొన్నాళ్లుగా ` అంటే ఏళ్లుగానే తాడిగిరి పోతరాజు (కోతుల నడుమ, హుజురాబాద్) మరణం సందర్భంలో కూడా అమరుడు (కోతుల నడుమ) వీరస్వామి (ఆర్.ఎస్.యు. రాష్ట్ర అధ్యక్షుడు, సెంట్రల్ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ రీసెర్చ్ స్కాలర్) తల్లిని పరామర్శించిన సమయంలో హుస్నాబాద్ స్థూపాన్ని పునర్నిర్మించాలన్న ప్రతిపాదన నలుగురిలో చర్చనీయాంశమైంది. అప్పటినుండే అనుకూల సమయాలనుకునే ప్రతి సందర్భంలో వస్తున్నది.
తెలంగాణ ప్రాంతీయ కమిటీ కార్యదర్శిగా కామ్రేడ్ దగ్గు రాజలింగం అప్పటిదాకా (1985 నుంచి 88 దాకా) గోపగాని ఐలయ్య (మహేశ్) నిర్వహించిన బాధ్యతలు చేపట్టాడు. ఇద్దరూ కరీంనగర్ జిల్లా వాళ్లే. ఐలయ్యది హుజురాబాద్ దగ్గర తుమ్మనపల్లి వరంగల్‌లో సి.కె.ఎం.లో డిగ్రీ పూర్తి చేసి, కెయుసిలో ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసి లా చదువుతున్న కాలంలో వృత్తి విప్లవకారుడయ్యాడు. 1985 లో వరంగల్ జిల్లా కమిటీకి ఎన్నికైన జిల్లా కార్యదర్శి పులి అంజయ్యకు కుడి భుజంగా ఆట, మాట, పాట బందయి తెలంగాణ లాటిన్ అమెరికా వంటి నిర్బంధాన్ని చవిచూస్తున్న రోజుల్లో విప్లవోద్యమ నిర్మాణం చేస్తూ హైదరాబాద్ నవరంగ్ టాకీస్ దగ్గర కె.ఎస్. వ్యాస్, అనురాగ్ శర్మల నాయకత్వంలో కిడ్నాప్‌కు గురై ‘మిస్సింగ్’ కేసుగా జస్టిస్ టి.ఎల్.ఎన్. రెడ్డి కమిషన్ (1990-91) చే విచారించబడిరది. కొడవటి సుదర్శన్ (కడిపికొండ)ను సోమిడి ఆర్.వై.ఎల్. క్యాంపుకు పోతుండగా 1984 డిసెంబర్ ఎన్నికల సమయంలో కిడ్నాప్ చేసిన కేసులో, వెంకటేశ్వర్లు (ప్రకాశ్ హనుమకొండ సి.ఓ.) ను జైలు నుండి విడుదల చేయగానే అరెస్ట్ చేసి ఏం చేశారో తెలియని ‘మిస్సింగ్’ కేసులో ఎస్.ఐ. యాదగిరి రెడ్డిని జస్టిస్ టి.ఎల్.ఎన్. రెడ్డి పైన పేర్కొన్న ఇద్దరు పోలీసు అధికారులను హత్యా నేరం కింద కేసు పెట్టి విచారించాలని ప్రభుత్వానికి సూచించారు కానీ జరగలేదు. ఆ తర్వాత దగ్గు రాజలింగును హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ రోడ్డుకు ఉన్న రమ సంతోష్ రెడ్డి దంపతుల ఇంట్లో అరెస్ట్ చేసి ‘ఎన్‌కౌంటర్’ చేశారు. దగ్గు రాజలింగుది కూడా కరీంనగర్ జిల్లా రాఘవాపురం.
