యాపిల్స్, హై స్ట్రీట్, హల్‌బెర్టన్, టివర్టన్ ఎక్స్ 16, 7AWఎడబ్ల్యు, యు కె
టెర్రీయాండ్ హెడర్ @హాట్ మెయిల్.కొ.యుకె
13 మార్చి 2025
ప్రియమైన ……
మానవహక్కులను కాపాడుకోవడానికి ఇతరులు చేసే కృషికి మీరు ఎంత అందగా ఉంటారో తెలిసిన ఒక మిత్రుల బృందం మాది.
మీ వంటి పరిస్థితిలోనే ఉన్న ఎవరో ఒకరు రాసిన కవితా మాకు సవాల్ విసిరింది.
ఇక్కడ ఇంగ్లాండులో ఇప్పుడు వసంతం. కొన్ని వేళల్లో సూర్యుడు ప్రకాశిస్తాడు. గ్రామీణ ప్రాంతాల్లో పుష్పాలు కాంతివంతంగా వికసించడం ప్రారంభమైంది.
మీకు, మీరు సమర్థిస్తున్నవారికి కొంత ఆశ చేకూరి ఉంటుందని మేం ఆశిస్తున్నాం. దృఢంగా ఉండండి.
నా, నా బృందంలోని వారివి శుభాకాంక్షలు
కృస్తీనా డాడ్స్
ఆశ నిరాశ రెండూ లేనపుడు
తాను తప్ప ఏమీ ఉండదు
మా స్వప్నం నిజమవుతుందనుకోవడం
అమాయకత్వం కావచ్చు
కాని మరో ప్రపంచం సాధ్యమే అని
విశ్వసించడం మూర్ఖత్వం కాదు
“జైలులో ప్రతిరోజూ మనిషి కోల్పోయిన స్వేచ్ఛను గుర్తు చేసే అవకాశం”
ఒక దూరాన ఆదర్శ ప్రపంచంలో
న్యాయస్థానాలను ఊహించుకోవచ్చు
కానీ సత్యాన్ని ఎత్తి పట్టే ప్రపంచం సాధ్యమే.
ప్రజలకివ్వడానికి మా దగ్గర
మా బ్యానర్లు తప్ప ఏమీ లేవు
వాళ్లను కలలు కనడానికి రెచ్చగొట్టే
మంచితనం మాత్రమే మా దగ్గర ఉంది
మీ దగ్గరికి మేము
శక్తివంతమైన సమర్థకులను
వెతుక్కోవడానికి రావడం లేదు
ఎందుకంటే మనమంతా అవే ప్రపంచవ్యాప్త
సమస్యలనెదుర్కొంటున్నాం
సంఘీభావంలోని శక్తితో
నిశ్చితమైన విశ్వాసంతో
అవే విశ్వజనీన విలువలను పంచుకుంటున్నాం.
రేపు కూడా సరిగ్గా అట్లాగే ఉంటుందని అనిపించే
ఊపిరాడని వాస్తవాలు తప్ప మరేమీ లేకుండా
గడిచిన ఇంతకు ముందటి రోజులను
మేం అంతం చేయడానికి పోరాడాం
భయాన్ని నాశనం చేయాలంటే
దానిని ఎదుర్కోవాలి, వెక్కిరించాలి
అని ప్రతి ఒక్కరికి తెలుసు.
జైల్లో ప్రతి ఒక్క రోజు
వాళ్లను అన్యాయంగా బంధించారు
అని సమాజానికి జ్ఞాపకం చేయడానికి
ప్రతిరోజు న్యాయమిట్లా నిరాకరింపబడడం
ఆగిపోవాలని
రాజకీయ బృందాల మీద, మీడియా మీద
ఒత్తిడి పెట్టడానికి ఒక అవకాశం.
ఈజిప్శియన్-బ్రిటిష్ బ్లాగర్, సాఫ్ట్‌వేర్ డెవలపర్, క్రియాశీల రాజకీయ కార్యకర్త అలీ అబ్దుల్ ఫతా జైల్లో రాసిన కవిత ఇది. సాఫ్ట్‌వేర్‌లో అరబిక్ భాషా రూపాలను, వేదికలను రూపకల్పన చేసి అభివృద్ధి చేయడంలో ఆయన నిమగ్నమై ఉండేవాడు. ఆయన మానవ హక్కుల కార్యకర్త కనుక ఎన్నో సందర్భాల్లో ఈజిప్టులో ఆయనను జైల్లో పెట్టారు. ఇప్పుడాయన ఐదు సంవత్సరాల శిక్ష కూడా పూర్తయి ఇంకా జైల్లోనే 2019 నుంచి ఉన్నాడు. ఆయనను విడుదల చేసి అతనికి స్వేచ్ఛ ఇవ్వాలని చాలామంది విజ్ఞప్తి చేస్తున్నారు.
