ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని రాజకీయ పార్టీలకూ ప్రజాసంఘాలకూ జీవిత ఖైదీల విడుదల సాధన సమితి తరపున ఆహ్వానం.
మిత్రులారా
చిలకలూరి పేట బస్సు దహనం కేసు మనలో చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది. 1993 సంవత్సరంలో జరిగిన ఆ దుర్ఘటన కు బాధ్యులైన చలపతిరావు విజయవర్ధనరావులు సంఘటన జరిగిన రెండు మూడు రోజులకే అరెస్ట్ అయ్యారు.
వారు ఆ నేరం బస్సులో ఉన్న వారిని చంపాలనే ఉద్దేశ్యంతో చేయలేదు. కేవలం బస్సులో ప్రయాణికులను బెదిరించి దోపిడీ చేసే ఉద్దేశ్యంతో మాత్రమే చేశారు.
అయితే అనుకోని విధంగా బస్సు దహనం జరిగిపోయింది. చలపతి విజయవర్ధనరావులు అరెస్ట్ అయిపోయారు.
కోర్టు వారికి ఉరిశిక్ష విధించింది.
ఈ చలపతి విజయవర్ధనరావులు గుంటూరు శివార్లలో ఉన్న ఓ దళితవాడకు చెందిన యువకులు. ఆర్ధికపరమైన కష్టాలతో … ఈ దోపిడీకి పాల్పడాల్సి వచ్చింది తప్ప వారు హాబిక్యువల్ అపెండర్స్ కాదు.
వారిపై ఈ దుర్ఘటనకు ముందు కూడా ఈ విధమైన నేరాలు రిజిష్టర్ కాలేదు. నేర చరిత్ర ఉన్న వారు కాదు.
ఇద్దరూ అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నవారే. ఆర్ధికంగా స్తోమత లేని కుటుంబాలకు చెందిన వారే.
కోర్టు వీరికి ఉరిశిక్ష విధించిన సందర్భంగా దళిత సంఘాలు వామపక్ష ప్రజాసంఘాలు కలసి ఉద్యమించి ఢిల్లీ వరకూ వెళ్లి జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత మహాశ్వేతాదేవి గారికి చెప్పగలిగారు. \
ఆవిడ కన్విన్స్ చేయడంతో అప్పటి రాష్ట్రపతి కెఆర్ నారాయణన్ చొరవ చూపి ఉరిరద్దు చేశారు.
ఉరి రద్దు అయ్యిందిగానీ వారు మాత్రం ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు.
ముప్పై ఒక్క సంవత్సరాలు పూర్తయిన సందర్భం ఇది.
ఇదే సందర్భంలో మరో కేసు విజయం మీ దృష్టికి తీసుకువస్తున్నాను.
తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రి పరిటాల రవీంద్రను హత్య చేయడం కోసం మద్దెలచెరువు సూరి జూబ్లీహిల్స్ ప్రాంతంలో మందుపాతర పెట్టిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.
శ్రీరాములయ్య సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోలో జరిగిన సందర్భంగా ఈ లాండ్ మైన్ ఏర్పాటు చేశారు.
\అయితే లాండ్ మైన్ పేలింది. కానీ పరిటాల రవి వాహనం కాక మీడియా వాహనం పేలిపోయింది. 26 మంది ఆ వాహనంలో ఉన్నారు. వారందరూ ప్రాణాలు కోల్పోయారు.
మిక్కిలినేని జగదీష్ బాబు అనే ఓ సీనియర్ జర్నలిస్టు కూడా చనిపోయిన వారిలో ఉన్నారు. ఆయన అప్పుడు ఈటీవీ కోసం పనిచేస్తున్నారు.
ఆ కేసులో అరెస్ట్ అయిన వారికి కేవలం పద్నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. పవన్ కుమార్ అనే వ్యక్తికి మాత్రం జీవిత ఖైదు పడింది. అతను కూడా వీరితో పాటే పదేళ్ల శిక్షాకాలం పూర్తవగానే విడుదల అయిపోయాడు.
1999 లో సంఘటన జరిగింది. సంవత్సరం తర్వాత వారి అరెస్ట్ జరిగింది.
బెయిల్ మీద కొందరు విడుదలయ్యారు. శిక్ష పడిన దగ్గర నుంచీ ఓ ఎనిమిదేళ్లు లోపల ఉన్నారు.
అంతిమంగా 2012లో విడుదలైపోయారు.
ఈ రెండు కేసుల తీరూ చూస్తే అర్ధమయ్యే వి|షయాలు …
1.పౌరసమాజం అనే పేరుతో చిలకలూరి పేట బస్సు దహనం సందర్భంలో రియాక్ట్ అయి వారిని తీవ్రంగా శిక్షించాలన్న వారెవరూ జూబ్లీహిల్స్ ఘటన జరిగినప్పుడు నినదించలేదు. ఆందోళనలు చేయలేదు.
- చిలకలూరి పేట కేసులో నేరస్తులు హత్యలు చేయడం ఉద్దేశ్యంగా నేరం చేయలేదు. దోపిడీ మాత్రమే వారి ఉద్దేశ్యం. కానీ జూబ్లీ హిల్స్ బాంబ్ బ్లాస్ట్ కేసులో నేరస్తులు ఉద్దేశ్యమే హత్య చేయడం. అయినా కోర్టు కూడా వారికి ఉరి శిక్ష విధించలేదు.
- చిలకలూరి పేట బస్సు దహనం కేసులో శిక్షలు పడ్డవారిద్దరూ దళితులు … నిరుపేదలు. జూబ్లీహిల్స్ బాంబ్ బ్లాస్ట్ కేసులో శిక్షలు పడ్డవారు రెడ్డి సమాజిక వర్గానికి చెందిన వారు అధికులు… ఆర్ధికంగా దన్ను కలిగిన వారు. అధికార పార్టీలతో సత్సంబంధాలు కలిగిన వారు.
- కె.జి సత్యమూర్తి గారు అన్నట్టు న్యాయస్థానానికీ ఉరికంబానికీ కూడా ఈ దేశంలో జంధ్యం ఉంటుందని ఈ రెండు కేసుల పోలిక చూస్తే అర్ధం అయ్యే అవకాశం ఉంది.
కావున ఇప్పటికైనా … చలపతి విజయవర్ఘనరావుల విడుదల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది.
ముప్పై రెండేళ్ల జైలు చేసిన ఈ ఇద్దరి విడుదల గురించీ ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుతూ అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
మీ పార్టీ ఉద్దేశ్యం ఏమైనా ఈ సమావేశంలో ప్రకటించవచ్చు. …. ప్రజాస్వామ్యం పట్ల గౌరవభావంతోనే ఈ సమావేశం నిర్వహించడం జరుగుతోంది. నూరు శాతం ప్రజాస్వామ్యం సాధించడం ద్వారానే ఈ దేశంలో ప్రజలు శాంతియుతంగా జీవించగలరన్న అంబేద్కర్ ఆశయమే మా ఆశయం కూడా.
- వెన్యూ: విజయవాడ ప్రెస్ క్లబ్ గాంధీ నగర్ విజయవాడ
- తేదీ సమయం: సెప్టెంబర్ 25 బుధవారం ఉదయం పది గంటలకు …
- ఆహ్వానించువారు: జీవిత ఖైదీల విడుదల సాధన సమితి తరపున ఆర్. భరద్వాజ
ఫోన్ నంబర్ 9052864400