గోపగాని ఐలయ్య, దగ్గు రాజలింగం 1985-90 గడ్డు కాలంలో క్షేత్రాన్ని వదలకుండా విప్లవోద్యమ నిర్మాణం చేయడానికి, ప్రజాసేవ, త్యాగానికి, అమరత్వానికి గుర్తింపుగానే వరంగల్‌లో మే 4, 5 తేదీల్లో జరిగిన రైతు కూలీ సంఘం సదస్సు కాశీబుగ్గ, ప్రకాశ్‌రెడ్డి నగర్ (వరంగల్ ఆర్ట్స్ కాలేజీ – రైలు మార్గం మధ్య ఉన్న స్థలం) బహిరంగ సభ ఆ ఇద్దరి పేరు మీదే గోపగాని ఐలయ్య, దగ్గు రాజలింగం నగర్‌లో జరిగాయి. ఆ మహాసభలలోనే మొదటిసారిగా ప్రారంభ సెషన్ అంతా అమరవీరుల కుటుంబాలనంతా పరిచయం చేసే ఒక ఉద్విగ్న సన్నివేశం ఆచరణలోకి వచ్చింది. సదస్సు ఆవరణలో అమరుల స్థూపాన్ని, ఎర్రజెండాను జన్ను చిన్నాలు తల్లి ఆవిష్కరించింది. ఎన్‌కౌంటర్ చేసి రైలుకింద పడేసి, రైలు కింద దొరికిన శవంగా పోలీసులు ప్రకటించిన నెక్కొండ సి.ఓ. ఇమాం తల్లి ` ఇది అమరులైన మన బిడ్డల పండుగ అన్నది.
రైతు కూలీ సంఘం రెండవ మహాసభలు 1983లో కరీంనగర్‌లో జరిగినప్పుడు అప్పటిదాకా అమరులైన వారి ఫొటో ఎగ్జిబిషన్‌ను అమరుడు పరిటాల శ్రీరాములు (అనంతపురం జిల్లా ధర్మవరం తాలూకాలో 18 ఊళ్లలో 1975 నాటికి 18 గ్రామాల్లో రైతు కూలీ సంఘాలు పెట్టి దేవర మాన్యాలను, జమాబంది గ్రామాలలో ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని పోరాటం నిర్వహించి తాను, కాశీపతి కలిసి అనంతపురంలో నిర్వహిస్తున్న చైతన్య సాహితిని విరసంలో విలీనం చేసి విరసం కార్యవర్గ సభ్యుడయ్యాడు. 1975 ఏప్రిల్ 8న జననాట్యమండలి సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తూ బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు, బస్సు దించి శత్రువులు కత్తులు, గొడ్డళ్లతో నరికి చంపారు. ఆయన పెద్ద కొడుకు పరిటాల హరి పార్టీ దళ సభ్యుడిగా 1983 కన్నా ముందే ఎన్‌కౌంటర్‌లో అమరుడయ్యాడు.) సహచరి ఆవిష్కరించింది.
కరీంనగర్‌లో రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభలు ప్రారంభమైన రోజే వరంగల్‌లో పార్టీ వరంగల్ జిల్లా నాయకత్వంలో చిన్నాలు తర్వాత ఎదిగివచ్చిన మామిడాల హరిభూషణ్‌ను ఎన్‌కౌంటర్ చేసారన్న వార్త తెలిసింది. కనుక ఆయన తడియారని నెత్తురు స్మృతిలో ‘మృతవీరుల పోరాట స్వప్నాలను చూపే చిత్రాల! హరిభూషణ్ ఎగ్జిబిషన్’గా పేర్కొన్నారు. రెండవరోజు బహిరంగ సభకు ప్రధాన వక్తగా వచ్చిన స్వామి అగ్నివేష్ అమరుడు హరిభూషణ్ నెత్తురు తడిసిన నేల పాద ధూళి శిరసున చల్లుకొని తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. అసలు వరంగల్ రైతుకూలీ సంఘం మహాసభలే శ్రీకాకుళ పోరాట అమరులందరినీ తలచుకునే శ్రీకాకుళ కమ్యూన్‌గా ఏర్పడి నిర్వహించుకున్నారు.