అనువాదకుని విజ్ఞప్తి: భీమా కోరేగావ్ ఎల్గార్ పరిషత్ కుట్రకేసులో జైల్లో మగ్గుతున్న బికె -16 మందికి సంఘీభావంగా ఇన్సాఫ్, లండన్ సంస్థ చేపట్టిన ఉద్యమంలో భాగంగా ఈ లేఖ వాళ్ళ న్యాయవాది ద్వారా బెయిల్‌పై ముంబైలో ఉంటున్న ఒకరికి సరిగ్గా మూడు నెలల తర్వాత చేరింది. ఈ మూడు నెలల్లో కూడా జైల్లో ఇంకా మగ్గుతున్న ఆరుగురి విడుదల విషయంలో ఏ ప్రగతి లేదు కనుక ఈ ఉత్తరానికీ, ఈ కవితకైతే ఎల్ల కాలానికీ కాలం చెల్లలేదని భావించి ప్రచరణార్థం పంపుతున్నాను.
కొన్ని చేదునిజాలు: 2018 జూన్ 6న మొదటి ఐదుగురిలో నాగపూర్‌లో మొట్టమొదటి వారిగా అరెస్టయిన 25 ఏళ్ల క్రిమినల్ లా అనుభవం ఉన్న ప్రఖ్యాత న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్ ఏడు సంవత్సరాలు గడిచి ఎనిమిదో సంవత్సరంలో హృదయ సంబంధ వ్యాధి (అరెస్టయి కోర్టు అనుమతితో పోలీసు కస్టడీలో ఉన్న సమయంలో గుండెనొప్పి వచ్చి పూనే ససూన్ ఆసుపత్రిలో స్టంట్ వేసారు. ఆయన కుటుంబ ఖర్చులతోనని పొలిస్ ప్రాజెక్టుకు ఆయన సహచరి మినాల్ చెప్పింది) షుగర్ బీపీ వంటి వ్యాధులతో జైల్లో మగ్గుతున్నాడు. గడ్చిరోలిలో 2016లో మోపబడిన లాయిడ్స్ కంపెనీ టిప్పర్స్ దహనం కేసులో బెయిల్ పిటీషన్ హైకోర్టులో పలుమార్లు నిరాకరింపబడి ఇప్పటికీ సుప్రీంకోర్టులో విచారణకు రావడం లేదు. హైకోర్టులో వాదనలు ముగిసిన భీమా కోరేగావ్, ఎల్గార్ పరిషత్ కేసులో రిజర్వులో ఉన్న తీర్పు విన్నాక ఇది చేపడ్తామన్నది సుప్రీంకోర్టు బెంచ్. దానితో అది వెనక్కి తీసుకోవడం జరిగింది. జులై 10న సుప్రీం కోర్టు వేసవి సెలవుల తర్వాత తిరిగి పనిచేయడం ప్రారంభించిన తర్వాత గానీ మళ్ళీ న్యాయం, స్వేచ్ఛ కోసం తలుపు తట్టడం వీలు కాదు. అన్ని రాజ్యం అంగాలకన్నా రాజ్యాంగం అత్యున్నతమైనదని, అందువల్లనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రచన అధ్యక్షుడిగా కల్పించిన సామాజిక న్యాయం వల్లనే తాను అత్యున్నత న్యాయస్థాన అత్యున్నత ప్రధాన న్యాయమూర్తి పదవికి రాగలిగానని ఇటీవలే ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించిన చీఫ్ జస్టిస్ బి.అర్. గవాయి ఆ పదవిలో ఉన్న కాలంలోనైనా సురేంద్రకు న్యాయం జరుగుతుందా?
వయసురీత్యా మొదటి పదిమందిలో చిన్నవాడైన మహేష్ రావత్ అరెస్టు కన్నా ముందు గడ్చిరోలీ జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆఫీసులో ప్రధానమంత్రి ఆదివాసుల సంక్షేమ వ్యవహార ప్రాజెక్టులో పని చేస్తున్న ప్రతిభాశాలియైన పరిశోధకుడు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ వంటి ప్రతిష్టాత్మక సామాజిక శాస్త్రాల అధ్యయన సంస్థ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్. ఇప్పుడైతే ఈ ఏడేళ్ళలో మానవ హక్కుల అధ్యయనంలో చాలా డిప్లమాలు పొంది, లా పరీక్షలో ప్రథమ శ్రేణిలో పూర్తి చేయబోతున్నాడు. ఈయన అరెస్టయినప్పుడే అది అన్యాయమని ఆయనను వెంటనే విడుదల చేయాలని గడ్చిరోలీ ఆదివాసీ షెడ్యూల్డ్ ఏరియాలో 300 గ్రామసభలు తీర్మానాలు చేసాయి. ఇంకా ఈ కేసు ప్రారంభదినాలలోకి, ఎన్‌ఐఎ చేపట్టిన ముందటి చరిత్రలోకి వెళ్లి చెప్పాలంటే మొదటి ఐదుగురు సుధీర్ ధావ్లే, రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్, షోమాసేన్, మహేష్ రావత్‌లకు 90 రోజుల లోపల చార్జిషీట్ ఇవ్వనందుకు బొంబాయి హైకోర్టు 2018 సెప్టెంబర్‌లోనే డిఫాల్ట్ బెయిల్ ఇచ్చింది. కాని దానిపై స్టేట్ సుప్రీంకోర్టులో స్టే తెచ్చుకున్నది. రంజన్ గొగాయి ప్రధాన న్యాయమూర్తి అయ్యాక చార్జిషీట్‌లో సాక్ష్యాలు వగయిరా ఇంగ్లీషు చేయించి సాంకేతిక లోపాల వల్ల మాత్రమే డిఫాల్ట్ బెయిల్ బొంబాయి హైకోర్టు ఇచ్చింది గానీ ప్రైమాఫేసీ, స్థూల దృష్టిలోనే వీరిపై నేరారోపణలు తీవ్రమైనవని అరెస్టును జనవరిలో సక్రమమే అని తీర్పు ఇచ్చాడు. 2020 జనవరి ఆఖరి వారంలో కేంద్ర ప్రభుత్వ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ కేసును పూనే పోలీసుల చేతి నుండి తీసేసుకున్నది.
అయినా ఇంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా మహేష్ రావత్‌కు 2023 సెప్టెంబర్‌లో బొంబాయి హైకోర్టు మెరిట్స్ మీద బెయిలు ఇచ్చింది. అంటే సూక్ష్మ దృష్టిలో ఈ కేసులో నేరారోపణలు లేవని. దీనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టునాశ్రయిస్తే ఇప్పటికీ అంటే రెండు సంవత్సరాలైనా సుప్రీంకోర్టుకు బెయిల్‌పై వినడానికి వీలుకావడం లేదు. బొంబాయి హైకోర్టు బెయిల్ నిరాకరించిన జ్యోతి జగతప్ కేసుతో కలిపి వింటామని కొన్నాళ్ళు, గౌతమ్ నవలఖా బెయిలు పిటిషన్ కూడ కలిపి విందాం అని కొన్నాళ్లు తాత్సారం చేసారు. గౌతమ్ నవలఖా కేసు విడిగానే విని బొంబాయి హైకోర్టు ఇచ్చిన బెయిల్ సుప్రీంకోర్టు ధృవపరిచి (24 మే 2024) ఆయన బయటికి వచ్చి ఏడాది దాటింది. అదే హైకోర్టు 2023 సెప్టెంబర్‌లోనే మెరిట్ బెయిల్ ఇచ్చిన మహేష్ రావత్ గానీ, బెయిలు తిరస్కరించిన జ్యోతి జగతప్ కానీ సుప్రీంకోర్టులో తమ బెయిలు కేసు(లు) చేపట్టకపోవడం ఒకరు 7 సంవత్సరాలకు పైగా మరొకరు 5 సంవత్సరాలుగా జైల్లోనే మగ్గుతున్నారు. వీరిలో బొంబాయి హైకోర్టు బెయిల్ రెండేళ్ల క్రితమే ఇచ్చినా ఇప్పటికీ సుప్రీంకోర్టు స్టే తొలగించి అది వినకపోవడం న్యాయమూర్తుల అపరిమిత అధికారాలకు ఏ అవధి లేకపోవడం తప్ప కారణం లేదు.