‘అది చెరువు శికం. అక్కడ ఒక కమ్యూన్ నిర్మించవచ్చని కమ్యూనిస్టులు చూపేదాకా కరీంనగర్‌కు తోచలేదు. పెద్ద పెద్ద నిర్మాణాలు ఆజామాయిషీ చేసే వాళ్లందరూ నిద్రలేచి చూసేవరకు అక్కడ శిరమెత్తి నిల్చున్నది శ్రీకాకుళ కమ్యూన్! (భవిష్యత్తు చిత్రపటం) ఈ సభలు ‘క్రాంతి’ సంపాదకుడు ఎల్.ఎస్.ఎన్. మూర్తి ఆధ్వర్యంలో దామోదరరెడ్డి ఇప్పటికెప్పుడో అమరులైన ఎందరో పార్టీ విప్లవ కార్యకర్తలు నిర్వహించారు. విరసం తరఫున సిఎస్‌ఆర్ ప్రసాద్, రుక్మిణి, ఆర్.ఎస్.యు. నుంచి ఎన్. వేణుగోపాల్, ఎల్.ఎస్.ఎన్. మూర్తికి సహకరిస్తూ కరీంనగర్‌లో ఉన్నారు. అమరుల స్మృతుల నుంచి మళ్లీ కరీంనగర్ జిల్లా అమరుల స్మృతిలో నిర్మాణమైన హుస్నాబాద్ స్థూపాన్ని పునర్నిర్మించుకోవాలనే ఆలోచనల ప్రస్తుత ప్రస్తావనలోకి వస్తే హుస్నాబాద్ లో గద్దర్ సంస్కరణ సభలో (ఆగస్టు 6?) ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ ముందు ఆ గ్రామ ప్రజలు, ప్రముఖులు ఈ ప్రతిపాదన చేశారు, ఆయన ఏమన్నది తెలియదు. అందుకోసం హుస్నాబాద్, కరీంనగర్ జిల్లా ప్రజలు ప్రత్యేకించి, తెలంగాణ అంతట ప్రజలు కదిలి ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి పెడతారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. 1990 నాటికి రాష్ట్రంలో ఇంద్రవెల్లి, హుస్నాబాద్ స్థూపాలే ప్రముఖంగా పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయంతో నిర్మాణమయ్యాయి.
అయితే పూనిక ఎంతగా పార్టీ రాష్ట్ర కమిటీదయినా ఇంద్రవెల్లి స్థూప నిర్మాణం జరిగింది ఆదివాసి జ్ఞాత, అజ్ఞాత అమరుల కోసం. డాక్టర్ రాజగోపాలన్, ప్రదీప్ నాయకత్వంలో మారణకాండ జరగగానే వెళ్లిన ఎ.పి.సి.ఎల్.సి. నిజనిర్ధారణ కమిటీ మొదలు, వరంగల్‌లో ఆర్ వై ఎల్ కాన్ఫరెన్స్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన ప్రొఫెసర్ మనోరంజన్ మొహంతి నాయకత్వంలో నిజనిర్ధారణకు వెళ్లిన ఎ.పి.సి.ఎల్.సి. డాక్టర్ రామనాథం, విరసం కెవిఆర్ తదితరుల కమిటీ వరకు 60 మంది దాకా పోలీస్ కాల్పుల్లో మరణించారని ప్రత్యక్షంగా ఎందరో ప్రేక్షకుల నోట విన్నప్పటికి పదముగ్గురి విషయంలో మాత్రమే సాక్ష్యాధారాలు, మృతదేహాలు ఆసుపత్రిలో ఎంట్రీ ఉండడం ఇంద్రవెల్లి గిరిజన అమరుల సంఫీుభావ కమిటీ పదముగ్గురి గ్రామాలకు, గాయపడిన వారి గ్రామాలకు (గూడాలకు) వెళ్లి సంక్షేమ నిధి నుంచి సహాయం చేయగలిగింది. 1983 జనవరి సంక్రాంతి సెలవుల్లో. అదంతా దేశమంతా నిరసన వెల్లువెత్తుతున్న నేపథ్యంలో 1985 దాకా కూడా నిరంతరం కొనసాగిన ప్రజా ఉద్యమాల కేంద్ర స్థానం అయింది ఇంద్రవెల్లి.
హుస్నాబాద్ స్తూప పునర్నిర్మాణానికి తెలంగాణలో లేదా రెండు తెలుగు రాష్ట్రాల్లో అటువంటి సంస్కృతిని,
సంప్రదాయాన్ని, వాతావరణాన్ని మళ్లీ కగార్ వ్యతిరేక పోరాట సందర్భంలో తేగలమా అనే దానిపై ఆధారపడి ఉంటుంది ఫలితం.