ఇక ప్రొఫెసర్ హనీ బాబు, మరో ఇద్దరు (జ్యోతి జగతప్ కాకుండా) కబీర్ కళా మంచ్ కళాకారులు రమేష్ గైచోర్, సాగర్ గోర్కేలు సురేంద్ర, మహేష్‌ల బెయిల్ ఫలితాలు చూసి గానీ ప్రయత్నాలు మొదలు పెట్టాలనుకోవడం లేదు. ట్రయల్ కోర్టు అయిన ఎన్ఐఎ స్పెషల్ కోర్టు ఈ పై అందరి డిశ్చార్జ్ పిటీషన్‌లను నిరాకరించింది. యుఎపిఎ చట్టం రాకముందు తెలంగాణ జైళ్ళలో జీవిత ఖైదీలు (లైఫర్స్) రాజకీయ ఖైదీలతో సహా ఎవ్వరూ 7, 10 పది సంవత్సరాలకు మించి జైళ్ళలో లేరు. యుఎపిఎ కింద అండర్ ట్రయల్ ఖైదీలుగానూ ఇంత సుదీర్ఘ కాలం లేరు. అది మహారాష్ట్ర జైళ్ళకే చెల్లింది. అందులోనూ ఆ ప్రమాణం ప్రకారం సురేంద్ర గాడ్లింగ్, మహేష్ రావత్‌ల జీవిత శిక్షాకాలం కూడా పూర్తయినట్లే.
ఆ ప్రమాణం ప్రకారం అని ఎందుకు రాయాల్సి వస్తున్నది అంటే ఎమర్జెన్సీ కాలంలో కూడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు కొనసాగినప్పుడు 7 సంవత్సరాలు జీవిత ఖైదు పూర్తి చేసిన ఖైదీలను సత్ప్రవర్తన పై కూడ వదలలేదు. దానిపై వరంగల్ జైలులో ఉన్న వందల సంఖ్యలోని లైఫర్లు సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు జీవితకాలం అంటే జీవిత కాలమేనని నిర్వచించింది అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో గానీ, ఆంధ్రప్రదేశ్‌లో గానీ సత్ప్రవర్తన కలిగిన ఏ లైఫర్ కూడ ఆరున్నర, ఏడు సంవత్సరాలు మించి జైల్లో లేరు. తర్వాత ప్రభుత్వ దయాధర్మాల మీద ఆధారపడి విడుదలయినా, తిరిగి చట్టబద్ధంగానే 7 సంవత్సరాల జీవిత ఖైదు సత్ప్రవర్తనతో పూర్తిచేసిన లైఫర్స్‌ను, రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ జైళ్ళన్నింటిలో పటేల్ సుధాకర్ రెడ్డి, శాకమూరి అప్పారావు, మోడెం బాలకృష్ణల నాయకత్వంలో లైఫర్‌లు వారికి సంఘీభావంగా ఇఫ్లు అంథ విద్యార్థి పవన్, ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా నాయకత్వంలో 1994 డిసెంబర్ నుండి 1995 మార్చి దాకా జరిగిన చారిత్రాత్మక పోరాటం 42 డిమాండ్‌ల లో 41 డిమాండ్‌లను సాధించుకున్నది. దానిలో సత్ప్రవర్తనను కలిగిన జీవిత ఖైదీలను 7 సంవత్సరాలకు విడుదల చేయాలనే దానికింద 400 మంది లైఫర్లు విడుదలయ్యారు. యుఎపిఎ చట్టం రాకముందు రాయపూర్, (మీనా, మాలతి) కలకత్తా, భోపాల్‌లలో తప్ప ఇప్పటికీ యుఎపిఎ చట్టం వచ్చినాక కూడా జీవిత ఖైదు పడిన అమిత్ బాగ్ఛి వంటి వాళ్ళు తప్ప దేశంలోనే శిక్షలు పడని రాజకీయ ఖైదీలు అండర్ ట్రయల్స్ ఎక్కువ బూర్జువా కోర్టులో విశ్వాసం లేదని ప్రముఖ నక్సలైటు నాయకులు విశాఖ జైల్లో 1969 నుంచి ఎమర్జెన్సీ తొలగే కాలం దాకా ఉన్న సమయం మినహాయించి బికె-16 లో 6 మంది ఇంకా 7, 5 సంవత్సరాల నుంచి అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉండడం బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు రాజ్య కక్ష సాధింపు చర్య తప్ప మరొకటి కాదు. జైల్లో ఒకరోజు ఉండాల్సి రావడం అంటే స్వేచ్ఛ కోల్పోవడమే.